Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఒలింపిక్ క్రీడలు

వికీసోర్స్ నుండి

ఒలింపిక్ క్రీడలు :

మానవుడు పరిపాటించు క్రీడలన్నింటిలోనికి ఒలింపిక్ క్రీడల కున్నంత వైభవసంపన్నత, చరిత్ర ప్రసిద్ధిగల నేపథ్యము మరెద్దానికిని లేదు. ఈ క్రీడలు క్రీస్తుశకమునకు పెక్కు సంవత్సరముల పూర్వమే గ్రీకు వారిచే ప్రారంభింపబడినవి. క్రీ. శ. 392 లో ఇవి ఒకానొక రోమక చక్రవర్తిచే ఆపివేయబడినవి. ప్రాచీన తతంగ సంబంధమైన పెక్కు లక్షణములతో ఈ తరములో గూడ సాగునట్లుగా 1896లో ఇవి ఉద్ధరింపబడెను.

కాలగర్భమున మునిగిపోయిన ప్రాచీనయుగ గ్రీకు చరిత్రను, ప్రపంచములో అత్యంత బలపరాక్రమాన్విత మయిన సామ్రాజ్యమని పేరొందిన రోమక చరిత్రను చాల వరకు ప్రకాశమానము గావించినదీ క్రీడలే. ఈక్రీడలు ఎట్లు ప్రారంభమయినవో అను విషయమున కొంత గజిబిజి కలదు. కాని క్రీ పూ 776 నుండి ఈ క్రీడలకథ సముచితముగ పరిరక్షింపబడినది.

గ్రీకుభాషలో 'ఒలింపీడ్' అనుపదము కాలమానమును తెలుపునట్టిదిగా నున్నది. అనగా 'నాలుగు సంవత్సరముల 'కాల'మని అర్థము. ఒలింపిక్ క్రీడలు ప్రతి "ఒలింపిడ్" అంత్యభాగమున జరుగుచుండెను. మరియొక విధమున చెప్పవలసియున్నచో ఇవి క్రొత్త "ఒలింపీడు” ప్రారంభమును సూచించును. ఇంతవరకు ఇది నిర్దిష్టమయిన విషయమే. కాని ఒలింపిక్ క్రీడలు ప్రప్రథమమున ఎప్పుడు అనుష్ఠానములోకి వచ్చెనో, ఏ యుద్దేశముతో వాటిని స్థాపించిరో ఇప్పటివరకును తెలియరాలేదు.

అతి ప్రాచీనయుగములో ఈ ఉత్సవ కార్యక్రమము క్రీ. పూ. 1453లో ప్రారంభమయినట్లు విశ్వసింప బడు చున్నది. ఇవి కేవలము మల్లయుద్ధ ప్రదర్శనములు కేర్పడినవికావు. ఒలింపిడ్ కాలములో మరణించినవారి గౌరవార్థము జరిపెడు స్మృతికలాపము మాత్రమే ఇవి. గ్రీకులు కాలమానమును ఇప్పటివలె సంవత్సరము సంవత్సరముగా గణించక, నాలుగు సంవత్సరముల కాలమునుబట్టి గణించుటయే దీనికి మూల హేతువు.

మానవులు మరణించినప్పుడు వారి ఆత్మలు ఆశరీరములు జీవించియుండిన పరిసరములందే యుండునని గ్రీకుల పరమవిశ్వాసము, ప్రాణముతో నున్నప్పుడు తమకు తెలిసిన కార్యరంగములను ఆజీవులు కనిపెట్టుచుంగురని వారు తలంచిరి. ఆ విశ్వాసముచేతను, బ్రతికియున్న బంధువులు, మిత్రులు మృతజీవులను సంతృప్తిపరచు కాంక్ష చేతను, వారి ఆత్మశరీరగతమైయున్న కాలమున ఆ ఆత్మ మనోవ్యాపారమునకు గురి అయిన విషయ మేదై యుండెనో తెలుపు లిఖితగ్రంథముల నుంచుచుండిరి.

కాబట్టి ఒక పాత ఒలింపీడు గడచిపోవుటయు లేక క్రొత్తది ప్రారంభమగుటయు గ్రహింపబడుటకై ఒక ఉత్సవ కార్యక్రమమును ఏర్పాటుచేసెదరు. ఈ ఉత్సవము నందు బ్రతికినంత కాలము మృతజీవుల కభిలషితములుగా నుండిన రంగములను, వాటిని తిలకించు ఆత్మల సమక్షములో ప్రదర్శించెదరు. ప్రాచీన ఉత్సవ కార్యక్రమములోని వైవిధ్యమునకు ఇదియే ముఖ్యకారణము.

క్రీ. పూ. 1453 ప్రాంతమునందు, తరువాత కొన్ని శతాబ్దములవరకును గ్రీసు ఒక సంఘటిత దేశముగా నుండకుండెను. ఒక దానికి మరియొక దానితో సంబంధము లేని స్వతంత్ర పట్టణ రాజ్యములు పెక్కుండెను. ఇవి ఎల్లప్పుడును పరస్పరము పోరాడుచుండెను. రాజ్య తంత్రజ్ఞులు, తత్వవేత్తలు, విజ్ఞానవంతులు ఈ పట్టణ రాజ్యముల నన్నింటిని సంఘటితముచేసి బలిష్ఠమగుజాతిగా తీర్చిదిద్దుటకు ప్రయత్నించిరి. ఈ పట్టణములలో నుండిన మల్ల రాజులు నందరినీ పిలిపించి, ఒక గొప్ప మల్లయుద్ధము ద్వారా డెల్ఫి దేవాలయములోని దైవజ్ఞు డీకార్యమును సాధించినట్లు విశ్వసింపబడుచున్నది. ప్రతి పట్టణమునందు జరుగు ఉత్సవాదుల కార్యక్రమము అతనికి తెలియును. ఏతదుత్సవాధికారి శక్తి సామర్థ్యములను గూర్చి ప్రతి యొక్కడు అత్యధిక గర్వముతో భావించుటయును అతనికి తెలియును. ఐక్య గ్రీసు ఉద్యమ నాయకులు వెంటనే సమ్మతించిరి. అయితే పట్టణములు తమ మామూలు ఉత్సవ కార్యకలాపములను సాగించుచునే యుండెను. జాతీయమైన పోటీ వందెములుగా పరిగణింపబడినట్టి సమష్టి కార్యకలాపములలో పాల్గొన కాంక్షించు వారికి స్వస్థానకలాపములు ఆకర్షణీయములు గాకుండెను.

అత్యంత ప్రాచీన కాలములో మహోత్కృష్టములగు ఈ పందెములు ఏ పేరుతో పిలువబడినవో తెలియదు. కావి గ్రీసులోని ఒలింపస్ పర్వతముమీద ఒలింపిడ్ కార్యకలాపము జరుపు నాచారము స్థిరఃడిపోగా క్రీ.పూ 776 లో ఒలింపిక్ క్రీడలు అను పదము వాడుకలోనికి వచ్చినట్లు తెలియుచున్నది. కొన్ని కొన్ని కారణముల చేత క్రీడారంగముగా ఆప్రదేశమునే నిర్ణయించిరి. విశేషమేమనగా, అది దేవతల అభిమాన విలయముగా భావించిబడెను. అందుచే ఆ ఉత్సవములు దేవతల ప్రీతిచే ధన్య మగుసని నమ్మిరి. ఇంకొక విశేష మేమనగా ఆ పర్వత పాదమునందలి విశాలమైదానము అత్యధిక సంఖ్యాకులు సమావేశమగుటకు అనువుగా నుండెను.

ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన నియమావళిలో నిష్ఠురమైన నియమము స్త్రీ నిషేధము. స్త్రీలు ఆ క్రీడల యందు పాలుపుచ్చుకొనుటకే గాక చూచుటకు గూడ రారాదు. ఏలయనగా, ఈ క్రీడలు మతాచార విధు లని భావించుచుండిరి. గ్రీకుల వ్రాచీన ధర్మశాస్త్రము ప్రకారము అట్టి మత విధులలో స్త్రీలు చేరకూడదు.

ఫిరినీసు సంఘటనము తరువాత ఈ నియమమును సడలించి స్త్రీ ఒలింపిక్ క్రీడల తిలకించుటకు అనుమతి యిచ్చిరి. ఫిరినిసు (Pherenise) అను నామె పీనిడోరస్ (Peisidorous) అను జెట్టి తల్లి. యుద్ధసమయమున తన కొమరునకు ప్రోత్సాహమియ్య ఆమె సంకల్పించుకోనెను. అట్టి సంరంభములో మగవాని దుస్తులతో క్రీడారంగము నందు ఆమె అడుగు పెట్టెను. పీసిదొరస్ విజయుడుకాగా ఆ తల్లి అత్యంత సంతోషావేశమున మైమరచి వానిని కౌగలించుకొని ముద్దులాడెను. ఆమెపై నేరము మోపి న్యాయస్థానములో విచారణ సల్పిరి. ఆమె తన మాతృత్వమును, ప్రేమను గమనించి క్షమింపగోరెను. న్యాయమూర్తులు చాలదూరము చర్చలు సలిపి, ఆలోచనలు చేసి చివరకు ఆమెను వదలిపెట్టిరి. కాని ఇకముందు శిక్షకోపాధ్యాయు లందరు నగ్న స్వరూపములతో క్రీడల యందు ప్రవేశించవలెనని శాసించిరి.

రోమను చక్రపర్తులు గ్రీసును జయించువరకు ఒలింపిక్ క్రీడలు నిష్కళంక ఖ్యాతిగల కులీన గ్రీకు (Free born Greeks) లకు మాత్రమే ప్రవేశార్హములై యుండెను. ఎప్పుడయినను జాతికి మానవునకు సంబంధించిన ఏ అల్ప ధర్మమునైనను ఉల్లంఘించినవాడు పాల్గొనుటకు వీలు లేదు. ఒలింపిక్ క్రీడలలో పాల్గొనుటకు ఎవనికైన అనుమ తించుటయే గ్రీసు ప్రసాదించు మహోన్నత గౌరవముగా నుండెను.

కాలిపరుగులు, చక్రమును విసరుట, (Pentathlon) కుస్తిపట్టు, ముష్టియుద్ధము, వీటితో సమ్మిళితములై యుండు (Paneratium) క్రీడావిశేషము, ఈ కార్యక్రనుము లోనివి ప్రధానాంశములు.

క్రీ. పూ. 464 లో ఈ క్రీడలు అత్యున్నత దశలోనికి వచ్చెను. ఆ కాలమున గ్రీసు ఐక్యజాతిగా నుండెను. ప్రతి సంఘమునకు తన పక్షమున నొక ఒలింపిక్ క్రీడాయోధుని కలిగియుండుట ఘనాభిలాషగా నుండెను.

ఆటలలో పాల్గొను వీరులును, అధికారులును ఊరేగుచు జ్యూయసు (జ్యుపీటరు) మహాదేవుని విగ్రహముకడకు పోవుటతో ఈ క్రీడలు ప్రారంభమగును. అచ్చట మల్లు లందరు ఎట్టి సందర్భముననైనను ధర్మ నిర్ణయాధికారి తీర్పును శిరసావహించెద మనియు, ఎట్టి వై ముఖ్యమును వెల్లడించ మనియు ప్రమాణములు చేసెదరు. ధర్మాధికారులు తాము నిష్పక్షపాతముగ తీర్పు చెప్పేద మని ప్రమాణము చేసెదరు. క్రీడలు ముగిసిన తరువాత మల్లు లందరు తిరిగి జ్యూయసు మహాదేవుని విగ్రహము సన్నిధికింజని ధన్యవాదములు సమర్పించుచు ప్రార్థనలు చేసెదరు.

రోమక సామ్రాజ్యములో గ్రీసు ఒక రాష్ట్రముగానైన తరువాతగూడ పెక్కు సంవత్సరములవరకు కలతలు లేకుండ ఒలింపిక్ క్రీడలు నిర్వహింపబడు చుండెను. క్రీ. శ. 392 లో రోమక చక్రవర్తి అయిన థియోడోసి యసు (Theodosius) వాటిని ఆపివేసెను.

ఈ విధముగా 1100 సంవత్సరముల కాలము నిరంత రాయముగ సాగిన ఒలింపిక్ క్రీడలకు స్వస్తి చెప్పబడినది.

ఫ్రాన్సులో నివసించు మల్లయుద్ధాభిమానియగు "బేరన్ పీరెడి కంబెర్టిన్" అనువాడు ఈ ప్రాచీన క్రీడలకు పునరుజ్జీవనము కలిగించవలెనని ప్రయత్నము చేసెను.


అతడు తన సూచననుగూర్చి గట్టిగా వాదించెను. 1894 లో ఈ క్రీడల స్థిరవ్యవహారమునకు తగినంత ప్రోత్సాహ మాతనికి లభించెను ఎం. అవెర్ (M. Aver) అను అలెగ్జాండ్రియా నాగరకుని ఉదారవితరణము కారణమున ఒక స్టేడియం నిర్మాణమున కవకాశము కలిగెను.ఈ స్టేడియం హిమయుగమునాటి గ్రీకులచేత ఎన్నో శతాబ్ధముల కాలము ఉపయోగింపబడుచున్న స్టేడియంకు రెండవదిగా సహకరించుచుండెను. ఆధునికముగా 1898 ఏప్రిల్ నెలలో ఏథెన్సునగరమున మొట్టమొదటి ఒలింపిక్ క్రీడలు సమారంభ మాయెను.

1896 మొదలుకొని ఒలింపిక్ క్రీడలు ప్రపంచములోని వేర్వేరు ప్రాంతములందు సక్రమముగా నిర్వహింపబడు చున్నవి. ఈ క్రీడలు క్రీడాపరాయణులమధ్య సద్భావ వ్యాప్తి గావించుచున్నవి.

1896 ఏధెన్సు గ్రీసు
1900 పారిస్ ఫ్రాన్సు
1904 సెయింటులూయీ అమెరికా
1908 లండన్ ఇంగ్లండు
1912 స్టాకుహూం నార్వే - స్వీడన్
1916 ప్రపంచయుద్ధ కారణమున జరుపబడలేదు.
1920 ఆంట్వెరు బెల్జియం
1924 పారిస్ ఫ్రాన్సు
1928 అం స్టరుడం హలండు
1932 లాస్ఏంజిలెస్ అ. సంయుక్త రాష్ట్రము
1936 బెర్లిన్ జర్మనీ
1948 లండన్ ఇంగ్లండు
1952 హెల్ సింకి ఫిన్లాండు
1956 మెల్బరన్ ఆస్ట్రేలియా

ఎస్. ఐ. ఆ