సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎఱ్ఱాప్రగడ
ఎఱ్ఱాప్రగడ : ఎఱ్ఱన శ్రీవత్స గోత్రుడగు నియోగి బ్రాహ్మణుడు. వెలనాటి చోడునిచే మన్ననలందిన భీమనమంత్రి ఎఱ్ఱన తాతకు తాత, ఎఱ్ఱన తాత ఎఱపోత సూరి శ్రీమ దహోబల నృసింహభక్తుడు. వేగినాటిలో కరాపర్తి వృత్తి మంతుడు. తండ్రి సూరన్న "ప్రాజ్ఞప్రస్తుతభవ్యభోగ విభవస్సారాత్ముడు, ఆరాధ్యసర్వజ్ఞుండు, అప్రతిమాద్భుతో భయ కవిత్వప్రౌడు" డని వర్ణింపబడెను. పోతాంబ ఈతని తల్లి. “నిత్యశివరాత్రివ్రత తత్పరుడగు శంకరస్వామి మునీంద్రుడు" ఎఱ్ఱనకు శివదీక్షా గురువు. ఈత డిట్లు శివ భక్తుడై శంభుదాసుడని పేరు వహించినను "గోవింద గుణాదర సంభృత సౌమనస్యధన్యుడ" నని చెప్పుకొన్నాడు. ఏర్చూరి శాసనుడొకడు కొక్కోకకర్త యొకడు మరి యిర్వు రెఱ్ఱనలు శ్రీవత్సగోత్రులున్నారుకాని కవిత్రయ మందలి ఈ యెఱ్ఱన వేరు. చదలువాడ ఈతని వంశ స్థానమై యుండును. కావుననే వీరికి చదలు వాడ వారని ఇంటి పేరు వచ్చినది. ఎఱ్ఱన తండ్రినాటనో, తననాటనో నీలకంఠేశ్వరస్థానమగు గుడ్లూరు చేరెను. అచటనే భారతారణ్యపర్వ శేషము పూరించి ప్రబంధపర మేశ్వరత్వము వహించెను. అచటనుండగనే శూర శేఖరుడు కవితా ప్రియుడునగు మల్లా రెడ్డితో పరిచయ మయ్యెను. ఈ మల్లారెడ్డి అద్దంకి నేలు ప్రోలయ వేమారెడ్డికి తమ్ముడు. క్రీ. శ. 1323 ప్రాంతమున కాకతీయ సామ్రాజ్య మస్తమించినది. అప్పటి కప్పుడే కాకతీయ సేనానులు స్వతంత్ర రాజ్యములు నెలకొల్పుకొని తురుష్క సేనా వాహినుల నిలువరించుచుండిరి. వారిలో అద్దంకి రాజధానిగా చేసికొన్న రెడ్డి ప్రభువులు క్రమముగా కొండవీడున, రాజమహేంద్రవరమున దుర్గములు నిర్మించుకొని తూర్పుసముద్రతీరము వెంట తమ రాజ్యమును విస్తరింప జేసిరి. స్వయము కవులు, గ్రంథకర్తలు, వ్యాఖ్యాతలు నగు ఈ రెడ్డి రాజులు తమ యాస్థానములను సరస్వతికి కొలువు చవికెల నొనర్చి శ్రీనాథాది సంస్కృతాంధ్ర కవుల నెందరినో పూజించి శాశ్వతకీర్తి గడించుకొనిరి. ఈ రెడ్డి వంశములో ప్రథముడగు ప్రోలయ వేమా రెడ్డి క్రీ. శ. 1324.1353 వరకు రాజ్యమేలెను. వేమా రెడ్డి తమ్ముడు మల్లారెడ్డి మహావీరుడై రెడ్డిరాజ్యమునకు పెట్టనికోటయై గుడ్లూరు, చదలువాడ ప్రాంతములను రాజప్రతినిధియై పాలించుచుండెను. అత డిట్లు ఎఱ్ఱన కాశ్రయమిచ్చి ఆ కవిరత్నమును తన అన్నకు కాన్క వెట్టెను. భారతారణ్య పర్వశేషము, రామాయణము,భారతారణ్యపర్వశేషము, నృసింహపురాణము, హరివంశము ఎఱ్ఱన కృతులు, వీనిలో భారతారణ్యపర్వ శేషము మొదటి కృతి.
నన్నయ ఆరంభించిన భారతరచనము మున్నూ రేండ్లకు ఎఱ్ఱన చేతిమీదుగా ముగిసినది. "ఆది దొడంగి మూడు కృతులు...ఒనర్చె... నన్నయభట్టు దక్షతన్" అని తిక్కన చెప్పిన దానినిబట్టి చూడగా నన్నయ అరణ్యపర్వము పూర్తి చేసినటులే కనిపించును. కనుకనే తిక్కన నాల్గవదగు విరాటపర్వము ఎత్తికోనెను. అరణ్యపర్వాంతమందు ఎఱ్ఱ నార్యుండు సకల లోకైక విదితుడైన నన్నయభట్ట మహా కవీంద్రు సరస సారస్వతాంశ ప్రశస్తి తన్ను జెంచుటయు సాధుజన హర్ష సిద్ధిగోరి "ధీరవిచారుడు తక్కవితారీతీయు కొంత దోఁప తద్రచనయకా నారణ్యపర్వ శేషము పూరించెఁ గవీంద్ర కర్ణపుట పేయముగాన్" అను పద్యములు కనిపించుచున్నవి. వీనివలన నన్నయ రచింపగా అరణ్యపర్వము కొంత శేషించినట్లు, దానిని ఎఱ్ఱన పూరించినట్లు స్పష్టమగుచున్నది. దీనికి తగినట్లుగా భారతారణ్య పర్వప్రతు అన్నింటిలో నాల్గవ ఆశ్వాసము 143 వ పద్యము నుండి "ఎఱ్ఱనకవిత్వం" అని వ్రాసియున్నది. ఇంతేకాదు. నన్నయ, అధర్వణుడు, భీమకవి - ఈ మువ్వురి విరోధాలను గూర్చిన కథలు కల్పితములే యైనను నన్నయ రచన ఆరణ్యపర్వ మధ్యభాగమం దాగిపోయినదను జనశ్రుతికి బలము చేకూర్చుచున్నవి. . "రెండు పర్వములు, మూడవ పర్వము నాల్గవ ఆశ్వాసములోని 142 పద్యములు మాత్రము నన్నయచెప్పె” నని పద్యములో వివరించుటకు వీలుపడదు కనుక తిక్కన "మూడుకృతులు" అని స్థూలముగా చెప్పి విడిచినట్లైంచు కొనవలెను అట్లు కాక తిక్కననాటికి మూడు పర్వములు పూర్తిగా నుండె ననుకొన్నచో ఎఱ్ఱన చేసినది శిథిల భాగ పూరణము మాత్రమే యగును. "తత్కవితారీతియు గొంతదోప" అని ఎఱ్ఱన చెప్పిన మాటకూడ ఈ యనుమానమును దృఢ పరచుచున్నది. ఆరణ్యపర్వాంత మందున్న ఆ రెండు పద్యములు ప్రథమపురుషలో నున్నవి గనుక వాని నెవరో రచించి చేర్చిరేమోయని యను కొందమన్నచో భారతప్రతు లన్నిటను అట్టి చేర్పు జరిగియుండదు. నన్నయకూడ భారతావతరణికయందు తన్ను గూర్చి ఇట్లే ప్రథమపురుష యందే చెప్పుకొనుటకూడ ఈ యూహకు బాధకమగును. ఆరణ్యపర్వాంతమందలి ఈ రెండు పద్యము లిట్లు సందేహాస్పదములుగా నున్నవి గనుక వానిని వదలి ఇతర సాక్ష్యములు పరీక్షించము.
నృసింహ పురాణములో ఎఱ్ఱన “ప్రబంధ పరమేశుఁ డనంగ ఆరణ్యపర్వ శేషోన్నయ మంధ్రభాష సుజనోత్సవ మొప్పగ నిర్వహించితి" నన్నాడు. "కతివయాక్షర పరిగ్రహజనితంబైన నైసర్గిక చాపలంబు కతంబున - ప్రాఢాం చితశబ్దసారులు మహాకవులాద్యులు కావ్యశయ్య గీలించిన కీర్తి సంగసుఖలీలకు నేనును గాంక్ష చేసితిన్"అని చెప్పికొన్న ఎఱ్ఱనవంటి పరమవినీతుడు తాను చేసినది ఆరణ్య పర్వ శిథిల పూరణమేయైనచో దానిని గ్రంథముఖమున ఇంతగా గొండాడికొనడు. ఎఱ్ఱయ వంశములోని చదలు వాడ మల్లన కవికూడ తన విప్రనారాయణ చరిత్రలో "ప్రతిభతో నారణ్య పర్వ శేషముచెప్పె కవులకు చేవులపండువులు గాగ" అని నిజవంశకర్తయైన ఎఱ్ఱనను స్తుతించెను. ఇంత యెందుకు ? భారతము పూర్తియైన ఈ యారువందల వత్సరముల నుండి ఆంధ్రకవీశ్వరులందరు ఎఱ్ఱనను భారత కవిత్రయముతో చేర్చి నమస్కరించిరి. నన్నయ రచించిన 'శారదరాత్రులు' అను తుది పద్యముతో ఎఱ్ఱన రచనలో ఆద్యమైన "స్ఫురదరుణాంశురాగరుచి" అను పద్యమును పోల్చి చూచినచో “నన్నయభట్ట మహాకవీంద్ర సరస సారస్వతాంశ ప్రశస్తి" ఎఱ్ఱన్నను చెందినదనుటకు సందేహింపబనిలేదు. కనుకనే "తత్క వితారీతీయు గొంతదోప"అనుమాట అన్వర్థమగు చున్నది. ఆంధ్రకవులలో ఇంతటి గుణోత్తరుడు మరియొకడు కనుపించడు. అరణ్య పర శేషరచనను నన్నయపై గల భక్తి చే ఆ మహాకవీంద్రునకే ధారపోయు ఔదార్యము ఎఱ్ఱన్నపట్ల సాజమని నమ్మవచ్చును.
ఎఱ్ఱన రాజాశ్రయమంది రామాయణ, హరివంశములు రచించి, ప్రోలయ వేమారెడ్డికి కృతి యిచ్చెను. హరి వంశమున “రామకథ ముఠా జెప్పించి అత్యుత్తమ ఖ్యాతిం జెందితి" నని యున్నది కాన ఎఱ్ఱన రామాయణమే తొలుత రచించెను. ఆ రామాయణము లక్షణ గ్రంథములం దుదాహృతమైనది. ఇన్నూ రేండ్ల క్రిందనున్న కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణసార సంగ్రహమున ఎఱ్ఱన రామాయణమునుండి పద్యము లుదాహరించెను. అట్టి మహా గ్రంథ మిప్పుడు లభింపకపోవుట దురదృష్టము. సర్వలక్షణసార సంగ్రహమందలి వికాక మరికొన్ని పద్యములు ఎఱ్ఱన రామాయణములోనివి వేరొక సంకలిత గ్రంథమున నున్నవని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు భారతిలో ప్రచురించిరి. ఆ యీ పద్యములంబట్టి చూడగా మల్లన విప్రనారాయణ చరిత్రమున "వల్మీకథవు వచోవైఖరి రామాయణంబు నాంధ్ర ప్రబంధమ్ముచేసె" అని చెప్పినట్లు ఎఱ్ఱన యథా వాల్మీకము గానే రామాయణము రచించియుండనోపు,
మల్లన చెప్పిన క్రమమునుబట్టి నృసింహ పురాణ మీతడు రామాయణమునకు పిమ్మట రచించినట్లే ర్పడుచున్నది. హరివంశము: నృసింహపురాణ ప్రసక్తిని ఎఱ్ఱన ఎత్తలేదు.నృసింహ పురాణమున రామాయణ హరివంశముల ప్రసక్తియులేదు. రాజాశ్రయము పొంది గ్రంథములు కృతులిచ్చి భోగభాగ్యము లనుభవించి విసివిన చరమవయస్సున ఎఱ్ఱన నృసింహపురాణము పరమేశ్వరాంకితముగా చెప్పేనని కొందరందురు. కాని ఆరణ్యపర్వశేష హరివంశములలో మొదటి దానికే నృసింహపురాణ శైలి దగ్గరి చుట్టమని తోచును. అహో బలనృసింహ భక్తుడగు ఎఱ్ఱన తాత ఎఱపోత సూరి కవికి స్వప్న మునగన్పించి నృసింహావతారమును ప్రస్తుతింపుమని కోరెను. ఇందలి కథ “బ్రహ్మాండాది పుఠాణేక్తం" బని ఎఱ్ఱన వచించినను విష్ణుపురాణము నుండి కూడ కొంత ఆంధ్రీకరించినటుల శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు నృసింహపురాణ పీఠికయందు వాకొనిరి. ప్రధానకథయందు మార్పులు చేయకున్నను వర్ణనాదికములచే పెంచి ఎఱ్ఱన ఈ పురాణమును ప్రబంధ మొనర్చి తన ప్రబంధ పరమేశ్వరత్వమును సమర్థించుకొనెను. తిక్కన తన భారతమును "ప్రబంధమండలి" అని చెప్పుకొన్నాడు. కానీ సన్ని చోడుని కుమారసంభవము, ఎఱ్ఱన నృసింహపురాణము - ఈ రెండును ఆంధ్రమున మొదటి ప్రబంధములని చెప్పవచ్చును. ఈ రెంటిలో నన్ని చోడుడు తెనిగించిన మూలగ్రంథము కూడ కావ్యమే కావున దానికి కావ్యలక్షణము లేక్కువగా పట్టినవి. పురాణకథను పునఃపాఠము పట్టుటలో సోముని హరివంశమునకును ఈ సృసింహవురాణమునకును పోలిక చెప్పవచ్చును. శ్రీనాథుడు పోతన మున్నగు కవులకు సోమునిరీతియే ఎక్కువగా ఆచార్యకమైనను పోతన ప్రహ్లాద చరిత్రమందలి "పానీ యంబులు ద్రావుచున్ గుడుచుచున్" 'అంధేందూరయముల్" మహాబధిరశంఖారావముల్”“కమలాక్షునర్చించు కరములు కరములు" మున్నగు పద్యరాజములు పెక్కింటికి ఎఱ్ఱన పద్యములే ఒరవడి పెట్టెను.
ఎఱ్ఱన కృతులలో హరివంశమే తుది కబ్బమని చెప్పవచ్చును. దీనిని వేమా రెడ్డికి కృతిగా జాతడు రచించెను. "హరివంశము భారతపరాంశమని బుధులింపారగ జెప్పుదురు" అన్నాడు ఎఱ్ఱన. భారత పూర్వాంశమున శేపించిన ఆరణ్యపర్వము చెప్పిన ఎఱ్ఱన ఈ పరాంశమును గూడ తెనిగించి కృతార్థుడ నౌదునని తలపోసి యుండును.
ఎఱ్ఱన హరివంశమును, నాచనసోముని ఉత్తర హరి వంశమును ఇంచుమిం చొక కాలమందే పుట్టినవి. "నవీన గుణసనాథుడ" నని గద్యలో చెప్పికొన్న సోమునకు ఎఱ్ఱన హరివంశము పట్ల ఇంచుకంత స్పర్థ యుండెనను కొన్నను దోషములేదు. సోముడు పూర్వ హరివంశమును గూడ చెప్పెనో లేక తన "నవీనగుణసనాథత్వమును" మెరయించుటకు అనువైన ఉత్తర హరివంశ భాగమును మాత్రమే తెనిగించెనో చెప్పలేము. ఆయీ కారణములచే విమర్శకు లీయిద్దరి హరివంశములను పోల్చి, ఎక్కువ తక్కువలు నిరూపింప జూతురు. నిజమున కీ రెండు గ్రంథములకు పోలికయేలేదు. రీత్యాభిమానియైన సోమన కావ్య ప్రబంధ కవులలో ఆద్యుడు. సరళ సుందర కవితాభిరాముడైన ఎఱ్ఱన పురాణకవులలో తుదివాడు.. “గౌతమ వ్యాసము"లను గ్రంథములో చెప్పినట్లు సోమునిది రజః ప్రధానమై పట్టపగ్గాలు లేని కవిత; ఎఱ్ఱనది సత్వ సంయమితమైన సుందర సృష్టి.
పురాణేతిహాసములు కథా ప్రథానములు. లొతుపాతులందును పరవునందును అవి కులపర్వత మహా సముద్రముల వంటివి. సర్గ ప్రతిసర్గ మన్వంతర పురాణ రాజన్య కథా కథనమున ఆ రెంటికి సామ్యమున్నను అవి ధర్మోస దేశము చేయుమార్గములు వేరు. పురాణమున ఈశ్వరుడు భూమి కవతరింపగా ఇతిహాసమున మానవుడు దివ్యత్వము నధిరోహించును. కావున పురాణముచేయు ధర్మోపదేశము ప్రత్యక్షము. ఇతిహాసము మానవుని శుభాశుభ కర్మల వెనుక సూత్రధారిత్వము వహించి నడిపించు కర్మఫల ప్రదాతయైన దైవమును పరోక్షమార్గమున దర్శించును. కనుక ఇతిహాసము పరోతమార్గమున ధర్మోపదేశముచేయును.
ధర్మోపదేశము చేయు మార్గమునుబట్టి పురాణేతిహాసముల రచనాశిల్పమందుకూడ విభేదము కనుపించును. నన్నయశిల్పము పురాణ రచనమునకు, తిక్కనది ఇతిహాస రచనమునకు అలవడినవి. అందొకరు హోమధూమ పవిత్రితములగు ఋష్యా శ్రమములందలి సరళజీవన మాధుర్య మును, రెండవవారు నగరములయు, రాజకులములయు, స్కంధాకారములయు ప్రగల్భ రమణీయ నాగరవృత్తి మును చెప్పుటలో దిట్టలు. ఉదారమధురములగు నన్నయ సూటిమాటలు పురాణఫక్కిలోనివి. తిక్కన వక్రోక్తి వ్యంగ్య చమత్కృతులు ఇతిహాస మార్గములోనివి. ఎఱ్ఱన ఈ రెండు మార్గములందును దిట్టయగుటేకాక హరివంశమున గొల్లపల్లెలను, పసిగాపులు జానపదవృత్తమును పరామర్శించుటలో నూతన ప్రపంచస్రష్ట యనిపించుకొనెను. అంభారవములతో "దధిమథన సంజాత మధురతర సంగీతములతో మోహనములగు దోహనరవములతో ముఖరితములైన గొల్లపల్లెల విసర్గ రమణీయతచే ఎఱ్ఱన హరివంశ కావ్యతీర్థము నిండారి, నునుపెక్కి, తేటలు దేరి ప్రవహించును, పుష్పిత ఫలిత తరుసంతానముల నీడలచే చలువలూరు యమునాతీరము, దాని వెంట ముళ్లకోరళ్లలో విశాలములైన పెరళ్ళు, అందు వేగు బోకల పోకుమేసివచ్చి నెమరు నురువులచే దెలుపారు మోములతో సుఖశయానలైన మొదవులు, వేర్వేర పిలువబడు తల్లుల నామపరిచయమువలన పొదులనుండి హర్ష ప్రతిస్వనములతో ఒండొంటి దాటుకొని, అభిముఖములై వచ్చు లేగల ఉత్సవ సంచార పారవశ్యములు పలువిధములైన పసిగావు పరామరికలచే నేమరక ఆరణ్యవృత్తముతో గలిసిన తమ జాతిస్వభావమునుబట్టి యిచ్చు ఎఱ్ఱనెరలతోడి కపిలకన్నుల వెడగు జూపులతో నెల్లెడల దిరుగు గొల్లలు, జలాహరణ శిశు సమాశ్వాసన దధిమధనాది గృహవృత్తముల నిమగ్నలైన గోపికల రుచి రోదాత్త చేష్టితములు" - ఇట్టి మధుర దర్శనముచే సర్వ ప్రకారసుందరమైన ఘోషజీవన సర్వస్వమీ హరివంశమున అడుగడుగునను అందముట్టిపడుచుండును. భాగవత దశమ స్కంధ మొక్కటే దీనితో తులతూచదగినది. పోతన భక్తిపారవశ్యము గోపాలకృష్ణుని పరమేశ్వర విఘాతిని పట్టి యిచ్చినట్లు ప్రాకృత బాలకుడగు నందకిశోరుని లీలా మౌగ్ధ్యమును ఎఱ్ఱన వర్ణనమువలె మన కందీయ జాలదు. ఉత్ప్రేవాతిశయో క్తులతో రీతిసముల్లాసతరంగిత మగు సోమనాదుల కవితా శిల్పమున కిందు ప్రవేశము లేదు. శబ్దార్థము లొకదానిలో నొకటి కరగిపోయి ఎఱ్ఱన సృష్టిలో రసమయత్వము దాల్చుచుండును.
"పొలుపొరగా బోరగిలి పొన్ను నాల్గు మూ
లలకును వచ్చుచు మెలగి మెలగి
లలి గపోలమ్ముల గిలిగిలింతలుబుచ్చి
సవ్వింప గలకల నవ్వి నవ్వి
ముద్దులు దొలకాడ మోకాల 'గేలను
దడవుచు నెందును దాఖీ తాజ్
నిలుచుండ బెట్టి యంగుళియూత సూపగా
బ్రీతి దప్పడుగులు పెట్టి పెట్టి
అయ్యగంటి దండ్రినిగంటి నన్నగంటి
నిందురావయ్య విందులు విందు లనుచు
అర్థిదను బిలువగ నడయాడియాడి"
“నోరంజేతులు రెండు గ్రుక్కి కొనుచున్
మోమెల్ల బాష్పాంజన
స్మేరంబై తిలకింపనేడ్చుచు బొరిన్
మీ జేతులం గన్ను లిం
పాఠందోముచు జీవబూని పిఱు దొ
య్యన్ మీది కల్లార్చుచున్
శ్రీ రమ్యాంఘ్రయుగమ్ము గింజికొనుచున్
జెల్వమ్ము రెట్టింపగన్.”
స్వభావోక్తి సుందరమై, 'సుభగసుకుమారమై అన్య కవి దుర్లభమైన ఇట్టి కావ్యసృష్టిచే ఎఱ్ఱన ఆంధ్రసాహిత్య ప్రథమద్వితీయాచార్యులైన నన్నయ తిక్కనల ప్రక్క మూడవపీఠముపై ఆసీనుడాయెను. ఆంధ్రసాహిత్యమున పురాణేతిహాసకర్తలు, కావ్య ప్రబంధ నిర్మాతలు పెక్కు మంది కలరుగాని ఎఱ్ఱన ఒక్కడే ఘోషజీవితమును వర్ణించినవి.
కా.వేం.