సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎలకూచి బాలసరస్వతి
ఎలకూచి బాలసరస్వతి :
వంశప్రతిష్ఠ : ఆంధ్ర లక్షణకర్తలలో ఎలకూచి బాల సరస్వతి మిక్కిలి ప్రసిద్ధిచెందినవాడు. ఈ విద్వాంసునిది పండిత వంశము. ఎలకూచి వంశీయులలో పెక్కురు విద్వాంసులై వెలుగొందినట్లు తెలియుచున్నది. బాల సరస్వతి పూర్వులలో నొకడైన తిరుమలయ్య అను మహా పండితుడు వసుచరిత్రకారుడైన రామరాజ భూషణునివలె అళియ రామరాజు సభాభూషణమై ఆ రాజేంద్రునివలన కడుంగడు గౌరవింపబడినట్లును, యెడవల్లి అను గ్రామ మును అగ్రహారముగా బడసినట్లును బాలసరస్వతీయ పీఠికలోని ఈ పద్యభాగమువలన తెలియుచున్నది.
"ఆతిరుమలేంద్రు డళియ రామావనీశ
దత్త యెడవల్లి ముఖ్య సద్గ్రామ హేమ
చామర చ్ఛత్ర పల్యంకికా మణివి
భూషుడై వై దుషీ స్ఫూర్తిఁ బొలుపుమించే"
బాలసరస్వతి తండ్రియైన కృష్ణయార్యుడు ప్రఖ్యాత పండితుడైయుండెను. ఆతడు 'పాకనాటి సకలవండిత కవి జనాచార్యుఁడై 'కీ ర్తి వహించినట్లు బాలసరస్వతియే ఉగ్గడించెను.
తలిదండ్రులు - విద్యాభ్యాస వైదుష్యములు : బాలసరస్వతి తండ్రి కృష్ణయ్య. తల్లి లక్ష్మమ్మ. ఈవై దిక బ్రాహ్మణవంశము వారిది కౌండిన్య గోత్రము. బాలసరస్వతికి ఆదిత్యకవి అను నొకసోదరు డుండెను. ఈసోదరులిరువురు తమ తండ్రి యొద్దనే శాస్త్రాధ్యయనము గావించి పండితులైరి. విద్వద్వా తావరణములో పుట్టి పెరుగుటచే బాల్యముననే విద్వాంసుడనిపించుకొని కృష్ణార్యుని జ్యేష్ఠ పుత్రుడు‘‘బాలసరస్వతి” యను ప్రఖ్యాత బిరుద నామమును వహించియుండునని పరిశోధకులు తలచుచున్నారు. బాలసరస్వతి అనునది సాధారణముగా తెలుగునాటి నామధేయమై యుండదనియు భావించుచున్నారు. నామము నామ ధేయముగా స్థిరపడుట ఆంధ్రులలో క్రొత్తగాదు. కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థాన పండితుడును, బహు గ్రంథకర్త యునగు అగస్త్యపండితుడు విద్యానాథుడుగా ప్రసిద్ధుడైనట్లు పండితులు నిరూపించియే యున్నారు. బాల సరస్వతీ వ్యాకరణాది బహుశాస్త్రముల సభ్యసించెను. వేదాధ్యయనము గావించెను ఆయుర్వేద సంగీతములలో గూడ ఆమేధావి పాటవమును గడించి యున్నట్లుగా ఆతని యాదవ రాఘవ పాండవీయ గ్రంథారంభమున 'వేదశాస్త్రపురాణ వివిధ సంగీత సాహిత్యాది వివిధో పబృంహణుండ’అని యుండుటవలనను, బాలసరస్వతీ యములోని 'బాహటస్థాన నిబంధ నుండ' అను వాక్యమువలనను తెలియుచున్నది. ఇన్నిట మహా విద్వాంసుడు కావుననే ఆతడు మహోపాధ్యాయ బిరుదాంకితుడై వాసికెక్కెను. బాలసరస్వతికి 'సకల భాషాకవితా స్వతంత్ర భట్టారకు'డను వేరొక బిరుదము కూడ మన్నట్లు బాలసరస్వతీయ పరిచ్ఛేదాంత గద్యములవలన విశదమగుచున్నది.
నివాసము : ఎలకూచివారు కృష్ణాతీర వాసులు. కావుననే ఆ ప్రాంతమందున్న పరిటాల (పర్తియాల) జటప్రోలు సంస్థానములలో వీరికి ప్రవేశ సన్మానములు లభించినవి. బాలసరస్వతీ తన చంద్రికాపరిణయ ప్రబంధమును పరిటాల రాజున కంకితము చేసెను. జటప్రోలు సంస్థానాధీశ్వరుడైన సురభిమల్ల భూపాలుని పేర భర్తృహరి సుభాషితములను తెలిగించెను. రసికుడగు మల్లభూపాలుడు బాలసరస్వతిని రెండువేల దీనారములతో బహూకరించెనట. విజయనగరముకూడ వీరిలో కొందరికి ఉనికిపటై యుండెను. బాలసరస్వతి జ్యేష్ఠ ప్రపితామహుడు విద్యానగరములో నుండెను. బాలసరస్వతికి ఆంధ్రశబ్దచింతామణి లభించినదియు విద్యానగరములోనే కావున నీ మహోపాధ్యాయుడును కొంత కాలము విజయనగర వాసము గావించియుండును.
కాలము : బాలసరస్వతి క్రీ.శ. పదునారవ శతాబ్ది మధ్యమునుండి పదునేడవ శతాబ్ది ప్రథమ పాదమువరకును గల కాలమున నుండెను. ఈతనికి కొలది కాలము పిమ్మట నుండిన అప్పకవి తన గ్రంథారంభమును గురించి చెప్పుచు అయ్యది (క్రీ. శ. 1656 నకు సరియగు ) శా. శ. 1578 మన్మథనామ సంవత్సర శ్రావణ బహుళాష్టమి (అనగా శ్రీకృష్ణాష్టమి) నాడు భగవదాదేశమున ఆరంభింపబడినట్లు నుడివెను. అంతియేగాక ఆ ఆంధ్రశబ్దచింతామణి గ్రంథ మంతకుముందే అనగా అప్పటికి సన్నిహితపూర్వమైన కీలక నామ సంవత్సరమున సిద్ధునిచే బాలసరస్వతికి అనుగ్రహింపబడినట్లును, దాని కతడు బాలసరస్వతీయమను టీకను రచించినట్లును చెప్పెను. అప్పకవికిని, బాలసరస్వతికిని దాదాపుగా ఏబది సంవత్సరములు కాలభేదముండు నన్నచో బాలసరస్వతికి పైన సూచించిన సరిపడును. అప్పకవి గ్రంథరచన చేసిన మన్మథ సంవత్సరమునకు వెనుక నుండిన కీలక సంవత్సరము క్రీ. శ. 1609ప్రాంతము కాగలదు. కావున బాలసరస్వతీయము క్రీ. శ. 1610లో వ్రాయబడియుండునని సంభావింప వచ్చును. ఈతని పూర్వుడయిన తిరుమలయ్య అళియరామ రాజుచే గౌరవింపబడుటయు దీనితో సంబద్ధమగుచున్నది.
గ్రంథములు : బాలసరస్వతి బహుముఖమైన ప్రజ్ఞ గలవాడు. ఆతని లేఖిని కావ్యరంగములో పలుభంగిమలు
-
చూపినది. ఆతడు నాటకములు వ్రాసెను. ప్రబంధములు గ్రంథించెను. శ్లేషకృతి నిర్మించెను. వైద్యగ్రంథము ను రచించెను. పురాణము లిఖించెను. తంత్రగ్రంథము వెలయించెను. ఈ మహోపాధ్యాయుడు శతాధిక గ్రంథ కర్తయైనట్లుగా ఆతని యాదవ రాఘవ పాండవీయము లోని 'సారసారస్య సచ్చంద్రికా పరిణయ ప్రముఖ శతాగ్రప్రబంధక ర్త-' అను పద్యపాదమువలన స్పష్ట పడుచున్నది. బాల సరస్వతీయమువంటి శాస్త్ర వ్యాఖ్యాన ములను, మల్లభూపాలీయమువంటి అనువాదములను ఆతడు కావించెను. ఆతని గ్రంథములలో తెలియ వచ్చినవి. కొన్ని ఇవి.
1. రంగకౌముది : ఇది యొక నాటకము యక్షగాన ఫక్కీలో వెలసినదియై యుండును.
2. చంద్రకాపరిణయము : ఇది యొక సరస ప్రబంధము. కాశీరాజు కూతురైన చంద్రికను భీమసేనుడు విశాహ.మాడిన కథ ఇందు వర్ణింపబడినది. ఈ గ్రంథము బెజవాడకు రెండామడల దూరములోనున్న పరిటాల అను నొక సంస్థానమును పాలించు జూపల్లి వెంకటాద్రి యను నాతని కంకితము కావింపబడెను.
3. మల్లభూపాలీయము : ఇది సుప్రసిద్ధమైన భర్తృహరి సుభాషితమునకు ఆంధ్రానువాదము. సుభాషితము నాంధ్రీకరించిన ఇతరకవులలో పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి అనువారలు ప్రసిద్ధులు. వీరిలో బాలసరస్వతియే మొట్టమొదట సుభాషితమును తెనిగించినవాడు. అతడు తన అనువాద గ్రంథమునకు మల్లభూపాలీయమని పేరుపెట్టెను. 'సురభిమల్లా నీతివాచస్పతీ'- 'సురభి మల్లామానినీ మన్మథా' - 'సురభి మల్లా వైదుషీ భూషణా' - అని నీతి శృంగార వైరాగ్య శతకములకు తగినట్లుగా మకుటము పెట్టి సురభి మల్లభూపాలునికి అంకితముగా ఈ గ్రంథమును రచించేను. ఈ సురభి మల్లభూపాలుడు హైదరాబాదు రాష్ట్రములోని జటప్రోలు సంస్థానమున కధీశ్వరుడైన వెలమనాయకుడు.
4. యాదవరాఘవపాండవీయము : ఇది యొక త్య్రర్థి కావ్యము. శ్లేషతో నొక పద్యమును రచించినను కావ్యజ్ఞులు మెచ్చుదురట. పూర్తిగా నొక కావ్యమునకు కావ్యమే శ్లేషలో నిర్వహించినవారగుట పింగళి సూర నార్యుడును, రామరాజభూషణుడును విశేష ప్రతిభావంతులుగా కీర్తింపబడినారు. అట్టియెడ మూడర్థములు వచ్చునట్లు సంపూర్ణ శ్లేష ప్రబంధమును నిబంధించిన బాలసరస్వతి అసాధారణ ప్రజ్ఞాన్వితుడనుట అతిశయోక్తి కాదు. తెలుగులో వ్యర్థికావ్యమును రచించినవారిలో నీతడే ప్రథముడు.
5. బాలసరస్వతీయము : ఇది ఆంధ్రశబ్ద చింతామణి యను వ్యాకరణ గ్రంథమునకు వ్యాఖ్యానము. బాలసరస్వతి అఖండకీర్తికి హేతువై నదీ యుద్ధంథమే. ఆంధ్ర శబ్ద చింతామణి, కవితాయుగారంభకుడైన నన్నయ భట్టారకునిచే రచింపబడినట్లు భావింపబడుచున్నది. సూత్రాత్మకములగు ఆర్యాగీత్యుద్గీతి రూపములగు సంస్కృత శ్లోకములతో, ఐదు పరిచ్ఛేదములతో ఈ ఆంధ్ర వ్యాకరణము వెలయుచున్నది. డాలసరస్వతి శ్లోకగత సూత్రములను విడదీసి, సూత్రార్థమును తెనుగులో వ్రాసి, పద నిష్పత్తిని చూపి వివరించెను. ఈ కలియుగములో ఆంధ్ర భాషకు చేకూరిన మొట్టమొదటి వ్యాకరణము ఈ ఆంధ్రశబ్ద చింతామణియే అనియు, అయ్యది నన్నయ భట్టారకునిచే రచింపబడెననియు, ఆ గ్రంథము చిర కాలము లుప్తప్రాయమైయుండి దై వచోదనమువలన తనకయ్యది యొక యోగివర్యుని మూలమున లభించె ననియు బాలసరస్వతి చెప్పెను.
'.... మున్నొకనాడు విద్యానగరిలో నచింత్యకారణో పొగమ స్నేహసాహచర్యుండగు శివయోగివర్యునిచే దైవ చోదనం బరిప్రాప్తమైన ఆంధ్రశబ్ద చింతామణి గ్రంథమునకు లోకోపకారార్థంబుగా టీక గావింపగోరి నెమ్మనమ్మున
'ఏమిమహాద్భుతంబిది హరి హరి !
యెక్కడి యాంధ్ర శబ్ద చిం
తామణి పక్కి, యెక్కడి
మతంగనగంబు యుగాది సంభవుం
డై మని చన్న నన్నయ మహాకవి
యెవ్వడు, సిద్ధుఁ డెవ్వ డా
హా ! మదగణ్య పుణ్య సముద్రగతఁ
జేరుఱెఁ గాథేయిన్ని యున్.'
'ఇలఁ బ్రజ్ఞాధికులౌ కవుల్ మునుపు
లేరే? వారు వ్యాఖ్యానక
ర్తలు గానోపరె! పెక్కు వత్సరము
అంతర్భూతమై యున్న యీ
తెలుగు వ్యాకరణంబు నాకొసఁగెఁ
బ్రీతిన్ డీకఁ గావింపు మం
చల సిద్ధుండు మదిష్ట దేవత
విరూపాక్షుండు నిక్కంబుగన్. '
బాలసరస్వతి తెలిపినట్లుగానే అతనికి పిమ్మట కొంత కాలమునకు చింతామణికి తెలుగువివరణమైన అప్పకవీయమును రచించిన అప్పకవియు తన కాంధ్రశబ్దచింతామణి లభించిన విధమును వివరించుచు నన్నయభట్టు ప్రణీతమైన ఆంధ్రశబ్ద చింతామణిని భీమన అడంచెననియు, దానిని బాల్యమున చదివియున్న రాజరాజనరేంద్రుని పట్టి సిద్ధుడై చిరకాలమునకు బాలసరస్వతీ కిచ్చెననియు, తనకును ఒక విప్రునివలన చింతామణి ప్రతి యొకటి లభించగా దానికి తాను వివరణము రచించినట్లును నుడివెను. అహోబల పండితుడుకూడ తన క విశిరోభూషణమున నీ చింతామణి గ్రంథలాభమును గురించి చెప్పేను. చింతామణి గ్రంథము లభించిన పిమ్మట వెలసిన తెలుగు వ్యాకరణము లన్నియు నించుమించుగా దాని నాధారముగా జేసికొని ప్రవర్తిల్లినవే.
ఆంధ్రశబ్ద చింతామణి కర్తృత్వము : ఆంధ్రశబ్ద చింతామణి నన్నయ భట్టారక కృతముకాదని విమర్శకులు కొంద రభిప్రాయపడిరి. అందలి సూత్రములకును నన్నయరచిత భారత భాగములోని ప్రయోగములకును సమన్వయము కుదురకుండుట ఇట్టి యభిప్రాయమును సమర్థించు కారణముగా వారు చెప్పుచున్నారు. అంతియేగాక తెలుగు వ్యాకరణము రచించినవారిలో ప్రాచీనుడైన కేతన, తనకుముందు తెనుగులో వ్యాకరణ మెవ్వరును రచించి యుండలేదనియు. తన ఆంధ్రభాషా భూషణమే మొదటి వ్యాకరణ గ్రంథమనియు చెప్పియుండుటగూడ ఆంధ్రశబ్ద చింతామణి యంతకుముందు లేదనుటకు యుక్తి యగు చున్నదని వీరందురు. బాలసరస్వతికి ముందున్న కవి చింతామణికర్త వెల్లంకి తాతంభట్టు, కవిలోకనంజీవిని వ్రాసిన ముద్ద రాజురామన్న, కావ్యాలంకార చూడామణి కారుడు విన్నకోట పెద్దన్న మున్నగు నాంధ్ర వైయాకరణులెవ్వరును ఆంధ్రశబ్ద చింతామణి నెరిగియున్నట్లుగాని, పేరు విన్నట్లుగాని, చెప్పియుండ లేదు. అది నన్నయభట్టు ప్రణీ తమేయైన పక్షమున వారదానిని గౌరవభావమున స్మరించియే యుందురు. కావున ఆంధ్రశబ్ద చింతామణిని బాలసరస్వతియో మరియొకరో రచించి గ్రంథ గౌర వాపొదనమునకై నన్నయభట్టు పేరు పెట్టి యుందురని కందుకూరి వీరేశలింగము వంతులుగారు మొదలైన విమర్శకు లూహించి యున్నారు.
పండిత విమర్శకులు కొందరు బాలసరస్వతి చింతామణి వ్యాఖ్య రచించెనే కాని మూలము నన్నయభట్ట ప్రణీతమే యని విశ్వసించుచున్నారు. బాలసరస్వతి వంటి వైష్ఠికుడు తాను రచించిన గ్రంథమును నన్నయభట్టు రచించి నట్లు చెప్పి అసత్యదోషమునకు పాల్పడియుండెననుట ఉచితము కాదని వీరందరు అతని కాంధ్రశబ్ద చింతామణి లభించిన విధ మేమంత అసహజముగా లేదనియు, లుస్తములైన గ్రంథము లెన్నియో కాలాంతరమున లభించేనన్న ఆశ్చర్యపడవలసిన యవసరములేదనియు నుడువుదురు. కాళిదాసు నకు పూర్వుడై నభాస మహాకవి రచించిన నాటకములు లుప్తములై పోయినవని భావింపబడినవి. కేరళములో గణపతిశాస్త్రి వర్యులకు అధునాతన కాలమున లభింప లేదా యని యడుగుచున్నారు. కేతనాదుల కాలమున మరుగుపడి యున్నందున వారద్దాని ప్రశంసచేయకుండుట సహజమే అనుచున్నారు. ఇక భారత ప్రయోగములకును, చింతామణికిని సమన్వయము లేకపోవుటకు చింతామణిలో ప్రక్షిప్తములు ప్రవేశించుటయే కారణమై యుండుననియు సమాధానము చెప్పు చున్నారు. చింతామణిలో నన్నయకంటే అర్వాచీనులగు అథర్వణాదుల పేళ్ళు కనబడుటయు దానిలో ప్రక్షిప్తములు చేరినవనుటకే తార్కాణ మగు నని సమాధానము చెప్పుచున్నారు. బాలసరస్వతినాటి చింతామణికిని, అప్పకవి నాటి చింతామణికిని పాఠభేదములు పెక్కు కనబడినవనియు వానిలో బాలసరస్వతి పాఠములనే తాను స్వీకరించితి ననియు కవిశిరోభూషణ కర్తయగు అహోబల పండితుడు వాకొన్నాడు. అట్టి అనతికాలముననే పాఠ భేదములు దొర్లినపుడు పదునొకండవ శతాబ్దమునాటి పుస్తకములో కొన్ని కూర్పులు మార్పులు చేరుట అసంభావ్యము కాదనియు వారు తలంచు చున్నారు. అప్పకవి చెప్పిన సారంగధరుడు సిద్ధుడై చింతామణిని తిరిగి ప్రసిద్ధికి తెచ్చెనన్న వృత్తాంతము పరంపరాయాతమైన కట్టుకథ వంటిరేయైనను అంతమాత్రముచేత నన్నయకు చింతామణి కర్తృత్వ మపహతము కాదనియు, చింతామణి చిరకాలము పఠన పాఠనములలో లేక అంతర్భూతమై యుండెననుటనే సూచించుననియు నుడువుచున్నారు.
బాలసరస్వతి ఈ ఆంధ్ర వ్యాకరణ భాష్యమును 'లోకోపకార సుకృతకీర్తి లాభముల' నర్థించి వ్రాయ సమకట్టి నట్లు చెప్పియున్నాడు. ఈ సందర్భమున బాలసరస్వతి —'ఇలఁ బ్రజ్జాధికులౌ కవుల్ మునుపు లేరే... అలసిద్ధుండు మదిష్ట దేవత విరూపాకుండు నిక్కంబుగన్'-' అను పద్యమూలమున ప్రకటించిన భావము 'ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీ యుర్విన్ బురాణావళుల్ ... సఫలంబు జేసెద పునర్జన్మంబు లేకుండఁగన్' అనిన పరమ భాగవతుడగు పోతనగారి భావమునకు సన్నిహితమై మహోపాధ్యాయుని పవిత్ర జీవితమును తెలుపుచున్నది.
బాలసరస్వతి తాను రచించిన చింతామణి వ్యాఖ్యను 'నా యాప్త దేవతయగు నంతాదేవి కర్పించువాడ' నని దుర్గాదేవి కంకిత మొనర్చినాడు. గ్రంథారంభమున 'హరినిర్జరశాఖ సమాశ్రయించెదన్-' అని విష్ణుస్తుతి చేసి నాడు. పిమ్మట '_మదిష్ట దేవత విరూపాతుండు నిక్కంబుగన్ అని శివు నిష్ట దైవతముగా బేర్కొన్నాడు. దీనిని బట్టిచూడ నీ విద్వాంసు డద్వైతీయని స్పష్టపడును. ఈ మహోపాధ్యాయు డింకమ బాహట, విప్రవామన పురాణ, భ్రమరగీత, దక్షిణకాశికా తంత్రాదులగు ననేక గ్రంథములను రచించి వాఙ్మయ సేవ గావించిన ధన్యజీవి. కావుననే—'బాలసరస్వతిని పోలు ప్రాజ్ఞులుగలరే-'అని విద్వాంసులచే కొనియాడబడెను.
చె. రం.