సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎన్నికల చట్టములు
ఎన్నికల చట్టములు:
ప్రజా ప్రభుత్వమునకు ప్రజలచే ఎన్నుకొనబడు వ్యక్తులే తాత్కాలిక పాలకులగుట, ఒక ముఖ్యవిశేషము. సమస్త ప్రజానీకమునుండి అట్టి పాలకులను ఎన్నుకొనుటయే ఎన్నిక విధాన మనబడుచున్నది. ప్రాచీన సంప్రదాయములో రాజ్యాధిపతిరాజై ప్రజలను పరిపాలించి మరణాంతమున వారసత్వరిత్యా కుమారునకు రాజ్యము నంద జేయుటయు, ప్రజలు సమ్మతించుటయు జరుగుచుండెడిది. నేటి ఆధునిక ప్రపంచములో రాచరికము దూష్యమై ప్రజాయత్తరాజ్యతంత్రము ఉత్తమమని నమ్మకము కలుగు చున్నది. ప్రజాయత్త రాజ్యమునకు ఎన్నిక విధానము ముఖ్యబీజము.
ప్రభుత్వోద్యోగులు తప్ప మిగిలిన వారెల్లరు ప్రభుత్వ నిర్వహణమునందు ఎన్నుకొనబడవలసిన వారలే. లోక శాసన సభలయందును, రాష్ట్ర శాసన సభలయందును, పురపాలక సభలయందును, వ్యాపారవర్తక సంఘసభల యందును సభ్యులెల్లరు ఎన్నికరూపమున అధికారమును పొందుచున్నారు. ముఖ్యముగా రాజ్యాంగ, శాసనసభల యందు ఎన్నిక విధానము చట్టరీత్యా ప్రతిష్ఠింపబడినది. రాజ్యాంగప్రణాళికలు తెలిపినరీతిగా భారతదేశమునందు యుక్త వయస్సుగలిగిన ప్రతివ్యక్తియు (21 సం. మించినవారు) స్త్రీ, పురుష, మత, జాతి, అధిక, నీచ, ధన, ధన హీన, భేద భావము లేకుండ ఎన్నిక విధానమునందు పాల్గొ నుటకు అధికార మివ్వబడినది. భారతదేశమున స్వతంత్రత చేకూరగనే యెన్నిక సమస్యలో ప్రథమ సోపానముగా 1950 లో "లోకసభ" వారు (Act 41 of 1950) చట్టమును శాసించి యున్నారు. ఈ చట్టరీత్యా భారత భూమిలో నున్న యెన్నిక దారులనందరిని (వోటర్లు) జాబితాలలో చేర్చి ప్రతి ప్రాంతమునందును ప్రభుత్వ యాజమాన్యము క్రింద అచ్చొత్తింపబడినవి. ఈ జాబితాలో ప్రతీయుక్త వయస్కుడు ఎన్నిక దారుడుగా పేర్కొనబడి గుర్తునిమిత్తము తండ్రి పేరు - వయస్సును - నివసించు గ్రామమును కలిగియుండును. ఈ జాబితాలోనుండు పొరపాట్లను గురించి సవరణచేయుటకు జిల్లా యధికారులకు అధికార మివ్వబడినది. ఏ వ్యక్తి వేరైనను ఒకటికిమించి పెక్కు జాబితాలలో పేర్కొనబడినచో, ఆవ్యక్తికి ఏ 'యొక్క ప్రదేశమునందు మాత్రమే 'వోటు' (నియోజన చేయు) చేయు అధికారము గల్గియుండును.
1951 లో (Act 43 of 51) ఎన్నికల విధానమును గురించి శాసనము లోకసభలో చేయబడ్డది. ఈశాసనరీత్యా ఎన్నికకు ముఖ్యములు ఏవియనః నామనిర్దేశము (నామినేషను), ఉపసంహరణ, వోటుచేయుట (ఎన్నిక, లెక్కింపు, ప్రకటన,
ఇరువదియైదు సంవత్సరములు మించిన వయస్కులే, రాష్ట్ర, కేంద్రశాసనసభలకును, ముప్పదియైదుకు మించిన వారలు కేంద్ర శాసనసభలకును, సభ్యత్వము పొందదగినవారు. వీరు భారతదేశములో ఏ నియోజక వర్గమునకయినను చెందిన వారలై యుండవలయును. ప్రతిసభ్యుని నామనిర్దేశమునకు (నామినేషను) ఆయా నియోజక వర్గములనుండి ఒక యుక్తవయస్కుడు ప్రతిపాదింప వలయును. మరియొక యుక్తవయస్కుడు బలపరచ వలయును. వీరిరువురును ఆ నియోజక వర్గ జాబితాలో నియోజకుడు (వోటరు) గా నుండి తీరవలయును. ఒక యభ్యర్థి పెక్కు నియోజకవర్గములలో పోటీచేయు నవకాశము కల్గియుండగలడు. ప్రతి నామనిర్దేశమునకు పూర్వమే రాష్ట్ర సభలకు రు. 250- లోకసభకు రు.500- రుసుము ప్రతియభ్యర్థియు ధరావతుగా చెల్లించవలయును. నామ నిర్ధేశపత్రముల నన్నింటి నొక సాంకేతిక సమయమందు నియోజకాధికారి యభ్యర్థుల సమక్షములో పరిశీలించి దోషములున్నచో ఈనాము నిర్దేశ పత్రములను రద్దు చేయవచ్చును. చట్టసమ్మతమైన యభ్యర్థి పత్రములను మాత్రమే స్వీకరించి ఎన్నికలకు అర్హత కల్గియున్న వారుగా ప్రకటించును. ప్రతియభ్యర్థియు ఎన్నికల సాంకేతిక చిత్రములలో (symbols) నొకటినో రెంటినో పేర్కొన వలయును. ఉపసంహరణమునకు కొద్దివ్యవధి ఇవ్వబడును.ఆకాల వ్యవధిలో అభ్యర్థులు ఉపసంహరించు కొనుటకు అవకాశమున్నది, ఎన్నికల ప్రకటనానంతరము నియమింపబడిన తేదీలో ప్రతి నియోజక వర్గములోను ఖండ ఖండములుగా ఎన్నిక కేంద్రములను తగు రక్షణలతో స్థాపింపబడి యొక యెన్నికల అధికారికి స్వాధీనము చేయబడి యుండును. జాబితాలో పేర్కొనబడిన ఆయాస్థల నియోజకులు ఆ సాంకేతిక దినమునందు క్రమబద్ధముగా ఒకరివెంట నొకరు లోపలికిపోయి యభ్య ర్థులకు వేరువేరుగా నిర్దేశింపబడిన సాంకేతిక చిత్రములతో (Symbols) సూచింపబడు ఎన్నికల పెట్టె లకు పైభాగముననున్న రంధ్రములో వారివారి ఇష్టానుసారముగా ఎన్నిక చీటివి ఉంచవలయును. ఈవిధాన మందు ఏవ్యక్తి యెవరి పెట్టెలో చీటీ వదిలివచ్చినది తెలియకుండునట్టి రహస్యము రక్షింపబడవలెనను సిద్ధాంతము ముఖ్యము. ఒకే వ్యక్తి తిరిగి రెండవసారి యెన్నికలో కృత్రిమముగా వోటు చేయకుండునటుల వారిచేతులమీద రంగును మచ్చగా వేయుదురు.
వోటింగు పూర్తి అయిన తదనంతరము అభ్యర్థులు, లేక వారల ప్రతినిధుల సమక్షములో నియోజకాధికారి చీట్లను వేరువేరుగా లెక్కించి అభ్యర్థుల జయపజయములను, వారలకు వచ్చిన సంఖ్యను అధికారరీత్యా ప్రకటన చేయును.
ఈ ప్రకటనానంతరము 45 దినములలోగా ప్రతి యభ్యర్థియు ఎన్నికలకు తాను చేసిన వ్యయమును విపులముగా పేర్కొనుచు జాబితాను దాఖలు చేయవలయును. చట్టరీత్యా ప్రతి యభ్యర్థియు ఇన్ని రూపాయలకు మించకుండ రాష్ట్ర శాసనసభకును, లోక శాసనసభకును- ఖర్చు పెట్టవలెనను నియమమున్నది. అంతకుమించి యెక్కుడు ఖర్చు పెట్టినచో సభ్యత్వము రద్దగును. ఆజాబితా కాలవరిమితిలో దాఖలుచేయనిచో సభ్యత్వమునకు హానికలుగును. ఈ పైన తెలిపిన యెన్నిక విధానము ప్రత్యక్ష పరోక్ష విధానము అనబడును. రెండవదయిన విధాన మేమన ఎన్నికరూపేణ వచ్చిన సభ్యులు మరొకరిని తిరిగి యెన్నుకొనుట పరోక్ష ఎన్నిక విధానమనబడును. ఈ పరొక్ష విధానము ననుసరించి రాజ్యసభసభ్యులు ఎన్నుకొనబడుదురు. శాసన సభ్యులెల్లరును రాష్ట్రపతిని ఎన్నుకొందురు. అదేవిధముగా శాసన సభాధ్యక్షుని, ఉపాధ్యక్షునికూడ నెన్నుకొందురు.
పైన తెలిపిన ప్రత్యక్ష విధానము రీత్యా గెలుపొందిన సభ్యులు శాసనసభలో వారివారి ధర్మములను ఐదు సంవత్సరములవరకు నెరవేర్చుకొందురు. వారి యెన్నికను రద్దుచేయుటకు సామాన్య న్యాయస్థానముల కెంత మాత్రము అధికారములేదు. కాని యెన్నికల తగాదాలను విమర్శించుటకు, తీర్పుచేయుటకు ప్రభుత్వము వారు ప్రత్యేక న్యాయస్థానమును (Tribunal) నెలకొల్పుదురు. ఎన్నికలు సమాప్తమైన కొంత వ్యవధిలోగా ఏ వ్యక్తి అయినను ఎన్నిక లనుగురించి యా క్షేపించుచు నొక విన్నపమును (petition) దాఖలు చేసికొన వచ్చును. ఆ ప్రత్యేక న్యాయస్థానమువారు విచారించి వివాదాంశమయిన ఎన్నికను: గురించి తీర్పు చేయుదురు. ఎన్నికలలో ఆక్షేపణకరమైన ముఖ్యాంశము లేవన, నియోజకులను లంచము చేతను, దుష్టప్రచారము చేతను, త్రాగుడుచేతను మోసపుచ్చి వోట్లను సంపాదించుట బలాత్కారమైన చర్యలచే ఎన్నిక విధానమును నిరోధించుట మొదలగునవి.
ఇటీవల లోకసభవారు ఈ యెన్నికల విధానమును మిక్కిలిగా క్లుప్తపరచవలయునని యోచించుచున్నారు.
స్థానిక సంస్థలలో పురపాలక, గ్రామసంస్థలలో కూడ ఈ యెన్నిక విధానము కలదు. ప్రతి రాష్ట్రమందును అందుకు సంబంధించిన చట్టములు, నియమములు కలవు.ఎక్కువగా ఈ స్థానిక యెన్నికలు జిల్లా అధికారులు యాజమాన్యముల క్రింద జరుగును.
మొత్తముమీద నేటి యెన్నికల విధానములో పలుకుబడి గల్గిన ప్రతివ్యక్తికి నఖండమైన అవకాశములు, అధికారములు సంపాదించు మార్గము నిస్సంశయముగా కనుపించుచున్నది. కాని ఆంగ్ల రాజ్యాంగ విధానము ననుసరించి భారతరాజ్యాంగములో వర్గపాలన పద్ధతి (Party system) నొప్పుకొనినట్లు ప్రత్యక్షమగుచున్నది. ముఖ్యమయిన వర్గములు (Parties) కాంగ్రేసు, కమ్యూనిస్టు, సోషలిస్టు, హిందూమహాసభ, మున్నగునవి.
ఈ వర్గమువారు వారివారి ముఖ్యులను అభ్యర్థులుగా నిలువబెట్టి వర్గద్రవ్య ప్రోత్సాహములతో వారివారి యభ్యర్థులను గెలిపించుకొని తుట్టతుదకు వారలలో ఎక్కువ పలుకుబడి కలవారిని ఉన్నత పదవులందుంచి రాజ్యాంగమును నడుపుచున్నారు. ప్రస్తుతము కాంగ్రేసు వర్గము వారుఅన్ని రాష్ట్రములలో నధికులై యున్నారు. ఓకానొక పరిస్థితియందు ఈ వర్గవిధానమువలన ఎన్నిక స్వాతంత్య్ర విధానములకు విరోధము పుట్టవచ్చునని యూహింపనగును. కాని ఆధునిక ప్రజాస్వామ్యమందు సామాన్యవ్యక్తికి అత్యధికస్థితి అబ్బుటకు వర్గవిధానము తప్ప మరొక సులభమయిన మార్గము కాన రాకున్నది.
వ. వెం.