Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎడ్వర్డు - ఫిట్టిరాల్డ్

వికీసోర్స్ నుండి

ఎడ్వర్డు ఫిట్టి రాల్డ్:

లార్డు ఎడ్వర్డు ఫిట్టి రాల్డు (1788-1798) ఐరిష్ దేశ భక్తుడు. ఇతడు లీన్స్టన్ యువరాజగు జేమ్సు, అతని భార్య ఎమిలో మేరీల ఐదవ కుమారుడు. 1763 వ. సంవత్సరమున అక్టోబరు నెల 15 వ తేదీన డబ్లిన్ నగర సమీపములో నున్న కార్టన్ హౌస్ లో ఇతడు జన్మించెను. 1779 లో సైన్యములో చేరి లార్డు రాడన్ సిబ్బందిలో అమెరికాలో పనిచేసినాడు. 1781 సెప్టెంబరు 1వ తేదీన ఇతడు యాటార్క్టింగ్సు యుద్ధములో తీవ్రముగా గాయ పడినాడు. 1783 లో ఫిట్టిరాల్డు ఐర్లండునకు తిరిగివచ్చి ఎట్టినుండి ఐరిష్ పార్లమెంటుకు ఎన్నుకొనబడెను. తరువాత గ్రాధన్ నాయకత్వములో నున్న చిన్న ప్రతిపక్షములో నితడు చేరెను. కాని చర్చలలో ఎక్కువగా పాల్గొనేడివాడు కాదు. ఆ తరువాత నితడు పూల్ విచ్ లో సైనిక విద్యాభ్యానమును పూర్తిచేసికొని 1787 లో స్పెయిను దేశమును పర్యటించెను. జార్జియానా లెనక్సు అను యువతిని ఇతడు ప్రేమించెను. కాని యామె ఈతని ప్రేమను నిరాకరించెను; మేజరు హోదాలో ఐదవ రెజిమెంటులో చేరుటకు ఇతడు నౌకలో న్యూబ్రంస్ విక్ వెళ్ళినాడు. 1789 లో ఇతడు ఎవరికి ఏమాత్రము తెలియని మారుమూల ప్రాంతములతో సహా ఫ్రెడరిక్ . స్టోన్ నుండి క్వెబెక్ వరకు దేశమంతటా పర్యటించెను. ఆ తరువాత సాహసయాత్రకు పూనుకొని డెట్రాయిట్ వెళ్ళగా హురాన్సు ఆదివాసులు ఆయనను తమనాయకునిగా స్వీకరించినారు. ఫిట్టిరాల్డు అక్కడినుండి మిసిసిపి ప్రాంతములో న్యూ ఆర్లియన్సు వరకు పర్యటించి ఇంగ్లండుకు తిరిగి వచ్చెను.

ఈ లోపుగా ఫిట్టిరాల్డు కీల్డేన్ నుండి ఐరిష్ పార్ల మెంటుకు ఎన్నుకొనబడెను. ఒక గోష్ఠిలో పాల్గొనుచు ఇతడు వంశ పరంపరగావచ్చు గౌరవబిరుదములను రద్దుచేయవలెనను ప్రతిపాదనను బలపరచియుండెను. స్వయముగా తనకున్న లార్డు బిరుదమునే ఇతడు త్యజించెను. ఇట్టి చర్యకై ఆయన సైన్యమునుండి తొలగించబడెను. ఈ సమయములో ఫిలిప్పె, డిజిన్ లిస్ దంపతుల కుమార్తె యైన పమేలా అను యువతి నతడు 1792 వ సంవత్సరము డిసెంబరు 21 వ తేదీన టోర్నేలో వివాహము చేసికొనెను. 1793 జనవరిలో ఈ నూతన దంపతులు డబ్లిన్ నగరము చేరుకొనిరి.

ఫిట్టిరాల్డు తిరిగి పార్లమెంటుకు ఎన్నుకోసబడి, ప్రతిపక్షములో ప్రముఖపాత్రను వహించెను. ప్రభుత్వ ప్రకట నము నొకదానిని తీవ్రముగా ప్రతిఘటించుచు ప్రసంగించి నందులకు ఈతడు అరెస్టు చేయబడి సభా న్యాయస్థాన మెదుట క్షమాపణము చెప్పుకొనవలసినదిగా కోరబడెను. తరువాత ప్రత్యేక రిపబ్లిక్ ను నెలకొల్పవలెనను ఉద్యమములో చేరెను. 1796 లో ఐరిష్ ప్రజల స్వాతంత్య్ర పోరాటములో ఫ్రెంచివారి సహాయమును అర్థించుటకై వోల్ఫ్టోన్ ప్యారిస్కు వెళ్ళెను. అదే నెలలో ఫిట్టిరాల్డు ఒక మిత్రునితో కలిసి హాంబర్లు వెళ్ళి ఫ్రెంచి మంత్రి రీన్ హార్డు ప్రభృతులతో చర్చలు జరిపెను. ఈ రాయబారములను విరమించుకొన వలసినదిగా భర్తకు చెప్పుమని పమేలాను యార్కు యువరాజు కోరెను. అయినను ఫిట్టి రాల్డు ఆ ప్రయత్నములను విరమించుకొనలేదు. స్వాతంత్య్ర సమరమునకు 280,000 మంది సిద్ధముగా నున్నారని చూపు పత్రములను చేతబూని, తమకు సహాయముగా ఫ్రెంచివారిని దండయాత్ర జరుపవలెనని ఆయన కోరెను. ఆ సందర్భములో ఏర్పడిన సైనిక సంఘమునకు తానే నాయకత్వము వహించెను. 1798 మార్చి 12 వ తేదీన థామస్ రేనాల్డు అందచేసిన సమాచారము చాలమంది కుట్రదారులను నిర్బంధించుటకు దారితీసెను. రేనాల్డు హెచ్చరికపై ఫిట్టిరాల్డు పట్టుబడకుండ తప్పించుకోనేను. పూర్తిగా తప్పించుకొని పారిపోవు అవకాశముండి కూడ తానే వారిని ప్రమాదస్థితిలోనికి నడిపినందున తన యనుచరులను విడిచివెళ్ళుటకు ఆయన నిరాకరించెను. మార్చి 30 వ తేదీన సైనిక శాసనము అమలులోనికి వచ్చెను.

ఫిట్టిరాల్డును పట్టుకొనువారికి 1000 పౌనులు బహుమతిగా నియ్యబడునని ప్రకటించబడెను. ఫిట్టిరాల్డు డబ్లిన్ నగరములో ఒక మిత్రునియింట దాగియుండెను. కానీ బహుమతికి ఆశపడిన మాగన్ అను నతడు ఈ రహస్యమును బయట పెట్టెను. మేనెల 19 వ తేదీన ఫిట్టిరాల్డు అరెస్టు చేయబడెను. అరెస్టుకుముందు జరిగిన సమరములో నతడు తీవ్రముగా గాయపడెను. తుపాకి దెబ్బలు కూడ తగిలినవి. న్యూగేటు జైలులో నుంచ బడెను. ఆ గాయములతో అక్కడనే ఇతడు 1798 జూన్ 4వ తేదీన మరణించెను. ఆయన ఆస్తిని స్వాధీన పరచుకొనుటకు ఒక శాసనము జారీచేయబడెను. భర్త మరణించక పూర్వమే దేశమును విడిచివెళ్ళవలసినదిగా అతనిభార్య ఆదేశించబడెను.

పమేలా హాంబర్లు వెళ్ళి 1800 లో జె. పిట్ కైర్న్‌ను వివాహము చేసికొనెను. అయినను చనిపోవు వరకు ప్రథమ భర్తను స్మరించుచు అతనిపట్ల భక్తి ప్రవృత్తులను కలిగియుండెను. ఆమెకు ఫిట్టిరాల్డువలన ముగ్గురు పిల్లలు కలిగిరి.

పిన్నవయసులోనే ఇంతటి సాహసకార్యములకు దిగిన ఫిట్టిరాల్డు పొట్టిగా, అందముగా నుండెడివాడు. అతని చక్కని మూర్తిత్వము, ప్రేమ, ఉదారబుద్ధి కుటుంబ సభ్యులందరి ప్రేమకు పాత్రమైనవి. కాని ప్రజలలో తాను చేయబూనిన సాహసచర్యలకు అవసరమగు కఠిన లక్షణములు ఆయనలో లేకుండినవి.. కపట మెంత మాత్రము లేక నిర్భయముగా వ్యవహరించెడివాడని రీష్ హార్డు వ్రాసినాడు.

ఫిట్టిరాల్డు జీవితమునుగూర్చి థామస్ మూరె, మార్టిన్ మాక్ డెర్మాత్, ఐ. ఏ. పేలరు మున్నగువారు పుస్తకములను వ్రాసిరి

కం. కా.