Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/అనర్ఘ రాఘవకర్త

వికీసోర్స్ నుండి


అనర్ఘ రాఘవము

శ్రీ శేషాద్రి రమణ కవులు అనర్ఘ రాఘవమను తెనుగు ప్రబంధమును అష్టభాష గోపాలరాయల మేనల్లుడును ప్రాగటూరు దొరయు, సుమారు 200 ఏండ్ల నాడుండిన వాడునునగు తిమ్మారెడ్డి యను తిమ్మభూపాలుడు ఆంధ్రీకరించిన పద్య కావ్యమని వ్రాసినారు. మరియు నా గ్రంథమిటీవల కర్నూలులో నచ్చైనదని యొక మిత్రుడు నాకా ప్రతి జూపించెను. ఆ గ్రంథమందు గ్రంథ ముఖపత్రమే ముద్రించలేదు, ఇది సహేతుకమో యేమో కాని ప్రత్యాశ్వాసాంతమందు తిమ్మభూపాల ప్రణీతమని పెద్ద గద్యమును బ్రకటించినారు.

అట్టిచో నీ కవి నిజముగా నీ గ్రంథము రచించెనా? లేక వేరొక భాగస్వామి కలడా, ఆ భాగస్వామియే దీనిని పూర్తిగా రచించెనా? లేక యిద్దరును కలిసి రచించిరా? యను ప్రశ్నలు నాలో బయలుదేరెను. పాపమా భాగస్వామి యెంత నిష్కామ కర్మియేమో! తిమ్మారెడ్డి ఈ యనర్ఘ రాఘవమందేమి సాక్ష్యము స్వయముగా నిచ్చుచున్నాడో చూడుడు.


మ. కమనీయ స్థితి జెంగటన్‌ ధవళ శంఖస్పూర్తి రాణింప దీ
     ప్తమరీచిన్‌ బవడంపు గెంపు బవలున్‌ బంజుల్‌ వెలుగొందని
     స్సమ సారస్వత నిర్మలామృత ఝరీ జాగ్రత్త రంగాబ్ది పే
     ర మహా సత్కవి తేజరిల్లె విబుధ ప్రస్తూయమానోద్ధతిన్‌


(యీ పద్యములో “జాగ్రత్తరంగాబ్ది” అనుటకు జాగ్రత్కవి రంగాబ్ధి అని సరిపోవునని ముందు చూపెదను)


చ. అతనికి బౌత్రుడై యసదృశాఖిల విద్యల బ్రౌఢిగన్న యా
     యతమతి కృష్ణ సత్కవి సహాయ కవిత్వమునన్‌ సమాజసం
     తత భజనాదరుండనగు నాకు నశేష విశేష వైదుషీ
     ప్రతిభకర స్థలామలక భాస్వరమై తనరారు టబ్రమే.

ఈ పద్యమును జదివిన బోధ్యమగునదేమన - పేరయ్య అను గొప్ప

పండితుడుండెనట. అతని మనుమడు కృష్ణ కవి అనేవారు. వీరి సహాయముండిన తరువాత “నేను కవిత్వము వ్రాసేదొక విచిత్రమా” అని తిమ్మారెడ్డి చెప్పుకొనినాడు.

ఇప్పుడింత వరకు తెలిసిన సారాంశమున కృష్ణకవియను నతడు ఈ కవిత్వములో భాగస్వామియనియు, యతినిదే పై చేయిగా నుండినట్లున్ను తిమ్మారెడ్డి అక్కడక్కడ కామాలు, వత్తులు, గుళ్ళు, కొమ్ములు, సవరించి యుండవచ్చును అని విశదమగుచున్నది.

కాని యిదికూడ నిజముకాదేమో నా మిత్రుని యొక్కనివద్ద తాళపత్రములో నిట్లుండుట జూచి వ్రాసికొంటిని


మ. “అవనిన్‌ రంగసముద్ర కృష్ణకవి చంద్రాపాదితాసర్ఘరా
     ఘవ కావ్యంబనురక్తి తోడుతను శ్రీకానాల కృష్ణ ప్రధా
     ననరాగ్రేసరుచేత వ్రాయబడి యెన్నన్‌ సత్కవిశ్రేణికిన్‌
     జవమై వన్నియకెక్కు నిద్ధరణి నాచంద్రార్క సంస్థాయియై”


గద్య - “ఉప్పల లక్ష్మీ నృసింహాచార్యులవారి కుమారుడు రామానుజా చార్యులవారు బిజ్జల చిన్నమ్మ దేశాయిగారికి అనర్ఘరాఘవము వ్రాసిన పుస్తకము” అని గ్రంథాంతమందు తాటాకుపై గంటముతోనే వ్రాసిన భాగము కలదు. ఈ పద్య గద్యములవలన తేలునదియేమన అనర్ఘ రాఘవమును రంగసముద్రము కృష్ణకవియే వ్రాసినాడని అట్టి గ్రంథమును కానాల కృష్ణప్ప తాటాకులపై వేరు ప్రతి వ్రాసి యిచ్చెనని పద్యములవలన తెలియును.


గద్యమువలన తెలియున దేమనగా ఆ తర్వాత తిమ్మారెడ్డి మనుమరాలో యేమో బిజ్జుల చిన్నమ్మ దేశాయికి ఉప్పలరామానుజాచార్యులు పూర్వప్రతి శిథిలంబైనందున నేమో వేరు ప్రతి వ్రాసి యిచ్చినాడు. నకల్నవీసులకు అఖ్ఖల్‌ లేనట్లు యీ రెండవవారు గ్రంథాంతమందలి కానాల కృష్ణప్ప వ్రాసిన యగత్యపు బద్యమునుగూడ నకలుచేసినాడు. తర్వాత తిమ్మారెడ్డి వంశములో కవులు లేనందున (తిమ్మారెడ్డి కవియైతే గద యుండునది) వారును నీ దాళపత్రప్రతిని నందరికి చూపుకొనినట్లున్నది. దాని కారణమిప్పుడే తెల్పుదును. మొదలు “జాగ్రత్కవిరంగాబ్ధి” యని యుండవలె నంటినికదా. ఎందుకన కానాలవారి పద్యములో రంగసముద్రము కృష్ణ కవియని పేర్కొనబడినది. కావున “రంగాబ్ధి” కప్పుడన్వయము సరిపోవును. లేకుండిన తరంగాబ్ధి అనిన నిరర్థక మగును.

ఇంతవరకు నిశ్చయమగునదేమన రంగసముద్రము కృష్ణకవి యను వారే యీ గ్రంథమును పూర్తిగా వ్రాసెననియు తిమ్మారెడ్డి బహుశా అతని పోషకపు దొరయై యుండెననియు, తర్వాత మందః కవియశఃప్రార్థీ అన్నట్లు తిమ్మారెడ్డియపర పండిత పెద్ద కృష్ణప్పవలె కృష్ణకవిని లోబరుచుకొని, తన పేరెక్కించు కొనెననియు, అక్కడికి కవి తన శ్రమ వ్యర్థమగునేయని ఆశ్వాసాదిలోనొక పద్యము సగము సగమర్థ మిచ్చునది, అపరచిత్రకవి సింగనార్యునివలె వ్రాసెననియు కానాలవారు ఇంచుమించు సమకాలి కులో లేక తర్వాత తరము వారో యగుటచే తన పెద్దలవలన నిజమెరిగినందునను తానున్ను కాస్తా కూస్తా కవి యగుటచేత తాను నకలుచేసిన తరువాత తాళ్ళపాక వారి కవిత్వము కొంత నా పైత్యం కొంత అన్నట్లు తన పద్యమొకటి మెల్లగా నిరికించి కవికుపకారము చేసెననియు నూహింప వీలుకలదు.

ఇంతేకాదు. ఈ తాళపత్ర సంపుటి 20-30 ఏండ్లనాడు పెద్ద పెద్ద పండితుల చేతులలో బడి బడి తుదకు అపర దుర్వాసులను ఖ్యాతిగాంచిన ఆలంపూరీ శ్రీప్రౌఢ సరస్వతీ కుమార స్వాములవారి చేత బడినది. ఆ యతులును నీ గ్రంథమును జూచి హేతుగర్భితమగు నీ పద్యముల తాళపత్రముల తుది స్వహస్తముతో మసితో వ్రాసినవి నా మిత్రుడు చూపగా వ్రాసికొనిన పద్యములివిగో జూడుడు.


శా. ఈ గ్రంథంబు ప్రశస్తమైనది యటంచే నెంచి చూడంగనెం
     తేగ్రాహ్యేతర దుష్ప్రయోగములు సంధి ప్రక్రియాదోషణ!
     వ్యగ్రాలేఖక సంగతంబులిట నాహా పెక్కులై తోచెధీ!
     ప్రాగ్యుల్‌ దిద్దగలారటంచు శ్రమయింప న్మానితిన్‌ నే సుడీ
 
ఉ. ఏమి వచింతు నక్కట ధనేచ్ఛను దుచ్చనృశంస సన్నిభో
    ద్దామవదాన్య మాన్యుల వృధానుతిసేయుచు నిట్లు సత్కవి
    గ్రామణులే చెలంగిరిలఁ గ్రచ్చర కేవల రామునిన్‌ మదిం
    గ్రామిత చిత్తవృత్తి పొసగన్‌ భజియించిన మోక్షమబ్బుదే


- శ్రీ. కు.

శుభ కృత్కార్తిక కృ 5లు

అని శ్రీ శాస్తులవారి వ్రాలు కలదు

దీనివలన శ్రీ కుమార శాస్త్రిగారును గ్రంథ కర్తృత్వమును సంశయించి రెండవ

పద్యములో ధనేచ్ఛచే కవి యిట్టి తుచ్ఛ కార్యము చేసెనే కేవల రామభజన గావించిన మోక్షమబ్బి యుండునుగదా అని సూచించినారు.

ఇన్ని ప్రమాణములు మనకు దొరుకుచుండ పాపమా రంగసముద్ర కృష్ణ కవి పేరును మాపి తిమ్మారెడ్డిని పొగడుట పొసగనేరదు. ఇంకా ఈ కృష్ణకవి యెవరను విషయము నాకు తెలియదు. పరిశోధకులు తెలిసిన తెలుపుదురు కాక.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse