సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/అప్పకవి
అప్పకవి
ఇటీవల ప్రచురితమైన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము రెండవ భాగము చూచితిని. అప్పకవిని గురించి ఇందు ఇంచుక వ్రాసినారు. అతడు గుంటూరులో వాడని నిరూపించుటకు ముప్పుతిప్పలు పడినారు. స్థానికాభిమానముతో అట్లు వ్రాయుట కారణము కానరాదు కాని నిజాం రాష్ట్రమువారి యభిప్రాయముల గమనింపని వివేకము వారికి చేకూరినది. కందుకూరి వీరేశలింగము పంతులువారు అప్పకవి కృష్ణామండలము వాడని వ్రాసిరి. మరియు శతఘంటము వేంకటశాస్త్రిగారు తమ భారతపీఠికలో నిదే సూచించిరి. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమువారు ప్రథమ ముద్రణములో అప్పకవి గుంటూరు వాడని వ్రాసి ఇప్పుడును అదేమాట వ్రాసినారు. కాని యిది సరియైనది కాదు. సంపూర్ణంగా తప్పువ్రాతయే. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ ప్రథమ ద్వితీయ ముద్రణములును, నిజాం రాష్ట్ర పత్రికలలో మూడు వ్యాసములును బయలుదేరెను.
దేశబంధు మాసపత్రికలో శుక్ల సంవత్సర జ్యేష్ట మాసములో నేను వ్రాసిన వ్యాసము.
బూర్గుల రామకృష్ణారావుగారు గోలకొండ పత్రిక 2వ సంపుటము మొదటి సంచికలో అంగీరస వైశాఖ శు॥లు 2నాడు వ్రాసిన అతివిపులమగు వ్యాసము.
గత సంవత్సరము గోలకొండ సంచికలోని పూర్వకవి భాగములో శ్రీ శేషాద్రి రమణకవులచే సంకలిత వివరణము.
ఇవన్నియు సర్వస్వమువారు చూడకపోవుట తటస్థించినది. ఈ సవరణ వ్యాసమును గూడ చూడకుండిన నాశ్చర్యమేమి?
ఈ వ్యాసమును నేను నిజాం రాష్ట్రాభిమానముతో వ్రాయుటకాదు. యథార్థమును వెల్లడించుటయే దీని యుద్దేశ్యము. అప్పకవి మరియు నిచ్చటివారు చేయు భాషాసేవను నెరుకపరచుటయు జ్ఞాపకము చేయుటయు ద్వితీయోద్దేశము. అప్పకవి నిజముగా నిజాం రాష్ట్రమువాడు గాడని అతనిని కృష్ణలో వేసినను గోదావరిలో వేసినను మేమేమి చేయగలము?
ఇక ప్రకృత విషయము - అప్పకవి నిజాం రాష్ట్రములోని మహబూబునగరు జిల్లావాడు. పాలమూరను పూర్వనామమునకు నూతన నామకరణమే మహబూబునగరు. నేను దేశబంధులో వ్రాసిన భాగమిది.
అప్పకవి వ్రాతలగూర్చి చర్చించుటకు పూర్వము వారి నివాసస్థలమును గూర్చి బయలుదేరిన సందిగ్ధములకు తోడుగ నింకొక సందిగ్ధమును జతపరుప నెంచితిని. అతడు గుంటూరు మండలమువాడని యొకరు, కృష్ణకు దక్షిణమున నొక యోజనము దూరమున (నెచ్చటనో) యుండెనని యొకరును వ్రాసిరి. అతడు మహబూబునగరు జిల్లావాడేమోనని నాకనుమానము కలిగినది. ఏలన నతడు తన గ్రంథములో నుదహరించిన స్థల నామములు మహబూబునగరములో గాన వచ్చుచున్నవి.
“కొండూరు” అనుననది “కోడూరు” ఏమో! చలిమల్ల యిప్పటి చెలిమిళ్ళయేమో! తంగెడ విషయము యిప్పటి తంగెళ్ళపల్లి యేమో. అభినవచూత గ్రామము అను అచ్చుతెనుగు చేసిన లేమావిళ్ళ యగును. వట్టెము యిప్పటికి వట్టెముగానే యున్నది. ఈ గ్రామములన్నియు మహబూబునగరు జిల్లాలో నున్నవి. శ్రీశైలమునకు సమీపమున నున్నవి. కావున ననుమానముతో సూచించితిని గాని నేనా జిల్లా వాడను ఐనందున స్థలాభిమానముతో గాదని ముందే విన్నవించుకొనుచున్నాను.
ఈ అనుమానమును నిస్సందేహ పరచినది మా మిత్రులును పండితులును యగు శ్రీయుత బూర్గుల రామకృష్ణారావుగారు. వారు గోలకొండ పత్రికలో నిట్లు వ్రాసిరి.
“కాకునూరు గ్రామ మెచ్చటనుండిన దెవ్వరికినీ తెలియనట్లున్నది. కాని పై పద్యము చదివినచో
(బాలుడై కాశికాపట్టణంబునకేగి
బ్రహ్మేంద్రు నొద్ద శాస్త్రములు జదివె॥)
నిజాం రాష్ట్ర వాసులమగు మనకు ఈ కాకునూరు గ్రామము నిశ్చితముగా నిర్ధేశించుటకు వీలుగలదు. చరికొండసీమలో అని వ్రాసియున్నాడు మహబూబునగర్ జిల్లాలో నాగర్ కర్నూలు, కల్వకుర్తి తాలూకాలలో చేరియున్న గ్రామాదులన్నియు దాదాపు నాడు చరికొండ సీమలో చేరియుండినవి. చరికొండ గ్రామము కల్వకుర్తి తాలూకాలో నున్నది. ఈ సీమలో చేరిన కాకునూరు నా జన్మస్థానమగు బూర్గులకు నాలుగు కోసల దూరమున్నది. ఇపుడది గుమార్‌గీర్ అను గోస్వాములకు
సర్వాగ్రహారముగా నున్నది. నిడుదవెల్లి బొద్దనేవెల్లి మొదలగు గ్రామాదులందు మాన్యక్షేత్రముల గడించెనని వ్రాసికొనియున్నారు కదా! పై జెప్పిన కాకునూరునకు మిగుల సమీపముననే యొక యామడలోపల పై గ్రామాదులన్నియు నిప్పటికి కలవు. కాకునూరికి రెండు క్రోశములలో నిడుదవెల్లి కలదు. బొద్దినేపల్లియు రెండు
క్రోశములలో నున్నది. కల్వకుర్తి తాలూకాలో చేరినది. “నివరళపురి” యను పాఠము సరికాదు.” నవదళపురి యని నా ప్రబలమైన యనుమానము. కాకునూరికి రెండు క్రోశములలో తొమ్మిదిరేకుల యను గ్రామము కలదు. ప్రాత ప్రతుల మూలములు మరల పరిశీలింపదగినవి.... “అభినవచూత సద్గ్రామము” విషయమై క్రీ.శ. లక్ష్మణరావుగారును, గిడుగు సీతాపతిగారును పొరపడినారు. ఈ గ్రామమును క్రొత్త మామిడిపల్లె యనిరి. మామిళ్లపల్లి యను గ్రామము లిక్కడను గలవు. అమరాబాదు తాలూకాలో నొక గ్రామము కలదు.... కాకునూరికి క్రోసెడు దూరముననే “లేమామిడి”
లేక “లేతమామిడి” యను గ్రామము పురాతన ప్రసిద్ధముగా నున్నది. “వట్టెము” నాగర్‌కర్నూలు తాలూకాలో చేరిన గ్రామము. ఇది రావుగారి వ్యాస సారాంశము. ఆ వ్యాస మతి విపులమై సమగ్ర చర్చగలదై యున్నను స్థల విస్తరణమగునని సూచన మాత్రముతో తృప్తి బొందుచున్నాను. అభిలాషులు దానిని జూడగలరు.
తర్వాత గోలకొండ కవుల సంచికలో పై బూర్గులవారి యభిప్రాయమునే బలపరచుచు శ్రీ శేషాద్రి రమణ కవులు వ్రాసిరి - గత సంవత్సరము కాకునూరు ప్రాంత మిత్రుడొకడు నాతో చెప్పిన విషయములేమన కాకునూరు నిడదవెల్లికి రెండు మైళ్ళ దూరమున నున్నదనియు, తొమ్మిది రేకులకు (రామకృష్ణారావుగారు సరిగా చదివిన నవదళపురి పాఠము నిరవళిపురికాదు) రెండుమైళ్ళ దూరమునను కలదనియు నీ గ్రామములన్నియు తనకు పరిచితములే యనియు తెలిపినారు. మరియు కాకునూరు కల్వకుర్తిలో ఖాల్సా యిలాకా మఖామనియు తెలిపినారు. చరికొండ కాకునూరునకు ఎనిమిది కోసుల దూరములో నున్నదనినారు. బొద్దినేపల్లి కాకునూరికి ఒక కోసు దూరములో నున్నదనినారు.
కామెపల్లి యెక్కడిదోనని అందరు తికమకలగుచున్నారు. దేవరకొండకు (నల్లగొండలోని తాలూకా గ్రామము నాగర కర్నూలు తాలూకా సరిహద్దులో నుండునది) 20 మైళ్ళ దూరములో నున్నదని పై మిత్రులే చెప్పినారు. గోననాని పల్లె అను గ్రామమునకు 10-15 మైళ్ళ దూరములో నున్నదనియు చెప్పినారు.
ఇదే సందర్భములో తిరుమలభట్టారకుని విషయము సూచించుట అప్రస్తుతము కాదనియు ముందు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము వారీ వ్యాసమును చూడ తటస్థించిన తప్పుదిద్దుకొనదలచిన తిరుమల భట్టారకు నొద్దనైన సరియైన సమాధానము జెప్పిన అతని వంశీయుడగు అప్పకవికి చేసిన యపచారమునకు “మాఫీ” యగునని తలచి వ్రాయుచున్నాము.
అప్పకవీయములో చతుర్థాశ్వాసములో గణదేవతాఫలశీర్షికలో 68 సంఖ్య గల వచనములో వావిళ్ళవారి 1910 వ సంవత్సరపు ముద్రిత ప్రతిలోని పుటలో నిట్లున్నది. “కాలామృతమునందు శ్రీమద్వేంకట నాయకమ్మని, మదీయాన్వయ ప్రభువుండగు తిరుమల భట్టారకుండును...” అను వాక్యము గమనింపదగినది.
సుప్రసిద్ధ కాలామృత గ్రంథకర్తయు తిరుమల భట్టారకుడు అప్పకవి పూర్వీకుడును, వంశస్థుడును.
తే॥ అందులో కాకునూరి రంగాహ్వయుండు
గనియె నలువురి తనయుల గన్నమాంబ
యందు దిరుమలభట్టు గంగార్యవర్యు
నెలమి బెదసోము జినసోము నిందులోన
అను పద్యములోని తిరుమల భట్టితడోయోమో!
మరియు అప్పకవి వంశస్థుడు శేషయ్య యను పేరుగల యువకుడు మహబూబునగరు జిల్లాలో వట్టెము ప్రాంతములో నున్నాడనియు, తమవద్ద కొంతకాలము చదువుకొనియె ననియు నా మిత్రులును కర్నూలులో పాఠశాల పండితులునగు శ్రీ అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్రిగారు నాతో చెప్పినారు. ఇన్ని కారణములుండినను అప్పకవి గుంటూరు మండలము వాడై యుండెననియే యొండు రెండూహలు చేసి నిర్ణయించుట సరికాదని మనవి చేయుచున్నాను.
ఇక అప్పకవి కావ్య విశేషముల నరయుదము
కల
మన యాంధ్రకవులు చాలా ధన్యులు. వారికి గ్రంథములు వ్రాయబుద్ధి వొడమిన తప్పక వారి కులదైవము వారికి ప్రత్యక్షమై గ్రంథమును వ్రాసి తనకు అంకితమీయ కోరుటయు సంభవించును. కలలో కేవలము కనిపించుటయే కాదు. వీరి దైవము వీరితో చాలాసేపు ముచ్చటించి నన్నయ, భీమన, సారంగధరుల కథయు, తాతన, కేతన రచించిన గ్రంథములు మెచ్చకపోవుటయు మున్నగు ముచ్చటలు గూడ నిందు గలవు. ధన్యోస్మి అని మరునాడే గ్రంథము ప్రారంభించెను మన అప్పకవి.
ప్రబంధ లక్షణము
ప్రబంధ లక్షణమును నిరూపించిన వీరి పద్ధతి ఆంధ్ర భాషకు చాల కష్టము గలిగించినదని నా అభిప్రాయము. ఏలయన, వీరు జూపించిన వర్ణనములన్నియు ప్రతి గ్రంథమందుండిన సామాన్యమై రుచి తగ్గుటయు, కవికి స్వాతంత్ర్యమీయక వర్ణనములందు కూడ దాసునిగా జేయుటయు, కథా సందర్భమునకు సంబంధించక పోయినను బలవంతముగా వర్ణనములను పట్టుకొని వచ్చి కూర్చుటయు, జలవిహార, సురతములను వర్ణించుట చేత గ్రామ్యత్వము కవులకు సిద్ధించుటయే ఈ అప్పకవి గారి మార్గమున నడుచుటవలన కలుగు ఫలితములు. చూడుడు వారి ఆదేశము.
సీ॥ పురమును ఋతుషట్కమును ప్రయాణంబును
శైలంబు వేటయు సాగరంబు
మౌనీంద్ర పుణ్యాశ్రమంబును మంత్రంబు
ద్యూతంబు పిదప నద్భుత రణంబు
విజయంబు మద్యపానజ వికారంబును
వనవిహారంబును వారికేళి
కన్యాంగ సౌందర్య కథనంబు హిమకరా
భ్యుదయంబు విప్రలంభోదితంబు
పద్మ మిత్రోదయంబును బరిణయంబు
సురతమును దౌహృదంబును సుత జననము
ననగ నిరువది రెండు వర్ణనలు గూర్చి
చెప్పవలయు బ్రబంధంబు శ్రీనివాస!
కల్లుద్రావి చెప్పి వికార చేష్టలు కూడ వర్ణించవలయునట. కొడుకు పుట్టని కథ ఉండినను కొడుకును పుట్టించి వర్ణించవలయునేమో! కన్యాంగ సౌందర్య కథనంబు అని చెప్పుటచేత కవులనేకులు పిచ్చి పిచ్చిగా వర్ణించినది అట్లుండ కొందరు చెప్పరాని అంగవర్జనలు కూడ చేసిరి. చాల కట్టి (వరుస పెట్టి) మధ్యకాలపు కవులందరు
“ఉండంగ ఉండంగ ఒక ఊరుండె” అని పురవర్ణనతో కథ ప్రారంభించిరి. కాళిదాసు కుమార సంభవములో 'అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా అని ప్రారంభము తోడనే హిమాలయ వర్ణన తోడను, మేఘసందేశములో 'కశ్చిత్కాంతా విరహ గురుణా” అని
శాపాస్తంగమిత మహిముడై విరహార్తి పొందుచుండిన యక్షుని వర్ణన తోడను, భారవి “శ్రియఃకురూణాం” అనియు ప్రారంభించిన గ్రంథము లెంత మనోహరముగా నున్నవో వేరుగా చెప్పనవసరము లేదు.
సారస్వతౌషధములు
అప్పకవి కొన్ని ఔషధములు తయారుచేసియున్నాడు. మనదేశములో వైద్యము ఒక రహస్య శాస్త్రముగా నుండెడిది. సిద్ధుల వలనను, సన్యాసుల వలనను, యోగుల వలనను, హిమత్పర్వత మూలికల నెరిగిన అనుభవజ్ఞుల వలనను, ఎవరైనను ఒక చిటికలగానీ, ఘటికలోగానీ, చేయనేర్చుకొనిన దాని నతిగోప్యముగా నుంచుకొని
ఇతరులకు చెప్పకుండెడివారు. అట్టిచో “సూక్తులు ఘటించు, మందులను కర్షమాత్రంబు భక్షింపగలిగెనేని” - గడియకొక పద్యశతకంబు నుడువ జేయునట్టి మందును, నలువచెలువ 'నాలుకను కాపురంబుండు” నట్లు చేయు దివ్య ఘటికను నెరిగిన
అప్పకవి ఏ మాత్రమును దాచక లోకోపకారార్థమై వెల్లడించినందులకు కృతజ్ఞతా బద్ధులుగా నుండవలసినదే. కాని, ఎవరైన నిది నిజమనినమ్మి చూపించిన ప్రకారము మందుల సేవించిరో లేదో తెలియదు. శతఘంటము వారమని బిరుదుల నుంచుకొనిన
పోతనామాత్యుడు
రేఫ ర కారములు మైత్రిని చేసెనని పోతనామాత్యుని తప్పుపట్టి ఈ అప్పకవి ఆ మహాకవిని ఉదాహరించుటయే మానుకొనెను. కాని, రేఫ ఱ కారమైత్రి చేసిన ఇతర కవులను నెందరినో ఉదాహరించుటలోని మర్మమేమో ఊహింపజాలను. పోతన విషయమయి ఇట్లు సెలవిచ్చిరి.
బమ్మెర పోతరాజకృత భాగవతంబు సలక్షణంబుగా
కిమ్మహినేమిటిం గొదువ యెంతయు నారసి చూడగాను రే
ఫమ్ములు ఱాలునుం గలిసి ప్రాసములైన కతంబునంగదా
యిమ్ముల నాది లాక్షణికులెల్లను మాని రుదాహరింపగన్
అయిన అప్పకవి తర్వాత వచ్చిన కూచిమంచి తిమ్మకవి సార్వభౌముడు తన సర్వలక్షణ సారసంగ్రహములో నిట్లు పోతనగారి నిజమయిన గొప్పదనమును నిరూపించి పుణ్యము కట్టుకొనెను. పోతన ప్రాశస్త్యమును ఇట్లు వర్ణించెను.
అఖిల వేదాంత విద్యారహస్యవిదుండు
సహజ పాండిత్య విశారదుండు
పటుతర కవితా విభాసిత ప్రతిభుండు
సకలాంధ్ర లక్షణ చక్రవర్తి
రఘుకులేశు నిదేశ రచిత మహా
భాగవత పురాణుడు పుణ్యవర్థ
నుండు..................................................
బుధజనహితుండు బమ్మెర పోత సుకవి
ఎన్న రేఫ ఱ కారంబు లెరుగడనుచు
నజ్ఞు లొక కొందరాడుదు రమ్మహాత్ము
కవిత కెందును లోపంబు గలుగదభవ
పోతన భాగవతము కొంత శిథిలముకాగా దానిని పూరించిన కవుల పద్యము లందే ఈ సాంకర్యము కలదు. కాని పోతన కవితలో లేదని పద్యముల ననేకము లాయా కవులవి ఉదాహరించి తిమ్మకవి నిరూపించెను. సంస్కృతాంధ్ర కవితా పటుత్వముచేత నొప్పి ఈ 300 సంవత్సరముల నుండి
వెలసిన కవుల కందరకును భిక్షపెట్టిన అప్పకవిని తప్పుపట్టు నుద్దేశముతో ఈ
వ్యాసమును వ్రాయలేదు. అట్టి మహాకవి కీ లోపములు లేకుండిన బాగుగా
నుండెడిదనియె నా అభిప్రాయము.
(ఈ వ్యాసం అప్పకవి గురించి వ్రాసిన రెండు వ్యాసాల సంక్షిప్త రూపం)
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse