సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎస్కిమోలు
ఎస్కిమోలు :
ఎస్కిమోలు ఉత్తర అమెరికా ఆర్కిటిక్ ప్రాంతము నంతయు అనగా 'అలాస్కా' నుండి 'గ్రీన్ లాండ్' వరకే కాక ఆవల 'ఎల్యూషియన్' (Aleutian) ద్వీపముల లోనికి, ఆసియాలో మిక్కిలి ఈశాన్యమునకు ఉన్న కొల్యు చిన్ అఖాతము (Kolyuchin Bay) వరకును వ్యాపించి యున్నారు.
వారు పొట్టివారు. వారి ముఖములు వెడల్పుగను, సోగగను ఉండును. దవడ ఎముకలు స్ఫుటముగా కనిపించు చుండును. ముక్కు తిన్ననై, సన్నగాను, పొడవుగాను ఉండును. లేతపసుపుతోకూడిన గోధుమవన్నె శరీరచ్ఛాయ గల మంగోలియనులకు విశిష్టలక్షణములయిన ఏటవాలు కన్నులు వీరికుండును. ఎపి కాంతికు (Epicanthic) ముడుతలుండును, వారి శిరోజములు ఒత్తుగాను, బిరుసుగాను,. నల్లగాను, ఒక్కోక్కప్పుడు నొక్కులతోను ఉండును.
ఇగ్లూ (Igloo) అని పిలువబడు గోపురాకారముగల మంచుఇండ్లలో ఎస్కిమోలు నివసింతురు. వెచ్చదనము కలుగుటకు ఒక్క దీపముమాత్రమే ఉపయోగింపబడినను, ఎస్కిమోల ఇండ్లు మిక్కిలి వెచ్చగా నుండును. అందుచేత గృహములోపల నున్నప్పుడు ఎస్కిమోలు నడుమువరకు నుండు చొక్కాలవంటి దుస్తులను వేసికొనరు.
ఈ జాతికూడా ఆహార సంపాదనార్థము ఒకప్పుడు సంచార మొనర్చుట కలదు. కొన్నిసందర్భములలో తప్ప, వారి ఆహారమంతయు వేటవలననే లభించుచున్నది. కణితి వంటి ఒక జంతువు (Reindeer) మాంసము ఎస్కిమోలకు మిక్కిలి ఇష్టమైనది. రైండీరు మాంసమును అధికముగా సంపాదించుటకు శరదృతువులో (Autumn) వేటవలన మంచి అవకాశములు లభించుచున్నవి. ఎస్కిమోలు ఈ కాలమున ఈ మాంసమును విరివిగా సంపాదించి, ఎండబెట్టి చలికాలమున వాడుకొనుటకొరకు నిలవచేసికొందురు. వేసవికాలములో ఎస్కిమోలు రువ్వెడు ఈటే, కత్తి, బల్లెము మొదలైన వాటితో సీలు, వేలు అను జంతువులను వేటాడుదురు. సముద్రతీరమునకు దూరమైన లోపలి ప్రదేశములలో గాలములు, వలలు, ముండ్లుగల ఈటెలు మొదలగు వాటితో నీటిలో చేపలు కూడా పట్టుదురు.
'వాల్ రస్' అను సముద్రజంతువు వారికి ముఖ్యమైన ఆహారము. దానిని సంవత్సరము పొడుగున అన్ని కాలములలో వేటాడుదురు. సముద్రముపై మంచు ఘనీభవించిన పిదప పగలు చీకటిపడువరకు, పిదప అవసరమైనచో వెన్నెలలో కూడ 'స్లెడ్జీలు' అను కుక్కలచే లాగబడు బండ్ల నెక్కి వేటాడుదురు.
ఎస్కిమోల వేట పద్ధతులు చాల ముచ్చటగానుండును. 'సీలు' అను సముద్ర జంతువులను పట్టుకొనుటకు రెండు ప్రత్యేక పద్ధతులు కలవు. మంచు నున్నగానుండి అడుగు వేసినను పగులకుండా ఉండు పరిస్థితులలో వేటగాండ్రు చప్పుడుకానటువంటి ఎలుగుబంట్ల చర్మముతో చేసిన చెప్పులు తొడుగుకొని మంచుపై ఒకచోట విడివిడిగా కూర్చొని సీలు చేపలు ఊపిరి పీల్చుకొనుటకు వచ్చునటు వంటి కన్నములదగ్గర వాటి అలికిడిని వినుచు, పొంచి యుందురు. ఒక జంతువు పైకిరాగానే దానిసమీపములో నున్న వేటగాడు నిశ్శబ్దముగా దాని దగ్గరకు పరుగెత్తి, అది తలవంచినపుడు వంట్రకోలను (Harpoons) తగిలించును. రెండవపర్యాయము ఆ జంతువు ఊపిరి పీల్చుకొనుటకు వచ్చినప్పుడు, తన బల్లెముతో దానిని చంపివేయును. మంచుగడ్డ పెరుసుగానున్నను, లేక మంచుచే కప్పబడి యున్నను విసుగుకలిగించు మౌపాకు (maupok) పద్ధతిని గాని, నిరీక్షణ పద్ధతిని గాని అవలంబింతురు. ఒక మనుష్యుడు ఆశగల ఒక కన్నముదగ్గర చిన్నముక్కాలిపీట వేసికొని మిక్కిలి ఓపికతో గంటలతరబడి కదలిక మెదలిక లేకుండా 'సీలు' కనుపించువరకు కూర్చుండును.
'సెడ్నా' (Sedna) అను దేవతయే ఎస్కిమోలకు ముఖ్యమైన ఆరాధ్యదేవత. ఈ దేవత తన తండ్రితో సముద్రపు టడుగుభాగమున నివసించును. ఎస్కిమోలకు ముఖ్యాహారములైన 'వేల్' 'వాల్రస్' 'సీల్' అను సముద్రజంతువులు ఈ 'సెడ్నా' అను దేవత యొక్క ఆధీనములో నుండును. ఎస్కిమోల మతనాయకులు మత గురువులు, అంగకుట్ (Angakut) అని పిలువబడుదురు. వీరు గొప్పశక్తికలవారు. తుపానులు, ఆహార కల్పన,మొదలగు ముఖ్యవిషయములను గురించి, వీరు, 'సెడ్నా' దేవతతో సంప్రతింపులు చేయుదురు. 'inua' అని పిలువబడు అమానుష (Supernatural) జీవులచే వారికి మరికొన్ని ఇతర శక్తులు కూడా సంక్రమించి యున్నవి. ఈ విధముగా ఈ (Angakut) అనువారికి రోగులను, గాయపడిన వారిని బాగు చేయుట, కరవులను వారించుట మొదలగు అద్భుతకృత్యములను చేయగల్గుదురు. ఈ అమానుష జీవుల కొరకు కొన్ని పెద్ద మంచు ఇండ్లు సమర్పింపబడియున్నవి. ఈ ఇండ్లలో ఈ జీవులు నివసింతురనియు, మానవులకు అసాధారణ సహాయము నొసగుదురనియు భావింపబడుచున్నది. గానము, నృత్యము అనునవియే వారు భగవంతుని అరాధించు విధానములలో ముఖ్యములైనవి. పెద్ద పెద్ద మంచు ఇండ్లు నృత్యగానముల కొరకే ఉద్దేశింపబడియున్నవి. ఎస్కిమోలకు వేరు వేరు మత నిబంధనలున్నవి. 'సీలు' ను కోయునప్పుడు అందరును అన్ని విధములైన పనులను మానుకొనవలయును. కొన్ని ప్రత్యేక సమయములలో స్త్రీలకు ప్రత్యేక మైన నిబంధనలున్నవి. స్త్రీలు పచ్చిమాంసమును తినకూడదు; కొన్ని ప్రత్యేకమైన పాత్రలలోనే వండ వలయును; ఉత్సవములలో పాల్గొనకూడదు.
నైతిక ప్రవర్తనకు సంబంధించిన కొన్ని చట్టములు కూడా ఎస్కిమోలలో నున్నవి. ఒంటరిగా ప్రయాణము చేయు బాటసారులకు ఆతిధ్య మిచ్చుటలో భోజనము పెట్టుట, ఆశ్రయమిచ్చుటేకాక, కొన్ని సందర్భములలో వారికి సహచరులుగా స్త్రీలనుగూడా ఇచ్చుట జరుగుచుండును, ఈ స్త్రీల నిచ్చుట అను ఆచారము స్త్రీ పురుషుల - అనగా భార్యాభర్తల మాత్రమే జరుగును. అట్టి ఆతిథ్య మీయబడినప్పుడు దానిని తిరస్కరించిన యెడల, అట్టి తిరస్కరణము, ఆ స్త్రీని, ఆతిధేయుని కూడా అవమానపరచుటగా భావింపబడును. గృహము నకు పురుషుడే పెద్ద, అతని అనుజ్ఞ లేక స్త్రీ వ్యభిచరించినచో కఠినమైన శిక్షకు పాత్రురాలగును. ఇట్టి స్త్రీ పురుషుల ప్రవర్తనమును గురించిన నిబంధనలు వారిలో నున్నవి. వృద్ధులై వేటాడుశక్తిలేక నిరుపయోగులైన 'ఎస్కిమోలు' ఏకాంతముగా ఎచ్చటికో వెడలిపోయి మరణించుట తరుచు జరుగుచుండును. ఎస్కిమోల సాంఘిక వ్యవస్థ కుటుంబముపైనను, గ్రామప్రజలమీదను ఆధారపడియుండును. కుటుంబములోని పురుషులు ఆహారమును సంపాదించుట, ఇండ్లు కట్టుట, అను పనులను నిర్వహింతురు. స్త్రీలు ఆహారమును సిద్ధమొనర్చుట, చుస్తులను కుట్టుట, అను పనులను నెరవేర్తురు. వేరు వేరు కుటుంబములలోని పురుషులందరును కలిసి వేటకాండ్ర గుంపుగా ఏర్పడుదురు. ఆదేశములో ప్రత్యేకమైన ప్రభుత్వవిధాన మేదియులేదు. 'Angakut' అను వారికిని, శ్రేష్ఠులైన వేటగాండ్రకును సర్వశక్తులును ఈయబడి యున్నవి. నాయకత్వము వంశానుగత మైనదికాదు. సమర్థులైనవారికే నాయకత్వము లభించును.
రా. ప్ర.