సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఏషియా క్రీడలు
ఏషియా క్రీడలు (Asian games) :
నేడు ప్రాచ్య దేశీయులు ప్రజ్ఞాపాటవముగ పలుకుటకును, సగర్వముగా పాల్గొనుటకును వాసికెక్కిన మహా క్రీడావతంసములు ఏషియాఖండ క్రీడ లనునవి. ఈ క్రీడలు ప్రప్రథమముగా హిందూ దేశమున ఢిల్లీనగరములో 1951 వ సం. నవంబరు 4 వ తేదీనుండి జరిగినను వీటి ఆరంభము పెక్కు సంవత్సరములకు పూర్వమే జరిగినది. 1913 వ సంవత్సరముననే "దూరప్రాచ్య దేశీయ వ్యాయామ సంఘపు పందెపు క్రీడలు" (Far East Athletics Association Championships) అను పేరుతో నొక క్రీడాసంఘము స్థాపితమయ్యెను. నేటి క్రీడా సంరంభములు మూడు సంవత్సరములకు ఒకసారి జరగునవై యున్నవి. కాని అవి ఆకాలమునందు రెండు సంవత్సరములకు ఒకసారి జరుగునవై యుండెను. ఈ క్రీడలను స్థాపించిన గౌరవము న్యాయముగా ఫిలిప్పైన్ దేశమునకే దక్కవలసియున్నది. ఆదేశము మొట్టమొదట 1913 వ సంవత్సరమున మనిలా (Manila) పట్టణమునందు ఈ క్రీడా ప్రదర్శనములను ఏర్పాటు కానించెను. ఈ మొదటి ఏపియా క్రీడలందు ఫిలిప్పైన్, చైనా, జపాను- ఈమూడు దేశములే పాల్గొనెను.
రెండవ పందెపు క్రీడా ప్రదర్శనములు 1915 వ సంవత్సరము మే నెలలో షాన్ మెయ్ (Shanghai) పట్టణము వద్ద జరిగెను. మలయా, సయము దేశములు ఎఫ్. ఈ. ఏ. ఏ. సంఘముందు చేరెను, కానీ సింగపూరు (Singapore) లోను, బాన్ కాక్ : Bangkok) లోను ఆకాలము నందే ఘటిలిన సంకటములు కారణముగా 1915 లొ జరిగిన ఆటలలో అవి పాల్గొనజాలవయ్యెను. ఎఫ్. ఈ. ఏ. ఏ. సంఘమునందు సభ్యత్వముగల మొదటి మూడు దేశములే అందు పాల్గొనెను.
మూడవసారి ఈ క్రీడలు 1917 లో జపాను దేశము నందలి టోకియోలోను, నాలుగవసారి క్రీడలు 1919 లో మరల 'మనిలా' పట్టణములోను జరుపబడెను. మొదటి వరుసలో జరిగిన ఏషియా క్రీడా పరంపర ఇంతటితో ముగిసెను దీని పిదప ఈ ఏషియా క్రీడా విశేషములను గూర్చి లోకము విన్నది ఏమియు లేదు. 1948 వ సంవ త్సరమున ఇండను నగరమునందు 14వ ఒలింపియాడ్ (Olympiad) క్రీడల సమారంభమువరకును ఈ ఏషియా క్రీడల పునరుద్ధారణ ప్రసంగమే తలంపబడలేదు. ప్రపంచ సంగ్రామము ముగియుటకును, 14 వ ఒలింపియాడ్ క్రీడలు జరుగు సమయమునకును మధ్యగల కాలములో ఫిలిప్పైను దీవి వాసులు మరల ఏషియా వ్యాయాము పందెపు క్రీడలను నవ్యఫణితిని శక్తి మంతముగా జరుపుటకు `పథకము వేసిరి. సరిగా అదే సమయమున అంతర్జాతీయ ఒలింపిక్సు (olympics) సంఘమునకు ఫిలిప్పైన్ ప్రతినిధి యగు గౌ. జార్జి బి. వార్గిన్ అనుపకుడును, అదే సంఘము యొక్క హిందూదేశపు ప్రతినిధియైన గౌ. జె. డి. పొండిన్ (Sondin) అను నతడును ఏషియా క్రీడల పునరుద్ధరణ విషయములను గూర్చి ఆలోచింప దొడగుట జరిగెను. ఈ ఉభయులు అగ్రగాము అయి లండనులో మౌంటు రాయల్ హోటలు వద్ద 1948 వ సంవత్సరము ఆగస్టు 8-వ తేదీనాడు ఇతర ఏషియా ప్రతినిధుల సమావేశమును ఏర్పాటు చేసిరి. ఆ సభయందు లండను ఒలింపిక్ క్రీడల సందర్భమున విచ్చేసిన ఏషియా ప్రతినిధు లందరుసు పాల్గొనిరి. ఏషియా పందెపు క్రీడలు నాలుగు సంవత్సర ములకొకసారి జరుపబడవలెననియు, 1949 సం. ఫిబ్రవరిలో ఢిల్లీ నగరమునందొక ఆలోచనా సమావేశము జరుగవలెననియు ఆ సభవారు తీర్మానము చేసిరి.
క్రీడాభిమానులు యాహ్వానసభ 1949 వ సంవత్సరము ఫిబ్రవరిలో అంతరములును, బాహిరములు నగు అనేక కారణములచే జరుగలేదు. ఆ యాహ్వానము ఉపసంహరింపబడెను. 1948 ఆగష్టు నెలలో లండనులో తయారు చేయబడిన ఏషియాక్రీడల ఫెడరేషను యొక్క నియమావళి(Constitution) 1949 సం.. ఫిబ్రవరి 12, 13 తేదీలలో క్రొత్త ఢిల్లీలో ఏషియా ప్రతినిధుల సమావేశమునందు చర్చించబడి అంతిమ నిర్ణయము గావింపబడెను. అంతర్జాతీయ ఒలింపికు సంఘము యొక్క సన్నిహిత సహకారముతో ఏషియా క్రీడలను ఏర్పాటుచేయుటకు అందరు ప్రతినిధులును ఏకగ్రీవముగా అంగీకరించిరి. నూతనసమితి (Committee) ఐరోపా, దక్షిణ అమెరికా క్రీడలకు సంబంధించిన ఫెడరేషను (European and South American Games Federation) విధానము ననుసరించి నిర్మాణము గావింపబడెను. తమ అంగీకారసూచకముగా ఈ క్రిందివారు నిబంధనల గ్రంథములో ( Constitution) సంతకములను చేసిరి.
| 1. సర్దారు గులాం మహమ్మదు | ఆఫ్గనిస్థానము |
| 2. యు. మాన్ గ్ ల్విన్(U. Maung Lwin) | బర్మా |
| 3. పాటియాలా మహారాజుగారును,మొయినుల్ హబ్ | హిందూస్థానము |
| 4. నూర్ ఆలం | పాకిస్థానము |
| 5. వి. రెగురో, ఆర్. కనన్ | ఫిలిప్పైన్స |
పిదప పాకిస్థాన్ తన సభ్యత్వమును వదలుకొనెను. సయాము, ఇండో నేషియా, సిలోను, నేపాలు దేశములు ఫెడరేషనులో చేరి నిబంధనల పత్రముపై సంతకములు చేసెను.
ఏషియా ఖండపు పం దెపుక్రీడలు వ్యవస్థా నియమావళి ననుసరించి నాలుగు సంవత్సరముల కొకసారి జరుపబడవలసియుండును. క్రీడా ప్రదర్శనములకొరకు ఏర్పాట్లన్నిటిని మొట్టమొదట కావించియున్న ఫిలిప్పైను దేశమేప్రప్రథమ ఆతిథేయ (Host) గౌరవము పొందునట్లు ఎన్నుకొనబడెను. అయితే, పిదప హిందూస్థానము ఆ మొదటి ఏషియా క్రీడా ప్రదర్శనపు టేర్పాట్లు గావించుటకు కోరబడెను. ఆ క్రీడా ప్రదర్శనములు క్రొత్తఢిల్లీలొ 1951 లో జరుపబడెను.
ఈ విధముగా 1951 మార్చి నెల 4 నుండి 11 వ తేది వరకు ఏషియా ద్వితీయఘట్టపు పందెపు క్రీడలు మొదట జరుపునట్టి అధికార గౌరవము హిందూస్థానమునకు లభించెను. పందెపు క్రీడల వ్యవస్థానిర్మాణ నిర్వహణాదుల కొరకు ఒక కమిటీ నియమిత మయ్యెను. ఆ కమిటీకి పాటియాల మహారాజుగారు అధ్యక్షులుగా నుండిరి. ఎ. ఎస్. డెమెల్లో అనువారు డైరెక్టరు పదవి వహించి పోటీ పందెముల కార్యజాతమును నడిపించిరి.
భారత రిపబ్లికునకు రాష్ట్రపతియగు డాక్టరు రాజేంద్ర ప్రసాదుగారు 1951 మార్చి 4 వ తేది సాయంకాలము 4 గంటల ప్రాంతమున పందెపు క్రీడలకు ప్రారంభోత్సవము జరిపిరి. ఏషియాఖండములోని బర్మా,సిలోను, థాయ్లాండ్, సింగపూరు, ఫిలిప్పైన్సు, ఇరాను, ఆఫ్గనిస్థాన్, ఇండో నేషియా, జపాను, హిందుస్థానము అను పదిదేశముల ప్రతినిధులైన 600 మంది వ్యాయామనిపుణుల (Athletes) వందనములను భారతాధ్యక్షులు స్వీకరించిరి. ఈ క్రింది క్రీడాంశములలో పోటీలు జరిగెను. ఆ క్రీడల ఫలితములు వానికి ప్రక్కగా చూపబడినవి
| క్రీడ పేరు | గెలిచిన దేశము |
|---|---|
| 1. ట్రక్కు & ఫీల్డు | హిందూస్థానము |
| 2. సైక్లింగు | జపాను |
| 3. జూస్ కెట్ బాలు | ఫిలిప్పైన్స్గ |
| 4. కాలిబంతి | హిందూస్థానము |
| 5. బరువు నెత్తుట | ఇరాను |
| 6. ఈత | హిందూస్థానము |
రెండవసారి ఏషియా క్రీడలు 1954 వ సంవత్సరము మే 1 నుండి 8 వ తేదీవరకు మనిలా పట్టణములో (ఫిలిప్పైన్స్) జరుపబడెను. ఈ క్రీడలలో ఆఫ్ఘనిస్థానము, బర్మా, కంబోడియా, సిలోను, నేషనలిస్టుచైనా, హాంగ్ కాంగ్, హిందూస్థానము, ఇండో నేషియా, ఇస్రాయిల్, జపాను, దక్షిణ కొరియా, మలయా, ఉత్తర బోర్నియో, పాకి స్థానము, ఫిలిప్పైన్సు, సింగపూరు, థాయ్ లాండు, వియత్ నామ్ అను దేశములు పాల్గొనేను.
పోటీ కావించిన 1000 మంది వ్యాయామ నిపుణులు ఖదం త్రొక్కుచు ఎదుటినుండి నడువగా వారి సలామీని అధ్యక్షుడగు రామోలోమా గ్చే (Romolo Magsay) అనునతడు స్వీకరించి క్రీడోత్సవ సమారంభ స్వస్తివాచకములు పలికెను. క్రీడా ఫలితములు క్రింద పొందుపరుపబడినవి.
| క్రీడ పేరు | జయము పొందిన దేశము |
|---|---|
| 1. ట్రక్కు & ఫీల్డు | జపాను |
| 2. కుస్తి | జపాను |
| ౩. గురిచూచి తుపాకితో కాల్చుట | ఫిలిప్పైను |
| 4. బాస్కెట్ బాలు | ఫిలిప్పైను |
| 5. జూక్సింగు (ముష్టియుద్ధము | ఫిలిప్పైను |
| 6. బరువు నెత్తుట | దక్షిణ కొరియా |
| 7. ఈత | జపాను |
| 8. కాలిబంతి (Foot ball) | చైనా |
| 9. వాటర్ పోలో (నీటిలో బంతియాట) | సింగపూరు |
బి. అ. రా.