Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/ఆంధ్ర వాజ్మయ చరిత్ర

వికీసోర్స్ నుండి

ఆంధ్ర వాఙ్మయ చరిత్ర


ఆంధ్ర భాష, ఆంధ్ర వాఙ్మయము చాలా ప్రాచీనమైనదేకాని మనకు లభించిన మొదటి గ్రంథము 900 ఏండ్లనాటి ఆంధ్ర మహాభారతమే. ఆంధ్రుల ప్రశంస సంస్కృత మహాభారతములో, రామాయణములో, ఐతరేయ బ్రాహ్మణములో - ఇట్టి అతి ప్రాచీన గ్రంథాలలో లభించినది. ఆంధ్రులు క్రీ.పూ. 200 ఏండ్ల ప్రాంతము నుండి మహా సామ్రాజ్యాలు స్థాపించి ప్రపంచ ఖ్యాతి కాంచిన వారు. అట్టివారి భాషలో క్రీ.పూ. 200 ఏండ్ల నాటి నుండి క్రీ.శ. 1050 వరకు అనగా నన్నయ భట్టు కాలము వరకు ఇంచుమించు 1200 ఏండ్ల కాలములో వ్రాసిన ఒక గ్రంథము కూడా లభించక పోవుట చాలా ఆశ్చర్యకరము. నన్నయ భట్టుకు పూర్వము తెనుగు భాష, తెనుగు కవిత్వము లేదని కాదు. ఆ రెండున్నూ ఉండెను. కాని మనకు గ్రంథమొకటైన దొరుకలేదనుటయే విచారకరమైనది.

నన్నయ కంటె ఏడు నూరేండ్లకు పూర్వము నుండి అనగా క్రీ.శ. నాల్గవ శతాబ్దము నుండి తెనుగు రచనలు ఉండినట్లు మనకు కొన్ని నిదర్శనాలు కనిపించుచున్నవి. దినేశ చంద్ర సర్కారుగారు “శాతవాహనుల తర్వాతి వారు” అను తమ ఇంగ్లీషు గ్రంథములో ఇట్లు వ్రాసినారు.

“ఇక్ష్వాకు రాజుల ప్రాకృత శాసనాలు కొన్ని జగ్గయ్యపేటలో లభించినవి. నాగార్జున కొండలోని రికార్డుల భాషను గూర్చి అది ఒక విధమైన ప్రాకృతమని బహుశా కన్నడమయి యుండునని స్టెన్‌ కొనోప్‌గారు అభిప్రాయపడిరి. నాగార్జున కొండలో కొన్ని ప్రాకృత శాసనాలు దొరికినవి" అయితే జగ్గయ్యపేట, నాగార్జున కొండ అను నీ రెండు స్థలాలు తెనుగు నడిగడ్డలో నున్నందున అచ్చటి ప్రాకృత భాష తెనుగు రూపమై యుండియుండును. కాని కన్నడము కానేరదు. కన్నడమైనను క్రీ.శ. నాల్గవ శతాబ్దిలో తెనుగు నుండి అంతగా భిన్నించినట్టిది కాదు. ఇక్ష్వాకులు, అశ్మక, ములక దేశములు రాజ్యము చేసినట్లు వాయు పురాణము చెప్పుచున్నది. ములక దేశము నిప్పటికిన్ని మొలకసీమ అని పిలుచుచున్నారు. అది యిప్పటి పాలమూరు జిల్లా. అక్కడ నుండి ములకసీమ (మురికినాడు) కర్నూలు, కడప మున్నగు ప్రాంతాల నాక్రమించుకొని యుండెను.

శాలంకాయనులు అను రాజవంశము వారు తెనుగుదేశములో క్రీ.శ. 5వ శతాబ్దమందు రాజ్యము చేసినారు. వారి శాసనాలలో మన కర్థమగు కొన్ని తెనుగు పద్యములున్నవి. ఊరు, చెరువు, మునుడు ఇట్టి పదాలు కొన్ని గలవు. క్రీ.శ. 5వ శతాబ్దమందు అనగా నన్నయభట్టు కంటె 600 ఏండ్లకు ముందు ఆంధ్రదేశమున రాజ్యము చేసిన విష్ణుకుండిన రాజుల దాన శాసనములలో ఒక దానియందు “వర్షంబుల్‌” అను తెనుగు పదము గలదు. ఇట్టి నిదర్శనములను బట్టి తెనుగు భాషయు, తెనుగు రచనయు (శాసనములోనే అనుడు) క్రీ.శ. 400 నుండి యుండెననుట స్పష్టము.

విష్ణుకుండిన రాజుల వంశములోని వాడగు జయాశ్రయుడు అను బిరుదు గల మాధవవర్మ నన్నయకు అయిదు నూరేండ్లకు ముందుండినవాడు. అతడు జనాశ్రయచ్ఛందమను ఛందఃశాస్త్రమును వ్రాసెను. అందు శీర్ష లక్షణము అనగా సీస పద్య లక్షణములను తెలిపినాడు.

నన్నయకు పూర్వము తరువోజ, సీసము, అక్కరలు విశేషముగా ఉండి యుండును. నన్నయ తరువోజలు, అక్మరలు అను కొన్నిపద్యాలను మహాభారతములో వ్రాసెను. తర్వాతి కవులు వాటిని పరిహరించిరి. నన్నయకంటె ముందు ద్విపదలోను, దాని భేదములగు వృత్తములోను వ్రాసి జనులు పాడుకొను చుండిరి. ఇంచుమించు క్రీశ. 1240 నుండి 1300 వరకుండిన పాల్కురికి సోమనాథుడు తనకన్నా ముందు కాలములో నుండిన చాలా విధములైన పాటలను గూర్చి ఇట్లు తన పండితారాధ్య చరిత్రలో వ్రాసెను.


“మదినుబ్బి సంసార మాయాస్తవంబు
పదములు, తుమ్మెద పదముల్‌, ప్రభాత
పదములు, శంకర పదముల్‌, నివాళి
పదములు, వాలేశు పదములు, గొబ్బి


పదములు, వెన్నెల పదములు - సెజ్జ
వర్ణన మరి గణ వర్ణన పదములు”

ఇట్టి వెన్నో యుండెనట!


నన్నయభట్టు రాజమహేంద్ర వరము రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. అతడు క్రీ.శ. 1050 ప్రాంతమందుండినవాడు. అతనికంటె ముందుండిన కవితలో కొన్ని పద్యాలు కొన్ని శాసనాలలో మనకు లభించినవి. గుంటూరు మండలంలోని అద్దంకిలో ఒక శాసనము దొరికినది. అది క్రీ.శ. 848 ప్రాంతములోనిది. అనగా నన్నయభట్టు కంటె ఇన్నూరేండ్లకు పూర్వముది. నన్నయకంటె ముందు మనకు తెనుగు రచనలే దొరుక లేదనుట చేత మనకు దొరికిన ఈ అద్దంకి శాసనములోని ఒక పద్యము, ఒక వచనము ఎంతైనా విలువ చేయుట చేత వాటి నిందుదాహరింతును.


తరువోజ: పట్టంబుగట్టిన ప్రధమంబునేణ్డు
             బలగవ్వ ౦ బొప్పంగ బైవేచి సేన
             పట్టంబు గట్టిఞ్చ ప్రభు బణ్డరంగు.
             బఞ్చన సమత్త! పడువతో బోయ
             కొట్టంబుల్వణ్డెణ్డు గొణి వేంగి నాణ్ణిం
             గొళల్చి యాత్రి భువనాంకుశ బణనిల్చి
             కట్టెపుదుర్దంబు గడుబయల్చేసి
             కణ్డు కూర్చెజ వాడగవిఞ్చ మెచ్చి”

వచనము: పండ రంగు పరమమహేశ్వరుణ్డు ఆదిత్య భట్టారకుని ఇచ్చిన భూమి
              యెనుబొది పుడ్ల అడ్ల పట్టునేల. దమ్మ పురంబున దమ్ముములు. వీని
              రక్షిఞ్చన వారికి అస్వమేదంబున ఫలంబు అగు”.


నన్నయ కంటె ముందటిదగు రెండవ శాసనము, యుద్ధమల్లుని బెజవాడ శాసనము. అది క్రీ.శ. 898 ప్రాంతముది. అనగా నన్నయ భట్టు కంటె 150 ఏండ్ల కన్న ముందటి శాసనము. దానిలో 5 మధ్యాక్మరలు ఒక వచనము మనకు లభించినవి.

అందలి పద్యమొకటి యుదాహరింతును.


“జనసుత చేబ్ణోల నుణ్డి బెజవాడ జాత్రకు వచ్చి
త్రినయను సుతుణ్డొణ్డు సోట మెచ్చక తివిరి యిన్నెలన
యనఘాణ్డు సేకొని యిన్దు ప్రత్యక్షబయన్న నిచ్చ
గని మల్లణ్డెత్తించె గుడియు మతంబునుం గార్తికేయునకు”


ఈ విధముగా నన్నయ భట్టు కంటెముందు తెనుగు రచనలుండెను. నన్నయభట్టు కంటె ముందు కాలములో కొందరు తెనుగువారు కన్నడములో కావ్యాలను రచించిరి. నన్నయకన్న ముందుండిన తెనుగు వాఙ్మయ స్థితి మనకింతకంటె యెక్కువగా తెలియదు. ఇక నన్నయ కాలం నుండి నేటివరకు ఆంధ్ర వాఙ్మయ చరిత్ర ఘట్టములను సంగ్రహముగా తెలుపుదుము. ఈ చరిత్రను ఏడు భాగాలుగా విభజింపవచ్చును.

1. ఆది యుగము (పూర్వ చాళుక్య యుగము)

2. కాకతీయ యుగము

3. రెడ్డి యుగము

4. విజయనగర యుగము

5. తంజావూరి యుగము

6. సంధియుగము

7. ఆధునిక యుగము

ఈ యుగములను గురించి వివరించుటకు పూర్వమొక విషయమును స్మరింపవలెను. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వములో ఆధర్వణాచార్యులను గూర్చి వ్రాయుచు ఇట్లు వ్రాసినారు.

“ఆధర్వణ కారికలలో పంచమ కాండమందిట్లున్నది. ఆధర్వణ శిఖోపనిషది త్రిమూర్తీనాం సంస్కృతాంధ్ర ప్రాకృతాః ప్రియంకరాః”

అందు యొక చోట ఇట్లు వ్రాసినారు.

“ప్రాకృతే షడ్విధేచాపి వాల్మీకిం వా మహేశ్వరం ద్యాయేత్‌ ఆత్రతు మామేవస్మరేత్‌ పండిత సమ్మతః” - ఆధర్వణ కారికలలో పంచమ కాండము, 8వ కాండము, 4వ కాండము అని యుదాహరించినారు. (కాని వావిళ్ళ ముద్రిత ప్రతిలో ఈ విభాగము లేదు. మరియు ఉదాహరింపబడిన విషయాలున్ను కానరావు) ఇంకను అందిట్లు వ్రాసినారు. ప్రాచీనాంధ్ర వేత్తలుగా నీక్రిందివారు (ఆధర్వణ కారికలలో) పేర్కొనబడినారు. బృహస్పతి, కణ్వుడు, హేమచంద్రుడు, పుష్పదంతుడు, రావణుడు, గౌతముడు, ధర్మరాజు... ఈ గ్రంథమందు పూర్వాంధ్ర వ్యాకర్తలుగా హరి, శ్రీకవి, విష్ణుశర్మ, ధూర్వహుడు, శృంగార భూషణుడు అనువారు కూడ పేర్కొనబడినారు. ఈ ప్రాచీనాంధ్ర వైయ్యాకరణులను గురించి మనకేమి తెలియదు. “సర్వస్వము” వారు ఏ ఆధర్వణ కారికల నుండి పై వాటి నుదహరించిరో తెలియదు. ఇప్పటి ముద్రిత పత్రికలో అవేవియు కానరావు.

నన్నయ భట్టు ఆంధ్ర శబ్ద చింతామణిని వ్రాసెనందురు. కాని దానిని ఎలకూచి బాల సరస్వతియో మరెవ్వరో వ్రాసినారని కొందరి తలంపు. నన్నయ ప్రయోగాలు కొన్ని ఆంధ్ర శబ్ద చింతామణికి విరుద్ధమగుట దానికి తార్కాణమందురు. సకల భాషా వాగనుశాసనుడు అను బిరుదము పొందిన వాడగుటచేత నన్నయ యేదో వ్యాకరణము రచించి యుండును. ఇక పైన పేర్కొనిన ఆంధ్ర సారస్వత చరిత్రలోని యేడు యుగములను వివరించుట అవసరము.


“మహిమున్‌ వాగనుశాసనుండు సృజియింపన్‌ కుండలీంద్రుండు, త
న్మహనీయ స్థితి మూలమై నిలువ, శ్రీనాథుండు ప్రోవన్‌, మహా
మహులై సోముడు, భాస్కరుండు వెలయింపన్‌ సొంపు వాటించు నీ
బహుళాంధ్రోక్తి మయ ప్రపంచమునఁ దత్ప్రాగల్భ్య మూహించెదన్‌”


ఈ పద్యమును రామరాజ భూషణుడు తన వసుచరిత్రలో వ్రాసెను. అనగా వారే తనకన్న ముందుండిన మహా కవులని అతని అభిప్రాయము. ఆంధ్ర సారస్వతమునకు మూలస్తంభములనియు అతని భావము. తనకన్న పూర్వులైన ఇతర కవులనతడు మెచ్చుకొనలేదన్నమాట.

1. ఆదియుగము

నన్నయభట్టు మొదలుకొని తిక్కన సోమయాజి కాలము వఱకు స్థూలముగా ఈ యుగమును విభజింపవచ్చును. నన్నయ రాజరాజనరేంద్ర చాళుక్యరాజు యొక్క ఆస్థానకవి. క్రీ.శ. 1050 ప్రాంతమువాడు. అతడు మహాభారతములో ఆదిపర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో ముప్పాతిక భాగము రచించి పోయెను. తర్వాత నెల్లూరిలో మనుమసిద్ధి రాజ్యము చేసిన కాలములో క్రీ.శ. 1250 ప్రాంతములో తిక్కన సోమయాజి విరాటపర్వము మొదలుకొని భారతము తుదివరకు తెనిగించెను. తర్వాత రెడ్ల యాస్థానమందుండిన ఎఱ్ఱాప్రగడ కవి భారతములోని అరణ్య పర్వ శేషమును పూరించెను. ఈ ముగ్గురు మహాభారత కవులను కవిత్రయము వారందురు. వారు వాడిన పదాలు, చేసిన ప్రయోగాలు అన్నియు అందరికిని ప్రమాణమైనవి. మహాభారతము మన తెనుగులో, ఆది గ్రంథమైనను, నేటికిని ఉత్తమోత్తమమని అందరిచే గౌరవింపబడుచున్నది.

నన్నయ తర్వాత ఇంచుమించు నూరేండ్లకు నన్నెచోడుడు అను రాజు కుమార సంభవము అను చక్కని తెనుగు కావ్యమును రచించెను.

2. కాకతీయ యుగము

ఓరుగంటిని రాజధానిగా జేసుకొని తెనుగు దేశమును కాకతీయులు క్రీ.శ. 1140 నుండి 1340 వరకు రాజ్యము చేసిరి. ఈ కాలములోమొదటి ప్రతాపరుద్రుడు, మహాదేవరాజు, గణపతిదేవుడు, అతని కూతురు రుద్రమ్మ, ఆమె మనుమడు రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ వంశపు రాజులు. ఢిల్లీ సుల్తానగు అల్లావుద్దీన్‌ ఖిల్జీ కాలములో ఓరుగంటి రాజ్యము పడిపోయెను. కాని 1320 నుండి 1440 వరకు నామకార్థముగా కొంత కాలము హిందువుల పరిపాలన ముండెను.

కాకతీయుల కాలములో అనగా 1140 నుండి 1340 మధ్యకాలములో ఉత్తమ సారస్వతము బయలుదేరెను. ఈ కాలములోనే పాల్కురికి సోమనాథుడు (క్రీ.శ. 1250-1300 ప్రాంతమువాడు) బసవపురాణము, పండితారాధ్య చరిత్ర అను ద్విపద శైవ వాఙ్మయమును రచించెను. ఇతడు జనగామ తాలూకాలోని పాలకుర్తివాడు. కాకతీయుల సామంతుడును, రాయచూరు ప్రభువును అయిన గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణమును తన తండ్రి విఠల (రంగనాథుని) పేర ద్విపదగా రచించెను. గోనబుద్ధారెడ్డి “కవి లోక భోజుండు”. మల్లికార్జున పండితా రాధ్యుడు “శివతత్త్వసారము” అను మంచి శైవ గ్రంథమును రచించెను. ఈ కాలమందే నెల్లూరిలో మనుమసిద్ధి రాజు నొద్ద తిక్కన సోమయాజియుండెను. ఇతని కన్న మించిన కవి నేటివరకు పుట్టలేదు. ఇతడు నిర్వచనోత్తర రామాయణమును, మహాభారతములోని పదియేను పర్వములను రచించెను. ఇతని గొప్పతనమేమన ఇతనికే అభినవదండి అను బిరుదుగల కేతన తన దశకుమార చరిత్రమును అంకితమిచ్చి యిట్లు చెప్పుకొనెను-


“కవిత జెప్పి యుభయ కవి మిత్రు మెప్పింప
నరిది బ్రహ్మకైన నతడు మెచ్చ
బరగ దశకుమార చరితంబు జెప్పిన
ప్రోడ నన్ను వేరె పొగడనేల?”


దశకుమార చరిత్ర కథలు చాలా మనోహరములైనవి. తిక్కన సోమయాజి శిష్యుడగు మారన మార్కండేయ పురాణమును రచించెను. తిక్కన శిష్యునిది కావున అది ఉత్తమమైనది. తిక్కన సోమయాజి ఉభయకవి మిత్రుడు. సకల విద్యాకళా విచక్షణుడు, కవిబ్రహ్మ, బుధజనవిరాజి. కావ్య ప్రౌఢి పాటించు శిల్ప్చమున పారగుడు. తను కావించిన సృష్టి తక్కొరులు చేయలేదు. సాటిలేని వాడనిపించుకొన్న ఆంధ్ర కవి కుల గురువు.

క్రీ.శ. 1300 ప్రాంతముననున్న మంచన అను కవి కేయూర బాహు చరిత్రమును రచించెను. పుస్తకము చాలా చిన్నదే కాని కవిత చాలా గొప్పది.

కాకతీయ యుగములోనే శతకములారంభమయ్యెను. అందు ముఖ్యమైనవి (బద్దెన) భద్ర భూపాలుడను నతనిచే రచితమని చెప్పబడు సుమతిశతకము, నీతి శాస్త్ర ముక్తావళి, పాల్కురికి సోమనాథుని వృషాధిపశతకము, యథావాక్కుల అన్నమయ్య “సర్వేశ్వర శతకము”.

3. రెడ్డియుగము

అద్దంకి, కొండవీడు, కోరుకొండ, రాజమహేంద్రవరములను రాజధానులనుగా జేసుకొని రెడ్డిరాజులు తెనుగు సీమను క్రీ.శ. 1300 నుండి 1450 వరకు రాజ్యము చేసిరి. ఒక దిక్కున సామ్రాజ్య విచ్చిత్తి కాగా ఇంకొక దిక్కున రెడ్డి రాజులు ఆంధ్రులను రక్షించి పాలించినవారైరి.

రెడ్డి రాజుల నాశ్రయించిన కవులలో ప్రఖ్యాతులైనవారు ఎఱ్ఱాప్రగడ, శ్రీనాథుడు, వామనభట్ట బాణుడు, వెన్నెలకంటి సూరన, నిశ్శంక కొమ్మన. రెడ్డిరాజులు స్వయముగా సంస్కృత గ్రంథాలు, వ్యాఖ్యలు రచించిరి. కుమారగిరి వసంత రాజీయమను నాట్యశాస్త్రమును సంస్కృతమున రచించెను. పెదకోమటి వేమభూపాలునికి సర్వజ్ఞ చక్రవర్తి అను బిరుదముండెను. ఈరాజుల రసికతవలన దేశమందు కవులు బహుళమై శ్రీనాథుని హాస్యమునకు పాత్రులైరి. శ్రీనాథుడు కొండవీటి వీధిలో తిరుగు గాడిద నుద్దేశించి యిట్లు పద్యమల్లెను -


“బూడిద బుంగలై యొడలు పొడిమి దిక్క మొగంబు వెల్లనై
వాడల వాడలం దిరిగి వాడును వీడును చొచ్చొచోయనన్‌
గోడల గొందు లందొదిగి కూయుచు నుందువు కొండవీటిలో
గాడిద! నీవునుం గవివి కావుగదా యనుమాన మయ్యెడిన్‌”.


ఈ కాలములోని ఎఱ్ఱాప్రగడ భారతములోని అరణ్య పర్వశేషమును ముగించిన కవిత్రయములోనివాడు. అతడు నృసింహ పురాణమును, హరివంశమును రచించెను. ఆ రచనతో ప్రబంధ పరమేశ్వరుడను బిరుదమును పొందెను.

రెడ్ల ఆస్థాన కవియు, ఆస్థాన విద్యాధికారియునైన శ్రీనాథుడు ఆనాటి వెలమ రాజులను, విజయనగర చక్రవర్తులను, ఇతర రాజులను దర్శించి వారిచే పూజితుడై దిగ్విజయమొంది తన గొప్పదనమును చూపెను. విజయనగరములో డిండిమభట్టు అను ఉద్దండుని జయించి 'నన్ను జయించేవారు లేరు” అని కంచు ఢక్కను మ్రోగించు కొనుచుండిన ఆ డిండిమభట్టు ఢక్కను పగులగొట్టించి విజయనగర చక్రవర్తిచే ముత్యాల శాలలో బంగారు దీనారాలతో స్నాతుడై కవి సార్వభౌమ బిరుదమందెను. అట్టి శ్రీనాథుడు శృంగార నైషదమును, కాశీఖండమును, భీమ ఖండమును రచించెను. ఇంకా ఇతర కావ్యాలు వ్రాసెను. పల్నాటి వీరుల కథలను ద్విపదగా ఇతడే వ్రాసెనని యందురు. ఎవరు వ్రాసినను అది చక్కని వీరకావ్యము. శ్రీనాథుడు భోగి, బమ్మెర పోతన యోగి.

శ్రీనాథునికి సమకాలికుడగు వల్లభరాయలు అను చిన్న రాజుండెను. అతడు క్రీడాభిరామమను శృంగార ప్రధానమగు వీధి నాటకమును రచించెను. కాని అది శ్రీనాథుడే వ్రాసినట్లు శైలి తెలుపుచున్నది. ఇద్దరునూ కలిసి వ్రాసిరో యేమో కాని కాకతీయుల నాటి సాంఘిక చరిత్రకు క్రీడాభిరామమే ముఖ్యాధారమగు చక్కని గ్రంథము. వెన్నెలకంటి సూరన విష్ణు పురాణమును రచించెను. ఇది భారత భాగవతములవలె ఆంధ్రులలో ప్రచారమైనట్టిది కాదు. అయినను ఇతనిది చక్కని కవిత.

ఈ వంశమువాడే వెన్నెలకంటి అన్నయ్య అను కవియుండెను. అతడే కాలమువాడో తెలియదు కాని ప్రచురణకర్తలు అతడు క్రీ.శ. 13వ శతాబ్ద్యనంతరము వాడన్నారు. బహుశః ఈ రెడ్డియుగములోనివాడేనేమో! ఈ అన్నయ్య కవి “షోడశకుమార చరిత్రము”ను రచించెను. ఇది చక్కని కవిత. అచ్చు పోసినట్లు ఒకే ధోరణిలో విసుగెత్తించు కవిత్వమును, కథలను వ్రాసిన ప్రబంధ కవుల రచనలను చదివిన వారి కిట్టి కథలు చాలా ఆనందమునిచ్చును. ఈతని షోడశకుమార చరిత్ర కథలు మనోహరమైనవి. ఇట్టి కథలను వ్రాసిన వారిలో పేర్కొనదగినవారు వీరు.


జక్కన - విక్రమార్క చరిత్ర

అనంతామాత్యుడు - భోజరాజీయము

కదిరీపతి - శుకసప్తతి

కొరవి గోపరాజు - సింహాసన ద్వాత్రింశిక

కేతన - దశకుమార చరిత్ర

మంచన - కేయూర బాహుచరిత్ర

వెంకటనాథుడు - పంచతంత్రము

పింగళి సూరన - కళాపూర్ణోదయము

ఇవన్నియు ఉత్తమ కవితలు.


ఇంచుమించు క్రీ.శ. 1380 ప్రాంతంలో నుండినవాడు రావిపాటి త్రిపురాంత కుడు. సంస్కృతములో ప్రేమాభిరామము రచించెను. అది మాయమై పోయినది. త్రిపురాంతక కవిని (తిప్పన్నను) గూర్చి క్రీడాభిరామములో ఇట్లన్నారు.


“నన్నయభట్టు తిక్కకవి నాయకులన్న హుళక్కిభాస్మరుం
డన్నను చిమ్మపూడి యమరాధిపుడన్నను సత్కవీశ్వరుల్‌
నెన్నుదుటం గరాంజలులు నింతురు జేయని రావిపాటి తి
ప్పన్నయ నంతవాడ తగునా యిటు దోసపు మాటలాడగన్‌?”


ఇతని తెనుగు కృతి త్రిపురాంతకోదాహరణము. ఇది ఒక్కటే మనకు లభించినది. అది ఉత్తమశైలి కలిగినట్టిది. రెడ్డిరాజుల సమకాలికులు రాచకొండ దేవరకొండలకు ప్రభువులైన వెలమరాజులు. అందు సర్వజ్ఞ బిరుదు వహించిన సింగమనాయకుడు సంస్కృతములో రచనలు చేసెను. అతని కాలమందే, అతని సీమ యందే కోలాచల మల్లినాథ సూరి యుండెను. జనగామ తాలూకాలో బమ్మెర అను గ్రామము కలదు. అది పాల్కురికి సోమనాథుని పాలకుర్తికి రెండు మూడు మైళ్ళ దూరముననున్నది. ఆ గ్రామము పోతనామాత్యుని జన్మదేశమై పవిత్రమైనది. పోతనామాత్యుడు ఆంధ్ర మహాభాగవత మును రచించిన మహాకవి. అతని భాగవతము అనేకులు పారాయణము చేయుదురు. అతనికి శిష్యులైన ఏర్చూరి సింగయ్య, వెలిగందల నారయ్య, గంగయ్య అనువారు భాగవతములో కొన్ని భాగములను రచించిరి.

సర్వజ్ఞ సింగభూపాలుడు భాగవతమును తన కంకిత మీయనందున దానిని పాతి పెట్టించగా ఖిలమైన భాగాలను పోతన శిష్యులచే పూరించిరను అపవాదము కల్పితమయ్యెను. అది అబద్ధము. ఆ ముగ్గురు శిష్యులలో ఒకరు కూడ సూచన మాత్రముగానైనను ఆ మాట వ్రాయలేదు. అట్లయితే వారెందుకు కొన్ని భాగాలను వ్రాసిరనగా పోతన తన శిష్యులను అనుగ్రహించుటకై వారిచే కొన్ని భాగాలను వ్రాయించి తనతోపాటే వారిని గూడ వందనీయులనుగాజేయ సంకల్పించి యుండేనేమో. ఆ ముగ్గురు శిష్యుల కవనము కూడా పోతన కవితకు కుడియెడమగా ప్రశంసా పాత్రముగా నున్నది.

పోతన భగవద్భక్తుడు. అతడు భక్తిరసాన్ని అద్వితీయముగా అసామాన్యముగా భాగవతమందు చిప్పిల్లజేసెను. భక్తిరస ఘట్టములందు అతడు కవిత్రయాన్నే కాక ఆంధ్ర కవులందరిని కూడా మించినవాడయ్యెను. ప్రహ్లాద చరిత్ర, కుచేలోపాఖ్యానము, గజేంద్రమోక్షము, ధృవచరిత్ర, అంబరీషోపాఖ్యానము ఉత్తమమైన భక్తిరస ప్రధాన ఘట్టములు. అందు ప్రహ్లోద చరిత్ర అగ్రస్థానమలంకరించును.


“మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు”


అను పద్యము వంటి పద్యాలు అందు నిండుగా గలవు. క్రీ.శ. 1420 ప్రాంతంలో రాచకొండ రాజుల యాశ్రములో నుండిన కొరవి గోపరాజు అతని

సింహాసన ద్వాత్రింశిక మనోహరమగు విక్రమార్క కథల కావ్యము.

4. విజయనగర యుగము

క్రీ.శ. 1323లో మహ్మదీయులు ఓరుగంటిని పట్టుకొనిరి. ఆ సమయములో ఓరుగంటి నుండి సంగమ అనునతని అయిదుగురు కుమారులు హంపికిని, దాని దగ్గర నుండు కంపిలికిని వెళ్ళి అచ్చట విజయనగర దుర్గమును తుంగభద్రా తీరమందు నిర్మించి, కీ.శ. 1336లో విజయనగర సామ్రాజ్య స్థాపన చేసిరి. ఆ సోదరులలో హక్క (మొదటి హరిహరరాయలు) బుక్క(రాయలు) ముఖ్యులు. క్రీ.శ. 1347లో బహమనీ రాజ్యము స్థాపితమయ్యెను. అది కొంతకాలానికి అయిదు చీలికలై పంచ సుల్తానులకు మూలమయ్యెను. హరిహరరాయ కాలము బహమనీ సుల్తానులతో పోరాడుటతో సరిపోయెను. అతని కొడుకు రెండవ హరిహరరాయలు క్రీ.శ. 1379 నుండి 1404 వరకు రాజ్యము చేసెను. తర్వాత మొదటి దేవరాయలు రాజయ్యెను. అతని కాలములో బహమనీ దాడి ఎక్కువై బాధ కలిగించెను. రెండవ దేవరాయలు 1421-1448 వరకు రాజ్యము చేసెను. అతడును దుర్భలుడగురాజు. తుదకు క్రీ.శ. 1486లో సాళువ నరసింహరాయలను చంద్రగిరి సామంతరాజు విజయ నగరాన్ని ఆక్రమించుకొని రాజ్యము చేసెను. అతడు ప్రబలుడై రాజ్యమును విస్తరించి, తురక ప్రభువులనోడించి రాజ్యమును స్థిరపరచెను. అతని కొడుకు ఇమ్మడి నరసింగ రాయలు. అతనిని క్రీ.శ. 1505లో అతని సేనాని తుళు వంశమువాడగు నరస నాయకుడు చంపి రాజ్యము నాక్రమించుకొనెను. అతని కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1509 నుండి 1529 వరకు దేదీప్యమానంగా, దిగ్విజయమానంగా రాజ్యం చేసెను. విజయనగర రాజ్యము గోదావరి నుండి రామేశ్వరము వరకు వ్యాపించి, మహాసామ్రజ్యమై సుల్తానుల బలమును భంగపఱచిన దయ్యెను. శ్రీకృష్ణదేవరాయల తర్వాత అతని తమ్ముడు అచ్యుతరాయలు చక్రవర్తి యయ్యెను. అతడు దుర్భలుడు, అతని తమ్ముని కొడుకగు సదాశివరాయలు క్రీ.శ. 1542లో చక్రవర్తియయ్యెను. అతడు నామకార్థముగా రాజుగా నుండెను. కాని శ్రీకృష్ణదేవరాయలు అల్లుడగు అళియ రామరాజు నిజమైన చక్రవర్తిగా పరిపాలించెను. క్రీ.శ. 1565లో అయిదుగురు దక్కన్‌ సుల్తానులు కలిసి తళ్ళికోట యొద్ద రామరాజుతో యుద్ధము చేసి అతనిని చంపి విజయనగరమును ధ్వంసము చేసిరి. కాని విజయనగర బలము నాశనము కాలేదు. రామరాజు తమ్ముడు తిరుమలరాజు పెనుగొండను రాజధానిగా చేసుకొని విజయనగర సామ్రాజ్యాన్ని పాలించెను. అతని తర్వాత శ్రీరంగరాయలు చంద్రగిరిని రాజధానిగా చేసుకొని ఇంచుమించు 1650 వరకు రాజ్యము చేసెను. అటు తర్వాత విజయనగర సామ్రాజ్యము సంపూర్ణముగా నశించెను.

ఇక 1350 నుండి 1650 వరకు వాఙ్మయ స్థితి ఎట్టిదో కనుగొందము.

ఈ 300 ఏండ్ల కాలమును ప్రబంధ యుగమని చెప్పవచ్చును. ఈ కాలంలో అష్టాదశ వర్ణనలతో సంస్కృతపద భూయిష్టశైలితో శబ్దాలంకార బాహుళ్యముతో గొప్ప గొప్ప ప్రబంధాలు రచింపబడెను.

మొదట బుక్కరాయల కాలంలో నాచసోమనాథుడను మహాకవి యుండెను. అతనికి గుత్తి దుర్గము క్రింద నుండు పెంచికలదిన్నెను అగ్రహారముగా బుక్కరాయలు దానము చేసినందున అతడాగ్రామము వాడనుట స్పష్టము. ఆ దాన శాసనములో కవి నిట్లు వర్ణించినాడు.


“యాజుషాణాం వరేణ్యాయ సకలాగమ వేదినే
అష్టాదశ పురాణానా మభిజ్ఞాతార్థ వేదినే
అష్ట భాషా కవిత్వశ్రీ వాణీ విజిత సంపదే
సోమాయ నాచనాం భోధేః సోమాయామిత తేజసే”


దీనిని బట్టి అతని పాండిత్య కవిత్వ మహత్వము సువ్యక్తమగుచున్నది.

తిక్మనవలె అతడు అసాధారణ కవి. అతడు ఉత్తర హరివంశమును రచించెను. అతడు క్రీ.శ. 1340 ప్రాంతమువాడు. అతడు “సకల భాషా భూషణుడు”, “సాహిత్య రస పోషణ సంవిధాన చక్రవర్తి”. “అలికంబున యక్షిని దాచినట్టి సర్వజ్ఞుడు”, అష్ట భాషా కవిత్వ విశారదుడు”, “నవీన గుణ సనాథుడు”. సీస పద్యము ఇతని చేతిలో పరిణతి నందెను.


కల్హార మకరంద కలిత మందాకినీ
      లహరీపరీత కోలాహలంబు
బాలేందు చంద్రికా పరభాగశోభా ప
      రాగ సంభావితా రగ్వధంబు
సేవాసమాసన్న సిద్ధ సీమంతినీ
      తాలవృంతోత్తాల తాండవంబు


కాత్యాయనీ దత్త కర్ణావతంస క
         ర్పూర ఖండామోద పూరితంబు
 
మారుతంబది నామీద మలసియాడ
గలుగునొకొ నాకు నొకనాడు కన్నులార
శివుని జూచు పుణ్యంబును చింతనెరయ
మొదలి వేలుపుఁ బొడగంటి మ్రొక్కగంటి.


ఈ నడకను శ్రీనాథుడు నేర్చుకొని తన సీసపద్యాలను తీర్చిదిద్ది యలంకరించు కొనెను. నాచన సోమనాథుడు సామెతలను ఎక్కువగా వాడిన మొదటి తెనుగు కవి. ఉత్తమ హాస్యమునకుఁగూడ నితడే మొదటివాడు.

మొదటి దేవరాయల మంత్రిగా నుండిన సిద్ధనకు జక్కన కవి తన విక్రమార్క చరిత్రను అంకితమిచ్చెను. జక్కన క్రీ.శ. 1430-1447 ప్రాంతమందుండెను. తన కవిత్వమును గూర్చి యిట్లు వ్రాసుకొనెను.


“చక్కన నీవైదుష్యము
చక్కన నీకావ్యరచన చాతుర్యంబుల్‌
చక్కన నీవాగ్వైఖరి
చక్కన నీ వంశమమహిమ జక్కన సుకవీ!”

ఇతడు చక్కని కథలు వ్రాసెను. సంస్కృతాంధ్రములందు అనర్గళధార గలవాడు.

కల్పాంత దుర్దాంత కలుషాంతక స్వాంత
      దుర్వార విహ్నికి నోర్వవచ్చు
నిష్ఠుర నిర్ఘోష నిర్ఘాత సంఘాత
      జాత మహివహ్ని సైపవచ్చు
ప్రళయ కాలాభీల ఫాలలోచన ఫాల
      భాగానలస్ఫూర్తి బ్రతుకవచ్చు
కాకోదరేంద్ర పూత్కార సంభవ తీవ్ర
      కాకోల దహనంబు గదియవచ్చు


కాక సైరింపవచ్చునే లోకదహన
దర్పితంబైన యస్మత్ర్పతాప వహ్ని
తావకోత్పాహ సాహసౌదార్య ధైర్య
గతికి మెచ్చితి విక్రమార్క క్షితీంద్ర!”

అని సంస్కృత పద జటిలముగా వ్రాసెను.

“పలుకులు వేయు నేటికిక, బ్రాహ్మణసూనుడ వీవు, నీకు దో
ర్బలమున కేమి కారణము, బాపనపోటును, కప్పకాటునుం
గలదె ధరిత్రి? భట్టిమొన గట్టిగ నమ్మకు, మోసపోకు, నీ
కొలదులె రాచకార్యములు, కోమటి బుద్ధుల దీర్పదీరునే?”

అని లలితముగా గూడ రచించెను.


పిల్లలమఱ్ఱి పినవీరన సూర్యాపేట యొద్దనుండు పిల్లలమఱ్ఱివాడు యందురు. అతడు జైమినీ భారతము వ్రాసి సాళువ నరసింహరాయల కంకితమిచ్చెను. అతని శృంగార శాకుంతలము, జైమినీ భారతము ప్రసిద్ధ కావ్యములు. “వాణి నా రాణియని యెద విరుచుకొని పలికినదీ పినవీరనయేనట! ఈ వీరభద్రుడు “విపులచాటూక్తి నిర్ణిద్రుడు”. తుళు వంశపు నరసింహరాయలకు నంది మల్లయ్య, ఘంట సింగయ్య అను జంటకవులు తమ వరాహపురాణము నంకితమిచ్చిరి.

శ్రీకృష్ణదేవరాయల కాలము ఆంధ్ర సారస్వతమునకు మహావైభవకాలము. అతని యాస్థానములో అష్టదిగ్గజములు అను ఎనిమిది మంది కవులుండిరని ప్రతీతి. కాని యందు పేర్కొనబడిన కవులలో కొందరు అతని ఆస్థానమువారు కారు.

శ్రీకృష్ణదేవరాయలు స్వయముగా మహాకవి. అతడు ఆముక్తమాల్యదను వ్రాసెను. దానినతడు వ్రాయలేదనీ, మను చరిత్ర వ్రాసిన అల్లసాని పెద్దన వ్రాసెననీ అందురు. కాని ఈ రెండు పుస్తకముల శైలిని చూచిన రెంటికిని ఏమిన్నీ పోలిక లేదు. ఆముక్తమాల్యద శైలి చాలా బిరుసు. మను చరిత్ర శైలి తీర్చి దిద్ది మృదువుగా, ఇంపుగా నుండునట్లు వ్రాసినది. ఆముక్త మాల్యద సానబట్టని గనిలోని రత్నము -

మను చరిత్ర మెఱుగిచ్చి వంకలు దిద్దిన వజ్రము.


“గృహసమ్మార్జనమో, జలాహరణమో, శృంగారపల్యంకికా
వహనంబో, వనమాలికాకరణమో, వాల్లభ్య లభ్యధ్వజ
గ్రహణంబో, వ్యజనాతపత్ర ధృతియో, బ్రాగ్దీపికారోపమో
నృహరీ! వాదములేల? లేరెయితరుల్‌ నీ లీలకుం బాత్రముల్‌”

- ఆముక్త మాల్యద



“బహురత్నద్యుతి మేదురోదర దరీభాగంబులం బొల్చుని
మ్మిహికాహార్యమునం జరింతు మెపుడుం బ్రేమన్‌ నభోవాహినీ
లహరీ శీతల గంధవాహ పరిఖేల న్మంజరీ సౌరభ
గ్రహణేందిందిర తుందిలంబులవి మత్కాంతార సంతాపముల్‌”

- మనుచరిత్ర


ఏ పద్యము చూచినను రెంటిలో ఇట్టి శైలి భేదముండును - కాన శ్రీకృష్ణరాయలే ఆముక్త మాల్యదను రచించెనని విశ్వసింపవలెను. బ్రాహ్మణేతరుల కవిత్వమెంత మంచిదైనను అది కాకజుష్టంబైన హవ్యంబువోలె గ్రాహ్యంబు కాదు” అని తిట్టిన అప్పకవి తన అప్పకవీయములో ఆముక్తమాల్యదను ఉదాహరించిపుడంతయు అది పెద్దన్నగారిది అని వ్రాసెను. అక్కడనుండి ఈ కథకు వేళ్ళు వచ్చెను. ఆముక్త మాల్యదను విష్ణు చిత్తీయమనియు నందురు. శైలి బాగుగా లేకున్నను అందలి భావములు వర్ణనలు అనితర కావ్య లభ్యములు.

కృష్ణదేవరాయలకు ముఖ్యుడైన ఆస్థాన కవి అల్లసాని పెద్దన. అతనికి “ఆంధ్ర కవితాపితామహ” అను బిరుదమిచ్చి అతని కాలికి ఆ చక్రవర్తి స్వయముగా గండపెండేరమును తొడిగించెను. శ్రీకృష్ణ దేవరాయలు చనిపోయిన తర్వాత అల్లసాని పెద్దన అతనిని తలచుకొని వాపోయిన పద్యమును చదువు ఆంధ్రులు కూడ ఆనాటి వైభవమును తలచుకొని దుఃఖింపక మానరు. పెద్దన రాయల గూర్చి ఇట్లు విలపించెను.


“ఎదురైనచో దన మద కరీంద్రము డిగ్గి
         కేలూత యొసగి యెక్కించు కొనియె
మను చరిత్రంబందు కొనువేళ పురమేగ
         పల్లకి తనకేల బట్టి యెత్తి


బిరుదైన కవి గండపెండేరమున కీవె
        తగుదని తానె పాదమున దొడిగె
గోకట గ్రామాద్యనేకాగ్రహారంబు
        లడగిన సీమలయందు నిచ్చె

ఆంధ్ర కవితా పితామహ యల్లసాని
పెద్దన కవీంద్రయని నన్ను బిలుచునట్టి
కృష్ణ రాయలతో దివి కేగలేక
బ్రతికి యున్నాడ జీవచ్చవంబ నగుచు.”


శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన మందలి అష్ట దిగ్గజము లెవరనగా! 1. అల్లసాని పెద్దన, 2. నంది తిమ్మన (ముక్కు తిమ్మన), 3. అయ్యలరాజు రామభద్ర కవి 4. ధూర్జటి, 5. మల్లన (ఫ్రౌడకవి), 6. పింగళి సూరన, 7. రామరాజ భూషణుడు, 8. తెనాలి రామకృష్ణుడు. తుది ముగ్గురు కృష్ణరాయల కాలములో గ్రంథాలేవి రచింపలేదు. నంది తిమ్మనకు ముక్కు పెద్దదిగా నుండెనేమో ముక్కు తిమ్మన అనియే అతడు ప్రసిద్ధి నొందెను.

“ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు”

అని నానుడి యేర్పడెను. అతడు పారిజాతాపహరణము రచించెను. అది ఉత్తమ కావ్యాలలో చేరినట్టిది.


“జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునన్‌
దొలగంద్రెసె లతాంగి యట్లయగు నాథుల్‌ నేరముల్‌ సేయ పే
రలుకం జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్‌ నేర్తురే?”


ఇట్టి సుందర పద్యములను నంది తిమ్మన వ్రాసెను.

కృష్ణరాయల కాలములో యెల్లనార్యుడు - నాదెండ్ల గోప ప్రధాని కూడా రచనలు చేసిరి. అవి అంత గొప్పవి కావు.

ధూర్జటి కవి కాళహస్తి మాహాత్మ్యము అను కావ్యమును రచించెను. అది ఉత్తమ ప్రబంధాలలో చేరినట్టిది. మల్లన రాజశేఖర చరిత్రము కూడ అదే శ్రేణిలో చేరినది. ఆళియ రామరాజు ఆస్థానకవి యగుటచే రామరాజ భూషణుడు అను ఖ్యాతి గాంచిన భట్టుమూర్తి కవి వసుచరిత్రను వ్రాసెను. అందు శ్లేషలు. యమకములు, ఉత్ప్రేక్షలు విశేషముగా గలవు. అతడు వ్రాసిన పద్ధతిపై ఇతరులు వ్రాయబోయి వెల్లకిలబడిరి. అతనిని పూర్తిగా ప్రతి పద్యములో అనుకరించిన వాడు కొల్లాపుర మాధవరాయలు. అతడు చంద్రికా పరిణయము రచించెను.

రామరాజు కాలములో పింగళి సూరన కళాపూర్ణోదయమును రచించెను. అది అద్భుత కల్పనా కథ. అది తెనుగు సారస్వతములో అపూర్వమగు గ్రంథము. ఇతని ప్రభావతీ ప్రద్యుమ్నము కూడా చక్కని గ్రంథము. ఇతడు మొదటి ద్వ్యర్థి కావ్యమగు రాఘవ పాండవీయము రచించెను.

ఇదే కాలములో తెనాలి రామకృష్ణుడు పాండురంగ మాహాత్మ్యమును రచించెను. అందు మారుమూల పదాలు బహుళము. కొన్ని వర్ణనలు చక్కగా ఆకర్షకములుగా నున్నవి.

విజయనగర సామ్రాజ్య కాలములో ఈ క్రింది వారుకూడా రచనలు చేసిరి. మనుమంచి భట్టు, దుగ్గన, తాళ్ళపాక చిన్నన్న, సంకుసాల నృసింహకవి (కవి కర్ణ రసాయన కర్త) రామభద్రకవి, ఎఱ్ఱన (శృంగార మల్హణ చరిత్రకర్త) రామరాజరంగన్న కుమార దూర్జటి (కృష్ణరాయ విజయము), తిరువెంగళ నాథుడు, మున్నగు పలువురు తమశక్తికొలది పద్యకావ్యములు రచించిరి. కాని ఉత్తమ శ్రేణిలోనివికావు.

విజయనగరపు తుదిరాజగు శ్రీరంగరాయలు చంద్రగిరిలో రాజ్యము చేసిన కాలముననో ఇంచుక తర్వాతి కాలముననో క్రీ.శ. 1600-1650 ప్రాంతములో వుండినవాడు కదిరీపతి. ఇతడు అనంతపుర మండలములోని కదిరి నివాసి. ఇతడు శుకసప్తతి యను కథల పుస్తకమును రచించెను. ఈ శుకసప్తతి తెనుగు సారస్వతములో తృతీయ పంథ త్రొక్కినదనవచ్చును. ఇందు హాస్యము, తెనుగు నుడికారము, లలితమగు శైలి, లోకానుభవము, చక్కని శృంగార రసము అన్నియు నిండి ప్రతి పద్యము మనోహరముగా నుండును. ఇతని వర్ణనలు ఇతర ప్రబంధ కవులవలె అంధాను కరణములు కావు. విరహ తాపం కలిగితే కవులందరు చంద్రుని, గాలిని, చిలుకలను, వసంతుని తిట్టిరి. ఈ కవి కథలోని ఒక (బ్రాహ్మణుడు విరహతాపము పొంది

యిట్లవస్థపడినాడు.


“ఒడిలోన పంచాంగ ముంచు కొన్నదిగాన
          కెటుపోయె ననుచు నూరెల్ల వెదకు
పనిలేనిపని వీధి జనుచు గ్రమ్మరు నాత్మ
          గృహమంచు నెంచి యిల్లిల్లు దూరు
అపుడు భుక్తి యొనర్చి యవునసే సంకటి
          తింటినాయని యింటి తెఱవ నడుగు
కుఱచ దోవతి కట్టుకొని యెవ్వరోయిట్లు
          గట్టిపోయిరటంచు గలవరించు

గడియలో తెల్లవాఱె, భాస్కరుడు గ్రుంకె
జాగులేలంచు సందెపై సందెవార్చు
కంతుమాయల నుమ్మెత్తకాయఁ దిన్న
పొలుపు సారెకు దెల్పునప్పుడమి వేల్పు”.


వర్ణనయైనను సరే సహజాలంకారములతో స్వభావోక్తులతో చక్కని తెనుగుతో నిండియుండును.

గోలకొండ కవులు

విజయనగర రాజుల కాలములో గోలకొండ కుతుబ్షాల కాలములో అందు ముఖ్యముగా ఇబ్రహీం కుతుబ్షా కాలములో పలువురు తెనుగు కవులుండిరి. అందు ముఖ్యులు మొదటి అచ్చ తెనుగు కావ్యమగు యయాతి చరిత్రమును వ్రాసిన పొన్నగంటి తెలగనార్యుడు, మాలిక్‌ ఇబ్రాహీం కుతుబ్షా (మల్కిభరాముని) ఆస్థాన కవియైన అద్దంకి గంగాధర కవియునై యుండిరి. ఇతడు తపతీ సంవరణోపాఖ్యానమును రచించెను. గోలకొండ ఖిల్లాలో కరణముగా నుండిన సారంగుతమ్మయ వైజయంతీ విలాసమను మంచి కావ్యమును రచించెను. ప్రౌఢ కవి మల్లారెడ్డియును ఈ కాలమువాడే. అతడు దోమకొండ ప్రభువులకు పూర్వ పురుషుడు. అతడు షట్చక్రవర్తి చరిత్ర మున్నగు పెక్కుగ్రంథాలను రచించెను. నిరంకుశోపాఖ్యానమును వ్రాసిన కందుకూరి రుద్రయ్య ఈ కాలము వాడే. ఓరుగల్లును కొంత కాలము పాలించిన షితాబ్‌ఖాన్‌ (సీతాపతి) కాలములో చరిగొండ ధర్మన్న చిత్ర భారతమును రచించెను. క్రీ.శ. 1450 ప్రాంతములో రాయచూరు మండలములో కృష్ణాతీర మందుండిన అనంతామాత్యుడు భోజరాజరాజీయమను ఉత్తమ కావ్యమును రచించెను. ఇందలి శైలి సరళమే కాక విశిష్ట పాండిత్యముతో కూడినట్టి స్వభావ వర్ణన లిందెక్కువ కలవు. ఇతడు గొప్పలాక్షణికుడు. రసాభరణము అను అలంకార శాస్త్రమును రచించెను. క్రీ.శ. 1600 ప్రాంతమువాడు. కొల్లాపురము రాజగు మల్ల భూపాలు నాశ్రయించి బాలసరస్వతి మల్ల భూపాలీయము రచించెను. ఇది భర్తృహరి శతకత్రయానికి తెనుగుసేత.

ఇంచుమించు క్రీ.శ. 1500 ప్రాంతమున సర్వజ్ఞ సింగభూపాలుని పుత్రుడగు మాధవుని వద్ద రాచకొండలో నుండునట్టి గౌరన అను కవి హరిశ్చంద్ర ద్విపదను, నవనాథ చరిత్ర ద్విపదను రచించెను. ఈ రెండును ఉత్తమ రచనలు. అందు హరిశ్చంద్ర ద్విపదయేమిన్న. ద్విపద ప్రబంధాలలో నిది పూజ్య స్థానమందినది. గౌరన కుమారుడు భైరవుడు. శ్రీరంగ మాహాత్య్యమను ప్రబంధమును రచించెను.

5‌. తంజావూరు యుగము

ఆంధ్ర సామ్రాజ్యము క్రమక్రమముగా దక్షిణాభిముఖమయ్యెను. విజయనగర సామంతులుగా, మండలాధిపతులుగా మధురను, తంజావూరును నాయకరాజులు పాలించుచుండిరి. అందులో మధుర సారస్వత పోషణకు ప్రసిద్ధికెక్క దయ్యెను. తంజావూరు రాజులు మాత్రము ఆంధ్రసారస్వతమును పోషించిన తుదిరాజులు. ఆ రాజులను గూర్చి ముందుకొంత తెలుసుకొనవలెను.

విజయనగర చక్రవర్తియగు అచ్యుతదేవరాయల భార్యకు చెల్లెలి భర్తయగు చిన చెన్నప్ప నాయకుడు క్రీ.శ. 1540 ప్రాంతమందు తంజావూరికి నాయక రాజయ్యెను. అతని కుమారుడు అచ్యుత నాయకుడు క్రీ.శ. 1561 లో రాజయి, ఇంచుమించు 50 ఏండ్లు రాజ్యము చేసెను. అతని తర్వాత తంజావూరు రాజ్యము క్షీణించి తుదకు శివాజీ సోదరుడైన ఏకోజీ వశమై మహారాష్టుల పాలనములోనికి వెళ్లి ఇంగ్లీషువారు ప్రభువులైన తర్వాత వారి వశమై పోయెను.

తంజావూరి రాజులలో రఘునాథరాయల కాలమునను, విజయరాఘవుని కాలమునను ఆంధ్ర సారస్వతము ఇంచుమించు నూరేండ్లకాలము పోషింపబడిన దయ్యెను. ఈ రాజుల కాలములో పలువురు స్త్రీలు, భోగస్త్రీలు కూడా సంస్కృతాంధ్రము లందు రచనలు చేసిరి. రఘునాథ రాజు స్వయముగా మహా పండితుడు; ఉత్తమకవి. సంగీతములో కొత్త రాగములను కనిపెట్టి ప్రచారము చేసినాడు. అప్రతిహత వీరుడు. ఈతడు రచించిన బహు సంస్కృతాంధ్ర గ్రంథములు లభించినవి కావు. వాల్మీకి చరిత్ర మనునదొక్కటి ముద్రితమైనది. అది యుత్తమ శ్రేణిలో చేరిన గ్రంథము.

రఘునాథ నాయకుని ఆస్థానకవి చేమకూర వేంకటపతి, “ఈ చేమకూర చక్కెర మడిలో అమృతము పాఱించి పెట్టినది” అని శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రిగారనిరి. ఈ చేమకూర వెంకటపతి సారంగధర చరిత్రము, విజయవిలాసము అను రెండు ప్రబంధములను రచించెను. ఈ రెండును ఆంధ్ర సారస్వతమందు అమూల్యమగు రత్నములు.

విజయ రాఘవుని కాలములో ఉత్తమ కావ్యాలు వెలవడలేదు. కాని పలువురు స్త్రీ పురుషులు యక్షగానాలను, చరిత్రలను మున్నగు వాటిని రచించిరి. అందు రంగాజమ్మ మన్నారు దాస విలాసము ముఖ్యమైనది. కాళకవి, వేంకటపతి సోమయాజి యనువారును ప్రబంధాలు వ్రాసిరి.

మధుర రాజులు

తంజావూరు రాజులెట్టు విజయనగరానికి యుండిరో అటులే మధుర నాయకులును అదే కాలములో సామంతులై తర్వాత స్వతంత్రులై యించుమించు తంజావూరు పడిపోయినప్పుడే పడిపోయిరి.

వారి కాలములో కొందరు సాధారణ ప్రబంధాలు వ్రాసిరి. అందులో ముఖ్యుడు శేషము వేంకటపతి తారాశశాంకము వేంకటకృష్ణప్ప నాయకుడు అహల్యా సంక్రందనమును వ్రాసెను. అతడే జైమినీ భారతమును వచనముగా వ్రాసెను. మట్ల అనంత భూపాలుడు, విజయరంగ చొక్కనాథుడును ప్రబంధాలు రచించిరి. వీరిలో శేషము వేంకటపతి తారాశశాంకము చక్కని శైలిగలది.

6. సంధి యుగము

విజయనగర పతనానంతరము చిల్లర పాలెగాళ్ళను, ధనికులను ఆశ్రయించి పలువురు కవులు రచనలు చేసిరి. వారినే యుగములోను చేర్చుటకు వీలు లేనందునను వారు మన ఆధునిక యుగానికి పూర్వులయినందునను క్రీ.శ. 1700-1900 వరకుండు కాలమును సంధి యుగమని పేర్కొననైనది. ఈ కాలములో ఉత్తమ రచనలు కానవచ్చుట లేదు. అట్లున్నను సారస్వత చరిత్రలో ఆ కవులను గూడ సూచించుట అవసరము. ఈ కాలములో ముఖ్యులైన కవులను వారి రచనలను సూచింతుము.

శంకర కవి - హరిశ్చంద్రోపాఖ్యానము
చిత్రకవి సింగరార్యుడు - బిల్హణీయము
కిరీటి వెంకటాచార్యులు - ఆచలాత్మజా పరిణయము
కుమ్మరి మొల్ల - రామాయణము
ముద్దు పళని - రాధికా సాంత్వనము
ఆడిదము సూరకవి - రామలింగేశ శతకము
కూచిమంచి తిమ్మకవి - రసికజన మనోభిరామము మున్నగు బహు గ్రంథములు
కూచిమంచి జగ్గకవి - చంద్రరేఖా విలాపము, సుభద్రా పరిణయము
శిష్టు కృష్ణమూర్తి - అనర్ఘ రాఘవము
కాణాదము పెద్ధన - ఆధ్యాత్మ రామాయణము, ముకుంద విలాసము
తరిగొండ వెంకమ్మ - వెకటాచల మహాత్యము

ఈ సంధి యుగములో ఇద్దరిని గురించి ప్రత్యేకముగా సూచింపవలెను. ఒకరు వేమన. ఇంకొకరు త్యాగరాజు. వేమన క్రీ.శ. 1700-1750 ప్రాంతములోని వాడు. అతడు ఆట వెలదులు వ్రాసినట్లుగా ఏ తెలుగు కవియు నేటివరకు వ్రాయలేదు. అతడు మహాకవి. గొప్ప వేదాంతి, అందులో సకల జనులకు అర్థమగు వేదాంతమును భోదించినాడు. అతడు అపూర్వ సంఘసంస్కర్త. సంస్కర్తలు విమర్శిస్తేనే జనులకు కోపము. వేమన లోపమున్న వారిని తిట్టి అందరిని నవ్వించి మెప్పు పొందినవాడు. అతని పద్యాలు కంఠపాఠము రాని తెనుగు విద్యావంతుడు కానరాడు.

క్రీ.శ. 1759 నుండి 1857 వరకు తంజావూరులోని తిరువాడిలో నివసించిన త్యాగరాజు ఆంధ్రుల చరిత్రలో అద్వితీయుడైన గాయక చక్రవర్తి. అంతేకాదు. మొత్తము ద్రావిడ భాషా కుటుంబమునకంతటికి ఇతడే సంగీత మందు ఆశ్రయ భూతుడైనాడు. ఇతని కీర్తనలు పాడినవారే గాయకులు. ఇతని కీర్తనలు పాడలేని వారు దక్షిణ దేశమందు గాయకులనిపించుకొనరు.

ఈ యుగములోని తక్కిన కవులెవరనగా

కనుపర్తి అబ్బయ - కవిరాజ మనోరంజనము
నారాయణ దిట్ట కవి - రంగరాయ చరిత్ర
అయ్యలరాజు నారాయణ కవి - హంస వింశతి
చెదలువాడ మల్లయ - విప్ర నారాయణ చరిత్ర
కంకంటి పాపరాజు - ఉత్తర రామాయణము
పుష్పగిరి తిమ్మన - సమీర కుమార విజయయు
పిండిప్రోలు లక్ష్మణ కవి - లంకా విజయము
గోపీనాథము వేంకట కవి - గోపీనాథ రామాయణము
ఓగిరాల జగన్నాధ కవి - సుమనో మనోభి రంజనము

7. ఆధునిక యుగము

క్రీ.శ. 1880 ప్రాంతము నుండియే రచనలు చేసిన వారైను వారు మన కాలములో 1900 తర్వాత గతించినవారు పలువురు రచయితలుండినందున అట్టివారిని ఈ యుగములో చేర్చనైనది. నిజముగా ఈ యుగము అచ్చు విరివిగా ప్రారంభమైన నాటినుంచి అనగా 1770-1820 లో నుండిన బ్రౌన్‌, అదే కాలములో అతని యొద్దనుండిన జూలూరి అప్పయ కాలము నుండియే లెక్క పెట్టవలెను. అచ్చు పద్ధతి యూరోపు నుండి మనకు లభించినది. క్రీ.శ. 1577 లోనే గోవాలో చేరిన పోర్చుగీసు వారిచే ప్రవేశపెట్టబడెను. మొదటి తమిళ నిఘంటువు క్రీ.శ. 1679లో అచ్చయ్యెను. మొదటి అచ్చుపుస్తకాలు క్రైస్తవుల బైబిలు గ్రంథాలే. మన తెనుగులో క్రీ.శ. 1800 ప్రాంతములో అచ్చు మొదలయ్యెను. కాని 1860 తర్వాతనే దానికి వ్యాప్తి కలిగెను. బ్రౌను అను ఇంగ్లీషు పండితుడు ఇంగ్లీషు తెనుగు నిఘంటువును రచించెను. అతడు వేమన పద్యాలను ఇంగ్లీషులోనికి అనువదించెను. తెనుగులో తాతాచార్యుల కథలు అను పుస్తకాన్ని వ్రాసెను. అతడు తెనుగు తాటాకు పుస్తకాలను తెప్పించి మద్రాసులో ప్రాచ్య లిఖిత పుస్తకాగారములో నుంచెను. మెకంజీ అను మరొక ఇంగ్లీషువాడు 1788 నుండి 1820 ప్రాంతము వఱకు మద్రాసులో ఇంజనీయరుగా నుండెను. అతడు తెనుగుదేశములోని చారిత్రక గాథలను అన్నింటిని వ్రాయించి “కైఫియత్తులు” సమకూర్చి అదే లిఖిత పుస్తకాగారములో నుంచెను. నేటికిని అవి అమూల్యమైనవి. కాని వాటిని ముద్రించు ఆలోచన ఎవ్వరున్నూ చేయనందున అవి శిథిలమై పోతున్నవి. యూరోపు నుండి మన దేశమునకు వచ్చిన మిషనరీలకు మనము చాలా బుణపడియున్నాము. వారు మన దక్షిణ భాషలలోని ఆటవిక భాషలకు గూడ వ్యాకరణాలు వ్రాసి ఆ భాషలలో క్రైస్తవమత పుస్తకాలను రచించి అచ్చువేసిరి. క్రీ.శ. 1856లో కాల్డ్వెల్‌ అను ఇంగ్లీషు పండితుడు తెనుగు, తమిళము, కన్నడము, మళయాళము మున్నగు దాక్షిణాత్య ద్రావిడ భాషల కన్నింటికిని ఒక భాషా శాస్త్రమును రచించి ముద్రించెను. “కురుఖు” అను లిపిలేని ఆటవిక భాషకు డాక్టర్‌ హోర్‌ అనువాడు వ్యాకరణము వ్రాసెను. “మల్తో” అను మరొక భాషకు డ్రొజే అనువాడు వ్యాకరణము వ్రాసెను. గొండి భాషకు విలియం సన్‌ వ్యాకరణము వ్రాసెను. “కోదు” భాషకు బుషే మొదలగు ముగ్గురు పాశ్చాత్యులు వ్యాకరణములు వ్రాసి బైబిలును ఆ భాషలో ముద్రించిరి. గ్రియర్సన్‌ అను ఇంగ్లీషువాడు భారతీయ భాషలన్నింటిని గురించి పుస్తకాల సంపుటముల ననేకముగా రచించి ముద్రించెను. (Linguistic sur- Vey) మన తెనుగునకు గూడ క్రీ.శ. 1850 ప్రాంతములో ఫ్రెంచి మిషనరీలు నిఘంటువును, వ్యాకరణమును వ్రాసిరి. క్రీ.శ. 1807లో తెనుగు వ్యాకరణమొకటి అచ్చయ్యెను. ఈ విధంగా ఇంగ్లీషు, ఫ్రెంచి, పోర్చుగీసువారు మన ద్రావిడ భాషలకు చేసిన సేవలో దశాంశమైనను నేటికిని మనము చేయలేదు.

ఇంగ్లీషువారు మన దేశమును జయించి మనల బానిసలనుగా చేసి రాజకీయముగా, ఆర్థికముగా పతితులనుగా జేసిరి. కాని మన సారస్వతానికి వారు అపారముగా ఉపకారము చేసినవారైరి.

ఒక వేయి యేండ్ల నుండి మనము వ్రాసిన పురాణాలనే వ్రాస్తూ, వర్ణించిన శృంగారాన్నే మళ్ళీ మళ్ళీ వర్ణిస్తూ, వ్రాసిన పద్యాలనే వ్రాస్తూ ఉండిన వారము. మనలో గొప్ప మార్పును ఇంగ్లీషు వాఙ్మయము కలిగించెను. ఇంగ్లీషు విద్య దేశమందు వ్యాపించిన కొలది మనలో మార్పులు కలిగెను. తత్ఫలితముగా వచనములు, నవలలు, నాటకాలు, సైన్సులు, చరిత్రలు, భూగోళము, చిన్న కథలు, ఖండకావ్యాలు, గేయములు, కొత్త వర్ణనలు, నూత్న విధ విమర్శలు, వ్యాసములు, ఏకాంకికలు, హాస్య రచనలు, పరిశోధనలు, శాసనములు, భాషా శాస్త్రము, వివిధ పత్రికలు, పర భాషా సారస్వతముల భాషాంతరీకరణములు. కుప్ప తెప్పలుగా మనలో బయలుదేరెను. ఇతర దేశ భాషల పరిచయమేగాక, ప్రపంచములో అన్ని భాషల పరిచయము మనకు కలిగెను. ఈ కారణాల చేత మనవారి వేయేండ్ల కృషి ఒక యెత్తు. 1859 నుండి నేటివరకు జరిగిన ఈ నూరేండ్ల కృషి ఒక యెత్తు అనిన అతియోక్తి కానేరదు.

ఆధునిక యుగములో కలిగిన మార్పులు సూక్ష్మముగా తెలుపనైనది. ఆ మార్పులకు కారకులైన కవి పండితుల పట్టికలను ఇచ్చుటకు సాధ్యముకాని పని. అందువల్ల క్రీ.శ. 1900 నుండి ఇంతవరకు భాషా సేవ చేసినవారి పేరులు సూచించుటకు వీలు లేదు.

ఆంధ్ర వాఙ్మయ చరిత్ర అతి సంగ్రహముగా ఇందు సూచితమైనది. ఇందు ఉత్తమ కృతులని సూచించిన వన్నియు సారస్వత ప్రియులు చదువవలెను.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse