Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కర్నూలు జిల్లా

​కర్నూలు జిల్లా:

ఆంధ్ర ప్రదేశమందు రాయలసీము లేక దత్తమండలము అసబడు ప్రాంతమున కర్నూలుజిల్లా కలదు. ఇది 14°55′-- 16°20' ఉత్తర అక్షాంశముల మధ్యను, 77°20′-79°35' తూర్పు రేఖాంకముల మధ్యను కలదు. దీనికి ఉత్తరమున గుంటూరు, మహబూబునగరము, రాయచూరు జిల్లాలు, పశ్చిమమున బళ్ళారిజిల్లా, దక్షిణమున అనంతపురము, కడప జిల్లాలు, తూర్పున గుంటూరు నెల్లూరు జిల్లాలు సరిహద్దులుగా నున్నవి. దీని విస్తీర్ణము 7836 చ. మైళ్ళు (50,15,222 ఎకరములు) (1951).

ఈ జిల్లాయందు మూడు రెవిన్యూ డివిజనులు కలవు. వీటిలో ఈ క్రింది పది తాబాకాలు కలవు.

1. కర్నూలు డివిజన్: దీనిలో కర్నూలు, పత్తికొండ,నందికొట్కూరు, ధోనె తాలూకాలు కలవు,

2. నంద్యాల డివిజన్: దీనిలో నంద్యాల, కోయిలకుంట్ల, బంగనపల్లి, సిరివెళ్ళతాలూకాలు కలవు.

3. మార్కాపురము డివిజన్: దీనిలో కంబము మార్కాపురము తాలూకాలు కలవు.

ఈజిల్లాలో 839 గ్రామములు, 14 పట్టణములు కలవు. జనాభా 12,70,843 మంది. ఇందు 6,43,594 మంది పురుషులు, 6,27,249 మంది స్త్రీలు కలరు. జనసాంద్రత 162.

కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రము ఏర్పడినప్పుడు బళ్లారి జిల్లాలోని ఆదోని, ఆలూరు తాలూకాలు ఈ జిల్లాలో కలుపబడినవి (1953). అప్పుడు తాలూకాల సంఖ్య 12 అగును.

ఈ జిల్లాలోని తాలూకాల వివరము (1951):

1. కర్నూలు తాలూకా : దీని విస్తీర్ణము 641 చ. మై. దీనిలో 91 గ్రామములు, 3 పురములు కలవు (కర్నూలు, ​ కోడుమూరు, గూడూరు). మొత్తం జనాభా 1,98,288 : పురుషులు 99,866; స్త్రీలు 98,422 ; జనసాంద్రత 309.

2. నందికోట్కూరు తాలూకా : దీని విస్తీర్ణము 1092 చ.మై. ; గ్రామములు 103; పురములు 2 (ఆత్మకూరు, నందికోట్కూరు); మొత్తము జనాభా 1,49,738; పురుషులు 75,336; స్త్రీలు 74,402 : జనసాంద్రత 137.

ప్రస్తుతము ఈ తాలూకాలో ఆత్మకూరు ముఖ్యపట్టణముగా నొక సబ్ తాలూకా వేరుగా నున్నది.

3. మార్కాపురము తాలూకా : దీని విస్తీర్ణము 1366చ. మై; గ్రామములు 99; పురము 1 (మార్కాపురము) ; జనాభా 138,120; పురుషులు 70,122; స్త్రీలు 67, 998; జనసాంద్రత 101.

4. పత్తి కొండ తాలూకా : దీని విస్తీర్ణము 747 చ. మై. ; గ్రామములు 69; పురములు 2 (మద్దికర, పత్తికొండ); మొత్తం జనాభా 126,922 : పురుషులు 64,194 ; స్త్రీలు 62,728 ; జనసాంద్రత 170.

5. ధోనే తాలూకా : దీని విస్తీర్ణము 836 చ. మై; గ్రామములు 75; పురము 1 (ధోనె); మొత్తం జనాభా 127,234; పురుషులు 65,322 ; స్త్రీలు 61,912; జన సాంద్రత 152.

6. నంద్యాల తాలూకా : దీని విస్తీర్ణము 664 చ. మై.; గ్రామములు 76: పురము 1 (నంద్యాల); మొత్తం జనాభా 1,25,392 ; పురుషులు 63,123 ; : స్త్రీలు 62, 270; జనసాంద్రన 189.

7. కంటము తాలూకా: దీని విస్తీర్ణము 1048 చ. మై; గ్రామములు 95: పురములు 2 (కంబము, గిద్దలూరు) ; మొత్తం జనాభా 163,845; పురుషులు 83,113; స్త్రీలు 80,732; జనసాంద్రత 156.

8. బంగనపల్లి తాలూకా : దీని విస్తీర్ణము 256 చ. మై,; పురములు 2 (బంగనపల్లి, కొండాపేట); మొత్తం జనాభా 43,447; పురుషులు 22,082, స్త్రీలు 21,365; జనసాంద్రత 170. ఈ తాలూకా కోయిలకుంట్ల తాలూకాలోని సబ్ తాలూకాగా నున్నది.

9. కోయిలకుంట్ల తాలూకా : దీని విస్తీర్ణము 573 చ.మై.; గ్రామములు (పై తాలూకాతో కలిసి) 140 ; పురము 1 (కోయిలకుంట్ల); మొత్తం జనాభా

​

93,132 : పురుషులు 47,190; స్త్రీలు 45,942 ; జన సాంద్రత 163.

10. సిరివెళ్ళ తాలూకా : దీని విస్తీర్ణము 613 చ. మై.; గ్రామములు 91; మొత్తం జనాభా 104,724; పురుషులు 53,246; స్త్రీలు 51,478; జనసాంద్రత 171.

11. ఆదోని తాలూకా : దీని విస్తీర్ణము 766 చ. మై. గ్రామములు 147; పురములు 3 (ఆదోని, ఎమ్మిగనూరు, కోసిగి); జనాభా 2,25, 220; పురుషులు 1,13,396 మంది ; స్త్రీలు 1,11,824 మంది; జనసాంద్రత 294. ఆదోని మొదటి పేరు ఆదవాని,

12. ఆలూరు తాలూకా : దీని విస్తీర్ణము 613 చ. మై; గ్రామములు 80; జనాభా 1,22,558; పురుషులు 61,718 మంది; స్త్రీలు 60,840 మంది; జనసాంద్రత 200. (1951)

శీతోష్ణ పరిస్థితి : ఈ జిల్లా దక్కను పీఠభూమిలో సముద్ర మట్టమునకు 3086 అడుగుల ఎత్తున ఉండి చక్కని శీతోష్ణస్థితిని కలిగియున్నది. సంవత్సరమునకు ఈ జిల్లాలోని సగటు వర్ష పాతము 50 దుక్కులు.

ఎఱ్ఱమల, నల్లమల, వెలిగొండ అనునవి ఈజిల్లాయందలి ప్రధానమగు పర్వతశ్రేణులు. వీటి ఎత్తు సగటున 2000 అడుగులనుండి 3000 అడుగుల వరకు ఉండును.

నదులు : ఈ జిల్లాలో కృష్ణ, తుంగభద్ర, హంద్రి, కుందు, గుండ్లకమ్మ, సగిలేరు అను ముఖ్యమైన నదులు ప్రవహించుచున్నవి. కృష్ణా, తుంగభద్రా నదులు జిల్లాకు ఉత్తర సరిహద్దుగా ప్రవహించుచున్నవి. హంద్రీనది పత్తికొండ, కర్నూలు తాలూకాలగుండా ప్రవహించి కర్నూలు పట్టణమునకు దిగువన తుంగభద్రలో కలియు చున్నది. ఇంకను దిగువన తుంగభద్ర కృష్ణలో కలియును. కుందునది నంద్యాల, కోయిలకుంట్ల తాలూకాలగుండా ప్రవహించి కడపజిల్లాలో పెన్నానదిలో కలియుచున్నది. గుండ్లకమ్మ నల్లమలై కొండలలో పుట్టి కంబము, మార్చా పురము తాలూకాలగుండా ప్రవహించి గుంటూరుజిల్లా గుండా పోవుచున్నది.

అడవులు : అడవుల విస్తీర్ణము 16,60,142 ఎకరములు.

నీటి పారుదల : ఈ జిల్లాలో కర్నూలు - కడప కాలువ పెద్ద ప్రణాళిక. కర్నూలునకు పశ్చిమముగా 17 మైళ్ల దూరమున తుంగభద్రకు సుంకేశులవద్ద ఆనకట్ట నిర్మించి అటనుండి దీనిని త్రవ్విరి. ఈ కాలువ కర్నూలు, నంది కోట్కూరు, నంద్యాల, సిరివెళ్ళ, కోయిలకుంట్ల తాజాకాల గుండా పోవుచున్నది. దీనివలన ఒకటిన్నర లక్షల ఎకరముల భూమి సాగు కాగలదని అంచనా వేయబడెను.ఇదిగాక కంబం చెరువుక్రిందను, ఇంకను అనేకములైన చిన్న చెరువులక్రిందను చాల భూమి సాగు చేయబడుచున్నది.

పంటలు : ఈ జిల్లాయందు వరి, చోళ్ళు, రాగులు, కొఱ్ఱలు, వరిగలు మున్నగు ఆహారధాన్యములు, పప్పు ధాన్యములు పండును. వేరు సెనగు, పొగాకు ఆర్థికపు పంటలు. వాటి వివరము లి దిగువవిధముగా నుండును.

వరి 75,524 ఎకరములు ; చోళులు 457,818 ఎకరములు; రాగులు 20,235 ఎకరములు; కొఱ్ఱలు 4, 17, 021 ఎకరములు; పరిగలు 98,579 ఎకరములు; వేరుసెనగ 548,579 ఎకరములు ; పొగాకు 36,669 ఎకరములు ; కందులు 36,772 ఎకరములు.

ఖనిజములు: పూర్వము రత్నాలకోట, (ఇప్పుడు రామళ్ళకోట) జొన్నగిరి మొదలగు గ్రామములలో రత్నములు లభ్యమయ్యేడివట. ఇనుము, ముగ్గురాయి, రంగురాయి, పలక, సీసము మొదలగు ఖనిజములకు ఈ జిల్లా పేరెన్నికగన్నది.

రహదార్లు: ఈ జిల్లానుండి బళ్ళారి, గుత్తి, తాడిపత్రి, ప్రొద్దుటూరు మున్నగు తావులకు రోడ్లుకలవు. మొత్తము 1312 మైళ్ళ పొడవుగల రోడ్లు కలవు.

"రైలుమార్గములు : 165 మైళ్ల రైలుమార్గములు కలవు. బందరునుండి హుబ్లి పోవు మీటరు గేజి, మద్రాసునుండి బొంబాయి పోవు పెద్దలైను ఈ జిల్లా గుండా పోవును.

ఆయా మాతృభాషలు మాటాడువారు: తెలుగు. 10,87,425 మంది ; హిందుస్తానీ - 152,071 మంది ; కన్నడము-9,209 మంది; లంబాడీ-5,800 మంది ; మరాఠీ 5,676 మంది ; తమిళము. 3,646 మంది ; హిందీ-3,194 మంది; ఎరుకల, కొరవ మొదలగునవి. 2,547 మంది : గుజరాతి - 722 మంది ; మలయాళము-479 మంది ; సింధి-56 మంది; బెంగాలి-15 మంది : తుళు-3 మంది. . ​ మతములు : హిందువులు-992,850 మంది ; జైనులు-153 మంది ; మహమ్మదీయులు-186,004 మంది; క్రైస్తవులు-91,832 మంది.

వైద్యశాలలు : జిల్లా ప్రధాన నగరనుగు కర్నూలులో 128 మంచములు గల ఒక ప్రభుత్వ వైద్యశాల కలదు. ఇదిగాక 46 పడకలుగల సెయింటు థెరెసా వైద్యశాల, ఒక ఆయుర్వేద వైద్యశాల, ఒక యునానీ వైద్యశాల కలవు, ప్రతి తాలూకానగరమందును వైద్యశాలలు కలవు. నంద్యాలలో 88 పడకలుగల మిషను వైద్యశాల కూడ కలదు. పై ప్రజాసౌకర్యములన్నియు 1953 లో కర్నూలు ఆంధ్ర రాష్ట్రమునకు ముఖ్య పట్టణముగా ఏర్పడిన తరువాత మిక్కిలి అభివృద్ధి గావింపబడినవి.

యాత్రాస్థలములు : దేశమందంతటను అత్యంత ప్రసిద్ధమైన శైవ క్షేత్రమగు శ్రీశైలము ఈ జిల్లాలో నందికొట్రూరు తాలూకాయందు కృష్ణాతీరమున కలదు. ఇచటికి దేశమునం దన్ని భాగములనుండి యాత్రికులు వచ్చుచుందురు. మహాశివరాత్య్రత్సవ సందర్భమున ఇచట గొప్ప ఉత్సవము జరుగును. ఇచటి దేవుని పేరు మల్లి కార్జున స్వామి. శ్రీశై లశిఖరమును సందర్శించినంత మాత్రముననే మోక్షము ప్రాప్తించునని పురాణోక్తి. సిరివెళ్ల తాలూకాలోని రుద్రవరమువద్దనున్న అహోబిలము ఒక సుప్రసిద్ధ వైష్ణవక్షేత్రము. ఇచటి దేవుడు నరసింహస్వామి. మహానంది, ఓంకారము, సంగమేశ్వరము, త్రిపురాంతకము, పెదకోటకొండ అను ప్రసిద్ధమైన యాత్రాస్థలములుకూడ కలవు. త్రిలింగదేశమున శైవ వైష్ణవ పీఠముల వికాసమునకును, శైవ వైష్ణవమత వ్యాప్తికిని ఒకప్పుడు ఈ జిల్లా కేంద్రస్థానముగా నుండెను. ఆదోని తాలూకాలో తుంగభద్రాతీరమునందలి మంత్రాలయము మాధ్వుల పవిత్ర స్థలము ఇచ్చట రాఘవేంద్రస్వామి వెలసియున్నారు. ఆగస్టులో రథోత్సవము జరుగును. ఆదోనిలో ఒక గొప్ప మసీదు అలంకరణ శిల్పమందు ప్రసిద్ధిగాంచి యున్నది.

విద్య : ఈ జిల్లాయందు ఒకకళాశాల (కర్నూలులో), 24 బాలుర ఉన్నత పాఠశాలలు, రెండు బాలికోన్నత పాఠశాలలు, ఒక ట్రైనింగు కళాశాల, ఆరు ట్రైనింగు పాఠశాలలు, 1,133 ప్రాథమిక పాఠశాలలు కలవు(1951).

పరిశ్రమలు : ఈజిల్లాలో పేర్కొనదగిన పెద్దపరిశ్రమలు లేవు. కర్నూలు నందు ఒక డాల్డా ఫ్యాక్టరీకలదు. కర్నూలు, నంద్యాల, పత్తికొండ, ధోనె (ద్రోణాచలము) తాలూకాలలో అనేకములగు నూనె కర్మాగారములు కలవు. గృహ పరిశ్రమలలో చేనేత, అద్దకము, ఉన్ని పరిశ్రమ మున్న గునవి చేరియున్నవి. మార్చాపురము వద్ద పలకలను తయారుచేయు పెద్ద పరీశ్రను కలదు. ఆదోని తాలూకాలో 37, ఆలూరు తాలుకాలో 18 గూదిమిల్లులు కలవు. ఈ మాదిమిల్లులలో మొత్తము 1726 మంది కార్మికులు పనిచేయుచుండిరి.

చరిత్ర : కర్నూలుజిల్లా చారిత్రక ప్రాముఖ్యము కలది. చెంచులు, కిరాతులు పూర్వము ఇచ్చట నివసించు చుండిరట. పాండవవంశ్యుడగు ఉత్తుంగభోజుని కుమారుడైన నందచక్రవర్తి ఉత్తరాపథమునుండి ఈ ప్రాంతమునకు వచ్చెనట. ఆయన తన వెంట వచ్చిన 500 బ్రాహ్మణ కుటుంబములకు నందవరమును అగ్రహారముగ నిచ్చినాడందురు. వారలకు నందవరములోని చౌడేశ్వరి కులదేవత. క్రీ. శ. 225-340 లలో ఆదవాని రాజధానిగా ఏలినట్టి పల్లవరాజ్యములో ఈ జిల్లా చేరియుండెను. ఆతరువాత కొన్ని శతాబ్దముల చరిత్ర తెలియదు. పశ్చిమ చాళుక్యరాజుల ఆధీనములో ఇది కొంతకాలముండినది. క్రీ. శ. 1060 సంవత్సరములో చోళులు ఈజిల్లాపై దండెత్తివచ్చి ప్రజలజీవితమును ఛిన్నాభిన్న మొనర్చినారు.

భౌగోళికముగ ఈ జిల్లా ఎఱ్ఱమల, నల్లమల అను కొండలచే మూడు విభాగములగుచున్నది. 12వ శతాబ్దా రంభమున ఎఱ్ఱమలకు తూర్పుననున్న భాగమును చోళులు, పశ్చిమముననున్న కొంతభాగమును యాదవులు ఆక్రమించిరి. 13వ శతాబ్దమందు ఈ జిల్లా కాకతీయుల హస్త గతమయ్యెను. ప్రతాపరుద్రుని తరువాత ఈ జిల్లాలో పెక్కురు సామాన్యరాజుల యొక్క పరిపాలనము కొనసాగినది. 1328.1460 సం. ల మధ్య నల్లమల కొండలకు తూర్పుగనున్న ప్రాంతము అనవేమారెడ్డి వంశ్యుల పాలనములోను, పశ్చిమభాగము విజయనగర రాజ్యపరిపాలనములోను ఉండెను. 1525 కృష్ణదేవరాయలనాటికి జిల్లాఅంతయు ఆతని ఏకచ్ఛత్రాధిపత్యము క్రిందికి వచ్చినది. తళ్ళికోట (1565) యుద్ధానంతరము ఇది బీజాపురము సుల్తానుల కైవసమయ్యెను. తరువాత 1775-79 లో ​ హైదరు కర్నూలు జిల్లాను వశపరచుకొనెను. అప్పటికే నైజాం స్వతంత్రుడై తన రాజ్యమును వశపరచుకొనుట జరిగినది.

నేటి కర్నూలుజిల్లా దండకారణ్యములో నొక భాగముగ నుండెననియు, రాక్షసుల సామ్రాజ్యమున కొంత కాలముండెననియు, ఆర్య నాగరికతా ప్రభావము ఇచట మెలమెల్లగ వ్యాపించెననియు ఒక ప్రతీతి కలదు. సీతాదేవిని వెదకుటకై పంచవటినుండి కిష్కింధకు వెళ్లుచు శ్రీరాముడు ఈ ప్రాంతమందు అడుగిడెనని చెప్పుకొందురు. కంచిని దర్శించుటకై హ్యుయాన్ త్సాంగ్ కర్నూలు మీదుగనే ప్రయాణించెనట! మార్కాపురం జిల్లా త్రిపురాంతక గ్రామములోని శాసనమొకటి విక్రముని పేరిట కనిపించుచున్నది. ఈ భాగము క్రీ. శ. 5వ శతాబ్దమునుండి 10వ శతాబ్దమువరకు చాళుక్యుల స్వాధీనమందున్నట్లు తెలియుచున్నది. కుంతలదేశ మందున్న (Modern Deccan) ఒక శిలాశాసనము వలన ఈ కర్నూలుజిల్లా క్రీ. శ. 1059 ప్రాంతమందు కంచి చోళ రాజు యొక్క స్వాధీనమందున్నట్లు అధికారపూర్వకమైన ఆధారమొకటి కలదు. గోరెంట్ల దేవాలయము నందలి శాసనమువలన స్థానికులైన యాదవులు చాళుక్య విక్రమునకు కొన్ని బాధలు కలిగించినట్లు తెలియు చున్నది. తరువాత కాకతి గణపతిదేవుడును, రెండవ ప్రతాపరుద్రుడును తమ అధికారమును జిల్లా యంతటను సాగించిరి. క్రీ.శ. 1686 వ సం. బీజాపూరు సుల్తానులనుండి ఈ ప్రాంతమంతయు ఢిల్లీ చక్రవర్తికి స్వాధీనమయ్యెను. ఆతరువాత కర్నూలుజిల్లా స్థానిక రాజులచేతను, పాలెగాండ్ర చేతను, ఖండ్రిక లుగా పరిపా లింపబడి కొంతకాలము హైద్రాబాద్ నవాబు స్వాధీన మందుండి చివరకు ఈస్టిండియా కంపెనీవారికి దత్త మయ్యెను. 1800-01 నాటికి అది బ్రిటిషువారి సామ్రాజ్యములో నొక భాగముగా నేర్పడెను.

క్రీ. శ. 11 వ శతాబ్దమునుండి సాంస్కృతిక రంగమందు ఈ జిల్లాకొక ప్రత్యేకత కనిపించుచున్నది. మల్లి కార్జున పండితుని గ్రంథములు మొదలుకొని అనేక ప్రసిద్ధాంధ్ర రచనలు ఇచ్చట సాగింపబడెననియు, పింగళి సూరన్న వంటి కవిముఖ్యులకు కొంతకాలము ఈ జిల్లా నివాసస్థానమయ్యేననియు చరిత్ర చాటుచున్నది.

కర్నూలుపట్టణము : ఈజిల్లాకు కేంద్రస్థానము కర్నూలు పట్టణము. కేంద్రప్రభుత్వము యొక్క శాసనము ననుసరించి 1953 అక్టోబరు ఒకటవ తేదీ మొదలు 1956 నవంబరు ఒకటవ తారీఖుపరకు (హైద్రాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ రాష్ట్రము ఏర్పడు వరకు) ఆంధ్రరాష్ట్రమునకు కర్నూలు రాజధానిగ నుండెను. కర్నూలుపట్టణము సముద్రమట్టమునకు 900 అడుగుల ఎత్తుననుండి ప్రాగుత్తర దికలయందు తుంగభద్రానదిచేతను, దక్షిణమందు హంద్రినది చేతను, పశ్చిమమందు కడప కర్నూలు కాలువచేతను కూడుకొనియుండి సహజ ప్రకృతిసౌందర్యముచే కళకళలాడుచు నొక ద్వీపమువలె విలసిల్లుచున్నది. ఈ పట్టణపు వైశాల్యము 3.75 చ॥ మైళ్ళు. జనసంఖ్య 60,222. ఇందు పురుషులు 30,639 మంది, స్త్రీలు 29,583 మంది (1951).

చాళుక్యరాజులు 11 వ శతాబ్దమందు ఇచ్చటికి 7 మైళ్ల దూరమందున్న అలంపూరు (ఇది దక్షి కాశియని ప్రసిద్ధి) లో దేవాలయనిర్మాణము చేయునపుడు రాళ్ళకొరకు బండ్లు ఇపుడున్న కర్నూలు ప్రదేశమునకు తుంగభద్రను దాటి వచ్చెడివనియు, కొంత విశ్రాంతి తీసికొన్నతరువాత బండ్లను తోలువారు తమ బండ్లకు కందెనవేసికొని పోవుచుండిరనియు అందుచేత ఆప్రదేశము “కంచెనమెట్ట" అని వ్యవహరింప బడినదనియు ఒకటి రెండు కుటుంబములు ఏర్పడుటచేత అది "కందెనపల్లి” గా మారినదనియు తెలియుచున్నది. ఆ తర్వాత "కందెనోలు, కందెనవోలు" గాను బ్రిటిషు వారిమూలమున "కర్నూలు”గాను మార్పు చెందినది. కొన్ని శాసనములలో "కన్నాడు" అని కూడ వ్యవహరింపబడినది. కొందరు కల్లు = రాయి, నాడు=భూమి అను రెండు పదముల కలయికచే నేటి కర్నూలు అనుపద మేర్పడె ననుచున్నారు.

శ్రీకృష్ణదేవరాయల కాలమువరకు కర్నూలునకు ఒక ప్రత్యేకత లేదు. ఆయన అనంతరము వచ్చిన అచ్యుత రాయలు కర్నూలుకోటను కట్టించినాడు. 1590 లో రామరాజు మనునుడైన గోపాలరాజునుండి కర్నూలును స్వాధీనపరచుకొనుటకై బిజాపూర్ నవాబు అబ్దుల్ వాహబ్ అను అబిసీనియాదేశస్థుని పంపెను. ఆయన కర్నూలు పట్టణమును అభివృద్ధిపరచెను. రాజవీథిలో కమానులతో ​అంగళ్ళు కట్టించేను. సింహద్వారము ( నేడిచ్చట మునిసిపల్ ఆస్పత్రిక కలదు) నిర్మించెను. ఆతడు 1618లో మరణించెను.” ఆ

సందర్భమున హంద్రీనది యొడ్డున ఒక పెద్ద జ్ఞాపక చిన్నము నెలకొల్పిరి. ఆతడే పూర్వము వేణుగోపాలస్వామి దేవాలయమును మసీదుగా మార్పించెనందురు. కర్నూలు 1686 సంవత్సరమువరకు బీజాపురము అధీనములో నుండి ఆ తరువాత ఢిల్లీ సింహాసనాధిపతియైన ఔరంగజేబు ఆధిపత్యము క్రిందికి వచ్చెను. ఔరంగజేబు పంపిన ఘయాసుద్దీన్ ఖాన్ అను అధికారిచేత 17 వ శతాబ్దమందు చివరిభాగమున కర్నూలు దాపూర్ ఖానుకు సమర్పింపబడెను. ఆయనయే కర్నూలు నేలిన పఠాన్ రాజవంశమునకు మూలపురుషుడు. తర్వాత ఢిల్లీ తో సంబంధము పోయి నైజాంనవాబుల ఆధిపత్యము ఏర్పడెను. 1800 వ సంవత్సరములో కర్నూలును నిజాము బ్రిటిషువారికి దత్తము చేసెను. 1839 వ సంవత్స

కొండారెడ్డి బురుజు - కర్నూలు

రము సెప్టెంబరు 13వ తేది బ్రిటిషువారు కర్నూలును స్వాధీనము చేసికొని నవాబును సదభ్రష్టుని కావించిరి.

1866 సంవత్సరములో పురపాలకసంఘ మేర్పరచబడినది. నేడీ పురపాలక సంఘము యొక్క అధీనములోని ప్రాంతము 10 చదరపు మైళ్ల విస్తీర్ణము కలది. జనాభా కొంచె మించుమించు ఒక లక్షవరకు పెరిగినది. పట్టణము కొండా రెడ్డి బురుజుతోను తదితరములయిన చారిత్రక శిథిలములతోడను, మసీదులతోడను, దేవాలయములతోడను కళకళలాడుచుండును. ఒక భక్తుని చేత సంగభద్రానది ఒడ్డున నాల్గు సంవత్సరముల క్రింద కర్నూలునందు నిర్మింప బడిన సాయిబాబా దేవాలయము దర్శనీయమై యున్నది. తుంగభద్ర యొక్క ఆవలి యొడ్డు, హైదరాబాదు రాష్ట్రపు సరిహద్దు. రుచ్యము, ఆరోగ్యకరము అయిన నీరు, అన్ని ఋతువుల యందు జనులకు బాధాకరముకాని వాతాపరణము కర్నూలు పట్టణ విశిష్టలక్షణములు.

దం. వే. ను.