సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఋషికుల్య
ఋషికుల్య : 'ఋషికుల్య' అనునది ఒరిస్సా రాష్ట్ర మందలి నదులలో నొకటి. 'ఋషిమాలో ' గుట్టలలో పుట్టుటచే దీనికి నామము గలిగెను, ఇది 115 మైళ్ళు తూర్పు వైపునకు పారి బంగాళాఖాతమున పడుచున్నది.
'సూరాడ', 'అస్క', 'పురుషోత్తమపురము', 'గంజామ్' అను నగరములీనదీతీరమున గలవు. 'అస్క' వద్ద ఈ నదిపై 10 కమానుల (Arches) వంతెనను నిర్మించిరి. 'పదమ', 'భాగువ', 'గోదహద్దు' అనునవి దీని ఉపనదులు. వేసవిలో వీనియందు నీరుండదు.
ఋషికుల్య ప్రాజెక్టువలన ఈ నదిలోని నీరు వంటల కుపయోగించుచున్నది. 'సూరాడ', 'అస్క' ల మధ్య 'జన్నిమల్లి' అనుచోట ఆనకట్టను నిర్మించిరి. అచటినుండి ఋషికుల్య కాలువ 4 మైళ్ళ పొడవును, దానినుండి త్రవ్విన ఇతర కాలువలు 188 మైళ్ళ పొడవును కల్గియున్నవి. ఈ ప్రాజక్టువలన 142,000 ఎకరముల పొలము సొగవుచున్నది. కాని పడవలు నడుచుటకు ఈ నది ఉపయోగపడుట లేదు.
'అస్క' వద్ద ఈ నది ఉత్తరవాహినిగా కొలదిదూరము పొరుచున్నది. అచ్చట ప్రతి సంవత్సరమును ఫిబ్రవరి నెలలో గాని, మార్చి నెలలో గాని పెద్ద ఉత్సవము జరుగును. వేలమంది జనులప్పుడు ఋషికుల్యయందు స్నానము చేయ నేతెంతురు.
యం వి. రా.