సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/జీవిత చరిత్రలు-వాటి రచన
జీవిత చరిత్రలు - వాటి రచన
జీవిత చరిత్రలకూ దేశచరిత్రలకూ సన్నిహిత సంబంధం కలదు. మహా పురుషులే దేశ చరిత్రలకు ముఖ్యకారకులు. ఒక్కొక్క మహాపురుషుడు తన శక్తి చేత గొప్ప భూభాగమునే కాక ఖండాలనే మార్చిపోయినాడు. ఏసుక్రీస్తు, మహమ్మదు, బుద్దుడు గొప్ప మత పరివర్తనము కావించి పోయినట్టివారు. అలెగ్జాండరు, హానిబాల్, నెపోలియన్ చక్రవర్తి, అశోకుడు మరొక వర్గానికి చేరినట్టివారు. వారు శూరులును, సాహసికులునునై యుండిరి, కొలంబసు, కుక్, వాస్కోడిగామా వంటి నావికులు కూడా ప్రపంచముపై తమ ప్రభావము వేసిపోయిరి. కొలంబసు తేరకు తేరగా అమెరికాను స్పెయిను కిచ్చెను. కుక్ అనువాడు ఆస్ట్రేలియాను చూడబోయి అచ్చట ఇంగ్లీషు జండాపాతి ఇది మాది అనెను. వాస్కోడిగామా ఇండియాకు దారితీసే పాశ్చాత్యులకు ఇండియాను అప్పగించుటకు పాటుపడెను. వాట్, స్టీవెన్సన్, గూటెన్ బర్గు, రైటు సోదరులు మున్నగు వారు చాలా గొప్పవారు. వారు రసాయనాది శాస్త్రాలలో ప్రవీణులై రైళ్ళు, ఇంజనులు, అచ్చుయంత్రాలు, విమానాలు మున్నగునవి కనుగొని ఏషియా, ఆఫ్రికా ఖండాల ఆర్థిక విజయమునకు కారకులైరి.
పై విషయాలను బట్టి మతకర్తలు, సేనానులు, రాజులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు వీరందరూ చారిత్రక పురుషులని విశదమగును. వారిని ఆదర్శముగా తీసుకొని తర్వాతి కాలములో క్రొత్తవారు బయలుదేరి ప్రపంచ కళ్యాణమునకు తోడ్పడుట కవకాశమేర్పడును. జీవిత చరిత్రలు నీతిని బోధించును. మన పూర్వుల మంచి చెడ్డలను తెలుసుకొని మనము వాటివల్ల లాభం పొందగలము.
జీవిత చరిత్రలు వ్రాయుటలో గ్రీకులో ప్రథమంలో క్రీస్తునకు పూర్వమందే క్షణఫ్ అనునతడు సోక్రటీసు చరిత్రను వ్రాసెను. ప్లూటార్ అనునతడు 46 మంది గ్రీసు రోముదేశాల మహాపురుషుల జీవితమును వ్రాసెను. గ్రీకుల తర్వాత జీవిత చరిత్రలు వ్రాయుటలో రోమువారు ప్రసిద్ధులు. హిందువులలో చరిత్రలే లేకుండెనను అపవాద మున్నందున ఇక జీవిత చరిత్రల కెక్కడ తావున్నది. హిందువులు ఒక విధముగ ప్రపంచములో మొట్టమొదట జీవిత చరిత్రలు వ్రాసినవారు. కాని ఆ మాటను నమ్మకుండునట్లుగా తర్వాత మనవారే చేసి వేసినారు. మన పురాణములు జీవిత చరిత్రలతో నిండియుండెను. రామాయణము శ్రీరాముని జీవిత చరిత్రము కాదా? దానిని చదువని లేక వినని హిందువు లేడు కదా! భాగవతము శ్రీకృష్ణుని జీవిత చరిత్రము, దానిని విననివారు అరుదు. హరిశ్చంద్రుని చరిత్ర, నలచరిత్ర, అజామిళుని చరిత్ర ఇట్టివి వేలకొలది కలవు. అవన్నీ జీవిత చరిత్రలే! కాని హిందువులలో ఒక లక్షణమున్నది. తమకు నచ్చిన వారిని దేవతలుగా చేసిరి. మెచ్చని వారిని రాక్షసులుగా చేసిరి. ఆ చేయుటలోనూ మహిమలతో పూర్తిగా నింపివేసిరి. ఈ కారణాలచేత నిజమైన చరిత్ర మాటుపడి, నమ్మరానిదై పోయెను. అంత ప్రాచీన కాలపు ముచ్చట్లు వదలినా నిన్న మొన్నటి అనగా 200 ఏండ్ల క్రిందటి చరిత్రలు కూడా మనవారట్లే వ్రాసిరి. తుకారాం విమానములో సశరీరుడై పోయెనట. నామదేవుడు బఱ్ఱెచేత వేదాలు చదివించెనట. ఇవన్నీ భక్త విజయములో చూచుకొనవచ్చును. వైష్ణవులను చూచి శైవులు, శైవులను చూచి వైష్ణవులు భక్తుల చరిత్రలను కొల్లులుగా వ్రాసిరి. ఇక మనవారి రెండవలోప మేమనగా జీవిత చరిత్రలను ఉన్న దున్నట్లుగా వ్రాయక ఉత్ప్రేక్షలతో అబద్దాలతో నింపివేసిరి. విక్రమాంకదేవ చరిత్ర, మహ్మద్ మదమర్ధనం, శంకర విజయము, వేమభూపాల చరిత్ర, హర్షచరిత్ర, సాళువాభ్యుదయము, పృథ్వీరాజ విజయము మున్నగు సంస్కృత జీవిత చరిత్రములు వందలకొలదిగా నున్నవి. అవి కొంతవరకే పనికి వచ్చును.
అజ్ఞానుల వల్ల వ్రాయబడిన జీవిత చరిత్రలు దేశకాలాదులను తెలుపక, అపభ్రంశ రూపాలతో నిండిన జంగము కథలు, పవాడాలు, సుద్దులు దేశమంతట నిండినవి. అవి జీవిత చరిత్రలె కాని బహు లోప భూయిష్టముగానున్నవి.
మన తెనుగులో కొన్ని జీవిత చరిత్రలు కానవచ్చుచున్నవి. కృష్ణరాయ విజయము, నరపతి విజయము, కైఫియత్తులు, ప్రతాప చరిత్రము మున్నగునవీ వర్గములో చేరును. కాని ఇవి వ్రేళ్ళమీది లెక్కలోనివి, ఇవికూడా లోపాలకు గురియెనవి. యూరపు దేశములో ఆధునిక పద్ధతులపై జీవిత చరిత్రలు మున్నూరు నున్నూరు ఏండ్ల క్రిందటనే రచింపబడుటకు మొదలయ్యెను. ఎనిమిదవ హెన్రీ కాలములో ఇంగ్లండు దేశములో జీవిత చరిత్రలు వ్రాయనారంభించిరి. కాని బాస్వెల్ వ్రాసిన జాన్సన్ జీవితమే ఇంగ్లీషు భాషకూ, జాతికీ జగద్విఖ్యాతిని తెచ్చెను. అదే తర్వాతి వారికి ఒరవడి అయ్యెను. నెల్సన్ జీవితము, స్కాటు జీవితము ప్రఖ్యాతములైనవి. యూరపు ఖండములోని ఫ్రాన్సు, జర్మనీ, రష్యా దేశాలలో జీవిత చరిత్రల రచన బాగా గత శతాబ్దమందు వృద్ధి యయ్యెను. అమెరికాలోను అదే కాలమందు అవి వ్యాప్తికి వచ్చెను.
జీవిత చరిత్రలో ఆత్మకథలు (AUt0 biographies) చేరినవి. ప్రపంచ మందలి కొందరు మహాపురుషులు తామే తమ జీవిత చరిత్రలను వ్రాసి పెట్టినారు. మహాత్మాగాంధీగారు తమ జీవిత చరిత్రను వ్రాసినది సుప్రసిద్ధము. ప్రపంచ స్వీయచరిత్రలలో గాంధీగారి ఆత్మకథ ఉత్తమ స్థానము వహిస్తున్నది. ఆత్మకథ వ్రాయువారు తమ లోపాలను బయటపెట్టరు గాంధీగారు తనలోని మంచివీ చెడ్డవీ అన్నీ బయటపెట్టారు.
మన తెనుగులో స్వీయచరిత్రను వ్రాసిన వారిలో మొట్టమొదటివారు శ్రీ కందుకూరి వీరేశలింగము గారే. మన తెనుగులో జీవిత చరిత్రలు మొన్న మొన్నటివరకు లేకుండెను. ఈ ముప్ఫై యేండ్ల నుండియే జీవిత చరిత్రలను అందందు వ్రాయుటకు మొదలు పెట్టినారు. మన తెనుగు లోనికి మొట్టమొదట ఆబట్ రచితమగు నెపోలియన్ చరిత్రము, లడ్విగ్ వ్రాసిన చరిత్రములు, ఆరంస్ట్రాంగ్ వ్రాసిన కమాల్‌పాషా ఇబసాదు చరిత్రలు జాన్సన్ జీవిత చరిత్ర, కార్లైల్ వీరుల చరిత్ర మొదలైన ఉత్తమ జీవిత చరిత్రలు పరివర్తనలు కావలెను. తర్వాత ప్రపంచ మహాపురుషులను గూర్చి వ్రాసిన ఉత్తమ చరిత్రల నన్నింటిని అనువదింప జేయవలెను.
పాశ్చాత్యులు మన పూర్వులకు సరియగు న్యాయమును చూపించి యుండలేదు. పాశ్చుయర్, యూక్లెడ్, ఆర్కిమిడిస్, గాలిలియో మొదలైన యూరపు పరిశోధకుల చరిత్రలను విపులముగా వ్రాయుదురు. కాని ప్రపంచానికి సంస్కృత భిక్షను పెట్టిన హిందూ ఆర్య మహాపురుషుల పేరులనైనా స్మరించరు. రేఖాగణితము, బీజగణితము (Geometry & Algebra) లెక్కలలోని పూర్ణాంకమును (సున్నాను) దశాంశమును (Decimal) మొట్టమొదట కనిపెట్టినది హిందువులు. ఆర్యభట్ట, వరాహమిహిర, భాస్కరాచార్య, నాగార్జున, భోజరాజు, శుల్బ, కణాద, ధన్వంతరి, అగస్త్య, కౌండిన్య, భరత, జయసింహాది పరశ్శత మహాపురుషుల పేరు లెక్కడా ఆంగ్ల జీవిత చరిత్రలలో కానరావు. పై వారిలో జ్యోతిర్వేత్తలు, గణితాచార్యులు, రసాయనశాస్త్ర ప్రవర్తకులు, కణ సిద్ధాంత స్థాపకులు (Atomic theory) వలస రాజ్యాలను స్థాపించినవారు, శిల్పాచార్యులు, విమానశాస్త్ర నిర్మాతలు చేరియున్నారు. తెల్లవారు చేయలేదని మనమూరకొనవలెనా? అందుచేతనే మన మింకనూ అధికముగా పరిశోధించి శ్రమించి మన పూర్వ మహామహుల చరిత్రలను మన భాషలందును పరభాషలందును వ్రాసి వ్యాప్తికి తేవలెను. ప్రత్యేకముగా పైన సూచించిన వారిని గూర్చి ఇతరార్య మహాపురుషుల గూర్చి యెవరైనా పరిశోధించి రచించిన బాగుండునని నేను చాలా కాలము నుండి అనుకొనుచుందును. ఆ పుణ్యకాలము రాకమానదు.
జీవిత చరిత్రలను వ్రాయుట సామాన్య విషయము కాదు. జీవిత చరిత్రను కూలికి వ్రాయువారు చాలామంది కలరు. తమ పొట్ట నింపుకొనుటకై శక్తి సంపన్నులను సకలాలంకారములతో వర్ణించి రావణుని రామునిగా, హిరణ్యకశిపుని హిరణ్య గర్భునిగా, పోతురాజును భోజరాజుగా, లుబ్దాగ్రేసరుని దానకర్ణునిగా చిత్రించి హాస్యస్పదులగుచున్నారు. అట్టి చరిత్రలు నాలుగుదినాల పాటు కూడా నిలువవు. జాన్సన్ చరిత్ర వ్రాసిన బాస్వెల్‌కు దమ్మిడి లాభము లేకుండెను. అది లోకోత్తర జీవిత చరిత్ర యయ్యెను. జీవిత చరిత్రలను కొని చదువుడనిన జనులు వాటితోపాటు అమృతాంజనం కొనవలెనంటారు. అవి నీరసముగా నుండునని తలతురు. జీవిత చరిత్ర వ్రాయు రచయిత తన గ్రంథాన్ని రమ్యముగా ఆకర్షణీయముగా వినోద హేతువుగా చేయుటకై అబద్ధాలను తన సొంత పైత్యాన్ని తన గ్రంథములో నింపిన అది మదనకామరాజు కథలుగా మారిపోవచ్చును. సత్యమునే చెప్పవలెను. చక్మగానే చెప్పవలెను. ఆ విధముగా చెప్పినవాడే ఘనుడు. రచయిత శైలి ద్వారా చాలా రమ్యతను తన గ్రంథానికి చేకూర్చగలడు. కావున జీవిత చరిత్రలకు శైలి చాలా ముఖ్యమైనదిగా నుండును.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse