సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎరువులు
ఎరువులు :
చెట్టు చేమలు స్వీయజీవితమునకు వలసిన ఆహార ద్రవ్యములలో బొగ్గుపులుసు వాయువుగాక, తక్కిన వాటి నన్నింటినీ వేళ్ళవలన నేలనుండియే గ్రహించును. చెట్లకాహారముగ ఉపయోగపడు ప్రధాన ద్రవ్యములు అనేకము లున్నను, నత్రజని, స్ఫురము లేక భాస్వరము, పొటానియము అను ద్రవ్యములు మాత్రము సన్యములచే నేలనుండి అధికముగా గ్రహింపబడుటవలన, ఈ మూడు మాత్రమే ఎరువులయందు సమకూర్పబడుచుండును. సన్యములను ఏటేటా పెరుచేయుచు, వాటిచే నేలనుండి తీసికొనబడిన ద్రవ్యములను మరల జేర్చనియెడల ఆ నేల యొక్క సత్తువ క్రమముగ క్షీణించును. ఇట్లు భూసారము క్షీణింపకుండ కాపాడుటకు గాని. హెచ్చించుటకు గాని, అందుండి అధిక ఫలసాయము పొందుటకై, నేలయందు చేర్చబడు వస్తువులు, 'ఎరువులు' అనబడును. పూర్వము నుండియు, పశువుల ఎరువు, వచ్చిరొట్టువంటి సేంద్రియపు చెరువు ఇప్పటివరకును వాడుకయందున్నను, రాసాయనికపు చెరువులవలన గూడ, భూసారము హెచ్చునని క్రిందటి శతాబ్ది మధ్యమున మాత్రమే కనుగొనబడెను. అప్పటి నుండియు అమ్మోనియా గంధకిదము (ammonium sulphate), అధిస్ఫురితము (superphosphate) వంటి రాసాయనికపు బరువులు కూడ ఎక్కువగా పాశ్చాత్య దేశములలోను, ఇటీవల మనదేశములోను ఉపయోగింప బడుచున్నవి.
ఎరువులను స్థూలమగు సామాన్యపు ఎరువులు (Bulky general manures) గను, ఉత్సారపు చెరువులు (concentrated manures) గను, విభజింపవచ్చును. పశువుల ఎరువు, పచ్చిరొట్ట మొదలగు స్థూలనుగు సేంద్రియపు చెరువులయందు సస్యములకు వలసిన నత్రజని, భాస్వరము, పొటాసియము మొదలగు ముఖ్యద్రవ్యములు స్వల్పపరిమితులలో నుండును. అందుచే వీటిని, కొద్ది భూమికై నను విస్తారముగా వాడవలసి యుండును. ఆదియునుగాక, వీటిని దూరపు పొలములకు గొనిపోయి వేయుట కొంత శ్రమతోకూడిన పని. ఇవి భూమియందు నెమ్మదిగా పనిచేయుటచే, విత్తుటకు ముందుగనే వీటిని నేలపై చల్లి, మట్టితో కలిపి దున్న వలసియుండును. వీటి యందు సేంద్రియ పదార్థముకూడ ఎక్కువగా నుండుట వలనను, ఇవి నేలలోని ఉపయోగకరమగు సూక్ష్మజీవుల అభివృద్ధికి తోడ్పడుటవలనను, ఈ ఎరువులు నేలయందలి బలము నభివృద్ధిచేయుటయేగాక, అందలి భౌతిక లక్షణములనుగూడ బాగుపరచును. వీటిని వాడుటవలన, నేలల యొక్క నీటిని గ్రహించి, పట్టియుంచుశక్తి అధికమగుటయేగాక, నేల గుల్లబారి, పైరుల యొక్క వ్రేళ్ళు బాగుగా లోనికిపోవుటకు వీలగును. నేల గుల్లబారుట వలన వ్యవసాయపు పనిముట్లతో సాగుపనులు చేయుట కూడ చాల సులభము. మరియు వీటియొక్క సారము,
వివరములు సంగ్రహ ఆంధ్ర మొదట వేసిన పైరున కేగాక తరువాత నొకటి రెండు పైరులకుకూడ లభించును. అమ్మోనియా గంధకిదము ammonium sulphate), అధిస్ఫురితము (superphosphate) మొదలగు ఉత్చారములగు ఎరువులయందు ఒకటి రెండు ప్రధాన ద్రవ్యములు మాత్రమే ఎక్కువ పరిమాణము నందుండుటవలన, వీటిని దూర ప్రదేశములకు గూడ గొనిపోవుటయు, సస్యములకు చేర్చుటయుకూడ సులభము. వీటియందలి ఆహార ద్రవ్యములు చురుకుగా పనిచేయుటచే సాధారణముగా సస్యములు పెరుగు. నారంభించిన తరువాతనే వీటిని వాడవలయును.
స్థూలమగు సామాన్యపు జెరువులు: 1. పశువుల ఎరువు ; ఇది సర్వత్ర విరివిగా ఉపయోగింపబడుచున్న జంతు సంబంధమగు సామాన్యపు చెరువు. పశువుల యొక్క మలమూత్రములును అవి నివసించు శాలలలోని చెత్త చెదారములును కలిసి చీకుటవలన ఈ ఎరువు ఏర్పడును. పశువుల ఎరువునందు, సస్యములకు వలయు నాహార ద్రవ్యము లన్నియు కొంచె మించుమించుగా నుండును. వీటి యొక్క పరిమితులు ఎరువునందు చేరిన మలమూత్రములను బట్టియు, చెత్త చెదారముల యొక్క సంఘట్టనమును బట్టియు, సారము పోకుండ చీక బెట్టి వాటిని ఎరువుగా మార్చు పద్ధతిని బట్టియు మారుచుండును.
మనదేశము నందలి సాధారణ జంతువుల మలమూత్రముల సగటు సంఘట్టనము ఈ క్రింది పట్టిక యందు వివరింపబడినది.
| క్రమ. సంఖ్య. | వివరములు | వివరములు | నత్రజని | స్ఫురత్సంచామ్లజని | పొటాష్ |
|---|---|---|---|---|---|
| 1. | పశువులు | పేడ | 0.3 | 0.2 | 0.2 |
| 1. | పశువులు | మూత్రము | 0.9 | స్వల్పము | 1.0 |
| 2. | గొఱ్ఱె | పెంటికలు | 0.9 | 0.6 | స్వల్పము |
| 2. | గొఱ్ఱె | మూత్రము | 1.7 | స్వల్పము | 2.2 |
| 3. | మేక | పెంటికలు | 0.7 | 0.5 | స్వల్పము |
| 3. | మేక | మూత్రము | 1.3 | స్వల్పము | 2.5 |
| 4. | గుఱ్ఱము | లద్ది | 0.6 | 0.4 | 0.3 |
| 4. | గుఱ్ఱము | మూత్రము | 0.2 | 0.1 | 1.0 |
| 5. | పంది | పెంట | 0.7 | 0.5 | స్వల్పము |
| 5. | పంది | మూత్రము | 0.4 | 0.1 | 0.45 |
| 6. | మనుష్యులు | మలము | 1.0 | 0.8 | 0.4 |
| 6. | మనుష్యులు | మూత్రము | 0.8 | 0.1 | 0.3 |
సామాన్య పశువుల ఎరువునందు సగటున నూటికి 0.5 పాళ్ళు నత్రజని, 0.25 పాళ్ళు స్ఫురత్వం చామ్ల జనితము, 0.5 పాళ్ళు పొటాషు ఉండును. మలమూత్రము యొక్క సంఘట్టనము అన్ని జంతువులయందును ఒకే విధముగ నుండక, వాటి యొక్క రకమును, వయస్సును బట్టియు, అవి తిను ఆహారమును, చేయు పనిని బట్టియు కూడ మారుచుండును. ముసలి పశువుల యొక్కయు, దుక్కి పశువుల యొక్కయు, మల మూత్రములు, ఎదుగుచున్న దూడల యొక్కయు, పాడియావుల యొక్కయు మలమూత్రముల కంటే ఎక్కువ సారము కలవి. ఆవుల యొక్కయు, ఎడ్ల యొక్కయు మలమూత్రములు, గేదెలయొక్కయు, దున్నల యొక్కయు మలమూత్రముల కంటే ఎక్కువ సారముకలవి. ప్రత్తివిత్తులు, వేరుసెనగపిండి, ఉలవలు మొదలగు దాణాలు పెట్టబడు పశువుల మలమూత్రములు కేవలము జొన్న చొప్ప, పచ్చిగడ్డి, వరిగడ్డి మొదలగు స్థూలాహారములు మాత్రమే తిను పశువుల మలమూత్రము కంటే ఎక్కువసారము కలవిగా నుండును.
“ ప్రశస్తమైన పశువుల ఎరువును తయారు చేయుటకు పశువుల శాలలందలి మలమూత్రములును, చెత్త చెదారములును వృథాకాకుండ పొదుపుచేసి, అవి కలిసి గోతి యందు చీకునప్పుడు, వాటి యందలి సారము పోకుండ చూడవలెను. పశువుల యొక్క మూత్రము చాల విలువ గలది. అందుచే జిగురులేని పొడిమట్టిగాని, ఎండిన కలుపు మొక్కలు లేక రాలుటాకులుగాని పశువుల శాలలందు పరచి, వాటివలన ఆ మూత్రమును ఇంకింపజేసి, ఎరువు గోతియందు జేర్చుచుండవలెను. పశువులశాల యొక్క నేలను గచ్చుచేసి, దాని పైబడు మూత్రమును, ఒక చివర నుండు గచ్చుకుండిలో పడునట్లు చేసి, దానిని ప్రతిదినము ఎరువు గోతియందు పోయుచుండుట చాల శ్రేష్ఠమైన వని.
ఇట్లు ప్రతి దినము పశు శాలనుండి తీయబడు మల మూత్రములు, చెత్తచెదారములు గోతిలో వేయబడి కాని, కుప్పగా పెట్టబడి కాని, 3.4 నెలలు చీకినతరువాత, అందలి సేంద్రియ పదార్థములు, సూక్ష్మజీవుల సహాయమున కొన్ని మార్పులు చెంది, మొక్కల వేళ్ళచే తీసికొనబడు ద్రావణీయ లవణములుగ మారును. ఎరువు, గోతియందు చీకునపుడు, దాని పై భాగమును దట్టముగ మట్టితో కప్పినచో, అండలి సారద్రవ్యములు సూర్యరశ్మివలన క్షీణింపకుండుటయేగాక, వర్షపు నీటితో కొట్టుకొని పోకుండ నుండును. మరియు ఎరువునందలి సారము క్రిందికి దిగిపోకుండునట్లు, గోతి యడుగు నేలను, కంకర వేసి గట్టిపరచి, నీరు ఇంకకుండ చేయవలెను.
అన్ని నేలలయందును, అన్ని సస్యములకును, ఉపయోగించి నిస్సంశయముగ ఫలితమునిచ్చు విషయమున పశువుల ఎరువునకు సాటి మరియొకటిలేదని చెప్పవచ్చును. మరియు, పశువుల ఎరువు వేసి పెంచిన కూరగాయలు ఇతర సస్యములు, కేవలము అమ్మోనియా గంధకిదములు మొదలగు నిరింద్రియపు టెరువులను (Inorganic fertilisers) మాత్రమే వేసి పండించిన పంటలకంటె, రుచికరములుగను, ఆరోగ్యదాయకములు గను ఉండునని తేటపడినది.
2. గొట్టే పెంట, మేక పెంట: గొజ్జెల యొక్కయు, మేకల యొక్కయు, మలమూత్రములు పశువుల మల మూత్రములకంటే హెచ్చుసారముకలిగి త్వరలో చీకును. ఆవులు మున్నగువాటివలె వీటిని పళ్లు శాలలలో కట్టి ఎరువును తయారుచేయుటకు ఎక్కువగా వీలుగ నుండక పోవుటచే, సత్తువచేయవలసిన నేలపై, రాత్రులందు ఎకరమునకు 1000–2000 చొప్పున గుంపులుగా మందలు తోలబడును. కలుపుమొక్కలు విస్తారముగానుండు నేలపై మంద కట్టినయెడల ఎరువు బలమువలన అందలి గడ్డి గాదములు విస్తరించును. అందుచే మందను పరుండబెట్టుటకు ముందుగ నేలను బాగుగ దున్ని మంద తొక్కిన తరువాత గుంటకను తోలిగాని మరల దున్నిగాని మలమూత్రములు నేలయందు బాగుగ కలియునట్లు చేయవలెను. వర్షకాలమున శేషగనుండు బంక నేలలపై మందులను పరుండ పెట్టినచో అనేలలు గట్టిపడిపోవును. గొజ్జెల యొక్కయు, మేకల యొక్కయు మల మూత్రములతో ఊరినమట్టి, పొగాకు, మిర్చి, నారింజజాతి ఫలవృక్షములు గులాబి, మల్లే మొదలగు పూల మొక్కలకు చాల పుష్టికరము. నిస్సారములగు నేలలందు ఎదుగనట్టియు, తెగుళ్ళచే నీరసించినట్టియు సస్యములకు, ఈ ఎరువులు అతి త్వరితముగ బలము నొసగును. 3. మానవుల మలమూత్రములు: మానవుల మల మూత్రములందు కూడ ఇతర జంతువుల మలమూత్రము లందు వలెనే కొంతసారముకలదు. కాని వీటి చెడువాసన వలన మనదేశపు కర్షకులు అసహ్యపడి వాటి సంతగా వాడుటలేదు. చైనా, జపాన్ మొదలగు కొన్ని దేశము లందు మలము, నెండబెట్టి, దానిని దుర్గంధము లేని ‘పూడెట్టు' (Poudrette) అనబడు ఎరువు; చేసి ఉపయోగించుచున్నారు. ఇటీవల మన దేశమునగూడ, మానవుల మలమును పట్టణపు వీథులచేత్తతో కలిపి, పొరలు పొరలుగ కుప్పలు పెట్టి, మధ్యనొకటి రెండుసార్లు వాటిని తిరుగ వేసి 45 మాసములలో దుర్గంధములేని ఎరువుగ తయారుచేయు చున్నారు. దీనికే పురీషపుచీకుడు ఎరువు (Night Soil Compost) అని పేరు. గ్రామపరిసరము లందుకూడ, మలవిసర్జనమునకు కాలువలనుతీసి, మలమును మట్టితో కప్పు తాత్కాలికపు దొడ్ల నేర్పరుచుకొన్నచో, కొంతకాలమునకు ప్రశస్తమైన ఎరువు లభ్యమగును.
4. పందిపెంట : పంది వెంటయందు, పశువుల పేడ యందుకంటె నత్రజనియు, భాస్వరమును అధికముగ నుండును. దీనిని పశువుల ఎరువుతో కలిపి, కొంత చీకిన తరువాత వాడుట శ్రేష్ఠము. నీరు పెట్టి సాగుచేయబడు పలువిధములైన కూరగాయలు, ఉల్లి, చెరకు, తమలపాకులు మొదలగు సస్యములకుకూడ ఇది ప్రశస్తమైన ఎరువు. ఎండిన పంది పేంటను పొడిగా నలుగగొట్టి, వరి మొదలగు పైరులకు, పెరుగు చున్నపుడు గూడ పైన చల్ల వచ్చును.
5. గుఱ్ఱపు ఎరువు: గుఱ్ఱపు లద్దిలోకూడ పశువుల పేడయందుకంటె నత్రజనియు భాస్వరమును చాల అధికముగ నుండుము. గుఱ్ఱపుఎరువు బాగుగ చీకనియెడల, లబ్ధియందు జీర్ణము కాని వారపదార్థము ఎక్కువగా నుండుటచే, ఇది నేలయందు తగినంత నీరు పెట్టని యెడల వేడిని పుట్టించి, సస్యములను చెరచును. బాగుగ చీకిన గుఱ్ఱపు ఎరువు శీతకాలపు పూలజాతులకు కూరగాయలకు శ్రేష్ఠము.
6. చీకుడు ఎరువు : (Compost) చేత్తచేదారములు ముందుగ కొంత కాలము క్రుళ్ఫుటవలన ఏర్పడు ఎరువు 'చీకుడు ఎరువు' అనబడును. దీనిని తయారుచేయుటకు, పొలములయందు లభించు కలుపు మొక్కలు, పైరులు కోసిన తరువాత నిరుపయోగముగ మిగిలియుండు దుబ్బులు, ఇతర భాగములు . 2-3 అడుగులు లోతుగల గోతులలో నింపిగాని, నేలపై పోగులుగా గాని, పొరలు పొరలుగా గాని ఏర్పరచి, నీటితో తడుపుచుండవలెను. గోతులన్నియు చెప్తే చేదారములతో నింపునపుడు, ప్రతి రెండు చెత్తపొరలమధ్యను పేడనీటిని, పశువులశాలలలోని మూత్రముతో ఊరినమట్టిని, కట్టెల బూడిదను చల్లి, గోతి పైభాగమును పట్టితో కప్పిన యెడల, 3 4 నెలలలో ఈ చెత్త చీకి, సస్యముల కెరువుగా వేయదగినట్లుండును. ఇట్లు తయారుచేసిన చీకుడు ఎరువు యొక్క సంఘట్టనము కొంచెము ఇంచుమించు పశువుల ఎరువును పోలియుండును.
7. పచ్చి రొట్ట : అడవులయందును, బంజరుభూముల యందును, బాటల ప్రక్కలందును, పొలముల గట్లయందును, పెరుగు మొక్కల యొక్క పచ్చిరొట్టను ఎరువుగా ఉపయోగింప వచ్చును. వెంపలి, జిల్లేడు, తంగేడు, సీమ తంగేడు, (Glyricidia maculata) నేపాళము, అవిసె, కానుగ, నిద్రగన్నేరు, వేప, గంగరావి, మొదలగువాటి యొక్క పచ్చిరొట్టను ఇట్లు ఉపయోగించవచ్చును. సాధారణముగా పచ్చిరొట్ట వరిచేలయందే ఎరుపుగ ఉపయోగింపబడుచున్నది. కాని, తోటభూములలో కూడ తగినంత నీరు పెట్టుబడి పైరుచేయబడు కూరగాయలు, ఉరలగడ్డ, మిర్చి, అరటి, చెరకు, మొదలగు సస్యములకును, బాగుగా వర్షము కురియుచోట్ల జొన్న, గోధుమ, పొగాకు మొదలగు వర్షాధారమున పెరుగు మెట్ట సస్యములకును కూడ పచ్చి రొట్టను ఎరువుగా ఉపయోగింపవచ్చును. ఇది లభింపని కాలములయందును, ప్రదేశములందును, సీమచింత, తంగేడు, నిద్రగన్నేరు, దిరిసెన మొదలగు చెట్ల యొక్క రాలుటాకులు గూడ నీటి వసతి గల సస్యములకు ఉపయోగింపవచ్చును. ఇవిగాక కర్షకులు తమ పొలములందే జనుము, జీలుగ, సీమజీలుగ (Sesbania-speciosa), పిల్లి పెసర, నీలి, వెంపలి, బొబ్బర, ఉలవ, గోరుచిక్కుడు, మొదలగు కాయధాన్య కుటుంబ మునకు చెందిన జాతులను పచ్చి ఎరువునకుగాను ప్రత్యేకముగ పైరుచేయుటయు గలదు. ఇట్లు పెంచి, సత్తువచేయదలచిన పొలమునందే దున్ని వేయుటకు, జనుము తక్కిన పచ్చి ఎరువు పైరులకంటే చాల అనుకూలము. ఇది త్వరగా ఎదిగి, దున్నిన వెనుక చాలత్వరగా చీకును, జనుము కొంచెమించుమించు అన్ని నేలలకును అనుకూలించును. కాని ఇది గరపనేలలలో బాగుగా నెదుగును. ఇది పశువులకు చాల రుచి కరమైన గ్రాసము. జీలుగ చవిటి భూములకును, పిల్లి పెసర నల్లబంక నేలలకును, వెంపలి ఇసుక నేలలకును అనుకూలములై ఉండును. వరిపొలములయందు ఇవి యన్నియు 7 - 10 దినములలోను, తోట లేక మెట్టభూములయందు 4 - 6 వారములలోను చీకును పచ్చి రొట్టయందు నత్రజని నూటికి 0.5–1.0 పాళ్ళును, ఎండు రొట్టయందింతకు మూడు, నాలుగు రెట్లు అధికముగను ఉండును.
8. సామాన్యమైన ఇతర ఎరువులు: నదీ తీరము లందును, చెరువు గర్భములందును, లభించు వండలిమన్ను, తేలిక నేలలందు పెంచబడు వేరుసెనగ, జొన్న వంటి సస్యములకును, కొబ్బరి మొదలగు ఫల వృక్షములకును, ఎరువుగ ఉపయోగించును. పురాతన గ్రామములందలి పాటిమన్ను వరిచేలకును, నారింజజాతి తోటలకును, అరటి తోటలకును మంచి సత్తువ నొసగును. బియ్యపు మరలయందు లభించు వడ్లదూగర (Rice mill dust), చక్కెర కర్మాగారములయందు లభించు చెరుకురసపు తెట్టు (Scum), వడపోత పిట్టు (Filter presscake), చక్కెర పాకు (molasses), కర్మాగారములనుండి వదలివేయబడు మురుగునీరు, పట్టణముల మురుగునీరు (town sewage), మురుగు నీటిపిట్టు (sewage sludge), తోళ్ళ కర్మాగారములనుండి లభించు చెత్త (tannery refuse) మొదలగు వస్తువుల నన్నింటిని ఎరువులుగ ఉపయోగింపవచ్చును.
1. ఉత్పారపు టెరువులు: నత్రజనిని హెచ్చుగ కలిగియున్న జంతు, వృక్ష సంబంధమైన ఉత్సారపు టెరువుల యొక్క సంఘట్టనము ఈ క్రింది పట్టికయందు తెలుపబడినది.
| సంఖ్య | ఎరుపు | నత్రజని | స్సు. సం. | పొటాష్. |
|---|---|---|---|---|
| 1. | వేరుసెనగపిండి | 8.0 | 1.4 | 1.2 |
| 2. | ఆముదపుపిండి (పొట్టుతీసినది) | 6.4 | 2.6 | 1.2 |
| 3. | ఆముదపుపిండి (పొట్టుతీయనిది) | 4.5 | 1.9 | 0.7 |
| 4. | నువ్వుపిండి | 6.1 | 2.4 | -- |
| 5. | ప్రత్తిపిండి | 3.0 | 1.2 | -- |
| 6. | కొబ్బరిపిండి | 3.5 | 1.4 | -- |
| 7. | కుసుమపిండి | 3.2 | 1.2 | -- |
| 8. | కానుగపిండి | 4.2 | 0.9 | -- |
| 9. | వేపపిండి | 4.7 | 1.9 | -- |
| 10. | ఎండుచేపలు | 4.0 | 4.0 | -- |
| 11. | చమురు తీసిన చేపల ఎరువు(fish guano) | 7.8 | 7.8 | -- |
| 12. | రక్త వుపొడి | 11.0 | 2.0 | -- |
నత్రజనిని హెచ్చుగ కలిగియున్న పిండి ఎరువులలో వేరు సెనగపిండి, ఆముదపుపిండి ముఖ్యమైనవి. పిణ్యాకము లన్నిటిలోను వేరుసెనగ పిండియందు నత్రజని 'హెచ్చుగ గలదు. ఆముదపుపిండియందు స్ఫురత్సం చామ్లజనిదము కొంచెమధికముగా నుండుటయేగాక, దీని నుపయోగించు నేలలందు చెదలవాధ అంతగా నుండదు. వేపపిండి చవిటి భూములందలి చౌడు నణగగొట్టుటయేగాక, దానియందలి ఘాటువలన చెదల బాధ కూడ వారింపబడును. నూనెగింజల పిట్టులయం దెంత తక్కువ చమురున్న అవి అంత త్వరలో చీకి, పైరులకు ఉపయోగపడును. వీటిని వరి, చెరకు, పసుపు, మిర్చి, ఉల్లి, కూరగాయలు మొదలగు అనేక అవ్యసస్యములకును వాడవచ్చును. చేప ఎరువునందు నత్రజనియు, స్ఫురత్పంచామ్లజనిదముకూడ హెచ్చుగ నుండును. ఇది నారింజ, దానిమ్మ, ద్రాక్ష మొదలగు ఫల వృక్షములకు చాల ప్రశస్తమైనది. దీనిని పసుపు, మిర్చి అరటి, చెరకు వరి మొదలగు నీటివసతిగల పైర్లకుకూడ వేయదగును. పట్టణములయందు ప్రతిదినము, పశువులు, గొట్టెలు, మేకలు వధచేయబడు స్థానములయందు లభించు రక్తము నెండబెట్టి తయారుచేయబడు పొడి చాల చురుకుగా పనిచేయు విలువైన నత్రజని ఎరువుగా మారును.
2. ఉత్సారపు రాసాయనికపు టెరువులు : (Concedtrated Chemical fertilisers) (అ) నత్రజని అధికముగా కలిగిన ప్రధానమైన ఉత్సారపు రాసాయనికపు టెరువులు, వాటి యొక్క సంఘట్టనము ఈ క్రింద తెలుపబడినది.
| సంఖ్య. | ఎరువు పేరు. | నత్రజని (N) % |
|---|---|---|
| 1. | అమ్మోనియా గంధకితము.(Ammonium sulphate) | 20.6 |
| 2. | సోడియ నత్రితము.(Sodium nitrate) | 15.5 |
| 3. | యూరియా (Urea) | 46.0 |
| 4. | అమ్మొనియా నత్రితము{Ammonium Nitrate) | 35.0 |
| 5. | అమ్మోనియా గంధకిద నత్రితము.(Ammonium Sulphate-nitrate) | 26.0 |
| 6. | నైట్రోలియమ్(calcium cyanamide) | 19.0 |
రాసాయనికపు చెరువులను మాత్రమే ఏటేట సస్యములకు వేయుచుండినచో, కొంతకాలమునకు 'నేలయందలి సేంద్రియ పదార్థమునకు, మరికొన్ని ముఖ్యద్రవ్యములకు కొరత యేర్పడి, నేల సారహీనమగును. కావున వీటిని పశువులయెరువు, పచ్చి ఎరువు, చీకుడు ఎరువు మొదలగు స్థూలమగు సేంద్రియపు టెరువులకు దోడుగ, అవసర మగునంతవరకే వాడుచుండవలెను.
నత్రజని హెచ్చుగగల రాసాయనికపు టెరువులలో, మనదేశమున అమ్మోనియా గంధకిదము వరిచేలకు, నారు. మళ్ళకు, చెరకు, అరటి, ఉల్లి, ఉరలగడ్డ, కూరగాయలు, ఇంకను అనేక తోట సస్యములకును, తగినంత వర్షము కురియుచోట్ల, జొన్న, ప్రత్తి, వేరుసెనగ మొదలగు మెట్ట పైర్లకుకూడ విరివిగ నుపయోగింపబడు చున్నది. సోడియ నత్రితము మిగుల చురుకుగ పనిచేయును. కాని ఇది చాల ద్రావణీయమగుటచే, నీరు పెట్టినపుడు గానీ, అధిక వర్షములు పడినపుడు కాని మొక్కల వేళ్ళకందకుండ కొట్టుకొనిపోవును. నల్లరేగడి నేలలందు ఈ ఎరువు, పైరులకు హానికరములగు మార్పులను కలిగించును. అందుచే మనదేశమున దీనిని ఉపయోగించుట చాల తక్కువ. అమ్మోనియా గంధకిదముకంటెను అధికముగ నత్రజని కలిగి, నేలయందు హానికరములగు మార్పులు కలిగింపని యూరియా, అమ్మోనియా సత్రితము, అమ్మోనియా గంధకిద - నత్రితము అను ఎరువులు ఇటీవల మస దేశమునకూడ కొంతవరకు వాడబడు చున్నవి.
స్ఫురపు టెరువులు (Phosphatic fertilisers) : జంతుసంబంధమైన స్ఫురపు టెరువులలో ఎముకల పొడియు రాసాయనికపు టెరువులలో అధిస్ఫురితము (Super-phosphate) ను ప్రధానమైనవి. కొన్ని స్ఫురపు టెరువుల యొక్క సంఘట్టనము ఈ క్రింద వివరింపబడినది.
| సంఖ్య. | ఎరువు | నత్రజని | స్సు.సం. |
|---|---|---|---|
| 1. | ఎముకల పొడి. | 4 | 23 |
| 2. | సామాన్య అధిస్ఫురితము.(Ordinary Super-phosphate) | -- | 16 |
| 3. | ద్విగుణాధిస్ఫురీతము(Double Super-phosphate) | -- | 32 |
| 4. | త్రిగుణాధిస్ఫురితము(Triple Super) | -- | 45 |
| 5. | భస్మిక స్ఫురిత చిట్టేము.(Basic Slag) | -- | 16-20 |
ఎముకలను కాల్చిగాని, సన్న పొడిగచేసిగాని, ఎరువుగ ఉపయోగింపవచ్చును. ఇది ఆలస్యముగ చీకి పైరునకు లభ్యమగుటచే దీనిని పశువుల ఎరుపు లేక ఇతర స్థూల సేంద్రియపు చెరువులతో గూడ కలిపి, విత్తుటకు ముందుగనే వేయవలెను. తగినంత ఎముకలపొడిని ఒకేసారి వేసిన యెడల, ఇది ఆ భూమియందు 2-3 సంవత్సరముల వరకు కూడ పనిచేయును. అధిస్ఫురితము అందలి స్ఫురము నేలకు చేర్చబడిన తోడనే కొంత భాగము త్వరలో సస్యము లకు ఉపకరించి, మిగిలినది క్రమముగా లభించును. వీటిని గూడ పశువుల ఎరువు, పచ్చిఎరుపు వంటి సేంద్రియపు టెరువులకు తోడుగ వాడుట శ్రేష్ఠము.' విత్తనములను చల్లుటకు ముందే, అధిస్ఫురితములను గొఱ్ఱు లేక మరియే ఇతర పరికరముతోనైనను, విత్తనముల వరుసలకు దగ్గర గను, భూమిలోనికి 23 అంగుళములు లోతుగను చల్లినచో, ఇవి అధిక ఫలితము నిచ్చునని కనుగొనబడెను. అధి స్ఫురితములు వరి, చెరకు, అరటి, కూరగాయలు, పండ్ల తోటలు మొదలగు వాటికి ఉపయోగకరములు. నత్రజని అధికముగ కలిగియుండుటచే సస్యముల కెక్కువగ రొట్ట పెరుగు నేలలందు వీటిని వాడుటవలన పైరులు త్వరలోనే పంటకు వచ్చుటయేగాక అధికముగ ఫలించును. భస్మిక స్ఫురిత చిట్టెము ఉక్కును తయారుచేయు కర్మాగారము లలో లభించు రద్దు ద్రవ్యము. దీనియందు సున్నముగూడ హెచ్చుగనుండుటచే, ఆమ్లస్వభావము గల నేలలకు (acid soils) ఇది ప్రశస్తమైన ఎరువు.
పొటాష్ ఎరువులు: పొటాష్ విస్తారముగ కలిగియుండు ఎరువులలో పొటాసియమ్ గంధకిదము (Potassium sulphate) పొటాసియమ్ హరిదము (Potassium chloride), కట్టెలబూడిద ముఖ్యమైనవి. వీటి యందు పొటాష్ (K), వరుసగా నూటికి 48, 50, 4.5 పొళ్ళుండును. ఈ ఎరువులను, పొటాషును ఎక్కువగా కోరు ఉరలగడ్డ, పొగాకువంటి పైరులకును, అరటి, కొబ్బరివంటి ఫలవృక్షములకును, నత్రజని స్ఫురమును ఒసగు ఇతర ఎరువులతో కూడ ఉపయోగింపవలెను. పొటాసియము గంధకిదము, పొటాసియము హరిదము కన్న శ్రేష్ఠమైన ఎరువు. కాని ఈ రెండు ఎరువులు కూడ 'నేలయందు ఆస్తుత్వమును కలిగించును. కట్టెల బూడిదయందు పొటాసియము కర్బనిత (carbonate) రూపమున నుండి, నేలకు ఆమ్లక్వమును కలిగించు స్వభావము లేకపోవుటచే ఇది ఆ రెండింటి కంటె కూడ ప్రశస్తమైన ఎరువని చెప్పవచ్చును. ఈ దిగువ పేర్కొన బడిన కొన్ని ఉత్సారపు చెరువులు, సస్యములకు వలయు మూడు మూల పదార్థములలో ఏవేని రెండింటిని కలిగియుండును.
| సంఖ్య. | ఎరువు | నత్రజని | ప్పు. పం | పొటాష్ |
|---|---|---|---|---|
| 1. | పొటాసియము నత్రితము లేక సూరేకారము(Potassium nitrate) | 13-14 | -- | 44 |
| 2. | అమ్మోఫాస్ (1) | 16.0 | 20.0 | -- |
| 2. | అమ్మోఫాస్ (2) | 11.0 | 48.0 | -- |
| 3. | నిసీఫాస్ (1) | 13.5 | 41.0 | -- |
| 3. | నిసీఫాస్ (2) | 17.5 | 17.5 | -- |
| 4. | లూనొ ఫాస్ | 21.0 | 20.0 | -- |
సస్యములకు వేయదగిన ఎరువులను నేల యొక్క బలమునుబట్టియు, సస్యములకు వలసిన మూల ద్రవ్యములను బట్టియు నిర్ణయింపవలెను. కొన్ని ముఖ్య సస్యములు ఒనగు పంటలనుబట్టి, అవి నేలనుండి ఎంతెంత నత్రజనిని, స్ఫురత్పంచామ్లజనిదమును, పోటాష్ను గ్రహించునో ఈ ప్రక్క పుటలోని పట్టికయందు వివరింపబడినది.
ఎక్కువ సత్తువ కలిగియున్న నేలలందు ఎరువులు వాడకుండగనే కొంతకాలము లాభదాయకముగా సస్య ములను పైరుచేయుటకు వీలు ఉన్నప్పటికిని, చాల కాలమునుండి సాగునందున్న సామాన్యపుభూము లన్నిటి యందును, ఆయా సస్యములచే తీసికొనబడు ద్రవ్యముల నన్నిటిని మరల నేలయందు చేర్చనియెడల, పంటలు క్రమముగా క్షీణించును. వివిధ సస్యములకు మరియు నత్రజనిని తెలిసికొని, దానిని కలిగియుండు నంత పశువుల ఎరువును నేలకు చేర్చినయెడల, స్ఫురత్వంచామ్ల జనిధము, పోటాషుగూడ సామాన్యముగ దానిమూలముననే లభించును. స్వీయస్వభావమునుబట్టి కొన్ని ద్రవ్యములను హెచ్చుగ కోరు సస్యములకు, పశువుల ఎరువుతో పాటు, నత్రజనిని గాని, స్ఫురతామ్లజనిదమును గాని, పొటాష్ నుగాని అధికముగ నొసగు ప్రత్యేకపు టెరువు
| సంఖ్య | సస్యము | ఒక ఎకరమునుండి లభించు పంట(పౌనులు) | వంటమూలమున ఒక ఎకరమునుండి పోవు | ||
|---|---|---|---|---|---|
| సంఖ్య | సస్యము | ఒక ఎకరమునుండి లభించు పంట(పౌనులు) | నత్రజని{పౌ} | స్సు.సం.{పౌ} | పొటాష్(పౌ}} |
| 1. | వరి | 3000 ధాన్యము, 4500 గడ్డి | గ50 | 25 | 50 |
| 2. | జొన్న | 800 గింజలు, 2400 దంటు | 25 | 10 | 35 |
| 3. | మొక్కజొన్న | 1200 గింజలు, 3000 దంటు | 35 | 20 | 60 |
| 4. | రాగులు | 1000 గింజలు, 2000 దంటు | 22 | ? | ? |
| 5. | సజ్జలు | 800 గింజలు, 2000 దంటు | 22 | ? | ? |
| 6. | ప్రత్తి | 250 దూది, 750 విత్తులు | 26 | 10 | 10 |
| 7. | ఉల్లి | 25000 పౌ. గడ్డలు | 70 | 35 | 70 |
| 8. | చెరకు | 10,0000 పౌ. లేక 45 టన్నులచెరకులు | 125 | 75 | 350 |
| 9. | అరటి | 22400 పౌ. లేక 10 టన్నులతూనిక గల 700 గెలలు | 180 | 60 | 700 |
| 10. | మేతజొన్న | 33600 పౌ. (15 ట.) పచ్చిమేత | 120 | 25 | 150 |
లను ఉపయోగింపవలెను. ఇటీవల వివిధ సస్యములకు వలయు ముఖ్యద్రవ్యము అన్నియుకూడ ప్రత్యేకముగ మిశ్రితములైన ఎరువుల (fertiliser-mixtures) యందు సమకూర్పబడి విక్రయింపబడుచున్నవి. వ్యవసాయ దారులు ఎరువులను కొనవలసి వచ్చినపుడు, వాటియందలి ముఖ్య ద్రవ్యములు పరిమితులను బట్టియు, అవి లభించు ధరలను బట్టియు ఏది కొనుట లాభకరమో నిర్ణయించుకొనవలెను.
ఉదా : నూటికి 8 సాళ్ళు నత్రజని గల 100 పౌనుల వేరుసెనగపిండి ఖరీదు 8 రూపాయలయిన యెడల, దాని యందుగల 1 పౌను నత్రజని ఖరీదు 1 రూపాయి అగును. ఇట్లే నూటికి 20 పాళ్ళు నత్రజని గల 100 పౌనుల అమ్మోనియం సల్ఫేటు ధర 15 రూపాయలయిన యెడల, దీనియందు గల 1 పౌను నత్రజని విలువ 12 అణాలు మాత్రమే అగును. ఈ రెండు ఎరువులును పైని పేర్కొనబడిన ధరలకు అభించునపుడు వేరుసెనగ పిండికంటె అమ్మోనియమ్ సల్ఫేటును కొనుటయే లాభకర మగును.
కే. భా.