సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎఱ్ఱమల
ఎర్రమల :
ఎర్రమల అనగా ఎర్రకొండలని అర్థము. ఇవి తూర్పు కనుమలలోని యొక భాగమైన కడపవరుసలోనివి. ఈ శ్రేణిలో పశ్చిమమున ఎర్రమల, శేషాచలము, పాలకొండ ఉన్నవి. ఇవి కొడవలి యాకారమున నున్నవి.
ఎర్రమలగుట్టలు తుంగభద్రానదికి దక్షిణమున నున్నవి. వీనికి దక్షిణమున శేషాచలమును, తూర్పున నల్లమల గుట్టలును గలవు. ఎర్రముల నల్లమలల నడుమ "కుందేరు" పారుచున్నది. ఈ ప్రవాహ ప్రదేశమునే నంద్యాలలోయ యందురు. ఈ లోయ కృష్ణా తుంగభద్రా సంగమము నుండి కడపవరకు వ్యాపించియున్నది.
ఎర్రమలగుట్టలయందు శ్వార్జ్ (పాలశిల), నాపరాయి లభించుచున్నవి. అచటి వత్సర వర్ష పాతము 40 " అగుటచే కొండలపై పల్చని అడవులు మాత్రము కాననగును. అచ్చటిరాళ్ళు సచ్ఛిద్రములై, పగిలియుండును.
ఈ ప్రాంతపుటడవులందు చెంచులు మొదలగు కొండ జాతివారు నివసింతురు. కొందరు పశువులను మేపు కొనియు మరికొందరు తేనె, వెదురు. కట్టె మొదలగునవి సేకరించి, వానిని విక్రయించుకొనియు జీవితమును గడపుదురు. కొండలోయలయందు మాత్రము సేద్యము కాననగును. అచ్చట చాలవరకు జొన్న పంటయు, అచ్చటచ్చట వరిపంటయు పండును.
యం. వి. రా.