Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణ

వికీసోర్స్ నుండి

ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణము

గోలకొండ రాజ్యము నేలిన ఖుతుబుషాహీ ప్రభువులు గాఢమైన స్వమతాభిమానులే కాని బహమనీ సుల్తానులవలె పరమత ధ్వంసకులు కారు. రాజ్యకాంక్ష బాగా కలిగినవారే కాని బహమనీలవలె రక్తపిపాసులు కారు. స్వభాషను మాత్రమే వీరు బహమనీలవలె ప్రేమించినవారు. దక్షిణ దేశమందు శిశుప్రాయమై యున్న ఉర్దూకు వీరు అవలంబన మిచ్చి పోషించిరి. ఈ ఖుతుబుషాహీలు స్వయముగా ఉర్దూ కవనమల్లిరి. పైగా తాము విశేషముగా తెలుగు దేశమును పాలించిన వారగుటచేత తెలుగును కూడా పోషించిరి. తమ సనదులను పార్శీలో వ్రాయించి యిచ్చుచు ఆ విషయములనే తెలుగులో వ్రాయించి ఇచ్చిరి. తెనుగు మండలములలో తెనుగు ద్వారానే రాజ్య వ్యవహారములను సాగించిరి.

మొదటి ఖుతుబుషా చిన్న కుమారుడును మూడవ గోల్కొండ సుల్తాను అగు ఇబ్రహీం ఖుతుబుషా ఏడేండ్లపాటు విజయనగరమందుండి తెనుగు బాగా నేర్చుకొనెను. తాను గోలకొండ సుల్తాను అయిన తరువాత విజయనగరమును నాశనము చేయుటకు ముఖ్య కారకుడయ్యెను. విజయనగర చక్రవర్తియగు అళియ రామరాజుకు దత్తపుత్రుడుగా స్వయంగా ఏర్పడిన అహమద్‌నగర్‌ సుల్తాను అగు అలీ ఆదిల్షాయును రామరాజుచే ఏడేండ్లు స్వపుత్రునివలె రక్షింపబడిన గోలకొండ ఇబ్రహీమును రామరాజును తళ్ళికోట యుద్ధములో చంపి విజయనగరమును భస్మము చేసి తుంగభద్రలో కడిగి వేసిరి. ప్రపంచంలో కని వినీ ఎరుగని ఉపకారమంటే ఇదొక్కటే యుండవచ్చును. ఈ విధంగా ఇబ్రహీము ఆంధ్రులకు క్షమింపరాని అపకారము చేసినను అతని కొద్దిపాటి తిరిపపు ఆదరణమును మాత్రము ఆంధ్రులు మరువ లేకపోయిరి. ఇదింకొక విచిత్రమగు కృతజ్ఞత. ఇబ్రహీం పేరునే మార్చి ఇభరామును చేసిరి. అతడు ఆంధ్రుల కందరికీ అభిరాముడయ్యెను. “మల్కిభరాముడు” ఆంధ్రమును బాగా ఎరిగి యుండెను. సలక్షణముగా మాట్లాడుచుండెను. కవుల శ్రావ్యమగు కవితా ధారా సుధారసమును కుత్తుక బంటిగా గ్రోలెను. తన్మయుడై తల ఆడించెను. ఆవేశపరుడై అడ్డా దిడ్డగా తెనుగు కవనమును స్వయముగా అల్లెను. రమ్ము పొమ్మని కవులతో సరసమాడెను. అద్దంకి గంగాధర కవిని పిలిపించి తపతీ సంవరణోపాఖ్యానమును వ్రాయించి కృతినందెను. అల్లాకాని రసులల్లా కాని ఇబ్రహీం సుల్తానును రక్షించి పోషించుగాక అని అద్దంకి దీవించలేదు. “శౌరి ఘనుడై కరుణారసవృష్టిచే నిరాయాసత బ్రోచుగావుత నృపాగ్ర... మాల్కిభరాము శాందిపున్‌” అని దీవించెను. ఇబ్రహీము అందులకు సంతసించి గంగాధరునితో నిట్లనెను.


“పెక్కు కృతుల్‌ చమత్కృతులు బెంపుగ నందితిగాని స
మ్యక్కృతి కన్యపైగల మమత్వము... వర్తింపదు”


ఇట్లని తపతీ సంవరణోపాఖ్యానమను పౌరాణిక గాథను కృతి పొందెను. సుల్తాను ఆంధ్రభాషను పోషించినది చూచి అతని సేనలో గొప్పయధికారియై యుండిన అమీన్‌ ఖాన్‌ గూడ ఒక కృతిని అందెను.


పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్రము అను అచ్చతెనుగు కావ్యమును రచించి అమీన్‌ఖానున కంకితమిచ్చెను. తెనుగు వాఙ్మయములో ఇదే మొదటి అచ్చ తెనుగుకృతి. అమీన్‌ఖాను కూడ మంచి సరసుడు. ఎన్నియో తరాల నుండి గోలకొండకు 20 మైళ్ళ దూరములోనున్న పొట్ల చెరువులో అతని పూర్వీకులు నివసించియుండిరి. అతని కుటుంబము హిందువులను ప్రేమించి ఆదరించుచుండెను. అతడు చిన్న దర్బారు చేసి “దీవులేలు బలియులు రౌతుల్‌ మొదల్గా దను గొలువన్‌ సంతసమంది కబ్బములు పేర్కావించు” ఆనందించుచుండెడివాడు. అతనికి ముఖ్య సచివుడు మరింగంటి అప్పన్న అను ఆంధ్రుడు. అమీన్‌ఖాను ఏమాత్రమున్నూ మతద్వేష మేకోశములోను లేనివాడు. పైగా హిందువులను తనవారివలె ప్రేమించువాడు.


“కడక నమీనుఖానుడు జగంబు తనుం బొగడంగ వేడ్కతో
విడువక యెప్పుడుం బుడమి వేల్పుల బిడ్డల పెండ్లిచేయు”.


అమీనుఖానునికి ముగ్గురు భార్యలు. అందరును ఉత్తమ పతివ్రతలు. పొట్లచెరువులోని జనులందరికిని చల్లని తల్లులు. అందు బడేబీబీ అను పెద్ద భార్య

సాక్షాత్తు అన్నపూర్ణాదేవియే!


“అత్తవారిండ్లకు నరుగు కన్నియలకు
        కట్నంబు లిచ్చుచు గారవించు,
ప్రొద్దు ప్రొద్దుననె యెప్పుడు లేచి వాడల
        పసి బిడ్డలకునెల్ల పాలుబోయు,
ఆ కొన్న వారల కద్దమి రేయైన
        ఆరగించబెట్టు నరసి యరసి
పాలునీరెనసిన బాగుగా పెనిమిటి
        తలపులో మెలకువ మెలగ నేర్చు

ఔర తన పుట్టినింటికి నత్తవారి
యింటికిని వన్నెదెచ్చిన తుంటవిల్తు
తల్లివంటి బడేబీబీ దరమె పొగడ
తమ్మి పూమీద నెలకొన్న దంటకైన”


ఒక ముసల్మాన్‌ స్త్రీ ఆ కాలములో హిందువులపై అంతటి, ఇంతటి అభిమానము చూపుట అసామాన్యమైన విశిష్టగుణమనవలెను.


అంతకు నూరేండ్ల క్రిందటనే బహమనీ సుల్తాను ఒక్క ముసల్మాను ప్రాణానికి ఒక లక్ష హిందువుల ప్రాణాలను తీసుకుంటాను, ఇదే మా మతాచారము అని చెప్పియుండెను. మహమూదుషా బహమనీ ఒక లక్ష హిందువులను చంపేవరకు అన్నము తినక పోయెను. అట్టి కాలములో అమీన్‌ఖాన్‌, అతని భార్యయు హిందువులను ప్రేమించినారంటే అది చాలా గొప్ప విషయము. అమీన్‌ఖాను బహుభాషావేత్త, అతని తమ్ముడు.


“అరబీ, పారసీ, గుజరాతీ, ఆరే, అచ్చ తెలుగు, కన్నోజి మొదలుగా గలవి తెలిసి వ్రాయదారి కన్నట్టి వాడు గతాత ఖాను”. ఇతడు,


“యిభరము శాహు చేపట్టె యనుంగుగా
నడుపబాయక మూడు తరాల నుండి కన్పట్టు అమీనుఖానుడు”

ఖుతుబుషా వంశము వారు తెనుగు దేశములో చెరువులు కట్టించిరి. అనేక

గ్రామాలను నిర్మించిరి. ఇతర ప్రాంతాల నుండి సమర్ధులను పిలిపించి, వారికి జాగీరులిచ్చి క్రొత్త గ్రామాలను స్థాపింపచేసిరి. అట్టివారిలో దోమకొండ ప్రభువుల పూర్వీకులు ముఖ్యులు. రాజా మల్లారెడ్డి తన 'శివ ధర్మోత్తరమున' నిట్లు వ్రాసుకొనెను.


“ఘనుడా కాచనృపాల శేఖరుడు మున్‌ కర్ణాట రాజ్యంబు నం
దున దుర్గాధిపతిత్వ వైభవముతోడ్తో కాంచి సుల్తాను పి
ల్పున కృష్ణానది దాటి యా, మెదకు, బల్‌ దుర్గంబు క్రిందన్‌ జిరం
తనమౌ బిక్కనవోలునుండె నవి యాత్మస్థాన రాజంబుగన్‌”.


ఈ సంఘటన ఇబ్రహీం తర్వాతి వాడగు మహమ్మద్‌ కుతుబుషా కాలంలో అనగా 1612 క్రీ.శ.లోని మాట. ఆ మహమ్మద్‌ ఖుతుబుషా దోమకొండ పూర్వ ప్రభువులను చాలా గౌరవించెను.


“భవ్య సులతాను మహమదు పాదుషాహా
లబ్ధ భూషణ లలిత పల్యంకితాత
పత్ర చామర సామ్రాజ్య భరిత విభవ
రమ్య గుణశాలి శ్రీ కామరడ్డి మౌళి”.


రాజా మల్లారెడ్డి గొప్ప కవి. సంస్కృతాంధ్రములందు అద్వితీయ పాండితీ ప్రతిభను తన కవనమందు ప్రకాశింపజేసినాడు. అతడొక చాటువులో తాను ఖుతుబుషా ప్రభువుల కాస్థాన కవినని చెప్పుకొనెను. మల్లారెడ్డి సమకాలికుడైన గణనాథ కవి యను నతడు గొప్ప “సత్కవి” యనియు, అతని తండ్రి పండిత వరేణ్యుడనియు మల్లారెడ్డి తన పద్మ పురాణములో వ్రాసినాడు. అట్టి గణనాథ కవి ఖుతుబుషా (అనగా 1617లో) ఆస్థాన కవిగా నుండెననియు తెలిపియున్నాడు.


“ధీనిధి, సాహితీయుతు, ప్రతీతయశున్‌ కుతుపావనీశ్వరా
స్థాన మహాకవీంద్రు, నిజ దర్శన కౌతుక వైభవాగతున్‌
శ్రీ నరసింహ పండిత వరేణ్యకుమారు గణేశధీరు స
మ్మానముతో నెదుర్కొని నమస్కృతి జేసి వసింప జేయుచున్‌”


ఇట్టి “మహా కవీంద్రుడైన” గణనాథ కవిని గురించి మనకింతకంటే ఎక్కువగా తెలియకపోవుట సంతాపకరము. అతడు “కుతుపావనీశ్వరాస్థాన కవీంద్రుడు”. కాని అతని గురించి మనమేమియు నెరుగజాలకున్నాము. మల్లారెడ్డి పుణ్యాన అతని పేరైన మనకు తెలిసినది. ఇదే మహమ్మద్‌ ఖుతుబుషా కాలములో గోలకొండ దుర్గములోనే సారంగుతమ్మయ అను గొప్ప కవియుండెను. అతడు సుల్తాన్‌ ఆశ్రయము కలిగినవాడేయని తానే తన వైజయంతీ విలాసములో ఇట్లు వ్రాసుకొనెను.


“ఇనసమతేజు తా నృపులనెల్ల మహమ్మదు షాహి యేలు నీ
యెనుబది నాల్గు దుర్గముల నేలిన యేలిక గోలకొండ, త
ద్ఘన నగరస్థలిన్‌ కరణికం బొనరించెడు తమ్మమంత్రి, యా
జనపతి రమ్ము పొమ్మన ప్రజల్‌ జయవెట్ట గృహస్థు తాననన్‌”


గోలకొండ నగరానికి సారంగుతమ్మయ్య కరణము కావున పాదుషాకీతనితో పనిబడుచుండెను. అట్లున్నను తమ్మయ్య తన దైవభక్తిచే తన కావ్యాన్ని శ్రీరామార్పణము చేసెను.


కందుకూరి రుద్రకవి వంశములో చాలామంది రుద్రకవి నామములుండిరని అందొక రుద్రకవి మల్కిభరాము (ఖుతుబుషా)చే 1480 శా.శ.లో రెంటచింతల పాలెము అను నగ్రహారమును పొందెదనియు వంగూరు సుబ్బారావుగారు శతక కవుల చరిత్రలో వ్రాసినారు. శ్రీ వంగూరి సుబ్బారావుగారు అదే చరిత్రలో మరొక చోట నిట్లు వ్రాసినారు -


ఏనుగు పెద లక్ష్మణకవి తన తుల్యామాహత్మ్యములో తన కృతిపతియగు వత్సవాయి తిమ్మరాజు పుత్రుడగు రాయ జగపతిరాజును గూర్చి యిట్లు వ్రాసెను.


“సుల్తానబ్దుల్‌ హసన్‌ కోటీశ్వరుని చేత మాటిమాటికి బహుమానమందె మరియు పింగలి మాదన్న భానుజీ మంత్రజ్ఞువలన సన్మానమందె అక్కన్న మొదలైన యట్టి పెద్దలచేత మేలు భూషణములు మెప్పులందె”


అక్కన్న మాదన్నలు సేవించినది అబ్దుల్‌ హసన్‌ పాదుషాను కాదు. వారు సేవించినది అబుల్‌ హసన్‌ తానీషాను. దీనిని బట్టి కుతుబుషాల సామంతులును తెనుగును బాగుగా పోషించిసట్లు నిదర్శనములు కనబడుచున్నవి.


కంచెర్ల గోపన్న అక్కన్న మాదన్నల మేనల్లుడని ప్రతీతి. భద్రాచల ప్రాంతమందలి నేలకొండపల్లి గ్రామనివాసి. అతడే ప్రసిద్ధ రామదాసు. అతడు గొప్ప కవి. రామభక్తుడు. భద్రాచల తహసీల్దారుగా నియుక్తుడై వసూలైన పన్నును దేవాలయానికి వినియోగించి బందీకృతుడయ్యెను. అబుల్‌ హసన్‌ తానీషాకు మంత్రి అక్కన్న. అతడే ఈ దక్కన్‌ రాజ్యములోని తుది ఆంధ్ర మంత్రి. నాటి నేటివరకు మరల ఆంధ్రులు తలయెత్తలేదు. అక్కన్న మాదన్నలు తెనాలి రామలింగడు అను కమసాలి వ్రాసిన ధీరజనమనో విరాజితము అను తెనుగు కృతికి కృతిపతులైరి. ఆ గ్రంథ మందలి మొదటి రెండు పద్యాలిట్లున్నవి.


శ్రీరమ్యార్థి కళావతంస పద రాజీవార్చనాసక్తు లు
ర్వీరామాధిప కార్య సంఘటన ప్రావీణ్యాధికారుల్‌ మహా
పారావార గభీరు లాశ్రిత జన వ్రాతావనుల్‌ సంతతో
దారుల్‌ యక్కన మాదనాహ్వయులు తత్త్వజ్ఞాన సంపూర్ణులై.

అందనుజన్ముడు మాదన

చందన మందార కీర్తి సంశోభితుడై పొందున నగ్రజుతో నిం
పొందగ తగురీతి పల్కె నురువాక్యములన్‌


ఈ విధముగా మనకు కుతుబుషా కాలములో సుల్తానుల ఆదరములో వెలసిన ఆంధ్ర కృతులను గురించి కొంతవరకు తెలియవచ్చినది. ఇబ్రహీం కాలము నుండి తానీషా కాలమువరకును గోలకొండ నేలిన సుల్తానులు తెలుగువారిని ఆదరించిరి. తెనుగుభాషను పోషించి, తెనుగు స్త్రీలను పెండ్లాడిరి. తెనుగు స్త్రీలలో ఉంపుడు గత్తెల నుంచుకొనిరి. వారిలో భాగ్యమతి, ప్రేమావతి, తారామతి అనువారు ప్రసిద్ధులు. భాగీరథి అను స్త్రీ ఒక సుల్తాను పట్టపు భార్యయై యుండెను.


కుతుబ్షాకాలమునకు ముందు దేశభాషలపై ముసల్మాను ప్రభువుల కాదరణ లేకుండెను. వారి తరువాత ఏర్పడిన ఆసఫ్‌జాహి వంశము వారును “ముల్కీ” భాషలకు ఏ మాత్రమును ప్రోత్సాహమును కలిగించినవారు కారు. తెనుగు మంత్రులు, తెనుగు సుబేదారులు, తెనుగు సేనానులు కూడా కుతుబ్షాల అనంతరము ఎక్కడా కూడా లేకపోయిరి. ఇప్పుడు నిజాము రాష్ట్రములోని విద్యావిధానములో తెనుగు దిక్కులేనిదై క్షయమందుచున్నది. ఇది పూర్వాపర సంబంధములతో పరికించిస కుతుబుషాలకు ఈ విషయములో ధన్యవాదములు సమర్చించుకొనుట కృతజ్ఞతా విధియై యున్నది.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse