సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉమామహేశ్వరము
ఉమామహేశ్వరము :
ఉమామహేశ్వరము శైవమతస్థులు పవిత్రముగా భావించు యాత్రాస్థలము. ఈ పుణ్యస్థలము శ్రీశైలమునకు ఉత్తర ద్వారముగ భావింపబడుచున్నది. ఇది మహబూబునగరు జిల్లా, అచ్చంపేట తాలుకాలో ఉన్నది. అమరాబాదునకు దావున ఒక కొండమీద మహేశ్వర దేవుడు వెలసియున్నాడు. కొండక్రింద ఉమామహేశ్వరాలయము కలదు. ఉమామహేశ్వరమునకు గుప్త మహేశ్వరము అను పేరుగూడ ఉన్నట్లు గ్రంథాధారములు కలవు. ఏ కొండ గుహాంతరాళముననో, ఏ భూగర్భబిలములోనొ ఈ దేవుడు వెలసియున్న యెడల దీనికి గుప్త మహేశ్వరమను పేరు సమంజసముగనుండును. కాని ఈ దేవాలయములు ఎత్తైన కొండమీదను, కొండక్రిందను కొన్ని మైళ్ళ దూరమువరకు భక్తులకు నేత్రగోచరమగు చుండును. ఆలయము నందలి లింగమూర్తికి పూజా పురస్కారములు జరుగుచుండును. భక్తులు స్వామిదర్శనమునకై వచ్చుచుందురు. ఈ పనులు రహస్యముగ జరుగునవి కావు. కావున ఇట్టి తావును గుప్తమహేశ్వరము అనుటలో ఔచితిలేదు. ఐనచో ఈ పేరు ఎట్లు కలిగియుండును ? పురాణములలో వర్ణితమైన గుప్తవంశజుజైన చంద్రగుప్తుని కథతో దీనికి సంబంధము కలదని కొందరు చరిత్రకారులు నుడువుచున్నారు. ఆ కథ ఏమనగా:
చంద్రగుప్తుడను రాజొకడుండెను. అతనికి చంద్రావతి యను కూతురుండెను. ఆమె అత్యంత సౌందర్యవతి. గాంధర్వ విద్యయందును ప్రవీణ. నవయౌవనశోభిత. అట్టి కొమార్తను చూచి తండ్రియైన చంద్రగుప్తుడే మోహ పరవశుడయ్యెను. కనరాని, వినరాని కార్యమునకు పూనిన తండ్రి యెడ చంద్రావతి ఏవగించుకొని, తండ్రి లేకుండ రహస్యముగా బయలు దేరి శ్రీశైలమునకు చేరెను. చేరి అచ్చట ఆ చంద్రావతి యోగినియై కఠిన తపస్సుచేసి, మల్లికాకుసుమములతో శివుని పూజించుచు, చివరకు తన వీణాగాన కౌశలమున ఆ దేవుని మెప్పుపొందెను. ఆమె మల్లికాకుసుమములచే పూజించుట చేతను, ఆ మల్లి కాదామము అర్జున కాంతి కలదగుట చేతను, ఆమె కోరిక నసుసరించి శివుడు మల్లికార్జునుడు అను నామమును ధరించెనట !
ఈ చంద్రగుప్తుడు సముద్రగుప్త సార్వభౌముని రెండవ కుమారుడనియు, ఇతడే చంద్రగుప్త విక్రమార్కుడను బిరుదు కలవాడనియు కొందరు భావించుచున్నారు. ఈ చంద్రగుప్తుడు తన కుమారైనే మోహించునంతటి పాపాత్ముడు కాడు. కిర్తికాముడు. విశేషించి, రుద్రసింహుడను శక రాజు దుర్వినీతుడును, విషయలోలుడు నయి ప్రజలను హింసించుచుండ, కోపించి వానిని తెగటార్చిన ధర్మపరుడు, ఇట్టివాడు మహాపాపకార్యమునకు ప్రయత్నించెననుటకు వీలులేదు. ఇక సౌకుమార్యవతియగు చంద్రావతి ఉత్తర హిందూస్థానములో దేవుళ్లులే రన్నట్లు వేలమైళ్ళు నడిచి వచ్చి శ్రీశైలము చేరుకొన్నదనుటయు తర్కబద్ధముగా లేదు. కాబట్టి గుప్తమహేశ్వరమునకును చంద్రగుప్త విక్రమార్కునకును ఎట్టి సంబంధము కనిపించదు. అయితే ఈ చంద్రగుప్తు డెవడను విషయమును నిర్ణయించుటకు మరియొక ఆధారము కలదు. ఆదేమనగా:
శ్రీశైలమునకు సమీపముననే 2, 3 మైళ్ల దూరమున చంద్రగుప్త పట్టణమను గొప్ప పట్టణ మొకటి పూర్వ కాలము నందు ఉండెడిది. దాని శిథిలములు ఇప్పటికిని కనబడుచున్నవి. ఈ చంద్రగుప్త పట్టణమును అల్పుడగు చంద్రగుప్తుడను రాజు ఏలుచుండెననియు, చంద్రావతి ఈతని కూతురై యుండుననియు భావింపవచ్చును. అయితే పురాణములలో చంద్రగుప్తుని గూర్చి అసంగతమయిన కథ యొకటి కనిపించుచున్నను, పాల్కురికి సోమనాథ కవి పండితారాధ్య చరిత్రలో చంద్రగుప్తుడు చంద్రవంశజుడనియు, భక్తుడనియు, చంద్రావతి ఈతని కూతురనియు ఈమెయు శివపూజా ధురంధర అనియు చెప్పినాడు. ఈ మహేశ్వర దేవాలయమును ఈ చంద్రగుప్తపట్టణ రాజగు చంద్రగుప్తుడే నిర్మించినాడేమో! అందుచే గుప్తమాహేశ్వరమను నామము వచ్చినదేమో!
ఈ మహేశ్వరమునకు ఉమామహేశ్వరమనియు నామాంతరము కలదు. మహేశ్వరుడున్న చోట ఉమకూడ
ఉండును. అందుచేత ఉమామహేశ్వరమని పేరు కలిగియుండును. లేదా, అచ్చట ఉమాగిరి యనునొక కొండ ఉన్నట్లు తెలియుచున్నది. బహువిధముల మహేశ్వర దేవాలయముగల కొండయే ఉమాగిరి యైయుండును. అందుచే దీనికి ఉమామహేశ్వరమను పేరు వచ్చి యుండును. కొండదిగువను ఉమామహేశ్వర దేవాలయము కలదుగదా! ఇది చాల చిన్నది.
ఉమామహేశ్వరము మతగ్రంథములందు ప్రశస్తినొందిన పుణ్యస్థలము. ఉమామ హేశ్వరమనుసది ఆ దేవాలయము కల ప్రదేశము మాత్రమే కాదు. దానికి చుట్టుప్రక్కల కొన్ని మైళ్ల వరకు వ్యాపించిన భూభాగము కూడ ఉమామహేశ్వర మనుటకు శాసనాధారములు కలవు. ఈ భూభాగమందు పెక్కు తీర్థరాజములుండెను. చరుకేశ్వరము, సంధ్యాసమాధి, గరుడేశ్వరము, సిద్ధేశ్వరము, నీలహ్రదము, కాలహ్రదేశ్వరము, పాపనాశము, గణేశ్వరము, దేవహ్రదేశ్వరము అను పెక్కు భవ్య తీర్థములు కలవు. ఈ మైదానమునందే భక్తులు గుళ్ళు, గోపురములు, మండపములు, మఠములు, వనములు నిర్మించి మహేశ్వరునకు అర్పించినట్లు శాసనాధారములు కలవు. వీటితో కూడిన విశాలమైన మొత్తము భూభాగమునకే ఉమామహేశ్వరమను నామము ఏర్పడినది. (శ్రీశైలమునకు బోపు యాత్రికులు ఈ తీర్థరాజములను దర్శించుకొని పోవుచుండెడివారట!
శ్రీశైలమునకు నాలుగు దిక్కుల యందును నాలుగు శివాలయములుకలవు. వీటిని ద్వారములందురు. ఇవి శ్రీశైలమను కామ ధేనువునకు "వర చతుర్ద్వార నివాస లింగములు సరసత నొప్పెడు చన్నులు" గా వర్ణితములైనవి. ఈ నాల్గింటిలో ఉమామ హేశ్వరము ఉరుతర శ్రీపర్వతోత్తర ద్వారమనియు, వరమహత్త్వంబు గలదనియు, శ్రీశైలోత్తర ద్వార విభుడు ప్రమధులబంచి లోకము లేర్చిన వాడనియు, వామదేవాంచిత వక్త్రంబుగా ఉత్తరముగా మహేశ్వరము తన రెననియు, ఉత్తరద్వార వాస్తవ్యుడైన మహేశ్వరుడు ఉద్యల్లింగమూర్తి అనియు, లింగమాహాత్మ్య మదీయ వాఙ్మనసాత్మక మ్మనియు ప్రశంస కలదు.
ఈ మహేశ్వర దేవాలయము అమరాబాదు దగ్గర ఒక కొండ మీద నున్నది. దానికి 900 మెట్లు గలవు. కొండ క్రిందను పూర్వకాలములో అమరావతీపురి యుండెనని లిఖితములు కలవు, ఈ అమరావతీపురియే అమరాబాదుగా మారినట్లు తోచుచున్నది.
ఈ దేవాలయము దాక్షిణాత్య వాస్తుశిల్పమును అనుసరించి నిర్మితమైనది. గర్భగుడి, అంతరాళ భోగమంటపము, నిత్యసూరి మంటపము, ఎత్తయిన గోపురములు, ప్రాకారకుడ్యములు, సరోవరము, పుష్పఫలో ద్యానములు - ఇవి దాక్షిణాత్య దేవాలయములలో కాననగు ప్రత్యేక లక్షణములు. మున్ననూరు నంది మల్లా రెడ్డి దాన శాసనము ఇట ప్రమాణము.
ఉమామ హేశ్వరములో దొరకిన శాసనములు కొన్ని దానములను తెలుపుచున్నవి. కాకతీయ రుద్రమదేవి కాలములో ఆ మహారాజ్య భండారు కరణము రామయంగారును, ఆయన భార్యలు మల్లసాని, గంగసానిగార్లును కొన్ని దేవాలయములను, శైవజోగులకు మఠములను నిర్మించి క్రీ.శ. 1280 లో మహేశ్వరదేవరకు సమర్పించి యున్నారు.
రేచర్ల వంశ దుగ్ధబ్ధి సుధాకరుడైన మాధవేంద్రుడు దేవినగ దక్షిణ ప్రాంతమందలి స్వనామాంకితమయిన మాధవవుర మందు రాజ్యోపవిష్టుండై "శ్రీ పర్వతోత్తర ద్వారమైన మహేశ్వర మంటవము మహచ్ఛిలా (స) మూహానను రమ్యంబుగా రచింపించి పదవాక్య ప్రమాణజ్ఞులైన మాయి భట్టోపాధ్యాయులచే శాసనంబు చెప్పుమని పంచిరి. శక సంవత్సరములు 1298 ఫాల్గుణము, " (క్రీ.శ. 1376.)
భారత సంప్రదాయస్థు డయిన సదానందుడను వాడును, దీనేని నరసమాంబ కుమారులగుపురుషో త్తముడు, హనుమడు, రంగడు అనువారలును, నందీశ్వర, కేశవ, పార్వతీ విగ్రహములను ప్రతిష్ఠింపించిరి. (క్రీ. శ. 1398)
ఆది ఉమామ హేశ్వర దేవాలయములోని మహేశ్వరునకు బయిరోజు అనువాడు నరసింహద్వారమును సర్వజిత్తు భాద్రపద శు. ౧౪ బుధవారమునాడు నిర్మించియున్నాడు.
శకవర్షంబులు 1347 అగు నేంటి విశ్వాసను నామ సంవత్సర కార్తీక బ౹౹౨ సోమవారమునాండు పాలకుర్తి మల్లి నాయిని కొడుకు సోమన మహేశ్వర నీలకంఠ పుణ్య క్షేత్రమందు గుప్త మల్లి కార్జున దేవర సన్నిధి వనప్రతిష్ఠ చేసినాడు. (1425)
కాకతీయ ప్రతాపరుద్ర మహారాజునకు పుణ్యంగాను 18 గ్రామముల జనులు సమావేశమయి మహేశ్వరదేవునకు పూజలు, సేవలు నిరంతరాయముగా సాగుటకు గొప్ప ఏర్పాట్లు చేసియున్నారు. ఈ శాసనవిషయము ముచ్చటగా నున్నది. ఒకసారి మహేశ్వర దేవుడు అప్పుల పాలయినాడట ! దేవాలయపు పారుప త్తెకాడయిన గణఖ వీరయంగారు 18 గ్రామములలో నుండు 72 నియోగములవారిని సమావేశపరచి వారికి దేవాలయ వికట పరిస్థితిని వివరించి వారి సహాయమర్ధించినాడు. తమ దేవునకు "ఇకముందు ఇబ్బందికలుగకుండ నుండుటకున్ను, మంచి ఆదాయము చేకురునట్లున్ను," 18 గ్రామాల వారు గుడ్డవృత్తుల వారిమీద పన్ను విధించినారు. బండ్లమీదను పన్ను విధించినారు. దీనిని గడిబండి కాద్రవ్యమన్నారు. 16 గ్రామాలలోని సిద్దాయమునుకూడ దేవున కర్పించినారు. సిద్దాయమనగా, కర్చులుపోను మిగిలిన ద్రవ్యము. జాబితా ననుసరించి నియోగాలవారు సొమ్ము చెల్లించవలెను. ఈ సొమ్ముతో స్థానప్రయాలు సరిపుచ్చవలెను. ధనరూపకముగా కానుక లొసంగుటయేగాక మంచి సంటభూములనుగూడ దానమొసగినారు. ఈ భూములమీది ఆదాయముతో రౌద్రిసంవత్సరమునుండి ప్రభవసంవత్సరమువరకు గల ఎనిమిది సంవత్సరములలో దేవుని అప్పులు తీర్చి వేయవలెను. ధర్మకర్తలగు మా హేశ్వరులు ఆభూములను అమ్మగూడదనియు కొత్తఅప్పులు చేయగూడదనియు శాసించినారు, ఈ ఎనిమిదిసంవత్సరముల కాలములో అప్పిచ్చినవాడు ద్రోహి. ఆ భూములను కొన్న వాడు ద్రోహి. వీరు పాపములను మూటగట్టుకొనుటయేగాక, రాజదండనకు పాత్రులయ్యెదరు. ఈ శాసనము క్రీ. శ. 1320 లో వేయబడినది. జనుల భక్తి విశ్వాసములను, పారమార్థిక చింతను, ఔదార్యమును ఈశాసనము వెల్లడిచేయుచున్నది.
ఈ ఉమామహేశ్వరాలయము ఎప్పుడు నిర్మితమైనదో సరిగా తెలియదు. 700 సంవత్సరముల క్రిందటివరకు శాసనాధారములు కనబడుచున్నవి. కావున ఈ దేవాలయ నిర్మాణము కనీసము వేయిసంవత్సరములకు పూర్వమే జరిగియుండునని నిస్సంశయముగా చెప్పవచ్చును.
కాలప్రభావమున ఈ మహేశ్వర దేవాలయము, మహత్తరమయిన ఈ పుణ్య క్షేత్రము తొల్లింటి వైభవమును కోల్పోయినను, ఇంకను దర్శనీయమై భక్తులను తరింపి చేయుచునే యున్నది. ఈ క్షేత్రమున శివరాత్రినాడు గొప్పజాతర జరుగుచుండును.
ఆ. వీ.