సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/చేమకూర వేంకటకవి
చేమకూర వేంకటపతి సారంగధర చరిత్ర
చేమకూర వేంకటకవి కవితాప్రాశస్త్యమును గురించి మన యాధునిక పండితరాయలిచ్చిన ఈ క్రింది యభిప్రాయము చాలా సమంజసముగానున్నది. ఈ చేమకూర వేంకటకవి చక్కర మడిలో అమృతము పాఱించి పెంచినదిగాని మట్టిలో నీరు పాఱించి పెంచినది కాదు. ఇందు పూ మొగ్గలు వోలె తామే విడుశ్లేషలును, ద్రాక్షా పాకంబున నోరూర రసమొల్కు రచనలును సదాచారాభిమానముంబురి కొల్పు ధర్మ్య నిబంధన నైపుణియు, విసిగింపని వర్ణనలును, బరువులు నెరువులుంగాని కబ్బంపు, దొడవులును, ఈ ప్రబంధమును భారతీ భాండాగారమందు కడునుచ్ఛ స్థానమందు నెలకొల్పుచున్నది.
మొట్టమొదట శ్రీయుత కట్టమంచి రామలింగారెడ్డిగారు ఆంధ్ర ప్రబంధములోని తత్త్వములను విమర్శించిరి. ప్రతి ప్రబంధమందును నొక విధమగు కథా పద్ధతియుండునని చూపించిరి. మన చేమకూర సారంగధరలో నట్టి పద్ధతి కానరాదు. ఇందలిదియే వేరుగా నున్నది. కావున పద్ధతియే వేరు. ఇందలి కథానాయకుల పాత్ర పోషణమును గుఱించి చర్చించుటకు బూర్వము యొక యంశమును విశదపఱుప వలెను. కీ.శే. ధర్మవరము కృష్ణమాచార్యులీ సారంగధరనే యాధారము చేసుకొని తమ నాటకమును రచించిరి. అందు చిత్రాంగి రాజరాజ నరేంద్రుని చిన్న భార్యగా నిరూపింపబడినది. కాని చేమకూర కవి యిట్లు చిత్రింపలేదు. చిత్రాంగి రాజనరేంద్రుని యుంపుడు కత్తియగానే యితడు వర్ణించి యున్నాడు. ప్రారంభముననే యిట్లు
వర్ణించినాడు.
క. కలరా యిల రాయనికిం
గుల సతి రత్నాంగి; భోగకుటిల శిరోజా
తిలకము చిత్రాంగియు; నన
నెల జవ్వను లిరువు రంబుజేందు నిభాస్యల్.
ఈ “భోగ కుటిల శిరోజా తిలక” మను చిత్రాంగికిని “కులసతి” యగు
రత్నాంగికిని చాలా భేదమున్నదని “అంబుజేందు నిభాస్యల్” అను పదముననే
సూచించియున్నాడు. అంబుజమునకును, చంద్రునికిని (ఇందు) సరిపడదని కవులెన్నడో
నిర్ణయించి యుండిరి. సుబుద్ధి యను మంత్రి కుమారుడు సారంగధరునితో
చిత్రాంగివలనిభయము సూచించుచు “వార కాంతల కెందైన వావి కలదె?” అని
పలికెను. అంతయేల చిత్రాంగియే సారంగధరుడు తనను “తల్లీ” యని మాటిమాటికి
సంబోధించుట నోర్వక
శా. ఆ నీలాలక లేఁతనవ్వొలయ నిట్లన్
గ్రమ్మఱన్ నిన్ జగం
బౌనౌ మేలన నీవె తెల్పుకొన
నేలా నీ గుణంబుల్, సతీ
సూనుగ్రామణి వౌదు నీ హృదయ
మిచ్చోగంటి నే దేవతం
గానే నీ పిన తల్లిగాను,
విభు భోగ స్త్రీని భావింపగన్.
అని తెలుపుకొనినది. అంతటితో పోలేదు వీరి వాదము.
సారం - “నంగడమున కెల్ల సొడ్డు” అనిన
చిత్రాం- “కాదటు, నేనల చిన్నవాడ నేర్పడితి' అని పలికినది.
ఇక ప్రకృతమునకు గడంగెదను. సారంగధరుడు రత్నాంగి కుమారుడు. ఇతడు
బహు తపః ఫలితముగా రాజనరేంద్రునికిఁ గలిగెను. బాల్యముననే శాస్త్రములందు,
శస్తములందును మంచి పాండిత్యమును గడించెను. అంతియేకాదు, గుణములందు
క. మాడెత్తు మాట యెవ్యరి
నాడడు, సత్యంబు వీడనాడడు ఖలులం
గూడడు, పరకామినులం
జూడడు, సారంగధరుఁడు సుతమాత్రుండే;
ఈ సారంగధరుడు తిన్నగా యవ్వనుడయ్యెను. తండ్రి యీతనికి “మంజువాణి”
యను భూర్జుర దేశపుఁ గన్యను దెచ్చి పెండ్లి చేసెను. ఈ వివాహమును గూర్చి,
మంజువాణిం గూర్చి మూడే పద్యములున్నవి. ఈ పద్యము లీ గ్రంథమందు లేకుండిన
మేలుగా నుండెడిది. ఏలన నీ మంజువాణి మఱల గ్రంథమందెచ్చటను గానుపింపదు.
సారంగధరుడు కాళ్ళు చేతుల కోతచే గాయపడినప్పుడు గాని తదనంతరముగాని
యీమె జాడయేలేదు. కవి పూర్తిగా నీమెను మఱచియే పోయెనో లేక చిత్రాంగిని
కథా నాయికనుగా జేయనెంచి నందున నీమెను మూలకుఁ ద్రోసి వేసెనో! ఎటులైనను
నీమెకథ నింతటితో వదలుదము.
రాజరాజు వేటకై దండకారణ్యమునకుఁ బోవునప్పుడు కాని, సారంగధరుని బాల్యమందుగాని యెచ్చటను తత్పూర్వము చిత్రాంగి ప్రస్తావనయే లేదు. సారంగధరుడు రాజు వేట కరిగిన యనంతరము ఉబుసుపోవక పావురాల పందెమునకై నగరు బయటకేతెంచి వినోదంబులందుండగా నతని పావురము చిత్రాంగి మేడపై వ్రాలెను. ఆ సందర్భముననే చిత్రాంగి యొక్క ప్రథమ దర్శనము పాఠకులకును గలుగుచున్నది. వ్రాలిన పిట్టను జేతబట్టి చిత్రాంగి....“ఇంక దీనిచే; గలుగు నిజంబుగా దనకుగాంక్షలు దీఱ సుఖంబు చెందఁగన్.” అని చింతింపఁదొడంగె.
చిత్రాంగి రాజుచే నెప్పుడు పరిగ్రహింపఁబడెనో, యాయమ యెప్పటినుండి సారంగధరునిపై మనసు గలిగియుండెనో యింతవరకు కవి తెలుపలేదు. కాని సారంగధరుడు పావురమునకై వచ్చినప్పుడతనితో చిత్రాంగి తన మనసులో రగులుచుండినట్టి ప్రేమను యిట్లు వెల్లడించెను.
ఉ. నీ సుగుణత్వమున్, జెలువు, నేర్పును,
నెచ్చెలు లెల్ల జెప్పగా
వీసరవోని మొహమున వీ
నుల విందుగ విందు నవ్యరే
ఖాసుమ కాండ! నేడు పొడగంటిని!
గన్నుల పండువయ్యె, నేఁ
జేసిన భాగ్యమెవ్వరును జేయర
యారె! ఫలించెఁ గోరికల్.
అంతియకాదు! ఆమెకా గామిని హల్లకబాణుని “దర్శన మాత్ర చేతనే” తొల్లి
మనంబులో గలుగు తుందుడు కెల్లను బాసె....”
క. “నను జూడరాడదేమో
యనినిను దూరుకొనుచుందు ననయము; నాపై
నెనరు గలందుకు గుఱుతిదె
కనిపించెను; మనము వేడుకలు కనఁగల్గెన్.”
అనియు సారంగధరునితోఁ జెప్పినది.
ఆంధ్ర ప్రబంధములందొకటి రెండు చోటులనే యిట్టి కథా సందర్భములు
చిత్రింపఁబడినవి. మనుచరిత్ర మందు ప్రవరుని వరూధిని ప్రేమించి, ప్రార్థించినను
ఫలము గానక పోవుటయు, సారంగధరలో చిత్రాంగి సారంగధరుని ప్రేమించి
విఫలమనోరథ యగుటయు నీ రెండు స్థలములందే యిట్టి ఘట్టములుండినట్లు
తోచుచున్నది. అచ్చటికన్న నిచ్చట విశేషము. అచ్చట వరూధిని నిరాశ పరవశురాలై
కృశించెను. ఇచ్చట చిత్రాంగి పగచాటెను. ఈయమ చమత్కారముగా తన మనస్సును
సారంగధరునికి బ్రకటింపజూచెను. కావుననే రవి శశిరశ్మికిన్ జొరగరాని
భయానకమైన” తన మేడలో.
ఉ. ఏఁకడఁ జూచినన్ రతులకేఁ
కటి దీరఁగ వ్రాసినట్టి కొ
క్కోక కళారహస్యములు
గోప్యములౌ చవుసీతి బంధముల్
నాకపురీ విలాస కలనా
గణికామణి కాముకాది నా
నాకృతులున్ విచిత్రగతు
లచ్చట నచ్చపలాక్షి చూపుచున్.
మనసు ఎఱుగకపోయెను. చిత్రాంగి మఱొక విధమాచరింపదొడఁగెను.
“ఓయి నెఱజాణ, తలకొన
జేయుము విరులివె జవాది చెయిబట్టుము
వాలాయమెద జేర్పు కలపము
కో.................... ” యని పలికెను.
ఇందు నర్మోక్తిగా తనను, “తలకొన జేయుము, చేయి బట్టుము, యెద జేర్చుము”
అనియు పలికెను. కాని సారంగధరుడు గ్రహించకపోయెను. చిత్రాంగి యింక
తాళలేదు. సముఖంబున నేటికి రాయబారముల్.”
మ. అని యూహించుచు లజ్జబో
విడిచి యేకాంతంబుగా నల్దెస
ల్గనుచున్ బైట తొలంగ, నీ
వివదలన్, గామాంధకారంబు నె
మ్మనమున్ గప్పిన, గన్నుగా
నకపుడా మత్తేభ గంభీర గా
మిని యత్యంత నిరంకుశో
ద్ధతిని బల్మిన్ బట్టగా జూచినన్.
ఇంతవఱకు వచ్చినప్పుడు సారంగధరుడు గడగడ వడకుచు “తల్లీ తడవాయెను
వచ్చి; పోయెదను నేను” అనెను.
ఇప్పుడు చిత్రాంగి బలవంతమునకు తోడుగా బతిమాలుకొనజొచ్చెను. కాని సారంగధరుడు తనకుఁ దెలిసిన నీతులన్నియు బోధింపఁ దొడఁగెను. ఎవరి పాట వారికే! చిత్రాంగి కివన్నియు బోధపడవు.
ఉ. ఎన్నడు నేర్చినాడవుర!
యీ మటు మాయపు మాటలీవు; నా
కిన్ని దలంప నేమిటికి?
నిప్పుడు దోసము పెద్దచేసి యా
దున్న వయాళి కాని గడు
దొడ్డగఁ జెప్పి: భయంబుసూపి చ
క్కన్నను దుద్దువెట్టి, యుఱు
కంగఁ దలంచెదు; మాను మీవగల్.
“మొనసి యూరకే రతిరంగమునకు రాని
సుద్దులివి యేల చాలింపు? సుగుణివౌదు!”
అని యనినది. అయితే సారంగధరునికీ నీతులు నచ్చిన నీమెయు దనకు దగిన
నీతులు నేర్చినట్టిది. శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు వీరందరు వ్యభిచారులు
కారా? యని ప్రశ్నించి.
“వారి కంటెను హెచ్చైన వాడవౌర!
నీకు గల బుద్ధి వారికి లేకపోయె
నీవు నాటికి లేకపోయితివిగాక;
చేరివారల యోజలు చెఱుపలేవె?
అక్కడికిని సారంగధరుడు ఱాయి వలె కరగకపోయెను “ఆడుది యుసురుమన్న
కొఱగాదు సుమీ” అని బెదిరింపమొదలిడెను. బుజ్జగింపులకు, ప్రార్థనలకు,
బలవంతమునకు లొంగని వాడిప్పుడీ బెదరింపులకు వెఱచునా? సారంగధరుని
వస్త్రము చేబట్టుకొని పెనుగులాడ, నతడు వస్త్ర నామె చేతనే వదలి వెడలిపోయెను.
“అంత చిత్రాంగి మదన బాణాగ్ని వేగి
హస్తగతమైన సొమ్ము పోనాడుకొన్న
కరణి బరితాపమొందిఁ యే సరణినైనఁ
జెఱతు సారంగధరునింక సిద్ధమనుచు”
రాజు రాకకై వేచి యుండును.
రాజు అరణ్యములో జిత్రాంగిని తలచికొని “అక్కటయేమి సేయుదు... చక్కని ముద్దుగుమ్మ! నా చక్కెర బొమ్మ! జూడ కిటు సైపగఁజాల వియోగ వేదనన్” అని విరహతాప మెందుచున్నాడు. “చక్కెర బొమ్మ!” ఇట్టి తియ్యటి మాటను ఆంధ్ర వాఙ్మయ మందెవ్వరును బ్రయోగింపలేదు! ఇట్లు చిత్రాంగీ లతాంగి దిదృక్షా సదృక్షాతి జాగరూక రూక్షాక్షుండై” విరహ వ్యధ నోర్వక వెంటనే యింటి కేతెంచి యామెను దుఃఖితగా నెఱిఁగి పరి పరివిధములఁ ప్రార్థించియుఁ బ్రత్యుత్తరముగానక యిట్లు వెఱ్ఱియై
ప్రలాపించెను.
శా. ఏమే! పల్కవు మోహనాంగి,
యిటు లేలే యల్క చిత్రాంగి ని
న్నే మంటిం గలకంఠి, నావలన
దప్పేమే యొయారీ, యయో
నా మీదన్ దయ లేదటే చెలి,
నను న్మన్నింపవే కోమలీ
నీ మాటల్ జవదాఁట కుందుఁ
గదనే నీరేజ పత్రేక్షణా.
ఇట్లు నమ్రుడైన పతిని మఱింతఁ బ్రేరేపించి తిన్నగా సారంగధరుఁడు బలిమిపై
గవిసెనని చిత్రాంగి వర్ణించి, వర్ణించి రాజు తలకెక్కునట్లుగా నిక్కువముగా నగపడు
నట్లుగా నిరూపించెను. అంతియగాదు తటాలున రాజుచేత ఖడ్గము నొఱనుండి
లాగి తన గొంతుకపైన బెట్టి యాత్మహత్య చేసుకొనఁబోవునట్లు నటించెను. రాజు
మాటలు విని, సారంగధరుని పట్టు పుట్టము చూచి, చిత్రాంగి యొక్క పరితాపమును
జూచి భరింపలేకపోయెను. కొడుకు మీది ప్రేమ యంతయు మఱచెను. నేరము
విచారించుటకు సభను బిలిపించెను. (నిరంకుశాధికారులవలె కాక యీ కామాంధుడు
యింతయైన చేయుట విశేషమే).
అంత సభ్యులును నుభయ పక్షముల విచారించి సారంగధరుని నేరస్థునిగా
నెంచి విజ్ఞానేశ్వరుమును జూచి కాళ్ళు సేతులు కోయుటయే దీనికిఁ దగిన శిక్షయని
విధించిరి. (రాజనరేంద్రుని కాలములో విజ్ఞానేశ్వరమే ముఖ్యమగు న్యాయ గ్రంథముగా
నుండెనేమో) రత్నాంగి యీ సంగతి విని చాలా శోకించెను. చిత్రాంగితోఁ గొంత
వాదులాడెను. రాజు కఠినుడై యేమాత్రమును క్షమింపడు. రత్నాంగి తన కొడుకు
నుండి యథార్థము తెలిసికొని కుమారుడు నిర్దోషుడైనను నిట్టి యాపదలకు లోనయ్యెనని
పరితాపము పొందెను. సారంగధరుడన్యాయముగా శిక్షితుఁడైనను కించిత్తు కూడ
రాజునుగాని, చిత్రాంగిని గానీ దూరడు. మీదు మిక్కిలి తల్లితో నిట్లు విన్నవించుకొనెను.
చ. అడలకువమ్మ నీవు, కలనైనను
రాజును దూరకమ్మయే
యెడల సపత్నితో జెలిమి
యించుక తప్పకు మమ్మ నాదు సం
గడిఁ జరియించు నాదు చెలి
కాండ్రను నావలె జూడవమ్మ యిం
పడరగ నన్నిక న్మఱవవమ్మ
విచారము మాని మానినీ.
సారంగధరుఁడు తాను కాళ్ళు సేతులు గోలుపోయి యత్యంతము బాధపడి
విలపించు నపుడైనను చిత్రాంగినిగాని, తండ్రినిగాని యొకతూరియైనను దూరడు.
చిత్రాంగి యిట్లు కాదు. ఆయమ్మ శీలమును సచివులు సంశయించి యదార్థము దెలుపుమని యడుగ.
“తొయ్యలి యూఁచక యాఁచక
పయ్యెద గొంగును బటాన బయలుగఁజేసెన్”
తుదకాకాశవాణి యడవిలో బల్కిన పల్కులను తలారులు రాజుతో విన్నవింప,
రాజామెను నిజము చెప్పుమని బెదరించి యడగ, నించుకయైననుఁ జలియించక
యా గట్టవాయి యిట్లని పలికె.
చ. తెలిసితి హా! యిదంతయును
దేవర పట్టపుదేవి కైతవం
బలసుతు పాడిఁదప్పినను
నాజ్ఞ యొనర్పగ లంచమిచ్చి వే
పిలిచి తలార్లచేత నని
పించిన దిట్టుల నీకు వాళ ము
ల్దెలియక వెఱ్ఱి రాజ! యిది
లెస్స నిజంబని నమ్మినాడవే!
చిత్రాంగి తుదకు నిందితయై గోతిలో త్రోయబడియె. సారంగధరుడొక సిద్ధుని
యౌషధ క్రియచే “గుణము” పొంది సర్వసంగ పరిత్యాగియైన సన్యాసి యయ్యెను.
ఇది చిత్రాంగీ సారంగధరుల మానసిక తత్త్వభేదము. మొదటినుండియు నొకరిది కేవల యాది భౌతిక బుద్ధిగను, మఱియొకరిది యాధ్యాత్మికముగను నిరూపింపబడినది. వీరి కథ చరిత్ర యందెచ్చటను లేదని స్పష్టముగా జెప్పవచ్చును. అట్టి తఱి యిది కేవలము చేమకూర వాని కల్పన తప్ప యింకొక్కరిది కాదు. ఇతఁడే యీ కథను మొదట వ్రాసినవాడు. ఎలకూచి బాలసరస్వతియు అప్పకవియు తర్వాత విన్నారు. మఱియు కూచిమంచి తిమ్మకవి పూర్తిగా మన చేమకూర వేంకట కవిని దన ద్విపద కావ్యములో ననుకరించియున్నాడు. బాణాల శంభుదాసు కూడ తర్వాతివాడు. తన ద్విపద సారంగధరలో
“భువిలోన సారంగ భూవరు చరిత
కవితా మహత్త్వంబుగల చేమకూర
అప్పన్న చెప్పిన యా ప్రకారమున
జెప్పితి బాణాల శంభుదాసుడను”
జెప్పి వాక్రుచ్చినాడు. చేమకూర వేంకటపతిని చేమకూర వేంకటప్పయని కూడ
పిలుచుచుండినట్లే చేమకూర అప్పన్న అను పదము నుండి వెల్లడియగును. ఆధునిక
కాలములో కీ.శే. ధర్మవరము కృష్ణమాచార్యులీ కథను విషాదాంతముతో ముగించుట
తప్ప తక్కిన యంశములలో - శైలిలో గూడ- నీ చేమకూర కవినే యనుకరించెను.
“ఈ వేంకటకవి శూద్రుఁడనియు తంజావూరి రఘునాథ నృపుని సభలో క్రీ.శ. 1630 సం.ల యప్పుడు విలసిల్లుచుండెననియు చరిత్ర శోధనల వలన నెఱుక పడుచున్నది”. అని వేంకటరాయశాస్త్రి గారు వ్రాసిరి. ఏ చరిత్ర శోధన వలన నీతడు శూద్రుఁడని వెల్లడియయ్యెనో తెలుపలేదు. వేంకట కవి యాశ్వాసాంతమందు తనను “లక్ష్మణామాత్య తనూభవ”యని సంబోధించుకొనినాడు. అమాత్య శబ్దముచే నీతడు నియోగిగా నుండనోపు అని అనుమానము.
ఈ కవి యాంధ్ర వాఙ్మయ క్షీణకాలములో నుండినవాడు. పౌరాణికుల కాలము దాటియుండెను. తర్జుమాలు తక్కువయ్యెను. మహాసామ్రాజ్యములంతరించి యుండెను. మహమ్మదీయ పరిపాలనము సంపూర్ణ వికాసమందుండెను. చిన్న చిన్న రాజులు విశేషముగా భోగైకలాలసులై యుండిరి. ప్రబంధములే విశేషముగా రచింపబడుచుండెను. అవియు శృంగార ప్రధానముగా నుండెను. వాని శైలి విశేషముగా శబ్దాలంకారములతో నుండెను. భావవిలసనము తక్కువ. శబ్దాడంబర మెక్కువ. అట్టి కాలమందు జీవించిన మనకవియు నాకాలపు సాంప్రదాయమువలలో గొంతవఱకు జిక్కియుండెను. శృంగారమును నితరులతోఁ బాటిగా నిందు ప్రధానముగా నుంచుకొని వ్రాసెను. కాని వారివలె పిచ్చిగా వ్రాయలేదు. “విజయవిలాస” మందుకొంచెము కళ్ళెమును జాఱవిడిచెను. గాని, “సారంగధర”లో మాత్రము నిగ్రహించి యుండెను. ఇందు పురవర్ణనయే లేదు. రాజనరేంద్రుడాంధ్రుడేనో కాదో? ఇతడు “మాళవపతి” అడవిలో చిత్రాంగిని దలఁచుకొని.
అక్కట నేమి సేయుదు ర
యంబున నిప్పుడె బోదు నంటినా
మిక్కిలి దూర దేశము, స
మీపమే? మాళవభూమి మండలం
బెక్కడ? దండకావనమి
దెక్కడ”
అని విలపించినాడు.
కావున నితని ముఖ్యపట్టణము రాజమహేంద్రవరము అని నిశ్చయింపలేము. కావున నీ కథ కేవలం కల్పితమగునేమో. సారంగధరలో నితర కవుల రీతి సంభోగ వర్ణన శ్రవణము నుండి పాఠకులను రక్షించినాడు. ఇందు నాయికా వర్ణన మితర కవులు చేసినట్లు తల మొదలుగ పద నఖ పర్యంతముగా వర్ణింపబడలేదు. చిత్రాంగి యొక్క వర్ణన రాజరాజు ప్రార్థించినప్పుడు, చిత్రాంగి సారంగధరుఁడు దన నిట్లిట్లు వర్ణించి గవిసెనని చెప్పునప్పుడును సందర్భానుసారముగ గనుపించును గాని నా వర్ణను బట్టి యీమె యిట్టిదైయుండి యుండునని భావింప శక్యము కాదు. అటుగాక సారంగధరుఁడు చక్కగా చిత్రింపబడియున్నాడు. ఇతడు మోహనా కౌలుడు, చక్కని ముక్కుగలవాడు, నగుమోము కలవాడు ఎగుభుజాలవాడు ఇంతియగాదు.
ఉ. తీరుగ మల్చివేసిన గతిన్ తొడలున్నవి; ఱొమ్ములోని వి
స్తారము చెప్పరాదు బలుదల్పు, నదల్పును బాలుగాఱు నౌ
రౌర, మొగమ్ము చక్కదన మన్ని యటుండనిమ్ము వీని యొ
య్యారమె లక్ష సేయు నహహాయనుచున్ దలయూచు సారెకున్,
ఇది చిత్రాంగికి దోచిన రూపము.
ఇక రత్నాంగికి వర్ణన బొత్తిగా లేనేలేదు. సారంగధరుని భార్య నొకే పద్యమున వర్ణించి కవియామెను బ్రక్కకుఁ ద్రోసి పుచ్చెను. ఇక రాజనరేంద్రుడెట్టివాడో, వృద్ధుడో, కాదో, యేజాడయుఁ దెలియదు. ఇక మన కవి శైలి యెట్టిదో కనుగొందము.' ఇతని శైలి మృదు మధురమై పటుత్వముతో గూడినట్టిది. పద్యముల నడక ధారాళముగా జదువుట కింపుగా నున్నది. కవియే దేశమువాడో మనకుఁదెలియదు. తంజావూరి వాఁడనుటకు వీలులేదు. ఒక్కొక్క మండలమున నొక విధముగ భాషయుండును. కవి యెట్టివాడైనను దన మండలములోని పదములఁదప్పక ప్రయోగించుట ప్రతివానికి సహజము. ఈ కవి వాడిన కొన్ని పదములు గమనింపందగినవి. తటకాపడి తట్టుకపడి - (గ్రామ్యము) కస్తి (కష్టము) యెదవడు (భయపడు) జుణుగు (నుసులు) కమతీలు (కమతగాండ్రు జీతగాండ్రు) కువాళము (కువ్వాడము గ్రామ్యము) బెదరించు (భయపెట్టు) ఎలుగుగొడ్లు (ఎలుగుబంట్లు) మున్నగు నీ పదములు విశేషముగా కర్నూలు, కడప మండలములలో నేటికిని సామాన్యంగా వాడుకలో నున్నవి. గావున నీ కవియు నీ మండలముల వాడై జీవనార్థము తంజావూరు రాజు నాశ్రయించి యుండి యుండునని యూహించు చున్నాను.
ఇక్కవి భావములు చాల సుందరమైనవి. సారంగధరలో గొన్ని యుపమానము లెవ్వరును బ్రయోగింపనట్టివై యున్నవి. రెండుదహరించెద.
“ఉమ్మెత్త పూవంటి యొఱపైన కుచ్చెళ్ల చెఱగు మట్టెలమీద చిందుదొక్క”
“మంగలంబునం బెటిలిన పేలగింజవలె మిక్కిలి పుత్ర వియోగ బాధ నట్టిటుపడి”
పావురము నాకసమున నెగురవైచి యది వియత్తలమందు విహరించుట నిట్లు వర్ణించి
యున్నాడు.
సౌధ కేతన పటాంచల వాతదూత ని
ర్గత గాంగ డిండీర ఖండమనగ
సితమౌని పూర్వాసిత భూపునద్ది దృ
క్షాగ తేంద్రాగ లతాంత మనగ
నవహార సంఘట్టనగ్రస్త పతయాళు
గగన లక్ష్మీమౌక్తికం బనంగ
మధ్యందినానంత మణిలూన మందేహ
సంత్యక్త బిరుదైక శంఖమనఁగ
గీ. పంకరుహ సంభవ కళత్ర పత్త్రపుత్ర
సురకుల ధురీణ కంఖాణ కరి కృపాణ
రమ్య ధావల్య జైత్ర పారావతంబు
రాఁ దొడఁగెఁ జుక్క దెగిపడ్డ క్రమముదోప
ఇది యీ కవి వతంసుని సంస్కృత భాషా ప్రవీణతయు జాటుచున్నది.
ఇక్కవికి శ్లేషలు యమకాలంకారములు, అను ప్రాసలు చాలా యిష్టముండినట్లు తోచుచున్నది. రమ్యముగా వర్ణించుచు వర్ణించుచు నేదైన నొక పదము నాధారము చేసికొని దాని ధ్వనియందే మగ్నుఁడై తప్పుడు దారిని బోఁదొడగును. శబ్దాలంకారము లితని కిష్టమని చూపుట కొక్క యుదాహరణమిచ్చెదను.
ఆ. ఔర! వీని మోహనాకార రేఖ వే
మాఱు మారు హరికుమారు మారు
వెలిదమ్మితొగల వీని కందోయి తీరు
రేపు మాపు బాపు రేపు మాపు
ఈ గ్రంథ మందు ముఖ్యముగా జూడఁదగిన వర్ణనలో - రాజనరేంద్రుని
సంతానచింత, సారంగధరుని బాల్యము, పావురములాట, చిత్రాంగీ రత్నాంగీ
సంవాదము మున్నగునవి.
ఈ చరిత్రమునకు నాయికా నాయకులగు చిత్రాంగీ సారంగధరుల గుణ శీలముల పోషణౌచిత్యము కొనియాడ దగినట్టిది. ముఖ్యముగా సాత్విక శక్తిచే, పవిత్ర జీవితముచే, సత్యనిష్టచే నెల్లర మనంబులు రంజిల్లునట్లుగా సారంగధర పాత్రమును
సృష్టించిన చేమకూర వేకంటకవి యొక్క కవిత్వ మహత్త్వము వే విధముల శ్లాఘ్యమైనది. అనర్ఘ రాఘవము
శ్రీ శేషాద్రి రమణ కవులు అనర్ఘ రాఘవమను తెనుగు ప్రబంధమును అష్టభాష గోపాలరాయల మేనల్లుడును ప్రాగటూరు దొరయు, సుమారు 200 ఏండ్ల నాడుండిన వాడునునగు తిమ్మారెడ్డి యను తిమ్మభూపాలుడు ఆంధ్రీకరించిన పద్య కావ్యమని వ్రాసినారు. మరియు నా గ్రంథమిటీవల కర్నూలులో నచ్చైనదని యొక మిత్రుడు నాకా ప్రతి జూపించెను. ఆ గ్రంథమందు గ్రంథ ముఖపత్రమే ముద్రించలేదు, ఇది సహేతుకమో యేమో కాని ప్రత్యాశ్వాసాంతమందు తిమ్మభూపాల ప్రణీతమని పెద్ద గద్యమును బ్రకటించినారు.
అట్టిచో నీ కవి నిజముగా నీ గ్రంథము రచించెనా? లేక వేరొక భాగస్వామి కలడా, ఆ భాగస్వామియే దీనిని పూర్తిగా రచించెనా? లేక యిద్దరును కలిసి రచించిరా? యను ప్రశ్నలు నాలో బయలుదేరెను. పాపమా భాగస్వామి యెంత నిష్కామ కర్మియేమో! తిమ్మారెడ్డి ఈ యనర్ఘ రాఘవమందేమి సాక్ష్యము స్వయముగా నిచ్చుచున్నాడో చూడుడు.
మ. కమనీయ స్థితి జెంగటన్ ధవళ శంఖస్పూర్తి రాణింప దీ
ప్తమరీచిన్ బవడంపు గెంపు బవలున్ బంజుల్ వెలుగొందని
స్సమ సారస్వత నిర్మలామృత ఝరీ జాగ్రత్త రంగాబ్ది పే
ర మహా సత్కవి తేజరిల్లె విబుధ ప్రస్తూయమానోద్ధతిన్
(యీ పద్యములో “జాగ్రత్తరంగాబ్ది” అనుటకు జాగ్రత్కవి రంగాబ్ధి అని
సరిపోవునని ముందు చూపెదను)
చ. అతనికి బౌత్రుడై యసదృశాఖిల విద్యల బ్రౌఢిగన్న యా
యతమతి కృష్ణ సత్కవి సహాయ కవిత్వమునన్ సమాజసం
తత భజనాదరుండనగు నాకు నశేష విశేష వైదుషీ
ప్రతిభకర స్థలామలక భాస్వరమై తనరారు టబ్రమే.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse