Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎర్నెస్టు హెన్రీ షాకల్ టన్ - సర్

వికీసోర్స్ నుండి

ఎర్నెస్టు, హెన్రీ, షాకల్టిన్, సర్ (1874-1922):

ఇతడు బ్రిటీషు వైజ్ఞానిక పరిశోధకుడు. క్రీ. శ. 1874 ఫిబ్రవరి 15 వ తేదీన ఐర్లాండులో కిల్కీ అను గ్రామములో జన్మించెను. డల్విచ్ కాలేజీలో విద్యాభ్యాసము ముగించుకొని, వర్తక నౌకాయానవృత్తిలో ప్రవేశించెను.

1901 లో దక్షిణధృవప్రాంతమును పరిశోధించవలెనని, బ్రిటీషు రాయలుసొసైటీ, రాయలు జాగ్రాఫికల్ సొసైటీ, రెండును కలిసి, సర్ క్లైమోటు మార్కాం అధ్యక్షతన ఒక పరిశోధక దళమును ఆయత్తము చేసెను. 700 టన్నుల బరువుగల "డిస్కవరీ" అను ఓడను, అయస్కాంత ప్రభా వము లేకుండునట్లుగా ప్రత్యేకముగ నిర్మించిరి. ఆర్. ఎన్. స్కాటు దళాధికారిగాను, లెఫ్ట్ నెంటు షా కల్ టున్,, డాక్టరు ఇ. ఏ. విల్సన్ సహాయకులుగాను నియమింప వీరు ఇంతకు పూర్వము రాస్ చే అనుగమింపబడిన మార్గమును ఆశ్రయించి ఇంక కొంతదూరము తూర్పు దిశగా వెళ్ళి, ఒకానొక అఖండ భూభాగమును కనుగొనిరి. 'కింగ్ ఎడ్వర్డ్ భూభాగమ' ని దీనికి పేరిడిరి. ఇచ్చట ఓడను నిలుపుకొని బలమైన కుక్కలచే లాగబడు " స్లెడ్జ్ " అను బండ్ల పై దక్షిణాభిముఖముగా దూరప్రయాణము చేసిరి. అవేక శ్రమలకోర్చి. డిసెంబరు 30, 1901 తేదీన 82° -17* దక్షిణ అక్షాంశమును చేరుకొనిరి. తిరుగుప్రయాణములో షాకల్ టన్ కు జబ్బుచేసెను. కెప్టెన్ స్కాట్, డాక్టర్ విల్సన్ లు అచ్చటనే ఇంకొక సంవత్సర కాలము నివసింపదలచినందున, షాకల్ టన్ ను వేరొక పడవలో ఇంగ్లాండుకు పంపించిరి.

లెఫ్ట్ నెంట్ షాకల్ టన్ న్యూజీలాండులో లిటిల్టన్ నుంచి "నింరొడు" అను తిమింగిలముల బట్టు పడవలో క్రీ. శ. 1908 జనవరి 1 వ తేదీని దక్షిణధ్రువ ప్రాంతమునకు బయలుదేరెను. 1901 నుంచి 1904 వరకు డిస్కవరీ పడవ లంగరువేసిన ప్రాంతమునకు 20 మైళ్లు ఉత్తరముగా రాస్ దీవి మీద, రాయిడ్ అగ్రమువద్ద దృఢమైన గుడిసెను నిర్మించి విడిసెను. ఈమారు కుక్కలకు బదులుగా మంచూరియానుంచి తెచ్చిన పొట్టి గుఱ్ఱములను “స్లెక్ట్ " లను బండ్లకుకట్టి లాగించిరి. ఎరిబెస్ అగ్ని పర్వతమును ప్రొఫెసరు డేవిడు కనుగొనెను. 72° -25 దక్షిణ అక్షాంశములో 7000 అడుగుల ఎత్తు ప్రదేశమును వీరు కనుగొనిరి.

ముగ్గురు సహాయకులతో షాకల్టెన్ స్వయముగా బియర్డ్ మూరు గ్లేసియరు మీదుగా 88° 23 దక్షిణ అక్షాంశము వరకు పయనించి, ప్రాణనష్టము లేకుండా తిరిగి వచ్చెను. ప్రభుత్వమువారు ఇతనికి 1909 లో సర్ బిరుదము నిచ్చి గౌరవించిరి.

దక్షిణధ్రువము మీదుగా, వెడ్డెల్ సముద్రమునుంచి రాన్ సముద్రము చేరుటకు, దక్షిణధ్రువ భూఖండమును సమగ్రముగ పరిశీలించుటకు, 1916 లో ప్రభుత్వ సహాయముతో ప్రారంభించెను. "ఎండ్యూరెన్సు" అను పడవలో క్రీ. శ. 1914 డిసెంబరులో వెడ్డెల్ సముద్రతీర పరిశీలనము మొదలిడెను. క్రీ. శ. 1915 జనవరి 11వ తేదీన 'కేర్డ్ కోస్ట్ ' అను ప్రాంతమును కనుగొనెను. కాని జనవరి18 తేదీన పడవ మంచుకొండలో ఇరుకుకొనిపోయి, మంచుగడ్డల ఒత్తిడికి తునాతునకలయ్యెను. అక్టోబరు 27 తేదీన 69.5′ దక్షిణ అక్షాంశములో 28 మంది మనుష్యులతో పడవను వదలి మంచుకొండమీద కాపురము ఏర్పరచుకొనిరి. 457 రోజులు ఈ కొండమీద గడచిన తరువాత 1916 ఏప్రిలు 9 వ రోజున కొండభగ్నముకాగా తమ వెంటనున్న మూడు చిన్న పడవలను సముద్రములోనికి వదలి, వాటిలో ఆరురోజులు భయంకరమైన పరిస్థితులలో కాలముగడపి, 'ఎలిఫెంటు' దీవి చేరుకొనిరి, అయిదుగురు జనులను తోడుతీసికొని, మిగిలినవారిని "ఎలిఫెంటు" దీవిపై వదలి 750 మైళ్ళు ప్రయాణముచేసి దక్షిణ జార్జియా ప్రాంతమును చేరుకొనెను. చిలీ దేశపు పడవ "ఎల్కో" సహాయముతో "ఎలిఫెంటు" దీవిపై నున్న తన మిత్రులను సురక్షితముగా 1916 ఆగస్టు 30 వ తేదీ నాడు దక్షిణ జార్జియా చేర్చెను.

చివరి పర్యాయము "క్వెస్టు"అను పడవలో సెప్టెంబరు 1921 లో తిరిగి దక్షిణధ్రువప్రాంత పరిశోధనలకై బయలు దేరి దక్షిణ జార్జియాలో "గ్రిట్వికెన్" అను ప్రదేశమును చేరెను. అచ్చట శరీరారోగ్యము చెడి 1922 జనవరి 5 వ తేదీన, సర్ ఎర్నస్ట్లు పాకల్టన్ పరమపదించెను. ఇతని సమాధి నేటివరకు కాపాడబడుచున్నది.

దక్షిణ ధ్రువప్రాంత సముద్రములో తిమింగలములు విరివిగా లభించుటచే, వానిని వేటాడుటకై పాశ్చాత్యులు వ్యయ ప్రయాసలకోర్చి, ఈ ప్రాంత నైసర్గిక స్థితిని కూలంకషముగ తెలిసికొనగోరిరి. దక్షిణధ్రువ భూఖండములో విలువగల ఖనిజము లుండవచ్చునని కూడ వీరి యూహ. నిరంతర ప్రయాణములు, పరిశోధనలలో నిమగ్నుడై సర్ ఎర్నస్టు షాకల్టెన్ చివరకు ఈ ప్రాంతములోనే సమాధి స్థితుడైనాడు. తాను దేశాభివృద్ధికై ప్రాణముల సహితము అర్పించి, చిరకీర్తిని ఆర్జించుకొనినాడు.

ప. వేం