Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉప్పట్లు (ఉప్పు పట్టెలు)

వికీసోర్స్ నుండి

ఉప్పట్లు (ఉప్పుపట్టెలు) :

ఈ ఆట ఆంధ్ర దేశమున పలు తావుల ప్రచారములో నున్నట్లు ప్రాచీనాంధ్ర సాహిత్య గ్రంథముల వలన

దెలియుచున్నది. గ్రంథములలో నిది ఉప్పనబట్టెలు అని పేర్కొనబడెను. 13 వ శతాబ్ది చివరివా డగు నాచన సోముడు తన యుత్తర హరివంశమున 4 వ ఆశ్వాసము, 155 వ పద్యములో నిట్లు వ్రాసెను.

“కప్పము పేర నేడు నొడికారితనంబున మోసపుచ్చగా
నుప్పులు దెత్తురే? సమర యోగ్యతలంబున వైరికోటితో
నుప్పనఁబట్టె లాడు నెడ నుప్పులు దెత్తురుగాక యాదవుల్."

ఆ గ్రంథముననే 5వ యాశ్వాసములో కవి యిట్లు వ్రాసెను.

“పడతి నీచూపు లుప్పనఁ బట్టెలాడించి
          చెలుల వక్త్రములఁ బూజింతుఁగాక."

పదునారవ శతాబ్దివాడగు ధూర్జటి తన కాళహస్తి మాహాత్మ్యమున తిన్నడను బోయవా డాడిన యాటలలో దీనిం బేర్కొనెను.

సీ. చిడుగుడు వ్వలపోటి చెండు గట్టినబోది
యల్లి యుప్పనఁబట్టె అప్పళాలు
గీ. ... ..... ..... ..... .....ఆడు
దిన్నడభినవ బాల్య సంపన్నుడగుచు.

ఈ యాటయందు చలన లాఘవమును, దృష్టి లాఘవమును పెంపొందునుగాన పల్లెటూళ్ళలో యువకులు మహోత్సాహము తోను, బలప్రదర్శనముతోను ఆడు చుండెడివారు. పాశ్చాత్య నాగరికత దేశమున ప్రబలిన తరువాత నీ యాటమూలమూలల దాగుకొనుచున్నది.

ఈ ఆటలో చిన్న ఉప్పట్టే అను ఆట తేలిక. కట్లాటలో వలె, ముగ్గురు ముగ్గురు అరచేతిలో చరచుకొను 'పంట' ఆటవలన దొంగను నిర్ణయింతురు. కొంత దూరములో చెట్టునో, మరియేవస్తువునో తల్లిగా నిర్ణయింతురు. నేలమీద అడ్డముగా ఒక బద్దెగీచి దొంగ అబద్దెపై కావలి కాచు చుండును. వానికి వెనుక కొంతదూరములో మొదటిగీతకు సమానాంతరముగా ఉప్పుపట్టె యను గీత గీయబడి యుండును. దొంగ చేయిచాచిన ఆందకుండునంత దూరములో ఇరువైపుల రెండు నిలువుగీతలు ఉప్పుపట్టిని చేర్చుచు గీయబడును. ఇట్లొక చతురస్రాకారపుగది బద్దెలతో నేర్పడును. దొంగ తనగీతమీద కావలికాచుచుండగా దాని వెలుపలనున్న ఆటగాండ్రు దొంగచేతిని తప్పించుకొని లోనికిచాటి, వెనుక నున్న ఉప్పుపట్టినిగూడ దాటి పోవలెను. ఈయత్నములో దొంగచేత ముట్టుకొనబడిన వాడు దొంగయగును. మూడుసార్లు ఆటగాంద్రందరును లోనికి వెళ్ళి తిరిగివచ్చినచో ఆటముగియును. ఒకమారు ఉప్పుపట్టెను దాటినవాడు తిరిగివచ్చి ఇతరులను ముట్టుకొనును. దీనినే ఉప్పు అందించుట యందురు. మూడు సార్లందరును తిరిగివచ్చునప్పటికి దొంగగా మిగిలి పోయినవాడు చివరకుదొంగ. వాడు పరుగెత్తి తల్లిని ముట్టుకొనవలేను. ఈ లోపున వానిని మిగిలిన యాటగాండ్రు మెరి పెట్టిన తమకండువాలతో గొట్టుచు తరుముదురు,

పెద్ద ఉప్పట్టె ఆడుట కష్టము. దీనిలో రక్షణపక్షము ఒకటి. ముట్టడిపక్షము ఇంకొకటి. రక్షణ పక్షములోని మొదటి ఆటగాడు మొదటి అడ్డగీతపై కావలి కాచుచుండును. ఆ అడ్డగీతకు వెనుక సమానాంతరములుగా ఒక దానివెనుక నొకటి సమానదూరములో మూడు అడ్డ గీతలుండును. ఈగీతల కిరువైపుల నిలువుగా రెండు గీతలు అడ్డగీతలను కలియుచుండును. ఈరెండు నిలువుగీత లేగాక మధ్యగా నొక నిలువుగీతకూడ నుండును. దీనిని సూర గీత అందురు. అడ్డుగీతలలో చివరిది ఉప్పుపట్టి. ఈ గీతలవలన ఆరుగదు లేర్పడును.

వాటి యాకార మిట్లుండును : ముట్టడిపక్షము 1, 2, 3,' 4', 5', ముట్టడి పక్షపు వారు 1వ గీత యెదుటినుండి కాని, పటములో చూపినట్లు గదులలో నుండి కాని ఆట ఆరంభించి, ఎదుటిగడులలోనికి దుముక యత్నింతురు.

అడ్డుబద్దెలును సూరగీతయు కాచువారు- నడుము వంచకుండ చేతులు సాచి లోనికి దూరువారిని తాకుటకు యత్నింతురు. ఇట్లు రక్షణపక్షములో నైదుగురు, ముట్టడి పక్షములో నైదుగురును ఆటగాండ్రుందురు. సూరబద్దె కాచువాడెప్పుడును నిలువుగా తనబద్దెమీద పరుగు పెట్టుచు కాచుచుండును. అడ్డుబద్దెల వారిని సూరకాచువానిని తప్పించుకొని ఆటగాండ్రు ప్రతి గదిలో నుండియు దూకి ఉప్పుపట్టెను దాటి, తిరిగి వెనుకకు రావలెను. 5' వ అటగాడు, అనగా ఉప్పు తెచ్చువాడు పట్టుపడకుండ క్రమముగా మీది అన్ని గదులలోనికి వచ్చి అచ్చటి యాటగాండ్రను

తాకుటయే ఉప్పు అందించుట యందురు.

ఒక్కొక్కప్పుడు సూరబద్దె కాచువాడును, రెండు అడ్డబద్దెలు కాచువారును రెండువైపులను కాచుచుండ ఇద్దరు ముగ్గురు ముట్టడిపక్షవువా రొక గదిలో చిక్కుకొని పోవుదురు. ఈ స్థితిని దొడ్డివేయుట యందురు. తమంతట బయటబడుటకు దొడ్డిలోనివారు యత్నించుచుండ ఉప్పు తెచ్చెడు వాడుగాని, ఆ పక్షపు ఆటగాండ్రుగాని డొడ్డిలోని వారిని తప్పించుటకు యత్నింతురు. ఉప్పు తెచ్చినవాడు వారిని ముట్టుకొనగలిగినచో వారు పండినట్లే. ఐదుగురొక పక్షముగాన వారిలో నొకడైనను ముట్టుకొనబడినచో ఆ పక్షము ఓడిపోయి, వారు కాచువారగుదురు. ఇట్లీ ఆట సాగును, పక్షములు మారుచుండును.

ఇట్టి ఆటలు పూర్వకాలపు సాంఘిక పరిస్థితులకు అనుకరణములై యుండును. దసరాపండుగలో బడిపిల్లలు గిలకల బద్దలతో ఇల్లిల్లు తిరుగుట ఆ కాలపు విల్లమ్ముల తోడి యుద్ధయాత్రలను మనకు స్మరణకు దెచ్చునట్లు, పేక్కండ్రు ఉద్యోగస్థులను, దొంగలను తప్పించుకొని, పలు పాట్లు పడి సముద్రతీరమునుండి ఉప్పు గొనివచ్చువారు దానిని లోపలిదేశమున కందిచ్చుట మనకీయాట జ్ఞాపకమునకు దెచ్చును. ఆరీతిగ ఈ యాటలు పుట్టి యుండవచ్చును.

వా.రా.