సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఐన్ స్టెన్
ఐన్న్ ఆల్బర్టు :
ఆల్బర్టు ఐన్ స్టైన్ కు జగన్నిర్మాత (maker of the Universe) అనెడు ప్రసిద్ధి వచ్చినది. ఇట్టి భాగ్యము కలవారు అరుదుగా నున్నారు. జనులు ప్రకృతిశాస్త్రమును అతని యొద్ద అభ్యసించుటకు అభిలషించెడివారు. అంతేకాదు. జీవితమునకు సంబంధించిన వివిధ విషయములను గూర్చి “ఐన్ స్టైన్" మాతో ఏకీభవించు చున్నాడని చెప్పుకొనగలుగుటకును, ప్రజలు ఆతనిని తమవైపు త్రిప్పుకొనుటకును ప్రయత్నించుచుండెడివారు. ఇతడు వర్తమానయుగమునకు అంతరాత్మ వంటివాడని నుడువవచ్చును.
ఐన్ స్టైన్ యూదుమతస్థుడు. తలిదండ్రులకు ఇతడొక్కడే కుమారుడు. జర్మన్ లోని మ్యూనిక్ పట్టణములో 1879 మార్చి 14 వ తారీఖున జన్మించెను. అతని తండ్రి “విద్యుత్ - రాసాయనిక" కర్మాగారమును తన తమ్ముని సహాయముతో నడపుచుండెను. ఆల్బర్టు క్యాథలిక్ ఎలిమెంటరీ పాఠశాలలో చదువుకొనసాగేను. ఆ తరగతిలో ఇతడొక్కడే యూదుడు. అతనికి తొమ్మిది వత్సరములు నిండినను చక్కగ మాటాడ లేకుండెను. అతని యందు విశిష్ట కౌశల్య సూచకములగు ఎట్టి చిహ్నములును కనబడలేదు.
అతడు బడిలో చదువుకొనుచున్న కాలమం దొకసారి అతని తండ్రి అతనికి జేబులో పెట్టుకొనదగిన "దిక్చూచి " యంత్రమును ఒసగెను. ఎటు త్రిప్పినను ఉత్తరపు దిక్కునే సూచించు అందలి ఇనుపముల్లు యొక్క అద్భుతశక్తిచే ఈ బాలుని హృదయము అత్యంతము ప్రభావితమయ్యెను. పదార్థములను ఆకర్షించి, ఒకే దిక్కుకు తిరుగునట్లు చేయగలుగు శక్తి ఏదో ఈ శూన్యాకాశ రంగమున కలదని అతడు భావించెను.
గణితశాస్త్రమం దీతనికిగల అభిరుచికి పాఠశాలగాక, గృహమే జన్మస్థానమయ్యెను. పాఠశాలలోని ఉపాధ్యాయుడు గాక, ఇంటిలోని పినతండ్రియే బీజగణితములోని మొదటి పాఠములను అతనికి నేర్పియుండెను.
అల్బర్టు ఒకానొక తరగతిలో ఉత్తీర్ణుడయి పైతరగతికి పోయినప్పుడు టాల్మేస్పైకర్సు వ్రాసిన రేఖా గణితశాస్త్ర గ్రంథము (Geometry) అతనికి బహుమతిగా లభించెను. ఆ పుస్తకమును చదువుట యందును, అందలి విషయములను గ్రహించుటయందును నిమగ్నుడయి కొన్ని వారము లాతడు గడపెను. కొన్ని నెలలలోనే ఆతడందలి విషయములను సంపూర్ణముగ అవగతము చేసికొనెను. పదునాలుగేండ్ల వయస్సున ఆల్బర్టు గురుతర గణితశాస్త్ర విషయములలో ప్రవీణుడయ్యెను. ఈ విషయములను బోధించుటకు సెకండరీ పాఠశాలలలో గూడ ప్రయత్నము చేయరు. ఇంకను విశేష మేనునగా, బ్రన్ స్టెన్ వ్రాసిన ప్రకృతి శాస్త్రమునకు సంబంధించిన సులభ గ్రంథములును, క్యాంటు విజ్ఞాని ప్రాచీన "శుద్దతర్క సమీక్ష" (Critique of pure reason) అను గ్రంథమును అతనికి లభించెను. ఈ గ్రంథములు అతని మనస్సు నాకర్షించెను. తత్పరిణామముగ గణితశాస్త్రముతోబాటు ప్రకృతిశాస్త్ర, తత్త్వశాస్త్రము లందును ఆతడు మగ్నమనస్కు డయ్యెను.
ఇంతలో అదృష్ట చక్రము గిఱ్ఱున తిరిగి విపరీత పరిస్థితు లేర్పడెను. అతని తండ్రిగారి వ్యాపారము ఎడ తెగక నష్టపరంపరలకు గురి కాసాగెను. అంత ఆల్బర్టు విద్యాభ్యాసము కొనసాగుటకై అతనిని మ్యూనిక్ నగరములో నమ మిత్రురాలయిన ఒక వృద్ధ వనిత దగ్గర నుంచుటకును, తాము ఇటలీకి తరలుటకును అతని తల్లిదండ్రులు నిశ్చయించుకొనిరి. కాని అప్పుడు ఐన్ స్టైన్ వయస్సు పదునైదు సంవత్సరములు. తల్లిని విడిచియుండుట అతడెంత మాత్రమును సహింపలేక వైద్యుని సర్టిఫికేటు సాకుగా గైకొని, అతడు మ్యూనిక్ ను విడిచిపెట్టి, ఇటలీలోనున్న తన తల్లిదండ్రులను కలిసికొనెను. అతనికి పాఠశాలా నిర్బంధము తప్పి స్వేచ్ఛ కలిగెను. దానికితోడుగ ఇటలీలోని చక్కని వాతావరణమునందు స్వజనులలో నుండుటకు అతనికి అవకాశము కలిగెను. ఈ అవకాశమును పురస్కరించుకొని శక్తిమంతము, ప్రతిభావంతము నగు తన మనస్సునకు వచ్చిన గ్రంథముల నన్నింటిని అతడు తదేకచిత్తతతో పఠనముగావించెను. తరువాత నతడు స్విట్ట ర్లాండులోని జ్యూరిచ్ నందలి "బహుముఖసాంకేతిక విద్యా పరిషత్తు" (Polytechnic Academy) నందు సంపూర్ణ యోగ్యత గల విద్యార్థిగా చేర్చుకొనబడెను. ఇచ్చట గణిత శాస్త్రాధ్యయనమునందును, పదార్థ విజ్ఞాన శాస్త్రపఠనము నందును అతడు తీవ్రకృషి చేయసాగెను. వెబ్బరు, గేసేరు. మింకోవస్కి వంటి విజ్ఞానఖమల ఉపదేశ పటిమచే అతడు అత్యంత ఆవేశ పూరితుడయ్యెను. ప్రపంచమును చకితము గావించిన "సాపేక్ష సిద్ధాంతము”వకు (Theory of Relativity) బీజములు క్రమముగా అతని సారవంతమైన మానసమున వేరులు నాటుకోన సాగెను. ఈబాల మేధావికి ఆజూరిచ్ పరిషత్తునందలి పాఠ్య కార్యక్రమము చాలనిదిగా స్పష్టమయ్యెను. హెర్బ్ు, హెల్మ్ హోల్ ట్టు, కిర్ చాఫ్ అనువారల గ్రంథాలను స్వయముగా పఠించి జీర్ణము చేసికొనుటకు వీలుగా నుండుటకై అతడు తరగతులకు పోవుట తరచుగ మానివేయసాగెను.
విద్యావ్యాసంగ పరిస్థితులను సమీక్షించు సందర్భమున ఆతనిని నిరంతరము వేధించుచున్న దారిద్య్రమును విస్మరించుటకు వీలు లేదు. అయితే అతనికి ద్రవ్య సంపాదన యందుగాని, కీర్తిసంపాదనయందుగాని కాంక్ష లేకుండెను. దురదృష్టమునకు తోడుగ ఇతడు పట్టభద్రుడయిన తరువాతగూడ ఒక సంవత్సరము వరకు నిరుద్యోగిగనే యుండవలసివచ్చెను. అతని దీనావస్థను గూర్చి ఈతని పూర్వ సహాధ్యాయికి తెలిసెను. ఆతని కృషిఫలితముగా "బెర్న్" నగరములోని పేటెంటు ఆఫీసు డైరక్టరగు మిస్టర్ హాలెన్ గారిని దర్శించుటకై ఒక సిఫారసు ఉత్తరము ఆల్బర్టుకు లభించేను. తన్మూలమున నతనికి 1902 లో అచ్చట ఒక సహాయకోద్యోగి పదవి లభించెను. ఈ యుద్యోగము అతని మేధాసంపద పరిపక్వమగుటకు తోడ్పడెను. ఇది మానవజాతి సాధించిన విషయములలో ప్రముఖమయిన యొక విషయమును ప్రపంచమున ప్రకాశము చేయుటకు ఇతనికి అవకాశము కలిగించెను. తనకు విరామము దొరకినప్పుడెల్లను అల్బర్టు అంతవరకు విశ్వసింపబడిన విశ్వనిర్మాణ సిద్ధాంతములను ఖండించుచు, గణితశాస్త్రపు తప్పుడు లెక్కలనుగూర్చి చాటుమాటున వ్రాయుచుండెడివాడు. ఐన్ స్టైన్ యొక్క బెర్న్ నగరగమనము ఆతని జీవితములో పెక్కు విధముల గొప్ప మార్పును తెచ్చుటకు కారణభూతమయినదని చెప్పవలెను. అతడిప్పుడు అధికాదాయమునిచ్చు ఉద్యోగమును బడనెను. కావున వివాహమాడి గృహస్థజీవితమును గడుపవలయునను యోచనకు అవకాశము కలిగెను. జూరిచ్ పరిషత్తులో తన పూర్వ సహాధ్యాయినియగు "మికెనా" అను కన్యను 1903 లో ఇతడు పెండ్లాడెను. కార్యాలయమందును, ఇంటి యందును విరామ కాలమును ఇతడు భౌతికశాస్త్ర పరిశోధనమునకై వినియోగించుచుండెడివాడు “పదార్థ విజ్ఞానశాస్త్ర వార్షిక సంపుటము" అనునొక ప్రముఖ జర్మన్ పత్రికయందు అతడు తన వ్యాసపరంపరలను ప్రకటించు చుండెడివాడు. 1905 వ సంపుటములో అతనివి అయిదు వ్యాసము లుండెను. అవన్నియు వేర్వేరు విషయములను గూర్చి వ్రాయబడి నట్టివియే. అందు మొదటి వ్యాసవిషయము "అణువుల పరిమాణపు కొలతలను గూర్చిన నవీన పద్ధతి” అది “డాక్ట రేటు” బిరుదముకొరకు సమర్పితమైన వ్యాసరాజము. రెండవ వ్యాసవిషయము 'ఫొటో ఎలెక్ట్రిక్ ప్రభావము" అనునది. ఆ వ్యాసరాజమే 1922 లో ఆల్బర్టు ఐన్ స్టైన్కు నోబెల్ బహుమతిని ప్రసాదించినది. మూడవ వ్యాసము "ద్రవపదార్థములలో బ్రేనియన్ గమనము", నాల్గవవ్యాసము 'చలనశీలముగల పదార్థములు విద్యుద్గతి శాస్త్రము' (Electrodynamics of moving bodies) అను శీర్షిక గలది. సామాన్య శీర్షికగల ఈ వ్యాసరాజమే ఇప్పుడు “సాపేక్ష సిద్ధాంతముగా" (Theory of Relativity) ప్రత్యేక ప్రసిద్ధివడసి యున్నది. ఐదవ వ్యాసము "శక్తి మాంద్యము" (Inertia of Energy) అనునది. అందు ప్రపంచమునంతయు గడగడలాడించు శక్తినిగూర్చి హెచ్చరిక చేసి యున్నాడు. అతడు చేసిన పరిశోధన కార్య ప్రాముఖ్యము చక్కగా గమనింపబడినది. అతనికి చిన్న యుద్యోగ మాతని పరిశోధన ప్రాముఖ్యమునకు అనుచితమైనదిగా భావింపబడెను.
1909 లో జ్యూరిచ్ విశ్వ విద్యాలయములో పదార్థ విజ్ఞానశాస్త్ర శాఖయందు అతడు సహాయ పండితుడుగా నియమితుడయ్యెను. 1910లో ప్రేగ్ నగరములోని జర్మన్ విశ్వవిద్యాలయములో పదార్థ విజ్ఞాన శాస్త్ర సిద్ధాంత భాగమునకు ఆచార్యుడుగా నియమితుడయ్యెను. అచ్చటనున్న కాలముననే అతడు తన ప్రత్యేక సిద్ధాంత మగు “సాపేక్ష వాదము"ను విపులీకరించుటకు ప్రారంభించెను. జర్మనీలో ఇద్దరు ప్రఖ్యాత శాస్త్రవేత్తలయిన "నెర్మస్టు", "ప్లాన్కి" అనువారలు "ప్రకృతి విజ్ఞాన సంస్థ"లో సభ్యత్వమునకై ఆతని పేరును ప్రతిపాదించిరి. ఆ"ప్రకృతి విజ్ఞాన సంస్థ" రెండవ విల్హెల్మ్ చక్రవర్తి చే స్థాపితమైన క్రొత్త సంస్థ “రాయల్ ప్రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్" అను విజ్ఞాన కేంద్రములో గూడ అతడు సభ్యుడుగా చేర్చుకోనబడియెను. కొమ్ము టేనుగులవంటి విద్యాంసులకును లభింపజాలనట్టి గౌరవ మిది.
1917 లో "క్రష్యన్ అకాడమీ ఆఫ్ సై స్సెస్" వారి నివేదికలలో అతడొక వ్యాసమును ప్రకటించెను. సాపేక్ష వాదమునకు సంబంధించిన సామాన్య సిద్ధాంతమ లను గూర్చిన విశ్వసృష్టి విచారము" (Cosmological considerations on General Theory of Relativity) అనునది ఆ వ్యాసమునకు మకుటము. 1929 లో అతడు తన "ఐక్యక్షేత్ర సిద్ధాంకము"(Unified field Theory)ను ప్రపంచమునకు చాటెను. అప్పుడే అతనికి 50 వ జన్మదినము కూడ తటస్థించెను. ఈ సిద్ధాంతము సృష్టినిర్మాణ విధాసము, అణుశక్తి విధానము అను రెండు విధానములను విశదపరచుచున్నది. అనగా, అనంతమగు మహాపదార్థము,అనంతమగుఅణుపదార్థము అను నీ రెంటికి మధ్యగల ఎడమును ఇది సంధింప జేయుచున్నది.
1930 తరువాత ఆత్మగౌరవముగల ఏ మనుష్యున కయినను సహింపరాని పరిస్థితులు జర్మనీలో ఏర్పడెను. ముఖ్యముగా యూదుల గతి దుర్భరముగా నుండెను. ఇట్టి సమయముననే అమెరికాలోని ఒక వదాన్యుడు ప్రిన్స్టన్ పట్టణములో ఉన్నత విజ్ఞానమును బోధించెడు పరిషత్సంస్థను ఏర్పాటు చేసెను. అచ్చట ఐన్స్టీన్ ఆచార్య పదవిలో నియోగింపబడెను. కాని అతనికి విద్యార్థుల కుపన్యసింపవలసిన బాధ్యత లేకుండెను. అప్పటి నుండి అతడు అమెరికా సంయుక్త రాష్ట్రములందు శాశ్వత పౌరుడయ్యెను.
1939 లో ఇటలీ దేశ శాస్త్రజ్ఞుడొకడు అచ్చటి ఫాసిస్టు (Fascist) ప్రభుత్వమునుండి తప్పించుకొని అమెరికాకు పరుగెత్తెను. “యురేనియము యొక్క కణవిభజనము" (Fission of Uranium) స్వయం నిర్వాహకముగ (Self sustaining) నుండులాగున చేయవచ్చునని అతడు రుజువుచేసెను. ఆ శాస్త్రజ్ఞుడును అతని సహాధ్యాయియు, కొలంబియా యూనివర్సిటీ విద్వాంసుడును అగు "వియో సేజీలాండు"ను యురేనియంబాంబు నిర్మాణము సాధ్యముగా కనబడుచున్న దను విషయమును పై నికాధికారులకు తెలుపుట భావ్యముగా నెంచిరి. ఆ విషయమును గూర్చి సూటిగా అధ్యక్షులవారికి విజ్ఞప్తి పంపవలసినదిగా వారు ఐన్ స్టీన్ కు సూచించిరి. ఐన్స్టెన్ రాజకీయ వ్యవహారములలో మగ్నుడగుటకు ఒల్లకుండెను. ముఖ్యముగా సైనిక వ్యవహారములపై సలహానిచ్చుట అతని కెంత మాత్రము రుచింపకుండెను. అయితే దురదృష్టవశమున హిట్లరు 200 మంది ప్రముఖ శాస్త్రజ్ఞులను సమీకరించి, యురేనియం కణవిభజన వ్యవహారమును కొనసాగించ వలసినదిగా నియోగించినాడని బెర్లి నునుండి వార్త వచ్చెను. నాజీలు అణుశక్తి సంపన్ను లయియుండి ప్రపంచమును తమ పాదాక్రాంతము చేసికొనుటకు దాని నుపయోగించెదరని ఐన్ స్టైన్ తలపోసెను. కాబట్టి 1939 ఆగస్టు 2 వ తారీఖున ఐన్లైన్ ప్రెసిడెంటు రూజు వెల్టు సన్నిధి కొక ఉత్తరము - చరిత్రాత్మకమైన ఉత్తరము - చరిత్రయం దపూర్వాధ్యాయమును కల్పించిన ఉత్తరము - వ్రాసి పంపెను. ఆ యుత్తరమునందు ఐన్ స్టెన్ ఇట్లు లిఖించెను :
"ఫెర్మి, జీలాండులు (Sziland) నాకు చూపిన ఈ నూతన ఘటనాదృశ్యము (Phenomenon) అపూర్వశక్తిగల బాంబుల నిర్మాణమునకు దారితీయగలదు. ఇట్టిదగు ఒక్క బాంబును నౌకలో తీసికొనిపోయి, ఏరేవునందైనను ప్రేలునట్లు చేసినచో, ఆ నౌకాతీరమునంతటినే గాక, చుట్టుపట్లనున్న భూభాగము నంతటిని అది సులభ ముగా నాశనము చేయగలుగును.”
శాంతికాముడయిన ఐన్ స్టైన్ ఇట్టి ప్రచండమగు యుద్ధాయుధ నిర్మాణమునకు ప్రోత్సాహకుడుగను, అది శాశ్వతముగ మానవుని హస్తగతమై యుండుటకు కారకుడుగను అయియుండుట విధిదుర్విపాకమనియే చెప్పవలెను. అవును ! అతడు బొత్తామును నొక్కినాడు. 1945 జూలై 16వ తారీఖున బాంబు న్యూ మెక్సికో ప్రాంతములోని ఎడారి యందు ఆల్మెగా రెడో విమాన కేంద్రస్థానము దగ్గరగా ప్రయోగ పూర్వకముగ ప్రప్రథమమున పరీక్షింపబడెను. తత్ఫలితములను గూర్చిన వార్తలను గమనించి, రక్తపాతము లేకుండ యుద్ధమును నివారించుటకు ప్రముఖ శత్రుప్రతినిధుల యెదుట జనవిహీన ప్రదేశమున ప్రయోగ ప్రదర్శనము చేసి దీనిశ క్తిని రూఢిపరచిన చాలునని అతడు ప్రకటించెను. ఇట్లు ఐన్లైన్ చెప్పియున్నప్పటికిని 1945 ఆగస్టు 6 వ తారీఖున హీరోషిమా పట్టణముమీద బాంబు ప్రయోగింపబడెను.
ఐన్ స్టెన్ ఇప్పుడు దుస్సహమగు మనోవ్యధకు గురి యయ్యెను. అతడు పశ్చాత్తప్తు డయ్యెను. అతడు తన విచారమును ప్రకటించుచు నిట్లు వ్రాసెను. "ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏ స్థితిలో నుండెనో అట్టి స్థితిలోనే భౌతిక శాస్త్రజ్ఞులు ఇప్పుడున్నారు. తనకు పూర్వము తెలియబడిన దానికంటె అధికతరశక్తి వంతమైన ప్రేలుడు పదార్థమును ఆల్ఫ్రెడ్ నోబెల్ కనిపెట్టి ఆ దోషపరిహారముకొరకును, తన ఆత్మశాంతికొరకును, శాంతి బహుమానమును స్థాపించినవాడయ్యెను. ఇప్పుడీ భయంకరాయుధ నిర్మాణ కారకులగు భౌతిక శాస్త్రజ్ఞులు, తాము దోషకారులమను భావముతో కాకపోయినను, ఆ శాంతికామునివలెనే తమ బాధ్యతను గుర్తించి ఆందోళనపడుచున్నారు. మరియు జర్మనులు ఆటంబాంబు నిర్మాణమున విజయులు కాలేరని నాకు తెలిసి యుండినచో ఈ ప్రమేయమున నేను వ్రేలు కూడ ఎత్తకుండెడివాడను" అని ఆతని ఆంతరంగిక మిత్రులతో చెప్పుచుండెడి వాడు. జీవిత శేషమున ఇట్టి చింతయే అతనిని దహించి వేయుచుండెను. ఇట్టి ఉపద్రవమునకు పరిహారము భౌతికశాస్త్ర పరిశోధనము లందుగాక మానవ హృదయములందే లభించునని ఆతడు తుదకు కనుగొనెను. "భౌతికశాస్త్రముగాదు, నైతికశాస్త్రమే తగిన పరిహారము చూపగలదు" అని అతడనుచుండెను. మరియు అతడు మానవజాతి శేషించి యుండవలయునన్నచో యుద్ధములు మాని వేయవలసినదిగా ప్రపంచములో సకలజాతుల వారికి విజప్తిచేయుచు, తన సంతకముతో ఒక విజ్ఞప్తిని ప్రకటిం చెను. ఇదియే అతని కడపటి రాజకీయ ప్రకటనము.
ఐన్ స్టైన్ కు మరణానంతర జీవితమునుగూర్చి ఎట్టి విశ్వాసమును లేదు. అయినను, అణుశక్తి వినియోగమును గూర్చి నేటి ప్రపంచధోరణినిబట్టి, అనగా శాంతి ప్రయోజనమును సాధించుటకొరకు అణుశక్తి యొక్క వినియోగమును గూర్చి విచారణ చేయుటకొరకు సమావేశమయిన జెనీవా మహాసభ వలన ఐన్లైన్ ఆత్మకు శాంత్యుపశమనములు చేకూరగలవని విశ్వసింతము.
తన మరణానంతరము తన మెదడును ఛేదించి పరిశీలించుటకు ఆల్బర్టు ఐన్ స్టైన్ అమెరికన్ ప్రభుత్వము వారికి అధికారమిచ్చెను. ఐన్ స్టైన్ లోకోత్తర మేధావియై యుండుటకు కారణభూతము అయిన ఆతని మేధస్సు నందలి విశేషములను పరిశోధించుటకు ముగ్గురు "మ స్తిష్ఠ విద్యావేత్తలు" ఇప్పుడు కృషి నల్పుచున్నారు. ఐన్ స్టైన్ పదార్థ విజ్ఞానశాస్త్ర, గణితశాస్త్రములందేగాక, ఖగోళ శాస్త్రమందును, తాత్త్విక విషయములందును, లలిత కళలయందును గొప్ప ప్రావీణ్యముకలవాడయియుండెను. లలితకళలలో ముఖ్యముగ సంగీతశాస్త్రమునందు అతనికి ఇష్టము మెండు. అతడు ఫిడేలు, పియానో జంత్రములను వాయించగలిగియుండెను.
సాధువు, అలౌకికుడు, అమాయికుడు, గంభీర ఆధ్యాత్మిక చింతాయుతుడు, భౌతికశాస్త్రపారగుడు, మహనీయుడు, శాస్త్రజ్ఞులలో ఘనుడు అయిన ఆల్బర్టు ఐన్ స్టెన్ 1955 ఏప్రిల్ నెల 18 వ తారీఖున పిత్తాశయము యొక్క వాపువలన దివంగతుడయ్యెను.
ఏ. యం. జ.