సాక్షి మొదటి సంపుటం/గ్రామ్యభాషాగ్రంథ పఠనము

వికీసోర్స్ నుండి

2. గ్రామ్యభాషా గ్రంథ పఠనము

ఒకనాడు జంఘాలశాస్త్రి ఒక కాగితాల బొత్తి చేత్తోపుచ్చుకుని, నెత్తికి తగిలిన ద్వారం దెబ్బనుకూడా లక్ష్యపెట్టకుండా వగర్చుకొంటూ సాక్షి సంఘానికి హుటాహుటిన వచ్చాడు.

అతను తెచ్చిన కాగితాలు వార్తా పత్రికలవి. అందులో అతన్ని కలవలపరిచిన వర్త “దేశ భాషల్ని ఇంటర్మీడియేట్, బి.ఏ. క్లాసుల్లో తప్పనిసరిపఠనీయాలుగాచేర్చడానికి విద్యాసంఘంవారు లంగీకరించలేదు - అని.

ఈ వార్త ఆధారంగా సాక్షికి, కాలాచార్యులుకి, జంఘాలశాస్త్రికి, కవి వాణీదాసుకీ చర్చ జరిగింది. జంఘాలశాస్త్రి ఆ పత్రికావార్తకి తీవ్రంగా ఆందోళన ప్రకటించాడు. విద్యా వ్యవస్థలో, దేశభాషల పట్ల ప్రభుత్వం అవలంబించే ఉదాశీన వైఖరి, వారి చర్చనీయాంశం.

ఇంటర్మీడియేట్ క్లాసులోకి వచ్చే బాలుడికి దేశభాషను మానడానికి గాని చదవడానికి గాని, స్వేచ్చా? - ఈ సిద్ధాంతం మీ ఇంగ్లీషుభాష కెందుకు ఉపయోగించుకో కూడదు? ఇక్కడ మళ్లీ తేడా చూపించడమా? ఇది మా దిక్కుమాలిన దేశభాషలకు మాత్రమే చెల్లవలసినదా? అని జంఘాలశాస్త్రి ఆవేదన.

ఈ చర్చ అంతా విద్యావిధానంలో ద్వంద్వ వైఖరి గురించి.

కవియుఁ గాలాచార్యులు నేను మాసభాభవనమున రాత్రి కూరుచుండి- "వేసవి కాలమారంభమైనది. ఉష్ణ మధికముగ నున్నది. మామిడిపిందె లింకను వచ్చుటలేదు. ఎఱ్ఱమిరెపుఁగాయల కున్నరుచిలోఁ బదునాలుగవవంతైనఁ బచ్చిమిరెపుఁగాయల కుండ” దను నిట్టి వట్టి వెఱ్ఱి మాటలతో సన్నిహితఋతువునుగూర్చియు, సాపాటును గూర్చియు సహజముగ మాటలాడుకొనుచుండ నెత్తికి టంగున తగిలిన ద్వారపు దెబ్బను లక్ష్యపెట్టక కాకితములబొత్తి చేతఁ బుచ్చుకొని వగర్చుచు లోనికి మా జైన దేవుఁడయిన జంఘాలశాస్త్రి వచ్చి “అయ్యయ్యో ఇంక నేమున్నది? ఇంక నిట్లు గూరుచుండిరా?" యని బిగ్గఱగఁ దొందరతో నరచెను. కొంపలు కాలుచున్నవా యేమి!" యనుచు నేను లేచితిని. నా వెనుకనే కవియు గలము చేతఁ బుచ్చుకొని “సహజోక్తి ప్రధానమైన యాధునిక కవిత్వ మభ్యసించు నాకీయనదృష్టమున లభించెను. కాలుచున్న కొంపలు గాలుచున్నట్లుగనే వర్ణింతు నని లేచేను. కాలాచార్యులు “పొడు మెక్కడనయిన దొరకును. నేనును వత్తును" అని ముక్కు ముమ్మారు టొకాయించి లేవఁబోవుచుండెను. నెత్తిపయిఁ దగిలిన దెబ్బనుండి చిమ్మి రక్తమును దుడుచుకొనుచుఁ గొంతసేపు జంఘాలశాస్త్రి మాటలాడక యుండి "కొంప కాలుచున్నవా యందురా? యీయూరుకొంపలా? యీతాలూకాకొంపలా? యీజి కొంపలా? యిట్టియనేకములగు జిల్లాల కొంపలు గాలుచున్నవా? యని యడుగుఁ దేశభాష బ్రదు కేమైనదో తెలిసినదా? యిదిగో వార్తాపత్రిక-నాకుఁ గొంత తెలిసినది. కొంత తెలియలేదు." అని దానిని బల్లపై వైచెను. ఇంతేకద! తొందరలేదు. కూరుచుండుఁడు నాకును దెలిసినది. దేశీయభాషలను నింటర్మీడియేటు బియేక్లాసులలో ననివార్యములు పఠనీయములుగఁ జేయుటకు విద్యాసంఘము వారంగీకరింపలేదు. ఇందువలన దేశజనులకు గొంత యసంతుష్టిగ నుండవచ్చును.

జంఘా-కొంతయసంతుష్టియా? అవధిలేనియసంతుష్టి. ఉండవచ్చునా? ఉన్న ఉండితీరినది. మనదేశ భాషలు గదా! మనము మాటలాడుకొను భాషలుకదా! ఏ భాషలలో బుట్టి పెరిఁగి చత్తుమో యాభాషలుకదా? మనపుత్రులేమి, పౌత్రులేమి, మనసంతతి వారందఱు ప్రపంచము నిల్చియున్నవఱకు నభ్యసించి యభివృద్ధిపఱచుకొనవలసిన వ భాషలు కదా! మనమాట లిందునుగూర్చి విననక్కఱలేదా? విశ్వసింప నక్కఱలేదా? మా చరిత్రాదికము కాదే? వారి గణితాదిశాస్త్రములు కావే? వారికీ పట్టుదల యేల?" వారికి దేశ భాషానిరాదరణమేల? హిందూదేశములో స్థాపించిన హైందవసర్వకళానిలయము (Indian University) లో దేశభాషలే పఠనార్హములు కాకుండఁ జేయునంత గొప్పపూచి వారేల వహింపవలయును? ఆహా! వారిలో నొక్కఁడయిన మన కామోద (Vote) మీయలేదు

కాలా-వారెవరు?

జం-ఆంగ్లేయభాషాపండితులగు గురువులు (Professors).

నేను-వారు నిర్హేతుకముగ మనవారికోరికను నిరాకరించిరా? అటు లెన్నఁడును లేదు వారికున్న హేతువులుగూడఁ గొన్ని బలీయములే యైయుండు. మన మిందునుగూడ సావకాశముగ మాట లాడుకొందము.

కవి - పరిపాలకులఁ గూర్చియు, వారి కార్యములఁ గూర్చియు మనము మాటలాడుకొనఁగూడదని నిబంధన ముండఁగ-

నేను-ఆ నిబంధనము పరిపాలనతంత్రములఁ గూర్చినదికాని దేశమునకుఁ బ్రాణమై భాషనుగూర్చి జరిగిన యేర్పాటుల న్యాయాన్యాయములు మాటలాడుకొనుట కభ్యంతర ముండదు. జంఘాల శాస్త్రీ! ఆంగ్లేయ సభ్యుల యందఱ యభిప్రాయముతో నేకీభవించు వాఁడను నేను. కాలాచార్యులును కవి నీతో నేకీభవింతురా? నాతో నేకీభవింతురా?

కాలా. & కవి-మేము జంఘాలశాస్త్రితో వారమే! జంఘా-నాతోవారు మీ రిద్దఱేనా? శ్రీ జగన్నాథ రామలింగేశ్వరదైవతద్వయ మధ్య భూమిని హైందవుడయి కాని, ముసలిమానుఁడయి కాని పుట్టు వొందిన ప్రతి మనుజుఁడు నాతో వాఁడే. కారణాంతరముల నెవరైనఁ బైకి వ్యతిరేకాభిప్రాయముల నిచ్చినను బరమార్థమున నాతోవారే. నేను శంకరాచార్యులఁ గొలిచిన, వారు రామానుజాచార్యులఁ గొల్తురు. మఱి వారు మరిడీమహాలక్ష్మిని గొలుతురు. పూజలలో మాకైక్యములేదు. వీరు బాలవితంతువును మంగలిపొదియొద్దఁ గూర్చుండఁబెట్ట, వారామెను మారుమగని ప్రక్కలోఁ బన్నుండఁబెట్టెదరు: ఆచారములలో మాకైక్యములేదు. బ్రహ్మసృష్ట్యాదినుండి వచ్చుచున్న వేదముల యపౌరు షేయ జననమును గూర్చి, పునర్జనన వాస్తవమును గూర్చి మాలో మాకైక్యములేదు. ఆత్మపరమాత్మ తత్త్వసంబంధములఁగూర్చి మాలో మా కైక్యము లేదు. మోక్షో పాయములఁ గూర్చి మా కైక్యము లేదు. కాని యీయంశమును గూర్చి ప్రాక్పశ్చిమ సముద్ర మధ్య దేశసంభవుల కందఱకు నైక్యము కలదు. నీవు మాత్రము వాదమునకై యాంగ్లేయసభ్యుఁడ వైతివని మే మెఱుఁగమా?

కాలా-మన వాదమున మధ్యస్థుఁ డెవఁడైన నుండవలదా? బొఱ్ఱయ్య సెట్టిని బిలిపించి, కొంచెము సేపు వీథిలోఁ గూర్చుండఁబెట్టిన బాగుగ నుండు నేమో! ఆతఁడు వెలుపలఁ గూర్చుండుట బాగుగ నుండనియెడల, నాతనివిడి యిత్తడి చేయినైనఁ దెప్పించి యధ్యక్షపీఠమున నుంచవలయును. మధ్యస్థుఁడు లేనివాద మసమంజసము.

జంఘా-గ్రంథముల గొడవయే యెఱుఁగని కోమటివాని మాధ్యస్థ్యమేమిటి? మనకు మహేశ్వరుఁడే మధ్యస్థుఁడు కానిండు.

నేను-కొంతకాలము క్రిందట నన్ని పరీక్షలకు దేశభాషలు నిర్బంధపఠనీయములుగ నుండెను. ఆ పద్ధతి సంతుష్టికరమైన యభివృద్ధి నీయలేదు. దేశభాషాగురువులగు పండితులు బాలుర కభ్యసింపఁ జేయవలసిన సులభరీతు లెఱుఁగక తెలివితక్కువ తలతిక్క రోఁకటి పాటలక్రిందఁ బెట్టి “కః కిమ్, కస్య, క్యాకర్ కర్ " అను ననావశ్యకములగు నకాలపువెఱ్ఱియా కాంక్షల క్రిందఁబెట్టి నిరంతర సంబంధమున్న భాషావ్యాకరణములలోఁ దీర్ఘమునకుఁ దీర్ఘము, ప్రసాధమునకుఁ బ్రసాదము ననునట్లు భాషలో నెంతమాత్రము బాలురఁ బ్రవేశపెట్టకుండ వ్యాకరణము భాష్యాంత మభ్యసింపఁజేసి వ్యాకరణపాఠమును గట్టి భాషాపాఠమునే చెప్పి వేదముల నపహరించిన సోమకాసురునాఁటి వెఱ్ఱిపద్ధతులనే యవలంబించి భాషాపఠన మంతయుఁ బలువిధములఁ బాడుసేయ బాలురు భాషాభ్యసనమునఁ బరమాసహ్యతాయుక్తులయిరి. అనివార్యపఠనపద్ధతిని బట్టి వచ్చిన ముప్పిదిగదా? యని యెంచి దేశభాషలు పైపరీక్షలకు స్వేచ్ఛాపఠనయోగ్యములుగఁ జేయఁబడినవి.

జంఘా- పైపరీక్షలకేనా? 4-వ ఫారం మొదలుకొని స్కూల్ ఫైనల్ వఱకు భాషాపఠనము నిర్బంధము సేయఁబడినదా? దాదాపుగా 12 సంవత్సరములున్న 4-వ క్లాసు పిల్లవాఁడు దేశభాషను వదలుకొనవలసినదా? ఏ దేశముననయిన నిట్లే జరుగుచున్నదా? మీ కింగ్లీషు దేశ భాషకదా? మీరు దేశ భాష నిట్లే పరిత్యజింపఁజేయఁబడితిరా? మీరు ల్యాటిను గ్రీకు మొదలగు నాది భాషలు నేర్చుకొనునప్పు డింగ్లీషు భాషామాధ్యస్థ్యముననే నేర్చుకొనలేదా? దానిని వదలి నేర్చుకొంటిరా? మీయభివృద్ధికి దేశభాష యావశ్యకమై మాయభివృద్ధి కాటంకమయినదా? పోనీ (School Final) స్కూల్ ఫైనల్ వఱకయిన దేశభాషలు చదువకతప్పనివిగఁ జేసితిరేమో! పై పరీక్షలకు వాని యనివార్యపఠనమంత యావశ్యకము కాదేమో యని మాలో మేము కన్నులు తుడుచుకొందుమన్న నేదీ? కాకి కుక్క కథలు ముగిసిన వెంటనే మాభాషాపాండిత్యమున కాశ్వాసాంతమైపోయెనే! మా దేశీయ గ్రంథపఠనదీక్ష కవబృథస్నాన మైపోయెనే! తగిన భాషా గురువులు లేకుండుటచే భాష యందు బాలురకు వేదాంతము ముదిరినదా! ఆహా! ఇది యెక్కడి హేతుకల్పనము? పూర్వభాషాపండితు లంత నిరుపయోగులనియే మీకుఁ దోఁచినదా? నలువదియేఁబది వత్సరముల లోపునఁ గలిగిన నవలాకారకులు, చరిత్ర కారకులు, శ్రవ్యదృశ్య ప్రబంధకారకులు, భాషాంతరీకరణ సమర్థులగు దేశీయు లిందఱు మీరు చెప్పిన తలతిక్క, తెలివితక్కువ, యెదుగుబొదు గెఱుఁగని కృతయుగపండిత స్థాణుజాతి వారివలన నిట్టిలోకోపకారస్థితిలోనికి వచ్చిన వారే కారా? ఇట్టి వీరి కందఱకు నాంగ్లేయభాషాప్రవేశముగూడఁ గొంచెముగనొ విశేషముగనొ యున్నదికదా? వీరందఱుగూడ నింగ్లీషుతోడ దేశభాషను నిర్బంధముగ నభ్యసించినవారగునా? కాదా? పూర్వపద్దతి సంతుష్టికరమగుఫలము నీయకపోవుటచే నీనవీనపద్ధతి కల్పింపఁబడినది అని మీరు చెప్పుచున్నారుగదా? ఇది సాహసమైన మాట కాదా? ఒకవేళ మీరభిప్రాయపడునట్లు దేశీయభాషా గురువగు పండితుఁడు సమర్థుఁడే కాకపోవచ్చును. పురాతనపుఁదుక్కే కావచ్చును. అతనిని బాగుచేయవలయును. అతనిని బ్రస్తుతస్థితి కుపయోగించునట్లు మార్పవలయునుగాని యాతనిని బట్టి మా బాలురకు భాషలనుండి బహిష్కారమా? భాషలకుఁ బఠనశాలనుండి బహిష్కారమా?

నేను-మీ భాషలను జదువుకొనవలదని మీ బాలుర నెవ్వరిని బ్రతిబంధింపలేదు. ఇష్టమువచ్చినవారు చదువుకొననే వచ్చును. అట్టి స్వేచ్ఛవలన భాషాభిరుచి పుట్టును. బలాత్కారము లేదు.

జంఘా-వారి యిష్టమేమిటి? ఇంటర్మీడియేటు క్లాసులోనికి వచ్చు బుద్ధిమంతుఁడైన బాలునకుఁ బదునాఱు సంవత్సరము లుండ వచ్చును గదా? తిన్నగ నాలుగుమాటలు మాటలాడుటకైన శక్తి కలిగియుండఁడు కదా? అట్టి బాలునకు దేశ భాషను మానుటకుఁగాని చదువుటకుఁగాని స్వేచ్ఛయా? ' వానికిఁ దోఁచినయెడల మానవలసినదా? వాఁ డంతటి దీర్ఘాలోచనపూర్వకమగు కార్య మావయసులోఁ జేయఁగలఁ డనియే మీ రనుకొందురా? మీ రట్టివయసులో నట్టి యాలోచనఁ జేసికొనఁగలరా? బలాత్కారము చేసినందువలన భాషాభిరుచి గలుగదు. కాన స్వేచ్ఛ నిచ్చితిమని యిది యొక క్రొత్తసిద్ధాంతమా? ఈ సిద్ధాంతము మీయాంగ్లేయభాష కేల యుపయోగించు కొనఁగూడదు? ఇక్కడఁ దిరుగ వ్యత్యాసమా? ఇది మాదిక్కుమాలిన దేశ భాషలకు మాత్రమే చెల్లవలసినదా? రాజభాష యొకటియు, దేశభాష యొకటియు నెప్పుడుగాని యెంతవయస్సుగల బాలునకుఁగాని నిర్బంధపఠనీయములుగ నుండవలసినదే! ఇతర విషయములు స్వేచ్ఛాను సారములుగ నుండవచ్చును.

నేను-ఇంటర్మీడియేటు బి.యే. పరీక్షలకుఁ బోవు బాలురకు దేశీయభాషావ్యాసములఁ బరీక్ష యున్నది కాదా? అది చాలదా?

జంఘా-ఉన్నది ఉన్నది, ముమ్మాటికి నున్నది. భాష లీరీతిగా నుధ్ధరింపఁబడుచున్నవా? బాగు. భాష లక్కఱలేదా? భాషలలోఁ బాఠములు మీరు చెప్పరా? భాషాపరిజ్ఞానము చూచుటకై వ్యాసములలోఁ బరీక్షలా? మీరు చెప్పనప్పుడు వారు చదువుకొననప్పుడెక్కడ నుండి భాషాపరిజ్ఞానము రాఁగలదు? భాషాగ్రంథములు చదువకుండ భాషాపరిజ్ఞానము గల్గుసాధన మేమైన నున్నదా? ప్రవేశ పరీక్షకుఁ గాఁబోలు పూర్వము రద్దుచేయఁబడిన యాంగ్లేయభాషాపఠన గ్రంథము తిరుగ నేల యంగీకరింపఁబడినది? భాషాగ్రంథపఠనము లేకుండ భాషాభిజ్ఞానము కలుగదను సంగతి యాంగ్లేయభాషకు నిజమైనప్పుడది దేశభాషల కన్యథా యగునా? ఆంగ్లేయభాష నుద్ధరించుటకై యిప్పుడు తిరుగ గ్రంథపఠన మనివార్యము చేసినట్లే దేశభాషలఁజావకుండఁ జేయుటకై యిప్పుడుకూడ నట్లు చేయరాదా? చేయుట న్యాయము కాదా? భాషాగ్రంథపఠనము లేకుండ భాషాభిజ్ఞానము లేదు. లేనప్పుడు లభింపని భాషాపరిజ్ఞానమునుగూర్చి వ్యాసపరీక్ష లేల? ఇవి యున్న లాభమేమి? ఇవి యుండుట లేనట్లుండుట కొఱకుఁ దప్ప నితర ప్రయోజన మేమున్నది? అదిగాక కన్నులకు గంతలు గట్టి కాదంబరి చదివిన బహుమతి నిత్తునని చెప్పిన నెవఁడైనఁ జదువఁగలఁడా? కలకత్తాలో నున్నవానికిఁ గాళ్లకుఁ గట్టులుగట్టి కాశికిఁ బర్వెత్తిన యెడల గౌరవపత్రిక నిచ్చెదనని యనునెడల నాతఁడు పరుగెత్తఁ గలఁడా? సాధనములఁ జంపినతర్వాత ఫలములోఁ బరీక్ష యెట్లు? చేతిలోని కలము లాగుకొనిన పిమ్మట వ్రాఁత పరీక్ష యుపయోగమున్నదా? వ్యాసలేఖనము సామాన్యమే! ఎన్ని భాషాగ్రంథములు చదువవలయును? ఎన్ని మారులు చదువవలయును? ఎందరచేతఁ జెప్పించుకొనవలయును? ఎన్ని తప్పుటడుగులు వేయవలయును? ఎన్ని పాటులు పడవలయును? ఎన్ని వంకగీఁతలు గీయవలయును? ఎన్ని మొట్లు తినవలయును? భాషా పరిజ్ఞానసారమును ప్రపంచ జ్ఞానసారమునగు వ్యాసలేఖనము పదునారు, పదునేడు సంవత్సరముల బాలునకు నిరాధారముగ, నిష్క్రయత్నముగ, నిస్సాధనముగ, నాకాశ పంచాంగముగ రాఁగలదా? అన్ని దివ్యగ్రంథముల వ్రాసిన నాంగ్లేయగ్రంథకర్త లందఱు భాషాపఠనసాహాయ్యముననేకదా యట్టి యపూర్వలేఖనము నభ్యసింపఁ గలిగిరి? నేల వదలిన సాము, భాష వదలిన లేఖనముండునా? నీళ్లలోఁబడి యొకప్పు డుక్కిరిబిక్కిరి యయి యటు కొట్టుకొని యిటుకొట్టుకొని మునిఁగి తేలి చేతులు కాళ్లు జాడించి తన్నుఁ గ్రమక్రమముగఁ దేల్చుకొని బారవేయఁగలవానికే యీఁతలోఁ బరీక్షకాని, యొడ్డునఁ గాళులు తడియకుండఁ గూర్చుండువానికిఁ బరీక్ష గలదా? అటులే దేశీయభాషామహాగ్రంథ సుధార్ణవమునఁ బడి తద్రసమును గొంత యుక్కిరిబిక్కిరి యగునట్లు త్రాగి యనేక సంవత్సరములు క్రిందుమీఁదుగ గింజుకొని తత్సన్నివేశమున కలవాటుపడి కడతేఱినవానికే వ్యాసలేఖనమునఁ బరీక్షగాని భాషను దరిఁజేరనివానికిఁ గలదా? వ్యాసలేఖనకు గ్రంథపఠన సాహాయ్యము తప్ప నితరసాధన మేమైన నుండుట కవకాశ మున్నదా? (Guides to Composition) (గయిడ్స్ టు కాంపోజిషన్) అని యింగ్లీషువారిలో గ్రంథములున్నవి కాని మనలో లేవుగద? అవి యుండి వారికెంత యుపయోగమో యవి లేకున్న మనకంతియే నష్టముకదా? అట్టి గ్రంథములు వ్రాఁతపద్ధతులను స్వల్పముగఁ జెప్పునుగాని భాషాసామర్థ్య మీయఁగలవా? అదిగాక గంగాప్రవాహమువంటి లేఖన ధోరణి యట్టిపద్ధతులకు లొంగునా? పాకశాస్త్రము చూచి ప్రొయ్యిలో నిప్పువేయువాఁడు తన్నుఁ గాల్చుకొనుటకు, గుణపాఠము చూచి వైద్యము చేయునాఁ డితరులను గాల్చుటకే కదా? కావున వ్యాసలేఖన మెప్పుడు పరీక్షార్హమో భాషాగ్రంథము లప్పుడే నిర్బంధపఠనీయార్హములు కాక తప్పదు.

నేను-దీని నిప్పుడట్లు చేసినయెడల నిర్బంధపఠనార్హ విషయము సంఖ్య హెచ్చగుటయుఁ దద్విషయిక గురువులకుఁ బని హెచ్చుటయుఁ జదువుకొను బాలుర మనస్సులకు భారము హెచ్చగుటయుఁ దప్పక సిద్ధించును. ఇదియుఁగూడ నాలోచనీయాంశము కదా?

జంఘా-మిగిలినవి తగ్గించుకొనవచ్చును. బంధువుల పరమాన్న భోజనమున్నకై ముందుగఁ దల్లిని బస్తుపెట్టుదురా! తల్లిని గౌరవింపని జ్ఞానశూన్యుఁడు బంధుమర్యాద కేడ్చినందువలన విశేషగౌరవ మున్నదా? అట్టివాఁడు తాను బస్తుండుట మంచిది కాదా? మన భాషామాతను మనము వదలఁ దలఁచుకొన్నప్పుడు మనకు విద్యతోఁ బనియేలేదు మాతృభాషానిరసనముకంటె మౌఢ్యము మంచిది. మన భాషామాతయొక్క యభివృద్ధికి నుపయోగమునకు, నుజ్జీవనమునకు, సదుపాయమునకు, సౌఖ్యమునకే మనకితరోపవిద్యలుగాని మఱి యింకెందులకు? తల్లి చావుపిల్ల పోఁతపాలతో నారోగ్యముగఁ బెరుఁగగలదా? శవమున కలంకారము లేల? ప్రాముఖ్యమున, బలాత్కార పఠనార్హత్వమున రాజభాష యెట్టిదో దేశభాషయు నట్టిదే! ఈ భాషా ద్వయముతరువాతనే యితర విషయపఠనము. అంతేకా! తోఁక ముందు, మూతి వెనుకనా?

నేను-పూర్వపుఁ బద్దతివలన ననఁగా నన్నియు నిర్బంధపఠసార్హములు సేయుటవలన నప్పటి బాలుర జ్ఞానమునకు వైశాల్యమే కాని లోఁతు తక్కువగ నుండెనని కనిపెట్టఁబడినది అనఁగా విశేష విషయములు వారికిఁ దెలియునుగాని యేవిషయముననైనఁ బూర్ణముగఁ దెలియదు. అట్టి విద్యాపద్దతి సంతుష్టిగ లేక బాలురజ్ఞానము స్వల్పవిషయిక మయ్యును గంభీర మగునట్లు చేయుటకై యీనవీన పద్ధతి-యనఁగఁ దమ కభిరుచి గల విషయముల స్వేచ్ఛానుసారముగఁ జదువుకొనుపద్ధతి- కల్పింపఁబడి తదనుగుణ్యముగ పఠన విషయములు ఖండములక్రింద విభాగింపఁబడినవి. విశేషవిషయములలో మిడిమిడి, జ్ఞానమున్న వారి డెందునను దెలియనివాఁడే! కొలఁది విషయములలో నైనఁ బూర్ణముగఁ దెలిసినవాఁడు వానిలోనైనను దెలిసినవాఁడే యగును. దేశ భాషలలో నభిరుచియున్నవా రాభాషలనే తీసికొని వానిలో నపూర్వపాండిత్యమును సంపాదించు కొనవచ్చును. పూర్వపధ్ధతి ననుసరించి తేలినవారు నూర్గుఱకన్న నవీసపద్ధతి ననుసరించి తేలినవారు పదుగు రధికలోకోపకారకులు.

జంఘా-ఏదీ? అట్లు తేలినవారేరి నాయనా? ఇఁక మునుఁగుట తప్ప తేలుట యేమిటి? దేశభాషాభిరుచిచే నేతరగతిలో నెందఱు చేరిరో లెక్కలనుబట్టి తెలియఁగలదు. 1912 సం.లో నింటర్మీడియేటుకు 5823 రును, బి.యే.కు 1012 గురును విద్యార్థులు గలరు. 1912-1913 సం.లో రెండవతరగతి కాలేజీలలో ‘‘నింటర్మీడియేటు పరీక్షలలో మొదటితరగతిలో నరవము చదువుకొనువాఁ డొక్కఁ డున్నాఁడు. రెండవతరగతిలో నార్గురున్నారు. హిందూసర్వకళా ప్రధానశాల కంతకు నాసంవత్సరములో బి.యే. తరగతిలో నొక్కఁడున్నాఁడు. భాషా పాండిత్యము సంపాదించుకొనఁదలఁచి చదువుకొనువారు 71 మంది తెనుఁగువారు, 15 గురు కర్ణాటకులు, 28 గురు మళయాళస్థులు, 27 గు రుర్దుభాష వారు నున్నారు. సంస్కృతము చదువుకొనువారు మాత్రము 282 మంది యుండుటచే నీ నవీనపద్ధతి దేశీయభాషల కెంతమాత్రముపయోగించుట లేదని స్పష్టపడుచున్నది” అని మొన్న జరిగిన వాదములో మ.రా.శ్రీ హానరేబిల్ శ్రీనివాసశాస్త్రులుగారు చెప్పినారు. ఇదిగాక భాషాభిరుచిచే నందుఁ బూర్ణ పాండిత్యము సంపాదించుకొన వచ్చునని నీవు చెప్పితివే? అట్లు సంపాదించుకొనుట కవకాశము లేదు. అట్టి తరగతులు బి.యే.కు నేకాలేజీలో నింకఁ బెట్టనేలేదు. “హానర్సు”కు మాత్రము ప్రెసిడెన్సీ కాలేజీలో నేర్పాటున్నది. దేశభాషల తోడి యింటర్మీడియేటు పరీక్షకుఁ గ్రిష్టియనుకాలేజీలో నేర్పాటు లేదు. ఏర్పాట్లు చూచిన నట్లున్నవి. చదువుకొనుచున్న పిల్లలసంఖ్య చూచిననట్టున్నది. ఆంగ్లేయ విద్యాపండితులగు గురువుల (Professors) యొక్క పట్టుదల యటులున్నది. అదిగాక వీరికింత దేశీయభాషావైషమ్య మెందులకు? హరిభాష కాదయ్యెను. వారు చదువుకొనిన (Latin, Greek) లాటిను, గ్రీకు మొదలగు నితరభాషలు కావయ్యెను. వారి కెంతమాత్రము తెలిసినభాష కాదయ్యెను. అట్టి యంశములో వారు తటస్థులుగ నుండుటకు బదులుగఁ దెలిసిన భాషాభిమానుల యభిప్రాయముల నిరసించుట చింత కాదా?

నేను ఈ నవీనపద్ధతి నవలంబించి మూఁడు సంవత్సరము లయియుండును గాఁబోలు. ఇది యెట్లు నడచుచున్నదో బాగుగఁ గనిపెట్టుట కింకఁ దగినంతయవకాశము కలుగలేదు. అదిగాక ముప్పది నలువది లక్షల వ్యయముచేఁగాని యీనవీనపద్ధతి ననుసరించి యేర్పాటులన్నియు జరుగవయ్యెను. అంతధనవ్యయ మొనర్చి తగినంత కాలము దీనినడకఁ జూడకుండ విడుచుట తగినపని కాదు. అందుచే నీకోరిక నెఱవేఱలేదని నీవు దుఃఖింపక యూరకుండుము.

జంఘా మనకోరిక విద్యాసంఘమువారు తీర్చువరకు మనహృదయములకు శాంతి యుండునా? వారు తీర్చువఱకు మన మూరుకుండువారము కాము. నిరంతరము ప్రార్థించు వారము. దుఃఖింపక యూరకుండు మని యెంతసులభముగఁ జెప్పితివి? నానోటియొద్ద నున్న యన్న మెవఁడైన నెగమీటుకొనిపోవ నేను గంటఁ దడి పెట్టువాఁడనుకాను. నేను దున్నుకొని జీవించుపొల మెవఁడైన నాక్రమించుకొనఁగ నే నేడ్వను. నాయింటిలోని సర్వస్వము సకాంతాపుత్రకముగఁ జోరులు హరించిన నే నంత దుఃఖించువాఁడను గాను. కాని చేటలోఁబడి “క్యావు” మనునది మొడలు హరియని కాటిలోఁ బడువఱ కుపయోగించు కొను దేశభాష కిట్టి

ఇచ్చట జంఘాలశాస్త్రి-గద్గదస్వరముతోఁ గనులు దుడుచుకొని యూరకుండెను. అతని హృదయమార్దవము గాంచి మేము తెల్లఁ బోయితిమి. కాలాచార్యులు, కవియు వాదములోఁ గూడ నప్పటికి నాకును జంఘాలశాస్త్రికిని జరిగిన సంభాషణ చెరియొకఁడు వ్రాసెను. మిక్కిలి రాత్రి యగుటచే ముగిసెను.