Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కడప జిల్లా

​కడప జిల్లా:

కడప మండలము : ఉత్తర అక్షాంశ రేఖ 13°-40′ నుండి 15°-15' వరకును, తూర్పు రేఖాంశము 77°-55 నుండి 79-30' వరకును వ్యాపించి సముద్రమట్టమునకు నాలుగు వందల ఏబది అడుగుల ఎత్తున నున్నది. ఉత్తరమువ కర్నూలు మండలము, తూర్పున నెల్లూరు మండలము, దక్షిణమున చిత్తూరు మండలము, పడమర అనంతపురము హద్దులుగా ఈ మండల మేర్పడియున్నది. ఈ మండలమున ​ పులివెందుల, కమలాపురము, జమ్ములమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట, సిద్ధవటము, రాయచోటి, కడప అను తొమ్మిది తాలూకాలు కలవు. ఈ మండల వైశాల్యము 5929 చదరపు మైళ్ళు.

నదులు : పినాకినీనది, మండలమునం దంపటను ప్రపహించుచున్నది. పాపఘ్ని, కుందు, చిత్రావతి, సగిలేరు, చెయ్యేరు మొదలగునవి పినాకినికి ఉపనదులు.

అడవులు : 1838.80 చదరపు మైళ్ళ అడవి ప్రదేశము కలదు. ఈ అడవిలో ఎక్కువభాగము రాజంపేట, బద్వేలు, రాయచోటి, సిద్ధవటము తాలూకాలలో ఉన్నది.

శీతోష్ణస్థితులు : ఈ మండలమున నాలుగు మాసములు మాత్రము దుస్సహమగు వేడియుండును. మార్చి-మే నెలలందు వేడిమి 106° వరకుండును. వాయవ్య పవసము గాని ఈశాన్య పవనముగాని ప్రసరించు టకు వీలులేని పరిస్థితులలో ఈ మండలమున్నది. నవంబరు నుండి వరకు మిక్కిలి చలి యుండును. ఈ మండలములో సంవత్సరమునందు సగటున అధికోష్ణము 95.2 డిగ్రీలు, అల్పోష్ణము 75.7 డిగ్రీలు ఉండును. మొత్తముమీద అత్యధికోష్ణము 109.0 వరకు, అత్యల్పోష్ణము 60° వరకు కనబడును (1951). వర్షపాతము 20.17 అంగుళములు. అధిక వర్షపాతముగల తాలూకాలు సిద్ధవటము, రాజంపేట, రాయచోటి అనునవి.

భూతత్త్వము : నల్ల రేగడభూమి 23.7 శాతము, ఎఱ్ఱ నేల 25.4 శాతము, ఇసుక తెరనేల 27.5 శాతము కలదు. మొత్తముమీద నల్ల రేగడభూమి ప్రశస్తమైనది. ఈ భూమి జమ్ములమడుగు, పులివెందుల, కమలాపురము, ప్రొద్దుటూరు తాలూకాలయందు ఎక్కువగ కలదు. ఎఱ్ఱు నేల రాయచోటి, బద్వేలు, కడప తాలూకాలయందు కలదు. ఈ ఎఱ్ఱు నేల నిరుపయోగకరమైనది. మండలము మొత్తమున సగము ఎఱ్ఱు నేల రాయచోటి తాలూకాలో కలదు.

నీటిపారుదల సౌకర్యములు : కర్నూలు-కడప కాలువను కర్నూలుకు 17 మైళ్ళ దూరమున తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టి ఏర్పాటు చేసి యున్నారు. ఈ కాలువ పొడవు 190 మెళ్ళు, ఈ కాలువవలననే కాక నదులయందు ఊట కాలువలు పలు తావు లందు త్రవ్వుకొని తమ్మాలమున జనులు పంటలు పండింతురు. బావుల ఆధారమునను పంటలు పెక్కు స్థలములందు పండును. వర్షాధారము గల చెరువులు అనేకము లీ మండలమున కలవు. పోరుమామిళ్ల చెరువు, బద్వేలు చెరువు పేర్కొనదగినవి. మొత్తముమీద ఈ కడప మండలమున జల వసతులు 2,323 కలవు. ఈ వసతుల క్రింద 40,608.45 ఎకరముల భూమి సాగుబడి యగును. ఇది అల్ప జలాధారముల మూలమున సాగు చేయబడు భూమి, అధిక జలాధారములవలన సాగు చేయబడు భూమి విస్తీర్ణము 69,208. 48 ఎకరములు.

పంటలు: వరి, జొన్న, సజ్జ, రాగి, కొఱ్ఱ, వరిగె, చామ ఇవి ఆహారసంబంధములైన పంటలు. కంది, సెనగ, పెసర, మున్నగు పప్పుధాన్యములు, వేరుసెనగ, ప్రత్తి, మిరపకాయలు, నూగులు, చెఱకు మున్నగు వ్యాపార సంబంధములగు వస్తువులు ఫలించును. ఈ పంటలలో ఎక్కువగా వేరుసెనగ, జొన్న, ప్రత్తి, వరి పండునని చెప్పవచ్చును. ​ ప్రయాణ సౌకర్యములు : ఈ జిల్లాయందు, 1022 మైళ్ల పొడవుకల రోడ్లు గలవు. నెల్లూరు, చిత్తూరు, బెంగుళూరు, బళ్లారి, మదరాసు, కర్నూలు, కంబము, గిద్దలూరు, మదనపల్లె, కదిరి, అనంతపురము అను తావులకు ప్రధాన మార్గములు కలవు. మదరాసునుండి బొంబాయికి వెళ్ళుటకు వేయబడిన ఇనుపదారి ఈ మండలములో సుమారు 122 మైళ్ళ పొడవున కలదు. పెక్కు రైలు స్టేషనులు లేవు. తాలూకాలు రైలుబాటకు దూరముగా నున్నవి. మొత్తముమీద ఈ మండలమున ఇనుపదారి సౌకర్యము లేదనవచ్చును. బస్సు సౌకర్యములు బాగుగా నున్నవి.

వైద్యసహాయము : ప్రతి తాలూకాయందును దొరతనమువారి వైద్యశాలలు కలవు. 10 వైద్యశాలలు స్థానిక పరిపాలనా శాఖకు చెందినవి. కడప పట్టణమున సర్వ పరికర సమృద్ధమగు ప్రభుత్వపు వైద్యశాల యొకటి కలదు.

సంతలు, ఉత్సవములు : పుష్పగిరి శంకర క్షేత్రమున చైత్ర బహుళ 13 మొ॥ వైశాఖ శుక్ల సప్తమి వరకు ఉత్సవము జరుగును. రాయచోటియందు గంగమ్మ జాతరయు, జమ్ములమడుగు తాలూకాయందు వైశాఖ పూర్ణిమకు ఏడు దినములు ముందునుండి ఉత్సవములును జరుగును.

విద్యాసంస్థలు: కడపలో గవర్నమెంటు అర్సు కళాశాల ఒకటి కలదు. బాలురకు 28 ఉన్నత పాఠశాలలును, బాలికలకు 3 ఉన్నత పాఠశాలలును కలవు. బోధనాభ్యసన పాఠశాలలు బాలురకు 2, బాలికలకు 2 కలవు. మాధ్యమిక పాఠశాలలు 3, ప్రాథమిక పాఠశాలలు 1061, బేసిక్ పాఠశాలలు 21, వయోజన పాఠశాలలు 48 కలవు. ఒక అంధ పాఠశాలయు కలదు.

Caption text
విద్య పురుషులు స్త్రీలు
మాధ్యమిక విద్య 6,703 1,385
హైయర్ సెకండరీ 3,736 575
ఇంటర్మీడియేట్ 530 77
పట్టభద్రులు 1,392 214

కుటీర పరిశ్రమలు : ఇచటి నూలు నేత పరిశ్రమ మాత్రము శేషించిన పరిశ్రమలన్నిటికంటె మిన్న యన వలయును. రంగుల పరిశ్రమ మిగుల స్వల్పము, పట్టు నేత పరిశ్రమ పులివెందుల తాలూకాలో కలదు. చెప్పులు కుట్టు పరిశ్రమ, కుండలను తయారుచేయు పరిశ్రమ అన్ని తాలూకాలందును కలవు. రాగి, ఇత్తడి, కంచు మొదలగు లోహపాత్రల పరిశ్రమ బద్వేలు తాలూకాలోను, ప్రొద్దుటూరులోను కలదు. బండ్లు పులివెందుల, కమలాపురము తాలూకాలలోను, బెల్లము రాయచోటి తాలూకాయందును తయారుచేయబడును.

గ్రామములు : ఈ మండలమున 909 గ్రామములున్నవి. ఇందు పట్టణములు తొమ్మిదికలవు. గృహములు 2,10,986 కలవు. ఇచటి జనసంఖ్య 11,61,731. ఇందు పురుషులు 5,95,060 మంది. స్త్రీలు 5,66,671 మంది.

ఈ జిల్లాలో వ్యవసాయము జీవనముగా గలవారును వారి పోషణముననుండు వారును 5,39,659 మంది. ఇందు పురుషుల సంఖ్య 2,79,909; స్త్రీల సంఖ్య 2,59,750. చదువు వచ్చిన పురుషుల సంఖ్య 13,789; చదువగల స్త్రీల సంఖ్య 2,648.

భాషలు : తెలుగు మాతృభాషగా గలవారే ఈ మండలములో అధిక సంఖ్యలో నున్నారు. వీరి సంఖ్య 10,06,250. ఇందు పురుషుల సంఖ్య 5,14,922; స్త్రీల సంఖ్య 4,91,328. తెలుగు భాష తరువాత రెండవ స్థాన మాక్రమించునది హిందూస్థాని భాష, హిందూస్థాని మాటాడు వారు 1,26,983 మంది కలరు. ఇందు 65,871 మంది పురుషులును, 61,112 మంది స్త్రీలును ఉన్నారు. తరువాత కన్నడము, మరాటి, హిందీ, తమిళము, లంబాడి, ఎరుకల, మలయాళము, గుజరాతి, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు, పోర్చుగీసు, డచ్చి భాషలు మాటాడువారు ఉత్తరోత్తరము తక్కువ సంఖ్యలో నున్నారు.

మతములు : ఈ జిల్లాలో మతములను బట్టి జనసంఖ్య ఈ క్రింది విధముగా నున్నది :

Caption text
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
1. హిందువులు 9,50,047
2. ముసల్మానులు 1,55,408
3. క్రైస్తవులు 56,227
4. జైనులు 47
5. సిక్కులు 2
మొత్తము 11,61,731
​

ఖనిజములు : కడప సమీపమున చెన్నూరు దగ్గర పినాకినీ నదీ తటమున గుఱ్ఱముపాడు అనుచోట వజ్రములు లభించును. నంద్యాలము పేట, ఎఱ్ఱగుంట్ల కోట, చిట్టివేలు, మడిచెరువు అను గ్రామముల ప్రాంతములందు ఇనుము లభించును. బద్వేలు గ్రామమునకు పడమటగా నుండు జంగమరాజుపల్లె పరిసరములందు సీసము, వెండి, రాగి, దొరుకు నందురు. కడప, కమలాపురము, ప్రొద్దుటూరు తాలూకాలలో నల్లని పరపురాళ్ళు విరివిగా లభించును. పులివెందుల, కడప తాలూకాలయందు రాతి నార దొరుకును. అచట సున్నపు రాయి విరివిగ దొరకును. ఎఱ్ఱగుంట్ల దగ్గర నిడుజువ్వి యను గ్రామము కలదు. అచట చాపరాయి పుష్కలముగ త్రవ్వబడి, నునుపు చేయబడి దేశాంతరములకు ఎగుమతి చేయబడుచున్నది. చింతకుంట గుట్టలయందు నిగనిగ మెరయు రాళ్ళు కలవు. వీనిని పలుగురాళ్ళనియు, ముగ్గురాళ్ళనియు అందురు. పులివెందుల తాలూకా యందు బాణగుట్టయను స్థలమున నేటికిని సిద్ధులు సిద్ధపరచిన అనేక రసములు కుండలయందు నిక్షిప్తములై కలవు. అవి తెలిసికొనుటకు సాధ్యము గానీవయి యున్నవి. రససిద్ధుల కీ మండలము ఆశ్రయమని యందురు. సిద్ధవటము సిద్ధుల చరిత్రమునకు నిలయము, ఇప్పటికిని అనేక సిద్ద పురుషులు పర్వతములయందు గుహలలో నివసించుచున్నట్లు నిదర్శనములు గలవు. ఇప్పటికి బొంబాయి మొదలగు దూరదేశములనుండి ధనవంతులు ఈ మండలమునకు వచ్చి మేంగనీసు మొదలయినవి భూ గర్భము నుండి త్రవ్వించి వ్యాపారము సాగించుచున్నారు. బై రేట్సు అను పదార్థము, అల్యూమినియము అను పదార్థము, కావిరాయి, గోపీచందనపుసుద్ధ ఎక్కువగ పర్వత ప్రాంతములందు లభించును. ఇనుపరాయి పెక్కు స్థలములలో లభించుచున్నది. వ్యాపారము చేయువారు పర్వత ప్రాంతములను త్రవ్వి దానిని ఎగుమతి చేయుచున్నారు.

చరిత్ర : క్రీ. శ. నాలుగవ శతాబ్దినుండి కొంతవరకు ఈ మండల చరిత్ర తెలియవచ్చుచున్నది. మొదట పల్లవులనువారు కడప మండలము నాక్రమించి అయిదవశతాబ్ది వరకు పరిపాలించిరి. అయిదవ శతాబ్దియందు, కరికాల చోళ రాజులు పల్లవుల నోడించిరి. ఈ ప్రాంతము చోళుల పరిపాలనమున నాల్గు తరములు పాలింపబడినది.

ఆరవ శతాబ్ది యర్ధభాగమున ఆంధ్రచోళులు కడప, కర్నూలులను ఆక్రమించిరి. రాష్ట్రకూటులు 783-84 నుండి 814 వరకు రాజ్యము చేసిరి. తొమ్మిదవ శతాబ్ద యందు బాణులనువారు తెలుగు చోళరాజ్యమున నుండిరి. ఈ శతాబ్దమునందే వారు కడప మండలమున ప్రవేశించిరి. రాష్ట్రకూటులు 940-956 ప్రాంతమున రాజ్యము చేసిరి, మూడవ కృష్ణుడు మరణించిన తరువాత రాష్ట్ర కూటుల యధికారము క్షీణించినది. అప్పుడు వైదుంబులు ప్రబలిరి. 1070 నుండి 1118 వరకు కుళోత్తుంగుడు ఈ భాగము నాక్రమించి పరిపాలించెను. 1268 సం. న మూడవ రాజేంద్రుడు మరణించిన తర్వాత పాండ్యులు చోడ రాజ్యము నాక్రమించిరి.

కాకతి గణపతిరాజు కడపమండలమును స్వాధీనపరచుకొనేను. పదునాల్గవ శతాబ్ది ప్రారంభమున కడపమండల మున రాయచోటిభాగము తప్ప, తక్కిన మండలమంతయు కాకతీయుల పరమునందే యుండెను. 1309 లో మహమ్మదీయులు దక్షిణదిక్కు నాక్రమించుటకై దండయాత్ర నారంభించిరి. పదునాల్గవ శతాబ్దినుండి పదునేడవ శతాబ్ది వరకు కడపమండలము విజయనగరరాజుల ఏలుబడిలో నుండినది. తరువాత కడపమండలము గోలకొండ కుతుబ్ షాహి సుల్తానులకు వశమయ్యెను. పిదప మొగలులు వచ్చిరి. ఔరంగజేబు కడపను పరిపాలింప ఏర్పాట్లుచేయ ప్రయత్నించి మహారాష్ట్రులతో యుద్ధ మేర్పడ, ఢిల్లీకి తిరిగి వెళ్ళెను (1652). తరువాత పాలెగాండ్రు విజృంభించిరి. పిదప కడపను నవాబు లేలిరీ. 1740 ప్రాంతమున మహారాష్ట్రులు దాడివెడలిరి. 1759 లో బసాలత్ జంగ్ ఫ్రెంచి సేనలతోవచ్చి కడపలో ప్రవేశించెను. 1769 లో నైజాముతో చేసికొన్న యొడంబడిక ననుసరించి కడప, కర్నూలులు హైదరాలీకి లోబడినవి. 1791 మొదలు 1794 వరకు కడపరాజ్యము కొన్నాళ్ళు మహారాష్ట్రుల వశమునను, కొన్నాళ్లు టిప్పుసుల్తాన్ చేతులలోను, కొన్నాళ్ళు నైజాం స్వాధీనములోను మారుచుండినది. 1795 లో నైజామునకు మహారాష్ట్రులకును యుద్ధము జరిగెను. నైజాం ఫ్రెంచి రై మండ్సు సహాయునిగగొని సేనల సాహాయ్యముకొరకు అతనికి కడవప్రాంతము నొసగెను. 1799 లో శ్రీరంగపట్టణము నైజామునకు ​ లోబడు సమయమున ఆంగ్ల సైనికులు కీయవలసిన జీతములకు గాను కడప మండలము బ్రిటిష్ వారికి అర్పింపబడెను. (12-10-1800). ఇది మొదలు కడపమండలమునకు క్రొత్త శక మారంభమయ్యెను. బ్రిటిషు వారి తరువాత భారత జాతీయ ప్రభుత్వ భాగముగా ఆంధ్రరాష్ట్రములో నున్నది ఈ మండలము.

కడపజిల్లాలోని తొమ్మిది తాలూకాలు మూడు డివిజనులక్రింద విభజింపబడినవి. ప్రస్తుత కాలమున ఆంధ్ర ప్రదేశ ప్రభుత్వము వారి ఆదేశానుసారము డివిజనులు.అందలి తాలూకాలు ఈ క్రింది విధముగా నుండును, (23-5-1958)_

1. కడప డివిజన్- ఇందలి తాలుకాలు కడప, రాయచోటి, కమలాపురం అనునవి. ప్రధాన నగరము - కడప,

2. రాజంపేట డివిజన్ - ఇందలి తాలూకాలు రాజంపేట, సిద్ధవటము, బద్వేలు అనునవి. ప్రధాన నగరము - రాజంపేట.

3. జమ్ములమడుగు డివిజన్- ఇందలి తాలూకాలు జమ్ములమడుగు, ప్రొద్దుటూరు, పులివెందులు అనునవి. ప్రధాన నగరము - జమ్ముల మడుగు.

1. కడప తాలూకా : ఈ తాలూకా విస్తీర్ణము 510 చ. మై. ఇందు 109 గ్రామములు కలవు. జనాభా 1,47,389. ఇందు పురుషుల సంఖ్య 75,326, స్త్రీల సంఖ్య 72,063. కడప పట్టణము జిల్లాకును, తాలూకాకును ముఖ్యస్థానము. ఇచ్చట మ్యునిసిపాలిటీ గలదు. పట్టణ జనసంఖ్య 37,438 (1951). 1570 సంవత్సరమున దీనిని నేక్ నామాబాదు అను పేరున నేక్ నాం ఖాన్ అను నతడు కట్టించెను, కొందరు దీనిని దయ యను వర్థ మిచ్చు "కృప” యను శబ్దముచే పిలుతురు. దీని కాధారము - ప్రాత కడప యనునది "కృప" యను పేరున క్రీ. పూ. రెండు శతాబ్దముల క్రిందట నుండినదని యందురు. 1890 లో ఈ పట్టణము నకు నీటి సదుపాయ మేర్పరచబడినది. 1902 లో కొళాయిలు ప్రారంభము చేయబడినవి. హైస్కూళ్ళు, క్రైస్తవ మిషనరీలు నిర్వహించు సూళ్ళు కలవు. 1821 లో కడప కంటోన్మెంటు సైనిక స్థలమయ్యెము, 1868 వరకు ఈ సేనానివాస ముండినది. ఆటు తరువాత కంటోన్మెంటు బళ్ళారికి మార్చబడినది. కడప మంచి వ్యాపార స్థలము. చెన్నూరు, వల్లూరు, పుష్పగిరి, పెండ్లిమట్టి, చిన్న దాసరిపల్లె. చింత కొమ్మదిన్నె, ఖాజీపేట, సుంకేసుల నంది మండలము పేర్కొనదగినవి. ఇందు పురుషుల సంఖ్య 62,394, స్త్రీల సంఖ్య 59,883.

2. రాయచోటి తాలూకా : విస్తీర్ణము 1103 చ. మై. ఇందు 119 గ్రామములు కలవు. జనాభా 1,90,172. ఇందు పురుషుల సంఖ్య 98,433; స్త్రీల సంఖ్య 91,739, రాయచోటి పట్టణ జనసంఖ్య 10,655. (1951) రాయచోటికి ప్రాచీన నామము “రాచవీటి." ఈ తాలూకాలో చుండుపల్లె, లక్క రెడ్డిపల్లె, గాలివీడు, నూలివీడు, సానిపాయ, వీరబల్లి, పంగిమళ్ళ, గడికోట, మట్ల, చిన్నమండెము పేర్కొనదగిన గ్రామములు.

3. కమలాపురము తాలూకా : విస్తీర్ణము 303 చ.మై, 65 గ్రామములు కలవు. జనాభా 75,588. ఇందు పురుషులు సంఖ్య 38,670; స్త్రీల సంఖ్య 36,918. ఇందు పాలగిరి, ఉప్పులూరు, అనిమెల, నిడుజువ్వి, ఎఱ్ఱగుంట్ల చేరినవి.

4. రాజంపేట తాలూకా : విస్తీర్ణము 1038 చ.మై. 128 గ్రామములుకలవు. జనాభా 1,85,942. ఇందు పురుషుల సంఖ్య 95,607; స్త్రీలసంఖ్య 90,335. పుల్లంపేట, చిట్వేలు, పొత్తపి, కోడూరు, సెట్టగుంట, నందలూరు, పెద్దజీరంపాడు, పెనగలూరు, టంగుటూరు పేర్కొనదగిన గ్రామములు.

5. సిద్ధవటము తాలూకా : విస్తీర్ణము 606 చ.మై, గ్రామములు 80 కలవు, జనాభా 75,704. ఇందు పురుషులు సంఖ్య 38,953; స్త్రీల సంఖ్య 36,751. ఈ తాలూకాలో ఒంటిమిట్ట మాధవరము, కురుగుంట్లపల్లి, కోటపాడు, గీబుళము, కొండూరు, విప్పిరాల, గంగవేలూరు, 'పేర్కొనదగిన గ్రామములు.

6. బద్వేలు తాలూకా : విస్తీర్ణము 757 చ. మై. 141 గ్రామములు కలవు. జనాభా 1,08,711. ఇందు పురుషుల సంఖ్య 55,159; స్త్రీల సంఖ్య 53,552. బద్వేలు పట్టణ జనసంఖ్య 7,085. ఈ తాలూకాలో పోరుమామిళ్ళ, శంఖవరము, కలవపాడు, కొత్తకోట, మున్నెల్లి, పలుగు రాళ్ళపల్లె పేర్కొనదగిన గ్రామములు.

7. జమ్ములమడుగు తాలూకా : విస్తీర్ణము 613 చ.మై. 125 గ్రామములు కలవు. జనాభా 1,22,277. ఇందు