సంపూర్ణ నీతిచంద్రిక/చిత్రగ్రీవు డను కపోతరాజు వృత్తాంతము

వికీసోర్స్ నుండి

చిత్రగ్రీవు డను కపోతరాజు వృత్తాంతము

పూర్వము గోదావరీతీరమున నొక గొప్ప బూరుగు చెట్టు గలదు. అన్ని దెసలనుండియు వచ్చి పక్షులు రాత్రి యా చెట్టుపై నివసించుచుండెడివి. ఒకనాటి వేకువవేళ లఘుపతనక మను కాకము మేలుకాంచి యమునివలె భయం కరుడై యున్న కిరాతు నొకని జూచి "లేవగానే యనిష్ట దర్శన మైనది. నే డేమి కీడు మూడునో కదా!" యని కలత నొందెను. అంతలో బోయవా డావృక్షముచెంత నూకలు చల్లి, వలపన్ని దాగి యుండెను. అనంతర మాకాశమున బరివారముతో సంచరించు చున్న చిత్రగ్రీవు డనెడి పావురములరాజు నేలమీద నున్న నూకలు జూచి భ్రమపడుచున్న తన తోడి పావురములతో నిట్లనెను. "నిర్జనమగు నీవనమున నూక లెట్లు వచ్చినవి? మన మీ నూకల కాసపడినచో బూర్వము కంకణమునకై యాసించి పులిచేత జిక్కి మరణించిన బాటసారివలె నపాయము నొందవచ్చును. మీ కాకథ చెప్పెదను వినుడు.