Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/గుర్రము

వికీసోర్స్ నుండి

గుర్రము

తెనుగుకవులు కొందరు సామ్రాణితేజీ లేక సాంబ్రాణితేజి అని గుర్రానికి పర్యాయపదముగా వాడినారు. ఇది శ్రీనాథుని కాలమునుండి మన సారస్వతములో కానవస్తున్నది. అంతకుపూర్వపు కవుల రచనలలో లేనట్లు నాకు జ్ఞాపకం. తిక్కన ఎక్కడా ఈ పదాన్ని వాడినటుల నాకు తెలియదు. క్రీ.శ. 1450 ప్రాంతము వాడగు గౌరన “రవణించి దాటు సాంబ్రాణితేజీలు” అని గ్రంథాదిలోనే వర్ణించినాడు. ఈ సామ్రాణి పదమెక్కడిది? ఇదియు ఈరాన్‌, తుర్కీ, గుజ్జరి (గుజరాత్‌) సింధు వంటి అశ్వోత్పత్తి స్థానమైయుండునని యూహించినాను. ఈరాన్‌, (పర్షియా) దేశము గుర్రాలకు చాలా ప్రసిద్ధి కలదై యుండెనని తెలుపనయినది. ఆ దేశమందే “సమరాన్‌” అనునొక ప్రదేశము కలదు. అది యిరాన్‌లోని దగుటచే విజయనగర సామ్రాజ్య కాలములో ఆ సమరానునుండి విశేషముగా గుర్రములు దిగుమతియై యుండును. సమరాన్‌ సంబంధ హయములగుటచే వాటికి సామ్రాణీలను పేరు వచ్చెను. సామ్రాణీతేజీలు అనుటచే తేజీ పదమును గూడ తెలుసుకోవలెను. తేజ్‌గా వేగముగా పోవునవి తేజీలై యుండుననవచ్చును. “తాజీ” అనుపదము అరబీలో కలదు. ఉత్తమాశ్వమును అరబీలో తాజీ గుర్రమందురు. సాదీ గుల్‌స్తాన్‌ చదివినవారికి “అస్పెతాజీ గర్‌జయీఫ్‌ బువద్‌” అనే పద్యము స్ఫురణకు రాగలదు. “అస్పెతాజీ” అన అశ్వోత్తమము అని యర్థము, కావున తాజీ పదము మనలో తేజీ యయ్యెనేమో!

నా వద్ద “ఫరస్‌నామా” అను అముద్రిత లిఖిత ఫార్సీ ప్రాచీన గ్రంథమున్నది. దాని పీఠికలో ఇట్లు వ్రాసినారు. “సుల్తానుమహమూదు గజనీకాలానికే సంస్కృతాశ్వ శాస్త్రము ప్రసిద్ధి నొందినది. హుమాయూన్‌ చిత్తోడును ధ్వంసించి నప్పుడందు కొన్ని పెట్టెల పుస్తకాలు “మాలెగనీమత్‌” లూటీగా దొరికెను. అందు సంస్కృతాశ్వశాస్త్ర మొకటియుండెను. అది చాలా యుత్తమ గ్రంథము. దానినే యిప్పుడు షాజహాను చక్రవర్తి కొరకు భాషాంతరీకరిస్తున్నాను”. ఈ పార్సీ గ్రంథానికి పీఠిక చాలా విపులముగా కలదు. అందు గుర్రము జంతుజాతిలో ఉత్తమమనియు, “గాజీ"లకు గుర్రమే ఉత్తమ వాహనమనియు, రాజులకు గుర్రాలే జయమునిచ్చుననియు, అవి లేని రాజు నాశనమగుననియు, గుర్రాలు కచ్మి (గుజరాతువద్ద) దేశమందును, అరబ్‌, ఈరాక్‌, తుర్కీ దేశాలలోను లభించుననియు, ఇంకా చాలా చాలా విషయాలు వ్రాసినాడు. ముసల్మానులు గుర్రము యొక్క ప్రాముఖ్యమును బాగా యెరిగినందుననే హిందువులను జయింప గలిగిరను నాభావమా గ్రంథము చూచిన తర్వాత స్థిరపడినది. ఈ గ్రంథాన్ని పూర్తిగా తెనుగులో తర్జుమా చేసి మంచి పీఠికతో ప్రచురించిన చాలా యోగ్యముగా నుండును. ఆ విధముగా చేయించు దాతలు దొరకుదురా? ఈ గ్రంథాన్ని గురించి ప్రత్యేక వ్యాసమవసరమగును. కాని సూచించి విడిచినాను.

ఆంధ్ర మహాభారతములోని ఆదిపర్వాష్టమాశ్వాసములో “చిత్రలలిత గతి నొప్పు నేనూరుగాడిదలను, సింధుబాహ్లిక కాంభోజ, పారసీక జాతమైన తురగ శతసహస్రము” అన్నారు. సంస్కృత మూలములో ఒక బాహ్లికమే కలదు. తక్కిన పదాలన్నీ నన్నయ సృష్టియే. వారి కాలములోని గుర్రాల దిగుమతులను వారు సూచించినారనుకోవచ్చు. ఈ యుదాహృతపంక్తి బహువిశిష్టత కలది. భారతమును సంస్కరించిన పెద్దలు తాళ్ళపాక వారి కవిత్వం కొంత, నాపైత్యం కొంత అన్నట్లు తమకిష్టము వచ్చినట్లు దిద్ది అపచారము చేసినారు. ఈ యుదాహృత పంక్తిలో గాడిదలు అన్న పదము అంటరానిదగుట చేత అర్జునుని పెండ్లిలో గాడిదలను కానుకలిచ్చినట్లుగా చెప్పితే తప్పగునని గాడిదలను “గాడీలు”గా మార్చి అచ్చువేసిరి. సంస్కృత మూలములో గాడిదలకు “అశ్వతరి” కంచరగాడిద అను పదం వాడిరి. అది మన సనాతన భారత సంస్కర్తలకు కొద్దిగా మేలు రకమగు మాట కదా! “ఏనూరు” అను పదమును గూడ గమనించండి. నూరు అనే మాట మోటని ఉత్తర సర్కారీ సోదరులు తెచ్చిపెట్టిన “వంద” అనే ప్రాచీనులు వాడని మాటను పలువురు మంచి పదమనుకొని అదేపనిగా వాడుతారు. నాకు తెలిసినంతవరకు మహాభారతములో ఎచ్చటనూ “వంద” అను పదము వాడలేదు. ఇతర ప్రాచీన కవులును వాడినట్లు కానరాదు. ఇంత వ్రాసినను గుర్రము అనే పదమెట్లేర్పడెనో తెలిసినది కాదు. అశ్వశాలకు తబేలాకు పేరులు యిట్టివి కలవు.

“సాహిణమన, బాగాయన, వాహాగారంబునకును వర్తిలుపేళ్ళై” గుర్రపు సాలెలలకు (సాహిణములకు) అధికారి సాహిణి. పూర్వము కొందరు రెడ్డి ముఖ్యులు సాహిణులై యుండిరి. ఆంధ్రులలో రెడ్లు, తర్వాత విజయనగర రాజులు గుర్రాల సైన్యమును దిట్టముగా నిలిపినట్టివారు.

“జక్కి, మావు, గుర్రము, తేజి, యెక్కిరింత తత్తడి, రవాలు, నడగడు, కత్తలాని తురికి, బాబా యనగనొప్పు తురగమునకు” అని సాంబ నిఘంటులో తెలిపినారు.

ఇందు జక్కియను పదమును గూర్చి విచారింతము. జక్కి మోర వేలుపు అనగా గుర్రపు మూతి వేలుపు. అనగా కిన్నరుడు. గుర్రము మూతివారు ప్రపంచ సృష్టిలో లేరు. అయితే గుర్రాలెక్కువగా నుండు దేశము వారని యర్థము చేసుకోవచ్చును. జక్కులను యక్షులనియు అందురు. జక్కులు (యక్షులు) కిన్నరులు వేరే కాని ఉభయులును ఈరాను కుత్తర ప్రాంతాల వారనుకొందును. పూర్వము అక్షస్‌ నదికి జక్కార్టీస్‌ అనియు పేరుండెను. జక్సాశబ్దమునకు కూడా యక్ష శబ్ద సామీప్యము కలదు. యక్షులు ఆ ప్రాంతీయులై యుందురు. గుర్రాలున్నూ ఆ ప్రాంతమందే హెచ్చు. అందుచే జక్కిశబ్దమేర్చడి యుండును.

గుర్రాలను గురించి ఇంగ్లీషులో చాలా గ్రంథాలు వ్రాసినారు. గుర్రపు జాతులు, వాటి పెంపకము, వాటి శిక్షణము, వాటి నడకలు, మున్నగు వాటిని గురించి పటములతో సహా బహుగ్రంథాలు వ్రాసి ప్రకటించినారు. గుర్రాల రోగాలను గురించి వాటి చికిత్సలను గూర్చియు చాలా వ్రాసినారు. కాని మనలో అట్టి గ్రంథాలు కానరావు. తెనుగులో రెండు అశ్వశాస్త్రాలను పద్యకావ్యాలుగా వ్రాసినారు. మనవారు చరిత్రలనే వాటిని శకునాలను గణితములను, సాముద్రికమును, జ్యోతిషమును, శిల్పమును, వైద్యమును, రత్న పరీక్షలను - అన్నింటిని - పద్యాలలో వ్రాసినటులే అశ్వశాస్త్రాన్ని కూడా పద్యాలలో వ్రాసినారు. ఈ రెంటిలో ఒకటి మనుమంచిబట్టు అనునతనిచే ఇంచుమించు 400 ఏండ్ల క్రిందట వ్రాయబడినది. అదియునసమగ్రమైనది. కర్నూలు జిల్లా వాడు దాన్ని రచించెను. వీటిలో గుర్రము సుళ్ళు, లక్షణాలు విశేషముగా వర్ణింపబడినవి. వాటివలన కలిగే లాభము కానరాదు. గుర్రాలకు రోగాలు వస్తే నాటు వైద్యులు తమకు తోచిన మందిత్తురు. పూర్వము తెనుగుదేశములో గుర్రాలపై సరుకులు మోపి రవాణా చేస్తూ వుండిరి.

పాశ్చాత్య యూరోపు దేశములోను, అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను గుర్రాలతో సేద్యము చేయుదురు. ఉత్తర అమెరికాలోని ఉత్తర భాగాన ప్రసిద్ధియైన గుర్రాలు కలవు. పశుల కాపరులు వాటిపై గంతలు కూడా వేయక కళ్ళెము మాత్రమే తగిలించి సవారి చేయుదురు. అవి చాలా పెద్ద గుర్రాలు. పైగా అడవి గుర్రాలవలె సాధనకు రాక వెనుక రెండు కాళ్ళపై నేటుగా ముందరి కాళ్ళెత్తి నిలబడుటయో లేక నాలుగు కాళ్ళెత్తి పైకెగురుటయో, నేలపై పొరలుటయో, ఎన్నెన్నియో, దుడుకులు చేసి సవారికి లొంగనివై యుండినను ఆ కాపరులు వాటి వీపులపై ఉడుములవలె కరుచుకొని యుండి వాటిని సాధించి సవారీ చేయుదురు. ఆ కాపరులను ఇంగ్లీషులో కౌబాయిస్‌ అందురు. ఆస్ట్రేలియా ఖండములోని గుర్రాలు సామాన్యమైనవి కావు. అవి చాలాపెద్దవి. బలిష్ఠమైనవి, చాలా వెల గలవి. ఇంగ్లీషువారును, ఫ్రెంచి జర్మనులును, రష్యావారును తమ యుద్ధావసరాలకై గుర్రాలపై కోట్ల కొలది ధనమును వ్యయము చేస్తూ వుందురు. విమానములు, మోటారులు, ట్యాంకులు వచ్చినను గుర్రాల ప్రాముఖ్యము తగ్గలేదు.

గుర్రముల యుద్ధ ప్రాముఖ్యమును గురించి ఫిర్దౌసీ షాహ్నమాలో చాలా వర్ణనలు కలవు. జగత్ప్రసిద్ధి గాంచిన రుస్తుం మహావీరుని గుర్రము పేరు 'రఖ్‌. ఆ గుర్రము పెద్దపులులతో కలబడి వాటిని చంపెడిదని షాహ్నములో వర్ణించినారు. ఫిర్దౌసీ కాలములో ముసల్మానుల విజృంభణము ముల్లోకములలో అనగా ఏషియా, యూరోపు, ఆఫ్రికా ఖండములలో విస్తరించుతూ వుండెను. వారి ధాటి పెద్ద తుఫాను వంటిది. వారి జయము పరాజితులకు భూకంపము వంటిది. వారి మత సంస్కృతి ఇతర సంస్కృతులనెల్లను తుడిచివేస్తూ వేలాతిక్రమణముతో ప్రవహించెను. అట్టి కాలానికి వీరులగాథ అవసరమై యుండెను. ఆ యవసరములో ఫిర్దౌసీ పైకి వచ్చెను. షాహ్నమా రచించెను. రాజులు దానిని పురాణముగా పఠింపజేసిరి. సాధారణులు ఖహ్వాఖానాలలో (చా కాఫీ క్షబ్బుల వంటి వాటిలో) పాడించి వింటూ వుండిరి. ఆ కథలలో ఘోటీధాటీ వర్ణన పరిపాటి విశేషముగా నుండెడిది. అట్టి వాతావరణమందు పెరిగి, అట్టి వీరావేశము నెక్కించుకొని, అట్టి రుస్తుం, ఆదర్శాలతో గుర్రాలపై మన దేశమందు ముసల్మానులు విజయాలు పొందిరంటే దానికింత వెనుకరంగము (Back- ground) ఉన్నదన్నమాట.

భారతీయ చారిత్రక రంగమున "నభూతో నభవిష్యతి” అనిపించుకొన్న అసాధారణ మహాపురుషుడగు చాణక్యుడు (కౌటిల్యుడు - కుటల దేశస్థుడు) తన అర్థశాస్త్రమందు అశ్వాధ్యక్ష ప్రకరణమందు సూత్రపద్ధతిలో అనేక విషయాలను సూక్ష్మముగా తెలిపియున్నాడు. అభిలాషులా ప్రకరణాన్ని చదువుకొనవలసిందే. అయినను దాని నుండి కొన్ని విశేషాలను మాత్రమిందుదాహరింతును.

“అశ్వాధ్యక్షుడు గుర్రాల తరములను ఏర్పాటు చేయవలెను. 1. ప్రణ్యాగారిక ములు (అమ్మదగినవి) 2. క్రయోపాగతములు (కొనబడినట్టివి) 3. ఆహవలబ్ధములు (యుద్ధములో పట్టుకొనబడినవి) 4. ఆజాతములు (దేశమందు పుట్టినవి) 5. సాహాయ్య కాగతములు (ఇతర మండలాల నుండి యుద్ధాద్యవసర సహాయానికై తీసుకొని రాబడినవి) 6. పణస్థితములు (గిరవుగా నుంచబడినవి) 7. యావత్కాలికములు (తాత్కాలికముగా లాయములలో నుంచబడినవి).

ఉత్తమాశ్వముల ముఖముల పొడవు 32 అంగుళాలు, గుర్రము పొడవు - ముఖమంత అయిదంతలుండవలెను.

ఉత్తమాశ్వములకు ఈ క్రింది విధముగా తిండిపెట్టవలెను. 2 ద్రోణాల దాణ బియ్యము కాని, గోధుమలు కాని, ప్రియంగువుకాని, ముద్గమాషము లుడికించి కానిపెట్టవలెను.

ఒక ప్రస్థము నూనె, 5 పలముల ఉప్పు, 50 పలముల మాంసము, 1 ఆఢకము రసము, 2 ఆఢకముల పెరుగు, 5 ఫలముల క్షారము (రుచికిగాను) 1 ప్రస్థము లేక రెండు ప్రస్థముల పాలు ఇయ్యవలెను మరియు 1 ప్రస్థము నూనెతో అనుపానము (ఎనిమా) చేయవలెను. 1 కుడుంబము నూనెను ముక్కుపై రుద్ధవలెను. 100 పలముల నట్టుగడ్డిని, 2000 పలముల తృణముసు మేత పెట్టవలెను.

“కాంభోజ, సింధు, ఆరట్టవనాయు, దేశజములగునవి ఉత్తమాశ్వములు. బాహ్లిక, పాపేయ, సౌవీర, తైతల దేశజములు మధ్యజాతివి. తక్కినవన్నియు ఆవరములు (సాధారణములు). “గుర్రాలను యుద్ధాలకే శిక్షణము చేయవలెను. వల్గన, నీచైర్గత, లంఘన, ధోరణ (Gallop) నారోష్ట్ర (Response to signals) ఇవి గుర్రపు నడకలు. ఒక్కొక్క నడకలో ఔపవేణుక వర్ధమానక, యమక, ఆలీఢప్లుతాది బహువిధముల రీతులు కలవు.

అశ్వ చికిత్సకులు ప్రత్యేకముగా గుర్రాలను విచారించుకొంటూ వుండవలెను. “గుర్రాలకీ క్రింది నౌకరులు అవసరమైయున్నారు.

1. సూత్ర గ్రాహకుడు - గుర్రాలను పట్టుకొని నడిపించుకొని పోవువారు సైసులు.

2. యావసికుడు - యవసము (గడ్డి) తెచ్చి మేత పెట్టువాడు

3. విధాపాచకుడు - గుగ్గిళ్ళు ఉడికించి పెట్టువాడు.

4. స్థానపాలకుడు - గుర్రపుశాలెల కావలిగాయువాడు.

5. కేశకారుడు - గుర్రాల వెంట్రుకలు కత్తిరించువాడు.

6. అవ్వబంధకుడు - గుర్రాల కట్టివేయువాడు.

7. జాంగలికుడు - విష చికిత్సలు చేయువాడు.

ఉత్తమ మధ్యమాశ్వాలు లభించు దేశాలను గురించి యిదివరకే తెలిపినాను. అయినను ఇందు కొన్ని కొత్త పదాలున్నవి. వాటిని గురించి తెలుసుకొందము. అరట్ట - ఆరట్ట - దేవము పంజాబులోని మండలము. ఆ రాష్ట్రకశబ్దభవము. మహాభారత యుద్ధ కాలములో అందలి జనులు దోపిడికాండ్రని ప్రసిద్ధిగాంచిరి. సౌవీరము గుజరాతు దేశములోనిది. పాపేయ, తైతల, దేశాలెచ్చటివో నాకు తెలియదు. ప్రాచీన భారతీయ భౌగోళిక నిఘంటులను వ్రాసినవారును వాటిని పేర్కొనలేదు. కావున ఈ రెండును భారతేతర ప్రాంతాలై యుండును. తైతల అనునది తార్తరీదేశ మనుకొందును. పాంపేయ అయి యుండునా? చాణక్యుని కాలానికే అది రూపుమాసెను. దాని ప్రసిద్ధి విని అతడుదాహరించియుండునా? లేక పంపా (తుంగభద్రా) తీరభూములే పాంపేయమయి యుండునా? వింధ్యకు దక్షిణమున మంచి గుర్రాలుండినట్లు కానరాదు. నేటికిని అదే లోపమును కానవస్తున్నది.

తక్కిన దేశాలను గూర్చి యిదివరకే చర్చించినాను. చాణక్యుని అశ్వాధ్యక్ష ప్రకరణములో తెలుసుకోదగిన విషయాలు చాలా కలవు. అర్థశాస్త్రమందలి యుద్ధరంగ ప్రకరణములో (పుస్తకము 10వ ప్రకరణము 4. గుర్రముల వినియోగమును గూర్చి యిట్లు తెలిపినారు”. యుద్ధ రంగస్థలమును, విడిదిని, అడవులను శోధించుట, ప్రధాన స్థలములాక్రమించుట, అనగా నీటిపట్లు, ఘాటులు మున్నగునవి పట్టుకొనుట, వెనుక వచ్చు సేనకు రక్షణ యిచ్చుట, సైనిక వ్యవస్థను సరిచూచుట, సైనిక కక్షలను రక్షించుట, శత్రువులపై మొదటిధాటి సాగించుట, శత్రు సైన్యమును చెదరగొట్టుట, కోశమును, రాజపురుషులను రక్షించుట, శత్రువుల వెనుకభాగముపై బడుట, తరుముట, వెన్నంటుట, వ్యూహరచన, ఇత్యాదులు ఆశ్విక దళములు చేయవలసిన కార్యములు”.

ఈ వ్యాసమందు సూచన మాత్రగా తెలిపిన విషయాలు, తెలుపని విషయాలు అన్నియు సమగ్రముగా వ్రాయవలెనంటే భారత గ్రంతమంత కాదా మరి? అట్టి గ్రంథము రచింపదలిచినవారికిది ప్రోత్సాహహేతువైయుండునని వ్రాసినాను.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse