Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కాకినాడ

​కాకినాడ:

కాకినాడ పట్టణము కాకినాడ తాలూకాకును, తూర్పుగోదావరిజిల్లాకును ముఖ్యపట్టణము. పాశ్చాత్య దేశీయ వర్తకసంఘములు భారతదేశముతో వర్తకముకొరకు క్రీ. శ. 1600 ప్రాంతమున నెలకొనిన నాటినుండియు ఈ నగర ప్రాముఖ్యము క్రమముగ హెచ్చగుచువచ్చెను. 1871 వ సంవత్సరమునాటికి జనసంఖ్య 17,839 వరకు పెరిగెను. 1951 నాటికి 99,952 మంది జనుల సంఖ్య తోను, ఎనిమిది చదరపుమైళ్ళ భూవిస్తృతి తోను సముద్ర తీరమున ఇది ఒక సుందర పట్టణమై 1886 వ సంవత్సరమునాటికి మ్యునిసిపాలిటీ యైనది. బంగాళాఖాతమున కోరంగి సముద్ర మనెడి గుఱ్ఱపు డెక్క ఆకారముగ నుండెడి యైదుమైళ్ళ వెడల్పును, యైదు మైళ్ళ పొడవును గల సముద్రపు రేవుభాగములో నైరృతిమూలగా ఈ పట్టణమున్నది, గోదావరీనది సప్తశాఖలుగా విడిపోయి సముద్రమున సంగమించుచున్నది. ఈ శాఖలలో మిక్కిలి యుత్తరమున నున్న కుల్యభాగాశాఖ సముద్రమున చేరుచున్న చొల్లంగి క్షేత్రమునకు ఆరుమైళ్ళలో కాకినాడ యున్నది. రెండవశాఖ యగు కోరంగినది (అత్రిశాఖ) కోరంగి యొద్ద సంగమించుచున్నది. కోరంగి, కాకినాడకు పది మైళ్ళ దూరమున గలదు. 'ఇది ప్రాచీన కాలము నుండియు ఓడలకు రేవు స్థలముగా నున్నది. నదియొక్క వండుచే ఈ రేవు క్రమముగ పూడిపోవుటచే దీని ప్రాముఖ్యమంతయు కాకినాడకు సంక్రమించినది. కోరంగి, సముద్ర తీరపు అగ్రమని 'ప్లీనీ' యను చరిత్రకారుడు వ్రాసెను. ఇవుడు కోరంగి సముద్రమునకు కొన్ని మైళ్ళ దూరములో నున్నది. కోరంగి యొద్ద ఓడలు నిల్పుటకు బలమైన రాతిగోడ కట్టబడినది. అది ఇప్పుడు శిథిలమైనది. ఇప్పుడు కాకినాడకు అయిదు మైళ్ళ దూరమున సముద్రమున లంగరు వేసికొని ఓడలు నిల్చుచున్నవి. ఈ యోడల నుండి 'కాకినాడ రేవునకు నూరేసి టన్నుల పెద్ద పడవలు సరకులను చేర్చును. ఓడల గుర్తుకొర కి ప్రాంతమున నాలుగు దీప స్తంభములు కట్టబడెను. కాకినాడ దగ్గర సున్న స్తంభము 1877 నుండి ఉపయోగరహితమై యున్నది. కాకినాడకు ఉత్తరమున అయిదు మైళ్ళలో నున్న వాకలపూడి దీప స్తంభములోని తిరుగుడు దీప మిప్పుడు ఓడలకు గుర్తుగా పనిచేయుచున్నది. మిగిలినవి ఉపయోగరహితములు. ఓడలనుండి పెద్ద పడవలు కాకినాడకు ప్రక్కగా సముద్రములో చేరుచున్న ఉప్పుటేరుగుండా రేవునకు చేరును. ఈ ఉప్పుటేరునకు రెండు వైపులను రాతిగట్లు కట్టబడినవి. కాకినాడ, చామర్లకోటల కాలువలనుండియు, ఏలేరునది నుండియు పండునీరు ఉప్పుటేరులో చేరునుగాన ఈ యోడ రేవు కాలువ పూడిపోకుండ త్రవ్వు పడవలు పనిచేయుచు దీనిని మరమ్మతు చేయుచుండును.,

8 చదరపు మైళ్ళు వ్యాపించి, శాఖానగరములతో కాకినాడ విశాలమైన పట్టణముగా నొప్పుచున్నది. ఉప్పు టేరునకు పడమరగానున్న భాగమును జగన్నాథపుర మందురు. ఉప్పుకోటారులు, క్రైస్తవ మిషనరీలు, పాఠశాలలు, దేవాలయములు, హిందువుల నివాసములు, నుల్లాడి సత్యలింగమునాయకరు అను మహాదాత యొక్క సత్రములు, విద్యాలయములు మున్నగువానితో ఇంపుగ నుండి ఈ శాఖానగరము ఉప్పుటేరుమీద వంతెనచే ముఖ్య నగరములో కలియుచున్నది. ఈ ఉప్పుటేరు వంతెనమీద ఒక దాత కట్టించిన ఎత్తైన గడియారపు స్తంభ మున్నది.

క్రీ. శ. 1600 కు పూర్వము కాకినాడ చరిత్ర అంతగా తెలియదు. పూర్వమిచ్చట కాకుల సంఖ్య అమితముగా నుండుటచే దీనికి కాకివాడ యని "పేరు కలిగెనందురు. ఒకమారొక వర్తకుడు తన బియ్యపుకొట్లలోనికి కాకులను రావించి 978 కాకులను పట్టి చంపెనట! పూర్వ మొకప్పు డిది నాటు ఓడల వ్యాపారము జరుగుగ్రామమై యుండనోపును. ఆంధ్రదేశము క్రీ. పూ. 225 నుండి క్రీ.శ. 225 వరకును శాతవాహనుల పాలనలో నుండెను. శాతవాహనుల నాణెములపై నుండిన ఓడ బొమ్మనుబట్టి నాటి నౌకా వాణిజ్యాసక్తి తెలియగలదు. క్రీ. శ. రెండవ ​శతాబ్దపు రోము దేశపు నాణెములు నెల్లూరు ప్రాంతమున దొరకెను. క్రీ. శ. రెండవ శతాబ్దపు చరిత్ర కారుడగు టాలెమీ తూర్పునందలి ఆంధ్రతీరమున రెండు రేవుపట్టణము లుండెనని వ్రాసెను. అవి మసాలియా (మచిలీపట్టణము), మోటుపల్లి, కోరంగి, అను వానిలో ఏ 'రెండు కాదగును. ఆంధ్ర రాజులు అరేబియా, ఈజిప్టు, గ్రీసు, రోము, పారశీకము అను దేశములతోను, తూర్పు దీవులతోను వర్తకము సాగించిరి. 14 వ శతాబ్దివాడగు మార్కొపోలో అను యాత్రికుడు ఆంధ్రదేశమునుండి వజ్రములు, రవసెల్లాలు మొదలగునవి ఎగుమతి యగు చుండెనని వ్రాసెను.

పిమ్మటి కాకినాడ చరిత్ర డచ్చి, ఫ్రెంచి, ఇంగ్లీషు వారి యుద్ధములతో సంబంధించియున్నది. కాకినాడలోని జగన్నాథపురములో గోలకొండ సుల్తానుల యనుమతిపై క్రీ. శ. 1628 లో డచ్చివారు ఫ్యాక్టరీ కట్టుకొని ఓడల వ్యాపార నూరంభించిరి. కోరంగి రేపు పూడిపోవుటచే డచ్చి, ఫ్రెంచి, ఇంగ్లీషు వారి ఓడలు కాకివాడ రేవునకు చేరుచుండెను. ఆంధ్రదేశపు కూలీలు బర్మాకు కాకినాడలో ఓడ యెక్కి పోయెడివారు. నైజాము రాజ్యము 1748 వ సంవత్సరములో అల్లరులకు గురియగుటచే ఫ్రెంచివారు దక్కను నందును, తీరపు జిల్లాల యందును అధికారబలమును సంపాదించిరి. 1757 లో ఫ్రెంచి గవర్నరు బుస్సీ కోస్తా జిల్లాలపై అధికారపు ఫర్మానా సంపాదించెను. 1758 లో ఆంగ్లేయ సైన్యము కర్నల్ ఫోర్డు నాయకత్వమున పిఠాపురమున కీశాన్యముగా ఏడు మైళ్ళలో నున్న చందూరువద్ద గొప్ప యుద్ధములో ఫ్రెంచి నేసల నోడించి తరిమివేసెను. దానిచే కోస్తా జిల్లాల అధికారము ఆంగ్లేయులకు సంక్రమించెను. ఫ్రెంచివారు చామర్లకోట, కాకినాడలలో కొంత కుట్ర సాగించి తుదకు తొలగిపోయిరి. యూరపులోని యుద్ధముల ఫలితముగా 1825 సం. నుండి డచ్చివారు కూడ కాకినాడను వదలిపోయిరి. కాకినాడతోపాటు గోదావరి జిల్లా ఆంగ్లేయుల ప్రభుత్వములో స్థిరపడిపోయేను. కాకినాడ ఓడల వ్యాపారముచే క్రమవృద్ధి నొందెను. 1861 లో అమెరికాలో జరిగిన అంతర్యుద్ధ కారణమున కాకినాడ నుండి దూది నూలుకు, బట్టలకు సంబంధించిన యెగుసుతులు అధికమై పట్టణము అభివృద్ధి యయ్యెను. కలకత్తా మద్రాసులను కలుపు రైలుమార్గములో సామర్లకోట యను జంక్షను నుండి ఈపట్టణమునకు సుమారు 10 మైళ్ళ శాఖామార్గ మొకటి కలదు. ఈ మార్గము కాకినాడ రేపు వరకు పోవుచున్నది.

ఈ నగరమందు పిఠాపురము రాజుగారిచే నిర్మించబడి పోషింపబడుచు వచ్చిన పెద్ద కళాశాల యొకటి కలదు. ప్రస్తుతమిది ప్రభుత్వాధీనములో నున్నది. ఇది కాక ఒక ఇంజనీరింగు కళాశాలయు, పాలిటెక్నిక్ కళాశాలయు, ప్రభుత్వముచే నిర్వహింపబడుచున్నవి. వైద్య కళాశాల యొకటి స్థానిక యాజమాన్యమున 1958 లో నెలకొల్పబడెను.

వా. రా.