Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/గాథాసప్తశతి

వికీసోర్స్ నుండి

గాథా సప్తశతి


సంస్కృతమందు కాని, ప్రాకృతమందు కాని, దేశభాషలందు కాని గాథా సప్తశతితో సమానమగు కవిత లేదు. శాలివాహన చక్రవర్తులలో నొకడగు హాలుడు తన యాస్థానమందును తనకన్న ముందు కాలమందును నుండిన కవుల యొక్కయు కవయిత్రుల యొక్కయు ప్రాకృత పద్యముల నేర్చి కూర్చి యందు తన సొంత పద్దెములను కొన్నింటిని జేర్చి 800 పద్యముల పరిమితిగా సంకలించి ప్రపంచాని కందించెను. అదే గాథా సప్తశతి. హాలుడు తనను గూర్చి యేమియు తెలుపుకొనలేదు. ప్రతి శతకానంతర మొక పద్యములో తాను సంకలన కర్తనని మాత్రము తెలుపుకొనెను.


“రసిక జన హృదయ దయతే
కవివత్సల ముఖ సుకవి సంకలితే”


అని ప్రథమ ద్వితీయ తృతీయ పంచమ షష్ట శత కాంతములందును “నరపాల హాల రచితే ప్రాకృత కావ్యేత్ర సప్తశతే' అని సప్తమ శతకాంత మందును “అత్ర చతుర్థం విరమతి నిసర్గ రమ్యం శతం హిగాథానాం! మధురత్వేనామృత మపినోలగతి హృదయే” అని చతుర్థ శతకాంతమందును వ్రాసెను. ఈ పద్యములు నిసర్గ రమ్యమైనవనియు వాటి మాధుర్యము ముందర అమృతము కూడ చప్ప చప్పనిదే యనియు కవి హృదయము.

పై శ్లోకాలలో “కవివత్సల ముఖ సుకవి సంకలితే” అనునది యను మానమునకు తావిచ్చినది. రాజులు మందులనియు కవులు యశః కాముకులనియు, ఇతరులచే వ్రాయించిన కవితలకు పైకమిచ్చి తమ పేర్ల నతికింతురనియు, మన దేశమందు కథలల్లినారు. ఆ కథలలో నీ కథయు చేరినది. హాలుని యాస్థానమందు కవి వత్సలుడో, శ్రీపాలితుడో యొకడుండెననియు, అతడే సంకలనకర్తయనియు, హాలుని పేరు ద్రవ్యాశచే తగిలించె ననియు నందురు. కాని యది నిరాధారము,

శతకాదియందే హాలుడిట్లు వ్రాసెను.


“సప్త శతకాని కోటేర్మధ్యే
కవి వత్సలేన హాలేన
గాథానాం రచితాని హి
నానాలంకార లలితానామ్‌” 1,3.


హాలుడే కవివత్సలుడు, హాలుని గురించి మనకు అయిదవ శతకమందు మరికొన్ని విషయములు తెలియవచ్చినవి.


దదతా సంవాహన సుఖ
రస సంతుష్టేన తవక రేలాక్షాం
విక్రమ నరేంద్ర చరితం
చరణేన హి శిక్షితం తస్యాః 5-64


భార్యభర్తతో నిట్లన్నది. లక్కరంగు పూసిన నా సవతి కాళ్ళు పిసికినది నీ యరచేతిలోని లక్క గుర్తులే చెప్పుచున్నవిలే.

నా సవతి విక్రమార్క చక్రవర్తి యంతటిది! విక్రమార్కుడు శత్రుసంబాధమున పేరొందిన భటుని కొక్కొక్కని కొకలక్ష యిచ్చెడివాడు. (ప్రాకృతములో లక్ష - లక్కయు సంబాధము - సంవాహము ఒకటే) విక్రమార్ముని యొక్క యొక ప్రసిద్ధ చర్యను పేర్కొనుటచే విక్రమార్కుడు హాలునికన్న ముందుండిన చక్రవర్తియనియు, అతడు కల్పిత పురుషుడు కాడనియు దీనివలన స్పష్టమైనది.


“దీనులైన వారి తేకువ దీర్చి ర
క్షింప నేర్చువార లిరువురిలను
పార్వతీశుడైన పరమేశ్వరుడు, రాజ
వల్లభుండు శాలివాహనుండు. 5-62.


(గాథా సప్తశతీసారమున శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు, లెక్చరర్‌, మైసూరు యూనివర్సిటీ, వ్రాసిన పద్యాల నుదాహరింతును. వారు అనువదించిన వాటిని ముఖ్యమని తోచిన వాటిని సంస్కృత మూలముననే యుదాహరింతును.)

కాళ్ళు పిసుకుటకు 564లో విక్రమార్కుడే యుపమానమును 566లో దీనుల నుద్ధరించుటలో నీశ్వరునితో తుల్యత్వమునకు శాలివాహన నరేంద్రుని పోల్చుటలో విక్రమార్క శాలివాహన వంశాలకుండు పోటీ సూచితము. దీనులనుటకు మూలములో “అవణాయి” అని కలదు. అది ఆపన్నాని యనియు అపర్ణాని యనియు నగును. అపర్ణయన పార్వతి. అపర్ణులు పార్వతేయులు అనగా శైవులు. ఆకులు కట్టని ఆదిమ నగ్నజనులలో వెలసిన దేవత యనియు సూచితమను కొందును. హాలుని కాలమందు శైవము బౌద్ధముతో పాటు ముఖ్యమతమనియు శాలివాహనులు శైవులనియు దీని నుండియే కాక,


అలుకమెయి జేవురించిన యాదిశక్తి
మోము జందురు నీడలో మొలచియుండ
పూజ తామర దాల్చిన పోల్కి బొలుచు
హరుని సంధ్యా జలాంజలి కెరగుదీరు. 1-1

అని ప్రథమ పద్యము నుండియు

సంధ్య వార్చగ దోసిట జలము పట్టి
నపుడు గౌరీ ముఖాంబుజమందు దోప
మంత్ర మంతయు నొక మాఱు మఱచి పట్టి
మోవినిగదల్చు శివునకు మ్రొక్కులిడుదు 7-111


అని పాఠకుల శృంగార రసానందమందు ముంచి తేల్చిన తుది పద్యము నుండియు నిస్సందేహముగా వెల్లడియైనది.


“తవరణజలద సమయ భయ
చల విహ్వల పక్షకైరనుప్రియతే” 5-71


శాలివాహనుని శత్రువులు విజితులై భయ విహ్వలులై విధేయులై అనుసరించి సేవించిరని హాలుడు వ్రాసుకొనెను. సప్తశతిలో హాలుని గురించి సూచనలివియే. శాతవాహనులాంధ్ర రాజులని పురాణాలలో పేర్కొనబడినారు. హాలుడు క్రీస్తు శక ప్రథమ శతకమందుండిన వాడని పలువురు చరిత్రకారులు నిర్ణయించినారు. ఔరంగబాదు జిల్లాలోని యిప్పటి పైఠానును అప్పటి ప్రతిష్ఠాన పురమును రాజధానిగా మధ్య దేశమంతయు నేలిన చక్రవర్తి. బహుశః ఇతడే శాలివాహన శక ప్రవర్తకుడై యుండును. ఇతనిని గూర్చి భట్ట శ్రీ మధురానాథ శాస్త్రి గారిట్లు సంస్కృత పీఠికలో వ్రాసిరి. “కథా సరిత్సాగరములోని రాజును గూర్చిన కథ కలదు. ఇతనికి మొదట సంస్కృతము రాకుండెను. ఇతని భార్యయగు మలయవతి కది బాగుగా వచ్చి యుండెను. ఒకనాటి జలకేళిలో రాజు నీటితో రాణిని కొట్టగా “మోదకైస్తాడయ” యనగా కుడుములు తెప్పించి కొట్టగా నామె పరిహసింప సిగ్గుపడి శర్వవర్మ బోధచే అచిరకాలమందు పండితుడయ్యెను. బాణాదులిట్లితనిని గూర్చి వ్రాసిరి.


“అవినాశినమగ్రామ్యమకరోత్‌
సాతవాహనః విశుద్ధ జాతిభిః


కోశరత్నైరివ సుభాషితైః” కాని యిది యుపచార వాక్య సూత్రమేమో? అభినంద ప్రణీతమగు రామచరిత మహాకావ్యమందు “హాలేనోత్తమ పూజయాకవి వృషః శ్రీ పాలితోలాలితః ఖ్యాతిం కామపి కాళిదాస కవి యోనితాః శకారాతినాః శ్రీహర్షోనిత తార గద్యకవియే బాణాయవాణీఫలం। సధ్య! సత్క్రియ యాభినందనుపిచ శ్రీహారవర్షో గ్రహత్‌!” అని శ్రీ పాలితుడను కవియే హాలుని పేర నీ సంకలనము చేసెనని వ్రాసినారు. దీనిని బట్టి శ్రీపాలితుడే దీని కర్తయనుట భావ్యము” భట్టశ్రీ గారు మరల ఇట్లు వ్రాసిరి.


“కేనానన్నాధ్య రాజన్య రాజ్యే ప్రాకృత భాషిణః
కాలేశ్రీ సహసాం కన్యకేన సంస్కృత భాషిణః”


అని భోజుడు సరస్వతీ కంఠాభరణమందు వ్రాసెను. “అఢ్యరాజు (హాలుని) రాజ్యమందందరు ప్రాకృతము మాట్లాడిరి. విక్రమార్కుని రాజ్యమందందరును సంస్కృతము మాట్లాడిరి అని యితడు తెలిపెను. సప్తశతి శృంగార రసభూయిష్టము. ఇది అపూర్వ ధ్వని కావ్యము. రుద్రట, మమ్మట, వాగ్భట, విశ్వనాథ, భోజాది సాహిత్యశాస్త్రకర్తలు దీని నుండి యుదాహరణములను గైకొనిరి”.

సప్తశతి యందు 200 పద్యాలలోపాలితుని పేర నుండునవి తొమ్మిది పద్యాలు మాత్రమే. హాలుని పేరనుండు పద్యములు 47. ఈ పద్యాల నెవరు వ్రాసినట్లు? సహజముగా సంకలనకర్త తన పద్యాల నెక్కువగా చేర్చును. మరియు సంకలనము చేయుట కూడ కష్టమగు పనియా?

దానికి పాలితుడే యవసరమా? అభినందుని శ్లోకము పాలిత పక్షముగా నుండిన నంతకు చాలా ప్రాచీనుడగు “బాణాదుల” శ్లోకాలు హాలుని పక్షాన వాదించినవి కదా. రాజుల కవిత్వాలకుండు నీ అపప్రథ హాలునికిని తగిలినది. హాలుడు సంకలనకర్త కాదనుటకు ప్రబలాధారములు కానరాలేదు.

సప్తశతి కవులు

సప్తశతి పద్యాలలో ఇంచుమించు 250 పద్యాలకు కర్తలెవరో తెలియరాలేదు. ఇందు పలువురి స్త్రీల పద్యాలున్నవి. రేవా (1-87-90). రోహయే (2-6-3), మాధవి (1-91), అణ్నుల లక్ష్మి (3,28,63,74,76), పాహయీఏ (1-70-83), వద్ధవాహయే (1-60-70-86) శశిప్రభా (4-4) అనువారు కవయిత్రులు. ఈ విషయమాకాలపు స్త్రీల యౌన్నత్యమును సూచించును.

ఇంకను ఇట్టి పద్యముల సంకలనములనేకములుండినట్లు ప్రాచీనులన్నారు. ఈ సప్తశతీ ప్రాశస్త్యమును దీనిపై పుట్టిన 19 వ్యాఖ్యానములే చాటుచున్నవి. అందు గంగాధరభట్టు వ్యాఖ్య ప్రసిద్ధమైనది. సప్తశతిలోని పద్యాలు సాహిత్య శాస్త్రకారులు విశేషంగా నుదాహరించుకొనిరి. భోజుడందరికన్న నెక్కుడుగా నీ పద్యాలు తన సరస్వతీ కంఠాభరణమందుదాహరించుకొనెను. ధ్వన్యాలోకకారుడును కొన్ని (2-75) పద్యాల నుదాహరించుకొనెను. మమ్మటుడు (1-44, 7-65), 7-67, 2-82, 5-55, 2-75) కొన్ని పద్యాలనుదాహరించుకొనెను.

భాష

సప్తశతిలోని భాష మహారాష్ట్ర ప్రాకృతము. ప్రాచీనులలో పలువురు సంస్కృత పండితులు ప్రాకృతమే సుకుమార సుందర భాషయని మెచ్చుకొనిరి. హాలుడే యిట్లనెను.


“అమృతం ప్రాకృత కావ్యం.”
చెవుల కమృతంబు ప్రాకృత
కవనము చదువంగ వినగ గాననివారల్‌
పుపువిల్తు శాస్త్ర మర్మము
వివరించెదరెట్లు సిగ్గువిడిచి మనమునన్‌” 12

కర్పూర మంజరియను ప్రాకృత నాటకములో రాజశేఖరుడిట్లు వ్రాసెను.

పరుషాః సంస్కృతబంధాః
ప్రాకృత బంధోపి భవతి సుకుమారః
పురుష మహిళానాం
యాపదిహాంతరం తానదేతేషాం॥

స్త్రీ పురుషులకెంత భేదమో యంత ప్రాకృత సంస్కృతాలకున్నదని భట్టశ్రీగారు

వజ్జాలగ్గ అను ప్రాకృత గ్రంథమునుండి ఈ క్రింది శ్లోకమునుదాహరించిరి.


“లలితే మధురాక్షరే
యువతి జనవల్లభే సశృంగారే
సతి ప్రాకృత కావ్యే
కః శక్నోతి సంస్కృతం పఠితుం.


లలిత మధురమై యువతి జనాహ్లాదియైన ప్రాకృత కావ్యాన్ని వదలి సంస్కృతము నెవడు పఠింప సహించును. పై విషయాలనుబట్టి చూచిన శాలివాహనుల కాలము వరకు ప్రాకృత భాషలు జనుల మాతృభాషలగుటచేత వాటిపై గల యభిమానముచే సంస్కృతమును చిన్నచూపుతో జూచియుందురు. వివిధ ప్రాకృతములలో సప్తశతిలోనిది మహారాష్ట్ర ప్రాకృతమందురు. మహారాష్ట్రుల మాతృభాషలోనిపదాలిందెన్ని కలవోయేమో కాని మన తెనుగులో సాధారణమై వాడుకలోనున్న బహుపదములు సప్తశతిలో కానవచ్చును. ఎట్లనగా -

అత్తశబ్దము శ్వశ్రుమాతులాని శబ్దములకు మారుగా గ్రంథమందంతటను చాల మారులు వచ్చినది. అత్తా తహర మణిజ్జం (శ్వశ్రుతధా రమణీయం (4-8) మామ భార్య మాతులానికి “మామి"యని పలుమారు వాడినారు. (1-93, 99) ఇది మన మామకు సన్నిహితమగుమాట. పొట్ట (1-83, 2-71), పడి (పతిత) (5-27) వల (వలగొను) 1-25 పల్లి (పల్లె) 1-30 పాడి (పాడియావు 1-65) కంటె 1-75 కాకి (22) మడ (ఏటిమడ 2-5) దేవళ (ము) 2-9, చేట (2-69) అద్దం 3-4, సవతి 3-11, దివ్వె 3-22, కడప 3-29, అవ్వ (ఆశ్చర్యార్థకము - ఒరంగల్‌ ప్రాంతమందలి యాశ్చర్యార్థక ప్రయోగము) 3-73 గంజి 3-86, చిప్పెర (చిప్పెర గడ్డి అలుము) 4-30 తరము (శక్యము) 4-49, గంటు (ముడిగ్రంథి) 4-51, తుపరీ (తువ్వ తొగరి-కంది-తువ్వనేల) 4-58 ఇట్టి పదాలు లభ్యమగు చున్నవి. గోదావరిని గోదాయనియు (1-58), గోలా యనియు (2-3) పలుమారు వాడినారు. పూర్వ రూపము గోలాయని తర్వాత గోదా యనియు (అదే గోదా ఏరు- గోదారి) తర్వాత గోదావరి యనియు గ్రహింపవచ్చును. సప్తశతీ శృంగారరంగములు పల్లెలు, తటాకములు, పంటపొలాలు, గోదావరీ తీరములు, వింధ్య పరిసరాలు,

దేవళములు.

అనుకరణములు

సప్తశతి ప్రాశస్త్యమును గ్రహించి యనేక కవులు దానిననుకరించిరి. అందు ముఖ్యులు అమరుడు, గోవర్ధనాచార్యుడు. బిహారి. అమరుడు అమరశతకమును వ్రాసెను. గోవర్ధనుడు ఆర్యాసప్తశతిని రచించెను. బిహారి ప్రజ భాషలో బిహారి సత్సయి (సప్తశతి) వ్రాసెను. వీరుకాక మరికొందరు దీని భావముల గ్రహించిరి. భట్టశ్రీగారు 1-46లోని యీ క్రింది

“రాతి మనసుతోడ నాతడు రేవూరు వదలి పోవుననెడు వార్తగలిగే వానికెపుడు దెల్లవారకయే యుండ రాత్రి తల్లి పెరిగిరావే నేడు”.

అను పద్యమునకు హిందీలో నీ క్రిందిది కలదని తెలిపినారు.


సజన్‌ సకారై జాయగే
నైన్‌ మరేగే రోయ్‌
విధవా ఐసీరైన్‌ కరే
భోర్‌ కబ్‌ హినహోయ్‌.


మరియు 2-61 “ఊర్ద్వాక్షః పిబతిజలం” అను పద్యాన్ని అప్పయ దీక్షితుడు మాటలు మార్చి ఇట్లు వ్రాసెననెను.


'యదోర్ద్వోక్షః పిబత్యంబు
పథికో విరళాంగుళిః
తథా ప్రపా పాలికాపి
ధారాం వితనుతేతనుం॥' (క్రీడాభిరామములో 3-38)


“విక్రీణీతే మాఘే ప్రావరణం పామరోహి బలదేన నిర్దూమ ముర్మరని భౌనూనం “శ్యామాస్తనౌ పశ్యన్‌'‌ (3-38) అను పద్యానికి 'మాఘమాసంబు పులివలె మలయుచుండ పచ్చడంబమ్ముకొన్నాడు. పణములకును ముదితచన్నులు పొగలేని ముర్మరములు చలికి నొఱగోయ కేలుండు సైరికుండు'- అను పద్యము కలదు.


సప్త శతిలోని (4-15)
జంఝావాతోత్తృణితే
గృహేరుదిత్యానిస్సహ నిషణ్ణాం
దర్శయతి గతిపతికాం

విద్యుదుద్ద్యోతో జలధారాణాం అను పద్యానికి క్రీడాభిరామములో నీ క్రింది

పద్యము కలదని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తమ పీఠికలో వ్రాసిరి.


మ. “పటు జంఝా పవనోత్తృణాలయములో భద్రంబునం బట్టెకం
     కటిపై ముచ్చము డింగి నిర్భర వియోగగ్లాని శోషిల్లియె
     క్కటి నిద్రించుచునున్న వాడవనితన్‌గర్జా వచః ప్రౌఢిమన్‌ -
     దటి దుద్ద్యోతము సూపునట్టు నడురే ధారాధశ్రేణికిన్‌॥”


శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారిట్లు పీఠికలో రాసినారు. “వంగూరి సుబ్బారావుగారు ఎక్కడ నుండి సంపాదించారో కాని శ్రీనాథుని శాలివాహన సప్తశతి లోనిదని యీ క్రింది పద్యముదాహరించిరి.


'వారణసేయ దావగొనవా, నవనారిజమందు తేటిక్రో।
వ్వారుచునుంట నీవెరుగవా, ప్రియవా తెరగంటి గంటికె।
వ్వారికి గెంపురాదె, తెగవా మగవారల దూర, నీ విభుం!
డారసి నీనిజం బెరుగు నంతకు నంతకు నోర్వు నెచ్చెలీ॥'
కాని యిప్పటి సప్తశతిలో దీనికి మూలమైన ప్రాకృత గాథ కానరాదు”.


నూనూగు మీసాల నూత్న యౌవనమున శాలివాహన సప్తశతి నొడివితి అని శ్రీనాథుడు చెప్పియుండెను. కాని యది యింతవరకు లభ్యము కాలేదు. సప్తశతి పద్యాలను బోలిన ప్రాకృత పద్యాలను కొన్నింటిని మమ్మటాదు లుదాహరించిరి. కాని యవి యెచ్చటివో తెలియదు. ఆర్యా సప్తశతికి దారి చూపినది శాలివాహన సప్తశతియే కాని ఆర్యా సప్తశతి పద్యాలు వీటి ముందర దిగదుడుపుగా నున్నవి. హాలుని గోవర్ధనుడు పూర్తిగా అనుకరించెను. ఇక అమరుక కవి శ్లోకాలను గురించి విచారింతము. అమరుక కవి బహుశ క్రీ.శ. 200 ప్రాంతము వాడై యుండును. అతని కసాధారణకీర్తి కలిగెను. 'అమరుకవే రేకః శ్లోకః ప్రబంధ శతాయతే” అను నానుడి యేర్పడెను. అమరు కవి యొక్కొక్క శోకము నూరు ప్రబంధాలకు సాటియనిరి. అట్టి కవి తన పెక్కు శ్లోకాలలో పూర్ణముగ గాథా సప్తశతి భావములను దింపుకొనెను. భట్టశ్రీ మధురానాథ శాస్త్రిగారు గాథలకును అమరుని శ్లోకాలలో గల సంపూర్ణ సామ్యములను చక్కగా నిరూపించినారు. ఉభయ గ్రంథ శ్లోకాలను పూర్తిగా నుదాహరిం

చుటకు వీలులేనందున రెంటిని మాత్రము చూపించి తక్కినవి సూచింతును.


“కృత కస్వాప నిమీలితనయన
సుభగ దేహి మహ్యమవకాశం
గండ పరిచుంబ నోద్గత పులక
పునర్నైవ చిరయిష్యే. 1-20”

శూన్యం వాసగృహం విలోక్య శయనాదుత్థాయ కించిచ్ఛెనై!
ర్నిద్రావ్యాజ ముపాగతస్యసుచిరం నిర్వర్ణ్య పత్యుర్ముఖం।
విశ్రబ్దం పరిచుంబ్య జాతపులకా మాలోక్యగండస్థలీం।
లజ్జానమ్రముఖీ ప్రియేణహసతా బాలాచిరం చుంబితా॥”
                                                      అమరుక శతకం - 77

“దయతే ప్రసీద, కుపితా కాని
సుతనుత్వం, పరేస్తికః కోపః?
కోస్తిపరో? నాథత్యం! కిమితిహి,
మనుదురిత శక్తిరియం” 4-84

'బాలే! నాథ! విముంచ మానిని రుషం, రోషాన్మయా కింకృతం,
ఖేదోస్మాను, నమేపరాధ్యపతి భవాన్‌ సర్వే పరాధామయి,
తత్కింరోదిషి గద్గదేన వచసా, కస్యాగ్ర తోరుద్యతే,
నన్వేతన్మమ, కాత వాస్మి దయితానాస్మీ త్యతో రుద్యతే” అమరు. 53.

ప్రణయ కుపిత 1-27
అన్యోన్య కటాక్ష 2-99
వీటికి సాటి అమరుక శ్లోకము
ఏకస్మిన్‌ శయనే... 19
స్థగయిష్యామి 4-14
దీనికి అమరుని అనుకరణము
భ్రూ భంగేరచితేపి-24
యత్‌పృచ్ఛసి నివాసన్మాం 7-11
దీనికి అమరుని అనుకరణము
అంగానామదితానవం-45

అమరుడు అను రాజు చావగా అతని శరీరములో పరకాయ ప్రవేశవిద్యచే

ఆదిశంకరాచార్యులు ప్రవేశించి అమరు రాజై అతని భార్యతో సుఖించి యీ శతకము వ్రాసెనని యొక అద్భుత కథకు విచిత్ర రూపమేర్పడినది. ఇదంతయు నవిశ్వసనీయము. శంకరుని కాలము 700-800 మధ్యకాలము. అమరుని ఆనందవర్ధన, మమ్మటాదులు గ్రహించినందున వారిరువురు క్రీ.శ. 10-11 శతాబ్దముల వారగుటవలన అమరుడు క్రీస్తు శకము 700 ఆ ప్రాంతము వాడనిన పొరపాటుండదు. అమరుడెవ్వడో తెలియదు.

విహారి సత్సయీ వ్రాసిన విహారి కవి యెప్పటివాడో తెలియదు. అమరు గోవర్ధనుల తర్వాత వాడని మాత్రమే భట్టశ్రీ గారన్నారు. సత్సయీలోని భాష యిప్పటి హిందీకి చాలా దూరముగానున్నది. కబీరు, తులసీదాసుల భాష కన్న చాలా ప్రాక్తన మైనది. కావున అది క్రీ.శ. 1200-1300 ప్రాంతముదిగా నుండును. సత్సయీలోని చాలా దోహలు (ద్విపదలు) గాథా సప్తశతి నుండి యేర్పడినవే యని భట్టశ్రీ గారెత్తి చూపినారు.

తెనుగు సేత

శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు అసాధారణ కవి పండితులు. సంగీత సాహిత్య విద్యానామక యుగళంబు గ్రోలినవారై బహు భాషలను, ప్రాకృతమును నెరిగిన వారగుటను, తెనుగున ఉత్తమ వచన శైలిని, మధుర కవితను నల్లగలిగినవారు. వారు గాథా సప్తశతిలోని 395 పద్యముల నేరి తెనుగించినారు. వారి విచక్షణ సరియెనదే. పచ్చి శృంగారమును, అనవసరమగు పద్యాలను, అనుత్తమమైన వాటిని పరిహరించినారు. మూలమందలి భావములను అందలి గంభీరతను చెడకుండా సుందరముగా సులభ గ్రాహ్యమగునట్లుగా చేతికందించినారు. వారే దానికి పీఠిక వ్రాయవలసి యుండెను. అటులే కొంత చేసినట్లే! శ్రీనాథుని కృతియుత్సన్నమైన వ్యధను వీరు తొలగించినారు.

నాటి ఆచారాలు

గాధా సప్తశతి యొక్క కాలమును నిర్ణయించినాను. కావున ఆ కాలమందలి సాంఘికాద్యాచార విశ్వాసము లెట్టివో సప్తశతిలోని వర్గలను బట్టి మనము స్పష్టముగా నిరూపింపవచ్చును. గాథలన్నియు నుద్దేశ పూర్వకముగా శృంగార భూయిష్టముగా

సంకలింపబడినందున నా కాలమున జనులందరు శృంగారలంపటులని తలపరాదు.

మత విశ్వాసాలు - ఉత్సవములు

ఆ కాలమందు కొన్ని పురాణ దేవతలకు విశేష వ్యాప్తి యుండినట్లున్నది. రామలక్ష్మణులు (1-35) వామనుడు (5-6) రాధాకృష్ణులు (1-89) గణపతి (4-79) పేర్కొనబడినారు. అందు పాపము గణపతి పొట్టగలవాడగుటచే ఒక విలాసినికి రహస్య సంగతిలో తలగడగా పనికి వచ్చెను.

యౌవనములో సురతసమయ పరిధానీకృత గణపతి వార్థక్య దశలో పాప పరిహర్తగా పూజితుడయ్యెను. ఎందరు పౌరాణిక దేవతలు పుట్టినను గిట్టినను నేటివలననే నాడును గ్రామదేవతలకే ప్రాముఖ్యముండెను.


“ఈవు చేతులారా నిచ్చినదని ప్రాచి
పూలసరము తావి పోయి యున్న
నింతి దాల్చుచున్న దింకను, వ్రత పూజ
ముగియ, నూరి వేల్పు బొమ్మవోలె (2-94)


(ఉదాహృతాంధ్ర పద్యములన్నియు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారివని యెరుగవలెను). ఆ గ్రామ దేవర్లకు దున్నపోతుల బలి ఇచ్చుచుండిరి.

కేవల హిందూ మతమే కాక బౌద్ధమతము కూడా మంచి వ్యాప్తిలో నుండెను. అందుచేత రెండు తావులలో తత్ర్ప క్తియు వచ్చినది.


భిక్షకుండు నాభి నీక్షించుచుండగా
నదియు వానిమోము నరయుచుండె
అతని చేతిచిప్ప నామె చేతుల తట్ట
కాకులేరి తినుచు గాకుచేసె (2-62)

ఇచట వీడు దొంగ సన్యాసి!

చిలుక ముక్కు వన్నెచే నొప్పు మోదుగు
పూలవరపు పొలిచె నేలనెల్ల
బుద్ధ దేవు చరణములు మ్రొక్క బుడమిపై
వ్రాలియుండు భిక్షు జాలమట్లు 4-8


స్త్రీలు వాయనము లిల్లిల్లు దిరిగి యిచ్చు వాడుక యుండెను. (4-28) పండుగలలో హోలీ పండుగ (ఫల్గుణోత్సవము) చాల ముఖ్యమైనది. స్త్రీ పురుషులు రంగులు చల్లుకొనుచు వినోదించెడి వారు. (4-69) 6-35 చూత లతికా క్రీడయనున దుండెను. ప్రియతమ నామమేమి చెప్పుమని ప్రియులు చూత లతికతో లేక నవ పలాశ లతతో కొట్టుట యీ క్రీడా విశేషమట! (1-28; 5-56) శైవ సాంప్రదాయకము లోని కాపాలికులందందుండిరి. (5-8) ప్రజలకు శకునాలపై విశ్వాసముండెను. “ఏ కోపి కృష్ణ సారో నదదాతివలనన్ ప్రదక్షిణం గంతుం" (1-25)

ధన నిక్షేపములు

నిన్న మొన్నటివరకు మనదేశమందలి ధనికులకు భూవివరములే బేంకులై యుండెననగా ఆ కాలమందు జనులు ధనమును, వెండి, బంగారును భూమిలో పూడ్చి దాచి పెట్టుకొనుచుండిరనిన చిత్రముగాదు. గాథలందు విరివిగా నీవిషయ చర్చలు వచ్చినవి.


“తగిన చోటు గాదు దాచుట కిది; యేల
సాహసంబు జేయ జనెదు కొడుక! 2-54

భూమిలో పాతిన ధనము పలుమారు నష్టమైనదని యిందు సూచితము.

“చరోజనులు సారె సారెకు జూతురు
భయము కోరికయును పైకొనంగ
వీరవరుని పత్ని వీగు జన్నుల; పాము
కాచు కొన్నలిచ్చి కడవలట్లు 6-72


బహుకాలము భూస్థాపితమైన ధనములపై పాములు కావలి యుండునన్న విశ్వాస మానాటికే ప్రాతదై యుండెను.

శిక్షలు

శిరచ్ఛేద శిక్ష పొందిన వాణ్ణి వధ్య స్థానమునకు తీసుకొని పోవుచూ తప్పెట వేసి యందరికి తెలియునట్లుగా వాని తప్పును, వాని శిక్షను ప్రకటించెడి వారు.

దొంగతనం చేసిన వారికి మరణ దండనము, శ్మశానమందు చెట్టుపై వ్రేలాడ గట్టట యానాటి యాచారముగా కానవచ్చును. "శంకా శ్మశాన పాదలంబిత చోరే ణేవ ఖరేన” (6–36) అనుటయే నిదర్శనము. వ్యభిచారులను గ్రామాధికారులు

శిక్షించుచుండిరి. (6-56)

స్త్రీల వేషభూషలు

స్త్రీలు స్నానము చేయునపుడు పసుపు రుద్దుకొనుచుండిరి. (1-80) కన్యలకు తొలి సమర్త కాలమందు పసుపులో నెయ్యి కలిపి ముఖమునకు చేతులకు కాళ్లకును రుద్దుచుండిరి. (3-46) ఇచ్చట మూలమందు “వర్ణఘృత లిప్తముఖం” అను పదముపై శ్రీ మధురానాథ శాస్త్రిగారిట్లు వ్యాఖ్యానించిరి. “హరిద్రావర్ణ మిశ్ర ఘృతం వర్ణఘృతం దేశ విశేష రజస్వలా ముఖం వర్ణఘృతేన, లిష్యతి ఇతికా చిత్ర్పథా” ఉత్తర హిందూ స్థాన మందీయాచారము లేదనియు “ఒకానొక దేశవిశేషమందు” ఈ యాచారముండె ననియు వ్యాఖ్యాత్రభిప్రాయము. ఇది ద్రావిడాచారము. సప్తశతిలో గోదావరీ తీర వాసుల యాచారాలు వర్ణించినందునను నేటికిని ఆంధ్రులలో నీయాచారముండుట వలనను దేశ విశేష నాంధ్రదేశమనుట స్పష్టము (చూడుడు 122 మరియు 619). ముత్తయిదువలు కాళ్ళకు లంకరంగు పూసుకొనుచుండిరి. (2-27) బుక్క పిండిని (కర్పూరాది గంధ ద్రవ్యకృత వర్ణ ధూళి) ప్రియులొండొరులపై చల్లుకొనుచుండిరి. (4-12) విలాసినుల ప్రసాదనములలో అద్దము, దువ్వెన ముఖ్యమైనవి. (3-4 మరియు 1-80) నాట్యమాడు స్త్రీలు ముఖమునకు హరిదళమును (అర్థళము - హరితాల మండిత ముఖీనటీవ) పూసుకొనెడివారు. (1-9) పూర్వమిండ్ల పెరడులందు ఆంకోల (ఊడుగ) వృక్షములు పెంచుచుండిరి. వాటి పూల సువాసన యువతీ జనాహ్లాదకారి (5-97) ముత్తయిదువలు కొప్పుముడిని, జడను వేసుకొనుచుండిరి. (3-73) మరువము స్త్రీలకు ప్రీతికరమైయుండెను. (2-22) ధనిక యువతులు మరకతమణి పద్మరాగ సంవలితములైన (పచ్చల కెంపుల) కంటెలను ధరించిరి. (1-25) మట్టిగాజులను తొడుగుకొను నాచారము తెనుగు ముత్తయిదువలలో నిప్పటికే రూఢమై పోయెను. (5-38) “భగ్నకరవలయాని” అనుటలో భగ్న శబ్దమును బట్టి యవి మట్టి గాజులే యనవలెను. మరియు (5-53) వ్యాఖ్యలోనవి “కాచాది నిర్మితం” అని వివరించినారు.

స్త్రీలకు చీర రవిక ప్రధాన వస్త్రములు. రంగు వస్త్రములపై వారికి ప్రీతి మెండు. కుసుమవన్నె నుత్తమమైనదిగా నీలి వన్నెను సాధారణమైనదిగా భావించిరి. రవికలు “కుసుంభరంజితములు” (6-45) కుసుమవన్నె (చెంగావి) చీర యువతులకు

ముచ్చట గొలుపునట్టిది.


దొరకకుండ నేడు దొరికిన చెంగావి
చీరకట్టె కాపువారి కోడ
లదిగో, చిన్నదయ్యు నడగక తిరిగెడు
విరివియైన యూరి వీధులందు. (3-4)


ఆనాటి పడచుల భావములో నీలిరంగు చీర మంచిది కాదట. పట్టుచీరయయిన భేషట! (6-20) ఉత్తర హిందూస్థానమందు స్త్రీల రవిక కట్టు వీపున నుండెడిది. దాక్షిణాత్య స్త్రీల కంచుక బంధనము ముందువైపే యుండెడిది. ముందు భాగమందు రెండు పార్శ్వములందు కొంత సందు కలిగి పొట్టపై రవిక రెండంచులను ముడివేయుట ఆనాటికే రూఢియై యుండెను. (7-20) “ద్వ్యంగుల లలిత కావాటక, పినద్ధ సవిశేష నీలకంచులికా” స్త్రీలు నూపురములు ధరించుచుండిరి. (2-88)

జనుల యాచారములు కొన్ని

పిడుకల కాల్చుట ప్రాతకాలపు దురాచారమే (2-29). జనులు ముఖ్యముగా స్త్రీలు ఇప్పపూల నేరి సారాయి చేసుకొనుచుండిరి. ఆనాడు ఇప్ప సారాయికి లైసెన్సు లేకుండెనన్నమాట (3-3 మరియు 2-4). ప్రాత సారాయి (జీర్ణ సుర) చాలా రుచికలదై మైకమును మదనోన్మాదమును కలిగించు నట్టిదని యొక కవి యిట్లనెను.


“ఊరినిండ వయసువారు; ప్రాయము; ముదు
సలి మగండు; నవవసంత వేళ;
ప్రాతపడిన కల్లు చేతనున్నది; ఇంక
చెడక చావగలమే; చెప్పవమ్మ. (2-97)


పండ్లు తోముకొనుటకు జనులు కానుగ పుల్లలను వాడుచుండిరి. (2-65, 6-53). స్నానము చేయునపుడు నలుగు పిండిని వాడుచుండిరి. ఆ పిండిని రుద్దుకొని కడుగుకొనినప్పుడు “జంబూకషాయము” ఏర్పడుచుండెను. (2-89) పిల్లలకు అక్షరాభ్యాసము 'ఓనమాల'తో సీధంనమః'తో ప్రారంభమగు చుండెను. (2-9).


“వర్ణావళీమష్య జానంతో లోకాలోకైర్గౌరవాభ్యధికాః
సువర్ణకార తులా ఇవ నిరక్షరా లిపిస్కంధై రుధ్యంతే.

ఈ శ్లోకంలో శ్లేష కలదు. దీనిపై సాహిత్యాచార్య భట్టశ్రీ మధురానాథశాస్త్రి

గారిట్లు వ్యాఖ్యానించిరి. “జనైః ఓనమః సిద్ధం సిద్ధిరస్తు ఇత్యారభ్యాం వర్ణమాలా మప్యజానంతో లోకాః గౌరవాభ్యధికాః” అని వ్రాసిరి. 'నమఃసిద్ధం' అని సాహిత్యా చార్యులవారు వ్రాయుట పాణినేయులకు, పాతంజలులకు సరిపడునో లేదో? ఉత్తరములు వ్రాసుకొనునప్పుడు 'స్వస్తి అను పదములతో ప్రారంభించుచుండిరి. పూర్వమందలి శాసనాలన్నియు స్వస్తి పదములతో ప్రారంభించుట భారతీయ చారిత్రకులెరిగియే యున్నారు. వ్రాతకు సాధనము లేఖిని యొకటి. తాటియాకులో భూర్జపత్రాలో వాడి యుందురు. గాథలు దాక్షిణాత్యమువి కాన తాటాకులే వాడిరనవలెను. మరి లేఖిని యన గంట మనవలెను.


“వడకి చెమరించు వ్రేళ్ళకు వశముగాక
నిలిచి నడవక జారు నీ కలము తోడ
స్వస్తి శబ్దమె ముగియంప జాలనైతి
కమ్మ నింకేమి వ్రాయంగగలను చెలియ” (3-44)


జనులిండ్ల గోడలపై చిత్తరువులు వ్రాయించుకొనువారు (3-17). ఆ యాచారము క్రీస్తుశకము 19వ శతకాంతమువరకు ప్రచలితమై యుండెను. ఇండ్ల ముందు అరుగుల గదులుండెడివి. అవి పలుమారు బాటసారులకు రాత్రులందు విశ్రమస్థానాలగుచుండెను. (3-54). ధర్మశాస్త్రోక్తి ప్రకారము పుత్రులు తండ్రుల బుణములను తీర్చుచుండిరి. (2-13) చలివేంద్రములు పెట్టి పథికులకు నిదాఘకాలమందు ప్రపాపాలికలు ప్రచురించుచుండిరి. (2-61) రాజులు ధనికులు ధర్మకార్యములను శాసనాల ద్వారా ప్రకటించుకొనుచుండిరి. (3-32) గ్రామములందు అగ్ని ప్రమాదములు జరిగినపుడు స్త్రీ పురుషులు బావి వద్ద నుండి బారులు తీరి చేతుల యంచెలపై కడవలందించి యగ్నినార్పుచుండిరి. (3-29) జనులు మర్రి యాకులను విస్తళ్ళుగా కుట్టి యందు భుజించుచుండిరి. బాటసారులు విశేషముగానట్లు చేసెడివారు. కాని కాకి మున్నగు పక్షుల రెట్టకలిగిన మర్రి యాకులను వాడకుండిరి. (2-66) పెద్దవారి యాగమనమున వారి యడుగులకు మడుగులొత్తు చుండిరి. వారింటికి రాగానే రెండు కలశములతో కాలు మొగము కడుగుకొన నీరిచ్చుచుండిరి.

(2-40)

పంటలు


వరిచేలు, జనుపచేలు విరివిగా నుండెను.
“పండి తెల్లబారు వరితోటలను జూచి
యేల మొగము వంచి యేడ్చెదమ్మ
చూడు, జనుపచేను సొగసయ్యె హరిదళం
బలదుకొన్న యాటవెలది వోలె” (1-4)


(రహస్య సంకేతస్థానముగా వరికి మారు జనుపచేను సిద్ధమైనదని విలాసినికి ధైర్యము చెప్పుట).

నువ్వులు కూడా పండించుచుండిరి. (1-3) మరికొన్ని తావులందు (బహుశా మహారాష్ట్ర ప్రాంతమందు) యవలు పండించుచుండిరి. వాటి కడవిపందుల బాధ యుండెను (5-3) సెనగలు కూడా పండించుచుండిరి. (6-57) ఆముదము లేక నూనెతో పత్తిని వెలిగించి దీపముగా వాడుచుండిరి. (3-64) వెలగపండ్లు, లడ్లు జనులకు ప్రీతిగా నుండెను. (7-41) ఓడిపట్టి దుర్దినములైనప్పుడు నిష్ఠాపరులు జ్యోతిశ్శాస్త్ర ప్రకారము గుణించుచుండిరి (5-35; పై ఈ శ్లోకమునందలి వ్యాఖ్యను జ్యోతిర్వేత్తలు చూచుకొనగలరు. ) “ప్రత్తిచేను దున్నవలసి మంచి దినాన మడకపూజలు సేయ” (2-65) యనుటచే ఏరువాక పున్నమ సూచితమవుచున్నది. నేటికినీ ఆంధ్రులు ఏరువాక నాడు మడకపూజ సేయుదురు. (ఏఱు=నాగలి).

వినోదములు

ఆనాటి జనుల వేడుకలో ముఖ్యమైనవి నాటకాలు. అవి యక్షగానాలా? లేక సంస్కృత ప్రాకృత నాటకాలా? గట్టిగా చెప్పజాలము. సంస్కృత మర్యాదలతో కూడిన ప్రాకృత నాటకాలై యుండినవో? సంస్కృతము మాతృభాష నుండి దేవభాషగా హాలుని కనేక శతాబ్దములకు ముందే మారియుండెను. జనులకు వివిధ ప్రాకృతములు మాతృభాషలయ్యెను. కావున జనసామాన్యాని కాహ్లాదము నిచ్చునవి ప్రాకృత నాటకాలేయై యుండును. ఆ నాటకాలకును యక్షగానాల వాసన గోదావరీ ప్రాంతాలలో నుండియుండును. ఆనాటి నుండి యీ శతాబ్దివరకు నాటకాలాడువారు ముఖములకు అర్థళము (హరిదళము- హరితాళము) పూసుకొనుచుండిరి. స్త్రీల పాత్రలను భోగము పడుచులు వేయుచుండిరా యను భ్రమ “హరిదళంబలదుకొన్న యాటవెలది వోలె” యను శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి అనువాదము నుండి కలుగును. కాని మూలమందు “నటి” వలె యనియే కలదు. “సురత నాటకము మనకు పూర్వరంగము” (4-44) అని యొకచో వర్ణించుటచేత రంగములు, పూర్వరంగము అను నాటక లక్షణములు పాటింపబడినవని యూహింప వీలుకలుగుతున్నది. మరొకతావున (4-51) నాట్య సూచన చేయబడినది.

గోడల మీద చిత్తరువులు వ్రాయించుకొనుచుండిరని తెలిపినాను. మరొకటి కనుడు.


మలినచిత్తుడైన మరదికి నిల్లాలు
గోడమీద వ్రాసికొన్న యట్టి
రాము వెంట దిరుగు సౌమిత్ర చరితంబు
చిన్న నవ్వుదోప జెప్పిచూపు. (1-35)


సమిష్టి కుటుంబాలలో నందందు రావణాంశజులుండుట చిత్రము కాదు. అందు నొక కవి మరల ఇట్లనెను.


చెడ్డ మనసు కలిగి యడ్డాడు మరది బా
ధలను దెగువగల్గు దయితుతోడ
చెప్పదింటి బ్రతుకు చెడునంచు మదిలోన
యడచి నవయు కోడలార్యశీల. (1-59)


“బ్రతుకు బొంగరంబు వంటిది” (5-6) అని తెలుగుసేతలో కలదు కాని మూలమందు 'చలం జీవనం' అని కలదు. జీవనము శాశ్వతము కాదు అని యర్థమే యనుకొందును. కుండల పోత మోటకూడ నాకాలమందుండెను. దానిని సంస్కృతంలో ఘట యంత్రమనిరి. దానినే “రహట్టఘటక'యనిరి. నేడును 'రహట్‌' మోట యంత్రమును గురించి ప్రకటించుటను గమనించుతున్నాము.

“రిక్తా నమంతి సుచిరం రహట్ట ఘటకా ఇవే హకాపురుషా!” రహట్టపై భట్టశ్రీగారిట్లు వ్యాఖ్యానించారు. “రహట్టో ఘటయంత్రం... ఉదకం లబ్ధ్వాయధా ఘటికా ఊర్ధ్వముఖాభవంతి తథా దుర్జనా అపిస్వల్ప లాభ ఏవదర్పేణ మస్తకమున్న యంతి”. పాచికల యాట బహు ప్రాచీనమైనది. కాయలను నడుపు నప్పుడిండ్లకు దుగ, తిగ, చౌ, పంచ, బద్రికాది సంకేత పదములుండెను. తురకలు వచ్చిన తరువాత వాటి స్థానంలో ఉర్దూ పేర్లేర్పడెను. దస్‌, పచ్చీస్‌, తీస్‌, బారా, చెక్కా అను సంకేతాలు మన యిండ్లలో మన స్త్రీల వాడుకకు వచ్చెను. ఈనాడీ యాటను “పచ్చీసాట” యంటున్నారు. హాలుడిట్లు దానిని వర్ణించెను.


“శునక ప్రచురే గ్రామే భ్రామయంతి తవకృతేన సా బాలా
పాశకశారీవ గృహంగృహేణ భాదిష్యతే కదాప్యంగ” (2-38)


దూతి విటునితో ఇట్లనెను. ఓయీ నీ కొర కావన్నెలాడి ఊరునం గండు కుక్కలున్నను లెక్కపెట్టక పచ్చీసు కాయవలె ఇల్లిల్లు తిరుగుచున్నది. పాశకశారిపై భట్ట శ్రీగారిట్లు వ్యాఖ్యానించిరి. “షతు ష్పటీగుటికా ద్యూత ఘటికా యధాద్యూత ఫ్టస్యప్రతి గేహం భ్రామ్యతి తథాగృహేణ గృహేణ గృహం భ్రామ్యతీ సా బాలా.”

ఉత్ఫల్లికా క్రీడ నొకచో వర్ణించినారు (2-96) అదెట్టిదో యర్థము కాలేదు. “ఉత్థానంశ యానస్య పాద యోరు పవిష్టానాం బాలానాం ముహుః పతనోత్పతన రూపాక్రీడా ఉత్పల్లి కేత్యాఖ్యాయే” టీకాకారులన్నారు.

- సుజాత (15 ఏప్రిల్‌ 1951)

కవితా ప్రాశస్త్యము

గాథా సప్తశతిలోని కవిత యసాధారణమైనది. విశ్వ వాఙ్మయములో దీని యనుకరణములే కలవు కాని ఇట్టిది మరొకటి లేదు. దీనినుండి భావములను విరివిగా గ్రహించిన అమరు శ్లోకాలకు “అమరు కవేరః శ్లోకః ప్రబంధ శతాయతే” అన్న కీర్తి కలిగినపుడు అమరు మాతృకయగు నీ గాథాసప్తశతి నేమనవలెను. గాథా సప్తశతిలోని నాయికా నాయకులు, దూతీచేటికలు, అత్తకోడండ్రు, గ్రామణి గ్రామీణులు జొన్న జనుప, నువ్వు, వరి, పెరిగిన పొలాలో చేసిన దుడుకులను, నర్మ గర్భముగా పదుగురికొక యర్థంగా తమ యిద్దరికొక యర్థంగా నుండు సంకేతములను చెప్పుకొనుటలను, నదీతీరాలలోని చాటు మాటు దాటులను, వన్నెలాడుల వయ్యారపు విహారములను, విలాసినిల చూపులోని మూగ పలుకరింతను, పథిక విటులలోని ఇంగితములను గ్రహించు మితిమీరిన చురుకు దనమును, సవతుల సహింపులేని తాకట్లను, మనము చిరునవ్వులతో మన్నింపవలెను. అందలి కవిత మనకెట్లాదేశిం చినది. ఉత్తమ టాకీలోని ప్రేమగాథలలో నటించిన వ్యక్తులను చూచి వచ్చిన తర్వాత మన భావాంబరముపై నవి పలుమారెట్టు పునర్నాట్యము చేయునో యటులే 200 ఏండ్ల క్రిందట గోదావరి తీరములోనూ, పల్లె ప్రాంతములందునూ, చెరువు చెట్ల దాపులందును, శృంగార విలాసములతో కాలము గడిపిపోయిన యువతీయువకు లీనాడును నేనాడును గాథలను తిరుగ వేసినప్పుడంతయు మన మనోనాటక రంగమందు టికెటులేని నాటకములాడి మనల గిలిగింతలు పెట్టి మనకు బ్రహ్మంగారిని చూపి (ఆనందోబ్రహ్మ) వెడలి పోవుచుందురు.

గాథలోని కవిత, కవితలోని యసాధారణత, భాష, భాషలోని సౌకుమార్యము భావము, భావములో గంభీరత, ఛలోక్తులు, ఛలోక్తులలోని చందన స్పర్శ, మాయా మర్మములు లేనట్లుగా భాసించు ముగుద ముద్దుగుమ్మలముచ్చట్లలో దాగిన సుందర సుకుమార నర్మగర్భితములు, ఎన్నని చెప్పవలెను, శృంగార లోకమంతయు సప్తశతీ గీతములలో పంచాక్షరిలో శివునివలె చక్కగా నిమిడి యున్నదనిన కొంతకు కొంత వక్తయొక్క యభిప్రాయము వెల్లడి కాగలిగి నట్లనవచ్చును.

700 గాథలలో అన్నియు నుత్తమములనుటయు లేదు. కాని అందలి పనికి రాని గీతాలన్నియును బహు ప్రబంధాలలోని బహువర్ణనలకన్న రమ్యమైనవే యని నేననుకొందును. శ్రీ రాళ్ళపల్లి శర్మగారి భావములో 700లో 395 గాథలుత్తమమైనవి. కాని నా యభిప్రాయములో ఇంచుమించు మరి 50-60 ఉత్తమ పద్యాలను వారు చిన్నచూపుతో చూచినారు. మొత్తముపై (500) పద్యాలు సప్తశతిలోనివి అత్యంతానంద సంధాయకములు, వీటిలోని ప్రాశస్త్యమును ఎత్తి చూపవలెనన్న నన్నిటిగురించి తనివితీర వ్యాఖ్యానించుటయే సమంజసమగు కార్యము. అదికాని పని కాన మాసరకు (నమోనాకు) కొన్నింటి మాత్రమెత్తి చూపిన స్థాలీపులాక న్యాయ నిదర్శనమగును.


“బిసిసీ పత్రి నిశ్చల నిస్సందా పశ్య రాజతి బలాకా
నిర్మల మరకతభాజన పరిస్థితాశంఖుక్తిరివ (1-4)


దీనిని శ్రీ శర్మగారు తెనుగింపలేదు. పల్లవనాయికా నాయకులకొక సరస్తీరము సంకేతఘటనా ప్రదేశముగా నేర్పాటై యుండెను. కాని యందొకరు వచ్చి కాచుకొని ఇంకొకరు రానందున విసుగుకొని పోయి మరల పదిమందిలో రాని వ్యక్తిని చూచి తమ బాస తమకే పూర్ణార్థమిచ్చునట్లుగా నీ గాథ బహువిధ బావముల వెల్లడిస్తున్నది. ఎట్లనగా. “చూచితివా! కమల పత్రముపై కొంగ నిశ్చలముగా చకితము కాకుండా నిలిచినది. శుభ్రమైన మరకతపు తట్టలో శంఖముంచినట్లుగా నాబలాక యున్నది.”

పై గీతములో మరేమి లేకున్నను ఉత్తమోపమాన మున్నందున నంత మాత్రకే యది రమ్యమైనది. కాని యొక విశేషమున్నది. కొంగలు అందులో పెంటివి మెలకువ కలవి. అచ్చట యేమైన ఆకుల చప్పుడు కాని, మనిషి కాలిచప్పుడు కాని వినిన నిశ్చలముగా నిస్సందముగానే యుండును. కావున ఆ సంకేతస్థానము అత్యంత నిర్జన ప్రదేశమని ప్రియులలో నొకరింకొకరితో తెలుపుదురు. అనగా ఆ చెరువు వద్ద ఆ కమలముల సమృద్ధి కల ప్రదేశమున్నది కదా! అచ్చట మనుష్య సంచారము లేదు అది మన యేకాంతమునకద్భుత సంఘటనాస్థానము.

ఇంతేకాదు. మరొక విశేషమున్నది. ప్రియులతో నొకరిట్లనుచున్నారు. “నీవు నాకన్న ముందాగురుతుగల చోటికి పోయి నేను రాలేదని తిరిగిపోతివన్న మాట పూర్తిగా కల్ల.

నీ పలుకు చొప్పున నీవే ముందుపోయి వచ్చి యుండి తర్వాత నేను పోయినప్పుడు మనుష్య సంచారమును వినిన జూచిన బలాక అంతనిర్మల నిస్సందగా నేలయుండును. దానిలో చకితత్వలక్షణమే కానరాదు. దాని నిశ్చలతయే నీ మాటలు దుబ్బరలని సాక్ష్యమిచ్చునది.

అంతేకాదు. ఇంకొక విశేషమున్నది. నీవు నాకన్న ముందుగా పోయినది కల్ల నేను ముందుగా పోయియుంటిని. అది కొంగ యొక్క నిశ్చలతవల్ల తెలుస్తున్నది” తిరిగి వచ్చితినని సమాధానము.

ఇంతటితో కథ ముగియలేదు. ప్రియాప్రియులు సంకేతస్థానమందు కలియనే కలిసినారు. అప్పుడు ఒకరింకొకరితో సంభోగ కాలమందిన పద్యమిది. ఎందుకనగా (మరుగునకై సంస్కృత ప్రమాణమునుదాహరించి వదలుదును).


“కల్లోలినీ కాననకందరాదౌ దుఃఖాశ్రయే చార్పిత చిత్తవృత్తిః
మృదుక్రమారంభమభిన్నదధైర్యః శ్లథోపిదీర్ఘం రమతే రతేషు”


ఈ చిన్నగాథలో ఈ రెండు పంక్తులలోనే ఇన్ని కథలిమిడియున్నవి. “ఏకఃశ్లోకః

ప్రబంధశతాయతే” అని యూరకే అన్నారామరి? మరొకటి చిత్తగించవలెను.


'మగని పయనమన్న మాటెవ్వడాడెనో
వానిమనసుపాడుగాను; తాను
విన్న మొదలు విసముగొన్నట్లు కోడలి
యవయవంబు లెల్ల నయవసాగె (2-11)


సవతిని నిందపాలు చేయుటకో లేక యున్నంత తెలుపుటకో దాని సవతి పై విధముగానన్నది. సవతి జారుడు పనిపై ప్రవాసము వెళ్ళుచున్నాడని దానికెట్లో తెలియకుండునా. తెలియనే తెలిసినదమ్మా! ఇక చూడు, అప్పటినుండి మొగము చిట్లించుకొని రుసరుసమని ఇంటి పనులన్నియు అడ్డదిడ్డిగా చెడజేయుచున్నది. దానికావార్త విసమునాకినట్లు కసిబిసియైనది. ఇంత విచ్చలవిడి తగునమ్మా? అని సవతి పోరొకదిక్కు

దీనికింకొక కథ కూడ సాధ్యమైనది. ఏమనగా - పతి ప్రవాస మందున్నందున ఆ సుందరిని నాకు కూర్పుమని యెకలంపటవిటుడు తార్పుకత్తెను విచారింపగా నాదూతి యిట్లంటున్నది. “వయ్యారపు అయ్యవారూ! ఆ యువతి పతి వియోగముచే దుఃఖతయై యింటి పనులే చేయనొల్లదే, అంతటి పతిదత్తమానస నీకు చిక్కునా? అది వ్యర్థ ప్రయత్నము” అని మందలించుట యిందు ద్యోతకమైనది.

అయితే మరొక విస్పష్టభావము పైననే కానవస్తున్నది. అత్తగారు తానెంతగా గట్టిగా కోడలి నెత్తిన మిరియాలు నూరినను, తన కొడుకు ప్రవాసమున కేగనున్నాడని కన్నకడుపు కావున తానాయసపడినదై తన కోడలి విరహతాపముపై కరుణ కలిగి ఇరుగుపొరుగు అమ్మలక్కలతో వెల్లడించుకొను వరకు మనసు పట్టలేకపోయినది. అత్త యిట్లన్నది. “నా కోడలికి దాని మగని ప్రవాస వార్త యెవరు చెప్పిరో యేమోనమ్మా విన్నప్పటినుండి మొగమింత చేసుకొని యింటిపనులన్నీ ముట్టక దుఃఖముతో బాధపడుతుందమ్మా- నా కోడలు!”


మరొక గీతమును తిలకించండి.

“ముద్దు కొడుకు మొదట మొలచిన పలుదోయి
గొరికి కొరికి కాటు వరిచెనిదిగొ
రేగుపండు గంటిరే! యని పెండ్లాము
నగుచు దెచ్చి పెట్టె మగనిచేత. (2-100)

ఆముక్తమాల్యదలో పై యభిప్రాయము నిచ్చు నీ క్రింది పద్యము మొదట

మనకు మతికి వచ్చును.


తన యుదరంబునం బొడమి తామ్రరుచిచ్చట లుల్లసిల్ల గో,
ల్కొనుధరణీజ సంతతికింగోరక దంతములించుకంత, ని
క్కినయది యాదిగాగ జెలగెన్‌ వనలక్ష్మి కడుంజెలంగగా
జను బ్రియుడైన మాధవుని సంగతిమీదట జాల గల్గుటన్‌.

ఆము. (5-116)


ప్రసవానంతరము కన్న శిశువునకు తొలి రెండు పండ్లు మొలచిన తర్వాత భార్యాభర్తల పునస్సమాగమ కాలమని హిందువులలో శిష్టాచారమైనది. ఒక యిల్లాలు తాను పతి సంభోగ సుఖానుభవ యోగ్యతను పొందినదని తన పతికి సుకుమారముగా నెచ్చరిస్తున్నది. దానికి సాక్ష్యమేమి? ఇదిగో పలుకాటుల పడిన రేగుపండు. అదెక్కడున్నది. ఇదిగో యిప్పుడే నీ చేత నుంచుచున్నాను. అయితే భార్య “ప్రహసిత వదన”గా రేగుపండును తన భర్త సేత నెందుకుంచెను? అది అనుమానానికి తావిచ్చునని సరస్వతీ కంఠాభరణమందు “వికసితనయనా” యని కలదు. అప్పుడు భావము సుందర తరమగును. కాని ప్రహసిత వదనయను పదముపై తృతీయ పంథగా వ్యాఖ్యలు చేయునలవాటు పడిన గంగాధరుడిట్లంటున్నాడు. “యువతి కుమారునికి పండ్లు వచ్చువరకు తాళజాలనిదై తానే దంత యుగళాంకితము చేసి రేగుపంటిని భర్తకిచ్చినది. అందుచేతనే మగడు నమ్మడని ప్రహసిత వదనయైనది” ఇదే ధోరణిలో నాలోచించిన మనమింకను నిట్లన వచ్చును. ప్రత్యక్ష ప్రమాణముండగా అనుమాన ప్రమాణమేల? చిట్టివాని కొత్త చిరుపండ్లు చూడుమాయని శిశువు నోట భర్త వ్రేలిని పెట్టించి కొరికించి తామును నవ్వవచ్చును. శిశువునూ నవ్వించవచ్చును. అట్లు చేయక పిల్లవానిపండ్లు చూపించక రేగుపండుపై కాట్లను చూపింపనవసరమేమి? ఇది ఇట్లుండనిండు. రేగుపండునే కొరికించి చూపనేల? వేరు మెత్తని చిన్నపండు - ద్రాక్షవంటిది బాగుండదా? నాకిట్లు తోచినది. రేగుపండు వసంతాగమ కాలమందు సమృద్ధి. అందుచే కవి దానిని సూచించెనేమో. మరియు ఇతర భారతీయులలో యే ప్రాంతమందు కలదో లేదో కాని తెనుగునాటనొక యాచారము కలదు. సంక్రాంతి పండుగనాడు ఏడాదిలోపలి శిశువులను కూర్చొనబెట్టి వారి తలలపై నుండి రేగుపండ్లను దిగబోసి యాపండ్లను బీదలకు పంచిపెట్టుదురు. అందుచే కవి రేగుపండునే తన గాథలో నుంచి యుండును. ప్రతిగాథకిన్ని కథలు! అన్నియు మనోహరములగు కథలే!


రమ్యమైనరూపు, రమణుడూరను లేడు;
పేదరికము; పెద్ద వీధినిల్లు;
పరువమైన వయస్సు; పొరుగింటిచెలి జార;
యైన నౌర! చెడదు చాన; చూడు. (1-36)


స్త్రీ చెడుటకు కావలసిన అంగములన్నియు సిద్ధమే కాని “చెడదు చాన చూడు” ఇదెవ్వరో పెద్దలన్న మాటగా భాసించును. లేదా కళంకకారణాభిశంకచే జనులు వృథాగా నన్ను నిందింతురు. నాకు చరిత్ర దోషము లేదు అని నిజదోష గోపనము చేసికొనుచు నొక కులట పలికిన పలుకులనవచ్చును.


కొండ సెలయేటి సుడికి జిక్కుకొని కలగి
తిరుగుచును కేసరంబులు విరిగిపోవ
కొంత మునుగుచు తేలుచు గొదమితేటి
వెంటనంటి, కడిమిపూవు వెల్లబోయె. 4-837


కడిమి పువ్వు నీటి సుడిలో కొట్టుకొని పోతున్నది. దాని మధువు నీటపడిన వెంటనే క్షాళితమైనది. కాని, తుమ్మెద మాత్రము దాని వెంటనే పడినది. దీనివెనుక యెంత కరుణారసము దాగినదో చూడుడు. పువ్వుపై గల తమకము తుమ్మెద కెంత గొప్పది. “ఎన్ని పువ్వులన్‌ వ్రాలదుతేటి” అని తారాశశాంక కవి యన్నట్లుగా - ఆ పువ్వు కాక వేరే మంచి పూలు లేవా? ఆ తుమ్మెదకు? తేనె యేమియు లేదు, పువ్వు నలిగినది. కొన్ని రేకులు విరిగినవి, సంపూర్ణ శైథిల్యమిప్పుడో అప్పుడో! మరి దానితో నేమి పని. నీచులే ద్రోహులై యుందురు. తుమ్మెదనైన చూచి మనుష్యులు బుద్దితెచ్చుకొనరాదా? తాననుభవించిన స్త్రీ బిగువు సడలగా తిరిగి చూడని ప్రియులను గూర్చి యీ సంభోదన.


వల నడుమను సాగిన పో
గులలో మీగాళ్ళు దవులుకొన సాలీడిం
పలరె, కనరాని దార
మ్ముల గూర్చిన యొంటి పొగడపువువలె గంటే! 1-63

ఉపమానము బహుసుందరము. పొగడపువ్వును చూడనివా రీకాలంలో

చాలామంది! చూచిన వారికి దీనిని సాలెపురుగుతో నుపమించుట యానందమిచ్చును. కాని మరొక కథయిందు దాగినది. ఒంటి సాలీడు. ఇంటిలో తాను తప్ప మరెవ్వరు లేరు. అందుచేతనే సాలీడింటి నిండుగా వలనల్లినాడు. “అత ఏవ సురుచిరం రతోత్పవో౽నుభూయతాం ఇత్యర్థోధ్వన్యతే. అందుచే నిర్భయముగా ఆనందింప వచ్చునని హెచ్చరిక!


లోభివాని చేతిలో సిరియెంతగా
వెలయుచున్న సుంతఫలము లేదు
తెరువునడుచు వేళ కరకు వేసవియెండ
మాడువానికి నీడవోలె.... 2-36


ఇది మంచినీతియే! అందులోను మంచి యుపమానముతో గూడిన నీతియే! ఒకదూతి లోభివిటునికి చల్లగా మెల్లగా సూచించినది. నీవు విరివిగా ధనమును వ్యయించకున్న ఆ సుందరి లభింపదు! ఈ దూతియు ఊరక రాయబారులు జరుపజాలదు!!


ఊర గొడుకు లేక యుండగ కోడలు
వచ్చి కాళ్ళు మ్రొక్క వంగినపుడు
గాజులెల్ల జారగా జూచి కడు గోప
కత్తె యయ్యు నేడ్చె నత్తగారు. 5-93


మూలములో వలయద్వయమని కలదు. చేతికొక్కొక గాజుండ ననవలెను. కాని తెనుగు సేతలో గాజులెల్ల అన్నారు. రెండు గాజులేమి! గాజులన్నియు జారినవని వారి యభిప్రాయమై యుండును! కృశించి కృశించి సన్నగిల్లుటవలన గాజులెప్పుడో జారిపడి పగిలిపోగా సౌభాగ్య చిహ్నముగా రెంటి నా సౌభాగ్యవతి మగనిమీద ప్రాణము నిలుపుకొన్నట్టిది. ఎటులో నిలుపుకొన్నది. ఆ యవస్థను కోపగత్తెయగు నత్త యెందుకు చూచును? ఏదో నిమిత్త కారణముగా తనను మ్రొక్కవచ్చినపుడు బాగుగా సన్నగిల్లిన చేతుల చూడగలిగినది. అప్పుడైనను కోడలిపై కరుణగలిగినదో లేదో? తన కొడుకు జ్ఞాపకము వచ్చి వాని బహుకాల ప్రవాసమును తలచుకొని యేడ్చియుండును. ఒక యేకాంకికకు కావలసినంత కరుణారసమిందున్నది. కాని రసభంగము చేయదలచిన యొక వ్యాఖ్యాత యిట్లన్వయించినాడు. అంతటి యాప్రేమ యాకాంతకు తన ప్రియ భర్తపై నుండగా నామెను విటుడు కోరుట వ్యర్థమని దూతీ సూచనయట! లేదా యామె భర్తతో ఏమయ్యా! నీవు లేనందున కృశించి చావసిద్ధంగానున్న నీ భార్యను గూడ కెందుకాలస్యము చేసెదవు అని యతని భార్య యొక్క దయనీయస్థితిని యతనితల్లి దుఃఖమును ఎందరో మిత్రులు తెలిపిరని వ్యాఖ్యానింపవచ్చును.

ఇంచుమించు ప్రతి పద్యము అమృతఝరియై (అమృతం ప్రాకృత కావ్యం 1-2) కామతత్వ చింతామణియై (కామస్యతత్త్వ చింతాం1-2) స్వభావ రమణీయమై (7-101) రసిక జన హృదయదయితై (1-101) అమృతమును కూడ నిరాకరింప జేయు మాధుర్యము కలదై (మధురత్వే నామృతమ ప్రియచ్ఛృత్వానోలగతిహ్రదయే (4-101) నానాలంకార లలితమై (1-3) ధ్వని ప్రధానమై సంతతాహ్లాద కారియై, గంభీర భావ పరంపరా సంపూరితమై రస సిద్ధుల పూర్ణ చంద్రోదయ ఘటికయై శ్లాఘాపాత్ర మైనట్టి గాథా సప్తశతి భారతీయ సాహిత్య రత్నములలో కొహినూర్‌! గాథలో కూర్చిన హాలుని రాజ్యమెన్నడో పోయెను. కాని యతని కావ్య సామ్రాజ్యమునకు కొట్టుబాటు లేదు. దానికి నిత్యనూత్నత కలదు. సుకవితా యద్యస్తి రాజ్యేనకిం?

ఇట్టిగాథలలో నూరింటి నేరి వ్యాఖ్యానించిన సర్వజ్ఞ చక్రవర్తి పెదకోమటి వేమభూపాలుని వ్యాఖ్య యేది? ఇంచుమించిరువది పండితులు వ్రాసిన వ్యాఖ్యానాలేవీ? ఈ గాథలకు తెలుగు వ్యాఖ్యలను వ్రాసి ఉత్తమ పీఠికను చేర్చి ముద్రించుట అవసరము. ఈ సప్తశతిని రసికులందరును చదివి యానందింతురు గాక.


సంధ్యోపాత్త జలాంజలి బింబిత గౌరీముఖాంబురుహం
స్ఫురితాధరం ముధైవహి విగళిత మంత్రం హరీం నమత. 7-100

సంధ్య వార్పగ దోసిట జలమువట్టి
నపుడు గౌరీముఖాంబుజ మందుదోప
మంత్రమంతయు నొకమారు మరచినట్టి
మోవిని గదుల్చు శివునకు మ్రొక్కులిడుదు.

శివునికి పట్టిన గతియే సప్తశతీ పాఠకులందరికిని పట్టుగాక!
                                                          సుజాత. (15 మే 1951)


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse