సత్యశోధన/నాల్గవభాగం/46. కక్షిదారులు అనుచరులుగా మారారు

వికీసోర్స్ నుండి

46. కక్షిదారులు అనుచరులుగా మారారు

నేటాలు మరియు ట్రాన్సువాలుల వకాల్తాలో ఒక తేడా వున్నది. నేటాలులో అడ్వొకేట్‌కు మరియు అటార్నికి తేడా వున్నప్పటికి యిద్దరూ కోర్టులన్నింటియందు సమానంగా వకాల్తాకు పూనుకోవచ్చు. ట్రాన్సువాలులో బొంబాయి వలెనే వ్యవహారం సాగుతున్నది. అక్కడ కక్షిదారుకు సంబంధించిన వ్యవహారాలన్నీ అడ్వొకేట్ అటర్ని ద్వారానే జరుగుతాయి. నేటాలులో నేను అడ్వకేట్‌గా ధృవీకరణ పత్రం తీసుకున్నాను. ట్రాన్సువాలులో అటార్నీ పత్రం పుచ్చుకున్నాను. అడ్వొకేట్‌గా వుంటూ హిందు దేశస్థులతో నాకు తిన్నగా సంబంధం వుండదు. తెల్లవాడైన అటార్నీ నాకు కేసులు అప్పగించే స్థితి దక్షిణ ఆఫ్రికాలో లేదు. ట్రాన్సువాలులో వకాల్తా చేస్తూ మేజిస్ట్రేటు కోర్టుకు నేను చాలా సార్లు వెళ్ళాను. ఒక పర్యాయం విచారణలో వున్న ఒక కేసులో నా కక్షిదారు నన్ను మోసం చేశాడని తేలింది. అతని కేసు అబద్ధాల పుట్ట. అతడు బోనులో నిలబడి వణికిపోయాడు. పడిపోయే స్థితిలో వున్నాడు. నేను మేజిస్ట్రేటును “అయ్యా. నా కక్షిదారుకు కఠిన శిక్ష విధించండి” అని కోరి కూర్చున్నాను. ప్రతిపక్షానికి చెందిన వకీలు నివ్వెరబోయాడు. మేజిస్ట్రేటు సంతోషించాడు. కక్షిదారును నేను బాగా కోప్పడ్డాను. ముందుగనే అబద్ధం కేసుతీసుకోనని అతడికి గట్టిగా చెప్పాను. అతడు అందుకు అంగీకరించాడు కూడా. అందువల్ల అతడికి శిక్షవిధించమని కోరినందున అతడు కోపం తెచ్చుకోలేదు. ఏదిఏమైనా నా యీ వ్యవహార ప్రభావం నా వృత్తిమీద పడలేదు. కోర్టులో నా పని సులభమైపోయింది. సత్యనిష్టవల్ల వకీలు మిత్రుల దృష్టిలో నాకు గౌరవం పెరిగింది. వారందరి ఆదరణ పొందగలిగాను. వకీలు వృత్తి సాగిస్తున్నప్పుడు కక్షిదారు దగ్గర గాని, వకీలు దగ్గర గాని నా అజ్ఞానాన్ని దాచేవాణ్ణికాదు. నాకు బోధపడనప్పుడు మరో వకీలు దగ్గరకు వెళ్ళమని కక్షిదారుకు నేనే సలహా యిచ్చేవాణ్ణి. అతడు నన్నే పనిచేయమంటే మరో అనుభవజ్ఞుడైన వకీలు సలహా పొందుతానని చెప్పేవాణ్ణి. ఈ విధంగా వ్యవహరించడంవల్ల కక్షిదారులు నన్ను విశ్వసించేవారు. పెద్ద వకీలు దగ్గరకు వెళ్ళి సలహా తీసుకునేందుకు అయ్యే వ్యయం కూడా వారే సంతోషంగా భరించేవారు. అట్టి వారి ప్రేమ, విశ్వాసాలు నా ప్రజాసేవకు బాగా ఉపకరించాయి. గత ప్రకరణంలో దక్షిణ ఆఫ్రికాలో నా వకీలు వృత్తి లక్ష్యం ప్రజా సేవయేనని తెలియజేశాను. ప్రజా సేవ చేయడానికి కూడా ప్రజల విశ్వాసం పొందడం చాలా అవసరం. డబ్బు తీసుకొని నేను వకీలు పని చేసినా ఉదార హృదయంతో ప్రజలు నా పనిని సేవా కార్యంగానే భావించారు. జైళ్ళకు వెళ్లవలసి వచ్చినప్పుడు చాలా మంది వ్యక్తులు ఆ విషయం ఏమిటో తెలుసుకోకుండానే నామీద గల ప్రేమ విశ్వాసాల కారణంగా సిద్ధపడ్డారు. ఈ విషయాలు వ్రాస్తున్నప్పుడు వకీలు వృత్తికి సంబంధించిన ఎన్నో మధుర స్మృతులు నా కలాన్ని ఆవహిస్తున్నాయి. చాలామంది కక్షిదారులు నాకు మిత్రులుగా మారిపోయారు. ప్రజా సేవలో నాకు నిజమైన అనుచరులుగా వుండి నా కఠోర జీవితాన్ని సరళం చేశారు.