సత్యశోధన/రెండవభాగం/29. వెంటనే బయలుదేరి రమ్మని పిలుపు

వికీసోర్స్ నుండి

29. వెంటనే బయలుదేరిరమ్మని పిలుపు

మద్రాసు నుండి కలకత్తా వెళ్లాను. కలకత్తాలో నా కష్టాలకు అంతు లేదంటే నమ్మండి. ఆచట గ్రేట్ ఈస్టరన్ హోటల్లో దిగాను. నేనక్కడ ఎవర్నీ ఎరగను. హోటల్లో డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికా ప్రతినిధి మిస్టర్ ఎల్లర్ థార్పుతో పరిచయం కలిగింది. వారి బస బెంగాల్ క్లబ్బులో. వారు నన్ను అచ్చటికి రమ్మని చెప్పారు. అచటి డ్రాయింగ్ రూములో భారతీయులకు ప్రవేశం లేదను సంగతి వారికి తెలియదు. అప్పుడే వారికి ఆ నిషేధం విషయం తెలిసింది. నన్ను వారు తమ గదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ నల్లవారి మీద తెల్లవారు చూపే ఈర్ష్యకు వారు విచారం వ్యక్తం చేశారు. నన్ను లోపలికి తీసుకొని వెళ్లజాలనందుకు క్షమించమని అన్నారు.

వంగ దైవం సురేంద్రనాధ బెనర్జీగారిని దర్శించాలి. వారి దర్శనానికి వెళ్లాను. అప్పుడు వారి చుట్టూ చాలామంది ఉన్నారు. వారు యిట్లా అన్నారు. “మీ మాట యిక్కడ ఎవ్వరూ వినరని నా భయం. మా పాట్లన్నీ మీరు చూస్తున్నారు గదా! అయినా కొద్దో గొప్పో ప్రయత్నించి చూడాలి. యిందుకు మీకు మహారాజుల మద్దతు అవసరం. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ ప్రతినిధిని చూడండి రాజాసర్ ప్యారమోహన్ ముఖర్జీగారిని, మహారాజా టాగోరు గారిని కలవండి. వీరిరువురు ఉదారులు. సార్వజనిక కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటూ వుంటారు.” అని అన్నారు. నేను ఆసజ్జనుల్ని సందర్శించాను. కాని అక్కడ పప్పులుడకలేదు. యిద్దరూ కలకత్తాలో సభ చేయడం సులభసాధ్యం కాదనీ, ఏమైనా చేయగలిగితే శ్రీ సురేంద్రనాధ బెనర్జీ గారే చేయగలరని చెప్పారు. నా పని కష్టతరం కాసాగింది. అమృత బజార్ పత్రిక ఆఫీసుకు వెళ్లాను. అక్కడ నన్ను చూచిన సజ్జనులంతా నేనొక దేశ దిమ్మరినని భావించారు. వంగవాసి ప్రతికాధిపతి ఇంకో మెట్టు పైకెక్కాడు. అక్కడ ఒక గంట సేపు వేచి వుండవలసి వచ్చింది. ఆయనతో మాట్లాడటానికి చాలామంది వచ్చారు. వాళ్లనందరినీ పంపించిన తరువాత కూడా వారు నన్ను కన్నెత్తి చూడలేదు. ఒక గంట సేపు ఆవిధంగా గడిపాను. చివరికి గత్యంతరం కనబడక నా విషయం చెప్పివేద్దామని ఉద్యుక్తుడనయ్యాను. వెంటనే ఆయన అందుకొని “నాకు ఎన్ని పనులున్నాయో మీకు కనిపించడం లేదా? మీవంటి వాళ్లు యిక్కడ వేలకు వేలు. మీరిక్కడ నుండి వెళ్లిపోవడం చాలా మంచిది. మీ మాట నేను వినదలుచుకోలేదు” అని అన్నాడు. నాకు కొంచెం కోపం వచ్చింది. కాని ఆ సంపాదకుని అవస్థ అర్ధం చేసుకున్నాను. వంగవాసి పత్రికా ఖ్యాతిని గురించి విన్నాను. అక్కడికి వచ్చి పోయే జన ప్రవాహాన్ని కూడా చూచాను. ఆ వచ్చిపోయేవారంతా ఆయనకు పరిచితులు. వారి పత్రికకు వార్తల లోపం లేదు. ఆరోజుల్లో దక్షిణ ఆఫ్రికాను గురించి చాలామంది వినియుండలేదు కూడా. ప్రతిరోజు చాలామంది వచ్చి తమ తమ కష్టాల్ని వారికి వినిపిస్తూ వుండేవారు. ఎవరి కష్టం వారికి ముఖ్యంగదా! వచ్చిన వారంతా సంపాదకునికి ఎదురుగా కూర్చుంటారు. వాళ్లందరినీ ఊరడించడం ఎలా? వారు పత్రికా సంపాదకుని మాటకు గొప్పశక్తి కలదని భావిస్తారు. కాని గడపదాటితే తన మాట చలామణి కాదని ఆ పత్రికా సంపాదకునికి బాగా తెలుసు.

నేను అధైర్యపడలేదు. యితర పత్రిక సంపాదకుల్ని వెళ్లి కలిశాను. నా అలవాటు ప్రకారం ఆంగ్లో ఇండియన్ పత్రికా సంపాదకుల్ని కూడా కలిశాను. నేను వారితో చాలా సేపు మాట్లాడాను. నేను మాట్లాడిందంతా వారు తమ పత్రికలలో ప్రకటించారు. ఇంగ్లీషుమన్ పత్రికా సంపాదకుడు సాండర్సు గారు నన్ను తన మనిషిగా చూచుకున్నారు. తన ఆఫీసును, తన పత్రికను నా వశం చేశారు. దక్షిణ - ఆఫ్రికాను గూర్చి ప్రధాన వ్యాసాల్లో నా యిష్టం వచ్చినట్లు మార్పులు చేయుటకు అంగీకరించారు. వారికి నాకు గొప్ప స్నేహం కుదిరిందని చెప్పడం అతిశయోక్తి కానేరదు. వారు తమ శక్తి కొద్దీ నాకు సాయం చేస్తామని మాట యిచ్చారు. దక్షిణ - ఆఫ్రికాకు వెళ్ళిన తరువాత కూడా తమకు జాబు వ్రాయమని చెప్పారు. నాకు చేతనైనంత చేస్తాను. అని వారు మాట యిచ్చారు. తమ మాటను తుచ తప్పకుండా పాటించారు. ఆరోగ్యం చెడిపోనంతవరకు నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే వున్నారు. నా జీవితంలో అనుకోకుండా ఏర్పడిన ఇటువంటి తీయని స్నేహాలు ఎన్నో వున్నాయి. నా మాటల్లో అతిశయోక్తులు లేకపోవడం, సత్యపరాయణత్వం నిండివుండటం సాండర్సు గారి స్నేహానికి కారణం. వారు నన్ను శల్య పరీక్ష చేశారు. దక్షిణ - ఆఫ్రికాలోని తెల్లవారి దోషాలు ఖండించడంలోను, సుగుణాలు చెప్పడంలోను కూడా నేను వెనుకాడలేదని వారికి బోధపడింది.

ప్రతి పక్షికి న్యాయం చేయడం వల్ల మనం త్వరగా న్యాయం పొందగలమని నా అనుభవం చెబుతూ వున్నది. ఇట్లా తలవని తలంపుగా సాయం చేకూరడం వల్ల కలకత్తాలో కూడా సభ జరుపవచ్చుననే ఆశ కలిగింది. అందుకోసం కృషి చేస్తుండగా దర్బను నుండి ఒక టెలిగ్రాం వచ్చింది. “జనవరిలో పార్లమెంటు సమావేశం జరుగుతున్నది వెంటనే బయలుదేరి రండి” అని ఆ టెలిగ్రాంలో వుంది. ఆ కారణం వల్ల వెంటనే దక్షిణ - ఆఫ్రికా వెళ్లవలసి వున్నదని పత్రికలో ప్రకటించి కలకత్తా విడిచి పెట్టాను. మొదటి స్టీమరులో నాకు ప్రయాణ సౌకర్యం కల్పించమని దాదా అబ్దుల్లా గారి ఏజంటుకు బొంబాయికి తంతి యిచ్చాను. దాదా అబ్దుల్లా గారు “కుర్‌లేండ్” అను స్టీమరు కొన్నారు. దానిలో కిరాయి లేకుండా నన్ను నా కుటుంబ సభ్యుల్ని తీసుకు పోతామని పట్టుపట్టారు. నేను ధన్యవాదాలు చెప్పి అందుకు అంగీకరించాను. కుర్‌లేండ్‌లో నా ధర్మపత్నిని, నాయిద్దరు పిల్లల్ని కీర్తిశేషుడగు మా బావగారి కుమారుణ్ణి తీసుకొని రెండవసారి దక్షిణ ఆఫ్రికాకు బయలుదేరాను. యీ స్టీమరుతో బాటు “నాదరీ” అను మరో స్టీమరు దక్షిణ ఆఫ్రికాకు బయలుదేరింది. దీనికి కూడా ఏజంటు దాదా అబ్దుల్లాయే. ఈ రెండు స్టీమర్లలో మొత్తం ఎనిమిది వందల మంది యాత్రికులు వున్నారు. అంతా ట్రాన్సువాలు వెళ్లేవారే.


* * *