సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/ఎఱ్ఱాప్రెగ్గడ (వ్రాతప్రతి)
ఎఱ్ఱాప్రెగ్గడ
సారస్వత పరిస్థితులు
కేవలము మతాభిమానముతో మత ప్రచారమునకై కావ్య రచన చేయు నాచారము తగ్గిపోయి కావ్య కళాదృష్టి తోడను సారస్వత స్పర్థతోడను కావ్య నిర్మాణము చేయు స్థితి ఎఱ్ఱన కవి కాలమునాటికి క్రమముగా వచ్చినది. కావుననే శివభక్తిచేత శంభుదాసుడైనను, కవిత్వ రచనా విధానము చేత ప్రబంధ పరమేశ్వరుడైన ఎఱ్ఱాప్రెగ్గడ నృసింహ పురాణమును రచించి యహోబల నృసింహస్వామికి అంకితమిచ్చెను.
ఎఱ్ఱాప్రెగ్గడ నియోగి బ్రాహ్మణుడు. శ్రీవత్స గోత్రుడు, ఆపస్తంబ సూత్రుడు. ఈ మహాకవిని గన్న తల్లిదండ్రులు-పోతాంబ సూరనలు. శంకర స్వామి పితామహుడు. గురువు.
కవికాలము: ఎఱ్ఱాప్రెగ్గడ రామాయణమును, హరివంశమును ప్రోలయ వేమారెడ్డి కంకితము చేసెను. ప్రోలయ వేమారెడ్డి క్రీ.శ. 1324-53 వఱకు రాజ్యము చేసెను. కావున ఆ రాజాస్థానమునున్న ఈ కవి కూడ నీ కాలముననే యుండెననుట స్పష్టము.
1. హరివంశము: ఇది భారతమున కనుబంధ గ్రంథము. ఎఱ్ఱాప్రెగ్గడ సంస్కృత హరివంశము నాంధ్రీకరించుటలో భారతాంధ్రీకరణ పద్ధతినే యనుసరించి సాధ్యమైనంతవరకు విషయములను సంగ్రహించి మూలకథాంశముల రచించెను. కాని యితడు మూలమందలి హంసడిభకోపాఖ్యానమును వజ్రనాభ వధఘట్టమును వదలి వేసినాడు. ఎఱ్ఱన ముఖ్యముగా ఔచిత్యము పాటించి మూలమును వదలక రసపోషణము చేయుచు తన రచనా పాటవముచే మూలమునకు గూడ మెఱుగు పెట్టినట్లున్నది. ఉషాపరిణయమున నీతడు వర్ణించిన నూతన వధూవరుల ముగ్ధ శృంగార ప్రణయ భావములు - చిత్రరేఖ పాత్రపోషణములిట్టివి. శ్రీకృష్ణుని శైశవ క్రీడోత్సవము, యశోదా దేవకీదేవుల మాతృభావము స్వభావసిద్ధముగా చిత్రింపబడి పోతనార్యుని భాగవత రచనకు వరవడియైనది.
ఉదా:
ఎక్కడి కేనియు బోయెద
మీ కష్టపు పాటలు పడగ నేమోర్వము నీ
చొక్కపు కొడుకును నీవును
నొక్కతలము నొక్కయూరి నుండుడు నెమ్మిన్ (హరి)
దీనికి సరియగు పోతన పద్యమిది.
ఓయమ్మ నీ కుమారుడు
మా యిండ్లను పాలు పెఱుగు మననీడమ్మా
పోయెద మెక్కడికైనను
మాయన్నల సురభులాన మంజుల వాణీ - (భాగ)
ఈ విధముగా యెఱ్ఱన రచన మలతి యలతి తెలుగు పదముల బింకముతో
నొప్పుచున్నది. ఎఱ్ఱన హరివంశమునందు పోతన భాగవతమునందును గూడ
సత్యభామా యుద్ధము - రుక్మిణీ పరిణయము - కాళీయ మర్ధనము, కృష్ణలీలలు,
వామనావతారము మొదలైన సమాన ఘట్టములు గలవు. ఇందు పోతనకంటె ఎఱ్ఱన
రచన మేలుబంతియైనది. అట్లయ్యును ఎఱ్ఱన రచనమును పోతన కవిత మించి
పోయెననియే చెప్పవలయును.
2. నృసింహ పురాణము: ఇది యష్టాదశ పురాణములలో నొకటి కాదు. ఇందలి
కథ బ్రహ్మాండాది పురాణాంతర్గతమైనది. భాగవతమున కూడ నీ కథ గలదు. కవి
కొంత కల్పించెను. విష్ణుపురాణమున నృసింహావతార కథ గలదు. అందు నృసింహుడేల
హిరణ్యకశిపుని జంపెనో చెప్పబడలేదు. దాని యందు నృసింహుడు స్తంభము బ్రద్దలు
చేసుకొని వచ్చుటయు లేదు. సంస్కృత నృసింహ పురాణమునకు దీనికి పోలికయే
లేదు. ఇందలి వర్ణనలు కవి స్వకపోల కల్పితములై ప్రబంధములందు వలె
ఋతు-చంద్రోదయాది వర్ణనలతో ప్రధాన కథకు భంగము కల్గింపక కథా సౌష్టవముతో
చేయబడినవి. ఈ కథకు సనక సనందాదుల శాపము బీజమును, హిరణ్య కశిపుని వధ
కార్యమునై యున్నది. హిరణ్య కశిపుని పాత్ర పోషణము విష్ణు సాయుజ్యము
పొందువానిగా జిత్రింపబడక యహంభావ పూరితుడైన విష్ణుద్వేషిగా పరిణమించెను.
నిధన సమయమందు కూడ హిరణ్యకశిపుడు జయుడను భావము పాఠకులకు జ్ఞప్తి
కలుగదు.
ప్రబంధ కాలమునకు చెందక పోయినను ఆంధ్ర భాష యందు కుమార సంభవము తర్వాత పురాణ కథను ప్రబంధమువలె ప్రౌఢముగా రచించిన వాడగుటచే ఎఱ్ఱనకు ప్రబంధ పరమేశ్వరుడను బిరుదు దగి యున్నది. నృసింహ పురాణమందలి కథ ప్రహ్లాద చరిత్ర. కావున యిందు కూడ పోతన రచనమునకు సాదృశ్యము కలదు. రసాతిశయమున పోతనది పై చేయియైనను ఔచిత్య పోషణమున నెఱ్ఱన మేటి యయ్యెను. భారత భాగవతాది పురాణములవలె నృసింహ పురాణము సంస్కృతము నుండి యాంధ్రీకరింపబడినది కాదు. ఇందలి కథ ఎఱ్ఱనామాత్యుడు బ్రహ్మాండాద్యనేక పురాణముల నుండి గ్రహించి ఔచిత్య పోషణ కొఱకు యొక ప్రబంధముగా మార్చినాడు. కావ్యమున ఔచిత్యము ప్రాణప్రదము కాన భాగవత కథ నుండి కవి చేసిన మార్పులను గమనింపవలసియున్నది.
ఔచిత్యములు: శ్రీ విష్ణుద్వార పాలకులైన జయ విజయులు - సనక సనందనాదుల నడ్డగించ నామహర్షులు వారిని అసురయోని జనింపుడని శపించిరి. పిమ్మట విష్ణువు అచటికి వచ్చి వారిననతి కాలములో తన యంతికము చేరునట్లను గ్రహించుటకును వేడుట మూలకథ. జయవిజయులకు వైకుంఠ మొసగు అధికారము విష్ణువునకుండగా ఆ మహర్షుల యాచింపనేల? ఈ సంఘటన సర్వాంతర్యామికి తెలియకుండ జరుగు టెట్లు? అల్ప దోషమునకే యింత ఘోర శాపమా? ఈ అనౌచిత్యముల పరిహరించుటకై ఎఱ్ఱన సనక సనందాదులతో విష్ణువు జయ విజయులొనర్చిన దోషము తనదేననియు- అనతి కాలములో ద్వార పాలకులు తనలో నైక్యమగుదురనియు ఈ సంఘటనలన్నియు తన మాయా బలముచే వారి శ్రేయస్సుకై కల్పింబడినవని” మార్చి మూల కథకు ఔచిత్యము గూర్చినాడు.
2. హిరణ్యకశిపుడు తన సోదరుని జంపినందులకై హరిని తదనుచరులగు దేవతలను ద్వేషించి దేవలోకముపై దండెత్తిపోయినట్లుగా భాగవతమున కలదు. ఇందు వ్యక్తిగతమగు కలహము ప్రతిపాదింపబడినది. ముఖ్యముగా నీతడు పోరాడినది తన యహంకారమువలననే. దానికొక బంధు వినాశనము అను సాధారణ కారణము కంటె ఎఱ్ఱన మఱియొక ఉచిత కారణమూహించెను. దేవతలు రాక్షసులు సవతుల సంతానము కాన నందులో రాక్షస మాతయగు దితి కశ్యప ప్రజాపతికి జ్యేష్ఠ భార్య యగుటచే త్రిలోక రాజ్యమునకు దైత్యులకెక్కువ యధికారముండెననియు నా హక్కును సాధించుకొనుటకై హిరణ్యకశిపుడు స్వర్గముపై దండెత్తెననియు యీ కవి కల్పన.
3. భాగవతమందలి హిరణ్యకశిపుడు చేసిన బ్రహ్మ స్తుతి అతని యసురత్వమునకు విరుద్ధముగా వేదాంతమయమైయున్నది. దీని నెఱ్ఱన ఔచిత్యముగోరి “సముచితార్థ మధుర బహువిధ స్తోత్ర సమ్మర్ధ రచనమున నతడిట్లని విన్నవించె”నని మాత్రము రచించెను.
4. హిరణ్యకశిపుడు తపము చేయుచుండగా అతని భార్య గర్భిణియగు లీలావతిని దేవేంద్రుడు చెఱపట్టెనను ఘోర విషయమును లీలావతి శత సంవత్సర గర్భ వృత్తాంతమును హిరణ్యకశిపుని శత దివ్య సంవత్సర లోపమును భాగవతమున కలవు. ఔచిత్య పోషణ కొఱకు ఎఱ్ఱన మహాకవి నృసింహ పురాణమున వీనిని పరిహరించెను.
5. హరి నృసింహ రూపమున నొక స్తంభమున నావిర్భవించుటకు గల కారణముగా నెఱ్ఱనచే నృసింహ పురాణమున నొక చక్కని సందర్భము గూర్పబడినది. నృసింహావతార సన్నివేశము హిరణ్యకశిపుని “సమంచిత కాంచన రత్న ఖచిత మహా స్తంభ శత సంఖ్యాతమగు సభా మండపమున” జరిగినట్లు వర్ణింపబడినది. అందుచే నా సభయందలి ఒకానొక స్తంభమునందు హరిని జూపుమని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నడుగుటయు నంత హరి దాని నుండి యుద్భవించుటయు సక్రమముగా పరిణమించినది.
ఈ విధముగా నెఱ్ఱన మూలమునకు ఔచిత్యముచేత మెఱగుపెట్టినాడనియే భావింపవలె.
పోతనపై యెఱ్ఱన ప్రభావము: ఎఱ్ఱన యొక్క రచన పోతనామాత్యునకు అనేక విధముల మార్గదర్శకమైనదనుటలో సందేహము లేదు. ఎఱ్ఱన వ్యాకరణ ఛందో౽ లంకార లక్షణయుక్తముగా వ్రాసినాడు. పోతనామాత్యునకు ఎఱ్ఱన కున్నంత పాండిత్యము లేకపోయినను పోతన కవిత్వమున గల మృదు మధుర రచన మాత్రము శ్రీఎఱ్ఱన కబ్బలేదనిన విమర్శకు లంగీకరింతురని యనుకొందును. అవాఙ్మానస గోచరమగు నొక విధమైన విష్ణు భక్త్యామృత రసము పోతనార్యుని కవిత్వములో ననపాయముగా వచ్చి భక్తి రసాబ్దిలో నోలలాడించును. ఎఱ్ఱనార్యుని పోతనామాత్యు డనుకరించిన పద్యములనేకము గలవు.
1. కలడు మేదిని యందు గలడుదకంబుల
గలడు వాయువు నందు గలడు వహ్ని - (నృసిం)
2. కలడంభోధి గలండు గాలిగల దాకాశంబునన్ గుంభినిం గలదగ్నిన్...
3. ఇందు గల డందు లేడని... (భాగ)
అనుకరించిన పద్యములో మెఱగుబెట్టి పైగా మించి మంచి పద్యము
వ్రాసినాడు.
“వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి
తగదను తండ్రియు దండ్రిగాడు (నృసింహ)
“శౌరి పదాంబుజ స్మృతి రసంబున దేలెడు నా మనంబు....
"............ అంబుజోదర దివ్య పాదారవింద...(భాగ)
ఈ రసవత్ఖండ సృష్టికి పై పద్యము మూలమనుటకు సందేహమేమియును
లేదు.
అరణ్య పర్వ పూరణము: ఎఱ్ఱనమీద ఏ మాత్రము గౌరవ భావము లేని
కొందరు విమర్శకులు భారతారణ్య పర్వశేషమును పూరించలేదనియు, నన్నయ
భారతమున మూడు పర్వములను పూర్తిగా వ్రాసినాడనియు - అక్కడక్కడ క్రిమిదష్టమైన
అక్షరములను ఎఱ్ఱన సర్దెనను వాదములు చేసిరి.
అరణ్య పర్వాంతమున -
......ఎఱ్ఱనార్యుండు సకల లోకైక విదితుడు -
......................................................
కం. ధీర విచారుడు తత్కవి
తా రీతియు కొంతదోప దద్రచనయకా
నారణ్య పర్వశేషము
పూరించె కర్ణపుట పేయముగాన్ - ”
పూరించెనని నమ్ముచున్నది. మరియు
ఉ. శారదరాత్రు లుజ్వల లసత్తరతారక హార పంక్తులం
జారుతరంబులయ్యె, వికసన్నవకైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణక
ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబర పూరితంబులై”
అరణ్య పర్వములోనిది నన్నయ చివరి పద్యముగా - మరి ఈ క్రింది పద్యము
నుండి ఎఱ్ఱన కవిత్వము.
చ. “స్ఫుర దరుణాంశు రాగరుచి బొంపిరి వోయి, నిరస్తనీరదా
వరణములై దళత్కమల వైభవ జృంభణముల్లసిల్ల ను
ద్ధుతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా
కరము వెలింగె వాసర ముఖంబులు శారద వేళ జూడగన్”
దీనిని బట్టి అరణ్య పర్వమున గల మొత్తము 2,900 గద్య పద్యములందు
నన్నయ 1300లును, ఎఱ్ఱన 1600లును రచించెగాన సగముకంటె నధికముగ
ఎఱ్ఱనయే రచించె ననుట స్పష్టము.
రామాయణము: ఎఱ్ఱన రామాయణ మిప్పుడెచ్చటను కానరాదు. దీని నుండి కొన్ని
పద్యములను కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ సార సంగ్రహమున నుదాహ
రించెను. ఒక సంకలన గ్రంథములో గూర్చబడిన యెఱ్ఱాప్రెగ్గడ రామాయణములోని
కొన్ని పద్యములను వేటూరి ప్రభాకరశాస్త్రి గారు సేకరించినారు.
ఆంధ్ర వాఙ్మయమున యెఱ్ఱనకు గల స్థానము
ఆంధ్రమున కవిత్రయము వారి ప్రయోగములు ప్రామాణికములనియు
తద్భిన్నములగు కావ్యములు కావని లాక్షణికులు తలంతురు. వీరు కావ్య రచనకు
మార్గదర్శకులనియు గురువు లనియు కూడ నంగీకరించి తర్వాతి కవులు వీరిని
కావ్యారంభముల స్తుతింపజొచ్చిరి. నన్నయ వాగనుశాసనుడుగను, తిక్కనకవి బ్రహ్మ
గాన నీతడు ప్రబంధ పరమేశ్వరుడనబడి రాబోవు ప్రబంధ యుగమునకు మార్గదర్శ
కుడయ్యెను. అరణ్య పర్వమును పూరించుటయేగాక భారతానుబంధ గ్రంథమగు
హరివంశమును గూడ రచించి భారతమును పరిపూర్ణముగా రచించిన వాడని ఖ్యాతి
పొందెను. నిజానికి భారతారణ్యపర్వ పూరణలో నొక పెద్ద సంకటము గలదు. నన్నయది
సంస్కృత భూయిష్టశెలి. తిక్కన శైలి దేశీయ పదమయము. అరణ్య పర్వ పూరణ మీ
రెంటికిని వంతెనవలె నుండవలెను. లేనిచో అతుకుల బొంత వలె తయారగును.
ఎఱ్ఱన కుభయ భాషలయందు కావ్య రచనా సామర్థ్యముండుటచే నీయసిధారా
వ్రతమును బహు చాకచక్యముతో నిర్వహించి యాంధ్ర సారస్వతలోకము మెప్పును,
కృతజ్ఞతను బడసిన వాడయ్యెను. అందుచే నీతనికి నన్నయ, తిక్కనలతో సమాన
గౌరవ ప్రతిపత్తులు దక్కినవి. ఇదియే ఎఱ్ఱనకాంధ్ర వాఙ్మయ మందలి గల స్థానము.
ఆంధ్రీకరణ విధానము: నన్నయ భట్టు మార్గముననే కథా ప్రధానముగ మూలము ననుసరించవలసినచో వర్ణనలు కొన్ని కలిపియు, కొన్ని విడిచియు కొన్ని మార్చియు స్వతంత్రముగా రచించెను.
కవిత్వ శైలి: నన్నయ వలె నతి సంసృతముగాక, తిక్కన వలె నతి దేశీయముగాక రెండును సమపాళ్ళు గల్గి ఈతని కవితాశైలి రసవత్తరమై కావ్యమై యుచిత గుణాలంకార శోభితమై హృదయ రంజకముగానున్నది. నన్నయ తిక్కనలవలె స్త్రీవర్ణనలనతి సభ్యముగాజేసెను.
ఉ. నీలపయోద మండలము నిచ్చల లీల వెలుంగ జేయుచుం
గ్రాలెడు వ్రాలు గ్రొమ్మెఱుగుకైవడి దద్వనభూమి యంతయున్
లలిత దేహకాంతి పటలంబుల జేసి వెలుంగ జేయు న
బ్బాల వినీలకుంతల విభాసిని జూచి సవిస్మయాత్ముడై”
తర్వాతి కవులపై నెఱ్ఱన ప్రభావము
ఈతడు నన్నయ తిక్కనల కవితలోగల మేలును గ్రహించి - తన ప్రతిభచే
తన కవితకు కొంత నూతన మార్గము దీసి రాబోవు ప్రబంధ కవులకు
మార్గదర్శకుడైనాడు ఈతని కవితా చాయల పోతన భాగవతము నెంతవరకు గల్గెనో
సమాన ఘట్టముల పరికించి చూచితిమి. నృసింహ పురాణములో క్షీర సముద్ర-
వైకుంఠ- విష్ణు- వసంత- పానగోష్ఠి మొదలగు వర్ణనములు కొంత దీర్ఘములై
కథకు అడ్డుతగిలి చమత్కార కల్పనలతో నలంకార భూయిష్టముగ రచియింపబడి
శ్రీనాథుడు కాశీఖండములో -
“పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ
సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు”
అని చెప్పుకొనెను.
దేవేంద్రుడు తనకు విష్ణ్వాదుల బలముగలదని పొంగుచున్నాడని హిరణ్య
కశిపుడు పల్కినపుడు ఎఱ్ఱన నృసింహ పురాణములో ఈ క్రింది పద్యము వ్రాసెను.
“హరి తనకుంగలండని పురాంతకుడామురవైరిసేత లె
ప్పరుసున మాన్పడల్లనుని పద్మభవుండుమనాత్మలోన ని
ర్జరులకు మేలు గోరునని సంయమికోటి తలంపుల న్నిజ
స్ఫురణమయావహించునని పొంగుచు నుండు మహేంద్రుడెప్పుడున్”
నంది తిమ్మన పారిజాతాపహరణములో సత్యభామా గర్వమును గూర్చి
నారదునిచే పల్కించిన పద్యమున ఎఱ్ఱన పైపద్య రచనానుకరణము గోచరించును.
“చక్కని దాననంచు నెల జవ్వనినంచు జగంబులోన బే
రెక్కిన దాననంచు బతియెంతయు నాకనురక్తుడంచు దా”
ఎఱ్ఱన నృసింహ పురాణములో వన విహారము చేయు స్త్రీ వర్ణనల పద్యమునకు
మెఱుగుపెట్టి యనంతామాత్యుడు భోజరాజీయమున నిట్లనుకరించెను.
“మునికాళ్ళు మోపి నిక్కిన పదచ్ఛవి నేల
యును పల్లవించిన యొప్పుమెఱయ
వలులేది నతనాభి బలసి యొక్కింత సా
గిన మధ్య యెంతయు ఘనతయు.
............................................................
నొయ్యడాకేల దవ్వుల నున్న తీగ
దివిచిన నఖ దీప్తులంతంత వీటుకొనగ
లీపపెఱకేల నచ్చరలేమ యోర్తు
గోసె బువ్వులు ప్రమద వికాసమెసగ” (నృ.పు)
179 “తరుణీ రత్నము పువ్వు తీగె నొకచేతన్వంచి పాదాగ్రమున్ ధరణిన్ మోపి యొకింత నిక్కిత నుమధ్యంబొష్బ హాస్య గక్ష ద్వయ స్ఫురణంబార కుచంబులుబ్బి నయనంబుల్విచ్చి లీలన్ముఖాం బురుహంబెత్తి యొకర్తు గోసెనెలమిన్ బుష్పంబులత్తోటలోన్- (భోజరా) “సత్ప్రబంధమహేశ్వరు శంభుదాసు - నధికతర యుక్తి నాదరించి” అని కాశీఖండములో శ్రీనాథుడే ఆదరించెను గదా!
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse