సత్య హరిశ్చంద్రీయము/పంచమాంకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరస్తు

సత్య హరిశ్చంద్రీయము

పంచమాంకము


(సతీసుతులతో హరిశ్చంద్రుడు నక్షత్రకుఁడు బ్రవేశించుచున్నారు)

హరి - దేవీ కష్టము లెట్లున్నను, బుణ్యక్షేత్రమైన వారణాశిం దర్శించితిమి. చూడు,

గీ. భక్తయోగ పదన్యాసి వారణాసి
భవదురిత శాత్రవఖరాసి వారణాసి
స్వర్ణదీ తటసంభాసి వారణాసి
పావనక్షేత్రముల వాసి వారణాసి.

నక్షత్రకా! విశ్వేశ్వరుని దర్శించి వత్తము. దేవీ! రమ్ము.

నక్ష - ఇఁక మాయప్పుమాట నీకు దోచదు, పద. (నడచుచున్నారు)

(యవనిక నెత్తఁగా దేవాలయము కాన్పించును. అందఱు విశ్వేశ్వరునకు నమస్కరింతురు)

హరి - (ప్రాంజలియై)

శ్లో॥ ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే!
ప్రముఖ్యోఽహం తేషామపి కిముత బంధుత్వ మనయోః
త్వయైన క్షంతవ్యా శ్శివ మదపరాధాశ్చ సకలాః
ప్రయత్నా త్కర్తవ్యం మదవన మియం బంధుసరణి.

శా. ఆపద్బంధుఁడ వీవు సామివి గదా! మాలాటి యాపన్నులం
దేపారన్‌ ప్రముఖుండఁగా మనకుం దండ్రీ? బాంధవం బింక వే
ఱే పల్కం బనిలేదుఁ గాననిఁక నీవే సైఁచి నా నేరముల్‌
కాపాడం దగు నెట్టులైనఁ నిటులే కాయోగ్యబంధుత్వముల్‌.

నక్ష - హరిశ్చంద్రా! ఇంకనెంతకాల మిట్లు ముక్కు పట్టుకొని కూర్చుండెదవు? రమ్ము.

చ. అలయక గుళ్ళుగోపురము లన్నియు జూచుచు నప్పుమాటయే
తలపవు చేరువయ్యెనుగదా గడువంచు రవంతయేని లోఁ
దలపవు నా ప్రయాసము వృథాయగుచున్నది వెళ్ళబెట్టుమా
పెలుచన మా ఋణంబు నెగ వేయదలంచిన నేను బోయెదన్‌.

హరి - అయ్యా! ఎగవేయవలయునన్న నింత కష్టమున కేల యోర్చితి? తొందర పడకుము.

నక్ష - ఏమీ! సొమ్మీయఁ దలఁచిన వాఁడవు నీవు తొందర పడకపోగా బుచ్చుకో వలసిన నన్ను గూడఁ తొందర పడవలదని నీతులు చెప్పుచున్నావుగా? బాగు! అన్నిటికిఁ గాళ్ళు సాచిన నీకేమి తొందర?

ఉ. పుట్టెడు నప్పుతోడ దల మున్గితి వింకొక పుట్టెడైన నీ
పుట్టి మునుంగ దింతయును బ్రొద్దున నీ మొగమింత సూచినన్‌
బుట్టదు యన్నమున్‌ మునిగి పోక యిఁకేమిటి? దీపముండగా
నెట్టన జక్కఁ బెట్టుకొన నేరకపోయె గురుండు వెఱ్ఱియై.

హరి - అయ్యా! నిష్ఠురము లాడకుము.

నక్ష - ఏమీ! మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిష్ఠురమాయెనుగా? నీ వడుగుకొన్న నలువది దినంబులు నేఁటితోఁ దీరుచున్నవే. ఇంత దనుక నాకిచ్చిన దొక్కకాసైన లేదే? ఇంక నీ విచ్చెదవని మా కెట్లు నమ్మకముండును? ఇప్పుడు మాత్రము

శా. ఏలీలన్‌ సవరింతు మా ఋణము కొంపే గోడియే నింత కూ
డే లేదేమిటి కింకఁ జంపెదవు పొమ్మీ మీకు నేనాటి బా
కీ లన్న నిన్ను గొట్టువాడెవడు? చిక్కెన్నీకు మాజుట్టు ప
త్రాలా? సాక్ష్యములా? నినున్‌ బలిమి మీదన్‌ రచ్చకీడ్పింపగన్‌.

హరి - నక్షత్రకా! పత్రములు సాక్షములు నేల కావలయును? నిత్యస్థిరంబయిన నా వాక్కున కన్యథాత్వ మెప్పటికైన సంభవింపదు గదా!

నక్ష - సంభవింపక యిప్పటికి జేసిన దేమున్నది?

హరి - అయ్యా! నా దీనదశ యించుక యోచించుము.

నక్ష - అలాగయిన నేను యోచించి చెప్పునది గట్టిగా వినుము.

శా. నీ కాతం డది యప్పు వెట్టినది కానే కాద యామౌని ని
న్నే కైసాచి మదర్థ మిమ్మనిన సొమ్మేకాని, యద్దానికై

నీ కన్నుంగవ దుమ్ముసల్లి యిట మున్నే రాజ్య సర్వస్వముం
జేకొన్నా డిఁక నేటి యప్పు? నిజముం జింతింప నింతేకదా!

హరి - ఇంతియెకాని ' నెలదినములలో నిచ్చెద ' నని యమ్మునితో నొప్పు కొంటిని గదా?

నక్ష - లేదనిన నామాట లన్నియు సున్న యగుంగాదే?

హరి - అయ్యా! సత్యేతరంబునకు నామానసం బొప్పునయ్యా!

నక్ష - అయ్యో! అమాయకుడా! ఇంతలోఁ జెడ్డప్పుడుగూడ సత్యము సత్య మని యూఁగులాడు చున్నావే? హరిశ్చంద్రా! నీ వేమనుకొన్నను,

మ. జటినై నేననరాదు కాని విను నీ సత్యంబె నీ కొంప కిం
తటి చేటౌటకు మూల; మిప్పటికి నైనన్‌ మించిపోలేదు, తీ
ర్చుట కేనాటి ఋణంబు మీ కనిన దీఱున్నీకు మా బాధ; యం
తట నూరేగుము సత్తుచి త్తనుచు జింతన్‌ బాసి బైరాగివై;

అట్లుకానిచో నింత ధనము నీ విప్పట్టున నె ట్లార్జించెదవు? చెప్పుము.

సీ. వైదికవృత్తి సంపాదింతు నంటివా
          యుడుగవు రాచపోకడలు నీకు,
రాచఱికంపు శౌర్యమున దెత్తు వఁటన్న
          దెసమాలి యేవంక దిక్కు లేదు,
వణిజు వర్తనముచే గణియింతు నంటివా
          యరచేత గుడ్డిగవ్వైన లేదు,
వ్యవసాయవృత్తిచే సవరింతు నంటివా
          లేదు భూవసతి గోష్పాదమంత,

గీ. ఇందు నేదేని వ్యాపార మందదగిన
యంత పున్నెంబు పుట్టిన నింతధనము
గంటుకట్టుదె యీ స్వల్ప కాలమునను
గడచు నీ నాటితోడ మా గడువుదినము.

ఇవి యేవియుగాక బానిసవృత్తికి బాల్పడినను ని న్నెవరు కొనువారు లేరు. కావున నా యుపదేశవాక్యముల ననుసరించి నీ వీ ఋణబాధ తప్పించికొనుము. మా గురువుగారితో నీ దురవస్థయంతయు జెప్పి యీ సొమ్ము వదిలివేయు తెఱంగొనరించెద. చెప్పుము. ఏల నీకీ బాధ? హరి - నక్షత్రకా! నా కంఠము గత్తిరించుచున్నను నసత్య మాడుటకు నామనంబొప్పదు గదా!

నక్ష - హరిశ్చంద్రా! నీ మేలు గోరి నే నింత వచించెద వినుము.

ఉ. పుట్టిన నాఁటనుండియును బొంకి యెఱుంగవ? యే నెఱుంగు ది
ప్పట్టుని గూడులేని దురవస్థల నుంటివి గాన నీ మనం
బెట్టిటొ తెంపుజేసికొని యీ యుపదేశము నాలకింపు మే
నొట్టిడుకొం దసత్యమున కొప్పితివంచు వచింప నేరికిన్‌.

చంద్ర - నక్షత్రేశ్వరా! నీ వంటి మునికుమారుడు చెప్పవలసిన నీతులా యివి?

నక్ష - చంద్రమతీ! నీవును నీ పెన్మిటికిం దగినట్టు దొరికినావు. పో,

శా. మీనిప్పచ్చరముం దలంచి కరుణన్‌ మీ బాగుకై యింతగా
నే నేమో హితమున్‌ వచించితిని, మీ కే లేని యీ బాధ నా
కా? నీ పెన్మిటి నీ వెటైన విను నా కౌనేమి పోనేమి సు
స్నానంబో జపమో తపంబో సదనుష్ఠానంబొ యోజింపుమా.

చంద్రమతీ! నానీతులు మీరు విననక్కఱలేదు. ఊరక యడ్డుపుల్లలు వేసినట్లు కాదు. మాకు రావలసినసొమ్ము గవ్వలతో గూడ లెక్కపెట్టి మా కిప్పింపుము. నే నింక క్షణమాగను, మీమీది మోమాటముచే నే నింకను నాలస్యము చేసినచో సహజముగా ముక్కోపియైన మాగురువుగారు నాగొంతుక కొఱుకక మానడు. హరిశ్చంద్రా! నీ పెద్దఱికం బాలోచింపను. మా సొమ్ము గుమ్మరించి మఱి నడువుము.

(చేయి పట్టుకొని నిలవేయుచున్నాడు)

హరి - (నిట్టూర్పు విడిచి) దేవీ! ఈ ఋణబాధ కడుంగడు దుర్భరముగద! చూడు,

మ. సరివారి న్నగుబాటు పిమ్మట మనశ్చాంచల్య రోగం, బనం
తర మాహారమునం దనిష్ట, మటుమీదన్‌ దేహజాడ్యం, బటన్‌
మరణంబే శరణంబు, పెక్కుదినము ల్మంచాన జీర్ణించి; యిం
తిరొ! యీ ప్రాణులకున్‌ ఋణవ్యధలకంటెన్‌ దుస్సహం బేదికన్‌.

దేవీ! మందభాగ్యుండనైన నే నిప్పుడేమి చేయుదును? నిరవశేషముగా ఋణము దీర్చివేసికొని సంతోషించు భాగ్యము నాకు లేకపోయెనే?

చంద్ర - నాథా! మీ రిప్పట్టున ధైర్యము వహించి నా మనవి యాలింపుడు.

గీ. కాలగతి సర్వసంపద గోలుపోవ
మిగులు సిరి నాకు మీరును మీకు నేనె
బానిసగ నన్ను నే కలవానికేని
నమ్ముకొనుఁ డింక మౌని ఋణమ్ము దీఱు.

హరి - హా! విధీ! ఈ హరిశ్చంద్రునకు నెంతటి యవస్థ దెచ్చితివి?

ఉ. అంతటి రాజచంద్రునకు నాత్మజవై కకుబంతకాంత వి
శ్రాంతయశోవిశాలుని త్రిశంకు నృపాలుని యిల్లు సొచ్చి, భా
స్వంతకుల ప్రసిద్ధికొక వన్నె ఘటించిన గేస్తురాండ్ర మే
ల్బంతిని నిన్ను నొక్కనికి బానిసగా దెగ నమ్ముకొందునే?

చంద్ర - ప్రాణేశా! నీచంబని సంకోచించవలదు. సత్యప్రతిష్ఠకై యొనర్చిన నీచ కార్యంబులును సగౌరవంబులేయగు.

హరి - హా! జీవితేశ్వరీ! హా! సుగుణసుమవల్లీ! కఠినకర్ముండ నగు నేనెంతకు జాలను? హృదయమా! నేటితో నభిమానము వదలివేయుము. దేవీ! చంద్రమతీ!

గీ. హృదయమున నెగ్గు సిగ్గులు వదలివేసి
దాసిగా నిన్ను నమ్ముకో దలచినాడ
వాడవాడల నిన్‌ గొనువారి నూర
వెదకికొన బోవుదుము జనవే లతాంగి!

చంద్ర - (నడచుచు) ఓదేవా! కాశీవిశ్వనాథా! నన్ను గొనువారి ద్వరలో గను పఱచి మమ్ము విశ్వామిత్ర ఋణబాధా విముక్తులను జేయుము, తండ్రీ!

నక్ష - హరిశ్చంద్రా! ఇదియే అంగడి వీథి. ఇక్కడ ఒక్క కేక వేయుము.

హరి - దేవీ! నేనిప్పుడేమి ఘోషించవలయును.

చంద్ర - క్రయ ధనమ్ము నమ్ము కొనువారెట్లో యట్లే.

హరి - ఓహో! పౌరులారా! (కొంచెమూరకుండి) అయ్యో! యెంత నైచ్యమునకు బాల్పడుచుంటిని?

నక్ష - హరిశ్చంద్రా! ధనమిచ్చి కొనదగిన వారంద ఱిక్కడనే యున్నారు? ఇంక నీ యాగడములు చాలించి యందఱు వినున ట్లెలుంగెత్తి కేక వేయుము.

హరి - అయ్యా! నేనన్నిటికి దెగించియే యున్నాను.

ద్విపద - రాగము కీరవాణి - తాళము ఆది

అవధారుడయ్య యో యగ్రజులార!
సవనదీక్షితులార! క్షత్రియులార!
ప్రవిమల గుణగణ్య పాదజులార!
కడలాక్రమించి యొక్కట భూమి నేలి
సడినున్న యీ హరిశ్చంద్రుడ నగుట
ప్రణుత కౌశిక ఋణగ్రస్తుండ నగుట
గుణములదొంతి పల్కులమేలుబంతి
పున్నె పింతుల యీలు పున కోజబంతి
యన్నుల తలకట్టు లందు సేమంతి
యగు నాదు నిల్లాలి హా! దయమాలి
తెగ నమ్ముకొందు వీధిని దాసిగాను
చేరి రొక్కంబిచ్చి చెల్వను గొనుడి
వారణాసీ పౌర వరులార! మీరు.

మఱియు నో సౌభాగ్యమహితాత్ములార!

సీ. జవదాటి యెఱుగ దీ యువతీలలామంబు
          పతిమాట రతనాల పైడిమూట
అడుగుదప్పి యెఱుంగ దత్తమామల యాజ్ఞ
          కసమానభక్తి దివ్యానురక్తి
అణుమాత్రమైన బొంకనుమాట యెఱుగ దీ
          కలుష విహీన నవ్వులకు నైన
కోపం బెఱుంగ దీ గుణవితాన నితాంత
          యొరులెంత తన్ను దూఱుచున్న సుంత

గీ. ఈ లతాంగి సమస్త భూపాలమకుట
భవ్యమణికాంతి శబలిత పాదుడైన
సార్వభౌముని శ్రీహరిశ్చంద్రు భార్య
దాసిగా నీపెఁ గొనరయ్య ధన్యులార!

(పిమ్మట గేశవునితో గాలకౌశికుడు ప్రవేశించుచున్నాడు.)

కాల - ఓరీ! శిష్యా! ఎక్కడరా బానిసల విక్రయించునది?

హరి - బ్రాహ్మణోత్తమా! ఇక్కడనే. మందభాగ్యుడనైన నేనే బానిసల విక్రయించు చున్నాడ.

కాల - అట్లయిన నీవెవ్వడవు? ముందు చెప్పుము.

హరి - నే నెవ్వండనైన మీకేమి?

కాల - ఏమోయీ. పేరు చెప్పుటకే సందేహించుచున్నావు. ఈ కాంతను నీ వెక్కడనో యెత్తుకొని వచ్చినట్లున్నావే! ఆఁ! నీవే దొంగతనము చేసినను సాగివచ్చుటకు నీ కాశికా పురమంత యరాజకముగ యున్నదనుకొంటివేమి? బోయవానికి రామచిలుక లాగున నీకీకాంత యెక్కడ చిక్కినది? ఫాలాక్షునంత వాడనైన నాకంటంబడి తప్పించుకొని బోవుట కల్ల. (శిష్యునితో) ఓరీ! కేశవా! నీవు పోయి మనయూరి తలారి పెద్ద యగు రామసింగును బిలుచుకొని రమ్ము. ఈ మ్రుచ్చును పట్టి యొప్పగింతము.

హరి - అయ్యా! విప్రోత్తమా!

గీ. ధరణిలో దొంగతనములో దొరతనములో
భాగ్యవంతునకేదైన బాధలేదు
పెన్నిధి యదృష్టమున నిరు పేదవాని
కబ్బినను దొంగసొమ్మంట కబ్బురంబె?

కాల - ఏమీ! నీ యదృష్టమునకు దోడు నీకీ కాంత యెక్కడో లభించినదా?

హరి - అదృష్టమున లభించినది. నేను హరిశ్చంద్రుడను. ఈమె నాభార్య చంద్రమతి.

కాల - ఏలాగూ! విశ్వామిత్రున కప్పుపడితినని యఱచినది నీవేనా? ఆలాగైన తపోధనుడైన యమ్ముని కీవెట్లు ఋణపడితివి?

హరి - నారాజ్యసర్వస్వ మాతనికి ధారవోయునప్పుడు మున్నాతనికి యజ్ఞార్థమై ఇచ్చెదనన్న ధనము ముందు నిరూపింపకపోవుట వలన.

కాల - పత్రము వ్రాసి పుచ్చుకొనినగాని యప్పుకాదు గదా! సాక్షులెవరైన నున్నారా? హరి - సత్యశీలమే పత్రము. మా యుభయుల చిత్తములే సాక్ష్యములు.

కాల - ఓయీ యమాయకుడా! ప్రాణము లేని యీ పత్రమునకును సాక్ష్యములకును భయపడి నిక్షేపము వంటి యిల్లాలి నమ్ముకొను చున్నావా? (ఆలోచించి) ఉండుండుము. నాకిప్పుడు మంచి యుపాయము తోచినది. నన్నా విశ్వామిత్రునొద్దకు దీసికొనిపోయి యీ ధనము నీకీయవలసినది కాదని పోరాడుము. నీ పక్షమున నేను న్యాయవాదిత్వము గైకొని రాయిగ్రుద్దుచు వాదింపగలను. ఓహో! ఒకరికిం బదుగురు సాక్షులుంచిన పత్రముల నెగవేయుటలోను ద్రోవఁబ్రోవు వారిపై లేని యప్పులగట్టి ధనము గణించుటలోను నన్ను మించినవాడు మఱొక్కండు నీకు దొరకడు. పద, నేను నీకు సహాయుడనై యుండ విశ్వామిత్రుడును గిశ్వామిత్రుడును నిన్నేమి చేయగలడో చూతము.

నక్ష - హరిశ్చంద్రా! నీ కిప్పుడు సహాయ సంపత్తి కూడ లభించినది! ఇంక రమ్ము. హరి - అయ్యలారా! మీ రిరువురును మహాబ్రాహ్మణులు కాని యూరకుండుడు. నా కెవ్వరి సహాయమక్కఱలేదు. నా సత్యమే నన్ను రక్షింపవలయును గాని,

మ. ఇటులెంతైన ధనంబు వచ్చినను రానీ గాధిరాట్సూతి నా
కెటు కష్టంబుల దెచ్చెనేనియును దేనీ దివ్యభోగంబు లె
న్నిటి నాకాజడదారి యిచ్చినను నీనీ, సత్యముం దప్ప నే
నిటు సూర్యుండటుతోచెనేని వినుడోయీ మీరు ముమ్మాటికిన్‌.

కాల - ఓహో! నీ వెంత సత్యవంతుడవైనను ధనము పట్ల గొంచెము సడలు విడవ వచ్చును. అందుకే "సర్వేజనాః కాంచన మాశ్రయంతి" యని పెద్దలు చెప్పు చున్నారు. నా యీ శాస్త్రప్రమాణ మంగీకరించి కౌశికునొద్దకు నడువుడు. చూడుము.

క. ఆలాగున గౌశికుఁడే
పాలయ్యె, ధనాశకింక వల దుడుగుము నీ
కేలా! యీ వేదాంతము?
పా లొల్లని పిల్లి గలదె పరికింపంగన్‌?

హరి - అయ్యా! ఏల మీకిన్ని మాటలు?

కాల - సరి, నీకి బాగుపడు యోగము లేదు. తియ్యని చెఱకుపానకము నోట బోయుచుండ విషమని గ్రక్కువాని కెవ్వరేమి చెప్పగలరు. నీ యిష్టము. నీ భార్య నెంత కమ్మెదవు?

హరి - నక్షత్రకా! చెప్పుము. నక్ష - ఓ కాలకౌశికుడా! వినుము.

క. దంతావళంబు పయి బల
వంతు డొక్కండు నిలిచి పైకిన్‌ రతనం
బెంతటి దవ్వుగ రువ్వునో
యంతటి యర్థంబు నిచ్చి యతివం గొనుమీ!

కాల - ఓహో! కేశవుడా! ఇదేమి చవుకబేరము గాదురా!

నక్ష - మఱి పంచాంగము కట్టకే వచ్చునేమి?

కాల - ఏమిరా చెడుగా! మాయాయవారపు జోలె చూచి నన్ను ధనహీనునిగా గణించుచున్నావు కాని, దీనిని మా యింటికి బంపి వేయుము. ధనమిచ్చి వేయుదను. హరిశ్చంద్రా! సరియేగదా!

హరి - అయ్యా! అట్లే.

కాల - దాసీ! ఇక బద. కుఱ్ఱా! నడువుము. (బెత్తమున నదలించుచు)

చంద్ర - అయ్యా! వచ్చుచున్నాను. (పతి పాదములపైఁ బడును)

కేశ - దాసీ! నడువమేమి? చంద్ర - హా! మందభాగ్యనైన నేను నేటితో మీ దృష్టినుండి సయితము దొలగింపఁబడి పరాధీననై పోయితినే! ప్రాణపతీ! హరిశ్చంద్రా! నాకింక దిక్కెవరు?

చం. పదపద యంచు బెత్తమున బ్రాహ్మణుఁ డిట్లదలించు చుండినన్‌
బదమటు సాగకున్నది భవత్పద సారసభక్తి యందు నె
మ్మది వశమౌట, చంద్రకర మర్దన మందుచునుండినన్‌ బదిం
బదిగ మరందలోలయయి పద్మముఁ బాయని భృంగికైవడిన్‌.

అకటకటా! మిమ్ముఁ జూచు నవకాశము నాకు లేదు. నా యజమానుఁడింకను దొందరపడుచున్నాడు. ఈ స్వల్పకాలములోనే శుభదాయకం బగు మీమూర్తి గనులారఁ గాంచి పోయెదను. ప్రాణపతీ!

సీ. కదలవే యని విప్రుఁడదలించుటకు మున్ను
          గనులార మీ మోముఁ గాననిండు
పదవేమి యని వటుండదలించుటకు మున్నె
          మీ నోటి నుడి తేనె లాననిండు

నడువవేమని విప్రుఁడడలు వెట్టకమున్నె
          పొడము మీ కన్నీరుఁ దుడువనిండు
సాగవేమని వటుల్లాగవచ్చుటకు ము
          న్నింపుగా మిముఁ గౌఁగిలింపనిండు
గీ. పరమ కరుణాసనాథ మత్ప్రాణనాథ!
కాలగతి మీకు దూరస్థురాల నగుచు
వెడలు కన్నీట బాదము ల్గడిగి మీకుఁ
బ్రణుతులిడుచున్న దాన సద్గుణ నిధాన!

హరి - (నిర్వేదముతో) ఛీ, ఛీ, హరిశ్చంద్రా! నీవు నిక్కముగా గిరాతునకు జన్మింప వలసినవాడవు గదా?

గీ. గళమునం దాల్పవలసిన యలరుదండ
పాదమర్దన కొప్పించు భంగిగాగ
నఖిల సామ్రాజ్యభోగంబు లందఁదగిన
పట్టపుఁ దేవి నమ్మితే బానిసగను.

చంద్ర - హృదయేశ్వరా! నాకై మీరింతగా దుఃఖింపవలదు. విధి విధాన మెవ్వరు తప్పింతురు? దుఃఖ మడంచుకొని యా కాలకౌశికుని సేవావృత్తికి నన్నిఁక సమ్మతించి పంపివేయుడు.

హరి - దేవీ! ఇప్పుడనుమతించుటేమి? ఆగర్భశ్రీమంతురాలవైన నిన్ను బరున కెప్పుడు విక్రయించితినో యప్పుడే నా యనుమతులన్నియు దీఱినవి. కాని,

మ. కనుసన్నన్‌ బనికత్తెలెల్ల నిరువంక\న్‌ గొల్వ రాణించు జీ
వనమే కాని యెఱుంగ వెప్డుఁ బర సేవాకృత్య మా జన్మమున్‌
వనితా నేటికి నీకు నా వలన బ్రాప్తంబయ్యె నెట్లోపెదో?
ఘనదుర్దాంత దురంతదుస్సహమహోగ్ర క్రూర దాస్యంబునన్‌.

నీ! మానవతీమణీ! రాణివాసంబు భోగభాగ్యంబులకు జెడి నూతనముగా దాసికావృత్తి నవ లంబింప బోవుచున్న నీకు గొంతచెప్పుచున్నాను. సావధానముగా నాకర్ణింపుము.

మ. తల్లిదండ్రుల్‌ మఱి వేర లే రిక సతీ! తద్దంపతుల్గాక నీ
కిల, వేమఱపాటు సెందకుసుమీ యీ విప్ర సేవాకృతిన్‌

దొలి నీ వొందిన భోగభాగ్యముల యందున్‌ జిత్తమున్‌ నిల్పకే
తలలో నాలుకగా మెలంగుము నెలంతీ! పిన్నలన్‌ బెద్దలన్‌.

మఱియు నో సాధ్వీమణి! నీ స్వామి కడనె బానిసీఁడుగ నుండవలసినవాడు గానఁ గుఱ్ఱవాని లోహితాస్యునెట్లు కాపాడుకొందువో? మనకు నేటితో దురంతమైన వియోగంబు సంభవించినది కదా! (లోహితాస్యునితో) నాయనా! లోహితాస్యా! నీవు కూడా నీ తల్లి ననుసరించి యుండవలసినవాడవే కాన నావెంట రాకుము.

లోహి - నాన్నగారూ! మీ రెందుల కేడ్చుచున్నారు? మీ రిప్పుడెక్కడకు బోయెదరు?

హరి - నాయనా! నే నెక్కడ బానిసీఁడుగా నుండవలెనో యక్కడికే.

(దీనవృత్తము - హిందూస్థానీ భైరవి -ఆది తాళము)

లోహి - జనకా! యిపుడెచ్చటి కేగకుమా
నను నీ వెనువెంటను గొనిపొమ్మా
జననిన్‌ నను నిచ్చట బ్రాహ్మణుఁడే
కొనిపోయిన మాకు సుఖంబగునే?

హరి - తండ్రీ! (యెత్తుకొని) నీకు రావలసిన కష్టములా ఇవి?

మ. కొడుకా! కష్టము లెన్ని వచ్చినను నీకున్నాకు నాకీడులం
దెడబాటు ల్ఘటింయింపకుండు టొక మేలే యంచు నే సంతసం
బడితింగాని యెఱుంగనిన్నుఁ దెగనమ్మంజూపి హా లోహితా!
కడ కీనాటికి గాలసర్పమునకుం గైకోలుఁ గావించుటన్‌.

హా! తండ్రీ! నీ కమంగళము ప్రతిహత మగుగాక!

(మరల) కడ కీనాటికి గాలకౌశికునకుం గైకోలుఁ గావించుటన్‌. దేవీ! నే నెంత దారుణమైన వాక్యము బల్కితిని.

చంద్ర - నాథా! మనకు దుఃఖము శాంతించుగాక!

గీ. కాలవశమున గల్గిన కష్టచయము
లెల్ల వెంటనే నిలుచునే యేక రీతి
మిహిర మండలమును గప్పు మేఘరీతి
తూలిపోకుండునే యెల్ల కాలమటుల?

అట్లే యచిరకాలమునకు మరల శుభములు వచ్చి పునస్సమాగమ సౌఖ్యము లభించకపోదు. హరి: దేవీ! భవితవ్యమును నెవ్వ రెఱుంగుదురు? చూడు.

మ. కలికీ! ఱెక్కలురాని పిల్లలను సాకన్‌ గూటిలో నుండి మే తలకై పోతొక చెంత బెంటియొక చెంతన్‌ బాఱ నీలోన బి ల్లలఁ బామే గ్రసియించునో వలల పాలన్‌ జిక్కునో పున్గులీ యిలపైఁ బ్రాణులకున్‌ వియోగమగుచో నెవ్వారి కెవ్వారలో?

కేశ: ఏమయ్యా! శుభమస్తు అని మాగురువుగారు దాసిని గొనుటేమి? మీరిట్లశుభముగా నేడ్చుటేమి? పద పద (అదలించును)

లోహి: (కోపముతోఁ గేశవునిఁ జూచి) (స్రగ్విణీవృతము: బేహాగ్‌ - ఆది తాళము)

ఏర! మాయమ్మని ట్లీడ్వ నీకేమిరా క్రూర! నిన్నిప్పుడే గ్రుద్దెదన్‌ జూడరా! దూరమందుండి మా తోడ మాట్లాడరా! శూరునిన్‌ లోహితున్‌ జూచి నోర్మూయరా!

కేశ: ఓరీ! చెడుగా, దాసిపుత్రా! కూటికి లేకపోయినను నీకెంత రాజసమున్నదిరా? (పడఁద్రోయును)

లోహి: (కన్నీరు కార్చుచుఁ దండ్రివంక జూచును)

హరి: (దుఃఖముతోఁ గుమారు నెత్తుకొని) తండ్రీ! నీకెంత దురవస్థ వచ్చెనురా!

మ: కనుదోయిన్‌ జడబాష్పము ల్దొరఁగ నాకై యేల వీక్షించెదో తనయా! నేను మహాకిరాతుఁడ సమస్తద్వీప భూమండలీ జననాథాళికి సార్వభౌముడవుగా జాల్నిన్ను నీ దాస్యపుం బనికై యమ్మిన నాకు నెచ్చటిదయా ప్రారంభవిస్రంభముల్‌.

కాల: ఓహో! యేమోయీ! నీకొడుకిట్లను చున్నాడే? ఇక మా ఇల్లల్లకల్లోలము చేయునా ఏమి?

హరి: అయ్యా! ఇది కేవల బాల్య చాపల్యము. కాని నామనవి యొక్క టాలింపవలయు.

కాల: అది యేమి?

హరి: గీ. మీరు బిడ్డలఁ గని పెంచువారె యైనఁ గడుపు కక్కుఱితిని నింతగా వచింతుఁ బ్రేమ నీ బిడ్డలందొక బిడ్డగాఁగ నరసి కొనుమయ్య వీనిఁ గృపాంబురాశి!

(లోహితు నొప్పగించును)

కాల: సరి, నీ యొప్పగింతలన్నియు నైనవా? ఇంక మా దాసినిఁ బంపివేయుము. మాకు జాగగుచున్నది.

చంద్ర: (దుఃఖముతో) (సరసాంక వృత్తములు - ఫీలు రాగము) సెలవిచ్చి నన్బంపుడీ క్షితిపాలచంద్రా! నలవంత జెందకిఁక పావన సత్యసాంద్రా!

హరి: కలకాల మీ గతిని దుఃఖముతో సుశీలా! తలపెట్టు టూఱడిలు నింతట ముద్దరాలా!

చంద్ర: ఇక జాగుచేయదగదో నృపసార్వభౌమా! సకలం బెఱింగి యిటు లెస్సయ పుణ్యధామా!

హరి: అకలంకశీల! నిను నిట్లలయించినాఁడన్‌ మొగమెత్తి యెట్లు గననోపుదు సిగ్గు తోడన్‌.

కాల: ఓహో! మీ ఏడ్పుతో మా పనులన్నియు జెడుచున్నవి. దాసీ కదలవేమి? మూటలెత్తుకొని రమ్ము.

చంద్ర: (లోహితాస్యునితోఁ దిరిగి తిరిగి పతిం జూచుచుఁ బోవుచున్నది)

హరి: హా! హా! నా పుణ్యలక్ష్మి దాఁటి పోయినది.

నక్ష: హరిశ్చంద్రా! నీవు విశ్వేశ్వరదేవాలయము నొద్ద నుండుము. నేను ధన మందికొని వత్తును.

(కాలకౌశికునితో నిష్క్రమించును. తెర వ్రాలును.)

(పిమ్మట యవనిక నెత్తగాఁ గాలకంటకి గృహద్వారముకడఁ బ్రవేశించును)

కాలకం: ఓరీ, యెవఁడురా? కేశవా! జనార్దనా! అంగడికిఁ బోయిన మా యాయన యింకను రాలేదుగా? కానీ

(కాలకౌశికుడు, కేశవుడు, చంద్రమతి, లోహితాస్యుడును ప్రవేశించుచున్నారు)

కాలకౌ: ఓరీ, కేశవా! అదిగో అరచుచున్నదిరో.

కేశ: ఈనాఁడు మీ గ్రహచార మంతగా బాగున్నట్లు తోఁచదు. కాలకౌ: ఏమోరా నాయనా! నీవు మాత్రము మాముండతో నామీద గొండెములు చెప్పకేమి. (ఇల్లు చేరుదురు)

కాలకం: వచ్చుచున్నావూ? రా, రా. (సమీపించును)

చంద్ర: (స్వగతము) అకటకటా! ఏమీ ధూర్తయైన యీ విప్రాంగన వర్తనము! ఈవిడయే నా యజమానురాలు గాబోలు.

కాలకం: దుర్మార్గుడా! నీ విల్లు వదలి యెంతసేపయినది? నీ కొఱకై పొయ్యార్పుకొని నేను గనిపెట్టుకొని యుండవలసినదా? ఈమధ్య నీకు బొత్తిగాఁ బ్రాయశ్చిత్త కర్మములు లేకుండ నున్నవి. నేఁడు నీకు మూఁడినది గానీ చెప్పు.

 	(కీర్తన: ఫరజు - త్రిశ్రగతి)

ఇంత పొద్దెక్కినదాక నీ వెక్కడ నుంటివి ఇంటికి రాక ॥ఇం॥

కాలకౌ: యాయవార మెత్తినాఁడ సంతపోయి శవాలను మోసికొచ్చినాఁడ ॥యా॥

కలకం: తెచ్చిన డబ్బేదో తెమ్ము నీ మ్రుచ్చుపోకిళ్ళను మెచ్చ రారమ్ము

కాలకౌ: మూడెమాడలం దెచ్చి నాడ నీతోడు నాకింకను దొరకలేదేవాడ

కాలకం: అట్లైన నే నూరుకోను నీపొట్ట బద్దలుచేసి నెట్టివేయకపోను (కొట్టుచున్నది)

కాలకౌ: అబ్బబ్బ నే నోర్వలేను యీ డబ్బునకు రేప యిబ్బడి ఈడ్చెదనే

కాలకం: నీ వింక జాగరూకతతో మెలంగకున్న నీగతి యింతియే.

కేశ: అమ్మా! కాలకంటకి నే డప్పుడే వదలి పెట్టినావే? ఇక్కడ చూడు. (చంద్రమతిని, లోహితాస్యుని చూపించును)

కాలకౌ: ఓరీ, కేశవా! నీ పుణ్యము, నీ వూరుకోరా! (గడ్డముఁ బట్టి బ్రతిమాలును)

కాలకం: ఇఁక నేనూరుకోను. ఈ నిర్భాగ్యురాలెవరు? చెప్పు. (కొట్టును)

కాలకౌ: (గట్టిఁగాఁ జేతులు పట్టుకొనుచు) నీకడుపుకడ, ఇంక చంపకే!

కాలకం: ఓరీ నీ చేతులు కాలిపోను! నీశక్తి మండిపోను! ముసలితనము వచ్చినను నీ కెంత మదమున్నదిరా! ఓ యెవరయ్య! నన్ను నామగఁడు చంపుచున్నాఁడు. రండయ్యా! (కేకలు వేయుచున్నది)

కాలకౌ: (నోరుమూయుచు) ఓసీ, నీపుణ్యము. అఱవకే. సుకుమారివి, నీ వింటిలోఁ బనిచేసుకోలేవని దాసిని దెచ్చినాడను. కాలకం: ఆ మాట మొదటనే యేడువరాదా?

చంద్ర: అమ్మా! కాలకంటకీ! ఇదియేమి న్యాయమమ్మా!

క. పతిఁ గడవ సతికి, లేదొక గతి యాతండెంత మనకుఁ గైవసమైనన్‌ మితి గలదు చనువునకు నీ గతిఁ బ్రతికూలతకుఁ బాలు కావలదమ్మా.

శా. ప్రత్యూషంబున లేచి నాథుని పదాబ్జాతంబుల్‌ వ్రాలుటో పత్యుద్దేశ మెఱింగి బోనముల సంబాళించుటో రాకకున్‌ బ్రత్యుత్థాన మొనర్చి మెచ్చఁ దగు సేవల్‌ సేయుటో కాకిటుల్‌ ప్రత్యాఖ్యాన మొనర్తురమ్మ సతమున్‌ బత్యాజ్ఞకున్‌ గేహినుల్‌?

మఱియు,

మ. పడతీ! నేనొక పాటిగాను వచియింపన్‌ నీవిభుండెంత నీ యడుగు దాటఁడ యేని బత్తి మిగులన్‌ హత్తించి బంగారమే యొడలెల్లన్‌ దిగువేయునట్లుగను నీ వోరంక ప్రొద్దెల్ల మే లడ పాలూనుము, కాళులొత్తు మటుగా దాసీవరుల్‌ వీచుమా.

కాలకం: ఓహో! నీ వెవ్వతివే? నాకు జక్కట్లు దిద్దుటకేనా నా మగండు నిన్ను దీసికొనివచ్చినది? ఓహో! నాకు దాసివై వచ్చి దొరసాని వైతివే నీకుఁ దెలిసిన మగనాలి వర్తనాలు మాకు దెలియవేమి? గూటికి వచ్చినదానవు చచ్చినట్లు పడియుండక శ్రీరంగనీతులు చెప్పుచు నా మాటలోఁ బడియున్న నా మగనిబుద్ధి చెడఁ గొట్టుచున్నావుగా.

కాలకౌ: చంద్రమతీ! నీ వెప్పుడు మాయావిదతో నిట్లు మాట్లాడరాదు. (రహస్యముగా) దీని నోటికి నూని కరణాలు, కాపులు గూడ వెఱచుచుచుందురు.

చంద్ర: అయ్యా! నే నూఱకున్నాను.

కాలకౌ: ఓసీ, యింటిదానా! నీకు నింత నిర్భయముగా మాట్లాడిన యీ దాసికిఁ దగిన పనులు నియమించి నీ కసి దీర్చుకొమ్ము.

కాలకం: అట్లయిన పద, నీ పనిన్‌ చెప్పెద. (అందరు నిష్క్రమింతురు) (పిమ్మట నక్షత్రక ద్వితీయుండై హరిశ్చంద్రుడు ప్రవేశించుచున్నాడు)

హరి: నక్షత్రేశ్వరా! నన్నింత యన్యాయము చేసెదవా? నక్ష: అడవులలో నన్నిన్నాళ్ళన్నమునకు నీళ్ళకును మొగము వాచునట్లు చేయుట నీది యన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన బత్తెము నేను తీసికొనుట యన్యాయ మయ్యెనేమి? యెట్లు?

ఉ. బత్తెము లేక త్రోవల విపత్తుల కోర్చుచుఁ దిండి కేనియున్‌ బొత్తుగా వాచిపోయి గృహమున్‌ విడి నీ వెనువెంట రాఁగ నీ తొత్తునె యింతకంటెను గతుల్మఱి మాకిఁక లెవె యేరికిన్‌ మెత్తనివానిఁ జూచు నెడ మిక్కిలి మొత్తగఁ జిత్తమౌఁ గదా!

హరి: నక్షత్రకా! మీ గురువుగారి పనిమీద నీవు నా వెంట వచ్చితివి కాని, నా కొఱకై వచ్చితివా? నా వలన బత్తెమే నీవు తీసికొనిన నీవు నీ గురువునకు జేసిన యుపకారమేమున్నది?

నక్ష: ఓయి దుర్మార్గుడా! ఏమన్నావు? నేను నా గురువునకు జేసిన యుపకారమేమనియా?

ఉ. ఆస దొరంగి ప్రాణముల కైన దెగించుచు నిట్టి బత్తెపుం గాసుల నాసచే దరువు కానిగ నీ పయి ఘోరకాననా వాస మొనర్చ నొప్పుకొని వచ్చుటె నాయుపకార మాతపో భ్యాసికి నా వలెన్‌ వటుఁడెవం డిటు నెత్తురుకూటికొప్పెడిన్‌

ఇప్పుడు నా గురుభక్తిని గూడ నధిక్షేపించుచున్నావుగా? నీ వేమైన ననుము. నీ భార్య నమ్మగా వచ్చిన ధనము బత్తెము క్రింద జెల్లవలసినదే. కాన నిక మా గురువుగారి ఋణమిప్పుడే యిచ్చివేయుము.

హరి: వటూత్తమా! నేనిప్పుడింత ధనమెక్కడినుండి తెత్తునయ్యా?

గీ. విమలశీలను నిల్లాలి విక్రయించి చేర్చిన ధనంబు నీ చేత జిక్కెను గద అవని స్వశరీరమాత్ర వైభవుఁడ నగుచు బ్రతుకు చున్నట్టి నేనెట్లు బత్తెమిత్తు?

నక్ష: నీ విట్టి నిర్భాగ్యుడ వనియే నేను దీపముండగనే చక్కంబెట్టుకొన్నాఁడ. ఓ హరిశ్చంద్రా! ఇటు వినుము.

గీ. నీకు రానున్న బత్తెంపు రూకలెటులో స్వీకరించితి నే నిల్లు సేరవచ్చు ముని ఋణమునకు మీరు మీరును బెనంగి తుదకు నే గంగలోనైన దుముక బొండు (పోవుచున్నాడు)

హరి: (చేయి పట్టుకొని) నక్షత్రకా! నీకిది బొత్తుగాఁ దగనిపని.

నక్ష: ఏమోయి చేయి పట్టుకొనుచున్నావు? నన్నుఁ గొట్టుదువా యేమి?

హరి: అయ్యా! నేనంత సాహసిని గాను.

నక్ష: కాకున్న నా చేయి విడువుము.

హరి: విడిచితిని. ఇంక నా సొమ్ము మీ గురువున కిచ్చి వేయుము.

నక్ష: హరిశ్చంద్రా! నే నిన్ని మాటలవాఁడను గాను.

క. అడియాస విడువు మిఁక నా యొడలన్‌ జీవంబు లున్న వొదమిన్‌ విడువన్‌ జెడనెంచి తేని నినునా బొడ నీ యడిదమున గోయ మీఁరో గొనుమీ.

హరి: నక్షత్రకా! ఇంతకన్న నేఁ జెడునదేమున్నది? నన్ను గూడ నమ్ముకొని మీ గురువు ఋణంబు రాబట్టుకొనుము.

నక్ష: నిన్నెవ్వరిచ్చటఁ గొందురు?

హరి: ఎవ్వరు గొనకున్న గడకుఁ గడజాతివానికైన నమ్మివేయుము.

నక్ష: సరి నిన్ను గాదననేల. (నడచును) (ద్విపద - కీరవాణి రాగము - ఆది తాళము)

 	అవధారుఁడయ్య యో యగ్రజులార

సవన దీక్షితులార క్షత్రియులార ద్రవిణేశు మించు నుత్తమ వైశ్యులార ప్రవిమల గుణగణ్య పాదజులార కడలాక్రమించి యొక్కట భూమి నేలి సడినున్న యా హరిశ్చంద్రుడు నేఁడు బానిసీడుగ నమ్మంబడుచున్న వాఁడు మాననీయుడు సత్యమార్గ ధీరుండు కోరిన ధనమిచ్చి కొనఁ దగుసుండి వారణాసి పౌరవరు లార రండి

(ఆకసమువంకఁ జూచి) ఏమీ! ఇతఁడెట్టి వాడఁనుచున్నారా?

సీ. తన మహీరాజ్యమంతయు గాధిసూతికిన్‌ దాన మిచ్చిన యట్టి ధర్మ మూర్తి నిజ యశశ్చంద్రికల్‌ నిఖిల దిక్కులయందుఁ బాఱఁజల్లిన యట్టి సారగుణుండు ముల్లోకములను సమ్మోదింప భేతాళు మద మడంచిన విక్రమస్థిరుండు అణుమాత్రమైన బొంకను మాట యెఱుగని యసమాన నిత్య సత్య వ్రతుండు గీ. ఏడు దీవుల నవలీల నేలినట్టి సాంద్ర కీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బానిసీడుగ నమ్మంగఁ బడెడు కొనుఁడు పౌరులార మహాధనోదారులార

హరి: ఎవరు కొనకున్నారు. ఇంకెంతని యఱిచెదరు? వీఁడెవఁడో కడజాతి వానివలె నున్నాఁడు. ఇటె వచ్చుచున్నాఁడు. ఉండుము.

(పిమ్మట వీర బాహు ప్రవేశించుచున్నాఁడు) వీరబాహు: (గేయము)

తొలగిపోనిండయ్య! దొరలు పెద్దింటోణ్ణి తెరచి చెప్పకుంటే పలువ పొమ్మంటారు ॥తొ॥ పబులు మీకుక్కల కట్టి వేస్కోండయ్యా ॥తొ॥ గబగబ బౌవంచు కఱవ వత్తుండయ్యా వాదనంటారు సూదోచ మంటారు నే కాచంత కల్లేసి కాటికి పోతుండ ॥తొ॥

నక్ష: హరిశ్చంద్రా! ఇంక నిన్నెవ్వరు కొందురు? వీర: దొరా! బానిసోణ్ణి అమ్ముతుండవా? నే గొంటానండీ, ధర చెప్పండి. నక్ష: చెప్పెదను గాని నీవు దూరముగా నుండి మాట్లాడుము. నే నిప్పుడు స్నానము చేయలేను. వీర: దూరంగానే వుండానుండి, చెప్పండి. హరి: నక్షత్రకా! నన్నీ కడజాతి వానికే యమ్మెదవా? వీర: కడజాతియేముంది, పెద్దింటోణ్ణి. నక్ష: హరిశ్చంద్రా! ఎవ్వరు గొనంకున్న నన్నేమి చేయమందువు? మొత్తము మీఁద నీవు నా కిచ్చు బత్తెమునకు దండుగ లేకుండ నా వలన బనిపుచ్చుకొనుచున్నావు. అఱచి యఱచి గొంతు పగిలిపోవుచున్నది. తిరిగి తిరిగి కాళ్ళు పడిపోవుచున్నవి. హరి: అయ్యా! వీనికే విక్రయింపుడు. నే నన్నిటికి సిద్ధుఁడనై యున్నాను. నక్ష: ఓరీ! వీరబాహూ! నీ కీతఁడు కావలయునన్న క. దంతావళంబు పయి బల వంతు డొక్కండు నిలిచి పైకిన్‌ రతనం బెంతటి దవ్వుగ రువ్వునో యంతటి యర్థం బొసంగుమా కొని పొమ్మా! వీర: ఓరబ్బో! సాలదాకుండదే! నక్ష: ఇఁక నేమనుకున్నావు? వీరబాహూ! నీచేతఁ కాదు పోరా. వీర: అయ్యోరూ! యిట్లుండానని సూత్తుండావు కామసు! డబ్బిత్తా రా, రావయ్యా అరిశ్చంద్రుడా. నక్ష: హరిశ్చంద్రా! ఇఁకబొమ్ము. నీఋణము తీఱినది. హరి: నక్షత్రేశ్వరా! నేఁనిక సెలవు పుచ్చుకొనియెద. ఎక్కడనో నిశ్చింతతోఁ దపం బాచరించుకొను నీవు గూడ నా మూలమున ఘోరారణ్యములఁ బడరాని పాట్లు పడితివి. క్షమింపుఁడు. వటూత్తమా! నమస్కారము. నక్ష: (స్వ) అయ్యో! నే నిప్పుడేమని యీ ధర్మమూర్తికిఁ బ్రత్యుత్తర మిచ్చెదను? ఇట్టి పరమ శాంతుని సత్యవంతుని నేనెంతఁ జేసితిని. (ప్రకాశముగా) హరిశ్చంద్రా! నేనే నీ కన్ని విధములఁ గష్టములఁ దెచ్చి పెట్టిన దుష్టుఁడను. నేను నిన్నడుగు కొనవలసిన క్షమాపణములు నీవు నన్నడుగు కొనుచున్నావు. అయినను బుట్టినదాదిననన్య సామాన్యమైన సత్యనిష్ఠాగరిష్ఠతచేఁ బరిశుద్ధమైన నీ మానసమున కింతటి క్షోభ దెచ్చి పెట్టిన నాయట్టి ఘోరకర్ముడు శిక్షార్హుండు గాక క్షమాపణమునకు దగునా? హరి: అయ్యో, విప్రోత్తమా! శిక్షించుటకుఁ గాని, క్షమించుటకుఁ గాని నేనెంతటి వాఁడను. వటుశిఖామణీ! నీకిదే వందనము. (నమస్కరించును)

నక్ష: (లేవనెత్తి)

చ. కలతఁ వహింపకయ్య కల కాలము కష్టము లుండబోవు కా వలసిన కారణార్థము లవంబును దప్పునె? నా యకృత్యముల్‌ దలఁపున నుంచకయ్య విహితమ్ము ననున్‌ క్షమింపుమయ్య, నా కలుషమె యింత కింత కధికమ్మయి నన్వధియింపకుండునే?

హరి: అయ్యా! మీరు చేసిన దేమున్నది? నా పూర్వభవసంచిత పాపఫలమే నన్నీ కష్టంబులకుఁ దెచ్చె.

నక్ష: రాజేంద్రా! నిత్య సత్య సంధుడవైన నీ కెప్పటికిని గష్టములు లేవు చూడు.

మ. కడకన్‌ గావలెనంచు సత్యఫలముం గాంక్షించి నీవే యొడం బడి కైకొన్న విపత్తులం బరితపిం పన్‌ గూడదయ్యా కడుం గడుదోసంబని నేనెఱింగియు వృథా క్రౌర్యంబునన్‌ నీ యెడన్‌ జెడుగు ల్సేయుట కెంత గుందితినొ నాచిత్తంబె తా సాక్షియౌ!

హరి: నక్షత్రేశ్వరా! దుఃఖింపకుము, పరమేశ్వరుఁడు నిన్ను రక్షించుగాక. వటూత్తమా! నాకింక సెలవొసంగుఁడు.

వీర: రావయ్యా! అరిశ్చంద్రుఁడా! కుండెత్తుకుంటావా!

హరి: అయ్యా, వచ్చుచున్నాను.

వీర: అరే అబ్బిగా! మద్దాసూ! ఇంటికాడికి మనోణ్ని తీసుకుపో, బామ్మడికి సొమ్మిప్పిస్తాను.

నక్ష: (స్వ) అయ్యో! నేనెంత కపట కృత్యముల నభినయించితిని? నన్నీ యకార్యమునకు నియమించునపుడు భగవానుడైన విశ్వామిత్రుడు నేనిట్టి రట్టునకు బాలగుదునని తలంపడయ్యె గదా! ఇనుమును బట్టి యగ్నికి సమ్మెట పెట్టనట్లే గురూత్తమా! మీ వలన గదా నేనిట్టిపని కొడిగట్టవలసి వచ్చె. మీ యాజ్ఞానువర్తినై నిత్యసత్యకీర్తి యగు హరిశ్చంద్ర చక్రవర్తికి లెక్కలేని యిక్కట్టులఁ జేచేతఁ దెచ్చిపెట్టి నేను మీఁకు జెల్లించవలసిన గురుదక్షిణ నిశ్శేషముగా జెల్లించు కొంటిని గాని నేనిప్పుడన్ని విధముల దిక్కుమాలిన వాఁడనై ప్రపంచమునకు రోసి చావక బ్రతికియు న్నాను. ఇంకను నాకు దపం బెందులకు? ఎన్ని మన్వంతరములు తపంబొనరించినను నా యీ దుష్కృతి నిష్కృతి యగుటెట్లు? హా దీనబంధూ!

గీ. గురుతిరస్కృతి తగదనుకొనుట యొకటి యతని కార్యంబు నెఱవేర్తుననుట యొకటి యింత నిందకు నన్‌ ద్రోచె నేను జనినఁ పాయ కది నిల్చు నెన్నిక కల్పములకైన

నే నిప్పుడేమి సేయుదు? నాకింక దిక్కెవరు? నా పాపంబునకుఁ బ్రాయశ్చితమెద్ది? భగవానుఁడా విశ్వపతీ!

శా. ఏయే ధర్మము లాచరింప నగు నేయే క్షేత్రము ల్మెట్టనౌ నేయే తీర్థములందుఁ గ్రుంక నగు నేయే దేవులం గొల్వనౌ నాయీ పాపము దప్పిపోవుట కనంతా దీనబంధూ! కృపా ళూ! యాపన్నుఁడ నీ వె దిక్కగుము కొల్తున్నిన్ను విశ్వేశ్వరా!

ఇంక దుఃఖించిన నేమి ప్రయోజనము? మా యుపాధ్యాయుడైనను దురుద్దేశముతో హరిశ్చంద్రుని బాధించుచున్నా డనుకొనను. తన వైరియగు వసిష్ఠుని సాధించుటకింత సేయుచున్నాడు. ఏది యెట్లున్నను మహానుభావుడైన హరిశ్చంద్రుని దుఃఖములు తలంచినచో వజ్రకాఠిన్య హృదయములు సైతము నవనీత సమానములు కాకపోవు. పాపమా లోహితాస్యుడా కాలకౌశికుని సేవానిర్బంధములో నెట్లున్నాడో! దైవమా! సర్వదా హరిశ్చంద్రునకుఁ దోడుపడుము. (ప్రకాశముగా) వీరబాహూ! ధనమిప్పింతువు గాని పద.

వీర: అయ్యోరూ రండి.

(నిష్క్రమింతురు)

ఇది పంచమాంకము.