సంపూర్ణ నీతిచంద్రిక/సోమశర్మ తండ్రి కథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సోమశర్మ తండ్రి కథ

ఒకానొక బ్రాహ్మణకుమారుడు విద్యాభ్యాసము చేయుచు నొక బ్రాహ్మణుని యింట దద్దినపు భోజనముచేసి వచ్చుచుండెను.అతనికి వారు కొంత పేలాలపిండి యొసగిరి. ఆతడది యొక కుండలో నుంచుకొని తనయొద్ద బెట్టుకొని భుక్తాయాసము దీఱుటకై యొక యరుగుమీద బండుకొని నిదురవోయెను. అపుడు మితిలేని కోరిక లాతని మనసున గలుగ జొచ్చెను.

"ఇపుడు నాదగ్గఱ బేలాలపిండి యున్నదిగదా! నేను దీనిని విక్రయించి యొక పాడిమేకను గొనియెదను. దానికి రెండు పిల్లలు గలుగును. ఆ రెండును గొంతకాలమునకు రెండేసి పిల్లల నీనును. ఆనాలుగింటికి నెనిమిది పిల్లలు పుట్టును. ఈవిధముగా గొంతకాలమునకు వేలకొలదియు మేకలగును. తరువాత వాని నమ్మి నూఱావుల గొందును. అవి ప్రతి సంవత్సరము నీనుచుండును. కొన్ని సంవత్సరములకు వేలకొలది సంఖ్యగల యావులతోను, బెయ్యలతోను, కోడెలతోను దొడ్డి నిండియుండును. కొన్నికోడెల నరకలు గట్టించి దున్నించి విస్తారమయిన పంట పండించి యాధాన్యముల నమ్మివేయుచుందును. కొన్నికోడెలను విక్రయించి మఱికొంత ధనము సంపాదింతును.

ఈప్రకారముగా సంపాదించిన ధనముం జూచి "నీకు గన్యనిచ్చెద" మని యనేకులు వచ్చెదరు. వారిలో గులంబును రూపంబును, గుణమును గలిగిన కన్య నెంచికొని పెండ్లియాడి యామెతో సంసారము చేయగా నొకకుమారుడు పుట్టును. ఆబాలునకు సోమశర్మయని పేరువెట్టుదును. కొన్ని నెలలయిన తరువాత వానికి బంగరు మువ్వలమొలత్రాడు, రావిరేక మురుగులు, గొలుసులు, అందెలు మొదలయిన నగలుపెట్టి యాదరముతో జూచెదను. వా డాడుకొనుచు నల్లరిచేయు సమయమున నేను పనితొందరలోనుండి పిల్లవానిం దీయుమని నాభార్యను బిలిచెదను ఆమెయు నేదోపనిలోనుండుట వలన నాలస్యము గావచ్చును. ఆలస్య మైనందులకు గోపగించి యామె నీకఱ్ఱతో గొట్టెదను" అని యాలోచించుచు బేలపిండి తినుటకు గుక్కలు మొదలగునవిరాకుండ బెదరించుటకు దగ్గఱనుంచుకొన్న కఱ్ఱగిరగిర ద్రిప్పికొట్టెను. ఆదెబ్బతగిలి పేలపిండి యున్నకుండ పగిలిపోయి పిండియంతయు జెదరి మంటిపాలయి పోయెను. దానితో మెలకువవచ్చి, జరిగినది తెలిసికొని యా బ్ర్రహ్మణ కుమారుడు మిక్కిలి విషాదము నొందెను. కాబట్టి యనాగతకార్యముల గుఱించి చింతింప రా దంటిని" అని చెప్పిన భార్యమాటలు విని దేవశర్మ కొంచెము సిగ్గుపడియూరకుండెను.

తరువాత గొన్నిదినములకు యజ్ఞాసేన శుభలక్షణములతో గూడిన కుమారుని గనెను. కొన్నాళ్ళయినపిమ్మట నొకనాడు పర్వదినమగుటచేత నామె కుమారుని బెనిమిటి కప్పగించి నదికి స్నానమునకు బోయెను. ఆమెనది కేగిన వెంటనే యాదేశము నేలు రాజా యగ్రహారమందలి బ్రాహ్మణులను దాన మిచ్చుటకై పిలువనంపెను. బ్రాహ్మణులు కొందఱపుడు దానము గ్రహించుటకై వెళ్ళుచుండిరి.

వారిం జూచి దేవశర్మ యిట్లు చింతించెను. "అయ్యో నేడు నాభార్యను స్నానమున కెందుల కంపితిని? నేను రాజ దర్శనమునకు బోయినచో నిపు డీ శిశువు నెవ్వరు గాపాడుదురు? "రాజు నన్నెపుడు పిలుచును? ఎపుడు దాన మిచ్చును? ఎపుడు భాగ్యవంతుడ నగుదును?" అని చిరకాలమునుండి నిరీక్షించుచుంటిని. ఇపు డవకాశమురాగా వెడలుటకు వీలు లేక పోవుచున్నదే!" ఇట్లు విచారించి యించుకనే పాలోచించి, చాలకాలము నుండి బిడ్డనువలె బెంచిన ముంగిసను బాలునియొద్ద గావలియుంచెదనని నిశ్చయించి దానిని బిలిచి "నీ విచటనుండి యీ శిశువును గనిపెట్టుచుండు" మని సంజ్ఞాపూర్వకముగా దెలిపి, దానిని ద్వారమందు నిలిపి రాజ భవనమునకు బోయెను. బ్రాహ్మణు డట్లు వెడలిన తరువాత నొక నల్లత్రాచు శిశువు చెంతకు బ్రాకిపోవుచుండెను. ముంగిస యదిచూచి సర్పము మెడబట్టి కొఱికి చంపివైచి దానిశరీరమును ముక్కలు ముక్కలుగా జేసివైచెను. నోటినిండ, దనదేహమునిండ బాము రక్త మెఱ్ఱగా నిగనిగలాడుచుండగా నాముంగి మరల ద్వారము నొద్దకు వచ్చి నిలిచెను.

అచట నాదేవశర్మ రా జొసగిన విలువయైన దానము బుచ్చుకొని బిడ్డ యేమయ్యనో యని తలచుకొనుచు మిక్కిలి త్వరితముగా నింటికి వచ్చెను. వచ్చియురాగానే నెత్తుటితో నిండియున్న ముంగి తన విధిని జయప్రదముగా నెఱవేర్చితి నన్న గర్వముతో యజమానుని పాదముల కడకు బరుగిడెను. ఊయలలోను, దాని శరీరమునను గల రక్తము కంటబడగానే యాముంగిస దన బిడ్డను గొఱికివైచినదని యెంచి యా బ్రాహ్మణుడు కోప మాపుకొనలేక యచటనున్న రోకటితో గొట్టి దానిం జంపి వైచెను. అనంతర మాత డూయెలదగ్గఱకు బోయి సంతసముతో గాలుసేతు లాడించుచు నవ్వుచున్న తనబిడ్డను గనుగొనెను. ప్రక్కను తునుకలుగా జేయబడి యున్న సర్పమును గాంచెను. వెంటనే జరిగిన సంగతి గ్రహించి గుండెలు బాదుకొనుచు "మందబుద్ధినగు నేను బాగుగా నాలోచింపక తొందరపడి దారుణము గావించితి" నని విలపించు చుండెను. ఇంతలో యజ్ఞసేన స్నాము చేసివచ్చి జరిగినది తెలిసికొని విచారించెను. కావున నేపనియు దూరమాలోచింపక చేయరాదు."

హిరణ్యకు డీవిధముగా నెంతచెప్పినను వినక భయము చేత మంథరుడు మఱియొక చోటునకు బోవుటకే నిశ్చయించి పయనమాయెను. స్నేహవశమున హానిని శంకించుచు హిరణ్యకాదులును వెంట నేగుచుండిరి. అట్లు నేలమీద ప్రయాణము సేయుచుండగా నొకవేటకాడు చూచి మంథరుని బట్టుకొని వింటికొనకు గట్టివైచి తిరిగి తిరిగి యాకలి గొని యింటికి మరలిపోవుచుండెను. వెంటనున్న మృగవాయస మూషికము లీసంగతి చూచి మిక్కిలి విషాదమొంది వేటగాని ననుసరించి పోవుచుండెను. అట్లు పోవుచు హిరణ్యకు డిట్లు చింతించెను.

"ఒక దు:ఖము ముగియులోపలనే మఱియొక దు:ఖము సంప్రాప్తమయ్యెను. సందు దొరకినపుడే యనర్థములన్నియు నొకదానివెంట నొకటి వచ్చి మీదబడును. ఆపద గలిగినపుడు ప్రాణములు సయితము లెక్కసేయక కాపాడు సన్మిత్రుడు మహాభాగ్యమువలన గాని లభింపడు. శోకము నుండియు, శత్రువుల నుండియు గాపాడునట్టియు; బ్రీతి విశ్వాసములకు బాత్రుడు నగు "మిత్రుడు" అను నక్షరత్రయముతోడి రత్న మెవరివలన సృష్టింపబడెనో కదా! సన్మిత్రుని యందుండు నమ్మకము తల్లియందును, దండ్రియందును, భార్య యందును, సోదరునియందును గుమారుని యందును గూడ, గలుగదు.

ఇదియంతయు దైవకల్పితము. పూర్వకర్మవలని ఫలము మంచిదైనను, జెడ్డదైనను ననుభవింపక తప్పదు. శరీరమున కెల్లప్పుడు నపాయము సిద్ధము. సంపద లాపదలకు మూలములు. స్నేహము లనిత్యములు. జనించిన దేదియు నశింపక మానదు.

ద్రవ్యాభిలాషచే సంపద గలిగినపు డందఱును మిత్రులగుదురు. సుఖమునందువలె దు:ఖమునందును బాలుపంచు కొనువా డెవ్వడో వాడే నిజమగు మిత్రుడు. దీనికి విపత్తులే నికషోపములు." ఇట్లు విచారించి చిత్రాంగ లఘుపతనకులతో నిట్లనియెను.

"ఇంక విచారించుచు నూరకుండిన లాభములేదు. బోయవా డీ యడవి దాటకముందే మిత్రుని విడిపింపవలయును. నాకొక యుపాయము తోచుచున్నది. చెప్పెదను. వినుడు. చిత్రాంగుడు కిరాతకుడు పోవుమార్గమున నొక మడుగుచెంత జచ్చినట్లు పడియుండవలయును. కాకి చిత్రాంగునిపై వ్రాలి ముక్కుతో బొడుచుచున్నట్లు నటింపవలయును. ఈ బోయ మృగము చచ్చి పడియున్నదని తలచి తప్పక మంథరు నచట విడిచి మృగమును గ్రహించుటకై ప్రయత్నపడును. నే నపుడు క్షణములో మంథరుని బంధములు దెగగొఱుకుదును. అపు డాతడు నీటిలో బ్రవేశించును. బోయ మిమ్ము సమీపించు సరికి వేగముగా బాఱిపొండు" అని చెప్పగా నవి రెండును నట్లే కావించెను.

కిరాతు డలసినవాడై పానీయముల ద్రావి యామడుగుదరి నున్న చెట్టునీడ యందు గూరుచుండి యాహరిణముంగాంచి సంతసమంది దాని దరికేగెను. హిరణ్యకుం డంతలోవచ్చి మంథరుని బంధములు గొఱికివేయగా నాతడు జలములలో బడెను. బోయ సమీపించుసరికి లేడిలేచి వేగముగా బాఱిపోయెను. ఆవ్యాధు డిదియంతయు జూచి "సిద్ధించిన దానిని విడిచి యెవ్వడు మఱొకదానికై లోభపడునో వాడు తుదకు "రెండింటికి జెడిన రేవ" డగును అని విచారించి నిరాశుడై యింటికి బోయెను. మంథరాధులందఱు నీవిధమున నాపదనుండి తప్పించుకొని సుఖముగా నుండిరి.

రాజపుత్రులారా! మీరును సుజనులగు మిత్రులను సంపాదించి మీరు మేలొంది లోకమునకు మేలుగూర్చుడు" అని విష్ణుశర్మ చెప్పగా వినివారు కడుంగడు మోదమొందిరి.


           _____________