సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉల్కలు
ఉల్కలు (Meteors) :
మేఘరహితమైన ఆకాశమును రాత్రివేళ జాగ్రత్తగా పరిశీలించినచో, ఆకస్మికముగ అగుపడి, ఆకాశమునుండి కొంత దూరము శరవేగముతోదిగి అదృశ్యమగు నక్షత్రములవంటి అంతరిక్ష వస్తువులు (celestial objects
కాననగును. అవియే ఉల్కలు. వీటిలో తక్కువ ప్రకాశము కలిగి ఒక క్షణముకంటె తక్కువకాలము మాత్రమే గోచరించు వాటిని శరతారలు అందురు. కొన్ని జాజ్వల్యమానముగా ఆకసమున కొన్ని క్షణములకాలము దీపించును. వీటిని అగ్నిగోళములందురు.
ఇవి భూమ్యాకాశముల కవ్వలి ప్రదేశమునుండి మహా వేగముతో క్షణమునకు 10 నుండి 50 మైళ్ళ వరకు ప్రయాణము చేయుచు భౌమిక వాతావరణమును తాకుచుండు రాళ్ళవంటి పదార్థములు. వీటిలో చిన్నవి గాలి రాపిడికి వేడెక్కి ప్రజ్వలించును. ఈ తాపమునకు అవి కరిగి ఆవిరియైపోవును. ఈ సంఘటన భూతలము నుండి 50 మైళ్ళ దూరములో జరుగును. ఈ పదార్థములలో పెద్దవి అంతకన్న దగ్గరకు వచ్చును. ఇంకను పెద్దవి భూమిమీద పడును. వీటిని ఉల్క లందురు.
ఉల్కలు : ఉల్కల పతనమును ప్రత్యక్షముగా చూచిన సన్నివేశములు చాల తక్కువగానే ఉన్నను, వాటి రచనను చూపు పాషాణములు పెక్కుచోట్ల కనబడుటచే అవి తరచుగా భూమిమీద పడుచున్నవి అని భావించవలెను. అవి తరచుగ వేలఖండములుగల శిలాసమూహములుగ భూమి మీద పడుచుండును.
అమెరికాలోని జీవకోటి సంబంధ వస్తు ప్రదర్శనశాలలో (Natural History Museum) భద్రపరుపబడినదే ఇంత వరకు లభ్యమైన వాటిలో పెద్దది. దాని బరువు 36½ టన్నులు. దాని పొడవు 10.9 అడుగులు. వెడల్పు 6.8 అడుగులు. ఎత్తు 5.2 అడుగులు. అది గ్రీన్ లాండులో దొరకినది. అట్టి పాషాణములు పైనుండి భూమిమీద పడినపుడు పెద్ద పగుళ్ళుకూడ ఏర్పడుటకద్దు, ఆరిజోనాలోని పెద్దపగులు ఉల్కాపాతమువలన నేర్పడినదే. దాని వ్యాసము 4000 అడుగులు, లోతు 600 అడుగులు.
ఉల్కలు మెరయుచు నల్లగా ఉండును. రసాయన విశ్లేషణము వలన దానిలో సుమారు 30 మూల ద్రవ్యము లున్నవని తేలినది; అందు ముఖ్యముగా ఇనుము, ఆమ్లజని, నికెలు, సిలికాను, మెగ్నీషియము, కొన్నిటిలో హేలియము కూడ ఉన్నట్లు తెలిసింది. దీనివలన ఒకప్పుడు వీటిలో రశ్ముద్దారులగు (Radio Active) మూల ద్రవ్యములు కూడ ఉండెడివని సూచితమగుచున్నది. వాటి యందున్న హేలియమునుబట్టి వాటి ఆయుః పరిమాణమునుకూడ అంచనా వేసి భూమి వయస్సుతో దాదాపు సమానముగా వాటివయస్సు ఉన్నదని నిర్ణయించినారు. దీనిననుసరించి ఉల్కలు, భూమి, ఇతరగ్రహములు ఒకే చోటునుండి (బహుశః సూర్యుని నుండి) పచ్చినవని ఊహించుచున్నారు.
భూమిమీదపడు ఉల్కలసంఖ్య: జాగ్రత్తగా పరిశీలించినచో సగటున గంటకుఆరుఉల్కలు కనబడును. వేరు వేరుచోట్ల వేరు వేరు వ్యక్తులు చేసిన పరిశోధనముల నాధారముగ చేసికొని గణించినచో భౌమిక వాతావరణమును కోట్లకొలది ఉల్కలు చేరుచున్నవని విశదము కాగలదు.
లఘు గ్రహములవలెను (Asteroids), తోకచుక్కల వలెను, ఉల్కలుకూడ సూర్యుని చుట్టు సక్రమకక్షలలో (Orbits) తిరుగుచున్నవి. సూర్యాస్తమయము తరువాత సూచ్యాకారములో పశ్చిమాకాశమునందు గోచరించు రాశిచక్ర తేజము (Zodaical light) బహుళ సంఖ్యాకములైన ఉల్కాసమూహములు సూర్యకాంతిని విప్రకీర్ణ మొనర్చుటచేతనే (scattering) కలుగుచున్నదని ఊహించుచున్నారు. ప్రతిగంటలోను అర్ధ రాత్రము మొదలు సూర్యోదయము వరకు కనిపించు ఉల్కల సంఖ్య సూర్యాస్తమయమునుండి అర్ధరాత్రమువరకు కనిపించు సంఖ్యకు రెట్టింపు ఉండునని గుర్తించినారు. భూమి తనచుట్టుతాను తిరుగుచున్నపుడు సూర్యుని చుట్టుతిరుగు ఉల్కలు, భూమిమీదనుండు పరిశోధకునకు అర్ధరాత్రము మొదలు మిట్ట మధ్యాహ్నము వరకు ఎదురుగాను, మిట్టమధ్యాహ్నమునుండి అర్ధ రాత్రమువరకు ఒకేవైపునకు తిరుగుచున్నట్టు కనిపించును. ఎదురుగా నున్నప్పుడు అన్ని రకముల ఉల్కలలో ఎక్కువ వేగముతో పోవుచున్న వాటిని తక్కువ వేగముతో పోవుచున్న వాటినికూడ పరిశోధకుడు చూచును. ఒకేవైపున పోవునపుడు, భూమి తిరుగు వేగముకన్న ఎక్కువ వేగముతో పోవుచుండు ఉల్కలు మాత్రము పరిశోధకునకు కనిపించును. అందువలన అర్ధరాత్రమునుండి మిట్ట మధ్యాహ్నమువరకు నుండుకాలములో భూమిమీద ఎక్కువ ఉల్కలుపడుట గమనింపదగినది.
ఋతుక్రమ ఉల్కాపాతము: ఉల్క లసంఖ్య సమానముగా నుండక, అనుదినము మారుచుండును. అందు ఋతువు ఋతువునకు వ్యత్యాసము కనిపించుచుండును. ఒక్కొక్క రోజున ఆకాశమున ఒక ప్రదేశమునుండి వాన కురిసినట్లు ఒక పెద్ద ఉల్కా సమూహము వచ్చును. దీనిని "ఉల్కలజల్లు” (Meteoric Shower) అందురు. ఒక్కో కప్పుడు వేలకొలది, లక్షలకొలది ఉల్కలు ఒకేసారి కనిపించును. ఇవి అన్నియు సమాంతర రేఖలలోనే పయనము' చేయుచున్నను దూరమునుండి చూచుటచే మనకు ఒకే ప్రదేశమునుండి పయనించుచున్న ట్లగపడును. (సమాంతరముగా నుండు రైలుపట్టాలను ఒక వంతెనమీది నుండి చూచిన అవి దూరముపోయి కలిసికొన్నట్లు కనిపించునుకదా! అట్లే.
సంవత్సరములో సుమారు. ఒకే రోజున ఈ (ఉల్కల) జల్లులు వచ్చును. జనవరి 2 వ. తేదీయందు కాలియము (డ్రేకన్) అనురాశినుండి వచ్చును. ఇట్లే ఏప్రెల్ 20. వ తేథియందు వైరా (స్వరమండలము) నుండియు, మే 6వ తేదియందు కుంభరాశినుండియు, జూలై 28 వ తేది యందు కూడ కుండ రాశినుండియు, అగష్టు 12 వ. తేది యందు యయాతి (పెర్సియస్) నుండియు, అక్టోబరు 20 వ. తేదియందు మృగశీర్ష (ఓరియన్) నుండియు, నవంబరు 14. వ. తేదియందు సింహరాశినుండియు, నవంబరు 24. వ. తేదియందు దేవయాని (ఆండ్రోమీడా) నుండియు, డిసెంబరు 10. ప. తేదియందు మిధునరాశి నుండియు వచ్చుజల్లులు నీటిలో ముఖ్యమయినవి. చిన్న చిన్న జల్లులు నేలకొలది కలవు.
లఘుగ్రహములవలె, తోకచుక్కలవలె, ఈ ఉల్కా సమూహములు కూడ సూర్యునిచుట్టు దీర్ఘవృత్తాకారములలో తిరుగుచుండునని హె. జి. న్యూటన్, జె.సి. ఏడమ్సు, అను వైజ్ఞానికుల పరిశోధనములవలన తెలియుచున్నది. భూకక్ష్యము ఉల్కాకక్ష్యము కలిసినపుడు ఉల్కలు భూమిమీద జల్లులుగా పడును.
ఉల్కల ఉత్పత్తి: యయాతి (పెర్సియస్) రాశినుండి వచ్చు ఉల్కలును క్రీ. శ. 1862 లో వచ్చిన "టటిక్" అను తోకచుక్కయు ఒకే కక్ష్యలో తిరుగుచున్నట్లు షియాపరేలి అను వైజ్ఞానికుడు తెలియపరచెను. తరువాత ఒపాల్జర్ అను విఖ్యాత శాస్త్రజ్ఞుడు, సింహరాశినుండి వచ్చు ఉల్కా సమూహము యొక్క కక్షయు, క్రీ.శ. 1866 లో వచ్చిన “టెంపెల్" అను తోకచుక్క యొక్క కక్షయు, ఒకటే అని గణించిచెప్పెను. తరువాత చాలమట్టుకు ఉల్కా సమూహము లన్నియు తోక చుక్కల దారులలోనే పోవుచున్నట్లు నిర్ధారణచేసిరి. ఈ పరిశోధనములు నాధారము చేసికొని ఉల్కలు తోకచుక్కల శిథిలఖండములే యని ఊర్టు అను హాలండ్ దేశ వైజ్ఞానికుడు నిర్ధారణ చేసేను.
ఎన్. రా.