Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/గొల్లకొండయే గోలకొండ

వికీసోర్స్ నుండి

గొల్లకొండయే గోలకొండ

ఇది గోలకొండకు సంబంధించిన శాసనము. గోలకొండకు సమీపములో రోజా అను గ్రామములో ఉన్న ఒక గొల్లవద్ద అతని పూర్వికుల కిచ్చిన సనదుకలదు. ఆ సనదు పార్సీలోను తెనుగులోను ఉన్నది. రెండును ఒకే సమయములో గోలకొండ బాదుషాచేత వ్రాయించి యియ్యబడినవి. భాషను ఉన్నదున్నట్లుగా ఉంచినాము. ఈ సనదులోని కొన్ని విశేషాలను మరొకమారు విశదపరుతుము. ఇది గోలకొండ చరిత్రకు చాలా అనుకూలించునని నా అభిప్రాయము.

ఖిలే మానుగల్‌ ఉర్ఫెగోలుకొండ మహమ్మదునగరు సూబేపరు కుంద బున్యాదుపర్గణే హవేలి బాగానరం మసూఉవుదరే దనుగరు కొండయ్య సాకీన్‌ గోలకొండ రేపల్లెవాడ వలదు కొండ్య, బినుకొండయ్య, ఇబ్బను కొండయ్య పరుమానియ బజానానే కారుకూనాసె వకానుగొయాసె వదేశ మఖానే వదేశ పాండ్యానే వపటేలియాసెవ, కులకర్ణియాసె వరాయాసె, సుల్తాన్‌ అబ్దుల్లా బాదుషాకు తుపుషాగారు. 1086 సంవత్సరములు క్రిందట ఖిల్లా కట్టుటకు ప్రయత్నం చేస్తే కుదరనందున బాదుషాతనము రుషతైన సయ్యదు షాముస్తఫా సాహెబు కాదరీ సాకీన్‌ ఔరంగాబాదు హాలు మొకాం గుల్బర్గాగారితో బాదుషాచేసే బయాన్‌ ఏమనగా మా పెద్దలైన పెద్ద మూలకు కుతుబుషా బాదుషాగారు 964 సం॥రముల క్రిందట (భాగానగరము) దాబానగరము అనుపేరు పెట్టి ఖిల్లా కట్టడమునకు ప్రయత్నము చేస్తే కుదురలేదు. సీసకమ్మగుట్టల మీద కిలా కట్టడమునకు పులుగంపోస్తే అది కుదురలేదు. ఈ ఖిల్లా కుదురలేదు. ఇప్పుడు మనము పులుగంపోసినా కుదురలేదని ఆలోచనచేస్తే ఆ మరుషతు బాదుషాతో చేసిన బయాన్‌ ఏమనగా (1) వరంగల్‌ ప్రతాపరుద్ర మహారాజుగారికి దనుగరు కొండయ్య చాలా కరామతును చూయించి బోనగిరి ఖిల్లా కూడా వరంగల్‌ ఖిల్లా కూడా ఈ దనుగురు కొండయ్య పరంపర తయారుచేయించినట్లుగ మన దగ్గర కొండయ్య - సనదులు వున్నవి కదా! అందును గురించి అదే పరంపర ఆంఖిల్లా గోత్రం సూర్యవంశగురు బసవేశ్వరుని శిష్యుడైన ఈ కొండయ్యను పిలిపించి నేను విచారింతునని చెప్పి కొండయ్యను నాగజర్రి రేపల్లె వాడనుంచి పిలిపించుకొని వందనాది క్రియలచే పూజించి మేము ఖిల్లా కట్టటమునకు పులుగంపోసి ప్రయత్నం చేస్తే కుదురలేదు. ఎందునిమిత్తార్థం? పూర్వము మీ పరంపర వారు భోనగిరి ఖిల్లా వరంగల్‌ ఖిల్లా కట్టివున్నారు మీరు అదే సంతతి కాబట్టి ఇదీ కూడా మీవల్లనే కావలెను గాని ఇఘ ఎవరినుంచి కాదని అడిగి చాలా మనవి చేసినందున కొండయ్య సమ్మతించి అక్కడ వీరు అడుగక మునుపే తాను చేసియుంచిన యావత్తు కరామతు బయానుచేసి దౌలతు చూయించి సాదుగోకుల్‌దాసుభావిలో బంగారి పుతులీ అయివున్న రామతు చెప్పి ఆ స్థళ మహత్తు అంత చూపించి ఇదే కొండయ్య పేరు తోటి 1087 సం॥రములకు సరి అయిన ఖరనామ సంవత్సర భాద్రపద శు॥ 5 శుక్రవారము 13 పదమూడు ఘడియల రాత్రికి పులగం పోసినాడు తర్వాత ఖిల్లా యావత్తు తయారు చేయించినాడు. ఈ కొండయ్య చూపించిన దౌలతు తోటి ఖిల్లా తయ్యారు అయివున్నది. ఖిల్లా తయ్యారు అయిన పిమ్మట సుల్తాను అబ్దుల్లా కుతుబుసాగారు బాదుషా తమ మురుషదుతో బయాన్‌ చేసినది ఏమనగా (2) ఈ దనుగురు కొండయ్య దేవ కల్యాణమునుండి వచ్చి మన స్థళమందు రేపల్లెవాడ కట్టుక నాగజిత్ర తోడుకొని మర్రిమాత యల్లమ్మను నిలబెట్టుకొని మల్లన్న మఠము కట్టుకొని యాదవ పీఠము సమేతముగా ఇంత మహత్తు జరుపుతూ వున్నాడు, మనకు తెలియలేదు, మనము పిలిపించి విచారించితే బహుకరామతు చూపించి బావిలో బంగారు పుతిలీని దౌలతు చూపించినాడు. వీరు లక్ష్మీప్రసన్నులు కనుక మన కోరికలు ఈడేర్చి మనల కృతార్థులు చేసినాడు. వీరితోనే మన గద్దినిలిచియున్నది. కనుక ఈ కొండయ్యకు ఏమి కావలెనో ఏమి అడుగుతాడో విచారించమని చెప్పిన సయ్యదుషా ముస్తఫా మురుషదు కాదరీగారు కొండయ్యతో చేసిన మారుజా ఏమనగా! (3, ఏ - కొండయ్య బాదుషాగారు ఏమి కావలెనో ఏమి అడుగుతాడో మిమ్ముల విచారించమని అన్నాడు కనుక మీరు పెద్దలు కనుక నీకు ఏమి కోరిక వుంటే ఆ కోరిక అడుగమని విచారించగా మరుషతుతో కొండయ్య చేసె మారుజా ఇదికదా! పన్నెండు గొల్ల కులాలకు రెండు కురుమ కులాలకు నేను గురువును యాదవ పీఠానికి అధికారివలె మానుగలుగు ఎప్పటికి గోలకొండ అనే పేరువుంచేది. గొల్లకొండ అని అనవలసినది. మా పరంపర రాబడిన 1465 సంవత్సరముల నుండి జరుగుకుంటు వచ్చిన వరంగల్‌ ప్రతాపరుద్ర మహారాజు ఇచ్చిన సనదు చూచుక అదే మతాబకు మొహరు దస్తకతుతో మాకు సనదు ఇచ్చేది. ఇదికాక గొల్లవాండ్లకు కురుమవాండ్లకు కూనిచేయకూడదు. అగరు కూని చేసినట్టు ఆవుతె గద్దికి హతకు వస్తాది. అదే తక్షణం లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇదిగాక కిలాలోపట యున్న యల్లమ్మ ఒకటికిలా బయటయున్న మల్లన్న మఠము, ఇవి యావత్తు వున్నంత దూరము దోషావరు జమీను ఇవి మావిగా వుండె అట్టి హుకుం ఇవ్వవలసినది. ఆదిగాక ప్రతాపరుద్ర మహారాజు ఇచ్చిన 1465 బిరుదావళి మర్తబా కితాబు ఏమనగా మా యాదవ పీఠము వెంట యాదవులున్ను యెలిగొలచి మహమ్మదీయులున్ను స్వామి కార్య దురంధరులున్ను దేవబ్రాహ్మన భయభక్తి పరులున్న పదునూట సహోదర రాజులున్న బిరుదు అంబారి చెంద్రా యుధము మకర తోరణాలు పగటి దివిటీలు నెమిలి పించాలు భుజకీర్తులు, కిరీటము, భూచక్రగొడుగు, అష్తాగిరి పాలీక నగుబోతు, నగారాధముకా నిషానీ, హనుమంతు నిషాని, ఏనుగుమీద ఢముకా ఒంటెమీద ఢముకా రణభేరి సింహమూతి కడియాలు మకర కుండనాలు సింహతలాట అంబారి మహిమా రుతబా గరుడ పడిగెలున్న హనుమంత చక్రములున్న అల్లా పద్మములున్నూ శంఖాలున్నూ వీరణమ్ములున్నూ శ్రీరామ కొణితలున్నూ సమస్థ రాగాలున్నూ బసువ చెక్రపు గొడుగులున్నూ చుట్టు వీటెలున్నూ జంగపు గొడుగులున్నూ శ్రీరామ కాని యాదవ పీఠము నిర్ణయంబైన తారీకు 5002 అక్షయ సంవత్సర సృష్ట్యాది శతాబ్దం 1955 మరియు 5002 రాజాధిరాజ ప్రతాపరుద్ర మహారాజు యాభై యారు రాజ్యములకు ఇచ్చిన సనదు ముతాబికు మరిమాత రేపల్లెవాడ మసీదువ మల్లన్న మఠం దీనిక్రింద పూదుగుల్‌వ చిరాగువ, మరమ్మతు హమేషా దుచావరుజమాను సఫీలు బయటము, గూమవరము, మర్లగడ్డ మక్తా 305 బిగాలు రామస్వామి గుట్టవద్ది మక్తా 325 బిగాలు తోకపుట్టి చరాయపట్టి, వజాతర్లు మల్లన్న జాతర్లు వబీర్ప జాతరు వగొల్లల కురుమల దగ్గర రుసూంసాలు బసాలు రుసూం జారీచేసినందున సనదుము తాబికువ కొండయ్య అరజుముతాబికు సర్కారు పర్మానుముతాబికు జరుపవలసినది. ఈ సనదు యందున్న దానిలో సర్కారికి ఏమి హక్కు లేదు. ఈ కార్యం సరుహర్‌ మాకు సర్కారు సదామద్దతు ఇచ్చి హమేశా ఊదుగుల్‌ చిరాఖు మమ్మత్తు చేయించవలసినది. పుత్ర పౌత్ర పారంపర్యాయం హరిచంద్ర హరుకంగ వారి ఆలు ఆవులాదు సూర్యచంద్రులు ఉన్నంత పర్యంతము ఏ బాదుషా గద్దె ఏలినా సుఖంగా రాజ్యములో జరిపించవలసినది. సమస్త రాగాలున్నూ శ్రీరామ కాలనులున్నూ పడిగనాదములున్నూ యడమ కుడి శంఖములున్నూ ఏకముఖరుద్రాక్షయున్నూ శంఖుచామరాలున్నూ బసువశంఖు బిరుదులున్నూ సంగడి తోరణాలున్నూ ఛాయ ఛాయ గొల్లెండ్లూన్నూ నవవన్నె గొల్లెండ్లూన్నూ బల్లానదట్టీలున్నూ పట్టుదట్టీలున్నూ పట్టు హారాలున్నూ గంటల వడ్యాలమున్నూ తరుట వీరణంబులున్నూ అశ్వము మొగ గుర్రములున్నూ వివమము.... మరుమలతోటి ద్వాదేశమున్నూ భారత భాగవతము... యావత్తు బిరుదావళి ప్రతాపరుద్రుడు ఇచ్చిన ముతాబికు మీరు హకుం ఇచ్చి దౌరా మీద రవాణా చేస్తూ వుండవలసినది. గోలకొండ గద్ది ఏ బాదుషా ఏలినప్పటికైన మా సిలసిలా వాండ్లతో ఆశీర్వచనములు సాలు సాలుకు తీసుకొను చుండవలెను. ఏ బాదుషా అయిన తప్పినట్టు అయితే గద్దికి హతకు రాగలదు, తురకలేగాని, తెలుగలేకాని, సాలుసాలుకు ఆశీర్వచనములు తీసుకుంటూ పుత్ర పౌత్రాభివృద్ధిగా హరిచంద్రార్కముగా సూర్యచంద్రాదులు వున్నంత పర్యంతరము సుఖముగా రాజ్యమేలుచుండవలసినది. బాదుషా గొడుగు తిరిగిన పరియంతరము మా పరంపర వాండ్లను సురుబరాయి చేసి దౌరామీద హరియేకు పరుగణాకు రవాణా చేసేది. ఏ గ్రామమే కాని ఏ సర్కారే గాని ఎక్కీసు సర్కారు అనగా ఇరవై ఒకటి సర్కారు ముమాలకె సర్కారి ఆలి మాసిలసిలా వారికి హమేషా మద్దతు ఇచ్చుకుంటూ వుండవలసిసది. అట్లు మద్దతు వుండనట్టు అవుతె మా సంతతి వాండ్లు ఏమన్నప్పటికైనా హతకు కాగలదు. మా సంతతి వాండ్లు కన్నీరు నించితే ఇచ్చటినుంచి లక్ష్మి కన్నీరు నించుకొని వెళ్ళిపోవును. గద్ది పరరాజుల పాలుగాగలదు ఇదిగాక మా యాదవ కులములో ఒకచోరి మొకద్దుమాకు మినహ తతిమ్మ మొకద్దుమా ఏదైనా మేము విచారణ చేసి పైసలా చేసుకోగలము కాని సర్కారువారు విచారించుటమునకు బిల్‌కూలు అక్కరలేదు. ఇదిగాక ఈ గోలకొండ గద్దికింద ఎన్ని రాజ్యములుంటే అన్ని రాజ్యములలో యున్న మల్లన్న జాతరాలు, బీరప్ప జాతర, మల్లన్న మ్యాళ్లాలు, బీరప్ప మ్యాళ్ల్యాలు, చౌడమ్మ మ్యాళ్ల్యాలు, తెల్లచెరల మ్యాళ్లాలు, కొమ్మోణి మ్యాళ్లాలు, తగరజోగోని మ్యాళము కుల్లు యాభైయారు రాజ్యాలలో వుండె పన్నెండు గొల్లకులాలు రెండు కురుమ కులాలు సాలుసాలుకు మాకు రుసుం కట్టె అట్టు మీరుసనదు మొహరుదస్కతుచేసి ఇవ్వమని కొండయ్య విచారించి సయ్యదు షా ముస్తపా సాహెబు కాదరీగారు సమ్మతించి ఈ కొండయ్య చేసిన యావత్తు మారూజాను సుల్తాను అబ్దుల్లా బాదుషాకు చెప్పితే వారు సమ్మతించి ముందు ప్రతాపరుద్రుడు ఇవ్వబడిన సనదు యాభై ఆరు రాజ్యములకు వుండె కనుక తమచే సూబెదకన్‌కు సుల్తాను అబుదుల్లాబాదు బాదుషా ఇచ్చే హుకుం మాచే సూబేదక్కన్‌ వాండ్లు వుండె కుల్లు యావత్తు మఠాలలో వసూలు చేసుకొనేది. పన్నెండు గొల్లకులాలు రెండు కురుమ కులాలదగ్గర ఇల్లు వకటికి ఒక్క రూపాయి భత్యంమ్యాకలువున్న వాండ్లతావున ఒక్క మ్యాకభత్యం తీసుకునేది. గొర్లు వున్న వాండ్ల తన ఒక్క గొర్రె భత్యం తీసుకొనవలసినది. మొగ్గాలు వున్న వాండ్ల వద్ద ఒక్క రూపాయి భత్యం తీసుకొనేది. చీర్ల వాండ్ల మేళమువద్ద అయిదురూపాయల భత్యం తీసుకునేది. మల్లన్న మఠాలలో మల్లన్న మ్యాళ్ళాల్లలో మఠం వక్కింటికి మ్యాళ్ళం వాళ్ళ వద్ద అయిదు రూపాయల భత్యం తీసుకోవలసినది. మందుచ్చోని మ్యాశ్యం వద్ద అయిదు రూపాయలు తీసుకునేది. కొమ్మువాండ్ల మ్యాళ్యం వద్ద అయిదురూపాయల భత్యం తీసుకొనేది. దక్షిణ కాశి కొలను ప్యాకలో కాటకోటయ్యను వుంచి మఠములో అయిదు రూపాయలు భత్యం తీసుకొనేది. సిద్దేశ్వర సిద్దయ్యను వుంచిన మఠములో అయిదు రూపాయల భత్యం తీసుకొనేది. ఈ రెండు దక్షిణ కాశి కొలను ప్యాకలో గొల్లకురుమ వాండ్ల మఠాలు చౌడమ్మ మ్యాళ్ళం వాండ్ల వద్ద అయిదు రూపాయల భత్యం తీసుకోవలసినది. కుల్లు యాభై ఆరు రాజ్యములలో వుండె జాతరుల హక్కు రుసుం సదరు యాదవ పీఠానికి రుసుం కట్టవలెను. మా ఇక్తి దారిప్రకారం శిక్షించి భూదాన గోదాన సమేతముగా తీసుకొనేది. ఇందుకు సర్కారు వారు మద్దతు ఇచ్చి దౌరామీదా హాజరువుండి వసూలుచేసి ఇవ్వవలసినది. ఇది సుల్తాను అబ్దుల్లా బాదుషా కుతుబుషా సమ్మతమున వ్రాసి ఇచ్చిన మొహరు దస్తకతు సనదు, పర్మాను. ప్రతాపరుద్ర మహారాజుగారు ఇచ్చిన సనదుమీద దస్కతులు చేసిన పీఠముల తపిసీల పేర్లు :

పీఠములు

1. శృంగేరి పీఠము, 2. పుష్పగిరి పీఠము, 3. విరూపాక్ష పీఠము, 4. కనకమ్మ పీఠము, 5. మాధవాచార్యుల పీఠము, 6. విపోదివారి పీఠము, 7. కనుపర్తి వారి పీఠము, 8. వీరభోజన పీఠము, 9. రామానుజ పీఠము, 10. అయ్యాళం పీఠము, 11. ఈరమాతిగరాయుని పీఠము, సాకిన్‌ హస్తినాపురము.

పన్నెండు గొల్ల కులాలు

1. యెర్రగొల్ల, 2. ముష్టిగొల్ల, 3. కరిణిగొల్ల, 4. పాకనాటిగొల్ల, 5. పూజగొల్ల, 6. మొదటీట గొల్ల, 7. నల్లసదనపు గొల్ల, 8. గుజరాతి గొల్ల, 9. గంపగొల్ల, 10. పెయ్యగొల్ల, 11. వెయ్యగొల్ల, 12. సిద్ద గొల్ల.

కురుమ కులాలు

1. పత్తి కంకణము, 2. ఉన్ని కంకణము

ఇట్లు, విధేయుడు యాదవ దాసుడు దస్తూరి సింగభూపాల్‌రావు సారాచెర్లగారు, అని వున్నది.

9-1-41 నాటి గోలకొండ పత్రికలో గొల్లకొండయే గోలకొండ అయ్యెనని నిరూపించు సనదును ప్రకటించి యుంటిని. అందలి విశేషాలను తెలుపుటకు ముందు ఆ సనదులోని కొన్ని పదాలకర్థములు వ్రాయుదును. హైద్రాబాదు రాష్ట్రములో ఉర్దూ తెలిసిన తెనుగువారి కందలి చాలా పదాలర్థమగును. ఉర్దు తెలియని వారికొరకు కొన్ని పదాల అర్ధమును వ్రాయుదును.

ఈ సనదు ఇప్పుడు ముద్దము మల్లయ్య అను గొల్లవద్ద ఉన్నది. పూర్వము ఈ మల్లయ్య ఇంటిపేరు కొండవాళ్ళు అనియుండెను. అనగా కొండయ్య ఇంటివారు అని యర్థము. ఇతని గోత్రము పేరు అంకిళ్ళ గోత్రము. దీనినే సనదులో ఆంఖిల్లా గోత్రము అని వ్రాసినారు. ఇతని నివాసస్థలము గోలకొండ ఖిల్లాకు అరకోసు దూరములో ఉన్న “దర్గ” అను గ్రామము. ఇతని పూర్వీకుడే సనదు పొందిన కొండయ్య. అతనిని దనుగరు కొండయ్య అన్నారు. దనగరు అనగా గొల్ల (దధికార తద్భవము) బిను లేక బిన్‌ లేక ఇబ్బను లేక ఇబన్‌ అను పదాలు అరబీపదాలు, కుమారుడు అని అర్థమిచ్చునవి.

ఇక సనదులోని పదాల వివరణమును తెలుపుదును. గోలకొండకు పూర్వము పేరు మానుగల్‌ కోట అని యుండెననీ మొట్టమొదటి వాక్యమే స్పష్టము చేయుచున్నది. ఈ పేరు చరిత్రకారు లెవ్వరు పేర్కొనలేదు. ఈ సనదులోనే మనకు మొదటి పర్యాయము కనబడుచున్నది. భాగా నగరము లేక భాగ్య నగరము ఇప్పటి హైదరాబాదే. రేపల్లె వాడ గోలకొండ కోట ప్రక్క భాగముననే పడమటి దిక్కున ఉన్నది. ఇప్పుడది పాడుపడినది. ఈ సనదులో చూపించబడిన మల్లన్న మఠము, మసీదు, మర్రిమాత నాగఝురి ఈ రేపల్లె వాడలో ఉన్నవి. సనదులో 1086 సంవత్సరము క్రిందట అనిన్ని 964 సంవత్సరాల క్రిందట అనిన్ని వ్రాసినారు, అనగా అవి హిజ్రీ తేదీలు, 1086 హిజ్రీలోను, 964 హిజ్రీలోను అవి జరిగెనన అర్ధము. ఫార్సి సనదులో సీసకమ్మల గుట్టవద్ద కోట కట్టుటకు 1027 హిజ్రీలో ప్రారంభించిరి అని వ్రాసినారు.

సీసకమ్మ గుట్టలు గోలకొండకు ఉత్తర దిశలో ఇప్పటి హకీంపేట అను గ్రామము వద్ద ఉన్నవి. వాటిపైన గూడ కోట కట్టదలచిరి. కాని అచ్చట అది కుదరలేదు. ఔరంగజేబు గోలకొండను ముట్టడించినపుడు ఈ సీసకమ్మల గుట్ట వద్దనే డేరాలు వేసి విడిది చేసెను.

ఈ సనదును ఇచ్చినవాడు సుల్తాన్‌ అబ్దుల్లా కుతుబుషా. ఇతని గురువునే మరుషతు అని పేర్కొన్నారు. పెద్ద మూలకు కుతుబుషాగారు అనగా ఇబ్రహీం పూర్వికుడగు 964 హిజ్రీలో గల గోలకొండ రాజ్యమును పాలించిన కుతుబుషా యని అర్థము. అతని కాలములో గోలకొండ కోట కట్టబడెను. అది బాగా కుదరలేదు. దానినింకను దృఢపరుపదలచిరి, అందులకీ కొండయ్య సహాయపడినాడు.

“పులగం పోయుట” అనగా కోటలకు పునాది వేసినప్పుడు అన్నమును మేకలను బలిగా యిత్తురు దానినే పులగం పోయుట అని యందురు.

నాగఝురి

ఇది గోలకొండకు పశ్చిమ దిశన నుండు గుట్టలలో ఉన్నది కోటకు అర్థమైలులోనే ఉంది. ఇది నాగఝురి. సుమారు 50 అడుగుల ఎత్తు రెండు గట్లున్నవి. వాటి సమీపములో భూమిలో 3 అడుగుల లోతున గుంత కలదు. అందు సదా ఊట వచ్చుచుండును. ఎండాకాలములో కూడా ఒకే విధముగా నీరు వచ్చుచుండును. ఇప్పటికిని ఆ గట్లలో పశువుల మేపుకొని పశువులకు ఈ నాగఝురి వద్దనే నీరు త్రాపుతారు.

సాధుగోకుల్‌ దాసు బావి

ఇది గోలకొండ కోటలోనే కలదు. దీని కథ రమ్యముగా ఉన్నది ముందు విమర్శలో వ్రాయుదును.

బంగారు పుతులీ

బంగారు బొమ్మ ఈ బొమ్మ కథపై గోకుల్‌ దాసుతో సంబంధించినది.

మర్రిమాత ఎల్లమ్మ

ఇది నాగఝురి వద్దనే 100 అడుగుల దూరాన కలదు. ఒక పెద్ద గుండునకు పట్టెలు వేసి దానిని పూజింతురు. దాని నిప్పటికిని అచ్చటి హిందువులు పూజింతురు. ఏటేట ఉత్సవము చేయుదురు. మానుగల్లును గోలకొండ అని పిలువవలెనని ఇందు కొండయ్య కోరెను. అదే అపభ్రంశమై గోలకొండ అయినది. గొల్లవాండ్లలో 12 శాఖలును వారికన్న కొంచెము తక్కువగా చూడబడు కురుమవారితో 2 శాఖలును కలవు. వాటి పేరులు ఈ సనదులో కలవు. ఇప్పటికిని ఈ శాఖలు కలవు.

ఎల్లమ్మ :

ఈ దేవత ఖిల్లా లోపల కలదని ఈ సనదులో కలదు. ఇప్పటికిని కలదు. కట్టకడపటి భాగమగు బాలాహిసారును ఎక్కు ఆవరణము ప్రక్కన ఉన్నది. ఈ ఎల్లమ్మ గుడివద్దనే ఒక ఫిరంగి కలదు. ఇప్పటికిని గోలకొండలోని హిందువులు ఈ ఎల్లమ్మకు ఏటేట కొలుపులు చేయుదురు.

మల్లన్న మఠము

నాగఝురికి పోవు మార్గములో దానికి ఫర్లాంగు దూరములో ఒక చిన్న ప్రాత మసీదుకలదు. దానికి సమీపములో ఒక చిన్న సమాధి కలదు. దానిపై మూడు అడుగుల చౌకము 6 అడుగుల ఎత్తును పైన చిన్న గుంబదువంటి కలదియును శిథిలావస్థలోను నున్న గది కలదు. అదే మల్లన్న మఠము. దానినిప్పుడు గుర్తు పట్టువారు లేకున్నారు. దానిని గుర్తుపట్టుటకు పరిశోధన చేయవలసి వచ్చెను.

దోషావరు జమీను

జమీను అనగా భూమి దోషావరు, లేక దోచావరు అనునది ఒక కొలత రెండు గొర్తల వైశాల్యము కలదిగా ఉండెను. ఇది పార్శీ పదముగా కనిపించుచున్నది. అందున ఇప్పుడు మిలిటిరీకిగాను బునాదులు తీసి బంగ్లాలు కట్టుచున్నారు. ఆ భాగమంతయు దోషావరు జమీనే - అది కొండయ్య కిచ్చిన ఇనాము భూమి. దాని వారసుడు యీ సనదుకల మల్లన్నయే. యితని అజ్ఞానముచేత దారిద్ర్యముచేత ఈ జమీను సర్కారుకు చెందిపోయి నదనుకొనవలెను.

సనదుపొందిన కొండయ్య ఎఱ్ఱ గొలకాదు, వెఱ్ఱిగొల్ల, అతడంతటి సహాయకారియుండిన అబ్దుల్లా ఖుతుబుషా అంతటివాడు ప్రసన్నుడై ఉండిన ఆ పాదుషా వద్ద ఒక సంస్థానమును కోరి యుండరాదా? దానికి బదులుగా తిక్క బిరుదులు, గొర్రెలు, రూపాయలు, కట్నములు కోరుకున్నాడు ఆ బిరుదుల పట్టిక యిందు కలదు.

ఆష్తాగిరి

పార్శీలో ఆఫ్తాబ్‌గీరి అనగా ఎండను ఆపు ఛత్రి.

పాలీక : పల్లకి

నగుబోతు : నౌబత్‌ - నగారా జాతి దముకా - ధంకా

అల్లా పద్మములు : ఇస్లాం మత చిహ్నముగా అల్లా పదములు చేసుకొని కొలుచుట గొల్లలలో కొందరికి వాడుకగా ఉండినట్లున్నది.

రామకొణితలు : కొణితలనగా సొమ్ములు. శ్రీరామ విగ్రహానికి పెట్టిన సొమ్ములు. ఇప్పుడవి జనగామ తాలూకాలో కొమరవెల్లి గ్రామములోని శ్రీరాముని విగ్రహముపై ఉన్నవందురు.

సింహమూతికడియాలు : మణికట్లకు పెట్టుకొను సింహమూతిగల బంగారు కడియాలు. గరుడ పడిగెలు : పట్టుదారాలతో అల్లిన పట్టీ - నాల్గువ్రేళ్ల వెడల్పుదిగి ఉండును. దానిని నడుమున బిగింతురు. శివమువచ్చువారే దీనిని కట్టుకొందురు.

శ్రీరామకొని : శ్రీరాములవారి కాలమునుండి మొదలుకొని అని అర్ధము.

వూదుగుల్‌ చిరాగు : వూదు అనగా అగరు ధూపము. గుల్‌ అనగా పూలు, చిరాగు అనగా దీపము.

బీరప్ప జాతర : బీరప్ప లేక వీరప్ప అను దేవత. గొల్లలకు ముఖ్యదేవత. ఆ దేవత కొలువులో సుమారు 4 అడుగుల యెత్తుగల పెద్ద డోలును వాయింతురు - ఇప్పటికి దానిని వీరప్పడోలు అని యందురు.

హరిచంద్రహరుకం : ఆ చంద్రతారార్కం అనుమాట

ఆలు అవులాదు : అరబ్బీ పదమే - పుత్ర పౌత్రపరంపర అని అర్ధము.

రామకొలనులు : అగ్ని గుండము ముందు మల్లన్న మఠముపెట్టి ఒళ్ళు నిండినవారు అగ్ని గుండములో దుముకుదురు - ఆ గుండమునే రామకొలను అని యందురు.

గంటల వడ్యాలము : చిరుగంటలుకల వడ్డాణము, నడుము పట్టి.

గొర్లు వున్న వాండ్ల తన : తన అనగా తావున వద్ద అని అర్థము.

అశ్వము మొగము గుర్రము : అశ్వము మగ గుర్రము అని చదువుకొనవలెను - మగ గుర్రమని యెందుకన్నారనగా గొల్లవారు పెంటిగుర్రాన్ని యిప్పటికిన్ని ఎక్కరు - పెంటి గుర్రమెక్కితే వారికి కులం తప్పు - అయితే వారికి వివాహాలలో గుర్రముపై మెరిమెన చేయు హక్కులేదు.

మ్యాళ్ళము : మేళము - భజంత్రీతోటి ఉత్సవము.

సాదుగోకుల్‌ దాసు బావి : కొండయ్య బాను చేసియుంచిన యావత్తు కరామతు బమాను చేసి దౌలతు చూయించి సాధు గోకుల్‌దాసు బావిలో బంగారి పుతిలీ అయి ఉన్న కరామతు చెప్పి ఆ స్థల మహత్తు అంతా చూపించెనని సనదులో కలదు. దీని కథ ఏమనగా!

గోలకొండ కోట కట్టిన కాలములో తత్పరిసర ప్రాంతాలలోని చిన్న చిన్న గట్లలో సాధుగోకుల్‌ దాసు అనువాడు నివాసము చేసియుండెను. అదే ప్రాంతాలలో కొండయ్య మేకలమేపుతూ గోకుల్‌దాసునకు దినమున్నూ మేకలపాలనిచ్చుచూ వచ్చెను. కొంతకాలమిట్లు ఉభయులకు మైత్రి కుదిరినది. ఒకనాడు సాధువు ఒక పెద్ద ఇనుపకాగు పెట్టి, దానిలో నూనెపోసి సలసల కాచుచూ ఉండినాడు. కొండయ్య చెంబులో పాలు తెచ్చి సాధువుకిచ్చినాడు. సాధువు వాటిని త్రాగి “అరే కొండయ్య నీకు ప్రత్యుపకారం చేయవలెనని బుద్ధి పుట్టింది. ఇట్లురా, ఈ కాగు చుట్టును ప్రదక్షిణము మూడు మారులు చెయ్యి” అన్నాడు. అమాయకుడగు కొండయ్య అట్లే చేసినాడు. మూడవ ప్రదక్షణం చేయుచుండగా సాధువు కొండయ్యను అమాంతముగా ఎత్తి కాగులో వేయబోయినాడు. కాని కొండయ్య సాధువుకంటే బలాడ్యుడగుటచేత పట్టు తప్పించుకొని ప్రక్కకు దుమికినాడు ఇదేనా నీ ప్రత్యుపకారం అని మహత్తరమైన కోపంతో సాధువునే తటాలున ఎత్తి కాగులో పారవేసినాడు. అంతలోనే ఆశ్చర్యమగు పరిణామము సంభవించెను. సాధువు మాయమయ్యెను. అతని స్థానములో ఆ కాగుచున్న నూనెలో ఒక పెద్ద బంగారు విగ్రహము కనబడెను. కొండయ్య భయపడి ఆ విగ్రహాన్ని సమీపమందు గల ఒక భావిలో పారవేసిపోయెను. ఆ బావినే ఇప్పటికిని గోకుల్‌దాసు బావి అని యందురు. ఆ విగ్రహమునే తర్వాత కొండయ్య ఇబ్రహీం కుతుబుషాకిచ్చెను. ఆ విగ్రహములోని విశేషమేమనగా దినము ఒక అంగముగ చేధించితే మరునాటి వరకు మరల ఆ యంగము యథాప్రకారముగ పెరుగుచుండెనట. అట్టి అక్షయ విగ్రహము నుండి వచ్చిన బంగారుతో కోట కట్టించబడెనట. ఇది బంగారు (పుతిలీ) బొమ్మ కరామతు (మహత్తు) యొక్క కథ.

ఈ కథ నిజమో కాదో మనము చెప్పజాలము. ఇట్టి కథయే కొండవీటి కైఫియత్తులో కలదు. దాని నిందు ఉదాహరించుచున్నాను.

“అనిపోతయ వేమారెడ్డిగారు ప్రభుత్వమునకు వచ్చిన సమయమందు ఒక గొల్లవాడు మేకలు గాసే నిమిత్తము బొల్లమూరు వేంకటేశ్వరస్వామి వారు వున్న కొండకు పోయి మేకల మేపుతూ వుండి వుండగా ఒక సిద్ధపురుషుడు కామ్యార్థియై వేంకటేశ్వర ఆలయంవద్ద తపస్సు చేసుకుంటూ వుండగా యీ గొల్లవాడు ఆయన యోగక్షేమము అడిగినాడు “నాకు నిత్యమూన్నూ క్షీరములు ఇవ్వవలెను” అని సాధువు అడిగినాడు. సన్యాసి ఒకనాడు గొల్లవాన్ని చూచి నీవు నిత్యమున్నూ ఎక్కడెక్కడవుంటే చెట్ల ఆకులు, మేకలు మేపుతుంటావు గదా, ఏ వృక్షాన్ని అయినా మేకలు మేయగానే తిరిగి వెంటనే ఆకు పుట్టునట్టు దృశ్యమైతే నాకు చెప్పమన్నాడు. ఆ గొల్లవాడు కొన్ని దినములు శోధన చేయగా దృష్టమైనందున సన్నాసికి చెప్పగా ఒక దినశుద్ధి చూచి ఆ చెట్టును తగుల బెట్టించి వృక్షము దగ్ధమయ్యే సమయములో గోపకుని చెయ్యిబట్టి ప్రదక్షణచేస్తూ వానిని యేమరించి మంటలో పడదొయ్య బోతే వాడు పుష్టి కలిగినవాడు కనుక గొల్లలోబడక బహు దినాల నుంచి నా మేక పాలు తాగి నాకు ఉపకారం చేస్తానని నమ్మించి నన్ను అగ్నిలో వేసి చంపజూచినావా అని సన్యాసిని బట్టి జ్వాలలోపడదోసి తన ఇంటికి వచ్చి మరునాడు తిరిగి మేకలు తోలుకొని ఆ స్థలానికి వెళ్ళి చూచేవరకు బంగారు ప్రతిమయై మనుష్య ప్రమాణపు, విగ్రహముగా నిలిచియున్నందున గొల్లవాడు పూర్వ వైషమ్యముచేత తన గొడ్డలి తీసుకొని ఆ విగ్రహము యొక్క హస్తమును చేధించేవరకు యథా ప్రకారం హస్తమావిర్భవించె. వాడు ఆశ్చర్యపడి వాడు బంగారం తీసుకొని సెట్టికిచ్చి తనకు కావలసిన పొగాకు తమలపాకులు యీ వరస ప్రవర్తిస్తుండగా ఆ కోమటి ధనికుడైనందున, ఈ సంగతి చారుల వల్ల అనపోతయరెడ్డిగారు విని వైశ్యుని పిలిపించి దండించి అడిగి నంతలో వున్న స్థితి మనవి చేసెను. గొల్లవాని ద్వార సువర్ణ ప్రతిమను తీసుకొని దానిద్వారా రాజ్యవిస్తీర్ణము చేసెను. తదనంతరము కొమరగిరి వేమారెడ్డి ప్రభుత్వమునకు వచ్చి ధర్మకర్తనుడయ్యెను. ఈ దినములో వరుస చెడి సువర్ణ విగ్రహమున్ను మాయం అయినది”

మరి ఈ కొండవీటి “కరామతు”లో ఎంత సత్యమున్నదో, కొండవీటి కరామతు కైఫీయతు ప్రమాణము. “ఘోకుల్‌దాసు పుతిలీ”కి ఈ గోలకొండ నసదే ప్రమాణం. అటైతే యీ సనదు కూడా అబద్ధపు సనదుగా ఉండవచ్చును. ఇదియు కల్పన యేమో అను సంశయములు కలుగపోవు.

సనదుయొక్క ప్రామాణ్యత

ఈ సనదు పుట్టినది నిజమైనదిగా కనబడుచున్నది. ఏలనన తెనుగులో సనదును మొదలు వ్రాయించి తర్వాత దానినే ఫార్సీలో వ్రాయించినారు. అయితే ఈ రెండును కల్పనలుగా ఉండగూడదా యనిన తర్వాతి కాలంలో సనదులో కనబరచిన హక్కులు కొండయ్య వంశమువారికి వర్తించుచు వచ్చినట్టు దాఖలాలు నేటి వరకు కలవు. పైగా ఆసఫ్‌జాహి వంశపు నిజామైన నిజాముద్దౌలా సనదు ఒకటి కొండయ్య వంశము వారి వద్ద కలదు. అది 1249 హిజ్రిలో ఇయ్యబడినట్టిది. అనగా సరిగా 111 ఏండ్ల క్రిందటిది : అప్పుడు మహారాజ చందూలాల్‌ మంత్రిగా ఉండెను. ఆ సనదులో ఇట్లు వ్రాసినారు.

“గోలకొండ ఖిల్లావద్ద దోషావర్‌ జమీనున్న కోటలోని యెల్లమ్మయున్నూ, కోటబయటి రేపల్లెవాడలోని మర్రిమాత నాగఝురి మల్లన్న మఠము” యాదవ పీఠము యొక్క అధికారమును పూర్వము ప్రభువులు అనగా ఖుతుబుషామీలు దన్గర్‌ కిష్టయ్య పూర్వికులకు ఇచ్చినారు. కనుక మొత్తం రాష్ట్రములో జాతరులు, సంతలు మున్నగునవి జరిగినప్పుడు దన్గర్‌ కిష్టయ్యకు 12 గొల్లకులాలపైనను యాజమాన్యము కలదనియు, కిష్టయ్య పోయిన తావునందెల్లను సర్కారి అధికారులు అతనికి అతని హక్కులను వసూలు చేసుకొనుటలో సాయపడవలెను. పైగా గోమారం మర్లగూడెంలో 300 భోగాల మక్తాయున్నూ రామస్వామి గుట్టవద్ద 325 భోగా భూమియున్నూ అతనిదే అయియున్నది.”

పైనదేకాక వీరివద్ద మరియొక సనదు కలదు. అదికూడ 1071 హిజ్రీలో అబ్దుల్లా ఖుతుబ్‌షాచేత కొండయ్య పేర ఇయ్యబడినది. అందులోను కొండయ్య కిచ్చిన హక్కులు పాలింపబడునని వివరింపబడియున్నది.

ఇంకొక సనదు కూడా ఈ వంశము వారి వద్ద కలదు. అది ముఖ్తారుల్‌ మల్కుసర్‌ సలారుజంగు మొహరుతో 1273 హీజ్రీలో ఇయ్యబడినది అందలి ముఖ్య విశేషాలేమనగా సనదు కొండ బాలయ్యపేరట ఇయ్యబడినది (ఇతడు కొండయ్య వంశమువాడు) “పూర్వసుల్తానులనగా సుల్తాను అబ్దుల్లా ఖుతుబుషా యొక్కయు నిజామలీఖాన్‌ యొక్కయు సనదును బట్టియు రాజాచందూలాలు యొక్క ఫహిమాయిషును బట్టియు ఈ బాలయ్య కరేలీ, అయినూరు, మేలారం, అయ్యారం, మలీగావూ, ఖండబా మున్నగు స్థలాలలో జరుగు జాతరలలో ఏయే హక్కులు వీరికి కలవో అవన్నియు అనుభవించుటకు అధికారము కలిగియున్నాడు.

దీనివలన తెలియునదేమనగా! అబ్దుల్లా ఖుతుబ్‌షా ఇచ్చిన సనదు నవాబు నిజామలీఖానున్నూ, చందులాల్‌ మంత్రియున్నూ, సర్‌ సాలార్‌ జంగు మంత్రియున్నూ నమ్మినారు. సత్యమని నిర్ణయించినారు. తామున్నూ సనదుల నిచ్చినారు. ఇతర సనదులలో కొన్ని గ్రామాల పేరులు కలవు. అందు గోమవరం అనునది మెదకు తాలూకాలో ఉన్నది. మర్లగడ్డ అనునది గోమవరంలోని పొలము పేరు. రామస్వామి గట్టు అనునది గోమవరం వద్ద నుండు గట్టు. అచ్చట రామస్వామి దేవాలయం కలదు. కొమరవెల్లి గ్రామము జనగామ తాలూకాలో ఉన్న ఐనూరు, మేలారం, అయారం మాలెగాం వద్దనున్నవి.

మరికొన్ని పదాలు

కొండయ్య సనదులో 'తగరుజోగోడు' అను పదము కలదు. తగరుజోగు వారు అనునదొక జాతిపేరు. డమరువంటి ఢక్కిని వాయించు ఈ జాతివారు బిచ్చమెత్తుతుదురు.

కాట కోటయ్య : 12 గొల్ల, 2 కురువ మఠాలకు పెద్ద అయిన బలిజ కీ పేరు.

మందుబ్బోడు : బిచ్చముతో బ్రతుకుజాతి. వీరు మంటిచేతను, పేడచేతను, చేసిన 200 వరకు సంఖ్యగల బొమ్మలను ఒక పెద్ద పెట్టెలో పెట్టుకొని వత్తురు. వీరు గొల్లల వద్దనే వారి కులగోత్రాలు చెప్పుకొనుచు బిచ్చమెత్తుదురు.

సనదు ఇచ్చిన అబ్దుల్లా ఖుతుబుషా అబుల్‌ హసన్‌ తానీషా కన్నముందు వాడు. అతడు క్రీ.శ. 1626 నుండి 1672 వరకు గోలకొండ రాజ్యమును పాలించెను. ఈ కొండయ్య సనదు పుట్టిన కాలం 1071 హిజ్రీకి అనగా 289 ఏండ్లక్రిందట, ఈ లెక్క చొప్పున ఈ సనదు క్రీ.శ. 1652 లో ఇయ్యబడినది.

ఇవి యీ కొండయ్య సనదులోని విశేషాలు.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse