సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎడారులు
ఎడారులు:
ఎడారులు ప్రపంచమునందలి మొత్తపు భూ వైశాల్యములో నాల్గవవంతుకంటే ఎక్కువభాగమునందు విస్తరించి యున్నవి. ప్రపంచము యొక్క ఇతర ప్రదేశము అందుకంటె ఎడారులయందు తక్కువవాన పడును; ఎక్కువ గాలివీచుమ; ఎక్కువ ఎండకాయును; ఎక్కువ ఉష్ణోగ్రత ఉండును. ఇవి ఎడారుల ముఖ్యలక్షణములు. ఎడారులలో తరచుగా అతి శీతోష్ణ పరిస్థితు లుండును. నీరు తక్కువగా నుండుట అన్నింటికి సాధారణ ధర్మము. నీరు దొరకని తావులలో, దీర్ఘకాలికమైన అనావృష్టిగల తావులలో ఎడారులు ఏర్పడును. ఎడారి యనగా నీటిపారుదల లేకుండా పంటలు పండించుటకు సాధ్యముకానంత పొడిగా నున్న ప్రదేశము.
ఎడారులు పెక్టు అంశముల కలయికచే ఏర్పడుచుండును.
1. ఎక్కువ చలిగానున్న అక్షాంశములనుండి ఎక్కువ వేడిగానున్న అక్షాంశములకు వీచెడి వ్యాపారవవనములు వెచ్చదనమును గ్రహించును. ఇట్లు వీచెడి పొడిగాడ్పుల సమూహము దానిక్రిందనున్న భూభాగమునుండి నీటి యావిరిని పరిగ్రహించును. ఇట్లు తడిని కోల్పోవుచుండుటచే భూమి ఎడారిగా ఏర్పడుచుండును.
2. సముద్రప్రభావమునకు దూరమందుండుటచే ఖండముల లోపలి భాగములు ఎడారులుగా మారుచుండును.
3. వీచెడి పవనముల దిక్కునకు సమాంతరముగా విస్తరించెడి తీరప్రదేశములు సముద్రపవనముల నుండి ఎక్కువ నీటియావిరిని గ్రహింపజాలకుండును.
4. ఎడారులు చాలవరకు ఉపోష్ణమండలము (Subtropical) యొక్క ఎక్కువ గాలిఒత్తిడిగల మండలములో విస్తరించి యున్నవి. ఆశ్వికాణాంశములలోవలే (Horse latitudes) నిట్టనిలువుగా క్రిందికిదిగు గాలి, ఒత్తిడికి లోనగుట సంభవించును. ఇందుచే ఈ గాలి వెచ్చబడును, ఈ పరిస్థితులలో నీటియావిరి నీరుగా మారి, వర్షించుటకు అవకాశము మిక్కిలి తక్కువగా నుండును.
5. భూమిమీద కొన్ని తావులలో, పర్వత పంక్తులు తీర రేఖకు సమాంతరముగా విస్తరించుచు, వర్షపవనము లను అడ్డగించుచుండును. ఈ పవనముల కెదురుగా నున్న వైపున అత్యధిక వర్షపాతము, మంచు సిద్ధించును. గాలి వీచు వైపుననున్న పొడిగాలి మరింత వెచ్చదనమును పొందును. ఇట్లు గాలి వీచు వైపుననున్న కొండల ప్రదేశములందు ఎడారి లక్షణములు ఏర్పడును.
ప్రపంచపటములో భూమధ్య రేఖకు దక్షిణమున 20 నుండి 30 వరకుగల అక్షాంశములమధ్య ఒక ఎడారి తునక కనిపించును. ఇట్లే 20°-50° వరకుగల ఉత్తర అజాంశముల మధ్య ఎడారి సీమ లున్నట్లు తెలియును. భూమధ్యరేఖ వైపుననున్న దిక్కులో 'శవన్నా' భూములమధ్యగా ఖండములకు పడమటివైపున సాధారణముగా ఈ ఎడారులు విస్తరించి యున్నవి. ధ్రువములపై పుననున్న దిక్కులో తక్కువ అంశ ములమీదనున్న 'స్టెప్పీస్ ' (సమశీతల మండలపు పచ్చిక బయళ్ళు) కును, మధ్యధరా శీతోష్ణస్థితిగల మండలములకును, మధ్యగా ఇవి విస్తరించి యున్నవి. అన్ని అక్షాంశములలో నున్న ఎడారులకును వర్షము లేకపోవుట అనునది సామాన్య లక్షణము. సౌకర్యముకొరకు ఎడారులను (1) వేడీ ఎడారులనియు, (2) చలి ఎడారులనియు విభజింపవచ్చును. వేడి ఎడారులు ఉష్ణమండలపు ఎడారులు, లేక వ్యాపారపవనపు ఎడారులు అని కూడ పిలువబడుచున్నవి. వేడి ఎడారులు (1) భూభాగమునకు చెందిన విగను, (3) సముద్రభాగమునకు చెందినవి గను రెండు విధములుగా విభజింపబడినవి. భూఖండమునకు చెందిన వేడి ఎడారులు ఖండముల లోపలిభాగములలో కనబడుచున్నవి. ఆఫ్రికాలోని సహా రాను, అరేబియాలోని ఎడారులను కలిపినచో ప్రపంచములో ఒక పెద్ద ఎడారిగా ఏర్పడును. ఆస్ట్రేలియా ఎడారి, దక్షిణ ఆఫ్రికాలోని 'కల్హారీ' ఎడారి, భారతదేశములో వాయవ్యదిక్కుననున్న 'ధార్' ఎడారి, ఇవి భూఖండమునకు చెందిన ఎడారులు.
ఈ ఎడారుల పడమటితీర భాగములను వెన్నంటి ప్రవహించు శీతల జలప్రవాహముల వలన సముద్ర భాగ మునకు చెందిన వేడి ఎడారులు ఏర్పడుచున్నవి. పర్వతములకును, సముద్రతీరమునకు మధ్యగల ఇరుకైన భూభాగములలో ఈ ఎడారులు ఏర్పడియున్నవి. ఉదా: ఉత్తర అమెరికాలోని కాలిఫోర్నియా ఎడారి; దక్షిణ అమెరికాలోని ఉత్తర చిలీ ఎడారి; దక్షిణ పెరూ ఎడారి. ه శీతలపు టెడారులు యూరేషియాలోను,ఉత్తర అమెరికాలోను, దక్షిణ అమెరికాలోను కలవు. యూరేషియా ఎడారులు కాస్పియన్ సముద్రమునుండి తూర్పున ఖంఘన్ (Khinghan) పర్వతముల వరకును వ్యాపించి యున్నవి. అవి టక్లా మఖాన్ (Takia - Makhan), టర్కా స్థాన్, గోబీ ఎడారులు. నీటిపారుదలకై వాటిలో సరస్సులు కలవు. ఉ త్తర అమెరికాలో ఇట్టి గొప్ప సరస్సు ఒకటి శిలామయములైన పర్వతములలో నున్నది. దక్షిణ అమెరికాలో పెటగోనియా ఎడారి 'ఆండీస్' పర్వతములకు తూర్పువైపున నున్నది.
ఎడారి భూమియొక్క స్వరూపము (Desert Land form) : ఎడారి పరిసరము యొక్క ప్రత్యేకత శీతోష్ణ స్థితి, భౌతికములైన మిట్టపల్లములు, (Relief) — అను వాటి కలయిక చేత ఏర్పడుచున్నది. ఎడారులలో అన్ని విధములైన భూతలములు (Surfaces) కనబడుచున్నవి. ఉదా : ఇసుక, మట్టి, కంకర, చెట్టుచేమ లేని రాయి. ఎడారుల భూతలము ఒకప్పుడు చెట్లు చేమలు లేని శూన్యమగు మైదానముగా నుండవచ్చును; లేక ఎత్తువల్లములతో అలలవలె పడిలేచు పై భాగము కలదిగా నుండవచ్చును; లేదా పెక్కు పర్వతపంక్తులు మైదానములపై కనిపించవచ్చును. సహారా ఎడారిలో వేర్వేరు భూతలములకు వేర్వేరు పేర్లు వాడబడుచున్నవి : వీచెడి గాలిచే దిబ్బలు ఏర్పడిన ఇసుక 'ఎర్గ్' అని పిలువబడుచున్నది. కంకర మైదానములకు 'రేగ్' (Reg) అని పేరు. శూన్యము లయిన రాతి పొరలకు 'హమాదా' అని పేరు.
మైదానములు పెరుగుటకును, క్షీణించుటకును గాలి ప్రబలమైన కారణము. గాలివీచు దిశలోనున్న ఇసుక దిబ్బల ఆకారములు వేరు వేరుగ నుండుము, నెలవంకవలెనున్న ఇసుక మెట్టకు 'బ రెహాన్ ' అని పేరు. ఇట్టి స్వరూపముగల భూమి తరచుగా కానవచ్చును. వేడిమి బలమై, మార్పులకు లోనగు వాయు ప్రవాహములను పుట్టించును (Convectional currents), అట్టి వాయువులు ధూళిని కొరడాతోవలె చెల రేగకొట్టును. స్థానికములైన ఆ సుడి గుండములను ధూళిగమ్యములందురు. అవి పెద్ద యెత్తున సహారానుండి వీచును. 'సీతాకో' 'సై మూన్' 'ఖాంపిన్' అని వాటికి పేర్లు, అవికూడా వేడి యిసుక రేణువులను కొనిపోవును. అందుచే కొన్ని తావులలో 140° ఫా. వరకు గూడ ఉష్ణోగ్రత పెరుగుచున్నది; అది భరించరాని వేడిమి . దానివలన మనుజుల చర్మము, వ్రేలి గోళ్లు పగిలిపోవును. సన్నని ధూళి నోటిలోనికి, చెవులలోనికి, ముక్కులలోనికి ప్రవేశించును. కావున అచ్చటి అవసరములకు అనుగుణముగా అరబ్బులు తమదుస్తులు ఏర్పాటు చేసికొందురు. అట్లే ఈజిప్టుదేశీయులు 'ఖాంసిన్' అని పిలువబడు ఇసుక యొక్క వేడిగాడ్పుల వలన అచటి శవములు చెడకుండు నట్లు ఏర్పాట్లు కావింతురు. ఎడారి జలప్రవాహములను, లోయలను అరబ్బులు 'వాడి' లేక 'ఎట్టోయా' లు అందురు. మేఘములనుండి పడు నీరు ఎడారిలో నీటి ప్రవాహములుగా ప్రవహించి, వెంటనే ఇసుక లోనికి, రాళ్ళలోనికి ఇంకి మాయమగును. ఎడారికి ఆవలి భాగమున నున్న పర్వతములపై నుండి మంచు కరగుటవలన పుట్టిన నదులు ఎడారిగుండా ప్రవహించుచు సన్నగిలిపోవును. నిట్టనిలువుగాను, ఎగుడుదిగుడుగాను వరుసతప్పి ఉండు గట్లుగల లోతైన లోయల మధ్యగా నదులు ప్రవహించుచు, అడుగున నున్న మెతక రాళ్ళ నేలలను కోయుచు పోవుచుండును. ఉదా : ఎరిజోనా యందలి 'గ్రాండు కేనియన్' (Grand Canyon) ప్రాంతముగుండా ప్రవహించు 'కొలరేడో" (Colorado) అను వది. ఒక నైలునది మాత్రమే సహారాలో నుండి ప్రవహించుట లేదు. ఆరెంజి, కుసేవ్ అను నదులు కల్హారీ ఎడారిగుండా ప్రవహించుచున్నవి. "స్నేక్' నదియు, 'కొలరెడో" నదియు 'గ్రేట్ బేసిన్' యొక్క ఉత్తరమునకును, దక్షిణమునకును తప్పించుకొని పారుచున్నవి. 'పేరిమ్' నది 'కారకోరమ్' పర్వత పంక్తుల యొక్క హిమానీనదములవలనపుట్టి, 1250 మైళ్ళు ప్రవహించి, ఎడారిలోని ఇసుక గర్భములో లీనమగు చున్నది. టైగ్రిస్, యూఫ్రటిస్ నదులు (షట్ అల్-అరబ్) ఖుర్దీటాన్ పర్వతములలో పుట్టి, అరేబియా ఎడారిగుండా ప్రవహించి, పెర్షియన్ గల్ఫ్ (సింధు శాఖ)లో పడుచున్నవి.
కొండలతో ఆవరింపబడియుండు ఎడారుల యొక్క ఏటవాలు ప్రదేశములు, రాళ్ళతోగూడిన ఊబి, గులక రాళ్ళు, విసనకఱ్ఱ ఆకృతిగల వండుమట్టి మొదలగు వాటితో కప్పబడి యుండును. సహారా ఎడారి, లేక టారిమ్ బేసిన్ లోవలె ఊటలుకల లేక భూగర్భమందు నీళ్ళుగలచోటులలో 'ఒయాసిస్సులు' ఏర్పడినవి. ఒయాసిస్సులు ఎడారిలోని ఒంటెలదండు మార్గములకు కూడలి స్థానములు. ఎడారిమండలములలోని సరస్సుల నీరు మిక్కిలి ఉప్పదనము గలిగియుండును. అతిశయముగా ఆవిరియగుట, లేక మడికట్టుట ఉప్పదనమునకు కారణము. ఉదా : గ్రేట్ సాల్ట్ సరస్సు, డెన్సీ, ఏరల్ సముద్రము- వీటితీరములు వేసవిలో దట్టమైన ఉప్పుపొరలచేతను 'ఒక్కొక్కప్పుడు ఉప్పుపళ్ళెరముల చేతను,కప్పబడి యుండును. వీటికి 'ప్లాయాలు' (Playas) అని పేరు.
ఎడారుల శీతోష్ణస్థితి: అత్యంతమైన వేడిమి, అత్యంతమైన చలి, స్వల్పమైన వర్షపాతములో గొప్ప మార్పు. ఇవి ఈ శీతోష్ణస్థితికి లక్షణములు. ప్రతిదినము శీతోష్ణ పరిమాణములలో మార్పులు కలుగుచుండును. ఇది ఎడారి యందలి వాతావరణము యొక్క లక్షణము. వెక్టు ఎడారులలో శీతోష్ణవరిమాణము రాత్రి, నీళ్ళు గడ్డకట్టుకొను స్థితికి చాలా క్రిందనుండి పగలు 100 ఫా పైవరకును మారు చుండును. శీతోష్ణ పరిమాణములో ఇంత గొప్ప మార్పునకు కారణములు తేమ, మబ్బులు లేని ఆకాశము, ఆకాశమున మబ్బులులేక గాలి పొడిగ నున్న యెడల సూర్యకిరణములు స్వేచ్ఛగా ప్రసరించును. సహారాలో చాల భాగమునందును, ఇతరములైన వేడి ఎడారులయందును, నీళ్ళు గడ్డకట్టునట్టి శీతోష్ణ పరిమాణములున్నట్లు సాక్ష్యము లున్నవి. సహారా మధ్యభాగములో సంవత్సరమునకు 10 లేక 15 పొగమంచు వ్యాపించిన రాత్రులుఁడును. తక్కువ అక్షాంశ ములలోని ఎడారులలోనే అత్యంతము తీర్ణమైన శీతోష్ణ పరిమాణములు కనబడుచున్నవి. ఆఫ్రికా యొక్క ఉత్తర తీరముననున్న అజీజియా (Azizia) లో కచ్చితముగా 134° ఫా. ల గరిష్ఠ శీతోష్ణ పరిమాణమున్నట్లు నీడలో నుంచబడిన సున్నితములగు పరికరములచే నిర్ణయింపబడినది.
కాలిఫోర్నియాలో డెత్ వేలీ (death valle) అను ఒక చోట 136.4 ఫా. ల శీతోష్ణ పరిమాణమున్నట్లు కను గొనబడినది నీడలోని సూక్ష్మసాధనములచే కొలువబడిన శీతోష్ణ పరిమాణములలో ఇది గరిష్ఠము. గోబీ, టేరిమ్ బేసిన్ వంటి చలి ఎడారులలో శీతకాలమునందలి ఉష్ణోగ్రతలు 0° కంటె కంటే తక్కువగా నుండుము. వేసవిలో సామాన్యముగా శీతోష్ణ పరిమాణములు 100° పైగా నుండును, వేడి ఎడారులలోవలెనే ఇక్కడకూడ శీతోష్ణ పరిమాణముల వ్యత్యాసము మిక్కిలి ఎక్కువగా నున్నది. ఎడారులలో వాన తక్కువగా పడును. పడెడు మొత్తము వర్షములోకూడ అనేక మార్పులుండును. ఎడారులలో తప్పక వానకురియునని నమ్మక ముండదు. కొన్ని తావులలో సంవత్సరమునకు 5 అం. ల వర్షముపడును. పిదప కొన్ని సంవత్సరములవరకు వాన ఉండదు. ఎడారులలోని వర్షపాతము చాలవరకు స్థానికముగా వీచు ఉరుములతో గూడిన తుపానులవలన కలుగుచున్నది. ఆ వర్షపాతము చాల గాఢమయి, నీరంతయు వేగముగా ఇసుకలో నింకిపోవును. వాయు మండలములును, నిశ్చల చక్రములును (Belt of Calms) దక్షిణ సహారాలో వేసవి యందును, ఉత్తర సహారాభాగమున శీతకాలమునందును వానలు కురియుటకు కారణములు. ఆస్ట్రేలియా ఎడారి యొక్క ఉత్తర, దక్షిణ భాగములయందుకూడ ఇట్టి పరిస్థితులే కన్పట్టును.
వృక్షసంపద, జంతువులు : వర్షము లేమికి తట్టుకొని ఎడారి పరిస్థితులలో మనగల ప్రత్యేక వృక్షజాతులు ఇచ్చట పెరుగుచున్నవి. సాధారణముగా అన్ని ఋతువులలో నుండు ఎడారి పొదలకును, మూలిక లకును, చెట్లకును, నేలపై మామూలుగా నుండు చిన్న మొక్కల మూలవేళ్ళకంటే ఎక్కువ పొడుగైన వేళ్ళుండును. ఈ వేళ్ళ మూలమున వృక్షములు స్థానిక వర్ణోదకమును పీల్చుకొనును. నీటిని పీల్చుకొనుటకు ముండ్ల జెముడు (Cactus) వంటి పెక్కు మొక్కలపై ముండ్లు కలవు. వీటి సాయమున ఆ మొక్కలు మనుష్యులనుండి, జంతువులనుండి ఆత్మరక్షణ మొనర్చుకోనును. వాన లేని కాలమున ఉపయోగించుకొనుటకై మొక్కలు వాననీటిని కండరములలో నిలవచేసికొనును. ఎడారులలో పెరుగు ఇతర వృక్షములలో ఖర్జూరపు చెట్లు, ఐరన్ వుడ్లు మున్నగునవి కలవు. 'అలా ఆల్ఫా'—— మొదలగు పువ్వులు, గడ్డి జాతులు ఒక వత్సరముకంటే ఎక్కువ కాలము జీవింపవు. అవి ఒక వాన తడుపునకు వేగముగా అంకురించి కొలది రోజులలోనే పరిపక్వదశను పొందును. గులాబీ, కాఫీ మొక్కలు ఎడారులలో పెరుగును. ఇరాన్ దేశములో ఫెరానా లోయలో పుట్టిన ఎడారి గులాబీకి నాలుగు రేకులే ఉండును. దాని సువాసన మైళ్ళకొలది వ్యాపించును. 'యెమెన్' లోని కాఫీ మంచి రుచికిని, సువాసనకును ప్రసిద్ధము. ఇక్కడనుండి యే అరబ్బులు, ఐరోపా సముద్రయాత్రికులు దీనిని ఇతర ప్రాంతములకు కొనిపోయిరి.
ఎడారులలో జంతువులు నివసించును. వాడి కొమ్ములు గల దుప్పి, లేడివంటి జంతువులు, ఉడుతలు, కొరికి తిను నట్టి ఎలుకలవంటి ప్రాణులు, రేటిలు (Rattle) అను పాములు ఎడారులలో జీవించును. ఇవి ఒండొంటిని చంపి ఆహారమును, నీటిని, సంపాదించుకొనును. వీటికి చెట్ల ఆకులుకూడ ఆహారమగును. ఒంటెలు ఎడారి పరిస్థితులకు అనుకూలమైన లక్షణములు కలవి. ఒంటెకు 'ఎడారి ఓడ' అని పేరు. ఇవికాక ఎడారిలో గుఱ్ఱము లుండును. వేగముతో అత్యవసరమైన చోట దీర్ఘములైన ఎడారి ప్రయాణములకు ఇవి ఉపయోగించును. ఉత్తమ జాతిగుఱ్ఱములు అరేబియాలో కనబడుచున్నవి. గాడిదలు, ఆలపాకాలు ఎడారి సరిహద్దు భూముల జంతువులని కొందరందురు.
ఎడారి వంటలు : ఎడారులలో లభించు నీటిని పారుదల గావించి స్వల్పభాగములలో ప్రబలమైన వ్యవసాయము జరుపబడును. ఒయాసెస్సులు కూడ పెంచబడును. ఆస్ట్రేలియాయందలి బుగ్గబావులలో లభించు నీరు కొంచెము ఉప్పగా నుండును. ఈ నీటిసాయమున కొలదిగా పంటలు పండించబడుచున్నవి. పశువులు, గొజ్జెలు త్రాగుటకు ఈ నీరు ఉపయోగపడుచున్నది. ఎడారిలో నీరే ప్రాణాధారము. అందుచేత చ. మై. 1 కి అధిక మైన జనసంఖ్య (నీరుగల) ఒయాసిస్సులలోనే ఉండును. ఎడారులలోని భూమి తరచు మిక్కిలి సారవంతమైనది. కారణమేమన నీటిలో కరగెడి ఎరువులు ఇచట కరగవు. అని నీటిచే తొలగింప బడవు. అందుచేత నీటిపారుదల కల్పించబడినచో, ఎడారిభూములు మిక్కిలి ఫలవంతములై యుండును. నీటిపారుదలను కల్పించుటకు సాధ్యపడెడి శావులలోను ఎడారులందలి అన్ని నదుల లోయలందును ముఖ్యముగా నైల్, టైగ్రిస్, యూఫ్రిటిస్ నదుల లోయలలో ఖర్జూరము, మొక్కజొన్న, జొన్న, ప్రత్తి, పొగాకు, వరి, పండుచున్నవి. పెర్షియా, ఫెర్గానా దేశములందలి ఎడారి తోటలలో అత్తిపండ్లు, దానిమ్మలు,మల్బెరీలు, ద్రాక్ష పండ్లు, నిమ్మ పండ్లు, ఏప్రికాట్లు, పొగాకు, నల్లమందు, ప్రత్తి, గోధుమ, మొక్కజొన్న, బార్లీ,కర్బుజాలు మున్నగు వాటిని పండించుచున్నారు,
ఈజిప్టు ప్రత్తికి ప్రసిద్ధమైనది. ఇరాన్ దేశము ఖర్జూరపు పండ్ల ఉత్పత్తి విషయమున మొదట పేర్కొనదగినది. టర్కీస్థానములోను, ఆసియా ఎడారులలోను గోధుమలు, యవలు పండును. ఇండియాయందలి థార్ ఎడారిలో వలె కొన్ని ఎడారులలో నీటిపారుదల కల్పించి వ్యవసాయము జరువునపుడు సూక్ష్మనాళికలు కారణముగా లవణములు పైకితేలును. దీనివలనను, పై భాగమున బయలుదేరెడ్డి, పూవుల ఉత్పత్తివలనను వ్యవసాయము నకు అభ్యంతరము కలుగుచున్నది.
ఎడారులలో జన్మించిన ప్రజలు సంచారశీలురుగా నున్నారు. ఉదా: ఆఫ్రికాలోని బిడాయిన్లు, చలిఎడారుల లోని కిర్గిజ్ జాతులు, కేలిఫోర్నియా ఎడారిలో బూబ్లో ఇండియన్లు. వారికి స్వల్ప సంఖ్యగల కొన్ని గొట్టెల మందులు, మేకలమందలు ఉండును. ఈ వెంపుడు జంతువుల కొరకు నీటిని, పచ్చిమేతను వెదకుచు వీరు ఒక చోటి నుండి వేరొకచోటికి తిరుగుచుందురు. తోలుతోను, బట్టలతోను చేయబడిన గుడారములు సాధారణముగా వీరి కుండును. అవి తేలికగా మోసికొని పోవుటకు వీలుగా సుండును. గోబీ ఎడారిలోని ప్రజలు వీటిని 'యర్ట్' (yurt) అని అందురు. ఇవి ఇంచుమించు అర్ధగోళాకారము కలిగి ఉండును.
ఎడారుల యందలి ప్రజలు వానలు లేక గొప్ప కష్టములను అనుభవింతురు. తమ జీవితమునందలి కష్టము లను వీరు తరచుగా వైరాగ్యముచే ఎదుర్కొందురు. మహమ్మదీయుల మతము, యూదు మతము, కిరస్తానుల మతము ఎడారులలోను, ఎడారులకు దగ్గరగా నున్న ప్రదేశములలోను ఉద్భవించియున్నవి. ఎడారులలో రాత్రుల యందు ఆకాశము అద్దమువలె స్వచ్ఛమై ఉండును. అందుచేత చంద్రుడు, నక్షత్రములు నిరుపమానమైన కాంతితో ప్రకాశించును. కావుననే ప్రాచీన కాలమున ఈజిప్టు దేశీయులు ఖగోళశాస్త్రమునందు మంచి పరిజ్ఞానము కలవారైరి.
ఉష్ణమండలములోను, ఉపోష్ణమండలములలోను కల ఎడారులలో నివసించు జనుల యొక్క నేటి కాలపు జీవ నము ఇంచుమించు తక్కిన ముండలములలో నివసించు జనుల జీవనమువలెనే యున్నది. ఆధునిక శాస్త్రము కనిపెట్టిన విషయముల వలనను, కల్పింపబడిన అభివృద్ధుల వలనను ఈ ఎడారి ముండలములు కూడ మానవునికి వాస యోగ్యములైనవి. సూర్యుని వేడిమిని విద్యుచ్ఛక్తిగా మార్చి, దానిని నేడు ఎడారులలోని జనులు ఉపయోగించు కొనుచున్నారు. కొలరెడో వద్ద కట్టబడిన ఆనకట్టయు, నైల్ నదియొక్క మొదటి జలధారకు అడ్డముగా ఆశ్వన్ వద్ద ఇప్పుడు నిర్మింపబడనున్న ఆనకట్టయు, భకానాన్గల్ యొక్క ఎడమగట్టు కాలువయును వేలకొలది ఎకరములకు నీటి పారుదలను సమకూర్చుచున్నవి. విమానమార్గములు ఈ ఎడారిమండలములకు బాహ్య ప్రపంచముతో రాకపోకలకు వలసిన సౌకర్యములను కల్పించినవి. శీతలీకరణ యంత్రము (Refrigerator) యొక్క సాయమున ఆహార పదార్థములను పదిలపరిచెడి విధానము అమలు లోనికి వచ్చినది. ఏకాంతములును, నిరుపయోగములునుగా నుండెడి ఈ ఎడారి ఇసుకలలోని ఒంటరితనము ను వేరుపాటును తొలగించి, రేడియో అచ్చటనున్న వారికి ప్రపంచముతో సంబంధ బాంధవ్యము లను సమకూర్చియున్నది. పెక్కు తావులలో ఘామి యొక్క పై భాగములతో పేరుకొనియున్న లవణములు ఖనిజ పరిశ్రమలకు సాధనములై ఉన్నవి. ఉదా : చిలీ దేశములో ఎరువులుగా ఉపయోగింప బడుచున్న నత్రీజములు (Nitrates),. కాస్పియన్ సముద్రతీరములందలి వెలిగారము, ట్యునీషియాలోని స్ఫురితములు (Phosphates), సహారాలోని చాడ్ సరస్సు నుండి లభించు లవణములును, ఇట్టి ఖనిజ పరిశ్రమలకు సాధనములు. ప్రస్తుతకాలమున ఎడారులలో పెట్రోలియము విశేషముగా లభించుచున్నది. ఇరాన్, ఇరాఖ్, సౌదీఅరేబియా, కాలిఫోర్నియాలు పెట్రోలియము ఉత్పత్తికి అగ్రస్థానములుగ నున్నవి.
చెట్లను నాటుటవలన ఎడారుల యొక్క వ్యాప్తి అరికట్టబడున్నది. అడవులను వృద్ధిచేయు ప్రణాళికలచేతను, వనమహోత్సవములచేతను, థార్ ఎడారి యొక్క వ్యాప్తిని అరికట్టుటకై భారత దేశమున యత్నములు జరుగు చున్నవి.
ఎస్. అ.