సత్య హరిశ్చంద్రీయము/షష్ఠాంకము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

సత్య హరిశ్చంద్రీయము

షష్ఠాంకము


(రంగము : కాశీపుర స్మశాన పరిసరారణ్యము)

(పిమ్మట గాలకౌశికుని శిష్యులగు కేశవ జనార్దనులతో లోహితాస్యుడు ప్రవేశించుచున్నాడు)

(గేయము - పార్శీమెట్టు)

అందరు - ఆటలాడుదమా చెండ్లాటలాడుదమా వాటమైన త్రొక్కుడు బిళ్ళాటలాడుదమా ॥ఆట॥ చెట్టులెక్కుదమా లేక గుట్టలెక్కుదమా అట్టు నిట్టు జీగురుబండలందు జాఱుదమా ॥ఆట॥ కూఁత వెట్టుచు దాగిలిమూత లాడుదమా ॥ఆట॥ ఆతరువు క్రింద గోలిలాటలాడుదమా ॥ఆట॥

లోహి - మిత్రులారా!

గీ. ఆటలకు వేళలేదు సాయంతనంపు టగ్నిహోత్రములకు వేళయయ్యె నిప్పు డయ్యవారలు ముక్కోపులగుట మీకుఁ దెలియునేకద రండు దర్భలను గోయ.

కేశ - జనార్దనుడా! పాపము! లోహితాస్యుని కీనాడెన్ని దెబ్బలు తగిలినవిరా! అందుకే వీఁడు భయపడుచున్నాడు.

జనా - మనలను గూఁడ గొట్టునేమో రండు. తలకొకదారిం బోయి దర్భలఁ బత్రములఁ గోయుదము. (అట్లు చేయుచున్నారు)

లోహి - (నడచి పూలఁగోసి) ఈ పూలతావి చక్కగా నున్నది. ఇవి మా కాలకంటికై తీసి కొనిపోయెదను. ఇదిగో నీ పుట్టమీద దర్భలు బాగుగా బెరిఁగినవి. అందరి కంటే నేనే ఎక్కువ దర్భలను గోసెదను. (పుట్టనెక్కి కోయుచుండ పాము కఱచును) హా! తల్లీ! హా! మిత్రులారా! నన్నొక పెనుఁబాము కఱచినది. (పడిపోవును).

అందఱు - (పరుగెత్తుకొనివచ్చి) నెచ్చెలీ! నీకేమైనది?

లోహి - అన్నలారా! ఇంకేమి కావలయును? నన్నొక పాము కఱచినది. ఇంక మాయమ్మను జూచుభాగ్యము నాకు లేదు.

కేశ - అయ్యో! అయ్యో! నీకెంత కష్టము కలిగెను? జనార్దనా! పాపము వీనికి మత్తు వచ్చుచున్నది. చెమటలు శరీరమునుండి యూఱక కాఱుచున్నవి. నోట నుఱుగులు పడుచున్నవి. కొంతసడి విసరనైన విసరుదము. (అట్లే చేయుచుండ)

లోహి - (కొంచెము తేఱి) అన్నలారా! చింతింపకుడు. నా యదృష్టమునకు మీరేమి చేయగలరు? మీ రిక్కడ నా మూలమున మసలవద్దు. మీకు మాట వచ్చును.

సీ. జాగయ్యెనని కొట్టునో గురుండట మిమ్ము
          నిచట నుండక యింటి కేగరయ్య
అతిభక్తి మీకు లోహితుఁడంపినాడని
          యీ కుశల్గురున కందీయరయ్య
సదయయై నారాక కెదురు చూచెడి తల్లి
          కీ నాదుగతి వచియింపరయ్య
యేదిక్కు లేక నేనే లోకమని యున్న
          జనని దుఃఖము బాపి మనుపరయ్య

   వీలుగా నున్న గురు నొప్పుకోలుమీఁద
          నమ్మ నొకసారి చూచి పొమ్మందురయ్య
          విసము తలకెక్కె నేను జీవింపనయ్య
          కడ కిదే మీకు నా నమస్కారమయ్య!

నెచ్చెలులారా! నా ప్రాణములు లేచిపోవుచున్నవి. మీరిఁక బొండు. హా తల్లీ! నీవైన నాదగ్గర లేకుంటివే? (మూర్ఛిల్లును)

జనా - అయ్యో! అయ్యో! ఎంతపని జరిగెను?

కేశ - మనమీఁద కేమి రాదుకద జనార్దనా!

జనా - మనము పోయి పాపమా చంద్రమతి కీ సంగతి నెఱింగింతము. మనమిక్కడ నుండి చేయునదేమున్నది? (నిష్క్రమింతురు) (పిమ్మట చంద్రమతి పిడక లేరుచుఁ బ్రవేశించుచున్నది)

అకటకటా ! ఎంత మందభాగ్యురాలను. నిరంత మనంతపరిచారికాశతంబుల యూడిగంబు లందికొను పట్టంపు రాజ్ఞీపదం బనుభవింప జేసి దైవమా ! తుదకీ నీచగతి కేల పాల్పఱచితివి? తొలుతనే నన్నీలాటి దాసిగ సృజియించిన నీవు నాకెంత యుపకార మొనరించినవాఁడ వగుదువు! ఈ దాసికావృత్తి యందైనను నా యజమానురాలిని మెప్పింప లేకుంటినే? హా! ప్రాణపతీ! హరిశ్చంద్రా! నీ విప్పుడెందున్నావో కదా! కాలకౌశికునికి నన్నొప్పగించునప్పుడు మనసార మన కష్టంబులఁ దలంచుటకైనను వీలు లేకపోయినను గడకు మందభాగ్యురాల నగు నేను,

సీ. యజమానుఁడైన బ్రాహ్మణుని తీవరముచే
          నింపార మిముఁ గౌఁగిలింప నైతి
నిబిడాశ్రువుల దృష్టి నిలుపలేకుండుటచే
          గనులార మిము జూచుకొనగనైతి
దుఃఖంబు పొంగి కుత్తుక బంటి యౌట నో
          రార మీతోడ మాటాడనైతి
మసలినన్‌ వడుగుచేమాట వచ్చునటంచు
          నొక్కింత మీదండ నుండనైతి
  
          కడకు నన్నొప్పగించి యీ కర్మమునకు
          ముందుఁ బోలేక పోలేక పోయినాఁడ
          వెందు నున్నాఁడ వేగతి నొందినాఁడ
          విలను నున్నాఁడవో లేవో! యినకులేశ!

అక్కటా! శోకతీవ్రతచే యజమానురాలి యాజ్ఞను మఱచుచున్నాను. ఇంక దొందఱగాఁ బిడక లేరవలయు. (ఏరుచు) ఓహో! సాయంకాలమై పడమటి కొండయందలి సంజకెంజాయ విశ్వామిత్రుని కోపరసమో యనఁ బ్రకాశించుచున్నది.

మఱియు,

మ. కొడుకస్తం గతు డయ్యెనంచు దెలివిన్‌ గోల్పోవుచున్‌ గన్న ప్రే
ముడిఁ జింతించెడి లోకబాంధవునకై పూర్వాశ ప్రాణేశుఁడె
య్యెడకో పోయెనటంచుఁ బద్మిని సదాభృంగీరవ్యాపృతిన్‌
దొఁడగన్‌ మోముముడించి యేడ్వనెట బంధుత్యాగ మింతేకదా?

కాని వడుగులతోఁ గలసి యడవి కేగిన మా లోహితాస్యుం డింకను రాకున్నాఁ డేమొకో? రావలసిన వేళ గూడ యతిక్రమించుచున్నది. అదిగో,

శా. ఆవు ల్మందలలోన నిల్వకయె యంబాయంచు లేదూడలన్‌
ద్రావింపన్‌ దమచేఁపు బాలు వడి నిండ్లన్‌ జేరెడిన్‌ ముక్కలం
దేవో ధాన్యపుఁ గంకు లందికొని యప్డే గూండ్లకున్‌ జేరెనా
రావంబు ల్చెలంగన్‌ బులుంగు లకటా! రాడేఁమి నా పాపఁడే.

నేఁ డేకారణంబుననో నామనంబు పరిపరివిధముల దపించుచుఁ గీడునే శంకించు చున్నది. తొలుతఁ కుఱ్ఱవానిని స్వామి యడవికిఁ బంపునప్పుడు బాల్యచాపల్యముచే వాఁడు "నే నడవికిం బోలే" నన్నమాత్రమున ముక్కోపియైన కాలకౌశికుఁడు చబుకుం బట్టుకొని,

మ. "చెడుగాఁ యేపని చేతగానియెడ నాచే నౌనె ముప్పూటలున్‌
గడుపుబ్బ న్నిను మేప?" నంచుఁ దనువున్‌ గాయాలుగాఁ గొట్టినన్‌
బడలేకా వ్యధఁ బ్రాణభీతి "గనుడమ్మా! చూడవే" యంచు నా
కడకేతెంచిన పుత్రు కష్టగతి నా గర్భంబు ఛేదించెడిన్‌.

దైవమా! ఎంత నీచ దురవస్థకుం దెచ్చితివి. ఏది యెట్లయినను గుఱ్ఱవాఁ డింకను నాకంట బడలేదు కదా! చెడుదినములుగాన నామనంబు ప్రతిక్షణము శంకించుచునే యున్నది. (ప్రక్క జూచి) వారే వడుగులందఱు వచ్చుచున్నారు. అక్కటా! కోసిన దర్భలు మోయలేక కుఱ్ఱవాడు వెనుకం జిక్కె కాఁబోలు! నేను వానికి సహాయము పోయెదను. (ఎదురుపోయి) ఏఁడి నా లోహితుఁడు? బ్రహ్మచారులు మాత్రము గనపడుచున్నారు గాని నా ముద్దులయ్య లోహితుండు కనంబడఁడే?

(వడుగులు ప్రవేశింతురు)

కేశ - జనార్దనా! పాపము చంద్రమతి ఇక్కడనే యున్నదిరా?

జనా - అయ్యో! ఈ దారుణవార్త యేమని వచింతుము?

చంద్ర - అన్నలారా! మా లోహితుఁడెక్కడ?

బ్రహ్మచారులు - (ఊరకుందురు.)

చంద్ర - ఏమి నాయనలారా? మాటాడరు? మఱేమి యప్రియము లేదు కదా?

కేశ - జనార్దనా! చెప్పుము.

జనా - నీవే చెప్పరా.

చంద్ర - అయ్యలారా! మిమ్ముఁ జూచిన నా కడుపు బ్రద్దలగుచున్నది. మీ ప్రియ మిత్రుడు లోహితాస్యు డేమయ్యెనయ్యా! కేశ - అమ్మా! మేమే పాపకర్మ మెఱుఁగము. మేమందఱ మడవిలో దర్భలు గోయుచుండ "మిత్రులారా! నన్నొక పెనుఁబాము కఱచినది" యను మీ లోహితాస్యుని దీనారవము మాకు వినంబడినది. అంత మేము పోయి చూతుము గదా సర్పదష్టుడై మరణవేదనఁ బడుచున్న నీ కుమారునిం జూచితిమి.

చంద్ర - హా! తండ్రీ! లోహితా! నే జచ్చితినిరా. (మూర్ఛిల్లును)

కేశ - అమ్మా! ఇంకఁ గొంచెము చెప్పవలసియున్నది.

చంద్ర - నాయనా! ఇంకేమి చెప్పవలయును?

కేశ - అప్పుడు స్పష్టముగా లేని వాక్కులతో నిట్లు చెప్పినాడు.

చంద్ర - ఎట్లు తండ్రీ!

కేశ - ('జాగయ్యె' నను పద్యమును చదువును) అట్లు చెప్పినప్పుడు మరణవేదన పడుచుండె. ఇప్పుడెట్లుండునో తెలియదు. ఎట్లయిన నీ కుమారుని నొక్కమాఱు చూచుకొనిరమ్ము. ఇదిగో ఈ మార్గమున సూటిగాఁ బోయితివేని నీ కొక వటవృక్షము గాన్పించును. దాని నీడయందే నీ నందనుండు పడియుండు. మేమింకఁ బోయి వత్తుము. మాకచట మాట వచ్చును.

చంద్ర - అయ్యలారా! పొండు. నా దురదృష్టమునకు మీరేమి చేయుదురు?

(బ్రహ్మచారులు నిష్క్రమింతురు)

చంద్ర - హా! కుమారా! లోహితా! నీకు మృత్యుదేవతయై యాకాలసర్పమెక్కడ దాపురించెనోయీ తండ్రీ! అడవికేగునప్పుడు "నేను నడువలేకున్నను నన్ను గురుండు బలవంతముగా గొట్టుచుఁ బొమ్మను చున్నాఁ" డని నీ వెంత చెప్పికొన్న నింటనే నిల్పికొనఁ జాలని నేను నిన్నుఁ జూడ వచ్చుటకు మాత్రమెట్లు స్వతంత్రురాలనగుదును? కొడుకా! నీవునన్నుఁ బూర్ణముగా విడిచిపెట్టితివా? హా విధీ! పతివియోగముచేతనే యిదివరకు గృశించి కృశించి యెప్పటికైన మా హరిశ్చంద్రుని చూడకపోదునా? యెల్లకాలము గష్టము లిట్లే యుండునా యను మొండి ధైర్యముచే నెక్కడనో యొక్క ప్రాణముతోడ నీలాగు జీవించియున్న నాగర్భమునఁ బుత్ర వియోగాగ్నియుఁ దరికొల్పితివా? నాకింక దిక్కెవ్వరు? హా! ప్రాణేశ్వరా! హరిశ్చంద్రా! నీ విప్పుడెక్కడ నున్నావు? కాలవైపరీత్యముచే నీకుటుంబ మంతయు దిక్కుమాలి నేఁటికి జెట్టున కొక పక్షియై రాలిపోవలసి వచ్చెనే, అయ్యో! దుఃఖభారముచే సేవాకృత్యమును మఱచుచున్నాను. స్వామి యాజ్ఞంగైకొని కొడుకువడియున్న చోటునకైనబోయి చూచివచ్చెదను. అమ్మా! కాలకంటకీ! నీవిప్పుడేమందువో?

కాలకం - (ప్రవేశించి, కోపముతో) ఓసీ, అంసనారీ! నీ విల్లు కదలి ఎంతసేపైనదే? పిడక లేరుకొని రమ్మని పంపగా సుఖముగా నిక్కడఁ బ్రొద్దులు పుచ్చుచున్నావా? ఓసీ! నీకు మాసొమ్మెంత విషమైనదే! ఈ తీరుగా బనికొడలు దాఁచుకొని యింటికే ముఖము పెట్టుకొని తిండికి రావలయు ననుకొన్నావు?

చంద్ర - అమ్మా, కోపింపకుము. నేను మీ యానల శిరసావహించియే పని చేయుచున్నాను. నేఁడు నా దురదృష్టము పండి దర్భలకై యడవికేగిన నా కొడుకును బాము కఱచినదఁట.

కాలకం - ఓసీ, సూత్రధారీ! తొందరగా నెందుకుఁ బనిచేయవన్నందునకీ పన్నాగము పన్నినావు! ఛీ! ఛీ!

చంద్ర - అమ్మా! నే నబద్ధ మెన్నటికి నాడనమ్మా! దర్భలకై పుట్టనెక్కగా నా కొడుకును బాము పట్టెనఁట.

కాలకం - ఎవరు చెప్పిరి?

చంద్ర - వెంటబోయిన వడుగులు చెప్పిరి.

కాలకం - అయ్యో! మాకు ధనవ్యయంబు గలిగింప నీవెక్కడ దాపురించితివే? బోలెడు ధనముపోసి కొనిన మేము నీ జీవనమునకు దేవుడాయని యేడ్వవలసి యుండఁగా నీకెందులకే యీ యేడుపు?

చంద్ర - అమ్మా! కన్నకడుపుగదా?

కాలకం - అట్లయిన నిప్పుడేమి చేయమందువు?

చంద్ర - కుఱ్ఱవాడు పడియున్న చోటకేగి చూచి వచ్చెదను. సెలవీయవలయును.

కాలకం - ఓసీ, నిర్భాగ్యురాలా! ఇంటిలో జేయవలసినఁ బనులెన్నియో ముందుఁ బెట్టుకొని యెక్కడకో పోయెదననుటకు నోరెట్లాడెనే? నీవు పోయిన తరువాత నీ పని యంతయు నీ తాత యెవరు చేయును? ఊఱక నోరుమూసుకొని నా వెంట రమ్ము.

చంద్ర - తల్లీ, కాలకంటకీ!

మ. కడ ప్రాణంబున నున్నవాఁడొ, విసమెక్కన్‌ జచ్చెనో కానలోఁ
గొడుకమ్మా! ననుఁ బంపకుండినను యోగ్యుండైన వైద్యుం ద్వరం
బడి యచ్చోటికిఁ బంపుమమ్మ బ్రతికింపం జాలునేమో సుతున్‌
గడ కాళ్ళంటి నమస్కరింతు సుతభిక్షం బెట్టి రక్షింపుమా.

కాలకం - చాలు చాలిదివఱకుఁ దిన్నది చాలక మాసొమ్మింకను గుండము వేయుదువుగా! దర్భలకు పోయినవాడు పుట్టలెక్కుట యెందులకు? పాము నోటికి గాలందీయఁగాఁ గఱవక ముద్దు పెట్టు కొనునా! కఱవకుండునట్లు దేశములోని పాముల కన్నింటికి వాకట్టు కట్టకుండుట మాతప్పాయేమి? నీ కొఱకై వైద్యునెవ్వరి నిక్కడ సిద్ధముగా నుంచలేదు. మాకు మందులు చేతఁగావు. ఇంటిలో బనులన్నియు జక్కబెట్టి రాత్రి మమ్ము నిదురపుచ్చి నీ వెక్కడికైనఁ బొమ్ము. (పోవుచున్నది)

చంద్ర - అమ్మా? నీ సెలవైనట్లే. (నడచుచు) హా! జీవితేశ్వరా హరిశ్చంద్రా! నీవుగూడ సేవా నిర్బంధమున లేవుగద! (అని నిష్క్రమించును)

(పిమ్మట నొక కుండ మూపుపై బెట్టుకొని హరిశ్చంద్రుడు ప్రవేశించి)

స్వామి యగు వీరబాహుడు నన్ను "హరిశ్చంద్రుడా! కాదు, కాదు. వీరదాసుఁడా! నేటి రాత్రియందు వల్లకాటియందు గావలియుండి, యుదయమున నింటికి వచ్చుచున్నప్పుడీ కుండ నిండఁ గ్రొత్తకల్లు నింపుకొని రమ్ము" అని యీ సురాభాండమును నాకిప్పించినాడు. ఆహా, సురాభాండమా! నీవు పూజ్యురాలవు. కావుననే, విశ్వామిత్రుని సహాయసంపత్తిచే విశ్వవిశ్వంభరాదేవికి నాస్థానంబగు నా భుజపీఠిపై నిట్లధిష్టించి యున్నావు. కానీ, నేనిప్పుడు శ్మశానవాటికకే వెళ్ళెదను. అంధకారమప్పుడే బ్రహ్మాండ మంతయు నావరించి కన్నులున్నవారిని గూడ గ్రుడ్డివాండ్రను జేయుచున్నది.

సీ. కలవారి యిండ్లలోపలి విధానము లెత్త
          నరుగు దొంగలకు సిద్ధాంజనంబు
మగలఁ గూరుకనిచ్చి తెగి యంటుగాండ్రకై
          తారాడు కులటల తార్పుగత్తె
అలవోక నలతి పిట్టలఁ బట్టి వేఁటాడు
          పాడు మూకములకుఁ బాడి పంట
మసనంబులోన నింపెసలారు శాకినీ
          ఢాకినీ తతుల చుట్టాల సురభి
  
          రేలతాంగికి నల్లని మేలి ముసుఁగు
          కమలజాండంబునకు నెల్ల గన్నుమూత
          సత్యవిద్రోహి దుర్యశశ్ఛవికిఁ దోడు
          కటికచీకటి యలమె దిక్తటములందు

ఇంకఁ ద్వరపడి శ్మశాన వాటికకే పోయెదను. (పిమ్మట శ్మశాన భూమి కాన్పించును) అహో! ఈ శ్మశానంబునం దెచ్చటఁ జూచినను,

సీ. కాఁబోలు బ్రహ్మరక్షస్సమూహం బిది
          ఘోషించుచుండె ఋక్కుల క్రమంబు

కాఁబోలు వీరు విగత జీవబాంధవు
          లడలుచుండిరి మహార్తారవములఁ
గాఁబోలు వీరు టక్కరి భూతమాంత్రికుల్‌
          నెమకుచుండిరి కపాలముల కొఱకు
గాఁబోలు నిది పిశాచీబాంధవ శ్రేణి
          పలలంపు బువ్వంపు బంతి సాగెఁ

   చిట్లుచున్నవి కాఁబోలు చితులలోనఁ
          గాల్పఁబడెడు శవాల కంకాళ సమితి
          నెటఁ బెఠీలను రవములే యొసఁగుచుండు
          దిక్కులన్నిండ మార్మోగింత పిక్కటిల్ల.

ఎవరచ్చట! నాకెదురుగా నిలుచున్నారు. పిలిచి చూచెదను. ఓహో, ఎవరు వారు?

గీ. కాటిసుంకంబు చెల్లింపకయె శవాల
మసనమునఁ గాల్పరే కద మనుజులార?
కాఁపు లేదనుకొంటిరేమో పదండు
దళిత ఘోరారి యీ వీరదాసు గలఁడు.

(అని నడచి) ఓహో! ఎంతపొరబడితిని? సగము కాలుచు బరువులేక నిట్టనిలువునఁ బైకిలేచిన యీ శవమును బ్రాణిగా భావించితిని. అయ్యో! ఈ కళేబరపు దుస్థితి యెంత జాలిం గొలిపెడిని.

శా. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌
నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్‌.

ఇట్టి శ్మశానములం గనినపుడెల్ల నీలాటి వైరాగ్యములు కలుగుచుండుట సహజమే. ఇంక నా మంచె దగ్గఱకు బోయెదను. (నడుచుచు) అయ్యో! దారి బొత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఈ చేతిలోని కాష్ఠమును నేనిప్పుడు దీపముగా నుపయోగించుకొనియెద. (అని కొఱవింగైకొని) ఆహా, చక్రవర్తులకు సేవకాజనముపట్ల బంగారపుంగర దీపికలకంటె నా యిప్పటి నీచస్థితికి నీ కొఱవియే మిక్కిలి యుచితమైనది.

శా. కాలంపుం గతి నెప్పుడేది యెటు భోగ్యం బప్పుడప్పాటనౌ
నాలీలన్‌ మును సేతు శీతనగ మధ్య ప్రాచ్య సామ్రాజ్య హే
లా లీలానుగతిన్‌ జరించి యిపుడీలాగైన నా ప్రాప్తికిన్‌
నాలో నాకొకభంగి నవ్వగు దురంతంబైన దుఃఖంబుతోన్‌.

మఱియు,

మ. చతురంబోధి పరీత భూవలయ రక్షాదక్ష చామీకరా
యత దండంబు ధరించు నీ కరమె యాహా! యిప్పు డిక్కాటిలో
జితిలోఁ గాలుచునున్న నీ కొఱవి దాల్చెన్‌ నవ్య మాణిక్య రా
జిత నీరాజన కాంతికిన్‌ బదులు వచ్చెన్‌ శోచనీయంబుగన్‌.

అయ్యో! ఈ కొఱవి యిప్పుడే యాఱినది. పోనీ, పాఱవైచెదను. (అని మెల్లగా నడచి) ఓహో! ఇదే శ్మశాన రాజ్యాభిషిక్తుఁడ నగు నా సింహాసనము (అని యెక్కి) నేనిక్కడ సోమరితనమున గూర్చున్న నిదుర వచ్చి స్వామి కార్యంబునకు భంగము కలుగదా, అయ్యో! నాకును నిద్రాహారములకును ఋణముతీఱి యెంతకాలమైనది? సుగుణవతియు నా యర్థాంగ లక్ష్మియు నగు చంద్రమతిఁ గొడుకుతో నొక్కనికి దాసిగా నెప్పుడమ్ముకొంటినో నాఁటితో నాకును నాసౌఖ్యమునకును ఋణము దీఱినది. మొండిపడి ప్రాణము మాత్రము వెడల పోకున్నది. ప్రాణము పోయిన నీ దుఃఖము లన్నియు నెవ్వరనుభవించు వారు? ఆహా! దైవోపహతుఁడనై నేనిప్పుడెన్ని విధముల బాధింపబడుచున్నాను.

మ. అకటా! యొక్కని పంచ దాసియయి యట్లల్లాడు నిల్లాలి పా
ట్లకుఁనై కుందుదునా? సువర్ణమయ డోలాకేళికిం బాసి పొ
ట్టకునై రోసి తపించు నా కొడుకు జాడం గాంచి దుఃఖింతునా?
యిఁక నీ నీచపు గాటికాఁపరిని నాకే నేను శోకింతునా?

హా! హా! లోకములోనిఁ గష్టములన్నియు నన్నే కోరి వరించినట్లున్నవి? కాకున్న నిన్ని కష్టము లెవ్వరనుభవింతురు? అయ్యో! ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుండు గతించిన వెనుక మరలఁ గష్టములకు దావెక్కడ దొరుకునో. రాజ్య వియోగంబునకై దుఃఖింపను. మహారణ్యావాసాది ఘోరదుఃఖంబులెన్ని సంభవించినను గణింపను. కడకతి నీచంబగు నా యీ చండాల దాస్యంబునకు గూడఁ బరితపించను. కాని చేపట్టినదాది నన్నే పరమ దైవంబుగ భావించుచు నా మూలమునఁ దనకంతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తిచే సహించుటే కాక తన్ను నొక్కనికిం దెగనమ్ముకొనుట నీచంబని నే సంకోచించునప్పుడు "నాథా! సత్యప్రతిష్ఠకై యొనర్చు నీచ కృత్యంబులు సగౌరవములే యగు" నని నాకు నుత్సాహము కలిగించి నా సత్యదీక్షం గాపాడిన నా యర్థాంగ లక్ష్మి యగు చంద్రమతీ దేవి వియోగదుఃఖము నేనే గతి భరింతు? హా దేవీ! అసూర్యంపశ్యా! నీ రాణివాస సౌఖ్యం బేమయ్యెను? అయ్యో! సాధ్వీమణీ! నీ పతి బ్రతికుండగనే నీవనాథవై యొక్కని దయకుం బాత్రురాలవు గావలసివచ్చె గదా! హా కుమారా! లోహితా! నిన్ను మరల నేనెన్నఁడు జూడఁ గలుగుదు? తండ్రీ! దాసదాసీ జనంబుల చేతులనుండి యడుగటు వెట్టనీక మిగుల గారాబమునఁ బెంచిన నిన్నిట్టి నిష్ఠురతమంబగు దాస్యంబున కొప్పగించితి కదా! అక్కటా! నాదుఃఖమంత కంతకు మితిమీరుచున్నది. కడచిన విపత్తు లొక్కటొక్కటిగఁ దలంపునకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుచున్నది. ఆహా! ఆనాఁడు భార్యాపుత్రులం గాలకౌశికునకు విక్రయించునప్పుడు "దాసీ! కదలవేమి!" అని యప్పాఱుడు తన తల్లి నడలించినాఁడని మా లోహితుఁడు "ఓరీ! మా యమ్మ నెక్కడకుగొని గొనిపోయెదవురా!" యని తనపై నదరినాఁడని యా కాలకౌశకుఁడు నిర్దయుడై,

మ. "కుడవం గూటికి లేకపోయినను నీకున్‌ రాజసంబెంత హె
చ్చెడురా! ఛీ! తలకెక్కెనే పొగరు దాసీ పుత్ర" యంచున్‌ సుతున్‌
పడద్రోయన్‌ గొడుకట్టె నా వదనమున్గన్నీళ్ళతో జూచె హా!
కడుపున్‌ ఱంపపుఁ గోఁతఁగోయునదియే గాయంబు గాకుండఁగన్‌.

అయ్యో! అట్టి దురవస్థనుండి సతీసుతులం దప్పింపలేక పోయితిగదా! నాకై గదా, రారాజు బిడ్డయగు నిల్లాలు దిక్కుమాలి పరులకొంపలఁ జాకిరికత్తెయై యల్లాడుట, ఛీ! ఛీ! కఠినాత్మా, హరిశ్చంద్రా! నీ జన్మము నిజముగా నిరర్థకమైనది. చూడు,

సీ. విడలేక నీ వెనువెంట వచ్చెదనన్న
          పౌరుల దుఃఖముల్బాసినావో
సరిరాచబిడ్డయౌ సతిని నిల్లాలిని
          బ్రియ మారంగా సుఖపెట్టినావో
గడుపారఁ గన్న యా గొడుకును ముద్దుగాఁ
          బెంచి ముచ్చటలఁ జెల్లించి నావొ
పుత్రవత్సలత నెప్పుడు నన్నుఁ బ్రేమించు
          కులగురు నాజ్ఞలో మెలఁగినావొ

గీ|| రవి మొదలుకొని నీదాఁక బ్రబలుచుండు
     స్వకుల గౌరవములను గాపాడినావొ
     చావకెందుకు ఛీ! హరిశ్చంద్ర! నీవు
     బ్రతికియున్నావు జీవచ్ఛవంబ వగుచు.

అయ్యో! ఎంతవైపరీత్యము జరిగెను. ఎప్పటికైన శుభములు రాకపోవునా యను ధైర్యము గూడ నంతరించినది. బ్రతికి యున్నంతవఱకు దేవికా దాస్యదుఃఖంబును, నాకీ కాటికాపరి యుద్యోగమును నవశ్యానుభోక్తవ్యంబులే కదా!

శా. నా దాసీత్వముఁ బాపి యెప్పటికినైనన్‌ జింత లీడేర్పడే
నా దేవుం డను నాసతో నసువులన్భారంబుగా మోసి నే
నే దిక్కౌదని నమ్మియుండు సతి నాహీనస్థితిన్‌ గానమిన్‌
ఈ దౌర్భాగ్యపు గాటికాపరితనం బేపాటితన్‌ బ్రోచెడిన్‌.

అకటకటా! మందభాగ్యుఁడనైన నా చిత్తమునకు శాంతి యెప్పటికో! అయ్యో! ఇంక శాంతి గాకేమున్నది?

శా. నానాటన్‌ బరిపాటి నా మది దురంతంబైన చింతాహతిన్‌
మానై రాయయి వజ్రమై స్వగుణ ధర్మంబైన చైతన్య లీ
లా నైజంబుఁ ద్యజించి నిర్వీకృతి మేళ్ళన్‌ గీళ్ళ నొక్కుమ్మడిన్‌
బూనున్‌ యోగి మనంబురీతి యపుడే పో శాంతి నా చింతకున్‌.

కావున నింక దుఃఖించిన మాత్ర మేమి ప్రయోజనము? సత్యస్థైర్యుఁడనైనఁ నే నింక ధైర్యమునే వహింపవలయును. అయ్యో! ఏమిది? దుఃఖ ప్రాబల్యమునఁ గర్తవ్యంబు మఱచితిని. (శ్రుతి నభినయించి) ఎక్కడనుండియో యీ దీనారావంబు శ్రవణ గోచరంబగుచున్నది, పోయి చూచెదఁగాక!

(పిమ్మట నొక మూలనుండి చంద్రమతి ప్రవేశించుచున్నది)

చంద్ర - అయ్యో! ఈ యర్థరాత్రమున నా కుమారుని జాడ నెవ్వరి నడుగుదును? దిక్కులేని నాకుఁ బ్రకృతియే తోడు గావలయును.

సీ. జలదమా! సుంత మార్బలికిన దోసమా
          యెఱుగవా నీవు లోహితునిజాడ
పరుగెత్తకుము చక్రవాకీ! యేకడనైన
          గనుఁగొంటివమ్మ నా కన్నవానిఁ

గాసంత మెఱపించి మోసగించెదవేల
          తోడురావమ్మ విద్యుల్లతాంగి
జలదపుఁ దెరఁబాసి వెలికి రండొక్కింత
          తారలారా! నా కుమారుఁ జూప

   కానవా వాని గంగాభవాని? సుంత
          గోల చాలించి వినుము నా గోడు కొంత
          వేగ గాన్పింపుమయ్య యో విశ్వనాథ!
          నీ కుమారునిఁ బోలిన నా కుమారు.

అయ్యో! గతిచాలనివేళ నా మాట నెవ్వరు పాటింతురు? హా! సుతా, లోహితా! నీవెక్కడ నున్నావు, తండ్రీ! మునికుల పవిత్రా, గాధిపుత్రా! మమ్మెంతయైన సాధింపుము. ఒక్కమాఱు నా కుమారుని జూచుకొన నిమ్ము. (నడచుచు) ఏమిటి? కాలికి నేదియో మెత్తని వస్తువు తగిలినది. నా కుమారుని శరీరము కాదుకదా? (పరికించి) హా! లోహితాస్యా! నీ కెంతటి యవస్థ సంభవించెనురా? కొడుకా! పలుకవేమి? అయ్యో! ఇంతటి కంటకములచేత నిదివఱకె నొత్తుకొనుచున్న నీ మృదుశరీరము కఠినం బగు నా పాదతాడనంబు చేత నింకెంత బాధపడుచుండెనో తనయా! పుట్టిన దాది, యే కష్టము లెఱుంగని నిన్ను గురుండ డవికి బంపుచుండగా నూఱకుంటినని నాపై నలిగితివా? లేకున్న నా తోడ నీ వేల మాట్లాడవు? నాయనా! శరత్కాల పూర్ణిమా రాకా నిశాకర బింబంబు విడంబించు నీ ముద్దు మోము చిఱునవ్వు వెన్నెలచే నలరారుచుండఁ గనులార జూడకున్నను నమృత రసంబునకే లభింపరాని మాధుర్యంబుఁ జిలుక నీ ముద్దు పలుకులు చెవులార వినకున్న బ్రతుకున కింకేమి యున్నది తండ్రీ? నేనింకెవ్వరినిఁ జూచి పుడమిపై జీవించి యుందును, నాకింకెవరు దిక్కు? రాజ్యసుఖాద్యుత్తమ భోగంబులను బాసి చేసికొని పతికి దూరస్థురాలనై యొక్కయింట నూడిగంపుగత్తెనై కాలము గడుపు నీచస్థితికి వచ్చినను గడుపునఁ బుట్టిన కుమారుఁడవు, సకల లక్షణలక్షితాకారుండవు, వంశైక విస్తారుఁడవు, నీ వొక్కఁడవు గట్టిగా నున్నాఁడ వంతియే చాలునని ప్రాణములన్నియు నీ మీఁదనే నెలకొల్పి బ్రతుకు చున్న నన్నిప్పుడే సముద్రమునఁ ద్రోసి బోయెదవు. తండ్రీ! దాసదాసీ జనము లూఁపు బంగారు తూగు టుయ్యెలలపై సుఖ నిద్రంజెందు సౌఖ్యమప్పుడే యంతరించినను నీకు నా కాలకౌశికుని యింటఁ బండుకొనుటకు నాపైట కొంగైన నింత యాధారము దొరకుచుండునే! నేడేదియు లేక దట్టముగా యుండుటచే నిండియుండిన యీ నట్టడవిలో నీ యర్ధరాత్రమున నిట్లొంటి నిద్రించుచుంటి వేమోయీ? కొడుకా! లోహితా! నీకు నేటికి గులకఱాల నేలయే పూలపాన్పయ్యెనా? అయ్యో! క్రూరసర్పమా! నే నిన్నేమందును? నిష్కారణముగ నా కుమారునిఁ జంపితివి. ఛీ! సర్పాధమా?

మ. పని యేమున్నది నిన్ననన్‌ నడకలాఁ వక్రంబు లే ప్రొద్దు నీ
వనిలో ఘోరవిషంబు గ్రక్కుట జగత్ప్రాణాశనోద్వృత్తి పె
ట్టిన పేరే యదిగాక నాలుకలు రెంటిం దాల్చినా విట్టి నీ
కనుకంపా గుణముండునన్న నెటు సాధ్యంబౌను దర్వీకరా!

అయ్యో! శోకాతిరేకముచే నీ పామును దూషించు చున్నానేమి? ఇప్పటికి రాత్రిలో మూడవ జాము జరుగుచున్నట్లున్నది. తెల్లవారక మునుపే గంటికిఁ గనఁ బడకున్న దొరసాని యూరకుండదు. కొడుఁకా! ఇంక నీ నవమన్మథాకారమును జూత మనుకొన్నను సంభవింపదే యని యిప్పుడే తనివి తీర జూచుకొనుచు నీ శవము కడఁ దడవు నిల్చుటకైనను నిప్పుడు స్వతంత్రురాలను గాకుంటినే? నాయనా! రమ్ము, లోకాచారముల ననుసరించి నిన్ను జేతులారఁ గాటికప్పగించి చేతులు గడుగుకొని యెద. (ఎత్తుకొని) అయ్యో! ఇప్పుడు స్మశాన వాటికకు నేదారియని పోయెదను? పుత్రశోకంబున నావరింపబడిన హృదయము వలెనే బ్రహ్మాండ మంతయు నంధకార బంధురంబై యున్నది. లోహితాస్యుండను నా బాల సూర్యుడస్తమించిన వెనుక లోకమున నంధకారము గాక యింకేమున్నది. (నడచుచు) ఆ వంక నేదియో వెలుతురు గాన వచ్చుచున్నది. నరసంచారము లేని యీ కాంతారమున నే మానిసి యలికిడి లేకపోయినను, దిక్కులన్నియు వ్రక్కలగునట్లు పిక్కటిల్లుచున్న గంగానదీ ఘోషం బులును నీ నట్టడవి యందలి ఝల్లీ నినదంబులును నా గుండెలు బ్రద్దలగునట్లు చేయుచున్నవి. (నడచుచు) ఆ వెలుతురున్నచోటె స్మశానవాటిక కాబోలు! ఆ ప్రక్కనే నడచెదను. అహో! ఇదే స్మశానవాటిక. అయ్యో! సాహసంబు చేసి ఇచ్చటికి వచ్చితిని. ప్రాణంబులకు రోసిన నాకు సాహసంబు గాక ఇంకేమున్నది? కులవర్ధనుఁడగు నీలాటి కొడుకిట్లు కాటిపాలైపోయిన వెనుక నేనింకను బ్రతికియేమి ప్రయోజనము తనయా! నీ విచ్చటఁ బండుకొనుము. నీ దహన కార్యమునకై నిన్ని చితుకులైనఁ బోగుచేసెదను. (అట్లు చేయుచు) ఆహా! ప్రాణపతీ! ఇట్టి కష్టకాలమునఁ గూడ నీవు దగ్గఱలేకుంటివే.

(ప్రవేశము - హరిశ్చంద్రుడు)

గీ. హృదయమున దుఃఖ మింతేనిఁ బదిలపడదు
మఱతునన్న సతీసుతుల్మఱపురారు

కంటి కిదియేమొ పలుమాఱు కానిపించు
నెక్కడో యున్న నాదు లోహితుఁడు నేఁడు

చంద్ర - హా! సుతా! నన్ను వదిలిపోతివా?

హరి - అహో! ఎక్కడిది యీ దీనారవము. ఇది పరికింపఁగా సతీ కంఠ స్వరంబుగా నున్నది, కాని పురుషునిది కాదు. పాపమా మందభాగ్యురాలెవరో పోయి చూచుట మేలు. (నడచుచున్నాఁడు)

చంద్ర - హా! కుమారా నాకు నేటితో సర్వాశా పూర్తి యయ్యెనుగా తండ్రీ! నీ దహన కార్యమునకుఁ దుదకుఁ గట్టెలకుగూడ గతిమాలి నీ తల్లి యల్లాడవలసివచ్చెనే. (శవము నెత్తికొని) హా, పుత్రా! నీకు నేనెంత ఘోరముఁ జేయ సాహసించితిని.

మ. చనుఁ బాలిచ్చినతోడనే నిదుర బుచ్చన్‌ బొత్తులందుంచి య
ల్లన జోకొట్టుచు నొక్కకేలఁ బెఱకేఁలన్‌ డోలికం బట్టి యూఁ
చిన నీతల్లియె యిప్పుడీ చితిపయిన్‌ జేసేత నిన్‌ జేర్చి హా!
యని దుఃఖించెడు దిక్కుమాలిఁ కొడుకా యన్యాయమింకేమనన్‌

నాయనా! రాజాధిరాజ కుమారుడవైన నీకుఁ గాలవశమునఁ గష్టములు వచ్చినను జనిపోయిన వెనుకనైనను నీ దహన విధి యథావిధి జరుగక యీ వల్లకాటి యందెవ్వనిదో యొకని చితిలో సగము కాలిన యల్పకాష్టముల నీకాధరములయ్యె గదా! నవమాసము మోసి, కని, ముద్దుముచ్చటలం బెంచిన నీ కన్నతల్లియా నీకుఁ గడకు దల కొఱవి నిడుట. ఛీ! ఛీ! చంద్రమతీ! నీ వెంత రాకాసివి! ఈ దుఃఖమున నీపతికి దావీయక నీ వొక్కతె నిట్లనుభవించుటకు నీ జన్మంబెంత దౌర్భాగ్యపు జన్మము. (కొఱవి చితి నంటించుచున్నది)

హరి - (సమీపించి, స్వగతము) ఓహో! నాయాజ్ఞలేకుండగనే నిక్కడఁ జితిఁ గూడఁ బేర్చినదే. (ప్రకాశముగా) ఓహో! ఎవ్వతె వీవు?

స్రగ్ధర:

పడతీఁ యేకాకివై నిర్భయమున నిటకున్‌ వచ్చి నా యాజ్ఞ లేకీ
నడిరేయిన్‌ వల్లకాట న్శవ దహన విధి న్సల్పుచున్నావుగా! ఛీ
చెడుగా చాల్లాలు పోపో చెడెదవు తగునే చేడె కీకృత్యముల్‌ నా
కడనా నీ మ్రుచ్చు వేసాల్కదలు కదలుమా కాడు నీ యబ్బ సొమ్మా!

(అని చితిం గూల దన్ను చున్నాడు) చంద్ర - అయ్యా! ఇప్పుడు గూడ నెంత పరాభవము జరుగుచున్నది. హా ప్రాణపతీ! ఇట్టి యవస్థయందు నీవు సహాయపడుటకు నా యండ నుండ వైతివే!

హరి - (స్వగతము) ఏమి? పతివిదూరయా? ఎవతెయో కాని,

గీ. ఈ నెలంత సుశీలగాఁ గానిపించుఁ గారణాంతరమున నిట్టి కష్టదశను జెందినట్లున్న దదికాక ముందు నేను విన్నదియుఁ గానే యున్నది వెలది స్వరము.

అయినను విచారించిన దప్పేమి? (ప్రకాశముగా)

మ. పడతీ యెవ్వతెవీవు? ఱాలుగరగన్‌ వాపోవుచున్నావు నీ కొడు కెద్దాన గతించె? నెవ్వరున్‌ నీకుం జుట్టముల్‌ లేరే యీ నడిరే యొంటిగ నెట్లు వచ్చితి శ్మశాన క్షోణికిన్‌? జిత్ర మ య్యెడు నీరీతి వచింపు మేడ్చి ఫలమేమీ! యూఱటం బొందుమీ.

చంద్ర - (స్వగతము)

గీ. అరయ నితఁడొక మహనీయుఁ డట్లు తోఁచు నీతని వచోవిధం బెన్న నేమొ కాని పరిపరివిధంబులను బాఱు హృదయవృత్తి యింత దుఃఖంబునన్‌ గొంత శాంతి వొడము.

ఏమైనను నిప్పుడు మౌనము వహించిన గార్యము నెఱవేఱదు కాన నిట్లు మాట్లాడెదను.

చ. పురుషవరేణ్య! నీ వెవఁడవో యెఱుఁగన్‌ మసనంబు లోపలన్‌ దిరిగెడు భూతనాధుడవొ దీనదశాకలనన్‌ గృశించు నన్‌ గరుణ ననుగ్రహించుటకుఁ గా నరుదెంచిన సిద్ధమూర్తివో పరమదయాబ్ధి నే నవని పైఁ గొఱగాని యభాగ్య దేవతన్‌.

హరి - మానినీ! నే సిద్ధుండ గాను, భూతేశుండఁ గాను. ఈ వల్లకాటికిం గావలి గాయువాఁడను. కాని సాహసము చేసి యీ యర్ధరాత్రమునఁ దోడులేక యిక్కాటికెట్లు వచ్చితివి? నీ చరిత్రయేమో యెఱింగింపుము. వచ్చిన కష్టము లనుభవింపక తీఱదు కదా!

చంద్ర - మ. అనఘా! ఎంతని విన్నవింపగలనయ్యా! రోళ్ళరోకళ్లదా

బాడిన నాదీన చరిత్ర మెల్ల నొకపాడిన్‌ జేసి యీ దేహమొ

క్కని సొత్తౌటఁ దలంచి ప్రాణముల బిగ్గంబట్టుటేకాక యే
మని జీవింతును దిక్కుమాలి కడుహేయంబైన దాస్యంబునన్‌?

పూజ్యుడా! ఈ దీనురాలికి నిప్పుడెవ్వరు తోడురాఁ గలరు? చూడు,

సీ. కొడుకా! యటంచు నా పడు నవస్థకు జాలి
          గొని యేడ్చు నలదిశాంగనలె తోడు
తన జంటంబాసి మింటను గూవు కూవు మంచు
          శోకించు నల చక్రవాకి తోడు
ననుఁ నూరడింప హోరని యేడ్చు లోక పా
          వనియగు గంగా భవాని తోడు
నను జూచిఁ బొటబొట మని మంచు కన్నీరు
          లం గార్చు తీవెయిల్లాండ్రు తోడు

   ఆపదలకై వారి నా యన్న వారి
        దిక్కులేనట్టి నా వంటి దీనసతికిం
        కాశీ విశ్వనాథుడే కలడు తోడు
        కడమ తోడేడ నాకు నో కాటిఱేఁడ!

మహానుభావుఁడా! నీవు నాకు గడు బూజ్యుడవుగా దోచుచున్నాడవు. నేనీ కాశీ పురంబున నొక బ్రాహ్మణుని యిం ట దాసిని. నా పే రంసనారి యందురు. ఈ చనిపోయినవాడు మదేక పుత్రుఁడు, వీనిని నేఁటి సాయంసమయమున

చ. అడవికి బోయిఁ గట్టెలఁ గుశాదుల దెమ్మను ఱేని యాన ని
య్యడ కరుదేర నాదు దురదృష్టముచే బెనుబాముచేత నీ
కొడుకున కీ నవాంగనజునకున్‌ మరణమ్ము ఘటిల్లెనయ్య నా
పడు దురవస్థ యేమనుచుఁ బల్కుదు? దుఃఖము పొంగి పొర్లెడున్‌

హరి - (స్వగతము) ఏమిది? ఈ మానినిం జూచినప్పటి నుండియు నా హృదయ మకారణముగా దుఃఖ సంకులం బగుటయే కాక విశేషించి

ఉ. ఈయలివేణి నోట వచియించెడు నొక్కొక్కమాట యొక్క వ
జ్రాయుధమై పెకల్చెడు శిలాకృతియ గాంచిన నాదు మానసం

బీయమ మాటపొందికయు నెల్గుఁదెఱంగు యుదంతమెల్ల ని
స్సీ యనరాదుగాని స్పృహియించును జంద్రమతీ సతీ మణిన్‌

అవిగాక యిక్కాంత కష్టోదంతంబెల్ల మందభాగ్యుండనైన నాకే తగిలి వచ్చుచున్నది. చనిపోయిన యీ కుఱ్ఱడు మా లోహితుడు కాదు గదా? ఛీ! ఛీ! నా పాడు తలంపున కెట్టి దురూహ పొడమినది? కొడుకా! లోహితా నీకమంగళము ప్రతిహతమగుగాక. ఇంక నా వెడగుదలంపుల మానివేసి నా విధియందు నే నప్రమత్తుడై మెలంగెద. (ప్రకాశముగా) ఓ మానినీ! నీవెవ్వతవైన మాకేమి గాని, నా యాజ్ఞ లేకుండ నిక్కాటి కీశవమేల కొనివచ్చితివి? ముందు చెప్పుము.

చంద్ర - పూజ్యుడా! శవదహనమునకు గూడ నొకరి యాజ్ఞ కావలయునా?

హరి - ఏమీ! బొత్తిగా నిచ్చటి కాటిచట్టముల గుర్తెఱుంగకున్నావే! ఎవ్వరు గాని దహింపవలసిన శవమును దెచ్చి ముందు మాకు జూపి, చెల్లింప వలసిన సుంకమును చెల్లించిగాని దహనకార్యం బుపక్రమింపరు. నీవు బలు తెగువ దానివిలా గున్నావు కాని

 
చ. పదపద యిప్పటికైనఁ దెఱవా! తడవయ్యెను మాకు నేల ని
ల్చెదవిఁక? నీ కుమారుని కళేబర మావల బాఱవైచునం
త దనుకఁ బోవె? శూలినయినన్‌ దలగోయక యూరకుందునా
ముదితవుగాననే బ్రతికిపోయితి వింక దొలంగు మిచ్చటన్‌.

చంద్ర - ఓ దయామయా! ఎఱుగక చేసిన నా నేరమును మన్నింపుము. నేనిప్పుడు శరీర మాత్ర విభవనై యున్నాను. విప్రు నింట నూడిగము చేసి కొనినగాని, గ్రాసవాసంబులు జరుగని నిరుపేదరాలను, నేనే మూలమునఁ గాటి సుంకమునుఁ జెల్లింపగలను?

హరి - (స్వగతము) అకటా! నేనెంత కాఠిన్యము వహింపవలసి వచ్చెను. (ప్రకాశముగా) మానినీ! నీవు పేదరాలవైన మాకేమి? భాగ్యవంతురాలవైన మాకేమి? భాగ్యమున్నను రావలసిన సుంకము కంటె నెక్కుడు మేమపేక్షింపము. మాడయొకటి, పిండంబు, దండులంబులును, నొక పాతయు మా కిచ్చినంగాని నేనీ శవమును దహింపనీయను. నన్నుఁ గఠినాత్ముండని యెంచినను సరే, కులధర్మంబు నీటింబుచ్చి యీ రీతిం గాటి కాపరితనముచే జీవించు నీ చండాల దాసునకుం గరుణ యెక్కడిది? పొమ్ము.

చంద్ర - అయ్యో! ఎవ్వరైననేమి? దీనరక్షణము తప్పుగాదు కదా!

హరి - తప్పో యొప్పో మాకడఁ జెప్పకుము. పొమ్ము శవమును బాఱ వైచెదఁ చూడుము. (అని పాఱవైవఁ బోవును) చంద్ర - అకటకటా! ఎంతటి కాని కాలము సంభవించినది. విశ్వవిశ్వంభరా చక్రంబున కెల్ల నేకచ్ఛత్రాధిపత్యము వహించి యశ్రాంతంబు పాదాక్రాంతులైన సామంత భూకాంతులకోటీర మణిఘృణీరావంబులచే విరాజిల్లు పాదయుగళముల చక్రవర్తికిఁ గుమారుడై కడకీ కాటిలోఁ జేరెడు నేలకేని స్వతంత్రుఁడగుటకు నోఁచుకొనక పోయెనుగా! కొడుకా! నీ ప్రారబ్ధంబున కెంతని విలపింతు?

హరి - (స్వగతము) ఈ బాలుండెవ్వడో మహారాజు కుమారుండని విస్పష్టమైనది. నేనింక నేమని తలంపను? వీడు నిశ్చయముగా మా లోహితాస్యుడేమో? నిస్సంశయుగాఁ బేరు తెలియకయే నే నేల కీడునే యూహింప వలయును? తండ్రీ! లోహితాస్యా! నీకు దీర్ఘాయురారోగ్యములు గలుగుగాక! వీఁడెవ్వ డైన నేమి? నా విధి యందు నేనొక విధముగాఁ బ్రవర్తింప రాదుగదా! (ప్రకాశముగా) ఓ కాంతా! నీవెంత యేడ్చినను నేను గరుణింప జాలను. నీ యుదంతం బంతయుఁ గడు నద్భుతముగ నున్నది. చనిపోయిన వీఁడు రాజకుమారుఁడైనట్లు నీ యేడుపు వలనఁ దెలియవచ్చినది. నిజముగా నీవు రాచదేవేరివేయైనచో మా కీయవలసిన కాటిసుంకము నీకడ లేకుండునా!

చంద్ర - అయ్యో! కాలవైపరీత్యమున నుత్తమ పదవిం బాసి యిప్పుడే నేను శరీర మాత్రవిభవనై యున్నానని యిదివఱకే విన్నవించుకొంటినే, నీ కేల దయరాదు?

హరి - నేనిది బొత్తిగా నమ్మను. నీ కిప్పుడున్న విభవము శరీరమాత్రమే కాదు. ఆలోచించుకొనుము. చంద్ర: అయ్యో! ఇంకేమున్నది?

హరి - ఏమీ! ఇంకేమీ లేదా? చూడు,

 
మ. దళమౌ పయ్యెదలో నడంగియు సముద్యత్కాంతు లీరెండలన్‌
మలియింపన్‌ దిశలన్‌ ద్వదీయ గళసీమన్‌ బాలసూర్యప్రభా
కలితంబై వెలుగొందుచున్నదది మాంగల్యంబు కాఁబోలు! నే
వెలకైనం దెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్‌ జెల్లదే?

చంద్ర - (ఉలికిపడి) అయ్యో! దైవమా! రెండవ సురజ్యేష్ఠుండగు వసిష్ఠ మహర్షి ప్రభావంబుచే నా పతికి దక్క నన్యులకు గోచరంబు కాని నా మంగళసూత్రం బొక్క చండాలుని కంటఁ బడెనా! కాదు కా దీతఁడు నా పతి హరిశ్చంద్రుడే. (అని కౌగిలించుకొని) హా! జీవితేశ్వరా! హా! విశ్వంభరాఖండ రాజ్య ప్రదాన సందర్పిత కౌశికా! హా! వసిష్ఠ ప్రియశిష్యా! హా! సార్వభౌమలలామా! హా! సత్యప్రియా! హా! హరిశ్చంద్రా! నేనే మంద భాగ్యురాలనగు నీ జీవితేశ్వరిని, చంద్రమతిని. ఎల్లప్పుడల్లారు ముద్దుగా బెంచిన నీ వంశాంకురంబగు నీ కుమారుడు లోహితాస్యుఁడీ కాటిలో గులకరాలపై నెట్లు పండుకొని యున్నాడో యొక్కమాఱు కన్నెత్తి చూడుము. ప్రాణపతీ! రాజరాజకోటీరమణి మంజరిమంజరిత పాదాంభోజుఁడగు నీకా యీ కాటికాపరితన ము? అకటకటా! దురవలోక్యంబగు నీ ప్రేతాలయంచే నీ కయోధ్యాపురం బయ్యెనే? కఱకుఁ గలిగిన నులకత్రాళ్ళచే నల్లబడిన యీ మంచెయే నీకు నవరత్న సింహాసనం బయ్యెనా? భయంకరంబులగు నీ భూతభేతాళ పిశాచ గణంబులా నీకు భట సముదాయము? శవనికరంబుల దహించుచుండిన సొదగుంపా నీకు చరదీపికా సహస్రములు? నాథా! నీ రాజసం బెందుఁ బోయినది? నీ తేజంబెందు దాగినది? జీవితేశ్వరా! అశ్రాంతంబు పాదాక్రాంతులై నమస్కరించు సామంతులెల్ల నీ కిప్పుడేల యడుగులకు మడుగు లొత్త కుండిరి! కరపల్లవంబుల బంగారు పళ్ళెరంబుల బట్టి పురంధ్రీ జనంబు నీకేల నీరాజనంబుల నెత్తకుండె! నీ సత్యసంభాషామనీషం గుఱించి ప్రబంధముల నుడువు వందిమాగధ జనంబెందు బోయె! రాజచూడామణీ!

సీ. పసిఁడిమేడలలోన వసియించు ప్రభునకా
           కటకటా! యీ వల్లకాటి వసతి
కనుసన్న దొరలచేఁ బనులందికొను మీక
          యీ నికృష్టపు మాలవాని సేవ!
అలరుఁ దేనియలతో నారగించెడు మీకా
          యకట! శవాల పిండాశనంబు
జిలుగు బంగారు దుస్తుల ధరించెడు మీక
          పొలుసు కంపొలయు నీ బొంతకోక!

   కనుల మీ యిట్టి దుస్థితిం గనిన నాకుఁ
         జావురాకున్న దెంతని సంతసింతు!
         హా హరిశ్చంద్ర! సార విద్యాఫణీంద్ర
         బుధజన మనశ్చకోర సంపూర్ణచంద్ర!

ప్రాణేశ్వరా! మన విపత్పరంపరకే నాఁటి కంతము లేక పోయెనే? నన్ను విక్రయించుటచే విశ్వామిత్రుని ఋణబాధ నిరవశేషముగాఁ దొలంగి యెక్కడనో మీరు కొంత సుఖముగా నున్నారని దలంచితిఁ గాని నాకు సంభవించిన దాస్యమున కంటె వేయిమడుంగు లెక్కుడు నీచంబగు నీచండాల సేవావృత్తియందుఁ జిక్కియున్న మీ కడకుఁ జనిపోయిన లోహితాస్యుని కళేబరముతో నిటుల వచ్చెదనని యొక్క నాఁడు దలంపనైతినే? నృపసార్వభౌమా! ధైర్యము వహించి యొక్క మాటైన నాడుము.

హరి - ఏమీ! నీవు చంద్రమతివా? అయ్యో! వీఁడు నా కొడుకు లోహితాస్యుఁడా! (కుమారునెత్తుకొని)

శా. హా! సూర్యాన్వయవార్థి కౌస్తుభమణీ! హా! సద్గుణాంభోనిథీ!
హా! సౌందర్యనిరస్త మన్మథశతా! హా! పూర్ణచంద్రాననా!
హా! సల్లక్షణ లక్షితాంగ లలితా! హా! మత్తభృంగాలకా!
హా! సేవాపరతోషిత ద్విజమణీ! హా! లోహితా! హా! సుతా!

తండ్రీ! పలుకవేమి? నిన్ను దుస్సహంబగు సేవకావృత్తి కప్పగించిన కిరాతుండైన నిన్ను గన్న తండ్రిని నన్నొక్కమాఱు ఱెప్పలెత్తి చూడుము, నాయనా! నీవప్పుడే స్వర్గయాత్రం బట్టుటకు నీకేమి నూఱేండ్లు నిండినవా, కొడుకా! లోహితా?

సీ. మోయలేదింకను మూఁపు కాయలుగాయ
          సర్వ సర్వంసహా చక్రతలము
ప్రాయలేదింక గర్వాయత్తుల జయించి
          యఖిలదిక్కుల విజయాక్షరముల
నిలుపలే దింక సత్కులకాంతను వరించి
          సింహాసనమున నీ చిన్ని సుతుని
సలుపలే దింక నిర్జరకోటి మెచ్చఁగా
          నశ్వమేధాది యజ్ఞాదికములఁ

   గన్న తల్లిదండ్రులగు మాకు నిన్ని నీళ్ళు
        విడువవలసిన పనిగూడ నడుపలేదె
        యిన్ని పనులున్నవే నీకు మన్నెఱేఁడ!
        యెందుకీ జాడ? లేచిరా యందగాడ!

చంద్ర - జీవితేశ్వరా! ఇకనెక్కడి కొడుకు! మీరు ప్రాకృతునివలె శోకాంధకారంబున మునుంగఁ దగదు. ముందు జరుపఁ దగిన కుమారుని దహనవిధి కుపాయమేదైన నున్నచో బరిశీలింపుడు. బ్రొద్దుబొడువకమున్న పోయి కంటి కగపడకున్న మా దొరసాని కాలకంటకి యాజ్ఞనుల్లంఘించిన దాననగుదును.

హరి - దేవీ! నిర్భాగ్యుఁడనై చండాలదాస్యంబునఁ బొట్టపోసికొను నేను నీకే యుపాయమున సహాయము చేయఁగలను? చెప్పుము?

ఉ. అందఱి కెట్టివో స్వవిషయంబున నట్టివె కాటి చట్టముల్‌
నందనుఁడంచు వీనిఁ గరుణం గని యేలినవాని యాన మీ

 
ఱందగునా? సతీ కనికరమ్మున కింత యెడమ్ము లేదు మా
డం దొర కీక యిప్పు డిచటన్‌ జితిఁ బేర్చుట కేను గర్తనే?

కావున నెట్లయిన మీ దొరసాని నడిగి మా స్వామికీయవలసిన మాడయుం బాతయు సంపాదించుకొనిరమ్ము. ఇప్పుడు నా చేతనైన సహాయము నాకిందురావలసిన పిండాశనము మానుకొనుట దక్క వేఱొండులేదు.

చంద్ర - హా! విధీ! యెంతవాని కెంతటి దురవస్థం దెచ్చి పెట్టితిని? నాథాఁ! యిట్టి యిక్కట్టులందును మీరు ధర్మపథంబు దొలగనందులకు నాకు సంతసమే కలుగుచున్నది. నేను మాదొరసాని కడ కేగి మాడయుఁ బాఁతయు నడిగెదను. ఆవిడకా కాసంత దయగూడఁ గలుగకున్న విధి యెట్లు విధించెనో యట్లగుఁ గాక!

హరి - శీఘ్రముగఁ బొమ్ము. అంతదనుక. గుఱ్ఱవాని కళేబరము నేఁ జూచు చుండెద.

(చంద్రమతి నిష్క్రమించును)

హరి - (కుమారుని ముందుంచుకొని) హా! హా! ఎంతఘోరము సంభవించినది? కొడుకా, లోహితా!

 
మ. చతురంబోధి పరీత భూతధరిణీ సామ్రాజ్యసర్వస్వ సం
తత ధౌరేయుండవయ్యు నీ వొకని యింటం గూటికై బంటవై
యతి నైచ్యంబు వహించి దిక్కు సెడి యిట్లైనాడ వేమందు నీ
బ్రతుకీ నాటికి తెల్లవారె గద పుత్రా యిన్ని బన్నాలతోన్‌.

తండ్రీ! నీ ప్రాణమునకా కాలసర్పమెక్కడ దాపురించెను? నిన్నుఁ గన్న తల్లిదండ్రులెన్నో దుఃఖంబు లనుభవింప రాళ్ళవలె బ్రతికియుండ నీవు దిక్కులేక యేకాకివై తుదకిట్లు దుర్మరణంబు పాలైతివే?

 
శా. నిన్నా పన్నగ ముగ్రతం గఱవ దండ్రిం దల్లిన్‌ జీరియే
మన్నావో యపుడెంత బాధపడితో హా! పుత్రకా! నాకునై
యెన్నో బన్నములందినావు తుదకిట్లేకాకివై పోవ నేఁ
గన్నారం గననైతి నీ యెడఁ గృతఘృత్వంబు పాటించితిన్‌.

ఇంక దుఃఖించి యేమి ప్రయోజనము. నీవు దీర్ఘాయుష్మతుఁడ వగుదువని నుడివిన కాలజ్ఞుల పల్కులే నిక్కంబు లగునేని నీకిన్ని కష్టములు రాకుండు. కాటిపన్నునకై పోయిన దేవి యింకను రాకున్నదేమి? దెల్లవాఱినదే? ఏమా కలకలము?

(తెఱలోఁ గలకలము) ఓహో పురజనులారా! మన రాజుగారి యింట దొంగతనముచేసి ధనాశచే రాచబిడ్డం జంపిన యీ శిశుహంత్రిని దలఁగోయ వలసినదిగా రాజాజ్ఞయైనది కనుక దీనిని వధ్యశిల యొద్దకు దీసిగొని పోవుచున్నాము. హరి - (ఆకర్ణించి) రాజభటులిక్కడికే వచ్చుచున్నారే!

భటు - (ప్రవేశించి) ఓయీ, వీరదాస! రాజు నాన మేరకీ బాల హంత్రిని దలనఱక మీ వీరబాహు నీ కుత్తర మిచ్చినాడు. ఇదిగో నాతని యానవాలు. దీని నింక దల నఱకుము.

హరి - (స్వగతము) ఏమిది? నా కన్నుల కేమైన భ్రమ కల్గెనా? నిక్కువముగానే చంద్రమతిని జూచు చున్నానా? ఈ శిశుహంత్రి చంద్రమతియా? (ప్రకాశముగా) అయ్యలారా! మీరు నేరస్థాపనయందుఁ బొరపాటు పడలేదు గద? తిన్నగ నాలోచింపుడు.

భటు - ఏమోయీ! మహారాజుగారి యాజ్ఞకే యెదురు చెప్పుచున్నావు? నీకీ యధిక ప్రసంగ మెందులకు? వెంటనే రాజాజ్ఞ నిర్వర్తించుము. మేఁమిఁక బోవుచున్నాము.

(నిష్క్రమింతురు)

హరి - (చంద్రమతిని సమీపించి దుఃఖముతో)

శా. హా కాంతా! జగదేక పావనివి యీ యన్యాయపు న్నిందనీ
కా కల్పించుట? రాజు నిర్దయుడె యోగ్యాయోగ్యముల్సూడఁడే?
లోకంబంతయు నస్తమించెనె? దయా ళుండైన దేవుండు లేఁ
డే కాపాడఁగ? గర్మసాక్షి పయిలేడే సర్వముం జూడఁడే?

చంద్ర - నాథా! దుఃఖింపకుఁడు. దైవము లేకేమి? పూర్వజన్మ సంచిత పాపఫలంబున నిజమో యబద్ధమో కాశీపురాధీశ్వరునిచే శాశ్వతమైన యీలాటి నింద యారోపింపబడి స్వచ్ఛమైన నీ కులంబున కెల్ల నొక కళంకంబు దెచ్చిన పాపాత్మురాలనైతి.

హరి - ఏమీ! జగదేకపావని వగు నీ యందే యొక నీచుఁడు నిందారోపణ మొనరించెనా? ఎట్లు?

చంద్ర - నాథా! అవధరింపుము. అట్లు మీచే సెలవందికొని పోవుచుండగా వొక బాలశవము నా కాలికి దగిలెను. అంత మతి చలించిన దానినై యా కళేబరము మన లోహితునదేమో నని పరీక్షించుచుండ యమకింకరులంబోలిన రాజభటుల చ్చోటికి వచ్చి "ఓసి పాపాత్మురాలా! రాచబిడ్డనేల చంపితి" వని నగలమూట నొకదానిని నాయొడిం బడవైచి దొంగచిక్కెనని నన్ను దన్నుచు రాజసాన్నిధ్యంబునకుం గొంపోవ నతం డతికుపిత మనస్కుండై నా తల నఱుకుమని యాజ్ఞాపించె, ఇదియే నా నిందకుఁ గారణము.

హరి - అకటకటా! ధర్మమున నేఁటికెంతటి దుస్థితి సంభవించినది. తన చిత్తంబు మెప్పింపవలయునని సేవకు లెవ్వరి పైననో నేరమారోపించి తన యెదుట నిల్పినతోడనే న్యాయాన్యాయములు విచారింపకుండ నిరపరాధులఁ గూడ సాపరాధులఁ జేసి, శిక్షించుచుండిన యీలాటి రాజులుండిన నేమి? మండిన నేమి? దేవీ, చంద్రమతీ! నేఁటితో మన యాశాబంధము గూడ దీరిపోయినది. నేనింక నా స్వామి యాజ్ఞ నెఱవేర్పక తప్పదు గదా! ఇదిగో, ఖండితులైన యపరాధుల రక్త పంకముచే నెఱ్రనై యున్న యీ వధ్యశిల నీ వింక నారోహింపుము. కులకాంతను నిన్నొక్కనికి విక్రయించిన యీ కృతఘ్నునకు స్త్రీ హత్యా పాతకము గూడ రాఁదగ్గదే!

చంద్ర - (వధ్యశిల నారోహించి) నాథా! మీరింక నాకై చింతింపకుడు. మీ రెఱుగని ధర్మము లేదు గదా! నన్ను జంపుట వలన సంభవింపగల పాపము నిరపరాధుల శిక్షించు నీ కాశికాపురాధీశ్వరు జెందుగాని మిమ్మంట నేరదు. అదిగాక, రాచబిడ్డను జంపితినను నీచమైన నిందను మోసిన నేనింక బ్రతికి మాత్రమేమి ప్రయోజనము. ఎక్కడనో నీచపు జావు చావకుండగా జీవితేశ్వరులగు మీ చేతనే చావఁ గలిగినందులకు నేను బూజ్యురాలనే. మీరింక నిష్కళంకచిత్తమున మీ సత్యనిరూఢి వేల్పులెల్లం బ్రశంసింప నా తలద్రుంచి మీ స్వామి యాజ్ఞ నెఱ వేర్పుడు. ప్రాణపతీ! నా కడసారి వందనమందుకొనుడు.

హరి - హా! హా!దుర్భరము దేవీ! నీవెంత చెప్పినను నాకూఱట జనించుటెట్లు?

సీ. నీవేకదా నాకు నిఖిలేప్సితంబుల
          నవగతంబు లొనర్చు కల్పలతవు
నీవుగదా నాకు నిత్యసత్యయశంబు
          దరిచేర్చుచుండెడు ధైర్యలక్ష్మి
నీవెకదా ఘోర దావానలమునుండి
          మమ్ము రక్షించిన మానవతివి
నీవె గదా మౌని ఋణబాధఁ దొలఁగించి
          పరువు నిల్పిన యట్టి భవ్యమతివి

గీ. నీవెకా నానిధానంబ నీవెకావె
          నాకులవిభీషణంబవు నీవెకావె
        అమరునే నాకు వేయి జన్మములకైన
         నిన్ను వంటి సతీమణి నెలఁతమిన్న?

చంద్ర - నాథా! దుఃఖం బుపశమింపుడు.

హరి - ఇదిగో! నేను దుఃఖము విడిచిపెట్టినాఁడను.

గీ. మానినీమణి! గతమెల్ల మఱచిపొమ్ము
పదిలపఱుపు మేకాగ్రత హృదయవృత్తి

భక్తికడసారి నా భగవంతుని గూర్చిం
నేత్ర యుగ్మంబు మోడ్చి ధ్యానించుకొమ్ము

చంద్ర - పరమేశ్వరా! దీనబంధూ! దయాగుణసాగరా! విశ్వనాథా!

మ. ఇదియే నాకడసారి ప్రార్థనంబు తండ్రీ సర్వభూతేశ నే
నెద వే మోక్షపథంబుఁ గోరనిఁక నెన్నే జన్మముల్‌ నాకు నీ
వొదవుం జేయుదు వన్ని జన్మముల కెట్లో నిత్యసత్యవ్రతున్‌
సదసత్కార్యవిచారధీరుని హరిశ్చంద్రం బతిం జేయుమీ!

ప్రాణేశ్వరా! నే నీ జన్మమున నీ కొనరించు కడపటి నమస్కార మిదియే. ఇంక రాజాజ్ఞ నిర్వర్తింపుడు.

హరి - ఆహా! నా నాటకంబునకు నిర్వహణసంధి నా భార్య వధ విధానంబుతో ముగియుచున్నది గదా! అయ్యో! నేనెంత ఘోర పాతకుండను! పాలవంటి కులంబెల్ల నా కులంబొనరించి యొక్క చండాలుని దాస్యం బంగీకరించినది చాలక శరణాగతులగు వారిపైనను స్త్రీజనంబుపైనను గృపాణమెత్తక రక్షింతునను నా ప్రతిన గూడ భంగము గావింప, జేపట్టిన కులకాంతను నిరుపమాన పవిత్రతాలలామను చేతులార దలగోయ సాహసించుచున్నాను. అయ్యో! స్వామియగు వీరబాహుడు నన్నే యీ కార్యమునకేల నియమింపవలయును? తానే రాజాజ్ఞ నిర్వర్తించిన నాకింత సంతాపము లేకుండుగదా! దైవమా! ఇన్ని దుఃఖములతో నన్నింత కాలము బ్రతుకనిచ్చిన దిట్టి స్త్రీ హత్యాపాతక మొడిగట్టుటకా? కటకటా! భూదేవీ! స్త్రీ హత్యకు గూఁడ బాల్పడిన యీ చండాలుని ప్రాణంబుల బోకార్చి నీ భారము కొంత తగ్గించుకొనరాదా? భగవంతుడా, లోకబాంధవా! నీ వంశమెల్ల నిట్లపకీర్తి పాలుచేయుచున్న యీ నీచ హరిశ్చంద్రుని నీ సహస్రకిరణంబులచేత భస్మీభూతునిగాఁ జేయలేవా? మునిజన గరిష్ఠా, వశిష్ఠా! ఈ నీ శిష్యుని పాపకర్మంబుల గన్నార జూచుచుండియు బ్రళయకాల నిర్ఘాతసమమైన నీ శాపవాక్కును విడువకున్నావేమి? ఛీ! ఛీ! దక్షిణహస్తమా! నీవు దినక్రమమున సుకృతములన్నియు మంటగల్పించుకొని తుదకేమి కానున్నావు?

ఉ. కమ్మని యాలనేత మునుగన్‌ సవనాగ్నిని దృప్తిసేయు పు
ణ్యమ్ము సగమ్మణంగె మసనమ్మునఁ బీనుగు లంటుటన్‌ వివా
హమ్మున నేసతిన్‌ విడూవనంచు స్పృశించితో తచ్ఛిరమ్ము నా
కొమ్మను జంప నా సగము గూడ నశింపదే పాప హస్తమా!

ఖడ్గమా! నీ వెంత యపకృతికి బాల్పడుచుంటివి?

 
చ. విడిచితి రాజ్యమైన సరవిం గులకాంతనునైనం గన్న యీ
కొడుకును నైన! నిన్ను ననుజుంగతి జూచితి గాని ఖడ్గమా!
కడ కిటు వల్లకాటి కధికారము వచ్చిన యప్పుడైన నిన్‌
విడువనె యీ కృతజ్ఞతయు వీడి వధింతువె నా సతీమణిన్‌.

ఛీ! ఏమి నా మతి చాంచల్యము? పవిత్రమైన సత్యవ్రత రక్షణార్థము నే నిప్పుడెంత సాహసమైన నాచరింపవలసినదే కావున,

 
సీ. హృదయమా! సతికి నా ఋణమెల్ల సరిపోయె
          నీ కేటియాశ యీ నెలత పైన
మోహమా! నీ కాలము గతించె మా చెంత
          బ్రతుకు మెందేని దంపతుల పొంత
దుఃఖమా! నీ వున్న దొసగు తప్పదు మాకు
          దొలఁగ పొమ్మింక నా తలపు వీడి
ఖడ్గమా! మానినీ కంఠరక్తము గూఁడ
          జవి చూడఁ గలవు నిశ్చలతఁ గొనుము

గీ. సత్యమునకయి యీ హరిశ్చంద్రు వంశ
మంతరించెడు గాక శ్రీ హరుని మీఁద
మనసు గుఱిచేసి, హా! చంద్రమతీ! త్వదీయ
కంఠ మర్పింపు నీ పతి ఖడ్గమునకు.

(అని కత్తి నెత్తగా హఠాత్తుగా విశ్వామిత్రుడు ప్రవేశించి నివారించి)

భళి! భళిరే హరిశ్చంద్రా! చాలుచాలు! నీ సాహసకృత్యంబు. ఛీ! ఛీ! నీవెక్కడనో రాకాసికి జన్మింపవలసినవాడవు. నీ ముఖముఁ జూచినఁ దురితము. విపక్షశిక్షాదక్షంబగు నీ కౌక్షేయము నేటి కీలాటి లతాతన్వుల జంపసిద్ధ పడెఁగా? ఆఱు నెలలు సాముచేసి మూల నున్న ముసలమ్మ నోడించి నట్లు నీ భుజబలం బీలాగుఁ గుసుమ కోమలులం జంపుటకు నక్కఱకు వచ్చెనుగా? నీ కులగురుండగు వసిష్ఠుండు నీకు ధనుర్వేదము నేర్పినదిందులకేనా? జగద్వంద్యమగు సూర్యవంశమున బుట్టి మావంటి వారికెల్లఁ దలవలంపులగు నట్లొక్క చండాలుని దాస్యంబునకుం జొచ్చుట చాల స్త్రీ హత్యకు గూడఁ బాల్పడితివిగా? దుర్మార్గుడా! సమంచిత సాధ్వీమతల్లి యగు నీ యిల్లాలి జంపి నీవింకనే స్వర్గరాజ్యం బేలదలచితివి? ఇప్పటికైన నా మాటవిని సౌందర్యసీమలగు నా ముద్దు కూఁతులం బరిణయమాడుము. నీ దారపుత్రుల ప్రాణదానంబును, రాజ్య ప్రదానంబును ననుగ్రహించెద. వినుము, నా వాక్కులమృతముతో సమానములు సుమీ.

హరి - (నవ్వి) గాధేయా! ఈ నీతులు నాకవసరము లేదు గాని మీరింక నిక్కడ తొలగిపొండు. నా పూనిక మాన్పనింక మీ తరము కాదు. పొండు. పొండు.

విశ్వా - కానీ. నీ వనుభవించెదవు. (స్వగతము) నేనిప్పుడేమి సేయుదును?

హరి - దేవీ! సిద్ధముగా నుండుము.

విశ్వా - (తత్తరముతో) హరిశ్చంద్రా! ఈ పాటికి శాంతింపుము. నీ గురువే జయించెను, నేనే యోడితిని.

హరి - అయ్యా! మీ మాటలు నా కర్థము కావు. గురువేమో, జయమేమో నేనెఱుగను. పొండావలకు.

విశ్వా - (దిక్కులకుం బరిగెత్తుచు) నక్షత్రకా! నేనిప్పుడేమి సేయుదునురా? ఓ దేవేంద్రా, మీరైన హరిశ్చంద్రుని వారింపుడు. హరిశ్చంద్రా! శాంతింపుము.

శా. సత్యశ్రీనిధివైతి! నీగురు ప్రతిజ్ఞావాక్యము ల్సెల్లె! స్త్రీ
హత్యాదోషము గట్టుకోకు! మిపు డార్యాభర్త విశ్వేశుడే
ప్రత్యక్షంబగు నీదు దేశికునితోఁ బాలింపుమా నన్ను బ్రా
ణత్యాగం బొనరింతు లేనియెడ నన్యాయంబుగా నీకునై.

(మరల దిక్కులకు బరుగెత్తి)

 
శా. నేరంబుల్‌ దిగమ్రింగి కాళ్ళఁ బడినన్‌ వేధింతువేమి వసి
ష్ఠా! రా యిప్పుడు పెండ్లి వారి నడక ల్సాగింపకయ్యా! మహేం
ద్రా! రాజిప్పటికే తెగించి తన కార్యం బెల్ల నెగ్గించె నే
మో? రారండికఁ జచ్చు దాక బిగియుంపుల్గూడ నెవ్వారికిన్‌.

ఓ కాశీ విశ్వనాథా! నీవైన నీ రాజేంద్రుని వారింపుము.

(పార్వతీ సహితుడై పరమేశ్వరు డింద్ర వసిష్ఠులతో బ్రవేశించును) హరి - (ప్రాంజలియై)

మానినీ వృత్తము

 
జయ జయ సురగంగా సంగతస్త్వోత్తమాంగా!
జయ జయ శరధినిషంగా శైలజాతాభిషాంగా!
జయ జయ వృషభతురంగా! సాధుచిత్తాబ్జభృంగా!
జయ జయ ధవళాంగా! సంతతానందసంగా!

మహాత్మా గిరీశా! నమస్కారము మహేంద్రా! వందనము గురూత్తమా! అభివాదము.

వసి - వత్సా! హరిశ్చంద్రా, నీయెడ పరమేశ్వరుఁడు ప్రసన్నుడయ్యె నీ కిఁక గష్టములు తొలగినవి.

పార్వ - చంద్రమతీ! పతివ్రతాతిలకంబగు నీచే లోకమంతయుఁ బవిత్రమైనది. నీ కేమి వరములు కావలయునో కోరుకొనుము.

చంద్ర - అమ్మా! మీరు ప్రసన్నత జెందిన నీయరాని దేమున్నది? చనిపోయిన రాచబిడ్డను బ్రతికించి నాయపవాదము బాపుము.

పార్వ - సాధ్వీమణీ! నీ ధర్మమునకు మెచ్చితిఁ, రాచబిడ్డతోగూడ నీకుమారుడు సజీవుండగు గాక! లోహితాస్యా లేచిరమ్ము! (లేవనెత్తును)

(తల్లి దండ్రులు కౌగిలించుకొందురు)

లోహి - మిత్రులారా! నే గోసిన కుశలెక్కడ?

పర - కుఱ్ఱా! నీ గురువులకు జేరినవి, తొందరపడకుము. హరిశ్చంద్రా! నీవిఁక రాజధాని బోయి పట్టభద్రుండవగుము.

హరి - అయ్యా! చండాలదాసుడనైన నాకింక రాజ్యమెందులకు? మీ దర్శన భాగ్యము లభించె జాలదా?

విశ్వా - హరిశ్చంద్రా! సత్యవ్రతము పరీక్షింప నేనే నీకిన్ని కష్టములు దెచ్చిపెట్టితిని. ఇది యంతయు నా మాయా కల్పితము. చూడు.

 
గీ. కడకు నిను దాసునిగ గొన్న కాటిఱేడు
పరయముడు గాని కడజాతి వాడు గాఁడు
ఇప్పుడు నీవు వసించెడు నిప్పొలంబు
సపనవాటంబు గాని మసనము కాదు.

మఱియు

క. పనికత్తెగ నీ వనితం
గొనినాతఁడు బాలచంద్ర కోటీరుఁడు గాక
నిజముగా విప్రుఁడుగా
డనఘా! హర సేవ దొరకు నా యన్యులకున్‌?

కావున మరల నీ రాజ్యము నీవు గ్రహించి నన్నుం జరితార్థుని జేయుము.

వసి - వత్సా! ఈ విశ్వామిత్రుని ప్రార్థన మంగీకరించుము.

హరి - గురూత్తమా! ఇమ్మహనీయుడు ప్రార్థింపవలయునా!

పర - విశ్వామిత్రా! నీ చేతిలో గిరీట మాతని శిరం బలంకరింపుము.

దేవే - గాధేయా! నాఁడు సకల మునిగణంబుల సమక్షమునఁ జేసిన ప్రతిజ్ఞ చెల్లించుట కిదియే యదను. కావున నీ పరమేశ్వరాజ్ఞ శిరసావహించి నిత్య సత్యవ్రతుండగు నీ హరిశ్చంద్ర చక్రవర్తిని జేతులార బట్టాభిషేక్తుం జేసి నీ తపశ్శక్తి యంతయు ధారబోయుము.

విశ్వా - (అట్లుజేసి) ఇదిగో నా తపశ్శక్తి యంతయు ధారబోయుచున్నాను. పరిగ్రహింపుము.

వసి: విశ్వామిత్రా! ఇప్పటికైనా నెవరు గెల్చిరో చెప్పుము.

విశ్వా - చాలు, చాలు. విశ్వామిత్రుడు నీకోడెనని తలంచుచున్నావు కాబోలు! సాటి రాచ బిడ్డయగు మా హరిశ్చంద్రుని సత్యయశముం బ్రకటింప నుద్దేశించి సఫలీకృత మనోరధుండమగు మాకు బరాజయ మెక్కడిది? ఇన్ని కష్టముల పడకున్న నితని కీర్తి లోకమున కెట్లు వెల్లడి యగును?

హరి - నిజము. ఇమ్మహనీయుని వచనంబులు యధార్థములు. చూడుఁడు

గీ. కరగినను గాని పసిడికి గాంతి రాదు
తఱచినను గాని పాల జేకురదు వెన్న
యొరసినను గాని మణికైన నొఱపు రాదు
ఇడుములనుగాని నరున కేర్పడదు కీర్తి.

దేవేం - విశ్వామిత్రా! నాడు నేను సభలో

గీ. సరసులగు పండితుల విమర్శనము లెల్లం
గడచినదె కద నిర్దుష్ట కావ్యమగును
తన కళత్ర సుత ప్రాణ ధనములుడుగ
సమయమున నిల్చి యున్నదే సత్యనిష్ఠ.

అని వక్కాణించిన దిందుకే. పర - హరిశ్చంద్రా! నీ కింకేమి కావలయును?

హరి - దేవా! నేనింక గోరందగిన దేమున్నది?

మ. తనయుండా త్తనయుండు దుర్విష లసద్దర్వీకరగ్రస్తుడై
మనియెన్‌! జెట్టున కొక్క పక్షిగతి సంసారంబు నిర్భిన్నమై
చనినన్‌ జేరితి నాలు బిడ్డల! నికృష్టంబైన దాస్యంబు వా
సె ననిర్వాచ్యఫలంబు దక్కె? నశియించెన్‌ దుష్టనిందావళుల్‌.

అయినను దేవర ప్రసన్నతఁ జెందితిరి కాన నిట్లగుగాక.

మంగళమహాశ్రీ వృత్తము.

శ్రీ లొసఁగ ధారుణ సశేషమగు పంటలు విశేషముగ బండెడి ధరిత్రీ
పాలకులు రాష్ట్రముల బాడిమెయి నేలుదురపార కరుణారససమృద్ధిన్‌
జాలఁగ వసుంధర నసత్యము నశియించుటను సత్యమె జయంబు వహించుచున్‌
ధీలలితులైన కవి ధీరుల యభీష్టములఁ దీర్చెదరుగాక నృపమౌళుల్‌.

పర: తథాస్తు.

(అందఱు నిష్క్రమింతురు)

గద్యము.

ఇది హరితసగోత్ర పవిత్రనృసింహ మనీషి వరపుత్త్ర బుధ జనవిధేయ లక్ష్మీకాంత నామధేయ ప్రణీతంబైన శ్రీ హరిశ్చంద్రీయ నాటకంబున సర్వంబును సంపూర్ణము.