Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎల్లోరా గుహాలయములు

వికీసోర్స్ నుండి

ఎల్లోరా గుహాలయములు :

1956 లో రాష్ట్రముల పునర్నిర్మాణ మూలకముగా హైదరాబాదు రాష్ట్రమునుండి బొంబాయి రాష్ట్రమునకు మార్చబడిన ఔరంగాబాదు నగరమునకు 17 మైళ్ల దూరమున వాయవ్య దిశయందు ఎల్లోరా గుహామందిరములు కలవు. ఇవి ఉన్నతమైన సహ్యాద్రి పర్వత సానువులందు తొలచబడినవి. ఇచ్చట 2-3 జలపాతములు గలవు.

ఎల్లోరాగుహామందిరములన్నియు అర్ధచంద్రాకారము గల కొండభాగమున గలవు. ముప్పదియైదు గుహలు ఒక మైలుదూరము వరకు వ్యాపించియుండును. ఇందు బౌద్ధమతమునకు సంబంధించినవి పండ్రెండు ; హిందూ మరమునకు సంబంధించినవి పందొమ్మిది; జైనమతమునకు సంబంధించినవి నాలుగు. ఇవియన్నియు ఈ క్రమముననే యున్నవి. ఈవిధముగా బౌద్ధ, హిందూ, జైన శిల్పసృష్టి త్రివేణీసంగమమువలె ఎల్లోరా గుహలలో వెల్లివిరిసినది. ఇచ్చటి శిల్ప విన్నాణముల ప్రఖ్యాతి దేశ దేశాంతరములకు ప్రాకినది. ఖండఖండాంతరముల నుండి కూడ యాత్రికులు, కళాభిమానులు ఈ దివ్య కళాక్షేత్రమును సందర్శించి పోవుచుందురు.

బౌద్ధగుహాలయములు : ఎల్లోరా గుహలయందు బౌద్ధమతమునకు చెందిన గుహలు పండ్రెండు కలవు. ఈ బుద్ధ దేవాలయములు క్రీ. శ. 350-700 సంవత్సరముల నడుమ నిర్మింపబడెను. ఇవన్నియు ఏకాండ శిలారూపమున నున్న కొండను తొలిచి రూపొందింపబడిన గుహాదేవాలయములే. ఇవి మహాయాన శాఖకు సంబంధించినవి.

వీటిలో, 52 చతురపు అడుగుల వైశాల్యముతో 8 గదులు కలిగిన విహారము మొట్టమొదటిది. ఈ విహారము గంభీరమై, నిరాడంబరమయిన శిల్ప విన్యాసాలం కృతమయిన దగుటచేతను, దీని యొక్క చావడి మధ్య యందు స్తంభములు లేకుండుటచేతను, చావడిచుట్టును కూర్చుండుటకు శిలా వేదికను అమర్చుటచేతను ఇది బహుళ 8 అత్యంత ప్రాచీనమయినది కావచ్చును. రెండవ గుహ శిల్పనిన్యాస సంభరితమయి యున్నది. ముఖ్యముగా ఇందలి బుద్ధుని యొక్కయు, బోధిసత్త్వుల యొక్కయు, తారల యొక్కయు వివిధ భంగిమములు ఆకర్ష వంతములుగ నున్నందున, ఇది ప్రఖ్యాతినందినది. ఇది చైత్యమయి యుండవచ్చును. ఇరువైపుల పార్శ్వభాగమునందును ప్రదర్శన రంగముల(Galleries)వలె నిర్మింపబడిన స్థలము కాక, 48 చతురపు అడుగుల విస్తీర్ణముగలదిగా నున్నది. ఈమెట్లపై పద్మాసనము నధిష్ఠించి, ధర్మచక్ర ముద్రలో నున్న కొన్ని బుద్ధ విగ్రహములు కలవు. ఈ చైత్యము యొక్క పై కప్పు భారమును వహించుచు చతురస్రముగా బ్రహ్మాండమయిన 13 స్తంభములు గలవు. ఈ స్తంభాగ్రముల మీద సుందరమయిన దిండ్లవంటి కుదురులును, ఉన్నతము అయిన చతురాకారపు పీఠములును కలవు. ఇందలి గర్భగుడిలో బ్రహ్మాండమయిన ఆకారముతో బుద్ధుడు సింహాసనాసీనుడయి యుండును. ద్వారపాలుర యొక్కయు, బోధిసత్త్వుల యొక్కయు, విద్యా ధరుల యొక్కయు ప్రతిమలు కొల్లలుగ గలవు. పద్మ పాణియొక్క యో లేక అవలోకితేశ్వరుని యొక్కయో విగ్రహముగూడ అందు కలదు. ఈ విగ్రహము యొక్క దక్షిణ హస్తము జపమాలను, వామహసము పద్మమును ధరించినటుల కాననగును.

మూడవ, నాలుగవ గుహలు సాధారణమయిన విహారములు. అయిదవ విహారము, పార్శ్వభాగము లందుగల రెండు ఏకాంతస్థలములుకాక, 117 అడుగుల పొడవును 58 అడుగుల వెడల్పును కలిగి విశాలమైనదిగా నొప్పు చున్నది. ఈ విహారము యొక్క పైకప్పు 24 స్తంభాగ్రములపై ఆధారపడి యున్నది. ఈ స్తంభాగ్రములు పూర్ణ ఘటయుతములు. గుహపొడవునను, నేలపై 2-3 అడుగుల ఎత్తుగల "రెండు అరుగులు కలవు. దీనినిబట్టి బౌద్ధ సంఘమునకు అప్పుడప్పుడు అత్యావశ్యకమయిన మత సమావేశములకొరకు ఖితువు లి గుహను ఉపయోగించు కొనుచుండిరని తోచుచున్నది. ఈ గుహ . యందు ఇరు పార్శ్వభాగములలో భీక్షువులు నివసించుటకయి శ్రేణులుగా గదులు నిర్మింపబడినవి. వెనుకభాగమందు గల గర్భ గుడియందు యథారీతిగ ఒక బుద్ధవిగ్రహమున్నది.

కొంచె ము త్తరముగాపోయి మెట్లుదిగి చావడిలో ప్రవేశించినచో, ఆరవగుహను చేరుదుము.ఈ చావడి పొడవు 28½, వెడల్పు 26 అడుగులు. కాని దీని పశ్చిమభాగ మంతయు శిథిలమయినది. దీని కుత్తరదిశగా, దీనికంటె విశాలమైనదియు, ఉన్నతమయిన పైకప్పును గలిగినదియు నగు మరియొక గుహ కలదు. దీని పొడవు వెడల్నులు 26½ × 43 అడుగులు. దీనిని, దీనికుత్తరమునగల మరియొక చావడినివిడదీయుచు రెండు స్తంభములు గలవు. దీనిపొడవు వెడల్పులు 29 × 27 చ.అడుగులు. ఇవన్నియు శిల్పవిన్యాస రహితము లయిన నిరాడంబర శాలలు. కానీ 6 వ గుహ గర్భాలయపు ముందర అంతరాళములో కొంత శిల్పము కలదు. ద్వారపాలుర విగ్రహములు సొగసుగా నున్నవి. బుద్ధుని విగ్రహము కొంచెము పెద్దదిగా నున్నది. ప్రక్కల నున్న గోడలపై పూజలు సల్పుచున్న భక్తులతో బుద్ధ విగ్రహములు బారులుతీరి యున్నవి. ఆరవ గుహగుండ పోయినచో ఉన్నత ప్రదేశమున మలచబడిన పడవగుహ కాన్పించును. అది చాల నిరాడంబర మయినది. విశాల మైన దాని పైకప్పు చతురాకారములోనున్న నాలుగు స్తంభములమీద ఆధారపడియున్నది. భిక్షువుల ఉపయోగమునకై దానికి ఇరుప్రక్కల యందును గదులు నిర్మింపబడియున్నవి. దీని చావడి 61½ × 43½ చ.అడుగుల వైశాల్యము కలిగియున్నది. దీని కుత్తరముగ ఎనిమిదవ గుహ కలదు. ఇది 28 × 25 చ. అడుగుల వైశాల్యముగల ఒక చావడి. దీనికిగూడ ఇరుప్రక్కలయందు గదులు నిర్మింపబడి యున్నవి. మిగతవాటియందువలె గాక ఈ గుహాలయము నందు గర్భగుడి చుట్టును ప్రదక్షిణపథము గలదు. ప్రదక్షిణ పథమునకు దక్షిణపుచివరనగల ద్వారము నంటియున్న గోడ మీద మహాయాన బౌద్ధులకు, ముఖ్యముగ చైనావారికి -మిక్కిలి ప్రియమయిన 'మహామయూరి' యొక్క విగ్రహ మున్నది. 9వ గుహాలయము ఆకర్షణీయ మయిన ముఖతలమును కలిగియున్నది. అక్కడినుండి కొలదిదూరము విశ్వ కర్మాలయము వైపు ముందుకు సాగినచో, ఆ గుహాసమూహమునకు ఎడముగా • పొంచికుడు' ను (Pancika) అతని అర్ధాంగి హరితి ఓడిలో బిడ్డను పెట్టుకొనియున్నట్లును చిత్రింపబడియున్నది.

పదియవ గుహ "విశ్వకర్మ" నామముగలది. ఎల్లోరా యందు గల చైత్యము ఇదిఒక్కటే. ఈ నిర్మాణము విశ్వ కర్మకు అంకితము చేయబడినదనియు, దానియందు గల బుద్దుని మహావిగ్రహము విశ్వకర్మ విగ్రహమనియు ప్రజలు భ్రాంతి చెందుటచే, దీనికి విశ్వకర్మ నామ ధేయము కలిగినది. దీనియందు గల వాస్తు విశేషములను బట్టియు, ఇందున్న ఒక శాసనము యొక్క లిపిని బట్టియు, ఈ చైత్యము క్రీ.శ. 7వ శతాబ్ది నాటిదని నిర్ణయింపబడినది. దీని ప్రాంగణమున గల ఆవరణముచుట్టును ఒక నడవ ఉన్నది. ఈగుహాలయము యొక్క ముఖతలము మిగుల అలంకార భూయిష్ఠమై యెప్పారుచుండును. అందు కూర్చుండుటకు తావుగలదు. ఆ తావును చుట్టుకొని సోపానపరంపర గలదు. ఈ సోపాన పరంపర గుడి అంతర్భాగములోని మెట్లవరుసకు దారి తీయును. ఈ చైత్యము పొడవు 86 అ., వెడల్పు 43 అ. ఎత్తు 34 అడుగులు కలిగి అత్యంత మనోహరమై తనరారు చున్నది. మధ్యభాగమునగల చావడికిని, పార్శ్వముల యందున్న వసారాలకును నడుము ఎనిమిది కోణములతో 14 అడుగుల ఎత్తుగల స్తంభములు 28 గలవు. ఈ స్తంభాగ్రముల అంచులందు సాలభంజికలు గలవు. ధనురాకారముగ నున్న పైకప్పు భాగమున శిలాపర్యంకములు గలవు. వీటి నిర్మాణము దారుశిల్ప నిర్మాణము ననుకరించి మలచబడినది. స్తంభాగ్రములయందు చిత్ర విచిత్రములయిన పెక్కు విగ్రహములు చెక్కబడినవి. త్రితలము మీదను, మెట్ల వరుసలమీదను రూపొందింపబడిన శిల్పము మహాయాన యుగము యొక్క చివరిదశకు చెందిన దని నిరూపితమగు చున్నది. చావడి చివర నున్న దగోబా యొక్క ఎత్తు 27 అడుగులు; దాని వ్యాసము 15 అడుగులు స్తూపమునకు ముందుభాగమున 'ప్రలంబపాదాసన' రూపములో బ్రహ్మాండమయిన బుద్ధ విగ్రహము చెక్కబడినది. అజంతా (9, 10 వ) గుహలలో క్రీస్తుపూర్వము నిర్మింపబడిన చాలా కొద్ది శిల్పము గల సాధారణ స్తూపముల కంటె, శిల్ప విన్యాసమున ఈ విగ్రహము ఎంతయో అధికముగా పరిణతి చెందినదని చెప్పగలము. ఈ చైత్యమందు సుప్రసిద్ధమయిన మరియొక శిల్పలక్షణము గోచరించును. ఇంతకు పూర్వపు చెక్కడముల వలె కాక, ఈ చైత్యము యొక్క గవాక్షము, స్తంభములచే మూడు విభాగములుగ చేయబడినది. మధ్య ద్వారముపై అటకతో కూడిన గవాళ మొకటి తొలువబడినది. ఈ విధానమునుబట్టి లోనికి వెలుతురు ప్రసరించు టకు మూడు గవాక్షము లేర్పడెను. అద్భుతమయిన శిల్ప నైపుణ్యమును చాటు పెక్కు శిల్ప సందోహము లిందు కాననగును.

11, 12 వ సంఖ్యను సూచించు గుహలు, 'దోతల్' (ద్వితలము) 'తీన్తల్' (త్రితలము) అని వరుసగా పిలువబడుచున్నవి. ఈ రెండు గుహలును, భారతదేశములోని అన్ని గుహలకన్నను (అవి ఏమతమునకు చెందినవైనను సరే) అద్భుతావహముగ నున్నవి. ఈ రెండు మఠములును మూడంతస్తులుగల నిర్మాణములు. వీటి ముందరి భాగమున పెద్ద ఆవరణములున్నవి. ఈ ఆవరణములన్నియు బ్రహ్మాండమయిన కొండరాతి నుండి తోలువబడినవి.ఈ నిర్మాణములు మహోన్నతములును, సాంద్రఘనములును అగు పురోభాగములతో నొప్పారుచున్నవి. ఈ ముఖతలము నందలి స్తంభముల మీది చెక్కడపువని సంస్కారజన్యమైన వారి శిల్ప వైవిధ్యాభిరుచిని ప్రకాశితము చేయుచున్నది. ఈ స్తంభములను పెక్కు విధములయిన శిల్పసముదాయమును పూర్ణముగ నింపలేదు. కాని వాటిమీద పద్మమో, పూర్ణఘటమో మాత్రము చెక్క బడియున్నది. ఇవియైనను మతప్రతిష్ఠాపనమునకు కేవలము గౌరవప్రతిష్ఠపాదకములగు సామాన్య ఆకార రేఖలతో చెక్కబడినవి. ఈ రెండు విహారముల యొక్క అంతస్తుల అగ్రభాగముల పైనెక్కి, చుట్టుప్రక్కలనున్న లోయలను, మైదానములను తిలకించినచో నేత్రపర్వముగ నుండును. ఈ గుహలలో తపోధ్యాననిరతులగు బౌద్ధభిక్షువులు ఇచ్చటి నానా విధ శోభా సంపన్నమగు ప్రకృతి రామణీయకమువలన ఉత్తేజితులై యుండి యుందురు.

పైన పేర్కొన్న 'దోతల్' (ద్వితలము) అను 11వ గుహాలయము నందలి క్రింది అంతస్తులో 102 అడుగుల నిడివి, 9 అడుగుల వెడల్పుగల వసారా ఒకటి కలదు. ఇందు నివాసయోగ్యమగు రెండు గదులు కలవు. వీటి వెనుక భాగమున ఒక గుడికలదు. దీనిపైనను ఇట్టిదే మరి యొక వసారాగలదు. క్రిందిభాగముననున్న వసారానుండి పై వసారాకు చేరుటకు మెట్లున్నవి. ముందుభాగమున నున్న గోడకు అయిదు ద్వారములు కలవు. ఈ అయిదు ద్వారములగుండ వేర్వేరుగనున్న అయిదు గదులకు చేరుకొనవచ్చును. మొదటి ద్వారము చిన్న గదికిని, రెండవద్వారము గుడికిని త్రోవతీయును. మూడవ ద్వారము గుండ ప్రవేశించినచో, గవాక్ష ద్వారము గుండ వెలుతురు ప్రసరించు చావడి కానవచ్చును. నాల్గవద్వారము మరియొక ఆలయమునకును, చివరి ద్వారము మరియొక చిన్న గదికిని ప్రవేశమిచ్చును.

నాల్గవద్వారముపై అందమైన చెక్కడములతో నొప్పారు శిల్పచాతుర్యముకలదు. పైన చెప్పబడిన దేవాలయము అన్నింటి యందును బుద్ధుని యొక్కయు, బోధి సత్త్వుల యొక్కయు, ఇతర దేవతల యొక్కయు ప్రతిమలు కలవు. చివరి అంతస్తుమీద ఇట్టివే రెండు గుళ్లును, గదులును కలవు. కాని దక్షిణముపై పుగల అంతస్తు సంపూర్ణము గావింపబడలేదు. గోడలమీద అసంఖ్యాకముగ బుద్దుని యొక్కయు, బోధిసత్త్వుల యొక్కయు, విగ్రహములు హ్రస్వాకారములలో చెక్కబడి యున్నవి. త్రితలము (“ఆన్ తల్') అను గుహాలయము యొక్క క్రింది అంతస్తునందు చతురాకారపు స్తంథములు కలవు. మూడు శ్రేణులలో నున్న ఈ స్తంభములన్నియు పర్వత మహాశిల నుండి మలచబడినవి. నట్టనడుమనున్న స్తంభద్వయముపై ఆకర్షణీయమైన పుష్పాలంకరణములు గోచరము కాగలవు.

పృష్ఠ భాగముననున్న ఆలయమున సుమారు 11 అడుగుల ఎత్తుగల గొప్ప బుద్ధ విగ్రహము కలదు. ఆ విగ్రహమున కిరుప్రక్కలను కూర్చుండినట్టియు, నిలవబడినట్టియు విగ్రహములు పెక్కుగలవు. వీటిలో వజ్రపాణి, పద్మపాణి అనువారలు బుద్ధుని కిరుపార్శ్వములందు నిలుచుండి యున్నారు. పశ్చిమముగనున్న మెట్లవరుస నెక్కి పోయినచో మొదటి అంతస్తుపై గల దీర్ఘమయిన వసారాలో ప్రవేశింపవచ్చును. ఇచ్చటినుండి చతురాకారపు స్తంభముల మధ్యనున్న ద్వారము గుండ పోయినచో ప్రధాన శాలాంతరములోనికి ప్రవేశము కలుగును. వసారాకు ఇరుప్రక్కలయందు మరి రెండు ప్రవేశ ద్వారములు కలవు. ప్రధానమయిన చావడిలో ఎనిమిదేసి స్తంభములు గల రెండు శ్రేణులు కలవు. ఈ రెండు శ్రేణులచే చావడి మూడు విభాగము అయినది. గర్భాలయ ద్వారమున కిరు ప్రక్కలయందు ఇర్వురు ద్వారపాలురు గలరు. గర్భాలయములో బుద్ధుని మహోన్న తాకార విగ్రహము కలదు. బుద్ధుడు 'భూమిస్పర్శ' ముద్రాంకితుడై యుండును. బోధిసత్త్వులును, పూర్ణఘటమును హస్తమున ధరించి గృహతలమునుండి ఆవిర్భవించిన భూదేవియు బుద్ధుని పరివేష్టించి యుందురు. వసారాయొక్క ఉత్తరకొనయందు అత్యంత లావణ్య హరిణద్వయ సమేతముగా, ధర్మచక్ర ప్రవర్తన రంగమునందు మలచబడిన బుద్ధవిగ్రహము అత్యంతాకర్షణీయముగ నున్నది. అన్నిటికంటె చతురాకారము కల్గి సామాన్యమైన (Plain) 42 స్తంభములచే పై అంతస్తు అలంకృతమయి యున్నది. ఈ స్తంభములు పై అంతస్తును అయిదు వసారాఖండములుగ విభజించుచున్నది. ఈవసారా ఖండముల చివరనున్న గూళ్లలో బుద్ధుని ప్రతిరూపములు కలవు. బుద్ధుడు సింహాసనాసీనుడయి ఆచారానుసారము శిష్యపరివృతుడై యుండును. వెనుక భాగమున నున్న వసారా యొక్క దక్షిణాగ్రమున మనోహర రంగము కలదు. అందు సింహాసన మధిష్ఠించియున్న బుద్ధుడు కలడు. ఈ బుద్ధ విగ్రహమునకు ముందు ధర్మచక్రమును,ఒయ్యారముగ పరుండియున్న రెండు హరిణములును రమణీయముగ చెక్కబడినవి. ఈ రంగము, మృగదావము నందలి బుద్ధుని ప్రథమోపదేశ సందర్భమును స్ఫురణకు తెచ్చుటకే యుద్దేశింపబడినది. ఈ వసారా యొక్క ఉత్తర భాగాంతముననే బుద్ధుడు కాళ్లుముడుచుకొని కూర్చుండియుండును. హస్తములు ధర్మచక్రముద్రను సూచించును. ఇంకొక చోట బుద్దుడు సింహాసనాసీనుడయి యున్నట్లు కలదు కానీ, అతని కిరుప్రక్కల యందున్న మూడు బుద్ధ ప్రతిరూపములు ధ్యానాసన, ధ్యానముద్రలలో నున్నట్లును, బౌద్ధ ధర్మసూత్రములను దేవతల కుపదేశించుటకోయన వినువీథియందు బుద్ధుడు పయనించుచున్నట్లును, బుద్ధుని పరినిర్వాణ పదముపొందు రంగదృశ్యములు చిత్రింపబడినవి.

పై ప్రదేశమునకు కుడివైపున ఎత్తయిన స్థలము కలదు. దానిపై నున్న ఆలయమునకు సమీపమందున్న గోడ పొడవున మొగసాల వరకు (Vestibule) ఏడు బుద్ధ విగ్రహములు కలవు. ఇవి యన్నియు ఏక విధముగా సమాధ్యవస్థలో నున్నట్లు రూపొందింపబడినవి. కాని ఒక్కొక్క విగ్రహము నెత్తిపై ఒక్కొక్క రూపములో బోధి వృక్షము యొక్క పత్రసముదాయము చిత్రింపబడి యున్నది. ఈ పత్ర సముదాయము కాంతి పరివేషము యొక్క వెనుక భాగమునుండి ఉద్భవించినట్లు చెక్కబడినది. ఇవి అజంతాలోని 22 వ గుహయందలి క్రింది వరుసలో వాటివాటి నామములతో చెక్కబడిన ఏడు 'మానుషి' బుద్ధ విగ్రహములయి యుండనోపు. వాటి పేర్లు ఈ క్రిందివరుస క్రమములో లిఖించబడినవి. 1. విపాస్యి, 2. శిఖి, 8. విశ్వభు, 4. క్రకుచంద, 5. కనక ముని, 6. కశ్యప, 7. శాక్యసింహ, వీరందరు పూర్వ బుద్ధావతార మూర్తులు. వీరి ధర్మోపదేశములే పూర్వ కల్పములలో సాటిలేని ప్రభుత్వగరిమను వహించెను. ఇందులో చిట్టచివరి వాడు చారిత్రాత్మక ప్రసిద్ధుడయిన బుద్ధుడయి యున్నాడు.

ఇటులే మొగసాల (Vestilule) కు దక్షిణమున ధ్యానముద్రలో నున్న ఏడు బుద్ధ విగ్రహముల వరుస కలదు. ఈ విగ్రహములు రాజలాంఛనములగు ఛత్రమండితములై యున్నవి. ధ్యానిబుద్ధు లైదుగురు. వైరోచన, అభోజ్య, రత్నసంభవ, ఆమితభ, అమోఘసిద్ధ అని వారి పేర్లు. వీరందరు ఆదిబుద్ధునినుండియే ఉత్పన్నమయిరి. వీరు తమ ఇచ్ఛాపర్యవసానముగ వరుసగా సామంత భద్ర, వజ్ర పాణి, రత్నపాణి, పద్మపాణి, విశ్వపాణి అను బోధిసత్త్వులను సృష్టించిరి. ఈ ఏడు విగ్రహములను గూర్చిన నిశ్చయార్థము ఇంతవరకు ఇదమిత్థమని ధ్రువపడ లేదు.

గుహాలయము యొక్క మొగసాలయందు మహోన్నతులగు ద్వారపాలకులు గలరు. వీరు చేతులుకట్టుకొని, నిలుచుండియున్నారు. ఒక్కొక్కరినెత్తిపై ఉన్నత శిరో వేష్టనములు కలవు. ప్రతికుడ్యపు చివరన ఎత్తయిన పీఠముల పై ముగ్గురు స్త్రీమూర్తులు ఆసీనులై యున్నారు. ఈ విగ్రహములు తమ కుడిపాదములను క్రిందికిచాచి పద్మము పైన నిలిపినట్లును, ఎడమ పాదములను తమలోపలనే ముడుచుకొనినట్లును మలచబడినవి. ప్రతి ప్రక్క యందలి కోణముల కడనున్న . స్త్రీ; నాలుగు చేతులు కలిగి యున్నది. చేతులలో అక్షమాలయు, వక్రదండమును గలవు. ప్రతి ప్రక్క నున్న గోడలమీద ఇట్టివే మరిమూడు విగ్రహములున్నవి. కాని వాటికి రెండుచేతులు మాత్రమే కలవు. ప్రతి విగ్రహము పుష్పమో, పజ్రమో, మరేదో సంకేతాత్మక చిహ్నమును ధరించినట్లు కన్పట్టును. పద్మములు, మత్స్యములు, పక్షులు మున్నగువానిమధ్య నిలుచుండి నాగఫణవి తాన ధారులగు విగ్రహములు కొలుచుచుండగా వీరు పద్మాసనాసీనులయి యుందురు. వీరు ఈ గుహయందే మరొక చోట చెక్కబడిన వివిధ బోధిసత్త్వులతో సన్నిహిత సంబంధముగల 'తారలు' అయి ఉండవచ్చును. వెనుక ప్రక్క నున్న గోడమీది ప్రతి విభాగమందు నాలుగు బుద్ధవిగ్రహములును, ప్రతి గోడ యొక్క చివరిభాగమందు అయిదు విగ్రహములును అన్నిటికీ పైన మలచబడినవి.

దేవాలయములో నేలపై కూర్చుండియున్న పెద్ద బుద్ధ విగ్రహము మరియొకటి కలదు. ఈ విగ్రహము చెడిపోయి యున్నది, దీని కిరుప్రక్కల అయిదుగురు బోధిసత్త్వులు పరివేష్టించి యున్నారు. దీనికి సరసనే వజ్రపాణి, పద్మపాణి విగ్రహములున్నవి. ఉత్తరదిశయందలి గోడ మధ్యమున, చేతియందు పుష్పమును ధరించి భూమిపై కూర్చుండియున్న ఒక స్త్రీ విగ్రహమును చూడగలము. ద్వారమునకు దక్షిణముగా సమ దూరముననే ఒక బలిష్ఠమయిన పురుష విగ్రహము చెక్కబడి యున్నది. ఇతడు జంభాలుడని స్పష్టమగు చున్నది. ఈ విగ్రహము యొక్క ఎడమ మోకాలిపై ధనపు సంచియు, కుడిమోకాలిపై ధనరూప చిహ్నమును చెక్కబడినవి. దీనికి దిగువగా, కొంచెము పేరుతరహాలో పూర్ణఘట మొకటి యున్నది. దీనికి ఎగువగానున్న గదికి ఇరువైపుల నేలపై కూర్చున్న అయిదు బుద్ధవిగ్రహము లున్నవి. ముందరి గోడపైగూడ ఇరుప్రక్కల మరి రెండు బుద్ధ విగ్రహములు కన్పడును. ఈ విగ్రహములు చావడి యొక్క వెనుక గోడమీది విగ్రహములవలెనే ఉన్నవి. పరిమాణమును బట్టియు, మతలక్షణములను బట్టియు, అలంకార చిహ్నములను బట్టియు, ఈ బౌద్ధ గుహాలయముల శిల్పము అతి మనోహరముగా నున్నదని చెప్పక తప్పదు. కాని అజంతాలోను, అంతకు పూర్వపు బౌద్ధ శిల్పములలోను వ్యక్తమయ్యెడి ఆధ్యాత్మిక గాంభీర్యము, తాపసిక సాత్వికత, ప్రశాంతత ఎల్లోరా గుహాలయములందలి శిల్పములలో కాన్పింపవు.

హిందూ గుహాలయములు :బౌద్ద గుహాలయముల తరువాత బ్రాహ్మణమత గుహాలయ వర్గములు కలవు. ఈ గుహల సంఖ్య పందొమ్మిది. ఇవి బౌద్ధాలయ వర్గపు చివర భాగమునుండి ఒక మైలు దూరమువరకు వ్యాపించి యున్నవి. అక్కడక్కడ నివి ఎడనెడముగనున్నవి. వీటిని నాలుగు వర్గములుగా విభజింపవచ్చును. మొదటి వర్గమునకు 15 వ సంఖ్యగల దశావతార గుహయు, రెండవ వర్గమునకు 14వ సంఖ్యగల రావణక భేయి గుహయు, 21 వ సంఖ్యగల రామేశ్వరగుహయు, మూడవ వర్గమునకు 29 వ సంఖ్యగల సీతాకనహాని గుహయు, నాల్గవ వర్గమునకు 16 వ సంఖ్యగల అత్యంత ప్రముఖమయిన కైలాసగుహయు ప్రాతినిధ్యము వహించును.

మొదటివర్గపు గుహలు సామాన్యమయిన పద్ధతిలో నున్నవి. ఇవి స్తంభములుగల ద్వారమంటనము, చివర

గర్భగుడి కలిగి, బౌద్ధవిహారమును పోలియున్నవి. రెండవ వర్గముకూడ అట్టిదే. కాని గర్భాలయముచుట్టును ప్రదక్షిణ పథములను కలిగియున్నవి. మూడవ వర్గము త్రికూలాకృతిలో ఒకచావడిగా నుండును. దానికి రెండుమూడు ద్వారములు, చావడి మధ్యలో ఆలయ నిర్మాణము ఉండును. నాల్గవవర్గము ప్రత్యేక శీలాత్మకము. గుహా వాస్తు శిల్పకళయందు ఈవర్గము పరాకాష్ఠను పొందినది. ఇది కేవలము శిలను తొలిచి గుహ కావించుట కాదు, బ్రహ్మాండమయిన పర్వతశిలాఖండమును తొలిచి సర్వాంగ సంయుతముగా, సమ స్తవిశేషములతో సర్వస్వతంత్ర దేవ మందిరము లేపబడుట ఈవర్గమునందు జరిగినది. L ఈ బ్రాహ్మణ గుహాలయముల శిల్పవి శేషములను ఇచ్చట పరిశీలించుట అసమంజసము కాదు. సామాన్యమయిన 18 వ గుహను వదలుదము. 'రావణకాఖేయ్' (రావణ పరా భవము) అను 14 వ గుహాలయము సుందరమగు శిల్పకళా ఖండ శ్రేణులలో మిగుల ప్రశస్తికన్నది. ఇందు గర్భాలయమున కిరుప్రక్కల మలచబడిన ద్వారపాలకుల విగ్రహములు, ఇతర ప్రతినులు, గర్భాలయమందలి విచ్ఛిన్నమైన దుర్గవిగ్రహము చూడముచ్చట గొల్పుచున్నవి. స్తంభముల సముదాయముగల చావడికి ఇరుప్రక్కలనున్న గోడ లలో అనేక శ్రేణులుగ వర్గీకరింపబడిన శిల్పకళాఖండము లున్నవి. దక్షిణభాగముపై (1) మహిషాసుర మర్దని, (2) శివపార్వతులు చదరంగమాడు దృశ్యము, (3) భృంగి, పార్వతి, బ్రహ్మ, విష్ణువులతో కలసి దిక్పాలురు శివుడు సంధ్యానృశ్య షూడుచుండగా తిలకించుచున్న దృశ్యము, (4) రావణుడు కైలాసమునుకదల్చి వేయుట, (5) భైరవుడు; ఉత్తరభాగము పై (1) చతుర్భుజయగు దుర్గ, (2) గజలక్ష్మి, (3) భూవరాహ, (4) గరుడాదులచే పరివేష్టితులైన లక్ష్మీ విష్ణువులు, (5) శేషశాయియగు విష్ణువు మొదలయిన సన్నివేశములు సుందరముగా చిత్రింపబడినవి. ప్రదక్షిణపధములో ఉత్తరదిశగా 'అతిరిక్త కాశి' యొక్క మూడుభిన్నరూపము లును, ఆమెకు రెండుపక్తల ఇరువురు సేవకులును, రెండు వర్గములలో ఒక చివర గణపతి విగ్రహము, రెండవ చివర వీరభద్ర విగ్రహముగల సప్తమాతృకలు గలరు.

15 వ గుహయగు దశావతార శిల్ప గుహాలయము మిగుల పెద్దది. దీనికిని, సమీపముననున్న బౌద్ధ గుహాలయ మయిన "తీన్ నల్" (త్రిశలము) కును పోలికలు కనపడును. అక్కడగల శిలాద్వారముగుండా పోయినచో, ఎగుడుదిగుడు ఆ కారములలో నున్న ఆవరణము కన్పట్టును. ఈ ఆవరణమధ్యములో ప్రత్యేకముగా ఒక గుడి కలదు. ఇది నందిమంటపమేమో! "తీన్ కల్" (త్రిరలము) అగు బౌద్ధ గుహాలయము యొక్క తలమునందలి శిల్పచాతుర్యమును, దాని మనోహర దృశ్యమును చూచిన కళ్ళతో ఈ నందిమంటపమును చూచినచో దివిటీముందు దీపమును చూచినట్లు ఇది పేలవముగా నుండును. దశావకారమను ఈ గుహ రెండంతస్తులు కలది. చతురాకృతిలో ఒక దానిపై మరొకటిగల రెండు స్తంభముల వరుసలపై ఈ కట్టడము ఆధారపడి యున్నది. ప్రతి అంతస్తులోను నిడి విడి స్తంభములుగల విశాలమయిన చావడి కలదు. ఈ స్తంభములు చతురాకారముకలపై గణనఫలక మునుపోలిన అగ్రములయందు గోడుగా (Flat) చెక్క బడి యున్నవి. ప్రక్కలయందును, గోడలయందును కొంత మరుగుపడి యున్న స్తంభముల మధ్యభాగములో పెద్దవగు చట్రములలోతు ప్రదేశమునందు చెక్కబడిన బ్రహ్మాండరూప పౌరాణిక గాథారంగములను బాగుగా ప్రదర్శించుటకే ఇచ్చటి శిల్పకళా వై చిత్ర్య ముద్దేశింపబడినదని భావించనగును.

బ్రాహ్మణమత గుహాలయములయందు రూపొందించ బడిన శిల్పములు ఎల్లో రాయందలి శిల్పములకంటే పూర్తిగా భిన్నములైనవి. ఈ శిల్పములలో ప్రదర్శింపబడిన అద్భుకమయిన శక్తి పాటవములు వర్ణనాతీతము లైనవి. ఉదాహరణమునకు విష్ణువు యొక్క త్రివిక్రమావతారమును, వరాహావతారమును, నారసింహావతారమును చెక్కుటలో ఆ విగ్రహములకు అనంతమయిన శక్తిని, తేజస్సును, భావమును మూర్తీభవింపజేయుట ఈ శిల్ప రాజముల ప్రత్యేక విశిష్టత. వీటిలో నారసింహుని ఉగ్రావతారమును మలచుట మిగుల నిరుపమాన శిల్ప చాతుర్యము, హిరణ్యకశ్యపుడు తన ప్రజల శత్రువునకు ఎదురుగా గంభీరాకృతిలో, అహంకారముతో నిలుచుండినట్లు చిత్రించుట భయానకము, బెదరుచూపులతో చూడతగినది. అదే సమయమున పైశాచీ కాట్టహాసమును ప్రదర్శించు నారసింహుని యొక్కయు, నిస్సహాయతను, లొంగుబాటు వైఖరిని చూపుచున్న హిరణ్యకశ్యపుని యొక్కయు చిత్రములు చూపరులను విభ్రమ చకితులను గావించును. ఆధునిక చిత్రములలో నారసింహుడు హిరణ్యకశ్యపుని తన మోకాళ్ళపై నిడుకొని చేతివ్రేళ్ళతో అతని గుండెలను చీల్చుచున్నట్లును, హిరణ్యకశ్యపుడు కేవలము నిస్సహా యుడై పడియున్నట్లును చూచెదము. కాని ఈ ఆధునిక చిత్రముకంటే, పైన వివరించిన శిల్పము కళాత్మకము గా ఉదాత్తతను చాటుచున్నది. దశావతార గుహాలయము యొక్క పై అంతస్తులోని చావడియందలి శిలా ఖండమున భైరవుని రూపము చెక్కబడినది. ఈ శిలాఖండము, ద్వారము సమీపమున ఉత్తరదిశగా నున్న మొట్టమొదటిది. ఇట్టి శిలాప్రతిమారూపములనుగూర్చి కొన్ని వివరములను ఇచ్చట పరిశీలింతము. ఈ విగ్రహము గంభీరముగను ప్రజ్ఞావంతముగను చెక్కబడిన శిల్పరచన. ఇది పరిమాణమున బ్రహ్మాండమయినది, ఇది ఎదుటివారిపై బడి చంపసున్నట్లు భయంకరముగ కనిపించును. ఈ భైరవదేవుడు గజచర్మాంబరధారి : మెడనుండి మోకాళ్ళ క్రిందివరకు వ్రేలాడు ముండమాల (కపాలమాలిక) కలవాడు. ఒక నాగసర్పము ఇతని శరీరమును చుట్టుకొని యుండును. వివృతముఖగహ్వరమున తన దంతావళిని చూపుచుండును. భైరవుడు తన త్రిశూలముతో ఒక వ్యక్తి శరీరమును గ్రుచ్చును. ఆ నిర్భాగ్యపువ్యక్తి దయారహితుడయిన భైరవుని దయచూపు మని ప్రార్థించుచుండును. మరియొక వ్యక్తిని ఒక ఎడమచేతితో వ్రేలాడునట్లు పట్టుకొని పైకెత్తి తన సంతోషాతిశయ ప్రకటనార్థముగాబోలు, 'డమరు'ను కఠోరముగ పటపటధ్వని చేయుచుండును. అట్లు డమరు వాయించుచునే తన పైశాచికతృష్ణను చల్లార్చుకోనుటకు రక్తధారను గ్రహించుచుండును. ఇట్టి భైరవావతార విగ్రహము యొక్క ప్రళయభయంకర లక్షణములకు ఇంకను ఎక్కువగా భయంకరత్వమును ఆపాదించుటకై కాళికాదేవి రాక్షసాకారమున దేహమును బెంచి ఇకిలించుచు, పెద్దనోటితో, విరియబోసికొన్న తల వెండ్రుకలతో, లోతుగా పీక్కొనిపోయిన కంటిగ్రుడ్లతో, దక్షిణహస్త మందు మెలిదిరిగిన కత్తితోకూడినదయి కపాలపు చిప్పగల వామహస్తమును చాచి, బలిగొనదలచిన వ్యక్తి యొక్క ఆహారములో తాను పాల్గొన కుతూహలపడుచున్నట్లు చూపబడినది. ఈ భయంకర దృశ్యమును చూచుచు నొక గ్రుడ్లగూబయో, పిశాచమో, కాళికాదేవి శిరము వెనుక కన్పట్టును. కుడిప్రక్కగా అస్థిపంజరము నెదుట పార్వతియు, ఆమెకు ఎగువగా, హతుడయిన రత్నాసురుని పాదములకడ నాలుకను చాచిన ఒక ముఖాకృతియు కన్పట్టును. భైరవదేవుని చేతులమురుగుల ఆకారముతో సహా ఈ సమూహమంతయు నొక పైశాచిక దృశ్యము. ఏలయన ఇట్టి భయంకర దృశ్యములు, ఇట్టి విషయాను సంధానము వారికి ప్రీతికరమయినట్టివి ఎల్లోరాలోని వివిధములయిన గుహాలయములలో చెక్కబడినవి. ఈ దృశ్యములు పైశాచిక లక్షణములను ప్రదర్శించుటలో ఒక దానికంటే మరియొకటి మిన్నగానుండెను. ఉదాహరణమునకు "సీతాకా నహాని" అను 29 వ ఆలయములో భైరవుని వికారరూపముగల దంష్ట్రలును, ముందు నకు పొడుచుకొనివచ్చిన కనుగ్రుడ్లును, ఆగ్రహపరవశత్వమును, పైశాచిక ఆనందలక్షణములను వెల్లడి చేయును. భైరవదేవుని ఈ భయంక రాకృతి అతని అర్థాంగియైన పార్వతిని సహితము కలవర పెట్టగా, ఆమె తన మనోవిక అశ్వమును, గుండెబెదరును, ఉపశమింపజేసికొనుటకై హస్తమును తన నక్షస్థలముపై ఉంచుకొనెను. ఈ శిల్ప సన్ని వేశము ప్రచండమై, హృదయవిదారకమై, యథార్థముగ అద్భుతావహమయి యున్నది. అయినను ఇట్టి సందర్భమున ఉగ్రమయిన మతలక్షణములు పొదుగబడిన ఈ శిల్పచాకచక్యమును అలక్ష్యము చేయరాదు.

వైష్ణవమతము స్వభావసిద్ధముగ శాంతికిని, సహృదయమునకును ఆస్పదమై తన ప్రతిమానిర్మాణమున శృంగారమునకు, సౌందర్యమునకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చియున్నను. ఈ ఉగ్రత వైష్ణవశిల్పములలో గూడ కన్పట్టును.. త్రివిక్రమ, వరాహ, ఇత్యాది శిలామూర్తులలో ఈ ఉగ్ర స్వభావ మున్నటుల ఇదివరలో తెలిసికొనియున్నాము.

16 వ గుహయగు కైలాసాలయ నిర్మాణము గుహా వాస్తు శిల్పములలో కెల్ల అసాధారణమయిన కళాఖండము నకు ఉదాహరణము. ఇందలి శిల్పకళావైభవమును బట్టియు, చిత్రకళా ప్రాధాన్యమునుబట్టియు, చెక్కడపు పనితనమందు చూపిన ప్రాగల్భ్యమునుబట్టియు ఈ నిర్మాణము ప్రపంచమునందు నిస్సందేహముగ అనుపమేయమై, మనోహరాత్మకమై తనరారు కళాఖండమైయున్నది. ఈ నిర్మాణము పూర్తి యైనపుడు దీని నిర్మాతయగు శిల్పియే తన కళానై పుణ్యమునకు ముగ్ధుడై, ఆశ్చర్యావేశము లతో తన్మయుడై నట్లును, ఉత్తేజమును కలిగించుటలో ఈ శిల్ప చాతుర్యము మానవశక్తి కతీతమైనదని స్వర్గమునందలి దేవతలు సహితము శ్లాఘించినట్లును చెప్పబడుచున్నది.

వాస్తునిర్మాణ విషయములో ఈ శిల్పము 'పట్టడకల్' అను ప్రదేశమందలి విరూపాక్షాలయమును కొంతవరకు పోలియున్నది. కాని ఈ శిల్పము విరూపాక్షాలయముకంటె రెండింతలు పెద్దది. వీరూపాక్షాలయము (1) ప్రధానాలయ భాగము, (2) ప్రవేశ ద్వారము, ఈ రెంటికి మధ్య (3) నంది గుడి, (4) ఆవరణము చుట్టును సన్యాసులు నివేశనములు, అనుబంధములుగా ఆవరణమున ఇరుప్రక్కలను అనంతర కాలమున నిర్మింపబడిన గదులు మొదలయినవానితోనాలుగు విభాగములుగా నిర్మింపబడినది. ఉత్తరపుగోడ సరసనే 'లంకేశ్వర' అను నొక గొప్ప చావడి స్తంభములతో నిర్మింపబడియున్నది. ఈ ఆలయ ప్రవేశ ద్వారము పశ్చిమదిశయం దున్నది. ప్రధాన కట్టడము యొక్క వైశాల్యము సుమారు 150× 110 చతురపు అడుగులు. క్రింది భాగమునుండి పై వరకును ఈ కట్టడము నిలువున, నడుమనడుమ, ముందునకు పొడుచుకొని యున్నట్లు నిర్మాణము చేయబడినది. గోడలపై ఏనుగులు, సింహములు మొదలైన జంతువుల చిత్రములు ప్రధాన కట్టడమును మోయుచున్నవా అనునట్లు గంభీరాకారములలో చెక్కబడినవి. 25 అడుగులు ఎత్తు గలిగిన దేవాలయ స్తంభములపై ఆమూలాగ్రముగా బరువైన చెక్కడపు పనులు తీర్చి దిద్దబడినవి.

'ఈ ఘనమైన చదరపు టడుగుభాగములుగల స్తంభముల మీద ప్రధానాలయము నెలకొని యున్నది. ఈ ఆలయమునకు సోపానమార్గము గలదు. సోపాన పంక్తుల మీదుగా పోయినచో పశ్చిమముగానున్న ముఖ మండపము వద్దకు చేరవచ్చును. ఇచ్చటనే వాస్తుశాస్త్రజ్ఞులు తమ శిల్పక శౌన్నత్యమును” అద్భుతముగా ప్రదర్శించిరి. మంటపమును, విమానమును మేళవించు సంప్రదాయ సిద్ధమయిన కళావిధానమునుండి వాస్తు శాస్త్రజ్ఞులు భిన్నమార్గమును త్రొక్కినట్లు తోచదు. 'కాని గోడల చూరులు, అంచులు, అర్ధభాగము గోడలో కలిసిపోయినట్లు నిర్మించబడిన స్తంభములు, గోడలయందలి గూడులు, ద్వారమంటపములు మొదలయిన చెక్కడములు క్రమబద్ధముగా, కళామయముగా, కచ్చితమైన శిల్పసిద్ధాంతముల ననుసరించి రూపొందింపబడి కళానైపుణ్యమును, కళాప్రావీణ్యమును చాటుచున్నవి. వీటన్నిటిని మించగల మూడు అంతస్తుల రాజసౌధ మొక్కటి కలదు. దీని ముందరిభాగమున మోరపాక ఆకారములో ప్రముఖముగా ముందుకు చొచ్చుకొనివచ్చిన నిర్మాణ మొకటి కన్పించును. ఎత్తులో దీనిని అధిగమించు గోపుర శిఖరము తీర్చిదిద్దినట్లు చెక్కబడెను. దీని మొత్తపు ఎత్తు 96 అడుగులు. ఇంతటితో ఇచ్చటి శిల్పసౌందర్యము ముగియలేదు. విమానము యొక్క మూల మట్టమునకు సమీపమునగల వేదిక చుట్టునున్న విశాల ప్రదేశపు పరిసరమునందు కొండరాతినుండి మలచ బడిన అయిదు ఉపప్రార్థనామందిరములు కలవు. ప్రధానదేవాలయపు శిల్పఫణితిని అనుసరించియే, స్వల్ప మైన ఆకారములో ఈ ఉప ప్రార్థనామందిరములు సహాయక మందిరములుగా నిర్మింపబడినవి. అంతర్భాగమున స్తంభములతో ఒక చావడి కలదు. అచ్చటినుండి గర్భగుడికి గొంపోవు నడవయున్నది. ఈ చావడి యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు, ఇతర హంగులు, వాస్తుశాస్త్రానుసారము, సౌష్ఠవముగ ఏర్పాటయినవి. దీని వైశాల్యము 70x62 చ. అడుగులు. ప్రతిమూలయందును నాలుగేసి స్తంభముల చొప్పున, 16 చతురాకారపు స్తంభములపై ఈ చావడి ఆధారపడియున్నది. ఈ నిర్మాణము ప్రకారము త్రిశూలా కారముగల వసారాలు చావడి మధ్యభాగములో ఏర్పడి, ఎంతోఘనతను చేకూర్చుచున్నవి. కైలాస గుహాలయమున పెక్కుకట్టడములు కలవు. ఇందు కొన్ని తరువాత చేర్చుచు చెక్క బడియుండవచ్చును. కాని మందిరముల చుట్టును నిర్మింపబడిన సోపానపంక్తులు కేంద్రాలయముతోపాటు సమకాలీనమైనవి. ఈ సోపాసపంక్తులను,శిల్పకళాఖండములను తిలకింపవచ్చిన దర్శకుల కీ దృశ్యము అత్యాకర్షణీయముగ నుండును. దక్షిణ దిశగానున్న తాళ్వారము ఇంకను ఆశ్చర్యకరముగా నుండును. దీని నిడివి 189 అడుగులు. దీని వెనుక ప్రక్క నున్న గోడపైన మానవాకారము కంటే పెద్దవియగు దేవతల విగ్రహములు సుందరముగా చెక్కబడినవి. నంది ఆలయమునకు ఇరుప్రక్కల 51 అడుగుల ఎత్తుగల రెండు ధ్వజస్తంభములు గమనింపదగిన మరియొక కళావిశేషము. దక్షిణ భారతములో ధ్వజ స్తంభముల నిర్మాణపరిణామదశయందు, ఈ రెండు ధ్వజ స్తంభముల నిర్మాణచాతుర్యము ముఖ్యమయిన ఒక ఘట్టమును సూచించుచున్నది. ఈ దేవాలయము యొక్క శిల్పా లంకారమునుబట్టి, ఇందలి అన్ని భాగములును శాస్త్రీయముగనే నిర్మింపబడినవి. ఇందులో ప్రదర్శించిన నైపుణ్యము చిరస్మరణీయమగు విశిష్టకళాఖండమునకు తగినట్లుగా నుండెనని చెప్పగలము. రావణుడు కైలాసపర్వతమును పెకలించినట్లు రచించిన శిల్పము ఇందలి శిల్పవి శేషములలో అగ్రగణ్యమైనది.

ఇందలి బ్రాహ్మణ గుహాలయములవలెనే, కైలాస గుహాలయమందు ప్రదర్శింపబడిన శిల్ప నైపుణ్యమునందు అత్యద్భుతమయిన శక్తి, అపరిమితమయిన తేజస్సు ప్రస్ఫుటముగ గోచరించుచున్నవి. దేవతలు మానవాతీతులని తెలియచేయుటకు పెక్కు తలలు, చేతులు, ఇతర ప్రధాన లక్షణములు ఈ విగ్రహనిర్మాణ మందు కల్పించుట ఇందలి విశేషము. బ్రాహ్మణాలయములలో అచ్చటనచ్చట చురుకయిన చలనమును, సౌందర్యమును, సంతోషమును, లావణ్యములను చిలుకుచు, అయిదవ శతాబ్దినాటి బుద్ధ నిగ్రహ సముదాయమును జ్ఞప్తికి తెచ్చు కొన్ని శిల్పవిశేషములు కన్పించును. ఉదాహరణమునకు, ఆకాశ వీధియందు కొన్ని జంటలు ఎగిరిపోవుచున్నట్లు కైలాస గుహాలయపు గోడల పైభాగము మీద మలచిన చెక్కడములు వాటి సౌకుమార్యము, ప్రశాంతచిత్తము, గమనవిధానము, బౌద్ధాప్సరసల మనోహరత్వమును, లావణ్యమును పోలియున్నవి.

ఎల్లోరాలోని అన్ని గుహాలయందువలె, ఈ గుహాలయ మందు కూడ వర్ణచిత్రములు బాహుళ్యముగ తప్పక ఉండియుండవచ్చును. ఈనాటికి ఎత్తయిన గోడలమీదను, పైకప్పులమీదను వర్ణచిత్రముల ఛాయలు కన్పించుటయే ఇందుకు నిదర్శనము. ఇప్పటికిని కైలాస, గణేశ గుహాలయములందు వర్ణచిత్రముల చాయలు మిగిలియున్నవి. ఇచ్చటికన్న జైన గుహాలయములలో ఈ చాయ లెక్కువగా కన్పట్టును. అజంతా గుహలకంటె ఎల్లోరాగుహలు ఎండ వానలకు ఎక్కువగా గురియగుటచే,ఇచ్చటి వర్ణములు వాతావరణ పరిస్థితుల ఒత్తిడికి తాళజాలక మకమకగా విలాసహీనములై యున్నవి. నమూనా విషయములో అవన్నియు ఒకే వర్గమునకు చెందియున్నవి. అవి లతాపుష్పజాతులకు చెందిన తరగతులు; రేఖాగణిత (Geometrical) సంబంధ చిహ్నములు. వీటిలో ఆథరణముల పోకడలు, చారుచిత్ర సంబంధమయిన రీతులు చేరిఉన్నవి. వీటి మూలము లన్నియు అంతకుపూర్వము నిర్మింపబడిన అజంతా గుహాలయముల కప్పులపై ఇప్పుడు చూడ వచ్చును.

కైలాస గుహాలయమునకు చెందిన ముఖమంటపము యొక్క పై కప్పు మీద చిత్రలేఖన చాయలు కొన్ని కన్పించుచున్నవి. ఇవి 8 వ శతాబ్ది మధ్యభాగముననో లేక కొంచె మవతలనో, ప్రధానాలయము మీద విగ్రహములు చెక్కబడిన కాలముననే చిత్రింపబడి యుండవచ్చును. వీటిలో ఒక చిత్రమందు పూజగొనుచున్న ఒక బ్రాహ్మణ దేవత చూపబడినది. ఇతడు శార్దూలముపై నధివసించి యుండును. ఆ శార్దూలము సింహపు తల, జూలు, పంజా తోడను, ఎద్దుయొక్కయో లేక మహిషముయొక్కయో కొమ్ములతోడను ఉండు పౌరాణిక ప్రసిద్ధిగల శరభమో, పాళ్వమో అయియుండును. భావనలోను, రూపకల్పన లోను ఈ బ్రాహ్మణదేవత శిరము అజంతాలో అదివరకు చిత్రింపబడిన బోధిసత్త్వుల శిరములను పోలియున్నది. అయితే ఈ వర్ణచిత్రములోని ఇతర వ్యక్తులు అతి వికృత రూపములో చిత్రింపబడి యున్నారు. అందుచే ఈ చిత్రముల యొక్క మత ప్రాధాన్యము లోపించెను. ఈ చిత్రముల అవయవ విశేషములు వాటి పరస్పర అనను రూపతను చాటు చున్నవి. ఇంతియే కాక, అజంతా గుహల నుండి అరువు తెచ్చుకొన్న సంప్రదాయ సిద్ధములయిన మేఘ రూపములు ఈ శిల్ప ప్రణాళికయందు మొత్తము మీద మోటుతనమునే ప్రవేశ పెట్టినవి. అందలి వర్ణములు గూడ లలితమయిన అభిరుచిని కల్పింపలేదు. కళాత్మక మయిన సౌందర్య, విశిష్టతలు ఈ చిత్రమందలి ప్రతి లక్షణములో నీరసింనచిట్లు ద్యోతకమగును.

పై చెప్పబడిన ముఖమంటపము యొక్క కప్పుమీద వలయాకారముగ నొక మండలము గలదు. దీనిపై నొక

పటముకూడ కన్నట్టును. అందు యముడు, అతని అర్ధాం

గియు మహిషముపై నెక్కి ప్రయాణము చేయుచున్నట్లు చిత్రింపబడెను. మహిషము ముందర ఇద్దరు సేవకులును, దాని పృష్ఠ భాగమున మరికొందరును కలరు. స్త్రీల కేశ సంస్కారవిధానము, ముఖ్యముగా కేశబంధన విధానము, అజంతాఫణితిని పోలియున్నది. కాని మోచేతులవంపులు, మోకాళ్ళ తీరుతెన్నులు, వికృతమయిన మిడిచూపులు పరిశీలించినచో, కళాకారుడు ముఖాకృతులకు, అవయవములకు సరియైన ఆకారమివ్వలేకపోయెనని స్పష్టమగును. కైలాస గుహాలయములోని వర్ణచిత్రములు ఒక దానిపైనొకటిగా పెక్కు పొరలలో కన్పించుటచే ఇందలి చిత్రములు ఒక దశలో కాక వేర్వేరు దశలలో రచింపబడిన వని ఊహింప నగును. యముని చిత్రము, దాని శైలినిబట్టి క్రీ. శ. 10 వ శతాబ్దికి చెందిన దని నిస్సందేహముగ చెప్ప వచ్చును.

కైలాసాలయము ముంగిటనున్న మంటపములోని పైకప్పుమీద కొన్ని వర్ణచిత్రములు వ్రాయబడినవి, 12 వ శతాబ్దిలో అధికారము చెలాయించిన మాల్వరాజవంశీయులగు పరమారుల నామములు ఈ చిత్రములలో ఉదాహ రింపబడుటచే, ఈ చిత్రము లెప్పటిపై నదియు నిర్ణయించుటకు గట్టి ఆధారము లున్నవి. ఈ చిత్రములలో కొన్ని యుద్ధ దృశ్యములు కలవు. ఇవి ఉత్తర హిందూస్థాన మందలి రాజపుత్ర చిత్రములతో, భావనలోను, శిల్పములోను సన్నిహితసంబంధము కలవిగా నున్నవి. కావున వీటికిని అజంతా చిత్రములకును సామ్య మున్నదనుటకు ఆధారము అంతగాలేవు. ఈ చిత్రములో ఏనుగుగమనము చురుకుగా సాగుచున్నట్లు సూచింపబడెను. కాని చిత్రకారుని చపల చిత్తమువలన గుఱ్ఱములు వెనుకడుగు వేయు వైఖరిలో నున్నట్లు చిత్రింపబడెను.

కైలాస గుహాలయము అద్వితీయమయిన శిల్పనిర్మాణము. పర్వతశిలనుండి రూపొందింపబడుటచే ఈ శిల్పకళా ఖండమునకు దృఢత్వమును, శాశ్వతత్వమును చేకూరినవి. అపరిమితమయిన శ్రమకోర్చి, విశేషసహనముతో, భగవత్సేవాతత్పరతతో ఈ శిల్పమునకు మనోహరమయిన రూపు రేఖలు దిద్దుటవలన ఉత్కృష్టతయందును, గాంభీర్యమందును ఇది ఈజిప్టు దేశపు గొప్ప ఆలయములతో తులతూగుచున్నది. మానవునిహృదయము, అంతరాత్మ, హస్త నైపుణ్యము సమశ్రుతిలో సమైక్యమై ఒక మహదాశయ సాధనకు కృషి చేసినవి. అపూర్వ సందర్భమునకు తార్కాణముగా నున్న మహోన్నత శిల్పమది. మత, సాంస్కృతిక స్థైర్యము నెలకొనిన పరిస్థితులలో శివుని ఆనందధామమగు కైలాసము ఒకే ప్రస్తరమునుండి శిల్పసౌభాగ్యముతో రూపొందింపబడినది.

17 వ గుహ, దానియందలి దక్షిణాగ్రమున చెక్కబడిన మహిషాసురమర్దని విగ్రహము యొక్కయు, ఉత్తరమున నున్న చతుర్భుజుడగు గణపతి విగ్రహముయొక్కయు ఉనికిచే, ప్రఖ్యాతి నొందియున్నది. ఇది ఇప్పటికిని చెక్కుచెదరక భద్రముగా నున్నది. ద్రావిడ శైలిలో నున్న ఆలయద్వారము అందముగ నిర్మింపబడలేదు. ఇది రెండు చేతులు గల ద్వారపాలకులతో ద్రావిడ సంప్రదాయానుసారముగ చెక్కబడినది. ద్వారపాలకులు హస్తములలో మామూలుగానుండు గదలకు మారుగా పుష్పములు పట్టుకొనియున్నారు. తక్కినవాటితో పోల్చినచో, ఇది యొక చిన్న గుహ. దీనియందు ఒక ప్రక్కనుండి మరియొక్క ప్రక్కకు ఒక్క వరుసలో నాలు గేసి స్తంభములు గల మూడువరుసలున్నవి. ముందువెనుకవి వసారాల పొడవు 64 అడుగులుండగా, దేవాలయపు పురోభాగమువరకు దీని వెడల్పు 37 అడుగు లున్నది. దీని మొత్తము కొలత 76 అడుగు లుండును. ఆలయము ముంగిటనున్న మంటపము స్థూలమైన రెండు చతురాకార స్తంభములు కలిగి యున్నది. ముందుభాగములో ద్వారమును, మూడు ప్రక్కలయందు తక్కువ ఎత్తుగల పై కప్పుకలిగిన నడవతో ఒక భవనమును అచట నున్నది. ఆభవనముకంటె పై జెప్పబడిన చతురాకార స్తంభములు ఎత్తుగానున్నవి.

ఆ తరువాతి మూడుగుహలు ఎక్కువ ముఖ్యమైనవి కావు. 'రామేశ్వర' అను 21 వ గుహ అతిసుందర మయి నది. దీని కెదురుగా ఉన్నతమయిన ఒక పీఠమును, దాని పై భాగమున నంది విగ్రహమును కలవు. ఈ గుహ కిరుప్రక్కల నదీ దేవతలయిన గంగా, యమునల విగ్రహము లున్నవి. ఈ విగ్రహములు ఉన్నతమయిన మానసిక బుద్ధి బలములను ప్రతిబింబించుచు, అత్యుత్తమ సంప్రదాయ శిల్ప చాతుర్యమును చాటు ఫణితిలోనున్నవి. మకరముయొక వీపుపై నున్న తామరపుష్పముమీద గంగ నిలబడియున్నది. శిల్పి ఈ మకరము యొక్క మూతిని, దీని అధో భాగమును అలంకార సంపన్నముగా మార్చి, తనయొక్క విచిత్రమయిన కళాభిరుచినీ ప్రతిబింబించు విధముగా రూపొందించి యున్నాడు. ఈ విగ్రహము యొక్క విన్యాసము, తీరుతెన్నులు ఎంతయు ఆహ్లాదకరములుగ నున్నవి. దీనిలోని రేఖలవంపులు, లావణ్యము జీవకళ యుట్టిపడునట్లుగా దిద్దబడినవి. ఈ దేవతావిగ్రహము యొక్క వామహస్తము ఒక మరుగుజ్జువ్యక్తి శిరముపై అభయమిచ్చినట్లు అనియున్నది. ఈ మరుగుజ్జువాని మోము, అతడు భక్తి తాత్పర్యభావవ్యగ్రుడై యున్నట్లు కనపడును. ఈ భావ ప్రకటనమునకు ఉపబలముగా వాడు చేతులు జోడించియున్నాడు. ఆదేవతామూర్తికి సమర్పించుటకై కానుకలం గొని గంధర్వులు అంతరిక్షము నుండి క్రిందకుదిగుచున్నారు. దురదృష్టవశాత్తు గంగాదేవి ముఖముపై ఒక బీట ఏర్పడినది. అయినను, ఆమె లావణ్యలక్షణములును, ఆధ్యాత్మిక భావ ప్రకటనయు ప్రశంసార్హములుగనే యున్నవి. ఈ దేవతకు కుడి ప్రక్కగా ‘చామర గ్రాహిణి విగ్రహమొకటియున్నది. ఈ శిలాచయము శీతవాతాతపములకు గురియగుటచే ఈ విగ్రహము చెడిపోయియున్నది. అయినను అది నిలచియున్న తీరు, అవయవరూపసౌందర్య ప్రదర్శనము కన్నుల కింపుగా నుండును. విగ్రహము యొక్క ముఖ లక్షణములతీరు ప్రశాంతచిత్తమును ప్రతిబింబించు చున్నది. కాని మిగత శరీరభాగమును మలచిన విధమునుబట్టి, ముఖ్యముగా కుడిపాదమును నిలిపిన విధమునుబట్టి, శిల్పి, విగ్రహమునందు మానవ సహజము లయిన లక్షణములను ఎక్కువగా చూపినాడు.

స్తంభములలో సగ మెత్తుకలిగిన ఒక సన్ననిగోడ, ముంగిటనున్న స్తంభములను కలుపుచున్నది. ముంగిట నున్న నాలుగు స్తంభాగ్రములపై మొక్కలు' మొలచి యున్న పూర్ణకుంభములు చెక్కబడినవి. ఈ మొక్కలు కుంభములకు చుట్టును వాలియున్నవి. వీటికి సరసనే మరుగుజ్జు పరివారముతో స్త్రీమూర్తులు వర్ణచాయల యందు నిలబడియున్నట్లు కలదు. పై భాగముననున్న చూరుల కాధారముగా శృంగములుగల రాక్షసాకారములు కలవు. వాటికి పైగా గదులయందు చిత్రవిచిత్రము అయిన శిల్పవిన్యాసము కలదు. ఈ శిల్పవిన్యాసములను విడదీయుచు స్థూలశరీరులగు గణదేవతలున్నారు.

చావడి యొక్క ఎత్తు 15½ అడుగులు. దీని వైశాల్యము 251 X 69 చదరపు అడుగులు. రెండు కోనలందునను రెండు మంటపములు కలవు. ఈ చావడికి నడుమ దీనిని వేరుచేయు రెండు స్తంభాగ్రములపై పూర్ణ ఘటములు చెక్కబడి యున్నవి. దక్షిణమంటపమందు సప్తమాతృకలను బృందము కలదు. ఈ బృందమునకు ఒక చివర గణేశుని విగ్రహమును, రెండవ చివర వీరభద్రుని విగ్రహమును కలవు. ఈ మంటము యొక్క తూర్పుకొనయందు గల గోడపై శివుని తాండవ నృత్యము కలదు. దీని కెదురుగా బశ్చిమమునగల గోడపై మూడు విగ్రహముల నడుమ అతిరిక్త కాశీ విగ్రహము కలదు. శివతాండవము అత్యంత ఘనముగా నున్నది. ఈ దృశ్యము దేవతలు కూడ చూడతగినది. దేవతలు తమతమ వాహనములమీద ఆరూఢులై పైన ఉన్నట్లుకూడ ఉబ్బెత్తు చిత్రములు మలచబడినవి. పార్వతియు, ఆమె అనుచరులును అధో భాగమున నున్నట్లును, నలుగురు సంగీతవిద్వాంసులు, మార్దంగికులు మొదలగువారు వారి చెంతనే ఉన్నట్లును విగ్రహములు చెక్కబడినవి. భృంగీశ్వరుడు శివునిపాదము ననుసరించి నాట్యము చేయుచుండును. ఇతని నాట్యము నటరాజస్వామి నృత్యము యొక్క మహద్వైభవమును ప్రత్యక్ష ప్రభావంతముగా చేయుచున్నది. అతిరిక్త కాళి విగ్రహమును, ఆమె యొక్క ఇద్దరు సహచారిణుల విగ్రహములును భయోత్పాతమును, వినాశమును కావించు రీతిగా మలచబడినవి. నాలుగు చేతులుగల భయంకరమైన నిడుపాటి అస్థిపంజర మొకటి తన పాదమును పట్టుకొని వెనుక నుండి కాళివంక చూచుచుండును. కాళి వాని శిరోజములను గ్రహించి యుండును. ఎడమ చేతిలో ఖండిత మస్తకముండును. ఆమె కంఠమును సర్పము చుట్టుకొని యున్నట్లును దృశ్యములు చెక్కబడినవి. మూడవ విగ్రహమందు గూడ చుట్టుకొనియున్న పాము గలదు. వాడు ఆమె తలమీదుగా పండ్లికిలించుచు నిలుచుండెను. దీనికి భిన్న దర్శనముగా దీర్ఘకంకాళమున కెదురుగా ఒక మూర్తి ఖడ్గధారియై నిలుచుండియున్నట్లును గంధర్వుడొకడు కానుకలను హస్తము నందిడుకొని అర్పింపనున్నట్లును చెక్కబడినది. ఇంతకంటే వికృతమైన బృందదృశ్యము ఊహింపబడ నేరదు. ఉత్తరపుదిశలో నున్న గుడిలో ఒక గోడచివర గిరిజాకల్యాణ సంబంధపు మనోహరదృశ్యము, కార్తికేయుడు, మరొక గోడ చివర మహిషాసురమర్ధని యొక్క విగ్రహము కలవు. కాళిదాస విరచితమయిన కుమార సంభవ కావ్యములో వర్ణితమయిన కొన్ని సన్నివేశములను శిల్పి గ్రహించి ఈ శిల్పమును తయారుచేసివాడని చెప్పవచ్చును. కఠోర తపస్సమాధిలోనున్న పార్వతి పంచాగ్నుల నడుమ ప్రశాంతచిత్తముతో నిలబడియుండుట, రతీమన్మధులు వసంత సహాయులై పార్వతిని (సహాయపడెదమని చెప్పుచు కాబోలు) బ్రతిమాలుచుండుటయు, శివపార్వతుల వివాహదృశ్యము, శివుడు పార్వతి యొక్క పాణిగ్రహణమును చేయుటయు, పార్వతి తలిదండ్రు లయిన మేనకా హిమవంతులు కానుకలు హస్తమందిడుకొని ఈ దృశ్యములను తిలకించుటయు, పవిత్రాగ్నులముందు పురోహితుడుగా బ్రహ్మ ఆసీనుడై ఉండుటయు, బాలుడైన గణపతి ఆనందముతో నాడుచుండుటయు, వివాహరంగమునకు దిగువ భాగమున ప్రమధగణాదులు చేరి సంతోష కోలాహలములు చేయుచుండుటయు - మొదలుగా గల దృశ్యములు వాస్తవిక మయిన కళాభిజ్ఞతతో చెక్కబడినవి. చివర గోడపైన అజముఖులగు పరివార బృందములతోడను, తన వాహనమైన నెమలితోడను కార్తికేయుడు అతి సహజముగా చెక్కబడెను.

దేవాలయముచుట్టును వెడల్పయిన ఉత్కృష్ట ప్రదక్షిణ పథమొకటి కన్పించును. ఆలయములో చతురాకార మయిన పొనపట్టమును, లింగమును కలవు. "నీలకంఠ" అనబడు తరువాతి గుహయందు 'సప్తమాతృక' అను వర్ణించు మరియొక గొప్పశిల్పము కన్పించును. దీనియందు గణేశుని యొక్కయు, నదీదేవతల యొక్కయు, ఇతరుల యొక్కయు విగ్రహములు గూడ కాననగును. 24 వ గుహ పేరెన్నికగన్న గుహకాదు. తరువాతి గుహాలయములో సూర్యుడు తన ఏడుగుఱ్ఱములను పూన్చిన రథముపై నెక్కియుండగా, ఇరుప్రక్కలనుండి తన పరిచారిక అయిన ఉష, ప్రత్యూషలు పుట్టుకొనివచ్చినట్లు సుందరముగా మలచుట ఇందలి విశేషము. ఈ శిల్పచిత్రము చావడి పైకప్పుమీద చెక్కబడినది. దాని తరువాతి గుహయు అంత ఆసక్తిని రేకెత్తించునదికాదు. దాని తరువాతిదియు అంతియే. కాని సిసలయిన వైష్ణవ సంప్రదాయము ననుసరించి శేషశాయి, మరి పెక్కు ఇతర శిల్పములు ఇందు రూపొందింపబడిన కళావిశేషములు. సరిగా జలపాతము క్రిందనే చిన్న గుహ యొకటి కలదు. దీనియందు ఇప్పటికిని పూజనొందుచున్న అష్టభుజాదేవియు, ఆమె పరివారమును కలరు. హిందూ గుహాలయములలో చివరి గుహాలయము ప్రముఖమైనది. ఇది 'దుమార్ లేనా' లేక 'సీతా కా నహాని' అను నానుముతో ప్రఖ్యాతి చెంది యున్నది. ఈ శిల్పము యొక్క శైలిలో చూపిన దిట్టతనము, రూపరచన యందు కనపరచిన దొడ్డతనము పరిశీలించినచో, ఇది 8వ శతాబ్దినాటి రాష్ట్రకూటుల శిల్ప కళాశైలిని పోలియున్నట్లు తెలియుచున్నది. ఈ గుహ యొక్క నమూనా 'ఎలిఫెంటా గుహలయందలి త్రిమూర్తి దేవాలయమును పోలియున్నది. కాని 'సీతా కా నహాని' త్రిమూర్తి ఆలయముకంటె వైశాల్యములో పెద్దదియు, వాస్తుశిల్పములో సుందరమైనదియునై యున్నది. అంతర్భాగము యొక్క వైశాల్యము 148×149 చ. అడుగులు, కప్పు వరకుగల గోడల ఎత్తు 17 అడుగుల 8 అంగుళములు. ఆకారములో అది సిలువను పోలియున్నది. పశ్చిమాభి ముఖముగ నున్న మార్గమున దర్శకుడు ప్రవేశించును. దేవాలయము యొక్క మధ్యమార్గము నకును, ఈమార్గమున కిరుప్రక్కల నున్న త్రోవలకును పై జెప్పిన మార్గము కలుపబడి యున్నది. ప్రక్కవాటుగా నున్న మార్గములు చెక్కబడిన ప్రాంతపు చివరిభాగమువరకు సాగిపోయినవి. ఈమార్గములే, దేవాలయుముచుట్టును ప్రదక్షిణాపథముగా ఉపయోగపడుచున్నవి. ప్రధానమయిన త్రోవ మధ్యభాగమున, ఉత్తర దక్షిణములనుండి మరియొక మార్గము వచ్చి కలియును. ఇది ఆలయ మధ్యభాగమును, ఆ వైపున నున్న దాని అనుబంధ నిర్మాణములను కలుపుచున్నది. అనుబంధములలో రెండు మార్గములు కలవు. సోపానములకు త్రోవతీయు వెలుపలిమార్గములు వాని వెనుకనున్న మార్గములకంటే చిన్నవి. గుడియొక్క అంతర్భాగము దీర్ఘమయిన వసారాఖండములుగా విభజింపబడినను మొత్తముపై ఆలయము నక్షత్రాకారమును పోలీయున్నది. ఈ నమూనా, దక్కనులో మధ్యయుగముల నాటి ఆలయ శిల్పకళనుండి పరిణామము చెందినది. గాడులు గల దిండు ఆకారములోనున్న స్తంభాగ్రములు అగ్రమున కొలదిగ భారవండములుగ నున్నట్లు కన్పట్టును' కాని పైకప్పు ఎత్తుగా నుండుటవలనను, దేవాలయపు నడవలు విశాలముగా నుండుటవలనను, ఇది ఎబ్బెట్టయిన లోపముగా ఎంచబడుటలేదు. గుహాలయాంతర్భాగమందలి శిల్పనై పుణ్యప్రభావము మొత్తముమీద తేజోవంతమును, శాశ్వతసిద్ధియు కలిగినదిగా నున్నది.

ముందు భాగమున నున్న చావడికి మూడు ప్రక్కల యందును అన్ని చివరలయందు, పెద్ద పెద్ద శిల్పములు చెక్కబడియున్నవి. పశ్చిమ వసారాలో దక్షిణాగ్రమున రావణుడు కైలాసమును కదల్చుచున్నట్లును, ఉత్తరాగ్రమున భైరవుడు ఇద్దరు వ్యక్తులను హతమార్చినట్లును చెక్కబడెను. పశ్చిమమున శివపార్వతులు చదరంగమాడు చున్నట్లును, క్రిందిభాగమున గణదేవతలతో నందీశ్వరుడు నిలచియున్నట్లును, పిరికి కుడిప్రక్కగా విష్ణువు, ఎడము ప్రక్కగా బ్రహ్మ వీక్షించుచున్నట్లును, శిల్పములు రూపొందింపబడెను. కాళిదాసుని వర్ణనలచే ప్రభావితులై శిల్పులు ప్రార్ధికయందు కల్యాణ మహోత్సవ రంగమును, దానికి మీదుగా అంతరిక్షమునుండి స్త్రీ పురుష దేవతలు వీక్షించు సన్నివేశమును చెక్కి యున్నారు. దీనికి దక్షిణముగా గోడలోని స్తంభమునకు వెలుపల సరస్వతీ విగ్రహమొకటి కలదు. వలయాకారముగల శిరో వేష్టనమును (తలపొగను) ఆమె ధరించినట్లు కన్పట్టును. ఆమెకు ఎగువ భాగమున ఋషులును, దిగువభాగమున పరివారమును ఉన్నట్లు శిల్పము చెక్కబడెను. సరస్వతి సరసనే కొంచెము క్రిందుగా ఆమె వాహనమయిన హంస నిలబడియున్నట్లు చూపబడినది.

దీనికి దక్షిణముగా క్రిందిభాగములోనున్న జలప్రవాహమువరకు సోపాన పంక్తులు కలవు.

వసారా యొక్క ఉత్తరాగ్రమున మహాయోగిగా శివుడో లేక లకుటేశ్వరుడో, ఎడమచేతిలో లగుడ ధారియై పద్మాసనముమీద కూర్చుండినట్లు కన్పడును. బౌద్ధ గుహాలయములలోవలెనే ఇద్దరు భక్తులు వెనుక నిలబడియుండగా, సర్పఫణమండిత విగ్రహులగు కొందరు తామరతూడును మోయుచున్నట్లుండును. దీని కెదురుగా, శివుడు తాండవ నృత్యము చేయుచున్నట్లును, ఆతనికి ఎడమవైపున పార్వతి ఆసీనయై యున్నట్లును కలదు.

గోడ స్తంభము (Pilaster) నకు వెలుపలగా తూర్పు దిశ యందున్న గోడపై తాబేలు మీద గంగాదేవి విగ్రహము చెక్కబడి యున్నది. ఈ విగ్రహము మరియొక చివర నున్న సరస్వతీవిగ్రహముతో సరితూగునట్లు చెక్కబడినది. గంగ సరసనే ఆమె పరివారము కలదు.ఆమె శిరముపై ఎత్తుగా గంధర్వులు ఎగురుచున్నట్లు కలదు.

అన్ని దేవాలయములందువలెనే, దీనియందును లింగ మున్నది. కాని దీనికి నాల్గు ప్రక్కలయందు ద్వారములు కలవు. నాలుగువైపులద్వారములయందును బ్రహ్మాండమైన ఆకారములతో ద్వారపాలకులు దేవాలయరక్షణకు నిలబడియున్నారు. ద్వారపాలకులు దక్షిణహస్తములందు పుష్పకలితులై యున్నారు. వీరి చెంత ఒక పరిచారిక గూడ పుష్పహస్తయై నిలచియున్నది. ఈ విగ్రహముల యొక్క శిరో వేష్టనములు ఒక దానికొకటి విభిన్నమైనవిగానున్నను, మొత్తముగా చూచినప్పుడు సుందరమయిన అనురూప్యము కలిగియే యుండును.

జైనగుహలు : బ్రాహ్మణ గుహా సముదాయమునందలి తుదిగుహకును, దాని కావలనున్న జైనగుహా సముదాయమునకును మధ్య గొప్ప దూరము కలదు. ఈ సముదాయమునకు చెందిన అయిదారింటిలో 31 వ సంఖ్యగల 'చిన్న కైలాసము', 32 వ సంఖ్యగల 'ఇంద్రసభ', 33 వ సంఖ్య గల 'జగన్నాథ సభ' అనునవి అత్యంత ముఖ్యమయినవి. - ఎల్లోరాయందలి ఇతర గుహలకంటే అవి ఎక్కువగా సురక్షిత స్థితియం దుంచబడినవి. వాటియందు చిత్రకళకును, శిల్పకళకును సంబంధించిన సూక్ష్మాంగ విభూతి ఎంతో గలదు.

ఇంద్రసభ అనునది రెండు అంతస్తులుగల దేవాలయము. అది శిలలో నూరుఅడుగులకు మించిన లోతున తొలచబడినది. దానిని చేరుటకు ఒక ద్వారము కలదు. ఈ ద్వారము శిలనుండి తొలచబడినదే. అది చతురస్రాకారము గల ఒక ఆవరణములోనికి ప్రవేశ పెట్టును. దాని మధ్య భాగమున మహాశీలను తొలచిన గుహాలయములు కనిపించును. అది కొంతమట్టుకు ఒక చిన్న ద్రావిడ దేవాలయ రూపమున నుండును. ద్వారమునకు కుడివైపున అద్భుతా

వహమయిన గజరాజు విగ్రహమొకటి కలదు. దానికి అభిముఖముగా సమదూరమున ఏకశిలామయమైన ఒక స్తంభమో, ధ్వజస్తంభమో కలదు. దీని ఎత్తు 30 అడుగులు. ఇంద్రసభ యొక్క పై అంతస్తు భారమును 12 స్తంభములు వహించుచున్నవి. వాటిపై విరివిగ ప్రతిమలు చెక్కబడి యున్నవి. క్రింది అంతస్తును విశాలమైన సమప్రదేశముపైఅంతస్తునుండి విభజించుచున్నది. ఈ రెండు శిలానిర్మాణ భాగములు విస్తారమయిన చెక్కడపుపని కలిగియున్నవి. ప్రధానమైన చావడి యొక్క మధ్యభాగమునందలి లోకప్పు అత్యంత సౌందర్య గుణావహముగా ఒక పెద్ద కమల రూపమున కల్పితమయినది. ఆ చావడి యొక్క ప్రతి మూలయందును మహాశివుని మహావిగ్రహముగల గుడి కలదు. తోరణాకార, ఆచ్ఛాదిత ప్రదేశమున (loggia) ఇంద్రుని విగ్రహము కలదు. 'ధాని పాదములకడ ఐరావతము కలదు. ఈ దృశ్యము ఒక లలితమయిన శిల్పకళాఖండమై తనరారుచున్నది. విగ్రహ శిల్పరచన యందును, అలంకరణ కళాఖినివేశ మందును, శిల్పకారులు అత్యంత విశిష్టములైన నిర్మాణముల నొనర్చిరి. ఎల్లోరా యందలి ఏ ఆలయముకూడ ఇంద్రసభయందలి పై అంతస్తు నందువలె పనితనపు పాటవమునందును, అవయవ పరిస్ఫూర్తియందును సంపూర్ణత నొందియుండ లేదు. గోడ స్తంభముల మధ్య తొలిచిన పెద్ద ఫలకము (Panels) లన్నియును ప్రతి కుడ్యమును వివిధ విషయక ప్రతిమా గాథలతో నింపబడినవి. స్తంభములు మోదావహములుగా ఎడఎడముగా ఏర్పరుపబడినవి. అవసరమునుబట్టి వాటిని పొట్టిగోడలతో కలిపి ఇతర సందర్భములందు వలెనే అగ్రములందు నిడుపాటి గాడులతో పలకల ముఖములతో మలచబడినవి.

జగన్నాథసభ అనునది ఎల్లోరాలో తొలచబడిన మరియొక విశిష్టమైన జైన చెక్కడమునకు తార్కాణము. ఇది మొత్తముమీద రూపపథమునందు ఇంద్రసభను పోలియున్నది. కాని ఇది ఇంద్రసభ కంటె పరిమాణమున చిన్నది. ఆదేవమందిరమును చిన్న ఉపశాలగుండా ప్రవేశింపనగును. ఆ ఉపశాలకు ఒక చక్కని యథా ప్రమాణ కృతమయిన బహిర్ద్వారము కలదు. ఆప్రవేశద్వారము మీదుగా తొరణ నిర్మాణము గలదు. ఈ ద్వారము లోపల సింహాసనస్థుడయిన మహావీరునియొక్క విగ్రహము కలదు. గోడలలో విగ్రహ నిర్మాణమునకై గూడులు ఏర్పాటు చేయబడినవి. స్తంభములపై శిల్పవిన్యాసము సమృద్ధిగనున్నది. అందలి శైలిజైనకళాకారుల విశిష్టప్రతిభను జాటుచున్నది.

సాధారణమైన నమూనాలోను, నిర్మాణశిల్ప లక్షణములోను ప్రధాన జైన దేవమందిరములకును, అచ్చటి బ్రాహ్మణ దేవమందిరములకుమ విస్మయోత్పాదకమయిన సామ్యము కలదు. కాని ఈ దేవమందిరముల యొక్క వివిధములయిన అనుబంధ నిర్మాణములు అనవసరములయిన అలంకరణ విస్తరములచే విశేషముగా సంకీర్ణములును, అతిభావా క్రాంతములై యున్నవి. అందుచే ప్రదర్శితమయిన వాటి సంకీర్ణతా క్లిష్టత చూపరులకు సంభ్రాంతిని, విసుగును కలిగించును. ఉదాహరణముగా, ఇంద్రసభయందలి యావరణమున ధ్వజ స్తంభము ఆలయకవాటమునకే కాక సభా కేంద్రమంటపమునకుగూడ చాల దగ్గరగానున్నది. అందుచే సర్వము ఇరుకుగను, సంకుచితముగను, చిత్తుగను కనిపించును. సభాస్తంభముల యొక్కయు, దాని పై భాగ ముననున్న కొన్ని చిన్న గదుల స్తంభముల యొక్కయు అల్ప పరిమాణములు ఈ వికృతపరిస్థితిని మరింతగా అధికము చేయుచున్నవి. వాస్తు శిల్ప సంబంధ విశేషములు వేర్వేరుగా పరికించినచో గొప్ప పరిశ్రమను, కౌశల్యమును చాటుచున్నను, ఈ పై లక్షణములు దేవాలయము యొక్ష ఆకార పథకమునందు వివిధాంగము లను పొందిక గాగూర్చు విజ్ఞానము మృగ్యముగా నున్నట్లు వెల్లడిచేయుచున్నవి. ఈశిల్ప విశేషములు సృజనాత్మక ప్రయత్నస్థానమున ఆత్మవిహీనమగు ప్రయత్నమును నిలిపి ఏదో ఫలితమును చూపించ దలచినట్లుండుటచే ఇందలి కళ తంత్రవిధానముగ దిగజారి పోయినట్లు గోచరించును.

ఈ గుహలయందలి శిల్పవిన్యాసము సమర్థమైన కార్య కౌశల్యమును ప్రదర్శించి మతవిషయక ప్రసన్నతా భావమును వెలిబుచ్చుచుండును. కాని మహనీయోజా త్తత యందు బౌద్ధ గుహాశిల్పమునుగాని, శక్త్యుత్సాహము లందు బ్రాహ్మణగుహాశిల్పమునుగాని ఇచ్చటి శిల్పవిన్యాసము పోలజాలదు. ఇచ్చటి కళ ఏదో వేరు విధానముగా నున్నది. శిల్పలేఖనములు కొన్ని ధార్మిక సిద్ధాంతముల ననుసరించి యున్నవి. ఇవి శిల్పియందు సృజనాత్మకశక్తి లోపించి యుండినట్లు చూపును.

పుష్పసంబంధమైనట్టియు, ఆభరణ సంబంధమైనట్టియు నమూనాలు, పౌరాణికములో, వాస్తవికములో అగు జంతునిరూపణకు సుప్రసిద్ధమగు సంప్రదాయ పద్ధతులు, లేక తాత్వికములయిన అల్పవిషయములు మున్నగు వాని కేవల అలంకరణ కల్పనలందు జైన శిల్పకారుని నైపుణ్యము బ్రాహ్మణ- బౌద్ధ శిల్పకారుల నైపుణ్యమునకు తీసిపోదు. కల్పనా సమృద్ధియందును, సంక్లిష్టములైన అలంకరణ విస్తారముల సంపూర్ణత యందును జైనశిల్పి బ్రాహ్మణ బౌద్ధ శిల్పులను కూడ మించగలడు. అత్యాడంబర భూయిష్ఠమయిన (lavish) జైనకళ మొత్తము మీద సామాన్యశిల్పి కల్పనకు అననుగుణముగా నుండి, సంస్కృతీకూన్యమయిన అభిరుచిని, సద్వివేక రహితమయిన, నిర్ణయమును వెల్లడిచేయుచున్నది.

ఈ గుహాలయములందలి చిత్రలేఖనములలో ముఖ్యముగా ఇంధ్రసభ యొక్క యు, జగన్నాథసభ యొక్క యు విహారములయందు గల అపురస చిత్రములు అజంతా యందలి తత్ప్రతిబింబములకు తుల్యముగా నున్నవి. అప్పుడపుడు ఈ గుహాలయ నివాసులగు సాధువులు కల్పించిన నిప్పుపొగల మూలమున ఈ చిత్రలేఖనముల అసలు వర్ణములు చెడిపోయినవి. ఐనప్పటికినీ, సాయంకాలిక సిందూరవర్ణ కలితములైన మేఘముల యొక్క మధ్యభాగములందు పయనించు శ్యామవర్ణ భాసురములైన అప్సరసల విగ్రహములు యథాదర్శన చిత్రలేఖన (perspective) పరిణామముతో కనిపించును. ఆ విగ్రహముల అవయవలాలిత్యము, తదాభరణ నేపథ్యములు విరళమైయున్నను, శోభ శ్లాఘ్యముగా పరిదృశ్యమానమగుచున్నది. అన్ని రంగులలోను శిల్పులకు సిందూర వర్ణము నచ్చినట్లు కనిపించును. శిల్పులు అనుకరణమున దక్షులుగనున్నారు. ఇంద్రసభ యొక్క వితానములందలి (ceilings) అప్సరసల విగ్రహములు అజంతా మఠము లందు చిత్రింపబడిన అప్సరసల విగ్రహములు నిలుచు తీరు నందలి సౌందర్యమును, అంగవి జేపమునందలి లాలిత్యమును విస్తారమయిన అలంకారప్రీతిని మాత్రమే ద్యోతకము చేయును. మొత్తముమీద ఎల్లోరాయందలి జైన చిత్రణము అనుకర ణాత్మకమై, సృజనాత్మకశక్తి విహీనమై యున్నది.

పు. శ్రీ.