Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/తాంబూల సేవనము

వికీసోర్స్ నుండి

తాంబూల సేవనము

తాంబూలమును సేవించు ఆచారము బహుశా ఒక్క హిందూస్థానమందే కలదేమో. ఈ యాచారమెప్పుడేర్పడెనో సరిగా చెప్పజాలము.


ఆదిత్య సోదయం, తాత.

“తాంబూలం, భారతీకథా, ఇష్టా భార్యా, సుమిత్రాంచ అపూర్వాసు దినే దినే”


భారత కథ, సూర్యోదయము, ఇష్ట భార్య, మంచి స్నేహితుడు, తాంబూలము ఇవన్నియు ప్రతిదినము క్రొత్తగనే రమణీయముగనే ఉండును అని పంచతంత్రములో వర్ణించినారు.


అమరసింహుడు బహుశా క్రీస్తుశకము 300 ప్రాంతములందుడినవాడు. అతడు నామలింగానుశాసనములో వనౌషధి వర్గలో తమలపాకుల కీ విధముగ పర్యాయపదములిచ్చెను. “తాంబూల వల్లీ తాంబూలీ నాగవల్ల్యపి” తాంబూలమునకు నాగవల్లి అను పదమొక్కటే అతడిచ్చెను. నాగలోకమునుండి అది మనకు లభించి నందున నాగవల్లి అయినదని అమరవ్యాఖ్యాత లింగాభట్టు చమత్కరించెను. కాని నాగుబాము పడగవలెనుండు ఆకులు కల తీగ యగుటచే నాగవల్లి యయ్యెనన వచ్చును.


ఘోంటాపగ, క్రముక, గువాక, ఖప్పర, ఉద్వేగ అనుపదములు పోకకు పర్యాయ పదములని అమరుడు తెలిపెను. అందు పూగక్రముకములే ప్రచారమందున్నది. పూగ అనగా 'పునీతి ముఖమితి పూగః” ముఖమును పవిత్రము చేయునది కాన పూగమయ్యెను అని లింగాభట్టు విచిత్రముగా సమర్థించెను. తెనుగులో పూగ అనునదే పోఁక. ఈ శబ్దములో అరసున్న కలదు. కాన పూర్వము దీనిని పొంక అనిరి. పోకనాడు, పూగనాడు అను నాడు కలదు. అచ్చట ఇవి విశేషముగా పండినందున పూగము పోక అయ్యెనేమో అని నా యనుమానము. ఘెంట అను పదమే తెనుగులో “గొంటు” అయి యుండును. గొంటు పోక అనియు కొరకరాని గొంటు అనియు తెనుగు వారందురు. గట్టిపోక గొంటు పోకయే అయి యుండును.

తాంబూలములోని యంగాంగములను మొదలు విచారింతుము. తాంబూలము, తమలము, తమ్ములము, నాగవల్లి అనునవి తమలపాకును తెలుపును. తమ్మ పడిగ అనగా తాంబూల రసమును ఉమియుటకై ఉపయోగించు పాత్ర. కావున తమ్మ అని తమ్ములమున కుపయోగించిరనవలెను. రెడ్డి వెలమరాజులు పరస్పరము తలలకోసి తలపుర్రెలను తమ్మపడిగలుగా ఉపయోగించిన ధీరులు! హైదరాబాదులో వాటికి థూక్దాన్‌ ఉగల్‌ దానులందురు. సంపన్నుల యిండ్లలో అవియుండును. పూర్వము రాజులవద్ద తాంబూలపుతిత్తులను ఉంచుకొనియుండు సేవకులును సేవకురాండ్రును ఉండినందుననె అడపకత్తె అడపకాడు అను పదములు మన వాఙ్మయములో కానవస్తున్నవి. అడపము అనగా వక్కలాకుల తిత్తి. వక్కలను కత్తిరించుట కొక సాధనము కలదు. దానిని అడకొత్తు, పోకొత్తు అందురు. అడకొత్తు అనగా ఆడకాయఁ ఒత్తు అనుపదముల చేరిక అని శబ్దరత్నాకరమందు వ్రాసిరి. కాని అడకాయ అనుపదమును వ్రాయలేదు. కన్నడంలో అడికి అనగా వక్క దానిని ఒత్తు నది అడకొత్తు. ఒక కాలములో తెనుగువారు పోకలను అడక అని పిలుచుచుండిరని ఊహింపవచ్చును. అడకాయ అనునది తప్పని కన్నడ పదములబట్టి చెప్పవచ్చును. అడకత్తును సంస్కృతములో “శంకుల” అనినట్లు శబ్దరత్నాకరములో కానవస్తున్నది. కాని అమరుడేపదము నిచ్చినట్లు కానరాదు. వక్క అను పదము ప్రక్క నుండి తునక అను నర్థములో నేర్పడెనో యేమో? ఉడుకబెట్టిన పోకచెక్క అని దానికి నిఘంట్వర్థము వ్రాసినారు. మనదేశములో ఉడుకబెట్టిన వక్కలను ఉడుకబెట్టని వక్కలను తినువారు కలరు. ఆంధ్రులు, కర్ణాటకులు, తమిళులు ఉడుకబెట్టిన వక్కలనే వాడుదురు. మళయాళీల దేశమందే వక్కలు సమృద్ధి. వారును ఇతర హిందూస్థానము జనులును విశేషముగా పచ్చిపోకలనే వాడుదురు. పోకలను బాగాలు అనియు అందురు. ఈ పదము ఒరంగల్‌ జిల్లాలో ఎక్కువ ప్రచారములో కలదు. “బాగములు” అను శబ్దమే భాగాలు. భాగములు అను శబ్దభావమే తునక అను నర్థములో వక్కవలె ఇది యేర్చడెనేమో అని నా అనుమానము. “కట్టెడు తెల్లనాకులను కప్పుర భాగాలు నిచ్చి నిచ్చటన్‌” అని తారా శశాంకమందును, “కర్పూరంబు తోడి బాగాలీరాదో యాకు మడిచి యీరాదొ చెలీ” అని కళాపూర్ణోదయమందును వాడిరి. “మంచి మేలైనది దిగు కొమ్మంచు కప్పురంబు సగపాలు నింపి వీడెంబొసంగి” అనియు “బాగా లొసంగె” అనియు చేమకూర వ్రాసిన ప్రయోగాలు కలవు, విడెము, వీడియము, వీడ్యము అను పదములు తాంబూలమునకు వాడిరి. దీనినె “బీకా” అని హిందీలో వాడిరి. “బీడా ఎత్తుట” అను హిందీ నుడికారములో గొప్ప యర్థము కలదు. ఎవరైన సాహస కార్యము చేయదలచిన రాజు ఇచ్చిన విడెమును తీసుకొనుచుండిరి. అనగా ఆ కార్యమును ప్రాణములర్పించి యైనను సాధించి తీరుదునని బీడా ఎత్తువాడు శపథము చేయుట అగుచుండెను. సంస్కృతమున విడెమును వీటి అనిరి.

ప్రియ దూతిక తెచ్చి యిచ్చు కప్పుర విడెము కావలెనని అల్లసాని పెద్దన కోరెను. మన కవులు సాధారణముగా తాంబూలములో కర్పూరమును చేర్చి సేవించుచు వర్ణించినది గమనింపవలెను. నేడు అది మృగ్యమైపోయినది. తాంబూలమును గురించి సంస్కృతములో కొన్ని చాటూక్తులు కలవు. తెనుగులోను కొన్ని కలవు. మాసరకిది యొకటి కనుడు. “తాంబూలం ముఖ్యరోగ”

తాంబూలమును వేసుకొనువారు తాంబూలము తిత్తులో లేక పెట్టెలో లేక కరండములో లేక కరంకము లేక జాలవల్లికలో ఉంచుకొనుచుండిరి. కరంక పదమును బాణుడు కాదంబరిలో ప్రయోగించెను. తెనుగులో కరండమని ప్రయోగించిరి. ఆ పెట్టెలపైన సన్నని తీగె పనులుండెడివి. అందుచేత వాటిని జాలవల్లికలనిరి. జాలవల్లికల తోడ బాగాలు, తెల్లనాకులు కైరవళ్ళు నెదుట పెట్టెను” అని సారంగు తమ్మయ్య వ్రాసెను. కైరవడి అనగా కాచులో పాలు మొగలిపూల రసము వేసి నూరి గోలీలుగా చేయుట అని యర్థము. “కప్పురపు వీడియంబును కైరవళ్ళు కొసగె” అని శృంగార మల్హణ చరిత్రలో వర్ణింపబడినది. తాంబూలపు పెట్టెలు నానా విధములైనవి. ఇత్తడి, రాగి, కంచు, వెండి, బంగారు లోహములతో సిద్ధము చేయుచుండిరి. నెమలివలె, బాతువలె, రాగిరేకువలె, గుండ్రముగను, తీగెల పనులతోను, వివిధ సుందర రూపముల తోను పెట్టెలను సిద్ధము చేయుచుండిరి. పెట్టెలలో అర్రలు చాలా ఉండెడివి. అందు వేర్వేరుగా వక్కలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, ఏలకులు, కర్పూరము, సున్నము, కస్తూరి, కుంకుమపువ్వు, కైరవళ్ళు, కాచు, సొంటి, తమలపాకులు, కొబ్బెరిపొడి, అడకొత్తు మున్నగునవి ఉండెడివి. సంపన్నులు వక్కలకు, లవంగాలకు వెండి, బంగారు రేకులను ఒత్తి వాడుకొనుచుండిరి. తాంబూలము పైనను వెండి, బంగారు రేకులొత్తి సేవించుచుండిరి.


“ఖండిత పూగీ నాగర
ఖండంబుల ఘన శశాంక ఖండంబులచే
హిండితమగు తాంబూలము”


అని కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో (5-93) వర్ణించెను.


“మృగమద సౌరభ విభవ
ద్వి గుణిత ఘనసార సాంద్రవీటీ గంధ
స్థగితే తర పరిమళమె”


అని అల్లసాని పెద్దన (2-24) వర్ణించెను.


విజయనగర చక్రవర్తుల కాలములో సంపన్నులు సేవించిన తాంబూలమును పైన వర్ణించినారనుట స్పష్టమే. తాంబూలములో కొందరు తురిమిన కొబ్బరి పొడిని, గసాలను, సోంపులను వాడుదురు.


చాళుక్య సోమేశ్వరుడు అను రాజు క్రీ.శ. 1050 ప్రాంతమువాడు. అతడు సంస్కృతములో “అభిలషితార్థ చింతామణి” అను గ్రంథమును రచించెను. “అందు తాంబూల భోగంబు” అను విషయమును గురించి (ప్రకరణము 3, అధ్యాయము 4 లో)22 శ్లోకములు వ్రాసెను. అతని కాలమందు రాజుల తాంబూలము లేవిధముగా ఉండెనో తెలిసికొనుటకీ భాగము చాలా నహాయవడుచున్నది. అందలి విషయాలిట్లున్నవి-


“రాజు స్నానము చేసి బయటకు వచ్చి “తాంబూలాధికారి”ని పిలిచి తాంబూలమును చేయును. మేఘవర్తి పురమందును, ఈశ్వర పురమందును, కారటీ పురమందును కాసిన వక్కలను పాకము చేయించవలెను. పాటలమువలె కొద్ది ఎరుపును కాషాయ మధుకమును అగునట్లుడికించి ఆరబెట్టవలెను. మామిడి ఫలముల తొడిమల నుండి వెడలు రసములోను గంధము పొడి, కర్పూరముతోను కలిపి నీటిలోన వాటిని నానబెట్టవలెను. అట్టి పచ్చిపోకల పైన సన్నని పొరను చెక్కి వేడి ముక్కలుగా చేసి నీడలో ఆరబెట్టవలెను. తమలపాకులలో శ్రేష్ఠమైనవి కర్పూరవల్లి, నాగవల్లి అను తీగలపై పెరుగునట్టవి. ఒక సంవత్సరము కన్న నెక్కువగా పెరిగిన తీగలపై తమల పాకులను తీసుకొనవలెను. ఆకులపై నదీ జలమును చల్లవలెను. అవి పెద్దవిగాను తెల్లవిగను ఉండవలెను. వాటి కొనలను గిల్లివేయవలెను. అవి 52 ఆకులై యుండవలెను. శైలోదకముతోను, శిలాపాకముతోను కూడిన ముత్తెపు భస్మమును సున్నముగా వాడవలెను. కర్పూరమెట్టిదనగా - మలయాచలమందు పుట్టినదగును. మామిడివాసన కలదిగను, ఈశావాసమను పేరు కలదిగను శ్రేష్టమైనదిగ నుండవలెను. తాంబూలములో పై వక్కలను, కర్పూరమును కాక, కస్తూరి చూర్ణమును, గంధ చూర్ణమును సమ భాగములుగా కలిపి వాడుకొనవలెను. మరియు నీ క్రిందివి కూడ చేర్చవలెనట.


“కస్తూరీ శశితక్కోలం జాతీఫల సుచూర్ణకం
ఖదిరక్వాథ చూర్ణంతు కస్తూరీ క్షోదమిశ్రితం
శ్రీ ఖండ కల్క సంయుక్తం కర్పూర రజసమన్వితం
మేళయిత్వా సమ్యక్‌భాగైః గుళికా కల్పితా శుభా”


కస్తూరి, తక్కొలము, జాజి, ఖదిరల్వౌధము, శశి, కర్పూరము గంధము ఇవన్నియును సమభాగాలుగా కలిపి నూరి గోలీలు చేసి వాటిని తాంబూలములో వాడవలెను. పై వాటిలో శశి అననేమో తెలియదు. ఖదిర మన ముడుగు తామర చంద్ర అని నిఘంట్వర్థము. ఇవేమో సరిగా తెలియనందున మూలము నుదాహరించి నాను. ఇంకా కొన్ని తాంబూల పరిష్కారములను సోమేశ్వరుడు వర్ణించినాడు. అందు ఖదిరసారముతో కాషామ్ల చూర్ణము జంజీర బీమిపూరము యొక్క కళికలు చేరినవి. ఇవియు నిట్టివో యేమో?


హిందూస్థానమందు తాంబూల సేవనము ఇట్లూహింపనైనది. బహుశ ఈ ఆచారము ఇండోనేషియాలోను, మలయాలోను కలదేమో? ఈరాన్‌, అరేబియా, వంటి ఉత్తర దేశాలలో ఈ ఆచారము లేదు. విజయసగర చక్రవర్తుల కాలములో ఈరాని రాయబారియగు అబ్దుర్రజాక్‌ ఇట్లు వ్రాసి యుండెను. “ఈ దేశములో తాంబూలమును విశేషముగా వేసుకొందురు. అది ఉత్తేజకరమైనది. బహుశా దీని ఉత్తేజకశక్తివలనేమో చక్రవర్తి తన (700) ఏడు నూర్ల భార్యలతో ఉంపుడు గత్తెలతో భోగింపగలుగుచున్నాడు”. శుభాశుభ కార్యాలలో తాంబూలములను వాడుదురు. వ్రతములలో మూర్తి పూజలలో తాంబూలములను వాడుదురు. ఈ సందర్భములో కొన్ని ఆచారములు స్థిరపడినవి. శుభకార్యములలో తాంబూలముగాచేసి ఇవ్వరాదు. శ్రాద్ధాదులలో విడిగా ఉన్న తమలపాకులనుంచెదరు. తమలపాకుల తొడిమలను, ఈనెలను, తోకలను తీసివేసి తాంబూలము చేయుట పలువురి పరిపాటి. దానికిని కొన్ని శాస్త్రాలు బయలుదేరినవి. తొడిమ రోగము కలిగించుననియు, అటులే ఈనెల తోకలు మంచివి కావనియు అందురు. విఘ్నేశ్వర పూజలతో ప్రారంభమగు ప్రతాలన్నింటిలో వినాయకునికిని, దేవతలకును తాంబూలము లిత్తురు. తాంబూలములతో పాటు దక్షిణ కూడ ఉండవలెను. వీడ్కోలు చేయునప్పుడు ఏమి లేకున్నను తాంబూలమైనను ఇయ్యకుండిన భారతీయులలో మర్యాద లోపమని భావింతురు. ఆధునిక పాశ్చాత్య వైద్యులు ఆకులు చెడ్డవి, వక్కలు మరీ చెడ్డవి, సున్నము చెడ్డది, మొత్తముపై తాంబూలమే చెడ్డదని అనినారు. కాని, వారిలో శ్రీవారు కొందరు నష్టము లేదన్నారు. వారేమన్నను భారతీయులు తాంబూలమును వదలుకొనిరి. సున్నము ఉత్తమమైనదిగా ఉండవలెను. రాజులు, రాణీలు నేటికిని ముత్యముల, పగడాల భస్మమును సున్నముగా వాడుదురు. పచ్చ పోకలు వేసుకొనువారు కాచును తప్పక వాడుదురు దానిని పాలతో ఉడికించు వారును కలరు. దానిలో మొగలిపూరసమును చేర్చి గోలీలుగా చేసి వాడువారును కలరు. పచ్చ కర్పూరమును వాడువారు కొందరు. పసుపువన్నెతో నుండు తమలపాకు లను అందరును చాలా శ్రేష్ఠమని భావింతురు. శ్రీనాథుని కాలపు క్రీడాభిరామములో నిట్లు కలదు.


“వీడిదె తెల్లనాకులను వీడెము సేయుచు వీథివచ్చుచు
న్నాడు, మదించి తిండితినినాడు చుమీ। ............. "


ఉత్తమ హిందూస్థానము వారు డిల్లీ ప్రాంతములందు పెరుగు తెల్లని చిన్న తమల పాకులను చాలా ప్రీతితో కోరుదురు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో “కారపాకులు” అను కొద్దిగా కారముకల పెద్ద తమల పాకులను తిందురు. తమిళు లు లేత ఆకుపచ్చని ఆకులెన్నైనను మేకలవలె నములుచుందురు. మళయాళములో మరల పెద్ద కారపాకులను అప్పుడు చెట్టుపై నుండి త్రెంచిన పీచుతో నుండు పచ్చని పోకలను ఘాటైన వెన్నవంటి మెత్తని తెల్లని సున్నమును వాడుదురు. ఆ యాకులు కర్నూలు ప్రాంతాలలో తాంబూలము ధర ఇప్పుడు ఒక అణా. అందు సాక్రీన్‌ చేర్చి అమ్ముదురు. ఆ ప్రాంతమందలి కొత్తగా ప్రబలిన రుచి. హైదరాబాదులో పచ్చి పోకల బీడాలే దొరకును. ఇదివరలో ఒక పైసాకొక బీడా యిచ్చుచుండిరి. ఇప్పుడు కనిష్ఠపు బీడా అర్థాణా కొకటి. రెండణాలును, నాలుగణాలును, అర్థ రూపాయికిని, రూపాయికిని ఒకే ఒక బీడా కూడా హైదరాబాదులో కట్టి యిచ్చువారున్నారు. వాటిని కొని సేవించువారును కలరు. పోకలును కలిసిన తాంబూలపు రసమును మ్రింగిన వెంటనే ఒళ్ళంతయు మంటలెత్తును.

మనదేశములో నంతటను మళయాళమందే పోకచెట్లు సమృద్ధిగానుండును. తర్వాత తమిళనాడులో కొంతవరకు లభించును. జాజికాయలు, జాపత్రి నీలగిరిలో లభించును. కాని ఏలకులు, లవంగాలు, జాజి, జాపత్రి, వక్కలు మున్నగు సుగంధ ద్రవ్యములు ఇండోనేషియా దీవులలో అతి సమృద్ధిగా లభించును. అందుచేతనే ఆ దీవులు పాశ్చాత్యులు సుగంధ దీవులు (50106 1312069) అని పేరు పెట్టిరి. గత ప్రపంచ యుద్ధ కాలమం దక్కడినుండి పై వస్తువులు దిగుమతి మనకు ఆగిపోగా వాటి ధర విపరీతముగా పెరిగిపోయెను.

పొగాకు మనదేశములో క్రీ.శ. 1550 నుండి మొదలై దేశమంతటను వ్యాపించెను. అటు తర్వాత ఇంచుమించు 200 ఏండ్ల నుండి పొగాకును తాంబూలములో పలువురు వాడుటను మొదలుపెట్టిరి. పొగాకు తినిన నోరు దుర్వాసన కలిగియుండును. కాని పండ్లకు జబ్బులను రాకుండా పొగాకు రసము సహాయపడును. అదియే పొగాకును తమలపాకులతో పాటు వాడుటకు ముఖ్య కారణమైనది. ముసల్మాను నవాబులు సర్కారులు అమీరులు దీనికి సువాసన కలుగుటకై పన్నీరు సుగంధ ద్రవ్యములు కలిపి పొగాకును నానబెట్టి పాకము చేసి జర్దా అనియు, ఖమాం అనియు, ఎన్నియో పేరులు పెట్టి సిద్ధము చేయించుచుందురు. తెనుగు దేశమందంతటను జనులు విశేషముగా పొగాకు పుల్లలనే తాంబూలముతో పాటు నోటవేసుకొని నమిలి రసమును ఉమ్మి వేయుచుందురు. పొగాకు పంటి నొప్పిని హరించునని 200 ఏండ్లనాడే కనుగొనిరి. ఒకచాటువులో నిట్లు వర్ణించినారు.


“దంత లూటీ ఘోర దంతి హర్యక్షంబు
కుష్టరోగాభీల కులిశధార....”


గండ్లూరి నరసింహ కవి కర్నూలు మండలమువాడు. క్రీ.శ. 1800 ప్రాంతము వాడు. అతడు తన భాషీయ దండకములో నిట్లు వ్రాసెను.


“ఇంగ, గొల్లేశీమొస్తుంది, నోట్లోకి కొంచెం పొగా
క్పుల్లగిల్పెట్టి......... పోరా; పోగాక్పుల్లకే యాడ
కొట్టించుంకొంటావురా, యటంచున్‌ విశదంబుగా
గూడె పున్‌ దాసం............... గుంపు గూడాడగా”


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse