సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/తెలంగాణ చరిత్రము
తెలంగాణ చరిత్రము
హైదరాబాదు రాష్ట్రములో తెలంగాణమనియు, మరాట్వాడా యనియు రెండు ముఖ్య భాగములున్నవి. తెలంగాణములో తెనుగు మాట్లాడువారు యెక్కువ. మరాట్వాడీలో మహారాష్ట్రులును కర్ణాటకులును చేరియున్నారు. ఇప్పుడు తెలంగాణాలో 9 జిల్లాలు క్రిందివి కలవు.
1. మహబూబునగరం 2. అత్రాభుబల్దా 3. నల్లగొండ 4. కరీంనగరు, 5. మెదకు, 6. వరంగల్, 7. బాగాత్, 8. ఆదిలాబాదు, 9. నిజామాబాదు. ఇవి గాక రాయచూరు జిల్లాలోని అలంపూరు, గద్వాల, రాయచూరు తాలూకాలున్నూ మరి యిట్టి వందందును తెనుగు తాలుకాలైయున్నవి. హైదరాబాదు రాష్ట్ర వైశాల్యములోసగము వరకు తెలంగాణా వైశాల్యమున్నది. అనగా ఇంచుమించు 40 వేల చదరపు మైళ్ళు మరియు జనసంఖ్య 80 లక్షల వరకున్నది. అనగా రాష్ట్ర మందు సగము సంఖ్య ఆంధ్రులదైయున్నది. ప్రధాన నగరమగు హైదరాబాదు తెనుగు సీమయే. అది తెలంగాణాలో చేరినట్టిదే.
తెలంగాణమను పేరు ఈ జిల్లాలకెప్పుడు వచ్చినదోయేమో సరియగు ఆధారములు కానవచ్చుటలేదు. కాకతీయుల అనంతరము గోలకొండ రాజ్యస్థాపన కాలములో ఈ పేరు ఏర్పడినట్లూహింపదగును. తెనుగువారి నుండి యీ పదమేర్పడినదనుట స్పష్టము. తెలుంగు ఆణెము అని పద విభాగము. ఆణెము అనగా దేశము. “ఆణెమందనగ దేశాహ్వయంబు” అని ఆంధ్ర భాషార్ణవ నిఘంటులో వ్రాసియుండిరి. కాని వ్యవహారములో తెలంగాణము తప్ప వేరే ఆణెము తెనుగు దేశములో మనకు కానవచ్చుటలేదు. తెనుగు బ్రాహ్మణులలో తెలగాణ్యులు అను శాఖ వారు కలరు. వారు సంపూర్ణముగా తెలంగాణ బ్రాహ్మణులే. తెనుగు దేశములో బ్రాహ్మణులలో పాకనాటివారు, వెలనాటివారు, నందవరీకులు గోలకొండ వ్యాపారులు, ములికినాటి వారు అను బహు శాఖ లేర్పడెను. గోలకొండ వ్యాపారులు గోలకొండ రాజ్య కాలములో ఏర్పడిన నియోగి శాఖవారు, నందవరీకులు కర్నూలు జిల్లాలోని నందవరము నుండి ఏర్పడినవారు. పాకనాటివారు కృష్ణా జిల్లావారు, ములికినాటి వారు మహబూబ్‌నగరము జిల్లా వారు. ఒక గోలకొండ వ్యాపారి శాఖ తప్పితే తక్కిన శాఖలు ఇంచుమించు కాకతీయుల రాజ్యకాలములో ఏర్పడినట్లు కానవచ్చుచున్నది. ఈ లెక్క ప్రకారము తెలగాణ్యులనుమాటప్పుడే ఏర్పడియుండవలెను. ఇవన్నీ యూహలే. చారిత్రికాధారాలు నాకు కానరాలేదు.
కీ.శే. చిల్లరిగె శ్రీనివాసరావుగారు తమ ఆంధ్రప్రదేశ్ చరిత్రములో ఇట్లు వ్రాసినారు. “అరవలును, కన్నడీలును, మళయాళులును మనలను తెలుగులు అనియే పిలుచుచున్నారు. బర్మాలోని వారును తైలింగులే, తెలుగు పేరనే తెలంగాణా మున్నగు రాష్ట్రములు ప్రాచీన కాలమునుండియు చరిత్రకెక్కినవి.
బర్మాలో తైలింగులు అనువారున్నారు. వారు ప్రాచీన మందలి మన తెలుగువారే - వారు వంగ దేశమును జయించి బర్మాను ఆక్రమించుకొని అందు నిలిచిపోయిరి - బర్మా తైలింగులను గూర్చి హర్వీ (Harvey) అను చరిత్రకారుడిట్లు వ్రాసెను.
"Indeed the Tailanga is Probobly derived from Telingana, a region on the Madras East whence so many of them Came".
మద్రాసు తీరమందలి తెలంగాణము నుండి బర్మాకు వచ్చిన తెలుగువారే బర్మాలో తైలింగులైరి అను అతని అభిప్రాయమును శ్రీనివాసరావు గారుదాహరించిరి.
ఈ తెలంగాణా చరిత్రము మనకు శాతవాహనుల కాలము నుండియు లభించుచున్నది. క్రీస్తు శకంలో శాతవాహనులు ప్రతిష్ఠాపురమును (పైఠన్) రాజధానిగా చేసుకొని తమ రాజ్యములో ఇప్పటి తెలంగాణమును; రాయలసీమను చేర్చుకొని పాలించిరి. వారి కాలములో మన తెలంగాణమునకు ముళకసీమ లేక మూలక దేశము అను వ్యవహారముండెను. శాలివాహనుల శాసనములో తమ దేశములో ముళక దేశముండినట్లు వ్రాసినారు. నేటికిని మహబూబ్‌నగరు జిల్లాను “ములకసీమ” అని అలంపూరు, గద్వాల వారనుచున్నారు. ఆంధ్రకులు, మౌళికులు, ఆశ్మకులు, భోగర్ధనులు, కుంతలులు దక్షిణాంధ్ర మందలి జాతులని మార్కండేయ పురాణంలో వ్రాసినారు. అందలి మౌళికులే ఈ మళక సీమవారు.
దక్షిణ దేశములో తెలంగాణముండినట్లును అందలి వారిని తెలింగులు అని వ్యవహరించినట్లును “అథపార్శ్వే తలంగాశ్చా” అని వాయు పురాణములో నున్నదని బిమలా చరణలాగారు (Tribes In Ancient India) ప్రాచీన భారతదేశమందలి జాతులు అను గ్రంథములో వ్రాసిరి.
ఇదే తెలంగాణలో ఆంధ్రుల నగరాలలో కొన్ని నగరాలుండినట్లును ప్లినీ గ్రీకు చరిత్రకారుడు ప్రాచీనమందు వ్రాసినట్టి ఒక ఆంధ్ర నగరము క్రీస్తు శక ప్రథమ ద్వితీయ శతాబ్దులందు హైదరాబాదు నగరమునకు 40 మైళ్ళ దూరములోని కొండాపుర గ్రామము వద్ద వెలిసి యుండినట్లును రెండేండ్లనాడు ప్రభుత్వము వారు త్రవ్వించిన ప్రాచీనపు దిబ్బల నుండి వెల్లడి అయ్యెను. మరియు ఆ దిబ్బలలో ప్రాచీనాంధ్ర రాజుల సీసపు నాణెములు కొల్లలుగా లభించెను. కొన్ని నెలల క్రిందటనే నల్లగొండ వద్ద మరొక ప్రాచీనాంధ్ర నగరము బయటపడినది.
మార్కండేయ పురాణములో మూచికులు అను ఒక జాతి వర్ణింపబడినది. అది మూసీనదీ తీరాలలోను చుట్టుపట్టులలోను వెలసియుండి మూసిక జాతియై యుండునని రాయే చౌదరిగారు ఊహించినారు. మూసీ ఇంచుమించు 150 మైళ్ళ పొడవున వికారాబాదు నుండి హైదరాబాదు నగరం మీదుగా ప్రవహించునట్టి తెలంగాణంలోని ఒక యుపనది. మార్కండేయ వాయు పురాణములలోని చర్చలు వ్యాస ప్రోక్తములనియు, యుగాంతర విషయాలనియు, అతి ప్రాచీనములనియు భ్రమ పడరాదు. క్రీస్తు శకము దశమ శతాబ్దము వరకు కూడా యీ పురాణాలను కల్పించి పెంచుతూ వచ్చిరని యెరుగవలెను.
శాతవాహనుల సామ్రాజ్యము క్రీ.శ. మూడవ శతాబ్దిలో క్షీణించుచు వచ్చను. అటు తర్వాత తెలంగాణ చరిత్ర సరిగా లభించుట లేదు. ఉత్తర దేశమందు హర్షుడు రాజ్యము చేసిన కాలములో దక్షిణమున వాతాపిని రాజధానిగా చేసుకొని పులకేశి రాజ్యము చేసెను. అతని యధీనములో తెలంగాణ ముండెను. అతడు చాలా ప్రబలుడగు దక్కన్ మహారాజు, అతని వద్దకు ఈరాన్ రాయబారులు వచ్చిరి. అతని తర్వాత పులకేశి రాజులు ఈ ప్రాంతాన్ని రాజ్యము చేసిరి. చాళుక్యులు తర్వాత ప్రభువులైరి. వారికిని పల్లవులకును కొంతకాలము యుద్ధములు జరిగెను. పల్లవులే జయించిరి. మరికొంత కాలానికి పశ్చిమ చాళుక్యులొక దిక్కు చోళులొక దిక్కు విజృంభించిరి. తెలంగాణా ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్యులే విశేష కాలముగా రాజ్యము చేసిరి. తెలంగాణ మంతటను చాళుక్యులు కట్టించిన శైవాలయములు కలవు. అందు వారి కన్నడ శాసనాలు కొల్లలుగా కనబడుచున్నవి.
చాళుక్యుల బలము క్షీణించిన తర్వాత కాకతీయులు విజృంభించిరి. కాకతీయుల కాలము నుండి మనకు తెలంగాణ చరిత్రము సమగ్రముగాను, విపులముగాను లభించుచున్నది. కాకతీయ రాజులు తెలంగాణాలోని ఓరుగల్లు నగరమును రాజధానిగా చేసుకొని ఇతర ప్రాంతాలను గూడ జయించి గొప్ప సామ్రాజ్యము స్థాపించి క్రీ.శ. 1350 వరకు రాజ్యము చేసిరి. వారి శాసనములు తెలంగాణ మంతటను లభించుచున్నవి. అవన్నియు తెనుగులోనే వ్రాయబడినవి. కొన్ని సంస్కృతమందును కలవు. కాకతీయుల చరిత్రను వివరించుట కిది సమయము కాదు - ఢిల్లీ రాజులకును, కాకతీయులకును పలుమార్లు యుద్ధాలు జరిగెను. తుదకు రెడ్డి వెలమలయొక్క ద్వేషాల వల్లను ఆంధ్రులలోని పరస్పర కలహాలవల్లను, జైన శైవ మత సంఘర్షణములందు జైనుల రాజ్య ద్రోహము వల్లను, కుల విద్వేషాల వల్లను కాకతీయ సామ్రాజ్యము విద్వస్థమయ్యెను.
వారి యనంతరము దక్కన్‌లో బహమనీ రాజ్యమేర్పడెను. బహమనీ సుల్తానులకు తెలంగాణ లోబడియుండెను. కాని ఒక నూరు సంవత్సరాలకే బహామనీ రాజ్యము అయిదు తునకలైపోయెను. అందొక శకలము గోలకొండ రాజ్యము. అది పూర్తిగా తెనుగు రాజ్యమై యుండెను. తెలంగాణాలోనే గోలకొండ కోట, కుతుబ్‌షాహీల ముఖ్యస్థానముండెను. తెలంగాణములో కుతుబ్‌షాహీల సరిహద్దు ఖిల్లాలుండెను. కుతుబ్‌షాహీల రాజ్యము క్రీ.శ. 1518 నుండి క్రీ.శ. 1687 వరకుండెను. ఆ 170 ఏండ్ల కాలములో గోలకొండ సుల్తానులు తెనుగువారికి ఉద్యోగాలు యిచ్చి తెనుగు సనదులిచ్చి, తెనుగుభాషను ప్రోత్సహించి, తెనుగు సేనానులను; తెనుగు సిపాయిలను ఏర్పాటు చేసి, రాజ్యమును తెలుగు రాజులవలె పాలించిరి. మత పక్షపాతము తప్పనిదైనను సమకాలీనులైన ఇతరుల వలె వారు దురాగ్రహమును ప్రదర్శించి యుండలేదు. కుతుబ్‌షాహీల యనంతరము ఆసఫ్ జాహి ప్రభువులు ఈ తెలంగాణమునకు ప్రభువులైరి. ఇంచుమించు 280 ఏండ్ల నుండి ఆసఫ్‌జాహీ వంశమువారు తెలంగాణాతోపాటు మరాట్వాడాను పరిపాలించుచు వచ్చినారు.
ఈ విధముగా మనకు 2000 ఏండ్ల నుండి తెలంగాణ చరిత్రము కొద్దిగనో గొప్పగనో లభించుచున్నది. ఇప్పుడు పరిపాలనా సౌకర్యము కొరకై తెలంగాణము మరాట్వాడా నుండి విభిన్న మొనర్చబడినది. కాని ప్రాచీన మందట్టి విభిన్నత కాని, ప్రత్యేకత కాని ఈ తెలంగాణమని కాని లేకుండెనని యెరుగవలెను. వివిధ రాజులు, సుల్తానులు తెలంగాణాముతో పాటు ఇతర ప్రాంతాలను కూడా జయించి రాజ్యము చేయుచుండిరి. ఇప్పుడు హైదరాబాదు రాష్ట్రములో ఆసఫ్ జాహీ ప్రభువుల పరిపాలన క్రింద తెలంగాణాకు విశిష్టత ఏర్పడినందున ఈ భాగములోని చరిత్రను తెలంగాణ వాసులు యెరిగియుండు టవసరమని తెల్పనైనది.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse