Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఏకనాథ్ జీ

వికీసోర్స్ నుండి

ఏక్ నాథజీ :

మహారాష్ట్రసీమలో నామనంకీర్తనము 16 వ శతాబ్దము నుండియే ఎక్కువ ప్రచారములోనికి వచ్చినది. ఈ సంప్ర చాయకులను “వర్కరాలు" అందురు. వీరు ఆషాఢశుద్ధ ఏకాదశి, కార్తీకశుద్ధ ఏకాదశి పుణ్యతిథులలో పండరీపుర యాత్రకుపోవు ఆచారమున్నది. వీరు చంద్రభాగానదిలో స్నానముచేసి పాండురంగ విఠలుని యాలయమునకు పోయి స్వామిని సేవించెదరు. అక్కడ వాతావరణమంతయు "రామకృష్ణ హరే, విఠల్" అను నామసంకీర్తనలతో మార్మోగుచుండును.

17 వ శతాబ్దములో మహమ్మదీయుల దాడి నెదుర్కొనుటకు శస్త్రాలను ధరించి ఈ వర్కరాలందరు 'ధార్యరీలు'గా మారిపోయినారు. వీరు భాగవతధర్మము ననుష్ఠించి, భాగవత, భగవద్గీతాది వేదాంత గ్రంథములను పఠించెదరు. వీరు నిష్కామ భక్తి యోగులు. ఈ సంప్రదాయకులలో ముఖ్యులు ధ్యానేశ్వరుడు, ఏకవాథుడు, సమర్ధరామదాసు, తుకారాము అను మహనీయులు, వారి రచనలను మహారాష్ట్రులు వేదముగా భావించెదరు.

క్రీ. శ. 1528 లో, భక్త శ్రేష్ఠ ఏకనాథుడు పైఠాన్ వేలీ ప్రతిష్ఠాన నగరములో మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబములో రుక్మిణీ సూర్యనారాయణ దేవుల పుత్రుడుగా జన్మించెను. తలిదండ్రులను బాల్యములోనే గోల్పోయెను. అందుచేత అతడు తన తాతయైన చక్రపాణిచేతులలో 'పెరిగి, పోషింపబడినాడు. ఇతని ముత్తాత భానుదాసు గొప్ప భక్తుడగుటచే శ్రీకృష్ణ దేవరాయల మహలులో నుండి శ్రీ పాండురంగని విగ్రహమును తీసికొనివచ్చి పండరిపురములో ప్రతిష్ఠించినాడు. బాల్యదశలోనే ఏకనాథుడు గొప్ప బుద్ధిమంతుడుగాను, శ్రద్ధాశువుగాను ఉండుట చేత భజనగోష్ఠిలో కాలమును గడపి ఆనందించువాడు. ఇతనికి అరవయేటనే ఉపనయన సంస్కారము జరిగెను. నాటి నుండి రామాయణ, మహాభారతాది గ్రంథములను శ్రద్ధతో వినుచుండెడివాడు.

క్రీ.శ. 1540 అనగా పండెండవ యేటనే యితనికి భక్తి అంకురించుటచేత, భగవద్దర్శనలాలసుడై, సద్గురువును అన్వేషించుచుండెను. ఈకారణముచేత రాత్రి నాలుగవ జామున శివాలయమునకుపోయి, అక్కడ హరిగుణ కీర్తనము చేసెడువాడు. ఒకనాడు ఆకాశవాణి ఇతనికి 'దేవగడ్' అను పట్టణమున కేగి అక్కడ జనార్ధన వంతు యొక్క దర్శనము చేసికొనవలసినదని ప్రబోధముచేసెను. అతడు వెంటనే బయలుదేరి దేవగడునకుపోయి అక్కడ జనార్దన పంతు దర్శనముచేసి అతని ఆశీర్వాదము పొందెను. పిమ్మట అవిరళ పరిశ్రమలచే ఆరు సంవత్సరాలు గురుసేవచేసి, కృతార్థుడై దత్తాత్రేయ సాక్షాత్కారము పొందీ ధన్యుడయ్యెను. కొన్నాళ్ళకు గురువితనికి శ్రీకృష్ణ మంత్రము నుపదేశించి శూలభంజన పర్వతముపై తపస్సు చేయమని యాజ్ఞాపించెను. కొంత కాలమిట్లు ఘోరతపస్సు నొనరించిన పిదప ఏకనాథుడు గురువులతో సంతనమున భాగవత ధర్మప్రచారార్థము నాసికా త్రియంబకమునకు పోయెను, ఆ రోజులలో చతుశ్లోకీ భాగవతమును ఛందోరూపముగా రచించెను. పంచవటి తీరములో శ్రీరామచంద్రమూర్తి వారి దేవాలయములో గురుదేవులకు అభంగములన్నియు వినిపించినాడు. పిమ్మట తన జన్మస్థాన మునకు పోయి అక్కడనున్న పిప్పలేశ్వర ఆలయములో విడిది దిగగా నతని పితామహుడగు చక్రపాణి గృహస్థా శ్రమ స్వీకారము చేయుమని అతనికి బోధించెను. ఏకనాథుడు అందులకు సమ్మతించి, గిరిజాబాయిని పెండ్లాడేను. ఇతడు గృహస్థాశ్రమ స్వీకారము చేసినదాదిగా నిత్య కర్మానుష్ఠానము, అతిథిసేవ,నామసంకీర్తనము చేయుచు పరమార్థ పరాయణుడయ్యెను. ఇతని నిరంతర భక్తినిగూర్చి విని ఎరుంగుటచే దూరదేశములనుండి అతిథులు అతని ఇంటికి వచ్చెడివారు. క్షమ, శాంతి, సమత. భూతదయ, నిరహంకారత, నిస్సంగత్వము, భక్తి పరాయణత మొదలగు గుణములకు నీదానుడు. ఇతడు వారిని గానజ్ఞాన దానాదులచే సంతృప్తి పరచు చుండెడివాడు.

ఒకనాడు ఇతడు పితృశ్రాద్ధము నిమిత్తము వంట చేయుచుండగ ఆ దారిని పోవుచున్న హరిజనులు కమ్మని వాసనలు ఆఘ్రాణించి, ఆ వంటకాలను తిన నిష్టమును సూచింపగా, వెంటనే ఏకనాథుడు వారిని భోజనముచే తృప్తిగావించెను, ఇంకొకతరి ఇతడు రామేశ్వరయాత్రకు గంగాజలమును తీసికొనిపోవుచుండగా మార్గమధ్యమున దప్పికచే ప్రాణముల గోల్పోపనున్న గాడిదకు తీర్ధొదకము కొంతపోసి దానిని రక్షించెను. శ్రీకృష్ణపరమాత్తు డీతనిని శ్రీఖండే అను సేవకుని రూపమున సుపచరించెను. ఇట్లేవ్నేని దృష్టాంతములు గలవు. ఇట్లితడు గృహస్థాశ్రమ ధర్మమును నిర్వర్తించుకొనుచు తన్నాశ్రయించిన వారికి తోడ్పడెను.

రచనలు : భాగవతమునందలి ఏకాదశస్కంధమును 20 వేల పద్యములలో రచించెను. రుక్మిణీ స్వయంవరము, భావార్థ రామాయణము, చిరంజీవిపదము, స్వాత్మబోధ, ఆనందలహరి మున్నగు గ్రంథము లను తాను మహారాష్ట్ర భాషలో రచించెను. ఇతడు ద్రవిడదేశములోని తామ్రపర్ణి, కృతమాల, పయస్విని, కావేరి మున్నగు నదీతీరములలో నివసించువారు గొప్ప భగవద్భక్తులు కాగలరని తనభాగవతములో లిఖించినాడు. ఇతనికి హరిపండితుడను ఒక పుత్రుడు, గోదావరి యను నొక కూతురు కలరు.

ఇతడు 1599 సం. విళంబినామ సంవత్సర చైత్ర బహుళ షష్ఠి తిథినాడు గోదావరిలో స్నాతుడై వచ్చి సమాధిస్థు డయ్యెను. ప్రతి సంవత్సరము భక్తు లితని వర్ధంతిని ఏకనాథషష్ఠి అను నామము భక్తి పురస్వరముగా ఆచరించుచుందురు.

యం.రా.శా