సత్యశోధన/నాల్గవభాగం/26. సత్యాగ్రహం పుట్టుక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

26. సత్యాగ్రహం పుట్టుక

జోహన్సుబర్గులో ఏదో ఒక ఘట్టం నా కోసం జరుగుతూ ఉంటున్నదని అనిపించసాగింది. ఆత్మశుద్ధి కోసం నేను చేసిందంతా సత్యాగ్రహానికి ముందు జరిగిన ఏర్పాటు అనిపించింది. బ్రహ్మచర్య వ్రతానికి పూనుకొనేవరకు నా జీవనంలో జరిగిన ముఖ్య ఘట్టాలన్నీ అప్రత్యక్షరూపంలో నన్ను సత్యాగ్రహానికి సిద్ధం చేస్తాయనని ఇప్పుడు నాకు తోస్తున్నది. ‘సత్యాగ్రహం’ అను శబ్ద ఆవిర్భావానికి ముందే ఆ వస్తువు పుట్టుక జరిగిందన్నమాట. ఆ సమయంలో అది ఏమిటో నాకు తెలియదు. కాని పాసివ్‌రెజిస్టెన్స్ అను ఆంగ్లశబ్దం ద్వారా దాన్ని తెలుసుకోసాగాను. ఇంగ్లీషువాళ్ళ ఒక సభలో ఈ శబ్దానికి వాళ్ళు తీసుకుంటున్న సంకుచిత అర్థం ఏమిటో గ్రహించాను. అది బలహీనుల ఆయుధం అని వారు భావించారు. అందు ద్వేషానికి అవకాశం ఉన్నది. దాని చివరి అంశం హింసారూపంలో బహిర్గతం కావచ్చు. ఈ విధమైన వారి భావాన్ని నేను ఖండించవలసి వచ్చింది. హిందూ దేశస్థుల సంగ్రామం యొక్క యదార్థ స్వరూపాన్ని వారికి తెలియజేయవలసి వచ్చింది. హిందూ దేశస్థులికి ఈ సంగ్రామ స్వరూపం బోధపరిచేందుకు క్రొత్త శబ్దాన్ని సృష్టించవలసి వచ్చింది.

అందుకు తగిన మంచి శబ్దం స్ఫురణకు రాలేదు. తగిన శబ్దం కోసం బహుమతి నిర్ణయించి ఇండియన్ ఒపీనియన్ పత్రికలో ప్రకటించి పాఠకులకు పోటీ పెట్టాము. ఈ పోటీ ఫలితంగా మగన్‌లాల్ గాంధీ సత్ - ఆగ్రహం రెండింటికీ సంధి కలిపి ‘సదాగ్రహం’ అను శబ్దం వ్రాసి పంపాడు. బహుమతి అతనికి లభించింది. కాని సదాగ్రహం అను శబ్దం ఇంకా స్పష్టంగా లేదని భావించి నేను సత్యాగ్రహం అని మార్చాను. గుజరాతీలో ఇది పోరు అను అర్థంలో ప్రచలితం అయింది.

ఈ సంగ్రామ చరిత్రయే దక్షిణ ఆఫ్రికాలో సాగిన నా జీవనంలో నేను కావించిన సత్యశోధన లేక సత్య ప్రయోగాల చరిత్ర అని చెప్పవచ్చు. ఈ చరిత్ర (ఎక్కువ భాగం) నేను యరవాడ జైల్లో వున్నప్పుడు వ్రాశాను. ఇదంతా నవజీవన్ పత్రికలో ప్రకటించబడింది. తరువాత అది దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్ర అను పేరిట విడిగా పుస్తకరూపంలో ప్రచురించబడింది. దాని ఆంగ్లానువాదం శ్రీ బాల్‌జీ గోవింద్‌జీ దేసాయి “కరెంట్ థాట్” లో ప్రచురించడం కోసం చేస్తున్నారు. దాన్ని త్వరగా ఇంగ్లీషులో పుస్తక రూపంలో ప్రకటించాలని నేను సూచించాను. దక్షిణ ఆఫ్రికాలో నేను చేసిన పెద్ద ప్రయోగాలను గురించి తెలుసుకోదలచిన వారికి అది అందాలని నా ఉద్దేశ్యం.

గుజరాతీ పాఠకులు ఆ పుస్తకం చదివియుండకపోతే తప్పక చదవమని సిఫారసు చేస్తున్నాను. ఆ చరిత్రలో పేర్కొనబడ్డ ప్రధాన కధా భాగాన్ని వదిలి దక్షిణ ఆఫ్రికాలో నేను చేసిన మిగతా చిన్న పెద్ద నా వ్యక్తిగత ప్రయోగాలను గురించి వచ్చే ప్రకరణాల్లో వ్రాస్తాను. అవి పూర్తికాగానే హిందూ దేశంలో చేసిన ప్రయోగాలను తెలియజేయాలని భావిస్తున్నాను. అందువల్ల ప్రయోగాల సందర్భక్రమాన్ని సరిగా ఉంచుకోవాలని భావించేవారు. దక్షిణ ఆఫ్రికా చరిత్రకు సంబంధించిన ప్రకరణాలను ఎదురుగా ఉంచుకోవడం అవసరం.