సంపూర్ణ నీతిచంద్రిక/మార్జాలమునకు జోటిచ్చి దానివలన మరణించిన జరద్గవ మను గ్రద్ద కథ

వికీసోర్స్ నుండి

మార్జాలమునకు జోటిచ్చి దానివలన మరణించిన జరద్గవ మను గ్రద్ద కథ

గంగాతీరమున గృధ్రకూట మను పర్వతమున నొక పెద్ద జువ్విచెట్టు గలదు. దాని తొఱ్ఱయందు మిక్కిలి ముదుసలియై గోళ్లు, దంతములు పట్టుచెడిన జరద్గవ మను నొక గ్రద్ద నివసించుచుండెను. ఆ చెట్టుమీదనుండు పక్షులు దయతో దాము తెచ్చుకొన్న తిండిలో గొంచెము కొంచె మా జరద్గవమున కిచ్చుచుండెను. ఆగ్రద్ద దానితో జీవించుచు బక్షులు గూళ్లు విడిచి పోయినపుడు వాని పిల్లలను గాపాడుచుండెను.

ఒకనాడు దీర్ఘకర్ణ మనెడి పిల్లి యొకటి పక్షిపిల్లలను బట్టుకొని తినుటకై యాజువ్విచెట్టుకడకు వచ్చెను. దానింజూచి పక్షిపిల్లలు భయపడి యఱవ దొడగెను. అంతట జరద్గవ మా యఱుపు విని "యెవ రా వచ్చుచున్న వా?" రని ప్రశ్నించెను.

అపు డాపిల్లి గ్రద్దను జూచి భయపడి "హా, చచ్చితిని! ఇక నేమి చేయుదును? ఆపద మీద బడినపుడు భయపడి పొందగల ప్రయోజనమేమి? పాఱిపోవు టిక శక్యముగాదు. ఉపాయమున దప్పించుకొనవలయును. ఏమైన నగును గాక. దీనితో మాటలాడి నమ్మకము గలిగింప యత్నించెదను." అని యాలోచించి దరిజేరి "అయ్యా! నమస్కారము" అని పలుకగా గ్రద్ద "నీవెవ్వడ" వని ప్రశ్నించెను. "నేను దీర్ఘకర్ణమను పేరుగల పిల్లిని" అన, గ్రద్ద "వెంటనే దూరముగ బొమ్ము. లేనిచో జంపివేయుదు" ననెను.

"దయయుంచి నామాట వినుడు. అనంతరము చంప దగినవాడ నైనయెడల నట్లే చంపివేయవచ్చును. జాతిమాత్రమున నెవ్వరిని జంపివేయనురాదు; పూజింపను గూడదు. సంగతియంతయు దెలిసికొని చంపదగునో, గౌరవింపదగునో నిర్ణయించుట నీతి" అని యా మార్జాలము వేడుకొనగా గ్రద్ద యపుడు "అయినచో జెప్పుము. నీవేమి పనిమీద నిచటికి వచ్చితివి?" అనియడిగెను.

"నే నిచట గంగలో నిత్యము స్నానముచేయుచు మాంసాహారము విడిచి బ్రహ్మచారినై చాంద్రాయణవ్రతము చేయుచుంటిని. మీరు ధర్మజ్ఞానపరులనియు, విశ్వాసయోగ్యులనియు బక్షులన్నియు నెల్లవేళల నుతించుట విని, విద్యచేతను, వయస్సుచేతను బెద్దలయిన మీవలన ధర్మములు వినదలచి మీదర్శనమునకు వచ్చితిని. అన్నిధర్మములు దెలిసిన మీరే మీయింటికి వచ్చిన నన్ను జంపదలచితిరి.

ఇంటికి వచ్చినప్పుడు శత్రువున కయినను గౌరవము చేయవలయును. ధన మీయలేకున్న మంచిమాటలతోనైన నాదరింపవలయును. తన్ను ఛేదించుటకు వచ్చినవానికి సయితము వృక్షము చల్లని నీడయొసగి యాదరించుచున్నది. సాధువులు గుణహీనులయందును దయచూపుదురు. ఎట్టి నీచపు దావులయందును జందమామ వెన్నెల గాయకుండ నుండడుగదా!

మఱియు నగ్ని బ్రాహ్మణులకు బూజ్యుడు. అన్ని వర్ణములవారికి నిజమైన బ్రాహ్మణుడు పూజ్యుడు. స్త్రీలకు భర్త పరమపూజ్యుడు. ఇంటికివచ్చిన యతిథి యందఱకు బరమపూజ్యతముడు. ఎవ్వడింటికి వచ్చిన యతిథిని, నిరాశతో వెడల గొట్టునో వాని సుకృత మా యతిథికి జెందుననియు, నాయతిథి చేసిన పాప మాతని వెడలగొట్టిన వానికి వచ్చుననియు బెద్దలు చెప్పుదురు. అతిథి సర్వదేవలతో సమానుడు. వాడెట్టి నీచుడైనను గౌరవమున కర్హుడు." అని పిల్లి చెప్పిన సంగతులు విని గ్రద్ద మరల నిట్లనెను. "పిల్లులకు మాంసమనం దెక్కువ యిష్టము. పక్షిపిల్లల రక్షణభారము నామీద నుండుటచేత నిట్లంటిని." అనగానే యాబిడాలము చెవులు మూసికొని యిట్లు పలికెను.

"హరిహరీ! ఎంతమాట వినవలసి వచ్చినది! ధర్మ శాస్త్రములు విని, కోరికలు విడిచి చాంద్రాయణవ్రత మాచరించుచుంటిని. ఇతర విషయములను గుఱించి పరస్పరవిరోధము లెన్ని యున్నను ధర్మశాస్త్రము లన్నియు "అహింస పరమధర్మ" మని యేకగ్రీవముగా ఘోషించుచున్నవి. సర్వజీవులయందు దయగలిగి యుండి యహింస నవలంబించువానికి స్వర్గము స్వాధీనమై యుండును. మరణము కలుగునన్నచో బుట్టుదుఃఖము వర్ణింపనలవికానిది. ఒకరి ప్రాణములు దీసి తా మనుభవించు తృప్తి క్షణికమే కదా! అనాయాసముగా దొరకు నే యాకలములతోనైన బొట్టపోసికొనవచ్చును. ఈ పాడుపొట్టకై మహాపాపముచేయుట యెంత తెలివితక్కువ పని?" యని పలికి యా ముసలిగ్రద్దకు సంపూర్ణమగు నమ్మకము గలిగించి దానితో మిక్కిలి స్నేహము జేయుచు నాచెట్టు తొఱ్ఱలోనే నివసించుచుండెను.

ఇట్లు కొన్నిదినములు గడచి గ్రద్దకు నమ్మకము ముదిరిన యనంతరము దీర్ఘకర్ణము చెట్టెక్కి పక్షిపిల్లలను దెచ్చి తొఱ్ఱలో నిడుకొని నిత్యము భక్షింపసాగెను. తమపిల్లలు కనబడక పక్షులు దు:ఖించుచు నిటునటు వెదుక దొడగినవి. ఆ సంగతి తెలిసి పిల్లి తొఱ్ఱను విడిచి పాఱిపోయెను. పక్షులు వెదకివెదకి తొఱ్ఱలోనున్న తమపిల్లల యెముకలు కనుగొని యా జరద్గవమే పిల్లలను దినివైచి యుండునని నిశ్చయించి యన్నియు జేరి తమ ముక్కులతో బొడిచి యా ముసలి గ్రద్దను జంపివైచినవి.

కాబట్టి యాకస్మికముగా వచ్చినవారిని నమ్మరాదని చెప్పితిని? ఈ విధముగా జెప్పిన కాకి పలుకులు విని మిక్కిలి కోపముతో జంబుక మిట్లనెను.

"ఈ లేడిని జూచిన మొదటిరోజున నీవును నూతనుడవే. అట్టి నీకును దీనికిని మైత్రి నిత్యమును వర్ధిల్లుట లేదా? నీ కెదురాడువారు లేక నీకు దోచిన వన్నియు నీతులని పలుకు చున్నావు. వీడు తనవాడు, వీడు పరుడు నని యల్పబుద్ధి గలవారు తలపోయుదురు. బుద్ధిమంతు లట్లు భావింపక లోకమంతయు నొకేకుటుంబమని యెంతురు. ఈ లేడి నీకెట్టి చుట్టమో నాకును నట్టిబంధువే." ఈ మాటలు విని "యట్లే యగు గాక" యని కాకియు దానిచెలిమి కంగీకరించెను. అప్పటినుండియు నాలేడియు, నక్కయు, గాకియు మిక్కిలి స్నేహముగలిగి యా వనమున నివసించుచుండెను.

కొంతకాలమునకు బిమ్మట సుబుద్ధి లేడితో రహస్యముగా నిట్లు పలికెను. "యీ యడవియం దొక్కచోట సస్యముతో నిండిన పొలమున్నది. దానిని నీకు జూపుదునుర" మ్మని జింకను వెంట దీసికొనిపోయి సుబుద్ధి పంటపొలము దానికి జూపెను. లేడియు రోజురోజు నచటికి బోయి యాపయిరు దినుచుండెను.

ఒకనాడు పొలముకాపు పయిరు దినివేయబడుచుండుట జూచి, వలపన్ని వెడలెను. జింక మేతకు బోయి యావలలో జిక్కుకొని "నన్నీ వలనుండి, తప్పించి కాపాడు దిక్కెవరు?" అని చింతించుచుండ జంబుకము వచ్చి చూచి "నాతంత్ర మిప్పటికి నెఱవేఱినది. ఇది చంపబడినయెడల దీని మాంసాదులు చాలకాలమువఱకు నాకు భోజనమునకు సరి పోవును." అని తలచుచు దరి కేగెను.

లేడి జంబుకమును గాంచినంతనే సంతసించి "సఖుడా! త్వరితముగా వచ్చి నాబంధములు గొఱికి నన్ను గాపాడు" మని కోరెను. ఆ నక్కయు మఱింత దగ్గరగా వచ్చి మాటిమాటికి వలను బరిశీలించి చూచి "మిత్రుడా! యీవల నులి నరములతో జేయబడినది. దీనిని నే డాదివార మగుటచేత దాక జాలను. నీవు వేఱుగా భావింపకుము. తెల్లవారగనే నీవు చెప్పినట్లు చేయుదును." అని పలికి సమీపమందలి పొదచాటున దాగియుండెను.

అనంతరము సాయంకాలమైనను లేడి తిరిగి రాకుండుట చేత వాయస మనుమానపడి యటునిటు వెదకుచు వచ్చి వలలో దగులుకొనియున్న మిత్రుని జూచి "ఇది యేమి?" యని యడిగెను.

"మిత్రుని మాట వినకుండుటవలన గలిగిన ఫలితము. హాని సిద్ధమైయున్నపుడు సఖుల మాటలు చెవి కెక్కునా!" యని పలికి లేడి సంగతియంతయు వివరించెను. "జంబుక మెచట నున్న" దని వాయస మడిగెను. "నా మాంసము దిన గోరుచు నిచటనే యుండు" నని మృగము బదులు పలికెను. అపుడు కాకి యిట్లనెను.

"నేను ముందే చెప్పితిని. నాయం దేమియు దోసము లేదు గదా యని దుర్మార్గులను నమ్మరాదు. వారు సుజనులకు గూడ హానిచేయగలరు. మరణము సమీపించినవారు దీప మాఱిపోవునప్పటి గంధ మాఘ్రాణింపలేరు. మఱియు వారి కరుంధతీ నక్షత్రము గోచరింపదు. మిత్రులమాటలు చెవికెక్కవు ఎదుట మంచిమాటలాడి నమ్మించి చాటున గీ డొనరించు మిత్రుని నమ్మరాదు. అట్టివాడు మేకవన్నె పులివంటివాడు." అని పలికి "ఓ దుష్టజంబుకమా! పరమసాధువయిన యీజింకను వంచించితివా? ఓ భూమాతా! నమ్మి మేలొనరించిన వారిని వంచించు దుష్టుల నెట్లు భరింపగలుగుచుంటివి?

దుర్జనుల సాంగత్యము సకలహానులకు మూలము. నిప్పు తాకినవారిని దహించును. చల్లాఱినను మాలిన్యమును గలిగించును.

దోమ ముందుగా బాదముల మీద వ్రాలును. పిదప వీపుమీది మాంసమును గొఱుకును. చెవిలో మధురముగా నేమియో పలుకును. రంధ్రము జూచుకొని నెమ్మదిగా శరీరమున జేరి కడుంగడు హాని గలిగించును. దుష్టుని వర్తనము నిట్టిదే. మధురముగా మాటలాడినంతమాత్రమున విషముతో నిండిన హృదయముగల దుర్జనుని నమ్మరాదు" అని విచారించుచుండ గఱ్ఱ చేత బట్టుకొని వచ్చుచున్న పొలముకాపు గనబడెను.

వాని జూచి వాయసము "సఖుడా! ఆలసింపరాదు. ఊపిరి బిగబట్టి కడు పుబ్బరించునట్లు చేసి కాళ్లు చాచుకొని చనిపోయినట్లు నటింపుము. నేను కూయగానే లేచి వేగముగా బాఱిపొమ్ము" అనిచెప్పెను.

జింకయు గాకి చెప్పిన విధమున జచ్చినట్లు పడియుండెను. అపుడు పొలముకాపువచ్చి యా జింకను జూచి యది చచ్చినదని తలచి వల వదలించెను. అది చూచి కాకి కూసెను. అంతట వేగముగా లేచి లేడి పాఱిపోయెను. మృగముచేసిన వంచన కా పొలముకాపు మిక్కిలికోపించి తన చేతనున్న బడియ విసరగా నది గుఱితప్పి దాగియున్న నక్కకు దగిలెను. దానిచేత నానక్క వెంటనే ప్రాణములు విడిచెను.

"పుణ్యముగాని, పాపముగాని మితిమీఱి చేయువారికి ఫలితము కొలది కాలములోనే సంభవించును." అనిన విని లఘుపతనకము హిరణ్యకున కిట్లనెను.

"నిన్ను జంపిన మాత్రమున నాకు బుష్కలముగ నాహారము చేకూఱునా? నీతో మైత్రి యొనరించి చిత్రగ్రీవుని వలె నుండుదును. నీవెన్ని చెప్పినను నీ చెలిమి సేయనిదే జీవించి యుండజాలను. నే నింతగా మాట్లాడితినని నాపై గోపగింపకుము. సాధువులకు గోపము వచ్చినను వా రితరులకు హానిచేయ బూనుకొనరు, నిప్పురవ్వ తగిలిన మాత్రమున సముద్రజలము వేడి యెక్కదు."

ఈ మాట విని, "నీవు చంచలబుద్దివి. చపలుని చెలిమి మంచిదిగాదు. మార్జాలము, దున్నపోతు, కాకము, దుర్జనుడు నమ్మించి యెంతపనియైన జేయగలరు. మఱియు నీవు మాకు శత్రువుల తెగకు జెందినవాడవు. శత్రు వెంతమంచివాడైనను వానితో జెలిమి సేయదగదు. జల మెంత యుష్ణమైనదైనను నిప్పును జల్లార్పకుండునా? మంచి మాణిక్యములను ధరించినదై నను సర్పము చేర రాని దైనట్లుగా నెట్టివిద్యగలవాడైనను దుర్జనుడు చేరనీయక విడువదగినవాడు. నేలమీద వానలును నీటిమీద బండ్లును నడువజాలని విధమున శత్రువు మేలొనరించుట యసంభవము. శత్రువును, దనపై మనసులేని భార్యను నమ్మియుండువాని క చిరకాలము ననే హాని సంభవింపకమానదు" అని దృఢముగా బలికెను.

ఆ మాటలు విని లఘుపతనకము "వేయిమాటలేల? నీవు నాచెలిమి కంగీకరింపని యెడల నేటినుండి నిరశనవ్రతము బూని ప్రాణములు కోలుపోవుదును. కారణ మేమన; మంటి కుండనువలె దుర్జనుని ద్వరలో విడగొట్టుట సులభము. సంధించుట మిక్కిలి కష్టము. బంగరుకలశము త్వరితముగా సంధింపబడును గాని తేలికగా విడగొట్టబడదు. సుజనుని విధము నట్టిదియే.

సుజనులను జూచినంతమాత్రమున సఖ్య మేర్పడును. అది విడదీయరానిదై యుండును. సుజనులు నారి కేళమువలె సారము గలిగియున్నట్లు బయటికి గన బడకున్నను నంతరంగమున సుగుణసారము గలిగి యుందురు. దుర్జనులు మేడిపండువలె బయటికి మాత్రము సుందరముగా గనబడుదురు. సాధువుల చెలిమి కేకారణమున నైన నాటంకములు గలిగినను వారి గుణముల యోగ్యత సెడదు. తామరతూండ్లు త్రుంచి వేయబడినను వాని దారములు విడిపోవు. మంచిమిత్రుని గుణములని చెప్పబడు దయ, స్నేహము, త్యాగము, శౌర్యము మున్నగునవి యన్నియు నీయందు గలవు. ఇట్టి మిత్రుడు నాకింకెట్లు దొరకును?" అని వివరించెను.

ఆ మాటలు విని హిరణ్యకుడు కలుగు వెడలివచ్చెను. "లఘుపతనకా! నీమాట లమృతమువలె నా కానంద మొసగినవి. మంచిగందపుసారముగాని, చల్లని నీటితుంపరుల జల్లుకాని, కప్పురపుబ్రోవుల పరిమళముగాని యాదరముతో నిండిన సుజనుల సల్లాపమువలె హాయి గలిగింప జాలవు. రహస్యము వెల్లడించుట, యాచన, నిష్టురముగ మాటలాడుట, మనస్థిరత్వము లేకపోవుట, కోపము, నసత్యములాడుట మిత్రుల కుండరాని గుణములు. ఈ దోసములం దేదియు నీయందు లేదు. మాటలవలననే మంచిచెడ్డలు గొంతవఱకు వెల్లడియగు చుండును. కావున నీవు గోరినటులే యగునుగాక" అని పలికి వాయసముతో సఖ్యమొనరించి గౌరవించెను. నాటినుండియు లఘుపతనక హిరణ్యకులు పరస్పరము గుశల మరసికొనుచు గడు విశ్వాసముతో మాటలాడుకొనుచు గాలక్షేపము సేయు చుండిరి.

ఒకనాడు లఘుపతనకుడు హిరణ్యకునితో "సఖుడా! ఇచట నాకు దిండి దొరకుట కష్టమగుచున్నది. ఇచ్చోటు వీడి మఱియొకస్థలమున కేగుట మంచిదని తలంచుచుంటిని." అని చెప్పెను. దానికి హిరణ్యకుడు "మిత్రుడా! ఒకస్థానము విడిచి నూతనస్థలమున నడుగిడునపుడు చక్కగా నాలోచింపవలయును. నీవెచటి కేగ దలచితివి?" అని అడిగెను. "మిత్రమా! చక్కగా నాలోచించితిని. దండకారణ్యమున గర్పూరగౌర మను నొక సరస్సు గలదు. చిరమిత్రుడైన మంథరు డనెడి కూర్మరా జందు గలడు. ఇతరులకు ధర్మములు బోధించుట సులభము. ఆచరించుట కష్టము. ఆ తాబేలు కడు ధర్మాత్ముడు. ఆత డాహార మొసగి నన్ను బోషింపగలడు" అని వాయసము బదులుపల్కెను.

అంతట హిరణ్యకుడు "నీవు వెడలిపోయిన తర్వాత నిచటనుండి నేనేమి చేయుదును? "ఏ దేశమున గౌరవము, జీవనోపాయము, చుట్టములు, విద్యాప్రాప్తి లభింపవో యా దేశము విడువవలయు" నని పెద్ద లందురు. మఱియు, అప్పిచ్చువాడు, వైద్యుడు, సంతతము బ్రవహించు నది, వేదపండితుడు లేనిచోట నుండరాదు. కావున నన్నుగూడ నీతో గొనిపొమ్ము." అని కోరెను. లఘుపతనకు డందుల కంగీకరించెను. సంతసముతో విచిత్రమైన కథలు చెప్పుకొనుచు గర్పూరగౌర సరస్సును జేరబోయిరి.

మంథరుడును, వచ్చుచున్న వాయస మూషికములను దూరమునుండియే చూచి తగిన విధమున నాదరించెను. అనంతరము లఘుపతనకుడు మంథరునితో నిట్లు పలికెను. "సఖుడా! యీ మూషికరాజు మిక్కిలి పుణ్యాత్ముడు. దయాపరుడు. ఈతనిపేరు హిరణ్యకుడు. ఈతని సుగుణ విశేషము లాదిశేషుడైనను వర్ణింపజాలడు. ఈతని నీవు మిగుల గౌరవింపవలయును." అని హిరణ్యకునితోడి తన చెలిమిని గుఱించి వివరించెను.

అంతట మంధరుడు హిరణ్యకుని మిక్కిలి పూజించి "హిరణ్యకా! నీ వీ జనరహితమైన యడవియందేల నివసించుచుంటి" వని యడిగెను. అపుడు హిరణ్యకుడు తన వృత్తాంతము నిట్లు చెప్పదొడగెను.

"చంపక మను నగర మొక్కటి కలదు. అందలి మఠములో సన్యాసులు పెక్కుమంది నివసించుచుందురు. అందు జూడాకర్ణు డను నొక యతి గలడు. అతడు ప్రతి దినము దాను భుజింపగామిగిలిన యాహారము భిక్షాపాత్రమందుంచి యా పాత్రము జిలుకకొయ్యకు దగిలించి నిదురించుచుండువాడు. నేను రోజురోజు మెల్లగా బయి కెగబ్రాకి యా పదార్థమును దినిపోవుచుండువాడను. ఒకనా డాతని మిత్రుడు వీణాకర్ణు డచటికివచ్చెను. జూడాకర్ణు డాతనితో మాటలాడుచు నన్ను భయపెట్టుటకై మాటిమాటికి గిలుక కఱ్ఱతో నేల మీద గొట్టుచు వచ్చెను. అదిచూచి వీణాకర్ణుడు "ఏల యటులు గొట్టుచుంటివి? నామాటలయం దిష్టములేదా?" యని చూడాకర్ణు నడిగెను.

"ఇష్టము లేకపోవుట గాదు, చూడుము, ఆ యెలుక ప్రతిదినము నా కపకారియై పాత్రమునందలి పదార్థము దిని వేయుచున్నది. దానిని బెదరించుటకై యిట్లుకొట్టుచుంటిని." అని చూడాకర్ణుడు బదులు పలికెను. అదివిని "యల్పజంతు వైన యెలుక కింత పైకెగురు శక్తి యెటులు వచ్చెను? దీని కేదోకారణ ముండితీరును. వెనుక శాండిలీమాతయను నొక బ్రాహ్మణి నువ్వుపప్పునకు మాఱుగా నువ్వు లడిగినందులకేదో కారణ ముండియుండునని యొక బ్రాహ్మణుడు గుర్తించెను. నీకా కథ చెప్పుదును వినుము" అని వీణాకర్ణు డిట్లు చెప్పదొడగెను.