Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఓరుగల్లు

వికీసోర్స్ నుండి

ఓరుగల్లు :

- దక్షిణాపథమునందు ఐతిహాసిక, సాంస్కృతిక ప్రాముఖ్యముతో అలరారిన మహానగరములలో ఓరుగల్లు నగర మొకటి. ప్రస్తుతము దీనికి వరంగల్లు అని పేరు. ఇది వరంగల్లు జిల్లాకు కేంద్రము. వాణిజ్యమునకు, పరిశ్రమలకు ముఖ్యస్థలము. ఓరుంగల్లు, ఓరుగల్లు, ఓరుకల్లు - అనునవి . దీని ప్రాచీన నామములు. ఓరుగల్లు ఏకశిలానగరముగ సంసృతీకరింపబడినది. ఈ నగరము రాజధానిగా పరిపాలించిన కాకతీయుల కాలములోకూడ ఈ సంస్కృతనామము బహుళ ప్రచారము నొందియుండెను. పెక్కు శాసనము లందును, సమకాలిక సారస్వతమునందును ఏక శిలానగరము అను పేరే కాననగుచున్నది. ఏకశిలాపట్టణ మనియు, 'ఏకోపల' అనియు ఏకశిలా వురియనియు నామాంతరములువ్యవహారమునందుండెను. ఓరుగల్లు అనినను, ఏకశిల అని నను ఒకరాయి, అని అర్థము. ఓరుగల్లుకోట నడుమ ఒక పెద్ద కొండబండ యుండుటచేత ఈ పేరు ఈ పట్టణమునకు కలిగినట్లు తెలియవచ్చుచున్నది. సుమారు మూడు శతాబ్దముల వరకు ఆంధ్ర దేశమునకు రాజధానిగా విలసిల్లియున్నందున ఇది “ఆంధ్రనగర”మనికూడ ప్రసిద్ధి నొంది యున్నది.

ఓరుగల్లు నగరము హైదరాబాదునకు ఈశాన్య దిక్కు నందు 86 మైళ్ళ దూరమున బెజవాడకు పోవు రైలు మార్గమునందు ఉన్నది. ఈ రైలు మార్గమునందు ప్రధానమైన జంక్షను కాజీపేట. కాజీపేట నుండి తూర్పు వైపు ఇంచు మించు పది మైళ్ళవరకు ఈ నగరము వ్యాపించియున్నది. కాజీపేట, హనుమకొండ, మఠెవాడ, వరంగల్లుకోట, ఉరుసు, కరీమాబాదు, అనునవి కలిసి వరంగల్లు పట్టణముగా రూపొందియున్నవి. ఈ పట్టణము సముద్ర మట్టమునకు 2000 అడుగుల యెత్తున ఉన్నది. ఇచటి జనాభా 1,65,000 (1951). దక్కను పీఠభూమిలో ఏటవాలుగనున్న మాగాణములలో ఇది యున్నది. అందుచేత ఇచటి ఉష్ణోగ్రత కొంచె మధికముగ నుండును. ఇప్పటి వరంగల్లు పట్టణము కాకతీయ ప్రభువుల కాలమున ప్రభవిల్లిన అనుమకొండ, ఓరుగల్లు అను రెండు రాజధానీనగరముల ఐక్యరూపము. అనుమకొండ అనునది హనుసుకొండ, హనుమద్గిరి యను పేర్లతో కూడ వ్యషహృత మైనది. శాసనములందు అన్మకొండ అనియే యున్నది. ఇపుడు హనుమకొండ యని పిలువబడుచున్నది. ఈ హనుమకొండ నేడు ఓరుగల్లు నగరములోని ఒక భాగమే యైయున్నను ప్రాచీన కాలమున ఇది రాజధానీ గౌరవమును పొందియుండినది.

క్రీస్తు శకారంభమునుండియే అనుమకొండ యొక్క నిర్మాణమును గురించి ఐతిహ్యములు లభించుచున్నవి. శ్రీశైల పర్వత ప్రాంతమునకు చెందిన ఎరుక దేవరాజను వీరు డొకడు హనుమద్గిరిని జయించి వశపరచుకొని తన ఏలుబడి కిందికి తెచ్చెను. 'అనుమడు', 'కొండడు' అనువారు అతని కొడుకులు. వారి పేరట అనుమకొండ నిర్మించబడినది.

నందగిరి (నాందేడు) కి రాజైన ఒక చాళుక్యరాజు చనిపోగా అతని రాజ్యమును అతని కొడుకులు పంచు కొనిరట. ఒకనికి అనుమకొండ సంక్రమించినదట. మరోకనికి కందారము లభించెనట. కటకపురపు బల్ల హుడు కందారమునకు ఏలికయైన సోమదేవుని నిహతుని చేయగా అతని భార్యయు, నిండు చూలాలు నగు సిరియాల దేవి హనుమకొండకు పచ్చి మాధవశర్మ అను ఒక బ్రాహ్మణుని శరణుపొందెను. సిరియాలదేవి కొడుకు మాధవవర్మ. అతనికాలము క్రీ. శ. 314. ఈ మాధవవర్మయే కాకతీయ వంశమునకు మూలపురుషుడని పద్మాక్షి దేవాలయములోని శాసనము తెలుపుచున్నది.

క్రీస్తుశకము 1115-1158 సంవత్సరముల మధ్య అనుమకొండలో రెండవ ప్రోలరాజు రాజ్యము సేయుచుండగా ఒక నాడు ఇపుడున్న ఓరుగంటి ప్రాంతమునుండి హనుమకొండకు ధాన్యపుబండ్లువచ్చుచుండెను. ఆకస్మికముగా నొకచోట ఒక బండి భూమిలో దిగబడెను, ఎంత పెనగులాడినను ఆ బండి కదలదయ్యెను. ఏమిచిత్రమోయని కాపులచటనే ఆ బండిని వదలి వెళ్ళిపోయిరి. మరునాడు బలిష్ఠమైన ఎద్దులను తెచ్చి కట్టి లాగించినను బండి కదలదయ్యెను. చక్రములు క్రిందికి దిగియుండవచ్చునని చూడగ వాటి ఇనుపకమ్ములు బంగారు కమ్ములుగ మారియుండెను. వారీయుదంతమును ప్రోలరాజున కెరింగించిరి. ప్రోలరాజు పరివారముతో వచ్చి అచట త్రవ్వింపగా స్పర్శవేది లింగమొకటి కనిపించెను. దాని ప్రభావముననే ఇనుప కమ్ములు బంగారు కమ్ము లయ్యే నని తలంచిరి. ఆ లింగమును అనుమకొండలో ప్రతిష్ఠించి, దేవళము కట్టించు తలంపుతో త్రవ్వించి దానిని బండిపై చేర్చుటకై ప్రోలరాజు పరివారమున కాజ్ఞ యిచ్చెము. ఎంతమంది ప్రయత్నించినను అది కదలలేదు. జరిగిన వార్త తెలిసి కాళేశ్వర వాసులగు శ్రీ శ్రీరామారణ్య త్రిపాదులను, మహేంద్ర శ్రీపాదులను, హిడింబాశ్రమ (మెట్టిగుట్ట) వాసులగు త్రిదండ ఋసి, సత్తములను బిలువనంపి ప్రోలరాజు ఆస్పర్శవేది లింగమును చూపెను. వారు అచటనే దేవళమును నిర్మింప వలయుననియు, ఆలింగమును కదలింపశక్యము కాదనియు చెప్పిరి. రామారణ్యత్రిపాదుల యాఙ చొప్పున శా. శ. 909 (క్రీ. శ. 987) శుభకృద్వర్ష కార్తీక శుద్ధ పంచమినాడు శ్రీవిద్యాయంత్ర క్రమమున లింగమును మధ్య నుంచి ప్రోలరాజునగరము నిర్మింపజేసి లింగస్పర్శచే లభించిన సువర్ణరాశినీ నగర నిర్మాణమునకై వ్యయపరచెనట. ఈ నగర మధ్యమున ఒక శిలాఖండముగనున్న కొండనుబట్టి యీ నగరమునకు ఓరుగల్లు (ఏకశిలానగరము) అని నామకరణము చేసినట్లు తెలియుచున్నది.

ఓరుగల్లు నగరమునందు కోటలు, బురుజులు దేవాలయములు నిర్మాణములై నగరము దినదినాభివృద్ధి చెందు చుండగా అనునుకొండ ప్రశస్తితగ్గుచు ఓరుగల్లు నగరమునకు ప్రాముఖ్యము హెచ్చుచు వచ్చెను.

వరంగల్లు ప్రాంతమంతయు కొండల ప్రదేశమగుటచే శత్రుదుర్భేద్యముగను యుద్దమునకు మిక్కిలి అనువైన ప్రదేశముగను తోచెను. అందుచేత మొదటి ప్రతాప రుద్రుడు (రుద్రదేవుడు 1158-1195) ఓరుగల్లు చుట్టు శిలా ప్రాకారము కట్టింప మొదలిడెను. రాజధానికూడ ఓరుగల్లునకుమార్చెను. తరువాత గణపతి దేవుడు (1198 - 1261) రుద్రమదేవి (1261-1295) ఆకోటను పటిష్ఠముగను, శత్రు దుర్భేద్యమైన దానిగను చేసిరి. అప్పటి నుండియే ఓరుగంటి శోభ చరిత్రాత్మకమైన ప్రాధాన్యముతో అతిశయించినది. ఓరుగల్లుకోట పటిష్ఠమగుకొలది హనుమకొండపై రాజులకు శ్రద్ధతగ్గేను. ఓరుగల్లుపై దాడిచేయుటకు వచ్చిన శత్రు సైన్యములన్నియు అనుమ కొండ వరకువచ్చి ఆగిపోయెడివి. అందుచేత హనుమకొండ శత్రువుల దౌర్జన్యమునకు గురియగుచు వచ్చెను. వాటి హనుమకొండ కోట యొక్క చిహ్నములు ఇప్పుడు పూర్తిగా జీర్ణములైనవి. ఒక మట్టిగోడయు, ఒక అసంపూర్ణ ద్వారమును మాత్రము ఇప్పుడు కనిపించుచున్నవి.

కాకతీయ ప్రభువులు జైనులుగ నున్నప్పుడు జైన దేవాలయములను గూడ కట్టించిరి. హనుమద్గిరి శిలలపై జైనతీర్థంకరుల విగ్రహములను చెక్కించిరి. అదేగుట్టపై పద్మాక్షి దేవాలయము గూడ కలదు. ఈ దేవాలయము లోని శాసనము కాకతీయుల వంశమును గూర్చి తెలుపుచున్నది. గుట్టవద్దనున్న చెరువులో జైన విగ్రహ శకల ములు అనేకము లిప్పటికిని కానవచ్చుచున్నవి. కాకతీయులు శైవులుగా మారిన తరువాత జైనమత ప్రాముఖ్యము తగ్గుచు వచ్చినది. కాకతీయులు మహేశ్వర పాద పద్మారాధకులుగా తమ్ము గూర్చి శాసనములలో వ్రాయించుకొనిరి. హనుమకొండలోని సహస్ర స్తంభ దేవాలయమును రుద్రదేవుడు క్రీ.శ. 1164 లో కట్టించెను. చాళుక్య దేవాలయములవలెనే ఇదియు నక్షత్రాకారముగా నున్నది. ఇందు సూర్య, విష్ణు, మహేశులకు గర్భాలయములున్నవి. వాటిమధ్య నొక మండపము గలదు. అందు పైకప్పుమీద లోపలి భాగమున నవగ్రహ ముల ప్రతిమలు చెక్కబడినవి. ద్వారబంధములపై, స్తంభములపై వివిధాకారములుగల లతలు, పుష్పములు

చెక్కబడినవి. ఈ దేవాలయము నందలి స్తంభములపై గల శిల్ప కౌశలము నిరుపమానమై ఒప్పారుచున్నది. నల్లరాతిని మణిదర్పణములుగా మార్చిన తెలుగు శిల్పి కళా నైపుణ్యము ఇందు కాననగును. అసంపూర్ణమును, శిథిలమును అయిన మంటప మొకటి దేవాలయమున కెదురుగ నున్నది. ప్రధాన దేవాలయమునకును, ఈ మంటపమునకును నడుమ జీవకళతో నొప్పారు ఒక నంది విగ్రహమున్నది. ఈ విగ్రహమును రాతితో తట్టిన అది కంచువలె మ్రోగును. ఈ నందీశ్వరుని మెడయందు చెక్కబడిన మువ్వల పట్టెడ ముద్దుల మూట గట్టుచు శిల్పి నైపుణ్యమును చాటుచున్నది. మంటపమునందుగాని, ప్రధాన దేవాలయమునందుగాని విగ్రహములు లేవు. కొంతవరకు శిథిలమైన శివలింగము మాత్రము నేటికిని ఓరుగల్లు ప్రజల పూజాపురస్కారములను పొందుచున్నది. దేవాలయావరణమునందు ఒక కోనేరున్నది. అందు భక్తుల స్నానపానములకై కల్పింపబడిన సౌకర్యములు నాటి నాగరకతా విభవమును ప్రదర్శించుచున్నవి. రుద్రదేవుడు వేయించిన ఒక పెద్ద శాసనము ముఖద్వారమున నున్నది. తెలుగునందును, సంస్కృతమునందును రచింపబడిన ఈ శాసనమునందు ఈ సహస్ర స్తంభ దేవాలయమునందలి ప్రధాన దైవతము రుద్రేశ్వరుడని పేర్కొనబడియున్నది.అనారతాధ్యయనాది తత్పరులైన శ్రోత్రియ బ్రాహ్మణు

లకు ఆవాసముగను, చతుష్షష్టి కళాపరిపూర్ణ వేశ్యాజనమున కాలవాలముగను, సర్వసంపద్యశో విరాజితముగను, హనుమకొండ ప్రసిద్ధి నొందియుండె నని ఈ శానసము తెల్పుచున్నది.

వరంగల్లునకును, హనుమకొండకును నడుమ కాకతీయుల కాలమున నిర్మింపబడిన భద్రి యను చెరువొకటి. కలదు. ఇది నేటికిని ప్రజాబాహుళ్యమునకు, స్నానపానాదులకు ఉపయోగపడుచున్నది. ఈ చెరువుగట్టునగల కొండపై భద్రకాళి దేవాలయమున్నది. ప్రాచీన కాలము నుండియు ఇది ప్రసిద్ధ దేవాలయముగా నుండినట్లు ఐతిహ్యమున్నది. భద్రి యని చెరువున కీ వేరు భద్రకాళి' సంబంధముచేతనే కలిగినదని ప్రతీతి కలదు.

ఓరుగల్లు నగరము కాకతీయ రాజధానియై, ఢిల్లీ సుల్తానులకు సహింపరాని సంపద్వైభవములతో విరాజిల్లెను. ఈ నగరమునకు కంచుకోట, ఇటుక కోట, పుట్టకోట, రాతికోట, భూమికోట, కంపకోట, గవినికోట అను ఏడు కోట లుండెనట. కాని ప్రస్తుతము రెండు కోటలు మాత్రమే కనిపించుచున్నవి. ఒకటి వేలుపలిది. ఇది మట్టిది. దీని చుట్టుకొలత 25 మైళ్ళు. అక్కడక్కడ ఈ కోట యొక్క శిథిలములు కనిపింపగలవు. లోపలి రాతికోట బలిష్ఠమైనది. దాని చుట్టుకొలత 8 మైళ్ళు. దీనికి నాలుగు మహాద్వారములు కలవు. ప్రాక్పశ్చిమ ద్వారములు మాత్రము తెరచియున్నవి. ప్రతిద్వారము నకును మూడు త్రోవలున్నవి. ప్రధాన ద్వారమును సూచించుటకు ఒక రాతి సింహ మమర్పబడినది. ద్వారమున కిరు ప్రక్కలయందును శిలానిర్మితములైన మెట్లు స్నవి. శిలా ప్రాకారముమీద అక్కడక్కడ కట్టబడిన బురుజులు డెబ్బది రెండు గలవు. వీటి పైభాగము విశాలముగ నున్నది. రాతి కోటను నిర్మించుటకు ఉపయోగింపబడిన రాళ్ళు నునుపుగ చేయబడి సున్నముతో గాని మట్టితో గాని సంబంధములేకయే ఒండొంటిపై పేర్చబడియున్నవి.కోట చుట్టును లోతైన కందకము కలదు. ఈ మహా దుర్గము 1199 లో ప్రారంభించబడి 1261 ప్రాంతమున పూర్తియైనది. కోందరీ కోట నిర్మాణము 1199 వ సంవత్సరమునకు పూర్వమే ప్రారంభమైనదని తలచిరి. కోట నడుమ ఒక పెద్ద దేవాలయము అసంపూర్తిగా విడువబడినట్లు ఇటీవలి త్రవ్వకములు తెలుపు చున్నవి. ఈ దేవాలయ ప్రాకారమునకు నలువైపుల మహాద్వార ములు హంసశిఖరో పేరములై యున్నవి. ఇందొకటి రెండు మాత్రమే ఇప్పుడు పూర్తిగా నిలిచియున్నవి. సాంచీ స్తూపద్వారములకును. ఈ ద్వారములకును కొంత పోలిక యున్నది. ఈ ద్వారములపై చెక్కడములు మిక్కిలి హృదయాకర్షకములై ఒప్పుచున్నవి. మట్టితొ నిర్మించబడిన ఈకోట ప్రహరియొక చుట్టుకొలత, పొడవు నందు భారతదేశమునగల అన్ని కోటల ప్రహరీల చుట్టు కొలతను మించినదని తెలియుచున్నది. కోట లోపల ఇంకను చిన్నవియు, పెద్దవియు నగు దేవాలయములు పెక్కులు గలవు. వీటిలోని ప్రతిశిలయు శిల్పాలంకృతమై శిథిలము అయ్యు జీవకళతో ఉట్టిబడుచున్నది. కోటకు తూరుపు దిశయందు పితాబుఖాన్ కట్టించిన మిక్కిలి ఎత్తైన దర్భారుహాలు, అతడు వేయించిన శిలా శాసనము కలవు. బొడ్డురాయిగ నున్న శిలాఖండము మీద ఎనిమిది కోణములచే అలంకృతమయిన ఒక బురుజు ఉన్నది. తలవరులీ బురుజుపై నియమింపబడి యుండిరి. దీని నానుకోని ఒక చెరువు కూడ కలదు.

ఏకశిలానగరమునందు భైరవాలయము. చాముండేశ్వరీ ఆలయము, వీరభద్రేశ్వరాలయము, బౌద్ధదేవుని విహారము, కుమారస్వామిగుడి, ముసానమ్మగుడి, పాండవుల గుడి, కేశవ స్వామ్యాలయము, స్వయం భూదేవాలయము, నరసింహాలయము మున్నగు ఆలయము లుండెను. ఏకవీరా, మైలారు దేవులకు ఉత్సవములు జరుగుచుండెడివి. జనులు వీరపురుషుల నారాధించు చుండెడివారు. పల్నాటివీరుల కొక గుడికూడ నుండెనట !

జనసమ్మర్దముగల రాజవీధులతోను, తోటలతోను ఈ నగరము శోభాయమానముగ నుండెను. క్రీ. శ. 1321 లో తురక సేనాని యగు ఉలం ఖాన్ ఒక మెట్టపై నెక్కి ఓరుగంటిని చూచెనట! ఏ దిక్కు చూచినను అతనికి రెండు మైళ్ల పొడవున ఉద్యానవనములు, ధారాజల యంత్రములు; మామిడి, అరటి, పనసచెట్లుగల తోటలు; మొగలి పొదలు, సంపెంగ చెట్లు, మల్లెపూవుల తీవెలు కనిపించెనట! నగరము పేటలుగా విభజింపబడినట్లు కనిపించెనట. ఓరుగల్లు నగరమున నాగరకులకు అవసరములైన ప్రసాధనములన్నియు లభించుచుండెను. కోటకు వెలుపలి భాగమున మైలసంత సాగుచుండెను. వివిధ వస్తువులపై చెల్లించవలసిన సుంకములను నిర్ణయించు శాసనము కూడ అక్కడ చెక్కబడినది. ఇప్పటికిని ఆ శాసన మున్నది. ఆచోటు నిపుడు ఖానాసాహెబ్ తోట అందురు. ఆ 'శాసనమునుబట్టి ఇక్కడ నవధాన్యములు, కూరగాయలు, వివిధ ఫలములు, పుష్పములు, కస్తూరి చందనాది సుగంధ ద్రవ్యములు, ఉప్పు, వివిధ ధాతువులు విక్రయింపబడు చుండెడివని తెలియుచున్నది. ఇందు అప్పటి ద్రవ్యమానము, కొలతలు పేర్కొనబడి యున్నవి. మట్టెవాడయని ఇప్పటికిని పిలువబడు వీథి యొక్కటి కలదు. ఒక వీథియే కాదు. ఇప్పటి వరంగల్లులో చాలభాగమున కీ పేరే వ్యవహారమున గలదు. మట్టెలుచేయు వారందుండిరట. కనుకనే దానికి ఆ పేరు వచ్చినదని అందురు.

నేడేకాక నాడుకూడ ఈ పట్టణము పారిశ్రామికముగ గొప్ప కీర్తిని సంపాదించి యుండెను. మారోపోలోయను ఇటలీ యాత్రికుడు, ఓరుగల్లులో సాలెపురుగు తంతువులకంటే సన్ననైన నూలు తయారు చేయబడు చుండెననియు, అట్టి నూలుతో నేయబడి, పలుచనై, విలువ, చెలువము కలిగిన ఆ వలువలను ధరింపకోరని రాజులుగాని, రాణులుగాని ప్రపంచమున నుండబోరనియు వ్రాసియుండెను. రసికులు, పరమధార్మికులు, పండితులు, పరిపాలనాదక్షులైన కాకతీయ ప్రభువులు ఓరుగల్లును దివ్యసుందర నగరముగా తీర్చిదిద్దిరి. రథగజ శకటహయ భటాళితో, ప్రజాబాహుళ్యముతో కిటకిటలాడు మంటా పథములతోను, పర్వవస్తు విలసితము లగు అంగళ్లతోను పుర మలరారుచుండెను. మేదరివారు, కుట్టుపనివారు, స్వర్ణకారులు, కుంభకారులు, ఇతర శిల్పులు అనవరతము తమ తమ పనులలో నిమగ్నులై యుండెడివారు. సుఖ ప్రసాధ నాధి సమంచితములైన వేశ్యాగృహములే పండ్రెండు వేలుండెనట! రాజనర్తకి మాచల్దేవి మేడ ఒక యాత్రా స్థలముగ భాసిల్లెను. వేశ్యాగృహములు చిత్రశాలలై కూడ వరలేను. చిత్రలేఖనమే వృత్తిగా గలిగినవారు ఇందు దాదాపు పదునైదు వందలమంది ఉండిరని ఏకామ్రనాథుడు వ్రాసెను. ఆంధ్రోక్విశు మోసాలపై నున్న ఘటికా యంత్రము సమయమును సూచించుచు గడియల ననుసరించి గంటలు గొట్టుచుండెడిదనియు, రేయి 30 గడియలు, పగలు 30 గడియలు వెరసి 60 గడియలు ఒక దినముగా క్రీడాభిరామమును బట్టి తెలియుచున్నది. పూటకూళ్ళ వారి ఇండ్లుకూడ లెక్క లేనన్నియుండెను. అందు బలవర్ధకమును, రుచికరమునైన ఆహారమ లభించు చుండెడిది. లక్ష్మణ వజ్ఝల యొక్క ఇల్లు ఇట్టి వానిలో ప్రసిద్ధమైనదిగా తెలియుచున్నది. అతనియింట ఒక రూక నిచ్చినచో "కప్పుర భోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంటయున్, గుప్పెడు పంచదారయును, క్రొత్తగ కాచినయాలనే, పెసర పప్పును గొమ్మునల్ల నటి పండ్లును, నాలుగునైదు నంజులున్, లప్పల తోడ క్రొంబెరుగులు” లభించెడివట. వీథులలో ప్రజలు వివిధములైన జూదము లాడుచుండెడివారు. పొట్టేళ్ళ పోట్లాట, కోళ్ళపోరు, మల్ల యుద్ధము ఇత్యాది ప్రజా వినోదములు నగరమున ప్రబలియుండెను. వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామమునందు ఆనాటి ఓరుగంటి ప్రజాజీవితము చక్కగా వర్ణింపబడినది. బమ్మెర పోతన, విద్యానాథుడు, తిక్కన సోమయాజి, పాల్కురికి సోమునాథుడు, జాయపసేనాని పరశురామపంతుల లింగమూర్తి ప్రభృతులు ఆంధ్రప్రజలకు సంస్కృతిభిక్ష పెట్టినవారు. వీరందరు ఓరుగంటిని తమ ఉనికిచే పునీతము చేసినారు. రాజులు, మంత్రులు విద్వత్సభలు చేయుచుండెడివారు. నగరమునందు సాహితీ వాతావరణము ప్రబలియుండెడిది.

కాజీ పేట గ్రామమునందుకూడ శైవ, వైష్ణవాలయము లున్నవి. ఇవి ప్రాచీనములు. 19 వ శతాబ్ద్యారంభమున ఒక తురుష్క మహానుభావుని సమాధి కట్టబడినది. ఇప్పటికిని ఆ సమాధివద్ద ఉత్సవములు జరుగుచుండును.

క్రీ. శ. 1308 నుండియే ఢిల్లీసుల్తానులు కాకతీయ రాజవంశమును ధ్వంసము చేయుటకు ప్రయత్నము లారంభించిరి. కాని రెండవ ప్రతాపరుద్రుడు ఆరుమార్లు వారి నెదుర్కొనెను, ఓరుగల్లు శత్రు దుర్నిరీశ్యమయ్యెను. కానీ ఉలఘాఖాన్ క్రీ. శ. 1321 లో దాడిచేసెను. ఆదాడిలో ప్రతాపరుద్రుడు పూర్తిగ ఓడిపోయెను. ఆ మహారాజును వీరుని బందీగా తురకలు ఢిల్లీకి గొంపోయిరి. కాకతీయ రాజ్యమ స్తమించెను. ఏక శిలానగరమునకు సుల్తాన్ పూర్ అను నామకరణము చేయబడెను. క్రీ. శ. 1422 లో బహమనీ రాజులు ఓరుగల్లును వశపరచుకొని ధ్వంసము చేసిరి.

కాకతీయుల పతనానంతరము స్వేచ్ఛాప్రియులైన తెలుగు నాయకులందరును ఏకమై ప్రోలయ నాయకుని ఆధ్వర్యవమున ఓరుగంటి నుండి తురుష్కులను పారద్రోలి ఇంచుమించు 50 ఏండ్లవరకు రాజ్యము చేసిరి. కావయ నాయకుడు ప్రోలయనాయకుని తరువాత తెనుగు నేల నేలినట్లు శాసనాధారమున్నది. షితాబ్ ఖాన్ అను బిరుదు గల సీతాపతి యను ఆంధ్రవీరుడు అసహాయశూరుడు. ఇతడు క్రీ. శ. 1504 లో ఓరుగల్లు స్వాతంత్య్రమును ప్రకటించెను. కుతుబ్ షాహీ రాజైన కులీ కుతుబ్ షాను ఓడించెను. ఓరుగంటిని రాజధానిగా వరించి రాజ్య పునర్ నిర్మాణమునకు పూనుకొనేను. ఓరుగల్లు యడా పూర్వ శోభను సంపాదించుకొనుచుండెను. కాని 1512 లో కులీ కుతుబ్ షా కుట్రలు పన్ని యుద్ధమును ప్రకటించెను.ఆ యుద్ధములో సీతాపతి నిహతు డయ్యెను. విజేతలు నగరమునందలి దేవాలయములను, భవనములను నేల గలిపిరి. గోలకొండ కుతుబుషాహీ రాజుల పతనానంతరము ఓరుగల్లు మొగలాయీ రాజ్యములోని భాగమయ్యెను. మొగల్ చక్రవర్తులను ధిక్కరించి దక్కను సుబేదారైన నిజాముల్ ముల్కు క్రీ.శ. 1724లో స్వాతంత్ర్యము ప్రకటించుకొనెను. వాటినుండి ఇది ఆసష్టాహీ రాజుల పరిపాలనక్రింద నుండెను. 1956 నవంబరులో ఆంధ్రప్రదేశ్ అవతరించెను.

ఆంధ్రప్రదేశము నందలి నేటి ప్రధాన నగరములలో ఓరుగల్లు ఒకటి, తివాచీల నేతకిది ప్రసిద్ధి వహించి యున్నది. నూనెగింజలు, ధాన్యము, చేనేత వస్త్రములు, తివాచీలు, కలప, ఇక్కడినుండి యెగుమతి యగుచుండును.

రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషానిలయము, శబ్దాను శాసనాంధ్ర భాషానిలయము, విజ్ఞాన ప్రసారక కేంద్రములుగా గత నాలుగు దశాబ్దములనుండి పని చేయుచున్నవి. పాలీ టెక్నిక్ కళాశాల, ఆర్ట్సు-సైన్సు కళాశాల ఇచట నున్నవి; పాఠశాలలు పెక్కులున్నవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో జనసంఖ్యయందేమి, చారిత్రక ప్రాముఖ్యము నందేమి ఆంధ్రప్రదేశ రాజధానియగు హైదరాబాదు తరువాత వరంగల్లునే పేర్కొనవలసి యుండును. వరంగల్లు ఆంధ్రులకు భావావేశమును కలిగించునదియై దినదినాభివృద్ధి పొందుచున్నది.

ఇ. కృ