Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కల్పము

​ కల్పము :

"శిక్షా, వ్యాకరణం, ఛంధః, నిరుక్తం, జ్యోతిషం తథా
కల్పశ్చేతి షడంగాని వేదస్యాహు ర్మనీషిణం."

అనునటుల వేదాంగములుగా కీర్తింపబడుచున్న షడంగములలో ఆరవయంగము కల్పము. పై గణనాక్రమమున కడపటిదైనను, పురుషునకు హస్తమువలె, వేద పురుషుసకు హస్తస్థానీయమై, పరమోపకారకమై యుండుటచే ఇది వేదాంగములలో ప్రధానమై అలరారుచున్నది.

వేదపురుషునకు ఛందస్సు పాదములనియు, కల్పము హస్తములనియు, జ్యోతిషము నేత్రములనియు, వ్యాకరణము ముఖమనియు,

"ఛన్దః పాదౌతు వేదస్య
     హస్తః కల్పోఽథపఠ్యతే
జ్యోతిషామయనం చక్షు,
      ముఖం వ్యాకరణం స్మృతమ్.”

అనుదానిచే తెలియుచున్నది. కనుక ఈ కల్ప విజ్ఞానము వైదిక విజ్ఞానమునకు కల్యాణకల్పకమై వెలుగొందు చున్నది.

మరియు ఈ కల్పసూత్ర వాఙ్మయము వైదిక వాఙ్మయమున విశేషస్థలము నాక్రమించుకొని యాజ్ఞి కాదులకు అత్యంతోపకారియై వెలయుచున్నది.

జ్ఞానమార్గ మెటుల ఆరణ్యకముల అంతిమ భాగమున అభివృద్ధమై, ఉపనిషత్తులుగా పరిణతిని చెందెనో, అటులనే కర్మమార్గము గూడ బ్రాహ్మణములయం దభివృద్ధమై, ఈ కల్పమున ప్రధాన విభాగమైన శ్రోత సూత్రములుగా పరిణతిని చెందెను. కానీ ఉపనిషత్తులకు సిద్ధించిన అపౌరుషేయత్వము గాని, వేదత్వము గాని వీటికి సిద్ధింపలేదు.

కల్పము, సూత్రమయ గ్రంథనిబద్ద మగుటచే "కల్ప సూత్రములు" అను ప్రసిద్ధి గలిగియున్నది. ఈ కల్ప సూత్రములు — శ్రోత, గృహ్య, ధర్మ ప్రభేదముచే ముత్తెరగులుగ నున్నవి. అయినను, లోకమున శ్రోత సూత్రములకే "కల్ప" మను ప్రసిద్ధి అధికముగా నున్నది.

మెక్డొనిల్ (Mecdonell) మొదలగు పాశ్చాత్య విమర్శకులు ——"బౌద్దాది నాస్తికమతము లావిర్భవించిన కాలమున బ్రాహ్మణులు స్వమత సిద్ధములైన ఆచార వ్యవహారములను సంరక్షించుటకై, యజ్ఞ కర్మప్రయోగ వైశద్య సంపాదకములును, నిరవద్య హృద్య రచనాసమన్వితములును అగు ఈ కల్పసూత్రములను విరచించి యుందురు. ఆ విశిష్టమైన సూత్రశైలీ సౌభాగ్యమును నరికించి, ముగ్ధులై, బౌద్ధాదులను పాళీ ప్రముఖములగు భాషలలో గనుతమ మత విషయముల విపుల ప్రచారమునకై ఆ సూత్ర శైలి సనుసరించుచు సూత్రగ్రంథము లను నిరచించియుందురు" అని వక్షాణించు చున్నారు.

యాగాది వైదిక కర్మాచరణము బౌద్ధాది మతా విర్భావకాలముననే తలయెత్తినదని నిరూపింపగలిగినచో వారి యూహ సముచితమై యుండెడి దేమోగాని, అట్లు నిరూపించుటకు వలనుపడదు. ఏలనన -ఋగ్వేద సంహితా కాలమునకు మున్నే యాగాది కర్మము లాచరింపబడు చుండినటుల ఋక్ సంహితాదులవలననే స్పష్టముగా తెలియుచున్నది. సామ, యజుస్సంహితలును యజ్ఞాది కర్మాచరణ ప్రబోధకములై యుండుట సువ్యక్తమైన విషయమే, మరియును వైదిక మతమునకు ప్రతిపక్షిగా బౌద్ధాదిమతములు బయలు దేరినవిగాని, బౌద్ధాది మతములకు ప్రతిద్వంద్విగా వైదిక మార్గ మావిర్భవింపలేదు.

మంత్రములందు చెల్లాచెదరుగా నుండిన యాగాది కర్మములను బ్రాహ్మణములు కొంతవరకు విశద పరుపగా, కల్పసూత్రము లింకను విశదతరముగా ఎల్లయంశములను నిరూపించుచున్నవి. కల్పసూత్రము లన్నియును ఆయా శాఖల బ్రాహ్మణములను అనుసరించి వచ్చినవి. ఇవి యజ్ఞములంచు హోత, ఉద్గాత మొదలగు ఋత్విక్కులు చేయు కార్యములను బోధించుచున్నవి.

శ్రోతసూత్రములు పౌర్వాపర్యము : శ్రోతసూత్రముల పౌర్వాపర్య నిర్ణయమంత సులభసాధ్యమగు పనికాదు. ఋగ్వేదమునకు సర్వానుక్రమణీవృత్తిని విరచించిన షడ్గురుశిష్యుడు దాని అవతరణికలో "శౌనకస్యతు శిష్యోభూత్, భగవాన్ అశ్వలాయనః" అని కీర్తించి యున్నాడు. దానినాధారముగ జేసికొని ఆశ్వలాయనుడు శౌనక శిష్యుడను నొక ప్రతీతియు, ఐతరేయారణ్యకమున పదునేను వాక్యముల నాల్గవ అధ్యాయమును ఆశ్వలాయనుడు విరచించెనని మరియొక ప్రతీతియును బయలుదేరినవి. కాత్యాయనముని ప్రశంసకై అవతరించిన షడ్గురు ​ శిష్యుని అవతారిక లోని విషయము ఏమాత్రము ప్రమాణ మన్నను, శౌనక, ఆశ్వలాయన, కాత్యాయనులు మువ్వురును కొంచెమించుమించుగా సమకాలికు లని చెప్పవలసి వచ్చుచున్నది. ఇది సంగతము కానేరదు, మాక్స్ ముల్లర్ (Maxmuller) మహాశయుడు గూడ ఈ యవతారికను చర్చించి అది అసంగతమని అభిప్రాయపడెను.

ఆశ్వలాయనుడు తన సూత్రముల కడపటి అధ్యాయమున "అపి నానాగోత్రాః స్యురితి శౌనకః" అని శౌనకుని పేరెత్తుచు, ఆచార్యపదప్రయోగముచేతనైనను గౌరవింప లేదు. కనుక మొదటి ప్రతీతి నమ్మదగినది కాదు. ఇక రెండవ ప్రతీతి మిక్కిలి నిరాధారము. కాని, దీనివలన శౌనకుని పేర్కొన్న ఆశ్వలాయనుడు అతనికన్న అర్వా చీనుడు అని మాత్రము స్పష్టముగా సిద్దించుచున్నది.

ఏది ఎట్లున్నను, ఆపస్తంబ, ఆశ్వలాయన, బోధాయన, కాత్యాయనాది ప్రధాన సూత్రకర్తలు క్రీస్తుపూర్వము ఐదవ శతాబ్దికి ఆవలివారేగాని ఈవలివారు కారనుట తధ్యమగు విషయము. పాశ్చాత్య పరిశోధకులలో డాక్టరు బుల్హర్ (Bulher) మహాశయుడు విశేష పరిశోధనములను జేసి, ఆపస్తంబుడు క్రీస్తుపూర్వము పంచమశ తాబ్దికి గూడ పరుడు కాడనవచ్చునని నిశ్చయించెను.

ఈ అభిప్రాయమునే సుదర్శనభాష్యముతో ఈ సూత్రములను బ్రకటించిన మహాదేవశాస్త్రిగారు బలపరచి యున్నారు. మరియు హరదత్త, సుదర్శన భాష్యములతో ఈ సూత్రములను ప్రకటించిన శ్రీ చిన్నస్వామి శాస్త్రిగారును ఈ అభిప్రాయమునే అంగీకరించుచు, ఇంకను వెనుకకు పోదగిన సూచనలను గూడ కొన్నిటిని చేసి యున్నారు.

ఆపాణినీయములైన ఆర్షప్రయోగములు ఆశ్వలాయన, బోధాయనాది సూత్రములలో కూడ కొన్ని కలవుగానీ, ఆపస్తంబ సూత్రమున అట్టివి ఎక్కువగా నున్నవి. ఆపస్తంబుడు పాణినికిని తరువాతివాడైనచో "రాతా - వృక్షనామాః - త్రిస్సప్లైః పుం స్వః" ఇత్యాదికములగు పాణినీయ విరుద్ధప్రయోగములు (ఆ. గృ. ఖం- 3, 2, 3-13; 9-5; 6-11) కావించియుండడనుట సమంజసము గాన, ఇతడు పాణినికిని పూర్వుడని ఊహింప వచ్చును. పాణిని క్రీ. పూ. సప్తమశతాబ్దికి తరువాతి వాడు కాడని పెక్కండ్రు విమర్శకులు అభిప్రాయపడి యున్నారు.

ఇది ఇట్లుండ, ఆపస్తంబుడు బోధాయనుని శిష్యుడని వైదిక సంప్రదాయ మొకటి ప్రసిద్ధమై యున్నది. దీనికి ఆధారములు కానరావు; కానీ, గృహ్యసూత్రములలో బోధాయనుడు చెప్పని "నాక బలి" మొదలగు కొన్నిటిని ఆపస్తంబుడు చెప్పుటయు, శ్రౌతసూత్రములలో లొధాయనుడు “ఇషేత్వో రేత్వా, శాఖామాచ్చినత్తి" అని చెప్పియుండ ఆపస్తంబుడు “ఇ పే.త్వోర్జేత్వా, శాఖా మాచ్ఛినత్తి, ఊర్థేత్యనుమార్షి" అని మంత్రమును విభజించుటయు అతనికంటే ఇతడు పరుడగుటకు హేతువని చెప్పుచున్నారు. కాని ఈ మత భేదము వీరి పొర్యాపర్యము నిర్ణయింప ననుకూలముగాదు సరిగదా, ఇదియే వీరి గురుశిష్య భావమున కెంతయు ప్రతికూలనుగుచున్నది. కనుక. శ్రౌతసూత్రకర్తలలో ఎవరు మొదటివారను విషయము తీర్మానించుటకు శక్యముగాకున్నది.

కల్పసూత్రముల విభాగము: ఈ కల్పసూత్రములు మూడువిధములుగా విభక్తములై యున్నవి. అందు మొదటిది శ్రౌతకర్మలను ప్రతిపాదించుచున్నందున 'శ్రౌత సూత్ర' మనియు, రెండవది గృహసంబంధములగు కర్మలను ప్రతిపాదించుచున్నందున 'గృహ్య సూత్ర' మనియు, మూడవది ధర్మములను ప్రతిపాదించు చున్నందున 'ధర్మసూత్ర' మనియు వ్యవహరింపబడుచున్నవి.

ఋగ్వేద శ్రోతసూత్రములు : ఈశాఖకు సంబంధించినవి ఆశ్వలాయన, శాంఖాయన నిర్మితములుగా రెండు సూత్రములు ప్రసిద్ధములై యున్నవి. శౌనకుడు గూడ ఒక సూత్రముమ విరచించినటులు తెలియు చున్నదిగాని, అది కనబడుటలేదు.

ఇందు మొదటిది.——ఐత రేయారణ్యకము ననుసరించినది; అందు 12 అధ్యాయములున్నవి. రెండవది- కౌషీతకీబ్రాహణము ననుసరించినది; అందు 18 అధ్యాయము లున్నవి. అందు కడపటి అధ్యాయమును తరువాత ఎవరో చేర్చిరి గాని, శాంఖాయనకృతము గాదని ఊహింపదగియున్నది. ప్రయోగ విషయమున ఈ రెండు నుసమానముగ నేయున్నవి. శాంఖాయన సూత్రములలో రాజసూయాది క్షత్రియోచిత యాగములు సవిస్తరముగా ప్రతిపాదింపబడియున్నవి. ​ ఆశ్వలాయన సూత్రమునకు మొదట దేవస్వామి 'అనారులము' అను పేరుగల భాష్యమును విరచించెను. దాని ననుసరించి తన వృత్తిని రచించినటుల నారాయణ గార్గ్యుడు,

"ఆశ్వలాయన సూత్రస్య, భాష్యం భగవతా కృతమ్
దేవస్వామి సమాఖ్యేన విస్తీర్ణం సదనాకులమ్.
తత్ప్రసాదాన్మయే దానీం, క్రియతే వృత్తి రీదృశీ
నారాయణేన గార్యేణ నరసింహస్య సూనునా.

అని తనవృత్తి యొక్క ఆరంభమున పేర్చొనియున్నాడు,

వీరలేగాక ఈ సూత్రమునకు సిద్ధాంతి, షడ్గురు శిష్యుడు అనువారలు వ్యాఖ్యలను నిర్మించియున్నారు. పిదప, విష్ణుభట్టు, తాళవృంత నివాసియగు త్రైవిద్యవృద్ధుడు ప్రయోగవృత్తులను విరచించియున్నారు. మరియు ఈ త్రైవిద్యవృద్ధుడు శ్రౌతవిషయమున వివిధ సూత్రములకు ప్రయోగవృత్తులను, ప్రయోగ దీపికలను విరచించి యున్నాడు. ఇతడు అన్ని గ్రంథములయందును.

"ఏషా త్రై విద్యవృద్ధేన తాశవృంత నివాసినా
సోమ పేన కృతావృత్తిః"

అని తన నామాదులను పొందుపరచియున్నాడు. కొన్ని లిఖిత పుస్తకములలో "తాళబృంద నివాసివా" అను పాఠాంతరమున్నది. ఇచ్చట అన్నియును విశేషణములుగా కనబడుచున్నను, త్రైవిద్యవృద్ధుడు అనునదే ఇతని ప్రసిద్ధ నామమై ఉండనోపు నని తోచుచున్నది.

ఈ సూత్రమును అవలంబించి అనేకములగు శ్రౌత గ్రంథములు ఉద్భవించినవి—— ప్రయోగప్రదీపిక, సర్వ వృష్ణాప్తోర్యామ, సప్తహౌత్ర ప్రయోగము, శ్రౌత ప్రయోగవృత్తి, శ్రౌత ప్రాయశ్చిత్త ప్రయోగము, కూష్మాండ హోమ ప్రయోగము, గణహోమ ప్రయోగము, కుండ లేష్టి ప్రయోగము, పౌండరీక హొత్రప్రయోగము మొదలయినవి పెక్కులున్నవి. శాంఖాయనుడు మహా కౌషీతకీమతము ననుసరించి 'జ్యోతిష్టోమ పద్ధతి' యను గ్రంథమును రచించినటుల తెలియనగుచున్నది. ' శాంఖాయన సూత్రప్రయోగమునకు 'బ్రహ్మదత్త మత 'మొకటి ప్రాచీన మైనది ఉన్నటుల ఈ సూత్రమునకు పద్ధతిని రచించిన శివపుర గ్రామనివాసియగు నారాయణ గార్గ్యుడు' 'పేర్కొనుచున్నాడు ——

"బ్రహ్మదత్త మనం సర్వం సంప్రదాయ పురస్సరమ్
శ్రుత్వా నారాయణాఖ్యేన పద్ధతిః కథ్యతేస్ఫుటమ్.

అని 'శాంఖాయన ద్వాదశాహ పద్ధతి ' అను మరియొక వ్యాఖ్య రఘునాధ్వాధ్వరి రచించినటుల కనబడుచున్నది.

"కౌషీతకం ప్రణమ్యాదౌ మునిం శాంఖాయనం గురూన్
క్రియతే రఘునాధేన ద్వాదశాహస్య పద్ధతి."

అని తదారంభమున అతడు కీర్తించియున్నాడు.

దీనినిబట్టి 'కౌషితకి' యనువాడు శాంఖాయను డని తెలియనగుచున్నది. ఇందు ద్వాదశస్తుత్యాహ దీక్షలు వివరింపబడియున్నవి.

సామవేదీయ శ్రోతసూత్రములు: సామవేద శాఖకు సంబంధించిన శ్రౌతసూత్రములు మూడు ప్రసిద్ధములై యున్నవి. అందు 'మశకాచార్య' కృతమైన 'ఆర్షేయ కల్ప' మనునది మొదటిదని తోచుచున్నది. మరి రెండు- ద్రాహ్యాయణ -లాట్యాయన కృతములుగా ప్రసిద్ధములైయున్నవి. ఇందు మొదటిదానికి 'వరదరాజు' ను రెండవ దానికి 'ధన్వి' యును, మూడవదానికి 'అగ్నిస్వామి'యును వ్యాఖ్యానములను రచించియున్నారు.

ఈ మూడుసూత్రములు గూడ తాండ్య బ్రాహ్మణమును, పంచవింశ బ్రాహ్మణమును అనుసరించినవిగాని, యాగప్రయోగములను వివరించుటలో ద్రాహ్యాయణ సూత్రము——"రాణాయణీయ' శాఖను, లాట్యాయన సూత్రము —— కౌధుమశాఖను అవలంబించియున్నవి. ఆర్షేయ కల్పమునందలి విషయములను అనుసరించి ఇతర సూత్ర ములు ఉండుటచే, అది మొదటిదని సిద్దించుచున్నది. ఇక ద్రాహ్యాయణ, లాట్యాయనములలో కొన్ని వందల సూత్రములు సమానముగా నుండుటచే ఏది ముందో నిర్ణయించుటకు శక్యముగాక యున్నది. అయినను వాటిలో లాట్యాయనమే తొలుతది అవి చెప్పుటకు అవకాశము కొంచెమున్నది. ఇందు గౌతమ, శాండిల్య, ధానంజయ్య, ఖాండితాయన, లామకాయన, శాండిల్యాయన, శౌచినృక్షి,రాణాయనీపుత్రాదులు పేర్కొనబడి యున్నారు.

ఆర్షేయకల్పము 11 అధ్యాయముల గ్రంథము, ద్రాహ్యాయణము 32 పటలములు కలది. లాట్యాయనము 10 ప్రపాఠకములు కలది. ​ దీనికి సంబంధించిన గ్రంథములు పెక్కులున్నవి. 'ప్రతీహారనిధానము' అను 15 ఖండికల గ్రంథ మొకటి యున్నది. దీని వ్యాఖ్యాతయగు వరదరాజపండితుడు ఈ సూత్రము కాత్యాయనకృతమని వర్ణించుచున్నాడు. "అథ భగవాన్ కాత్యాయనో పక్ష్యమాణం వస్తునిర్దిశతి" అని. జైమిని నిర్మించిన ప్రతిహారలక్షణమునకు వివరణ ముగా ఆహీశ్రేణ్యుడను నాచార్యుడు 4 పటలముల ప్రతిహారసూత్రమును విరచించినటుల తెలియుచున్నది. దీనికి వైనతేయుడు భాష్యము వ్రాసినటుల,

"భగవదాచార్యేణ జై మినినా ప్రతిహార లక్షణం సామాన్య రూపేణ ప్రతిపాదితమ్;... శావతాగ్రం థేన అధునాతనానాం అల్ప మేధసామ్... సామప్రతిహారావగతి రశక్యేతి మత్వా భగవాన్ ఆహిశ్రేణ్యో నామ ఆచార్యః ... సామ్నాం వ్యక్తతరం ప్రతిహార్యా ఆచిఖ్యాసుః ఏవ మారబ్ధవాన్" అని నిరూపించుటచే తెలియనగుచున్నది.

మరియును 'ఫుల్ల సూత్ర' మనుపేర 132 ఖండముల గ్రంథమును వరరుచి రచించినటుల వ్యాఖ్యాతయైన 'ఉపాధ్యాయాజాతశత్రువు' తెలుపుచున్నాడు. ఇవిగాక ప్రస్తావసూత్రము, ఉపగ్రంథ సూత్రము, క్షుద్రకల్పము మొదలగు మరికొన్ని సూత్రగ్రంథములును సామప్రయోగ వృత్తి మొదలగు వ్యాఖ్యలును కనబడుచున్నవి.

కాత్యాయన ప్రాతిశాఖ్య వ్యాఖ్యలో వరదరాజు కల్పసూత్రములు పది కలవని పేర్కొనియున్నారు :

"లాట్యాయన మనుపదం నిదానం కల్పమేవచ
ఉపగ్రంధాశ్చ క్షుద్రాశ్చ తం విలక్షణమేవచ
సూత్రం పంచవిధేయంచ కల్పానుపదమేవచ
అనుస్తోత్రం చ విజ్ఞేయం దశ సూత్ర ప్రకీర్తనమ్" అని.

వీనిలో 'కల్ప' మనునది అర్షేయకల్పమనియు, ఇతరములు లాట్యాయన, బ్రాహ్యాయణములచే గతార్థములైన అల్పగ్రంథము లనియును తెలియుచున్నది.

కృష్ణ యజుర్వేదీయ శ్రోతసూత్రములు: కృష్ణ యజుర్వేదీయ శ్రౌతసూత్రములును వీటి వ్యాఖ్యానములును అనంతములుగా నున్నవి. వీటిలో ఆపస్తంబ శ్రౌతసూత్రము మొదటిదిగా కన్పట్టుచున్నది. ఏలనన, "అధాఽతో ధర్మ పూర్ణ మాసౌ వ్యాఖ్యాస్యామః" అను దీని మొదటి సూత్రము బ్రహ్మ యజ్ఞ పాఠమున చేరియుండుట యొక నిదర్శనము. ఇది 30 ప్రపాఠకముల గ్రంథము. ఇది యంతయును శ్రౌతపరమేయని కొందరి అభిప్రాయము. కాని ఇందు మొదటి 24 ప్రశ్నలును కడపటి 'శుల్బ' ప్రశ్నయు మాత్రమే శ్రౌతమునకు సంబంధించినవి. తక్కిన ఐదు ప్రశ్నలలో 25, 26, 27 ప్రశ్నలు గృహ్య సూత్రాత్మకములు; 28, 29 ప్రశ్నలు ధర్మ సూత్రాత్మకములు. ఈ రెండువిధములైన భాగములును ఖండము లను విభాగములతో వేరు వేరుగా ముద్రితములై యున్నవి. అందుచే 24 ప్రపాఠకములే ఈ సూత్రమనుట యుక్తమైనవిషయము. ఇందులో 24 వ ప్రశ్న పరిభాషా ప్రవరఖండ హౌత్రమంత్రములను తెలుపుచున్నవి.

ఈసూత్రములకు 'రుద్రదత్తుడు' మొదలగువా రనేకులు వ్యాఖ్యానములను రచించి యున్నారు. అందు రుద్ర దత్తుడు రచించిన 'సూత్రదీపిక' అను వ్యాఖ్య మొదటి 15 ప్రశ్నలకు మాత్రమే లభించుచున్నదని తెలియుచున్నది. 'ధూర్తస్వామి' భాష్యము పరిభాషకు సంబంధించినది మాత్రమే లభించుచున్నది. ఇటులనే తక్కిన వ్యాఖ్యానములుగూడ అసంపూర్ణములుగానే లభించుచున్నవి. దీనికి గురుదేవస్వామి, కరవిందస్వామి, చౌండపాచార్యుడు, అహోబిల సూరి, సుందరరాజు అను నైదుగురును వ్యాఖ్యలను వ్రాసి యున్నారు. ఇందు గురుదేవస్వామి రచించినది ప్రాచీనమని కొందరి అభిప్రాయము. మూలమును సక్రమముగా వివరించునది చౌండపాచార్యుని 'ప్రయోగ రత్నమాల' ఇందలి అవతారికలో విజయనగర రాజుల వంశావళి కనబడుచున్నది.

శ్రౌతసూత్రములలో ఆపస్తంబుని కంటె బౌధాయన' మే ఎక్కువ ప్రమాణమని అందరి అభిప్రాయము. 'యజ్ఞతంత్ర సుధానిధి' అను గ్రంథమున సాయణాచార్యుడు బౌధాయనమును అధ్వర సముద్రమును దాటు నావగా రూపణముచేసి, మిక్కిలి ప్రశంసించియున్నాడు.

"అస్తి బౌధాయనం సూత్రం
       ఆద్య మాధ్వర్య వాశ్రయమ్.”

అని మహాదేవయజ్వ శ్రౌతచంద్రికలో నిరూపించియుండుట చూడ చౌధాయనము మొదటిదని తలపవలసియుండగా,

"ఆదిమం బ్రాహ్మణం క్షేమ మధ్యస్థిత పరావరమ్
అపాస్తా శేషపాప్మానం ఆపస్తంబమునిం స్తుమః”

​

అను రుద్రదత్తుని సూత్ర దీపికావతరణమునుబట్టి బ్రాహ్మణులలో నాపస్తంబుడు మొదటివాడని తలవవలసి యున్నది. కనుక ఈ ప్రశంసలు వీని సౌర్యాపర్య నిర్ణయమునకు అధికముగా ఉపయోగించుట లేదు. కాని శ్రౌత గ్రంథములలో బౌధాయనము ప్రశస్తము అను విషయము మాత్రము నిశ్చప్రచమగు విషయము.

బోధాయనసూత్రము : 30 ప్రశ్నల గ్రంథము. దీనికిని వ్యాఖ్యలు కన్పట్టు చున్నవి. వాటిలో భావస్వామి,నవహస్త, శేషనారాయణ, ద్వారకానాధయజ్వ, మహా దేవయజ్వ, యజ్ఞేశ్వర బాల దీక్షిత, వాసు దేవ దీక్షిత, వేంకటాధ్వరి, గోపాల, అనంతదేవ, సింగణు, సాయణాది కృతములు ప్రసిద్ధములై యున్నవి.

భారద్వాజ శ్రౌతసూత్రము: ఇది భారద్వాజ మహర్షి కృతము అను వైదికలోక ప్రసిద్ధిని అనుసరించి, సప్త మహర్షు లందరును సూత్రస్మృతి కర్తలే యైయుండవలసినందున అంగీకరింపవలసియున్నది గాని గ్రంథరీతి యట్లు లేదు. ఇందలి భాగములును ప్రశ్నలుగానే యున్నవి.

హిరణ్యకేశి శ్రౌతసూత్రము: దీనికి 'సత్యా పాఢ 'మనియు ప్రసిద్ధికలదు. ఇది మైత్రాయణీయశాఖకు సంబంధించినది. వీనికి 'వాంఛేశ్వర సుధి' వ్యాఖ్యానమును రచించెను. మాతృదత్త విరచిత' మగు ప్రయోగము అంతకుముందే ఉండెనుగాని, అది సూత్రార్థ సమ్మతము కానట్లు ఇతడు నిరూపించుచున్నాడు.

ఇవిగాక సప్తసోమపద్ధతి, మానవసూత్రము, వాధూన సూత్రము, వైఖానస సూత్రము, లౌగాక్షి సూత్రము, 'మైత్రసూత్రము, ' కఠసూత్రము, వరాహసూత్రము అనునవి కృష్ణయజుశ్శాఖకు సంబంధించినవిగా ప్రతీతములై యున్నవి. ఇవి అన్నియును ఆపస్తంబబోధాయనాది ప్రధానసూత్రములకు అర్వాచీనములు. వైఖానస సూత్రము శ్రీనివాస దీక్షితీయ వ్యాఖ్యలో కాననగు చున్నది. ఔఖేయశాఖకు సంబంధించిన ఈ సూత్రమును విఖనసుడు విరచించినట్లుగా, “ప్రణీతం సూత్రమౌభేయం తస్మై విఖనసే నమః" అని వ్యాఖ్యాత. కీర్తించుచున్నాడు.

ఇటుల ఆపస్తంబ, ఆశ్వలాయన, బోధాయన సూత్రములు ఆధారముగాగొని ఉద్భవించిన శ్రౌత్ర సూత్ర ప్రయోగ గ్రంథములు అసంఖ్యాకములుగా మన్నవి.

శుక్ల యజుర్వేదీయ శ్రౌతసూత్రము; కశాఖకు సంబంధించిన సూత్రములలో 'కాత్యాయన' ముని విరచితమగు శ్రౌత సూత్రము ప్రసిద్ధమైయున్నది. ఇందు 26 అధ్యాయములు కలవు. ఈగ్రంథమునకు కక్కొపాద్యాయుడు భాష్యమును విరచించెనుగాని, అదియును సూత్రప్రాయముగనే యున్నది.

కాత్యాయనుడు ‘హొత్ర మనుపేర మరియొక సూత్రమును విరచించినటుల 'కాతీయం కల్పసూత్రంచ హోత్రం కాతీయ మేప చ ॥ అనయోః కర్క భాష్యం చ సంప్రదాయాది నిర్ణయాన్, ఏతో నాలోచ్య పదార్థాదర్శ సంజ్ఞం తు గ్రంథం కుర్వే" ఆను శ్లోకములవలన తెలియ నగుచున్నది. ఇదిగూడ పూర్వసూత్రములవలె దర్శపూర్ణ మాసాదియాగముల నిరూపించుచున్నది. ఇందు ప్రథమా ధ్యాయమున వాత్స్య, కార్ణాజన్యాది పూర్వాచార్యులలో లౌగాక్షి భారద్వాజులు గూడ నున్నారు. వీరలకంటే కాత్యాయనుడు పరుడని తెలియు చున్నది.

అధర్వణ శ్రౌత సూత్రములు: వైతాననూత్రము, కౌశిక సూత్రము అనునవి అధర్వశాఖలకు సంబంధించిన శ్రౌతసూత్రములు. వీనికి వ్యాఖ్యానములున్నటుల కనబడుట లేదు. ఈ రెండును యాగక్రియా చరణమున ప్రమాణములుగా గ్రహింప బడినట్లు కనబడుట లేదు. కౌశికసూత్రము అధర్వవేదమందలి మంత్రములను ఎత్తుకొని ఆయా కర్మలను ప్రతిపాదించుచు వచ్చినది, కౌశిక మతమును ఉదాహరించుచున్న వైతాన సూత్రము దాని కన్న అర్వాచీనమని సిద్ధించుచున్నది.

శ్రౌతసూత్ర విషయ సంగ్రహము : శ్రౌతసూత్రము లన్నియును అగ్న్యాధాన, అగ్నిహోత్ర, దర్శపూర్ణి మాసాది సస్తహవిస్సంస్థలను, అగ్నిష్టోను, వాజపేయ అతిరాత్రాది సప్తసోమ సంస్థలను ప్రతిపాదించునవిగా నున్నవి. ఈ యాగములలో అగ్నిహోత్రము ప్రతిదినము సాయం ప్రాతస్సమయములయందు ఆచరింప దగినది. తక్కినవి వివిధ ఫలాపేక్షచే అనుష్ఠింపదగినవి. సోమయాగములు ఒకటి మొదలుగా 12 రోజులవరకు చేయదగినవి. సత్ర యాగము సంవత్సరములకొలది ఆచరింపవలసిన యాగము.

ఈదృశమైన యాగపద్ధతి కేవలము స్వర్గాది ఫలాపేక్షచే కల్పింపబడినదని తలపరాదు. కాకపోగా, కర్మా ​ చరణము చిత్తశుద్ధికిని, వైరాగ్యమునకును కారణమై జ్ఞాన భక్త్యాదులను కలుగ జేసి భగవదనుగ్రహ సంపాదన మూలమున మోక్ష సామ్రాజ్యానుభవమునకు మూల కంద మగు చున్నదని పరమార్థము.

గృహ్యసూత్రములు : శ్రౌతసూత్రములవలెనే గృహ్య సూత్రములును ఆపస్తంబాది మహర్షి ప్రణీతములు అనేకములు కలవు. మరియు వాటి వ్యాఖ్యానములును వాటిననుసరించి ఉద్భవించిన స్మార్త గ్రంథములును అనంతములు,

గృహ్యసూత్రములును వివిధ వేదశాఖలకు సంబంధించి పలు శాఖలుగా ఎల్లెడల వ్యాపించి యున్నవి. వీటిలో ఆపస్తంబసూత్రము దక్షిణదేశమునను, అందును ఆంధ్ర దేశమునను అనాదిగా మిక్కిలి ప్రచారములో నున్నది. ఆపస్తంబుని సూత్రములను ప్రకటించిన గార్చ్, బుల్హర్ మహాశయులును తమ పీఠికలలో "ఆపస్తంబుడు ఆంధ్ర దేశనివాసి" యని సిద్ధాంతీకరించి యున్నారు.

"బోధాయనము, ఆపస్తంబము, సత్యాషాఢము, ద్రాహ్యాయణము, అగస్త్యము, శాండిల్యము, ఆశ్వలాయనము, శాంభవము, కాత్యాయనము అను 9 సూత్రములు పూర్వసూత్రములు. వైఖానసము, శౌనకీయము, భార ద్వాజము, అగ్నివై శ్యము, జైమినీయము, వాధూలము, మాధ్యందినము, కౌండిన్యము, కౌషీతకము అను 9 సూత్రములు అర్వాచీనములు" అని అగ్ని వైశ్య' సూత్రము తెలుపుచున్నది. ఇవియేగాక, ఇంకను కొన్ని గృహ్యసూత్రములు కలవు.

గృహ్యసూత్రనామ నిర్వచనము: గర్భాదాన, పుంసపన, జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌల, ఉపనయన, వివాహాది గృహ్యకర్మలను, ఔర్వదైహిక కర్మలను ప్రతిపాదించునవగుటచే వీటికి 'గృహ్యసూత్రము' లని పేరు ప్రసిద్ధులు కలిగినవి. వీటియందు మొత్తము 40 కర్మలు చెప్పబడినవి. అందు 18 గర్భాధానము మొదలుగా వివాహపర్యంతముగల కర్మలు. 5 పంచమహాయజ్ఞములు. 3 పాకయజ్ఞములు ; ఇవి నిత్యానుషేయములైన గృహ్య కర్మలు. తక్కిన 14 శ్రోతములైన యజ్ఞకర్మలు.

వీటిలో అశ్వలాయన, శాంఖాయన (కౌషీతక), శాంభవములు మూడును ఋక్ శాఖీయములు. ఇందు మొదటిది ఆశ్వలాయన శ్రోత సూత్రమునకు అనుబంధమైనది. ఇది ఓ కాండముల గ్రంథము. రెండవది కౌషీతకి. బ్రాహ్మణోత్తములైన ఆయా గృహ్యకర్మల నొక్కచో చేర్చి వాటిని సవిస్తరముగా వర్ణించిన గ్రంథము. దీని తరువాతిదగు శాంభవసూత్రమున పితృయజ్ఞము వర్ణింపబడినది. ఈ మూడింటిలోను ఆశ్వలాయనమే ఎక్కువ ప్రమాణమై ఆచరణములో నున్నది.

దీని ననుసరించి 'శుక్లవిశ్రామ' పుత్రుడైన 'శివరామ’ శాస్త్రి ‘బహ్వృచాహ్నికమును రచియించెను. "శాకలో ఒహం ప్రయోగంచ వక్ష్యే బహ్వృచ కర్మణాం" అను దానినిబట్టి శాకలుడు తన పేర ఒక కారిక రచియించి నటుల తెలియుచున్నది. మరియు భట్ట కుమారిల స్వామి 'ఆశ్వలాయన సూత్రప్రదీపిక' అను పేర మరి యొక కారికను రచించెను. ఈ కారిక ఆశ్వలాయన గృహ్య సూత్రవృత్తికి సంగ్రహమై యున్నట్లు తెలియు చున్నది.

సామశాఖీయ గృహ్య సూత్రములలో లాట్యాయన మతానుసారియైన గోభిలీయసూత్రము మొదటిదిగా కన బడుచున్నది. ఇది 4 ప్రపాఠకముల గ్రంథము. ఇందు గృహ్యవిషయము అన్నియును విశదీకరింపబడి యున్నవి. దీనికి ఛాందోగ్య గృహ్యసూత్రమనియు పేరు కలదు. దీనికి నారాయణపండితుడు వృత్తిని రచించెను. మరియు శివ రామపండితుడు 'కృత్య చింతామణి' అను గ్రంథమును రచించెను.

ఖాదిర గృహ్య సూత్ర మనునది రాణాయనీయశాఖకు చెందినది మరియొకటి కలదు. ఇది ద్రాహ్యాయణమతము ననుసరించినది. కాని విషయమునందేది గోభిలసూత్రమునే పోలియున్న దని విమర్శకులు తెలుపుచున్నారు. ఇందు 4 పటలము లున్నవి. ఖాదిరసూత్రమందు దర్శపూర్ణ మాస, ఆగ్నేయ, స్థాలీపాక, పుంసవనాది కర్మలు ప్రతిపాదింపబడినవి. గోఖిలసూత్రమును అవలంబించి వచ్చినది ఛందోగపరిశిష్టము. దీని కర్త కేశవమిత్రుడు. ఈపరిశిష్టమునకు నారాయణ పండితుడు 'ప్రకాశ' మను వ్యాఖ్యను వ్రాసెను. ఈ పరిశిష్ట ప్రకాశమునకు 'సారమంజరి' అను వ్యాఖ్యను శ్రీనాథాచార్యుడు వ్రాసెను.

మరియు జైమిని గృహ్యసూత్రము, ద్రాహ్యాయణ గృహ్యసూత్రము గూడ ఉన్నటులు వాటి ననుసరించి వచ్చిన ​ గ్రంథములనుబట్టి తెలియనగుచున్నది. ఇవిగాక, జైమిని, గోభిల సూత్రములను అనుసరించి 'కర్మప్రదీపము' అనుకారికాగ్రంథ మొకటి యున్నది. అందు 500 శ్లోకములు 10 ఖండికలుగా నున్నటుల 'గై క్వార్' అను పరిశోధకుడు తెలుపుచున్నాడు. దీనికి 'అశార్కమిత్రుడు' భాష్యమును విరచించెను. ప్రకరణాంత్య గద్యములవలన భాష్యకర్త ఆశాదిత్యమిశ్రుడనియు, అతని తండ్రి 'చక్రధరమిశ్రు'డనియు తెలియుచున్నది. ఇంకను ఈ శాఖీయములగు గ్రంథములు అనేకములున్నవి.

కృష్ణ యజుశ్శాఖీయ గృహ్యసూత్రములు: తైత్తిరీయ శాఖలో ‘ఆప స్తంబ సూత్రు' అనియు, 'బౌధాయనసూత్రు'లనియు ఇరుతెరగులవారు కలరు. ఆంధ్రదేశమునందలి తైత్తిరియు లందరును ఆపస్తంబ సూత్రులే. అటులనే మైత్రాయణీయశాఖలో హైరణ్యకేశులు మానవులు అను భేదము గలదు. ఆయాశాఖల వారు తమతమ సూత్రములనే గృహ్యకర్మలందు ప్రమాణముగా స్వీకరింతురు. అట్టి సూత్రములు ఆపస్తంబము, బౌధాయనము, హిరణ్య కేశి, మాసవము, కఠము, వైఖానసము అనునవి. ఇవిగాక, భారద్వాజ, శాట్యాయన గృహ్యసూత్రములు రెండు తైత్తిరీయ శాఖకు చెందినవి కలవు. కాని ఆ సూత్రములవా రెచ్చట నున్నారో తెలియుట లేదు.

ఆపస్తంబ సూత్రము 23 ఖండముల గ్రంథము: ఇందు 405 సూత్రములున్నవి. దీనికి 'హరదత్తు' డు అనాకుల వృత్తిని, సుదర్శనాచార్యుడు తాత్పర్య దర్శనమును, కపర్దిస్వామి భాష్యమును రచించిరి. ఈగృహ్యసూత్రము దీని శ్రౌతసూత్రములోని 27 వ ప్రశ్నయే అని కొందరనుచున్నారు. శ్రౌతసూత్రము 24 ప్రశ్నముల గ్రంథమే. తరువాతివి గృహ్య ధర్మములను బోధించుచున్నవి. వీటి నన్నిటిని చేర్చి ఒక భాగములో వ్రాసియున్నారు. దానినిబట్టి శ్రౌతసూత్రమునందలి భాగమని ప్రతీతి కలిగినదిగాని, అది సరికాదు. అని మరికొందరు చెప్పుచున్నారు.

శ్రుతిలక్షణములు, ఆచారలక్షణములు అని కర్మలు ద్వివిధములు. మొదటివి యాగాదులు, ఆచారగమ్యము లైన వివాహాదికర్మలు, ఆచార లక్షణములు,

బోధాయన గృహ్యసూత్రములు: ఇది 4 ప్రశ్నల గ్రంథము. ఇందు 12 అధ్యాయములు గలవు. దీనితోబాటు రెండు ప్రశ్నల పరిభాషయు, 5 ప్రశ్నల గృహ్య శేషము, 3 ప్రశ్నల వితృమేధము అను మూడు సూత్రగ్రంథములును బోధాయన నిర్మితములుగా ఉపలభ్యములగు చున్నవి.

దీనికి వ్యాఖ్యానము లెంచును కనబడుటలేదు. 'శిష్ట' వ్యాఖ్యాన' మని అసమగ్రము, అపరిశుద్ధము, అతి సంక్షిప్తము అయినదొకటి లభించినదిగాని, తృప్తికరముగా లేదని గృహ్య సూత్రప్రకాశకులు వ్రాసియున్నారు. మైత్రాయణీయ మానవసూత్రము రెండు పురుషములుగా విభజింపబడినది. ప్రథమపురుషమున 23 ఖండములును, ద్వితీయపురుషమున 18 ఖండములును కలవు. బ్రహ్మచారి నియమములతో ఆరంభమయిన ఈ సూత్రము పుత్రేష్ట యాగముతో ముగియుచున్నది. దీనికిని వ్యాఖ్యానము కనబడదు.

కఠగృహ్యసూత్రము లభింపలేదు. ఔఖేయశాఖకు చెందిన వైఖానససూత్రము 11 ప్రశ్నల గ్రంథము. ఇది “అథ నిషేకాది సంస్కారాన్ వ్యాఖ్యాస్యామః" అని ఆరంభమయి వివిధ గృహ్యకర్మలను తెలుపుచున్నది. ఇవిగాక తైత్తిరీయమునకు ఆపస్తంబ గృహ్య సూత్రకారిక, ప్రయోగప్రదీపిక, గృహ్యరత్నము, పితృ మేధ ప్రశ్న భాష్యము, విధానమాల, సంస్కార నిర్ణయము, పాకయజ్ఞ నిర్ణయము మొదలగు గ్రంథములున్నవి.

శుక్లయజుశ్శాఖీయ గృహ్యసూత్రములు: వీటిలో పారస్కర గృహ్యసూత్రము ప్రసిద్ధమై యున్నది. దీని కర్త యగు పారస్కరుడు, వాక్యకారుడైన వరరుచియు, శ్రౌతసూత్రక ర్తయునైన కాత్యాయనుడేగాని అన్యుడు కాడని పెద్దలు చెప్పుచున్నారు. ఇది 3 కాండముల గ్రంథము. దీనికి చేరిన పరిశిష్టకండిక, శౌచసూత్రము, స్నానసూత్రము, స్రాద్ధసూత్రము. భోజనసూత్రము అనునవి కలవు.

ఈ మాత్రమునకు కర్కోపాధ్యాయుడు, జయరామా చార్యుడు, హరిహరాచార్యుడు, గదాధర దీక్షితులు అనువారు భాష్యములు వ్రాసిరి. వీరిలో మొదటివాడే ప్రాచీనుడు.

ఆధర్వశాఖీయ గృహ్యసూత్రములు : ఈ శాఖకు "కౌశిక" సూత్రమని ప్రసిద్ధి కలదు. ఈ కౌశిక సూత్ర ​ ములలో వివాహాది కర్మలేగాక, అధర్వవేదీయములైన ఆభిచారిక కర్మలుగూడ ప్రతిపాదింపబడుచున్నవని మేగ్డా నల్ మహాశయుడు వ్రాసియున్నాడు.

మరియును 'కమలాకరభట్టు' రచించిన అగ్ని నిర్ణయము, నారాయణభట్టు రచించిన గృహ్యాగ్ని సారము, గృహ్య కల్పతరువు మొదలుగాగల కొన్ని గ్రంథములును అర్వాచీనములు, ఉపలబ్ధము లగుచున్నవి.

ధర్మసూత్రములు : ఇవి 4, 5 మాత్రమే ప్రసిద్ధములై యున్నవి. ఇందు ఆపస్తంబ, హైరణ్యకేశీయ, బౌధాయనములు, కృష్ణయజుశ్శాఖియములు. గౌతమ సూత్రము, సామశాఖీయము. ‘వైఖానస ధర్మప్రశ్నము' అను పేరనొక సూత్రగ్రంథము ముద్రితమై యున్నది.

పై సూత్రములయందు ఉదాహరింపబడిన మతాంతరములనుబట్టి మరికొన్ని ధర్మసూత్రము లుండి యుండ వలయు నని తెలియుచున్నది. గద్యపద్యాత్మకముగానున్న 'వాసిష్ఠస్మృతి' యొకటి పూర్వధర్మశాస్త్రములలో పరిగణింపదగి యున్నది. అది స్మృతియైనను సూత్రగౌరవమునకు తగియున్నది.

ధర్మసూత్రముల పౌర్వాపర్యము : మను, హారితములను ఉద్ఘాటించిన ఆపస్తంబము వాటికంటే పరము, పాణినీయమునకు పూర్వమని తెలియుచున్నది. 'భాల్లవు' లను పురాతనులనుగా 'నిర్వచించిన పాణినీయ మతమునకు ఆధారభూతమయిన 'థాల్లవిగాథ' ను ఉదాహరించుటచే వాసిష్ఠము పాణినీయమునకు పూర్వమైయుండవలయును. దీనిని గౌతమముని పేర్చొన్న బౌధాయనము, హిరణ్యకేశి సూత్రమునకంటె పూర్వముగా కనబడుచున్నది. క్రీ. పూ. 5 వ శతాబ్దిలోని శిలాశాసనములో హిరణ్యకేశి శబ్దముండుటచే అంతకుపూర్వమై యుండవలయును. గౌతము. ఆప స్తంబములలో నేది ప్రాచీనమో నిశ్చయించుటకు వీలు లేకున్నది.

'వాసిష్ఠస్కృతి: 30 అధ్యాయముల గ్రంథము. ఇందు మను, హారీత, గౌతమ, ప్రజాపతి, యమ, వసిష్ఠుల మతములును, కాఠిక, భాల్లవి. వాజస, కాయక మతములును ఉద్ఘాటింపబడియున్నవి.

ధర్మసూత్రములలో ఉత్తమోత్తమమైనది ఆపస్తంబము. ఇది దక్షిణదేశమున సకల వర్ణాశ్రమాచారము లకును పరమప్రమాణమై యున్నది. ఇది 2 ప్రశ్నల గ్రంథము. ఈ రెండును శ్రౌతసూత్రములోని 28, 29 ప్రశ్నలని కొందరును, వేరుగ్రంథమని మరికొందరును భావించుచున్నారు. ఇంట్లొక్కొక్క ప్రశ్నమునకు 11 పటలములు గలవు.

ఈ ధర్మసూత్రములు, సామయి కాచారములను బొధించును. సమయ మనగా మనుష్యులు చేసిన వ్యవస్థ. అదివిధి, నియమ, ప్రతి షేధ భేదములచే త్రివిధముగుచున్నది.

ఆపస్తంబమువలెనే హైరణ్యకేశి ధర్మసూత్రముగూడ తన కల్పసూత్రమునకు అనుబంధము, 27 అధ్యాయముల శ్రౌతసూత్రములలో 26, 27 అధ్యాయములు ధర్మసూత్రములు. ఇది మనదేశమున వ్యాప్తిలో లేదు.

గౌతమధర్మసూత్రము: ఇది క3 ప్రశ్నల గ్రంథము. ఇదియును దక్షిణదేశమున ఎక్కువ వ్యాప్తిలో సున్నది. ఇది జన్మచే సామ వేదీయ మైనను, ఇందలి విషయము సర్వశాఖా సామాన్యమై వెలయుచున్నది. ఇందలి 26 వ అధ్యాయము సామవిధాన బ్రాహ్మణము ననుసరించుటచే ఈ సూత్రము సామశాఖీయమని స్పష్టమగుచున్నది.

దీనికి ‘హరదత్తుడు' 'మితాక్షర' వ్యాఖ్యను రచించేను. ఇందలి లౌకిక ధర్మములు హిందూకోడ్లో ఉదాహరింప బడియున్నవి. 'క్రియా కాండ' మను పేర ఈ సూత్రములకు పరిశిష్టగ్రంథ మొకటిగలదు. కాని ఇది గౌతమ నిర్మితము కాదు.

బౌధాయన ధర్మసూత్రము : ఇది 4 ప్రశ్నల గ్రంథము. ఇందలి విభాగములకు అధ్యాయము లని పేరు.దీనికి గోవిందస్వామి రచించిన వ్యాఖ్య ప్రసిద్ధమైయున్నది. 'ఇతర శాఖీయములును బౌధాయనము ననుసరించిన స్వసూత్రము ననుసరించిన ట్లగును' అని వృద్ధమనువు చెప్పియున్నాడు. దానినిబట్టి ఈ సూత్రమునకుండు పరమ ప్రామాణికత్వము, మహిమయు వ్యక్తములగుచున్నవి.

స్రౌతగృహ్య సూత్రములందువలెనే ధర్మసూత్రము లందును సంప్రదాయ భేదములు కొన్ని కనవచ్చుట మాత్రమే గాక, దేశ భేదమును బట్టి వచ్చిన ఆచారములును కొన్ని కనిపించుచున్నవి. వాసిష్ఠమువలెనే ఆపస్తంబము షడ్విధవివాహములను చెప్పగా, గౌతమము 8 విధములను చూపుచున్నది. ​ఇంకను ఈ విషయములను విపులముగా బోధించు స్మృతి గ్రంథములు లెక్కకు మీరియున్నవి.

సూత్రము లన్నిటియందును సాధారణముగా పర్ణాశ్రమ విభాగములు, సర్వవర్ణాశ్రమాచార సంబంధము లయిన సాంఘిక ధర్మములును వివరింప బడుచున్నవి. ధర్మ సూత్రములు ఉపదేశించిన పావనజీవనము ఇప్పుడు కలలోని వార్తయయినది.

తి. కు. వేం. న. సు.