సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కందుకూరు
కందుకూరు :
కందుకూరు నెల్లూరుజిల్లాలో నున్నది. నెల్లూరు జిల్లాలో కందుకూరు, కావలి, గూడూరు అను మూడు డివిజనులు కలవు. కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి, ఆత్మకూరు, కావలి, కొవ్వూరు, ఉదయగిరి, గూడూరు, సుల్లూరుపేట, వేంకటగిరి, రాపూరు, నెల్లూరు అను తాలూకాలు కలవు. నెల్లూరుజిల్లా వైశాల్యము 7960 చ. మైళ్ళు. 1951 వ సం. జనాభా లెక్కల ప్రకారము జనసంఖ్య 17,95,632. ఇందు 15,91,993 మంది గ్రామ వాసులు, 2,03,639 మంది పట్టణవాసులు. 9,02,794 మంది పురుషులు, 8,92,838 మంది స్త్రీలు ఉన్నారు. 1581 గ్రామములు, 12 పట్టణములు, 3,38,013 గృహములు కలవు. ఈ జిల్లాలో అధిక సంఖ్యాకు లగు హిందువులు 15,46,946 మంది కలరు. వీరితరువాత గణింప తగిన వారు ముసల్మానులు, క్రైస్తవులు. ఈ జిల్లాలో 25 మాతృభాషలు కలవారు ఉన్నారు. వీరిలో అధికసంఖ్యాకులు 16,41,350 మంది తెలుగువారు ఉన్నారు.
కందుకూరు డివిజన్: ఈ డివిజన్లో లో కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి అను నాలుగు తాలూకాలు కలవు. డివిజన్ వైశాల్యము 2956 చ. మైళ్ళు, జనాభా 5,80,100 మంది.
కందుకూరు తాలూకా : ఈ తాలూకాలో ఉత్తరమున పొదిలి, పడమట కనిగిరి, దక్షిణమున కావలి తాలూకా లున్నవి. తూర్పున బంగాళాఖాతమున్నది. సముద్రతీర ప్రాంతమగుటచే ఇందు ఇసుక బయళ్ళు కలవు. తాలూకాయందు అంతటను పొదల అడవి కలదు. మధ్యమధ్య నారికేళ వనములు, తాటితోపులు, సరుగుడు తోటలు కలవు. అచ్చటచ్చట విడివిడిగా గుట్టలున్నవి. మన్నేరునది ఈ తాలూకాగుండ ప్రవహించుచున్నది. ఉప్పుటేరు, పాలేరు, మూసీనది ఇందలి ఇతరములయిన చిన్న నదులు. తాలూకా విస్తీర్ణము 801 చ. మైళ్ళు.
ఈ తాలూకాలో 74.65 చ. మైళ్ళ అరణ్యము కలదు. సగటున ఇందు 33.05 అంగుళముల వర్షపాత ముండును. నల్ల రేగడి, ఎఱ్ఱమట్టి భూమి, కలగలుపు భూమి, ఇసుక పట్టలు దాదాపు సమాన విస్తీర్ణము కలవిగా నున్నవి. మాచవరము, మోపాడు. పొన్నలూరు, కారేడు, ప్రభృతి గ్రామములందలి చెరువులు తరి వ్యవసాయమునకు ముఖ్యాధారములు. 1,30,325 ఎకరములు ధాన్యముల పంటకును, 11,768 ఎకరములు వాణిజ్యపు పంటలకును వినియోగింపబడును.
ఈ తాలూకా జనసంఖ్య 2,01,316. ఇందు 1,01,364 మంది పురుషులును, 99,952 మంది స్త్రీలును ఉన్నారు. 1,89,409 మంది గ్రామవాసులును, 11,907 మంది పట్టణవాసులును కలరు (1951). కందుకూరు, సింగరాయికొండ అను ఈ రెండును జాతరలు జరుగు ప్రదేశములు. చుండి కందుకూరు సీమకు రాజధానిగా నుండెను. ఈ తాలూకాలో 3 హైస్కూళ్ళు, 180 ఎలిమెంటరీ స్కూళ్ళు, 5 వయోజన పాఠశాలలు కలవు. 9797 మంది బాలురును, 5206 మంది బాలికలును విద్యను అభ్యసించుచున్నారు.
1936 కుటీర పరిశ్రమలు కలవు. వీటిలో 4778 మంది జనులు పనిచేయుచున్నారు. చుండీ ప్రాంతములో "క్యానైట్" అను లోహము (Kyanite) అధిక ప్రమాణములో దొరకును.
ఈ తాలూకాలో 1 పట్టణము, 160 గ్రామములు కలవు. జలుగుతల్లి, పాకేల, కాలేడు అను గ్రామములు మాత్రమే 5000 లకు మించిన జనసంఖ్యను కలిగియున్నవి. ఇందు 39,762 ఇండ్లు గలవు.
పదుమూడవశతాబ్దములో కాటమరాజు అను యాదవ సంఘ వల్లభునకును, నెల్లూరు నేలుచుండిన మనుమసిద్ధి నృపాలునకును పసుల పుల్లరి విషయములో తగవులు ఏర్పడి ఉభయులకు గొప్ప యుద్ధము జరిగినది. ఆ యుద్ధముతో సంబంధముగల కాటమరాజు చరిత్రకును ఈ తాలూకాకును సంబంధము కలదు. ఈ విషయమును సూచించెడు శిలాశాసనము ఈ తాలూకా యందలి గుండ్లపాలెములోని బ్రహ్మేశ్వరస్వామి ఆలయమున కలదు. ఆ శాసనమున ఈ క్రింది వక్కాణము గలదు :
"జోరుగంటి ప్రతాపుని కాలమున కాటమ రాజు 82 రాజ్యంచేసి లింగాల కొండ ఎర్రగడ్డ పాటను నలసిద్ధి రాజు గూడి యుద్ధంబుచేసి బడుగులవారు జని పొయ్యే నాంటికి కలియుగంబోచ్చి 3985 యేండ్లాయెను"...... “స్వస్తిశ్రీ శాలివాహనశక వర్షంబులు 1170 అగు నేంటి కాళయుక్తి సంవత్సర కార్తిక శు. 5గు. నెల్లూరి నలసిద్ధి రాజు సర్వసన్నాహం మెరసి లింగాలకొండ ఎర్రగడ్డపాటి కూడలి సోమేశ్వరుని సందలిన నానఅత్రేయగోత్ర యాదవ క్షత్రియ మధురాపురమం దీశ్వర శ్రీవిష్ణుయోగమాయ దివ్య శ్రీపాదక బ్రకట శాత్రవ భంజన నచ్చేరవుంది పాత్రలాయత్తనం గౌరవ పౌరవుండు ద్వారకాపురి గోపికావల్లభుని పౌత్రుండు వల్లురాజు, అతని సుతులు పోలురాజు పెద్దురాజు వారి పుత్రులు మొదలైన యాదవులు నలసిద్ధింగూడి యుద్ధము సేసి మృతులైరి... భాగీరతి దుర్గస్తానం కొండయ్య కొడుకు రామయ్య వుద్ధరించిన శాసనం"1[1]
కందుకూరు పట్టణము : కందుకూరు పట్టణము కందుకూరు డివిజనుకును, తాలూకాకును ప్రధానస్థలము . ఇచ్చట పంచాయితీ సభ కలదు. 11,907 మంది జనులున్నారు. ఇందు 6,112 మంది పురుషులు, 5,795 మంది స్త్రీలు కలరు. గవర్నమెంటు వారి ఆసుపత్రి కలదు:
కందుకూరు చాల పురాతన గ్రామము. పల్లవులు, చాళుక్యులు ఏలినారు. చాళుక్యుల కాలములో గ్రామము రాజ్యమునకు ప్రధాన రక్షణస్థానముగా నుండి వైభవ మనుభవించి యుండెను. చాళుక్యుల తరువాత రెడ్లు కందుకూరు రాజధానిగా ఆ ప్రాంతమును ఏలినారు. కందుకూరి రెడ్లు కొండవీటి రెడ్లకు బంధువులే. కొండవీటి రెడ్డిరాజ్యమును స్థాపించిన వేమారెడ్డి సోదరుడగు మల్లారెడ్డి కందుకూరు రెడ్లవంశమునకు మూలపురుషుడు. మల్లా రెడ్డి వంశమువా రిచ్చట కొండవీటి రాజ్యమునకు సామంతులుగ రాజ్యపాలనము చేసిరి. కొంతకాలము స్వతంత్రరాజ్యముగ కందుకూరు రాజ్యము ప్రబలెను. తరువాత ఇది విజయనగర సామ్రాజ్యమునకు సామంత రాజ్య మయ్యెను (1424).
కందుకూరు రెడ్డిరాజులు పెక్కు దేవాలయములను నిర్మించినారు. గొప్ప తటాకములను ప్రతిష్ఠించిరి. శాస నాలలో ఈ రెడ్డిరాజులు కవీంద్ర ప్రకర సురతరువు లనియు, సంగీత సాహిత్య గుణజ్ఞు లనియు ప్రశంసింప బడినారు.
కందుకూరులో పెక్కు శాసనములు కలవు. వీటిలో చాళుక్య శాసన మొక్కటి ముఖ్యమైనది కలదు. ఇది 9 వ శతాబ్దమునాటిది. అనగా, నన్నయభట్టునకు పూర్వము వేయించినట్టిది. ఈ శాసనపాఠము సీసపద్యమని తెలియుచున్నది. చరిత్ర దృష్టిచే భాషాదృష్టిచే, ప్రాముఖ్యముగల ఈ శాసన పాఠమును ఇచ్చుచున్నాము :
మొదటిప్రక్క
- 1. శ్రీనిరవద్యుణ్ణు
- 2. సిత్తసముణ్ణుశివ
- 3. పదవర... సేవితుణ్ణు
- 4. ఖిలుణ్ణ వ్రత రిపుబ
- 5. లు జ్ఞాహన రాధరణ
- 6. యోగ్యసిమ సమణ్ణ
- 7. గణితద(? దా) నా (1) సవణ్ణుగ (? జ)
- 8. ..........
రెండవప్రక్క
- 9. ....లయుణ్ణు... ..హపణ్ణ (?)
- 10. సపడ్డా రంగువ్వి...యుగాన్చి
- 11. కొలదిలేనికో (ట్ట) ంబుల్వొది (? డి) (చి)
- 12. గోణ కెనలాత పక్షపాతి
- 13. సలలిత... (? ద) గన్
- 14.........
మూడవ ప్రక్క
15. తారోణవిద (? డ) వ గొరన్ల వ (?)2[2]
ఈ శాసనములో గొణ కేనల్లాతని పేరును, పండరంగని పేరును కనబడుచున్నవి. గొణకేనల్లాతడు వేంగీ దేశములో క్రీ.శ. 848 మొదలు 892 వరకు రాజ్యము చేసినాడు. ఇతడు కలివిష్ణువర్ధనుని కుమారుడు. ఇతనికి మూడవ విజయాదిత్యు డను పేరు కలదు. పండరంగడు ఈతని మంత్రియై యుండెను.
రెడ్లు పూర్వమిచ్చట బలిష్ఠమైన దుర్గము కట్టించినారు. ఆ దుర్గ శిథిలావశేషములు ఇప్పటికిని కనబడు చుండును. కందుకూరునకు స్కంధపురియను మరియొక పేరున్నట్లు తెలియుచున్నది.
కా, సీ.