Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉస్మానియా విశ్వవిద్యాలయము

వికీసోర్స్ నుండి

ఉస్మానియా విశ్వవిద్యాలయము :

ఇది హైదరాబాదు రాష్ట్రమునందలి ఏకైక విశ్వవిద్యాలయము. క్రీ. శ. 1918 వరకు హైదరాబాదు రాష్ట్రమున ప్రాథమిక, మాధ్యమిక తరగతుల వరకు మాత్రమే విద్యా సౌకర్యములుండినవి. రాష్ట్ర ప్రజలకు ఉన్నత విద్యాభ్యాస సౌకర్యములు లేనిలోటును తీర్చుటకై నిజాం ప్రభువువారును, వారి ప్రభుత్వమును ఈ విశ్వవిద్యాలయము స్థాపింప సంకల్పించిరి. మద్రాసు విశ్వ విద్యాలయమునకు అనుబంధముగా నుండి ధనిక వర్గము వారికి మాత్రమే అందుబాటులో నుండిన నిజాంకళాశాల యందు ఆంగ్లము ద్వారమున విద్యాబోధనము జరుగు చుండినది. దేశ భాషలో విద్యను బోధించు నట్టిదియు, సామాన్య ప్రజలకు అందుబాటులో నుండునట్టిదియునగు విశ్వవిద్యాలయము యొక్క స్థాపనము, ఆవశ్యకమని వారికి తోచినది.

ఈ విశ్వవిద్యాలయ స్థాపనమునకు అప్పటి విద్యా శాఖా కార్యదర్శి కీ. శే. సర్ అక్బరు హైద్రి (నవాబు హైదర్ నవాజ్ జంగ్) జనకుడని చెప్పవచ్చును. హైదర్ నవాజ్ జంగ్ గారు విద్యా ప్రణాళికను గూర్చియు, విశ్వవిద్యాలయ స్థాపనమును గూర్చియు ఒక నివేదనమును శ్రీ నిజాము ప్రభువువారికి సమర్పించిరి. శ్రీ ప్రభువు గారు ఏతదుద్దేశమునకు సమ్మతి నొసగుచు విశ్వవిద్యాలయ ప్రణాళికయందు ప్రవేశ పెట్టదగిన ముఖ్యములగు కొన్ని అంశములను ప్రత్యేక గజెటునందు సూచించిరి. ఇది చరిత్ర ప్రాధాన్యముగల గజెటని చెప్పనొప్పును.

"ప్రాచ్య పాశ్చాత్య సంప్రదాయానుగుణమైనట్టియు లౌకిక, ఆధ్యాత్మిక, నైతిక ప్రవృత్తికిని, శారీరక, మానసిక వికాసమునకును దోహద మొసగునట్టియు దేశ దేశాంతర వివిధ భాషా సంప్రదాయ విజ్ఞాన సముపేతమైనట్టియు, వివిధ శాస్త్రములందు పరిశోధన దృష్టిని అలవరుచునట్టియు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడునట్టియు విద్యా ప్రణాళికను కూర్చుట సమంజసము. అదియే మా ఆదర్శము. అట్టి విద్యాబోధనము ఉర్దూలోనే జరుగవలయును. సమకాలిక పరిస్థితుల కను

గుణముగ ఆంగ్లభాషా సాహిత్య పరిజ్ఞానార్థము, ఉరుదు నకు ప్రత్యేకస్థానము నొసగుటయు మా సంకల్పము.” అని నిజాం ప్రభువు వారు సెలవిచ్చినారు. ఈ గజెటు లేదా మన్హూరు క్రీ. శ. 1918 లో (1327 ఫసలీ) వెలువడినది.

9.0 శాతము జనులకు తెలియని ఉర్దుభాషకు ఈ ప్రత్యేక గౌరవమేలు అనగా, ఉర్దు రాజభాష, శిష్టజనుల భాష, దేశ భాష అని సమర్థించినారు.

ఈ ఉర్దు విశ్వవిద్యాలయము నిజాం ప్రభువుగారి పేర "ఉస్మానియా విశ్వవిద్యాలయము"గా 1918 లో అవతరించినది. ప్రప్రథమమున ప్రణాళిక ననుసరించి ఉర్దు భాషలో పాఠ్య గ్రంథములు రచించుటకై, అందులకు అవసరమగు ప్రామాణిక సాంకేతిక పదజాలమును, భాషాస్వరూపమును నిర్ణయించుటకై, ఆయా శాస్త్రము లందు ప్రవీణులగు వారిని, భాషావేత్త లను నియమించి "ఉస్మానియా విశ్వవిద్యాలయ అనువాద - ప్రచురణశాఖ" నెలకొల్పబడినది. ఈ శాఖవారు అపారకృషి సలిపి, సమస్త శాస్త్రములందలి ముఖ్య గ్రంథములను, ఆధార గ్రంథములను ఉర్దు భాషలో రచింప జేసిరి. కొన్ని స్వతంత్రగ్రంథములు కూడ రచింపబడినవి. భారతీయ విశ్వవిద్యాలయములు అనేకములుండ దేశ భాషలో ఇట్టికృషికి పూనుకొనినవారు ఉస్మానియా విశ్వవిద్యాలయమువారే. వారు అవిరళ కృషి యొనర్చి, కష్టనష్టములకోర్చి ఉన్నత విద్యాబోధనము దేశభాషయందు జరుపవచ్చుననియు, అది ఆచరణ సాధ్యమనియు నిరూపించిరి. వారిదీక్ష, వారి ఉన్నత ఆదర్శము, వారి దేశ భాషను ప్రోత్సహించు సంకల్పము ప్రశంశనీయములుసు మార్గ దర్శకములునై యున్నవి. అయితే ఈ సందర్భమున గమనించదగిన ముఖ్యవిషయ మేమన, వారు తమ కృషికి దోహదకరముగా ప్రాంతీయ భాషల సహకారమును సంపాదించలేదు. వారు సృష్టించిన సాంకేతిక పదజాలమంతయును అరబ్బీ, పారశీక భాషలపై ఆధార పడి యుండుటవలన జనసామాన్యమునకు అనగా సామాన్య భాషాజ్ఞానము కలవారికి సుబోధముగ లేకుండినది. అది విద్యార్థులకు సయితము కొంతవరకు కఠినముగనేయుండినది. సంస్కృతము యొక్కయు ప్రాంతీయ భాషలగు ఆంధ్ర కన్నడ. మహారాష్ట్ర భాషల యొక్కయు సంప్రదాయములను పదములను కొంతవరకైనను ఉపయోగించుకొని యున్నచో ఈ ఉర్దు విశ్వవిద్యాలయము కొంతవరకు అభిమానపాత్రమైయుండి యుండెడిది. మరియొక విషయమీ సందర్భమున గమనించదగియున్నది. ఉర్దు రాజభాషగ నుండినంత మాత్రమున ఉర్దుకే అధిక ప్రాధాన్య మొసగబడినది. పాఠ్య ప్రణాళికయందు ప్రాంతీయ భాషలను నిర్బంధ పఠనీయములుగ గుర్తించియున్నచో విశ్వవిద్యాలయమువారి కృషి ఇంకను అధికముగ సఫల మగు అవకాశ ముండెడిది. కాని వారు ప్రాంతీయభాషలు ఐచ్ఛికముగా మాత్రమే పఠనార్హములని నిర్ణయించిరి. ఈ విధముగ ప్రాంతీయ భాషలకు అప్రాధాన్యము కొసగుచు చిన్న చూపు చూచినందున, ఈ కృషి యంతయు రాష్ట్రములోని అధిక సంఖ్యాకులకు విరుద్ధముగా తోచెను. 'అనువాద ప్రచురణశాఖ' యొక్క స్థాపనా నంతరము, గ్రంథ ప్రకటనానంతరము, ఉస్మానియా మెట్రికు తరగతులు ప్రారంభింపబడినవి. దారుల్ ఉలూమ్ విద్యాలయమున ప్రప్రథమమున మెట్రిక్ పరీక్ష 1918 లో జరిగినది. విద్యాలయములందు ఉస్మానియా మెట్రికుతో పాటు మద్రాసు విశ్వవిద్యాలయ ప్రణాళిక ననుసరించి ఆంగ్ల భాషలో, హెచ్. ఎస్. ఎల్. సి. పరీక్షకు చదువు అవకాశము కల్పింపబడినది. ఉన్నత పాఠశాలలు అటు తర్వాత ఎన్నియో నెలకొల్పబడినవి. క్రమాభివృద్ధి నొందు చున్న విద్యార్థుల సంఖ్య ననుసరించి ప్రైవేటు పాఠశాలలకుకూడ అనుమతి లభించినది.

ఉస్మానియా మెట్రికు పరీక్షలందు ఉత్తీర్ణులైనవారికి విశ్వవిద్యాలయ తరగతులందు ప్రవేశించుటకును, ఉన్నత విద్య నభ్యసించుటకును తత్ క్షణమే ఏర్పాట్లు ఓనర్చబడినవి. ప్రారంభదశయందు ఇంటర్మీడియటు, బి.ఏ. తరగతులు ప్రస్తుతము స్టేటుబ్యాంకుగల ఆవరణముననున్న కొన్ని భవనములందు ఏర్పాటుచేయబడినవి. అడిక మెట్టు ప్రాంతమున విశ్వవిద్యాలయ భవన నిర్మాణము జరుగు వరకు ఈ తాత్కాలిక భవనములందే విద్యాబోధనము జరుగుచుండెను.

అటు తర్వాత ఈ తరగతులు విశ్వవిద్యాలయ ఆవరణమునందలి తాత్కాలిక భవనములకు మార్చబడినవి. ప్రభుత్వము వారు హైదరాబాదు నగరమునకు తూర్పున నాలుగుమైళ్ళ దూరముననున్న రెండువేల ఎకరముల

విశాల భూభాగమును విశ్వవిద్యాలయ భవననిర్మాణము నిమిత్తమై ఒసగిరి. ఈ ఆవరణమున విశ్వవిద్యాలయ భవనములు, వసతిగృహములు, ఆధ్యాపకుల వసతిగృహములు, మొదలగు వాటి నిర్మాణమునకు మూడుకోట్ల రూపాయల ప్రణాళిక సిద్ధపరచబడెను.

ఈ ప్రణాళిక ననుసరించి ఆర్ట్సు కళాశాల నిర్మాణ మారంభమైనది. 1934 నుండి 1939 వరకు ఈ కట్టడము పూర్తియైనది. ఈ భవనము చక్కని నల్లరాతి కట్టడము. దాదాపు 33 లక్షల ద్రవ్యము వ్యయమైనది. హిందూ మహమ్మదీయ శిల్పకళా సంప్రదాయ సమ్మేళనమునకు చిహ్నమగు ఈ సుందరభవనము హైదరాబాదు నందలి ముఖ్యకట్టడములలో నొకటియై, పలువురిని ఆకర్షించు చున్నది. విశ్వవిద్యాలయపు తరగతులు 1939 లో ఈ భవనమునకు మార్చబడినవి. మొదట ఆర్ట్సు, సైన్సు తరగతులకు ఈ భవనమునందే వసతులుండినవి. కాని విద్యార్థుల సంఖ్య అభివృద్ధియగు కొలది ఇతర భవనముల ఆవశ్యకతను గుర్తించి, ప్రణాళిక ననుసరించి పదార్థ విజ్ఞాన శాస్త్రమునకు, రసాయనశాస్త్రమునకు, వృక్ష శాస్త్రమునకు, పశువైద్యశాస్త్రమునకు ప్రత్యేక భవనములు నిర్మింపబడినవి. ఈ నిర్మాణములు 1944 లో పూర్తియైన తర్వాత విజ్ఞానశాస్త్ర, తదితర శాస్త్రములకు చెందిన తరగతులు ఆయా భవనములకు మార్చబడినవి. ఆర్ట్సు కళాశాలా భవనమునందే విశ్వవిద్యాలయ కార్యాలయము, గ్రంథాలముము, తదితర కార్యాలయములు కలవు. 1944 నుండి ఇంటర్మీడియటు తరగతులు సైఫాబాదు కళాశాలకు, తదితర కళాశాలలకు మార్చబడినవి. ఇపుడు బి. ఏ. ఎం. ఏ. తరగతులకు మాత్రమే ఇచట బోధనము జరుగుచున్నది.

ఉస్మానియావిశ్వవిద్యాలయ ఆవరణమునందే ఇంజనీరింగు కళాశాలయు తదితర సాంకేతిక కళాశాలలును కలవు. ఇటీవల వైద్యకళాశాలకు సంబంధించిన ప్రథమ ద్వితీయ సంవత్సర తరగతులకు ఇచటనే వసతులు కల్పించబడినవి. ఈ ఆవరణమునందే విద్యార్థి వసతిగృహములు ఐదు కలవు. ఇందు మొత్తము వేయిమందికి మాత్రమే వసతిసౌకర్యములు కలవు. ఈ ప్రాంతమునందలి విశ్వ విద్యాలయ ఉపాధ్యతుల వసతిగృహము, విశ్వవిద్యాలయ ఉద్యానవనము దర్శనీయములు, కార్యాలయోద్యోగులకు, అధ్యాపకులకు ఆవరణమునందే కొన్ని భవనములు కలవు. ఈ ఆవరణమున ప్రణాళిక ననుసరించి మరికొన్ని భవనములు నిర్మించుటకు సంకల్పముకలదు. ఈ ప్రణాళిక ఆవరణస్వరూపమును ఆర్ట్సుక ళాశాల సమీపమున 'మాడల్ రూమ్'లో చక్కగా చిత్రించియున్నారు. దాని ప్రకారము నిర్మాణము జరిగినచో అచిరకాలమున ఈ విశాల ఆవరణము సుందర భవనములతో విలసిల్లి కన్నులపండువుగా నొప్పుచుండగలదు.

వివిధకళాశాలలు : నగరమున ప్రభుత్వయాజమాన్యమున నిర్వహింపబడుచున్నట్టివి ఆరుక ళాశాలలు కలవు. ఇందు రెండు డిగ్రీకళాశాలలు, నాలుగు ఇంటర్మీడియటు కళాశాలలు. మహిళాకళాశాలయందు డిగ్రీ తరగతు లేర్పాటు చేయబడినవి. డిగ్రీ తరగతులుకల వేరొక్కటి నిజాం కళాశాల. ఈ కళాశాల రాష్ట్రమున 1887 లో స్థాపితమైనది. 1947 వరకు ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయమునకు అనుబంధముగానుండి మద్రాసు విశ్వవిద్యాలయ పాఠ్యప్రణాళిక ననుసరించియే విద్యాబోధనమున కేర్పాట్లు కలిగియుండినది. 1947 లో ఈ కళాశాల స్వర్ణోత్సవము జరిగెను. ఆ సందర్భమున నిజాంప్రభువుగారు ఇకముందు ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయమునకు లోబడియుండును" అని ప్రకటించిరి. అప్పటి నుండియు ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయమునకు అనుబంధముగా నేర్పడినది. మొదట ఇచ్చట నున్న బి.ఏ. ఆనర్సు తరగతుల స్థానమున ఎం. ఏ. తరగతుల బోధనమునకు అవకాశము కల్పింపబడెను. ఎం. ఏ. తరగతులకు చరిత్ర, రాజకీయ శాస్త్రము, ఆర్థిక శాస్త్రము మాత్రమే బోధించుటకు ఏర్పాట్లు జరిగెను.

జిల్లాల ముఖ్యపట్టణములందును ప్రభుత్వకళాశాలలు కలవు. వరంగల్లు, గుల్బర్గా, ఔరంగాబాదులందున్న ఇంట ర్మీడియటు కళాశాలలలో, 1956 సంవత్సరము నుండియే డిగ్రీ తరగతులు ప్రారంభించబడినవి. నగరమునందును, రాష్ట్రమునందును మొత్తము మూడు బోధనాభ్యసన కళాశాలలు కలవు. లా కళాశాల ఒకటియే కలదు. మహబూబ్ కళాశాలయందు, నిజాం కళాశాల యందు మాత్రమే సహవిద్య కేర్పాట్లు కలవు. ఉస్మానియా ఆర్ట్సు కళాశాల యందు ఎం. ఏ. తరగతులందును సహవిద్యకు ఏర్పాట్లు కలవు.

హైదరాబాదు రాష్ట్రమున ప్రజాప్రభుత్వ మేర్పడక మున్ను విశ్వవిద్యాలయ కళాశాలల నిర్వహణమంతయు ప్రభుత్వ యాజమాన్యమున జరుగుచుండెను. ప్రజాసంస్థలు కళాశాలల నిర్వహించుటకు అవకాశములు లేకుండినవి.

1949 సంవత్సరమునందు ప్రజాసంస్థలు నిర్వహించు కళాశాలల స్థాపనముకై అనుమతి యొసగబడెను. అట్టి కళాశాలలలో వివేకవర్థనీకళాశాల మొదటిది. ప్రైవేటు కళాశాలలు తర్వాత ఎన్ని యోవెలసినవి. ఇపుడు నగరము నందును జిల్లాలందును దాదాపు పదునాల్గు కళాశాలలు కలవు. ఈ సంవత్సరమే వైద్యకళాశాలలు స్థాపించుటకు ప్రయివేటు సంస్థలకు అనుమతి లభించినది. గాంధీ మెడికల్ కళాశాల ఒక ప్రయివేటు సంస్థ స్థాపించినదే. రాజా బహదరు వేంకటరామారెడ్డి మహిళా కళాశాల ప్రత్యేకముగ పేర్కొనదగినది. ఈ మహిళాకళాశాలను మరియొక ప్రజాసంస్థ నిర్వహించుచున్నది. నగరమునందు ప్రజాసంస్థలచే నిర్వహింపబడుతక్కు కళాశాలలలో వివేకవర్థనీ కళాశాల, బద్రూకా వాణిజ్యకళాశాల, నానక్ రాంభగవాన్ దాసు సైన్సుకళాశాల ముఖ్యమైనవి. జిల్లాలందు పి.ఇ.ఎస్. కళాశాల, శంకర్ ఆర్ట్సు కళాశాల, రాయచూరు కళాశాల పేర్కొనదగినవి. ఇవి అన్నియు. విశ్వవిద్యాలయ పాఠ్యప్రణాళిక ననుసరించి, విద్యా బోధనమున కేర్పాట్లు చేయుచున్నవి. ఉస్మానియా విశ్వవిద్యాలయపు నిబంధన అన్నియు వీటికి అన్వయించును. అనుమతి నొసగుటయందు విశ్వవిద్యాలయమువారు చూపుచున్న ఔదార్యమును పురస్కరించుకొని పెక్కు ప్రజాసంస్థలు కళాశాలలను స్థాపించుటకై ప్రయత్నించుచున్నవి. నల్లగొండ, మహబూబ్ నగరము, నిజామాబాదు, కరీంనగరము జిల్లాలందు కళాశాలలను స్థాపించుటకై పలువురు కృషి సలుపుచున్నారు. ప్రస్తుతము ఈ కళాశాలలందు చదువుచున్న వారి సంఖ్య దాదాపు పదుమూడు వేలు. ఇందులో 1400 విద్యార్థినులు కలరు. ఐదుగురు వికలాంగులు, అంధులు కలరు. వీరికి ప్రత్యేకముగ విశ్వవిద్యాలయమువారు విద్యార్థి వేతనము మున్నగు సౌకర్యములను కూర్చుచున్నారు.

సాయంక ళాశాలల యొక్క స్థాపనోదంతము విశ్వవిద్యాలయ చరిత్రలో స్వర్ణాక్షరముల లిఖింపదగియున్నది. అర్థబలము లేకయో, చీకాకులవలననో, బలవత్తరములగు మరి యే యితర కారణముల వలననో మెట్రికు వరకే విద్యాభ్యాస మొనర్చి, ఉద్యోగులై ఇతర వ్యవహారములందు నిమగ్నులై విద్యా సముపార్జనమునకు తరుణము గడచిపోయినదని నిరుత్సాహముతో జీవితము గడుపుచున్న వారికి విశ్వవిద్యాలయమువారి సత్సంకల్పము వినూతన జ్ఞానజ్యోతిని ఆనందము ను ప్రసాదించినది. ఉదయము కార్యాలయములందు పనిపాట లోనర్చి స్వల్పమగు విశ్రాంతిగై కొని తక్షణమే ఉన్నత విద్యా సముపార్జనాసక్తులై, సాయంకాల కళాశాలలో విద్య నభ్యసించుచున్న ఉద్యోగుల యుత్సాహముకూడ ప్రశంస నీయమే. సాయంకళాశాలలు హైదరాబాదునం దొకటియు, సికింద్రాబాదునం దొకటియు రెండే కలవు. ఈ రెండు కళాశాల లందు దాదాపు 1500 ఉద్యోగులు విద్య నభ్యసించుచున్నారు. పరీక్షలందు కృతార్థులయిన వారికి ఉద్యోగ సంపాదనా విషయమునందును విశ్వవిద్యాలయాధికారులు తోడ్పడుచున్నారు. భారతీయ విశ్వవిద్యాలయములందు, ప్రభుత్వ పక్షమున నిర్వహింపబడు ఇట్టి విద్యాలయము లెచ్చటను లేవు. ఉస్మానియా విశ్వవిద్యాలయ మీ సందర్భమున ప్రత్యేక గౌరవస్థానమునకు అర్హతను వహించుచున్నది. 'లా' కళాశాలయందుకూడ ఉద్యోగులు విద్యాభ్యాస మొనర్చుటకు ఇట్టి ఏర్పాట్లే కలవు. సామాన్య విద్యార్థులకొరకు 'లా' కళాశాలలో తరగతులు ఉదయము ప్రత్యేకముగ ఏర్పాటు చేయబడినవి.

పరీక్షలు : ఉస్మానియా విద్యాలయమువారు సంవత్సరమునకు రెండు పరీక్షలను ఏర్పాటు చేసియున్నారు. ఒకటి మార్చియందును, మరియొకటి సెప్టెంబరునందును జరుగును. సెప్టెంబరుపరీక్ష ఇటీవలనే ప్రారంభమైనది. పరీక్షల నిర్వహించుటకు ప్రత్యేక కార్యాలయముకలదు.విశ్వవిద్యాలయోద్యోగులు, ప్రభుత్వముచే గుర్తింపబడిన పాఠశాలలందు పనిచేయు ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయ పరీక్ష లొసగుటకు ఏర్పాట్లుకలవు. స్త్రీలు కళాశాలలందు చేరకయే ఇంటర్మీడియేటు, బి.ఏ. పరీక్షలకు చదువుటకు అవకాశములు కలవు. విశ్వవిద్యాలయము వారు ఫ్రెంచి, జర్మన్ డిప్లోనూ పరీక్షలను కూడ నిర్వ హించుచున్నారు. ఉస్మానియా విద్యాలయమునందును, నిజాం కళాశాలయందును ఈ భాషలను బోధించుటకు, డిప్లోమా పరీక్షలకై విద్యార్థులకు శిక్షణ నొసగుటకు ప్రత్యేక సదుపాయములు చేయబడినవి. ప్రాచ్య విద్యాపరిపోషణార్థము సంస్కృతము, తెలుగు, కన్నడము, మహారాష్ట్రము మున్నగు భాషలందు, డిప్లొమా, బి. ఓ. ఎల్. డిగ్రీపరీక్షలను నిర్వహింపవలయునని విశ్వవిద్యాలయాధికారులు నిర్ణయించిరి. ఈ భాషలను బోధించుటకు విశ్వవిద్యాలయమువారు ఎట్టి ఏర్పాటుల నొనర్చలేదు. కాని విశ్వవిద్యాలయ పరీక్షల ప్రణాళికను, పాఠ్యప్రణాళికను అనుసరించి విద్యార్థులకు శిక్షణము నొసగు విద్యాసంస్థలను గుర్తించుటకు విశ్వవిద్యాలయము వారు అంగీకరించి యున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము వారు ఇతర విశ్వవిద్యాలయముల పరిక్షలను, పట్టములను, పరస్పరాంగీకార సూత్రముపైన అంగీకరించియున్నారు. మొదటినుండియు విశ్వవిద్యాలయ పరీక్షలకు చదువు విద్యార్థులు విశ్వవిద్యాలయ ఆదర్శము ప్రకారము ఉర్దులోనే సమాధానములు వ్రాయవలయునను నియమముండెను. కాని పోలీసుచర్య (1948) తరువాత సమాధానములు ఆంగ్లములో వ్రాయుటకు నియమాలు చేయబడినవి. ఇప్పుడు బోధనము ఇంగ్లీషులోనే జరుగుచున్నదకాని హిందీ లిపిలోను, ఉర్దు లిపిలో కూడ సమాధానములను వ్రాయుటకు అవకాశములు కల్పించిరి. విశ్వవిద్యాలయ విద్యార్థులు సాధారణముగా ఆంగ్లమునందే సమాధానములు వ్రాయుదురు.

ఇటీవలి మార్పులు: హైదరాబాదు రాష్ట్రమునందు ప్రజాప్రభుత్వ మేర్పడినపుడు విశ్వవిద్యాలయ ప్రణాళిక యందును, విద్యావిధానమునందును గొప్ప మార్పులు ప్రవేశ పెట్టబడినవి. విద్యాబోధనము ఇంగ్లీషుభాషయందే జరుగవలయునని విశ్వవిద్యాలయమువారు నిర్ణయించిరి. అకస్మాత్తుగ మార్పుచేయబడిన పరిస్థితులచే విద్యార్థులకు నష్టము కలుగకుండునట్లు ఉర్దు ద్వారా కొన్ని సంవత్సరములవరకు తరగతులు నేర్పాటు చేయుటకును, పరీక్షల నొనగుటకును, ప్రత్యేక సౌకర్యములు కలిగించిరి. పాఠ్యప్రణాళికయందు ఇంతకుముందు నైతికవిద్య లేదా ఇస్లాము మతవిద్య నిర్బంధముగా నుండెను. దానిని మార్చి ప్రాంతీయ భాషలను నిర్బంధపఠనీయములుగా ప్రణాళిక యందు చేర్చిరి. ఇస్లాముమతమునకు సంబంధించిన ప్రత్యేక శాఖ యొకటి యుండెను. అందుకూడ అధికారులు ప్రణాళిక యందు మార్పుల నొనర్చి సంస్కృతిశాఖను నెలకొల్పిరి. ఇందు ప్రత్యేకముగ ఇస్లాము మత సంస్కృతులకేకాక హైందవమతమునకును, సంస్కృతికిని స్థానము కల్పించబడినది. పాఠ్యప్రణాళికయందు కొన్ని నూతన శాస్త్రములు చేర్చబడినవి. మానవ సాంఘికశాస్త్రము, భూగోళశాస్త్రము, వాణిజ్య శాస్త్రము ఇట్టివి. సైన్సు విభాగమునందు కూడ విజ్ఞానశాస్త్రమునకు సంబంధించిన క్రొత్త శాస్త్రములు చేర్చబడినవి. ఇదివరకు ప్రాంతీయ భాషాసాహిత్యములందు పరిశోధనము సలుపుటకు ఏర్పాట్లు లేకుండినవి. 1950 నుండి తెలుగు, కన్నడము, మహారాష్ట్రము మొదలగు భాషలందు పరిశోధనము జరుపునట్లుగా విద్యార్థులకు, అధ్యాపకులకు సౌకర్యములు కూర్చి పాఠ్యప్రణాళికను అందుకు అనుగుణముగ దిద్ది తీర్చిరి. ఈ సంవత్సరమునుండి పత్రికారచనము కూడ ఒక శాస్త్రముగ నభ్యసించుటకు విశ్వవిద్యాలమువా రేర్పాటు చేసియున్నారు.

సంస్కృత అకాడమీ, తాళపత్ర గ్రంథాలయము : ఆర్ట్సు కళాశాలాభవనమునందలి గ్రంథాలయములో చక్కని ఏర్పాట్లు కలవు. దేశ విదేశ భాషలకు సంబంధించినవి దాదాపు 10,00,000 గ్రంథములు గ్రంథాలయమును అలంకరించి యున్నవి. దీని కనుబంధముగ ప్రత్యేక గ్రంథముల భాండాగారము కలదు. అపూర్వములయిన ఆధార గ్రంథములు, నిఘంటువులు, విజ్ఞానకోశములు, ప్రభుత్వ ప్రచురణలు, పటములు మొదలగునవి అందు దాదాపు మూడువేలవరకు కలవు. ఎం. ఏ. విద్యార్థులకు, డాక్టరేటు విద్యార్థులకు పరిశోధనమునకీ గ్రంథాలయ మెంతయు తోడ్పడుచున్నది. ఇచటనే దాదాపు 300 మంది విద్యార్థులు కూర్చుండి పఠించుటకు వీలగు చక్కని పఠనమందిరము కలదు. వలసినవారు కూర్చుండి పఠించుటకు సంవత్సరము పొడుగునను పఠనాలయము తెరచియుంచబడును.(రాత్రులందును, ప్రత్యేక సెలవుదినములందును తప్ప), ఇచటి తాళపత్ర గ్రంథాలయము ప్రత్యేకముగ పేర్కొనదగినది. ఇందు అన్ని భాషలందు మొత్తము 6604 గ్రంథములు కలవు. నవాబు సాలార్ జంగ్ బహద్దరు వారిచే సేకరించబడిన అమూల్య గ్రంథములు ఈ గ్రంథాలయమునందు చేర్చబడినవి. సంస్కృతాంధ్ర గ్రంథముల పట్టిక కూర్చుటకు ఇటీవలనే యత్నములు సాగుచున్నవి. సంస్కృత తాళపత్రగ్రంథములు సంస్కృత అకాడమీకి అప్పగించబడినవి. భారతీయ సంస్కృతికి దర్పణమగు సంస్కృత భాషావాఙ్మయములను గౌరవించి ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రత్యేకముగ సంస్కృత అకాడమీని స్థాపించిరి. ఈ అకాడమీవారు సంస్కృత తాళపత్రగ్రంథముల పట్టిక సిద్ధపరచుచున్నారు. అంతియే కాక అపూర్వ సంస్కృత గ్రంథముల పరిష్కరించి ప్రచురించుటకు ఏర్పాట్లు జరుగుచున్నవి. విశ్వవిద్యాలయాధి కార్యవర్గమువారు, ప్రభుత్వమువారు ఉదారముగ విరాళము లొసగి అకాడమీ కృషికి కార్యరూపమును సాధించుటకు ప్రోత్సహించుచున్నారు.

పరిపాలన నిర్వహణము: ఇంతకు పూర్వము నిజాం నవాబు ఉస్మానియా విశ్వవిద్యాలమునకు పోషకులుగను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానమంత్రి అధ్యక్షులుగను, ప్రముఖ విద్యావేత్త ఉపాధ్యక్షులుగను వ్యవహరించుచుండిరి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షులుగను, ప్రభుత్వముచే నియమితుడైన విద్యావేత్త ఉపాధ్యక్షులుగను ఉన్నారు. విశ్వ విద్యాలయ నిర్వహణమునకు రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక సహాయము జనగుచున్నను, పరిపాలనమున విశ్వవిద్యాలయము నకు స్వతంత్ర ప్రతిపత్తి కలదు. ఉపాధ్యక్ష పదవి మూడు సంవత్సరములవరకుండును. విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు యూనివర్సిటీ కౌన్సిల్ పరముగా తమ యధికారమును వినియోగించుచుందురు. విద్యావిషయము లందు సలహాల నొసగుటకు అకాడమిక్ కౌన్సిల్ ఏర్పాటయియున్నది. ఉపాధ్యకులు అధికారములు, బాధ్యతలు, విశ్వవిద్యాలయమునకు సంబంధించిన సమస్త విషయములనుగూర్చిన విశేషాంశములు, యూనివర్సిటీ చార్టరునందు వివరింపబడి యున్నవి. విశ్వవిద్యాలయ నిర్వహణమునకు, వివిధ శాస్త్రము లందు పరిశోధనములు జరుగుటకు రాష్ట్ర ప్రభుత్వము వారే కాక కేంద్ర ప్రభుత్వమువారు, విశ్వవిద్యాలయ గ్రాంట్లకమిషను వారు ఉదారముగ విరాళము లొసగియున్నారు. భారత దేశమునందలి ఇతర విశ్వవిద్యాలయములస్థాయి నందుకొన యత్నించుచు పురోగమించుచున్న ఈ విశ్వవిద్యాలయము ప్రత్యేకస్థానము గడింపగలదని ఆశింపవచ్చును. శాస్త్రపారీణులు, సమర్థులు అగు ఆచార్యులు, విద్యావేత్తలు నిరంతరము విద్యాసము పార్టనమున, విద్యాబోధనమున, పరిశోధనమున నిమగ్నులై విజ్ఞానదీపికలను వెదజల్లుచున్నారు.

ప్రస్తుతము విద్యాప్రణాళికలందు మార్పులు ప్రవేశపెట్టి ఈ విశ్వవిద్యాలయమును దేశీయ సంప్రదాయములకు అనుగుణముగ సిద్దపరచవలయునని విద్యావేత్తలు తమ నిర్ణయమును ప్రకటించిరి. ముందు ప్రీ-యూనివర్సిటీ కోర్సును, ఒక సంవత్సరము తరువాత మూడేండ్ల బి.ఏ. డిగ్రీకోర్సును ప్రవేశ పెట్టినారు.

కే. జి. రావు