శివపురాణము/సతీ ఖండము/సతిని శివుడు తల్లిగా తలపోయుట

వికీసోర్స్ నుండి

అదేకల్పం జరుగుతూండగా, యుగాలు మారుతున్నాయి. అట్టి ఒకనొక త్రేతాయుగంలో - సతీశివ దంపతులు, ఉద్యానవన విహారంలో ఉండగా, వానరులు కొందరు సుగ్రీవాజ్ఞ గైకొని - శ్రీరామపత్నియైన సీతను వెదుకుతూ ఇటువచ్చామని చెప్పారు. రాముడు చింతాక్రాంతుడై నట్లు చెప్పారు. అది విన్న సతీదేవి, 'శ్రీ రాముడు నారాయణాంశతో జన్మించాడంటారే! ఒక సామాన్య క్షత్రియుడిలా అలా సతికోసం విచారిస్తూ ఉన్నాడూ అంటే, ఎంత అర్ధరహితంగా ఉన్నదో కదా నాధా!" అంది.

"కాదు దేవీ! ఒకానొక సంధర్భంలో అది నారదుడు ఇచ్చిన శాప ప్రభావం! నాడు వైష్ణవ మాయామహిమ చూపనెంచిన ఫలితం!" అన్నాడు శివుడు.

సతీదేవి నమ్మలేదు. చూచి వస్తానన్నది.

"వద్దు సతీ! అసలే శ్రీరాముడు సతీ వియోగ దుఃఖితుడై ఉన్నాడు. ఈ సమయంలో నీవు వెళ్తే పరాభూతవవుతావు!" అంటూ హెచ్చరించినా వినకుండా బయల్దేరింది సతీదేవి.

దారిలో ఆలోచన మార్చుకుని, తానే సీతలా రూపుదాల్చి శ్రీరాముని పరీక్షించ సంకల్పించింది.

ఆమెను చూస్తూనే శ్రీరాముడు ఒకే ఒక్కమాట అన్నాడు - శ్రీరాముడు... దైవమాయనూ - రాక్షసమాయనూ అంత కానలేనివాడు కాడు తల్లీ! అమ్మా! దాక్షాయణీ! నిన్ను ఎరుగుదును. శివునిపత్నివై ఉండి, ఈ సీత వేషమేల దాల్చావు?" అనేసరికి సిగ్గుపడి, చటుక్కున అక్కడినుండి అంతర్హితురాలైంది సతీదేవి.

అది అంతా దివ్యదృష్టితో చూసినప్పటికీ - సర్వేశ్వరుడు ఏమీ ఎరగని వాడిలా "రామపరామర్శ ఏమైంది?" అని అడిగాడు.

తడుముకోకుండా సతీదేవి అబద్ధం ఆడేయ సంసిద్ధురాలైంది - ఏమీ మాట్లాడలేదని ముక్తసరిగా అంది.

శివుడు ముక్కున వ్రేలేసుకున్నాడు. "ఔరా! ఈ స్త్రీలు ఎంతకైనా తగుదురు! సర్వసాక్షిని - సర్వవ్యాపినైన నన్నే మాయజేయ బోయిందే ఈ మానిని! నేటినుండి - స్త్రీకి అబద్ధమాడుట సహజ లక్షణమై పరిణమించును గాక! భర్తనైన నా దగ్గరే దాపరికానికి ప్రయత్నించిన సతీ! మహాతల్లీ! నేటినుండి నీవు నాకు భార్యవు కావు! తల్లితో సమానంగా జమ! త్రిమూర్తులమైన మేము రూపానికి తేడాగా ఉన్నా, మాలో ఏ భేదాలూ లేవు! నారాయణుడే నిన్ను అలా పిలిచాక నా సంబోధన వేరే విధంగా ఎందుకు ఉంటుంది? ఇకపై నీకు నేను భర్తను కాను" అని ఎంతో మనో వేదనతో శాపం అనలేని - శాపం కాని శాపం వంటి మాటలాడి, తపోనిష్ఠలో మునిగిపోయాడు.

ఈ ప్రకారం జరిగిన నాటినుండి పరమశివుడామెయందు కామవిముఖుడై, నిశ్చల చిత్తముతో నిజంగానే తపమాచరించడం చూశాక, సతీదేవి వికల మనస్కురాలైంది.

తెలిసో - తెలియకో చేసిన తన తప్పు మన్నించమని వేడుకుంది. "సత్యనిష్ఠ తప్పిన ఎవరికైనా క్షమ ఉంటుందేమో గాని, ఉమ వైనప్పటికీ - నా సతివైనపట్టికీ నన్నే ఏమార్చజూచిన నిన్ను క్షమించను" అన్నాడు ఉమాపతి.

నానాటికీ సతీదేవి దిగులు అధికం కాసాగింది. ఆమె మనో వేదన చూసిన ఆశరీరవాణి "సతీ! నీ పతివ్రతా ధర్మాచరణము ఏమైనది? కపటమున నీవు నారాయణాంశ సంభవుని వంచింప మాయసీతగా మారితివి! జగత్పోషకుడైన శ్రీరాముడికి - ఏకపత్నీ వ్రతుడికి తన సతి ఎవరో - పరసతి ఎవరో తెలీదని నీవు భావించడం అజ్ఞానమో, అసాధారణమో అయిఉండాలి! పోనీ! జరిగింది జరిగినట్లు పతితో చెప్పి వుండాల్సింది. పరమేశుడు మహాయోగి. ఎంత కామేశుడో అంత యోగీశుడు కూడా! అది నీకు తెలిసీ అబద్ధం ఆడి, ఇంతకాలం స్త్రీ జాతికి లేని కళంకం.. ఆపాదించడమే కాక, సహజలక్షణంగా మార్చేస్తివి! ఇక ఈ దేహంతో నీవు పరమశివునితో రమించడమనేది కల్ల! ఆయన ఇంకా నిన్ను సతిగా ఏలుకోవడమనేది నీ భ్రమ" అని స్పష్టం చేసేసింది.

విధి ఇట్లుండ తప్పింప ఎవ్వరివశం?.. అని తత్కాలోపశమనం చెంది, ఊరకొంది సతి.

శ్రీ సదాశివుని మహిమలుగాని, సంకల్పాలు గాని, శాపాను గ్రహాలు గాని సంపూర్ణంగా తెలియగల మహా మహితాత్ములు, అందుకు సమర్థులైన పండితోత్తములు ఎవరున్నారు? సహచరియై కాపురం చేసే సతీదేవికే సదాశివుడు అర్ధంకాకపోగా, మనం ఎంత?