Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/ఎలిఫెంటా గుహలు

వికీసోర్స్ నుండి



ఎలిఫెంటా గుహలు

ఇప్పటి కాలమునఁ బాశ్చాత్య పండితుల కేది యత్యంతాశ్చర్యము కలిగించుచున్నదో కాలాతీతము చేతను, క్రూర హస్తములచేతను నేదినాశనముకాగా మిగిలిన యా శేషమును జూడ ప్రపంచము యొక్క నాలుగు దిక్కుల నుండి జనులు వచ్చుచున్నారో, యట్టి శిల్పరాజములు మన హిందూస్థానమందుగాక మఱెచ్చట కలవు? పూర్వము మన యార్యులలో శిల్పులకిచ్చిన గౌరవము బ్రాహ్మణులకుఁ గూడ నియ్యలేదు. శిల్పకారుని నత్యంత పూజ్యునిగా భావించుచుండిరి. వాస్తు శాస్త్రములు సంస్కృత భాషయందనేకములు బహుపురాతన కాలమందే లిఖింపబడెను. దేవతల యొక్కయు, మనుష్యుల యొక్కయు, స్త్రీలయొక్కయు, తిర్యగ్జాతులయొక్కయు వివిధ రూపము లేయేవిధములనుండ వలయునో మయవాస్తువు వంటి గ్రంథములందు విరివిగా చర్చింపఁబడెను. మహారాజుల నాది నుండియు శిల్పకారుల మన దేశమందు విశేషముగా సన్మానించుచుండిరి. వారి నివాస గృహముల నిర్మించుట యందేమి, వారి కోటలఁ గట్టుటయందేమి, దేవాలయముల స్థాపించుటయందేమి, రాజులు నిరంతర మీ శిల్పులకే యావత్కార్యముల విడుచుచుండిరి. పూర్వపు శిల్పులు తాము చేయుచుండిన పనులందుఁ బూర్ణముగాఁ దమమనస్సు లయింపు జేయుచుండిరని చెప్పుట యతిశయోక్తి కాదు. ఆ కాలపు గట్టడములును, ఆ కాలము నుండి వచ్చిన లోక ప్రతీతియు దీనికి ప్రబల సాక్ష్యములు. అనంతశయన మందలి పద్మనాభస్వామి దేవాలయమును గట్టునపుడొక శిల్పి తన కార్యమందత్యంతముగా నిమగ్నుడై తన ప్రక్కన రాజుగారుండినదియు గుర్తింపక యతడు తనచేతి క్రింది మనుష్యుఁడే యని తలచి యొక సాధనము నందిమ్మని యాజ్ఞాపించెనఁట. రాజుగారు తన గాంభీర్యము చెడెననిగాని తన గొప్పతనమునకు లోటు కలిగెనని గాని విచారింపక- తాను విశాల హృదయుఁడగుటచే జంకు కొంకు లేక వెంటనే కోరిన వస్తువును దెచ్చి యిచ్చెనఁట. ఇచ్చునపుడు చేతిని జూచి రాజును జూచి శిల్పిభీతుఁడై తన యపరాధమేమియు లేదని రాజతనితో చెప్పినను వినక యా తప్పుకై తన చేతిని కోసుకొని ప్రాయశ్చిత్తము పెట్టుకొనెనట. ఇట్టి యంశములు వెదకు వారి కనేకములు గోచరించును.

పూర్వపు వైభవము, పూర్వపు శిల్పనైపుణి యార్యుల స్వాతంత్ర్యము తోడనే యంతరించెను. పూర్వపు గోటలను దేవాలయములను ఋషిసంతతి వారనుపించు కొనిన మనమిప్పుడును చూచిన యాకట్టడములు మనుష్యులు కట్టిరా లేక యక్షగరుడ కిన్నరాదుల వంటి మనుష్యాతీతులైన వారెవరైన కట్టిరాయను భ్రాంతిని బుట్టించు చున్నవి. పూర్వపు శిల్పముల ప్రకారము కట్టు వారింకను దక్షిణ హిందూస్థానమున నున్నారని భారతదేశమునకంతయు వంద్యులైన ఇ.బి. హెవెల్‌ దొరగారు నుడువు చున్నారు. కాని యీ శిల్పు లనుదినము క్షీణించుచున్నారు. దానికి కారణము మనమే. మనలో పూర్వపు గట్టడములలోని సౌందర్యమును జూచి మెచ్చుకొను శక్తి క్షీణించినది. అప్పటి విధానములు మనకు రుచించవు. మన దేశ భాషలందెట్లు మనమితరుల జూచి వారి ననుకరించుచున్నామో, యిట్టి శాస్త్రములందును మనకితరులే గురువులు. 'క్రొత్తదొక వింత, ప్రాతదొక రోత'యను సామెత నేడు మన యందొక రీతి విచిత్రముగా నొప్పియున్నది. నవనాగరికులని తలంచుకొను వారికి బూర్వపు శిల్పములు రుచింపవు. ఇప్పటి మహారాజులుగాని, నవాబులుగాని పూర్వపు హిందూ బౌద్ధ శిల్పములనుగాని, మొగల్‌ రాజపుత్ర శిల్పములగాని కోరక గాథిక్‌, శాక్జన్‌ మున్నగు నానాశిల్పముల యొక్క సమ్మేళనముచే సంకరములైన పద్ధతిపై తమ బంగ్లాలను గట్టించుకొనుచున్నారు. పాశ్చాత్యులు మన వేషములే, మన భాషలే, మన పూర్వ శాస్త్రములే మేలైనవని శ్లాఘించుటయే కాక నాచరించుచునుండగా, మనము పాశ్చాత్యులవే మంచివని వాదించుట విచిత్రము. “పడమటి” గాలి విశేషముగా వీవ దొడఁగినది.

ఎలిఫెంటా ద్వీపము

బొంబాయి నుండి సముద్రములో నోడపై ఏడు మైళ్ళు ప్రయాణము చేసిన ఎలిఫెంటా ద్వీపమును చేరవచ్చును. ఈ ద్వీపము 4 మైళ్ళ చుట్టుకొలత కలది. దీనిలో నొకగట్టు 11 మైలు పొడవును, 500 అడుగుల ఎత్తును గలదైయున్నది. ఈ ద్వీపములో జనులు నివసించుచున్నారు. వరి మున్నగు కొన్ని పంటల బండించు చున్నారు. ఈ ద్వీపమును మున్ను గిరిపురి (పర్వతముపైన నుండుపురి) యని వ్యవహరించుచుండిరి. దీనికి ఎలిఫెంటా యని పోర్చుగీసు వారు పేరిడిరి. ఏలనన నీ ద్వీపమందొక రాతియేనుగు 13 అడుగులు పొడవును 7 ¼ అడుగుల యెత్తును గలది యుండెను. ఈ యేనుగు కొంతకాలమునకు శిథిలమయ్యెను. దానిని 1864 సంవత్సరంలో బ్రిటిష్‌ ప్రభుత్వం వారు బొంబాయికిఁ దెచ్చి విరిగిన భాగముల నతికించి విక్టోరియా తోటలో నుంచిరి. ఇప్పటికిని నిది యా తోటలోనే యున్నది.

ఈ ద్వీపములో క్రీ.శ. ౩వ శతాబ్దమున బౌద్ధ స్థూపములు కట్టినట్లు గొన్ని శిథిలముల నుండి యూహింపఁబడుచున్నది. మఱియు నందలి గుహలు క్రీ.శ. 8వ శతాబ్దమందు నిర్మింపబడినట్లూహింపబడుచున్నవి. ఈ గుహల విషయమై యితర హిందూ క్షేత్రమువలె స్థానికులు వివిధగాథలను జెప్పుచుందురు. కొందరు వీనిని పాండు పుత్రులు కట్టిరనియు, కొందరు బాణాసురుని కూతురగు ఉషాకన్య నిర్మించె ననియు చెప్పుదురు. కాని చరిత్ర వేరుగా బోధించుచున్నది.

ఈ ద్వీపము మౌర్య రాజుల యొక్క రాజధానిగా గొంతకాలమువరకుండె. పిమ్మట ఇది చాళుక్యులచేత, రాష్ట్ర కూటులచేతను, యాదవులచేతను పరిపాలించ బడెను. క్రీ.శ. 15వ శతాబ్దమందిది మొగలుల పాలనములోనికి వచ్చెను. తురకలు సాధారణముగా విగ్రహ నాశకులని పాశ్చాత్య చరిత్రకారులు వ్రాయుచుందురు. కాని యీ ద్వీప విషయములో నిందలకుఁబాలైన ముసల్మానులవలన నేయపకారమును జరుగలేదు. క్రీ.శ. 1534వ సంవత్సరంలో నీ ద్వీపము పోర్చుగీసు (బుడతకీచులు) వారి స్వాధీనమయ్యెను. సుమారు 200 సంవత్సరాల వరకీ గుహలీదుష్టుల స్వాధీనమందుండెను. వీరిచే నివి నాశనము చేయబడెను. పోర్చుగీసు లీ విశాల మంటపములలో దమ పశువులను మేపుకొనుచుండిరి. ఈ సిపాయీ లిచటి ప్రతిధ్వనులను బరీక్షింప నెంచి తమ ఫిరంగులతో నీ యాలయమును గాల్చిరి. కాన ననేక విగ్రహములును, స్తంభములును గూలిపోయెను. ఈ బుడుతకీచులకు విగ్రహము లసహ్యముగా నుండెను. కావున వారు ప్రత్యేకముగా శ్రమించి యీ విగ్రహములను తుపాకులతోడను ఫిరంగులతోడను పగులగొట్టిరి. హిందువుల శిల్పకళకును, నీ పరంగీ జాతి ఫిరంగుల శిల్పకళకును నెంతటి ఘోర తారతమ్య మున్నదో కనుఁడు. మన దొరలగు నింగ్లీషు వారి హస్తగతమైన తర్వాత కూడ 1865 నుండి 1868 వరకు నీ గుహల వినాశన కార్యమందు నింగ్లీషు వారు పోర్చుగీసుల పోటీకి నిలిచిన వారైరి. అనేక సంవత్సరములిది బ్రిటిష్‌ వారి సైన్య విశ్రామ స్థలముగా నుండెను. సర్వలలిత కళలకు విరోధులైన సైనికులు నాశనము చేయుటకుఁగాను యింకేమి చేయు సమర్థులు. తుదకు 1909 వ సంవత్సరము నుండి యీ గుహలను బ్రిటిష్‌ ప్రభుత్వము వారు సంరక్షింపబూనుకొనిరి.

గుహాశిల్పము

హిందూస్థానములో క్రీ.పూ. 300 సంవత్సరాల నుండి (అనేగా నేటికి 220 సంవత్సరాల క్రితము) పర్వతములలో, గుట్టలలో పెద్ద సురంగములు చేసి వానిని చైత్యములుగను, విహారములుగను, దేవాలయములుగను, హిందూ బౌద్ధులుపయోగించి నట్లు ఫర్గూసన్‌గారు వ్రాసియున్నారు. “గుహా శిల్ప నిర్మాణములో బౌద్ధులే నిస్సంశ యముగా మొదటివారు అని ఫర్గూసన్‌ గారు సెలవిచ్చినారు. పిమ్మట జైనులు, హిందువులు (సాధారణముగా క్రీ.శ. 6వ శతాబ్దము నుండి) గుహా శిల్పములకు గడంగిరి. ఉత్తర హిందూస్థానములోని బారబన్‌ గుహలును, ఒరిస్సాలోని కారక్‌ గుహలును, నిజాము రాష్ట్రములోని ఎల్లోరా, అజంతా గుహలును, మహారాష్ట్ర దేశములోకార్లా, జోగేశ్వరి, ఎలిఫెంటా గుహలును సుప్రసిద్ధములైనవైయున్నవి.

ఎలిఫెంటా గుహలు

ఈ గుహలు క్రీ.శ. 8వ శతాబ్దమందు నిర్మింపబడెనని యింతవరకే నివేదించి యుంటివి. ఇందు శైవ సాంప్రదాయపు గాథలే చిత్రింపబడినవి. ఇచ్చట ప్రధానమైనవి మూడు గుహలు. ఇయ్యవి దూరము నుండి చూచినట్లయిన మూడు గొప్ప సురంగముల వలె గనబడును.

ఈ గుహలలో ప్రధానమైనది మధ్యన నుండు గుహయే. ఇది 133 అడుగుల పొడవును, 130 అడుగుల వెడల్పును - ఇంచుమించు చౌకముగా నున్నది.

అందు 10 మాత్రమే మంచి స్థితిలో నున్నవి. ఇందు 26 స్తంభములున్నవి. ఈ గుహను 17 అడుగుల లోతుగా రాతినుండి తొలిచినప్పుడా రాతిలోనే నీ స్తంభములను వదలి యున్నారు. వీనిని నేర్పుతో నేర్పాటు చేసియున్నారు. ప్రేక్షకుడు గుహయెదుట నిలిచినంతనే తనయెదుట దూరమందు(133 అడుగులు) త్రిమూర్తి విగ్రహము కనబడును. ఉభయ పార్శ్వములందు నందేడేడు స్తంభముల వరుసయున్నది. మధ్యగుహ ముఖమున నిలిచినంతనే నీయుభయ పార్శ్వముల స్తంభముల మధ్య త్రిమూర్తి విగ్రహము ప్రేక్షకుని కగపడును.

విగ్రహములు

ఇప్పటి శిల్పకారులనేకులు తమ పూర్వులు విద్యలన్నింటిని మరచి యడ్డాదిడ్డి యిండ్లను గట్టు విధానము మాత్రము తమ జీవనార్థముగా నుంచుకొని పూర్వ శిల్ప వైభవమును గుఱించి ముచ్చటించిన నా కాలము వారొక పసరును దెచ్చి శిలలపై రుద్దిన శిలలన్నియు మైనము వలె నగుచుండెననియు నప్పుడు తాము కోరినట్టి రూపములఁ దీర్చుచుండిరనియుఁ జెప్పుదురు. నేటికిని కంచి మున్నగు ప్రదేశములందు జరుగుచున్న శిల్ప నిర్మాణముల జూచువారికీ విషయమబద్ధమని తోపకపోదు. అయినను నీ ఎలిఫెంటా గుహలలోని యత్యంతోన్నత విగ్రహములను దిలకించు నతనికిఁ బైకథలు నిజమేమోయను భ్రమజనించును. ప్రప్రథమున మనకు గోచరించు నీ త్రిమూర్తి విగ్రహము సగము మాత్రమే (bust) చెక్కబడియున్నది. ఇది సుమారు 14 అడుగుల యెత్తున్నది. ఈ విగ్రహమందుండు మధ్య శిరస్సు బ్రహ్మ, వానికి కుడిప్రక్క విష్ణు శిరస్సును, నెడమ ప్రక్క రుద్రశిరస్సును నున్నవి. ఈ త్రిమూర్తి విగ్రహము యొక్క శిరస్సులు కిరీటముల చేతను, కంఠములనేక హారములచేతను, కర్ణములు కుండలముల చేతను నలంకరింపబడియున్నవి. ఇందలి మూడు వదనములు మూడు విధములగు కళలచే నొప్పారు చున్నవి.

అర్ధనారీశ్వర

త్రిమూర్తి విగ్రహము ప్రక్కకెడమ ప్రక్క అర్ధనారీశ్వర విగ్రహమున్నది. ఈ విగ్రహమున కిరుపార్శ్వములందు బ్రహ్మ, విష్ణు, కుబేరేంద్రాది దేవతలున్నారు. ఈ విగ్రహములోని ఎడమ భాగము స్త్రీ భాగమని చూపరులకు వెంటనే స్ఫురించును. ఈ భాగమందలి యొక స్తనమును, కర్ణభూషణములును, సన్నని మధ్య భాగమును, నెత్తైన పిఱుఁదును, నతి సుందరముగా శిల్పకారుని సామర్థ్యమును వెలిబుచ్చుచున్నవి.

ఈ విశేషములు విగ్రహముల యొక్క కుడిభాగమున చూడుడు.

పార్వతీ పరిణయము

త్రిమూర్తికి దక్షిణ భాగమందించుక దూరముగా పార్వతీ పరమేశ్వరుల వివాహ ఘట్టము నిరూపింపబడి యున్నది. ఇందు నీశ్వరుని కుడి ప్రక్కన బార్వతి నమ్ర వదనయై యున్నది. ఆమె వెనుక కన్యాదాతలగు మేనకా హిమవంతులున్నారు. మేనక వెనుక చంద్రుడు అమృత కుంభమును బట్టుకొని నిలిచి యున్నాడు. ఈశ్వరుని పాదముల దగ్గఱ పురోహితుడగు బ్రహ్మయున్నాడు. పై భాగమందు బెండ్లికి జుట్టములుగా బ్రేక్షకులుగా వచ్చిన దేవతలున్నారు. ఇందు ముఖ్య పాత్రములైన పార్వతీ పరమేశ్వరుల విగ్రహములతి సుందరముగా వినయ గాంభీర్య గుణయుక్తముగా నున్నవి. కాని బుడుతకీచులిచట మన శిల్ప నైపుణ్యమును మాపి తమ శతఘ్నికా శిల్పాధిక్యమును శాశ్వతముగా జాటి యుండుటచేఁ బ్రేక్షకులకు జాల విషాదము సంఘటించుచున్నది. (వివాహ కాలములందు నాశ్వలాయన శాఖీయులలో భార్య పురుషుని కుడి ప్రక్క నుండును. తర్వాతి కాలములందు నాశ్వలాయనులలో నాపస్తంబీయులందువలె భార్య భర్త కెడమ ప్రక్కనే యుండును. ఈ పటమందు భార్య భర్తకు గుడిప్రక్కనున్నది.

ద్వార పాలకులు

త్రిమూర్తి విగ్రహమునకు సుమారు 90 అడుగుల దూరమున గుహయందే యొక గుడి నిర్మించి యున్నారు. అందొక లింగమున్నది. ఆ గుడి నాలుగు ప్రక్కలలో నిద్దఱిద్దరు ద్వారపాలకులున్నారు. ఈ ద్వార పాలక విగ్రహములొక్కొక్కటి రమారమి 19 అడుగుల యెత్తున్నవి. ఇంత యెత్తుండినను విగ్రహముల యొక్క యవయవముల పరిమితి (Proportion) చెడకుండయున్నది. ఇందలి విగ్రహములలో సాధారణంగా ద్వార పాలకులకుండునని భావింపబడు గర్వ క్రౌర్యాది చిహ్నము లేమియు లేవు. ముఖములపై సౌకుమార్యము, మార్దవము విశేషముగాఁ గనపడుచున్నవి. ఇందలి విగ్రహములు కూడ నితర విగ్రహములవలెఁబ్రయత్న పూర్వకముగా పోర్చుగీసు దుండగీలచే రూపుమాయింపబడినవి.

గంగావతరణము

ఈ విగ్రహములో నీశ్వరుడు పార్వతి ప్రక్కకును, పార్వతి ఈశ్వరుని ప్రక్కకును వ్రాలియున్నారు. చుట్టును దేవతలున్నారు. ఈ ఘట్టము కూడ జాలశిధిలమైపోయినది. ఈ గుహలో శివలీలా కథలింకను ననేకములు నిరూపింపబడినవి. సతీదేవి యొక్క నిర్యాణానంతర మీశ్వరుడు యోగియై తపస్సు చేసినదియు, పార్వతీదేవి నాహ్లాదింపఁ దాండవమాడుటయు, రుద్రావతారియై దక్షాధ్వర ధ్వంన మొనరించుటయు, ప్రణయ ప్రకోపముచేఁ బార్వతీపరమేశ్వరులు కలహించుకొనుటయు రావణుడఖిల జగద్రావణుండైన పిమ్మట తన చేతుల తీటవోఁ గైలాసగిరి నెత్తుటయు నఖిల ప్రపంచ నేతయైన హైమవతీ నాథుడు లీలగా నాతని గర్వ నిర్వాపణ మొనర్చుటయునగు నీ శైవ సాంప్రదాయపు గాథలిందుఁ జెక్కబడియున్నవి.

ఇంతవఱకు నివేదింపబడిన విషయములన్నియు మధ్యదియుఁ బెద్దదియునగు గుహా సంబంధములు. ఈ గుహకిరు పార్శ్వములందును రెండు గుహలున్నవి. పెద్ద గుహకును వీనికిని మార్గములున్నవి. ఈ రెంటను బేర్కొనదగిన వస్తువులు లేవు. కుడి ప్రక్కన నుండు గుహలో నొక చిన్న పుష్కరిణి కలదు. అందు నిరంతరము పానయోగ్యమగు జలముండును. ఎడమ ప్రక్కన నుండు గుహ యొక్క ముంగలి భాగమున నొక యంగణమున్నది. దాని యెదుట శివాలయమున్నది.

ఈ రెండు గుహలు గాక వీనికి తూర్పు దిక్కున నాలుగు గుహలున్నవి. ఇందు కొంత శిథిలములును గొంత పరిపూర్తికానివియు నున్నవి.

సముద్ర పరివృత ద్వీపమందుండటచేత నేమి మౌర్య, రాష్ట్ర కూటాది హిందూ రాజ్య పరిపాలన స్థానముగా నుండినవగుటచేతనేమి, సుందరతర విగ్రహములచే బ్రాచీనార్య శిల్ప కళావైదుష్య ప్రకటనము చేతనేమి, తుదకు బుడతకీచులవలని దుండగములచేతనేమి యీ గిరిపుర గుహలు చారిత్రకములై, యానందదాయకములై దర్శన యోగ్యములైయున్నవి.

ఈ గుహలందొక కాలమున నజంటాలొవలెఁ గొంతవఱకు చిత్రములు గూడ లిఖించి యుండిరని చెప్పుదురు. కాని యవి యిప్పుడు కానరావు.

ఈ గుహలను గుఱించి 1539 క్రీ.శ. నాటికే డాంజోడీకాస్ట్రోయను నతడివి మనుష్య మాత్రులు నిర్మించినవేయై యుండిన నింత సుందరంగా నుండుటెట్లు సాధ్యమని శంకించెను. ఇంచుమించాకాలము వాడేయగు లిన్‌షోటెన్‌వీనిని హిందువుల యౌన్నత్య సూచకములుగా భావించెను.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse