సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉపాధ్యాయుడు (యుగయుగములలో దేశదేశములలో)
ఉపాధ్యాయుడు : (యుగయుగములలో - దేశదేశములలో)
మానవసంఘము నాగరకదశయందు ప్రవేశించిన తరువాత ప్రజలలో అనేక సద్గుణములు పెంపొందెను. అందు జ్ఞాన సంపాదనా పేక్ష యొకటి. జ్ఞానము రెండువిధములు. ఒకటి లౌకికముగ మానవుడభివృద్ధి చెందుట కావశ్యక మగు జ్ఞానము. రెండవది, ఆముష్మిక విషయములకు చెందిన జ్ఞానము. ఈ ద్వివిధజ్ఞానమును మనకు కలుగ జేయువాడు ఉపాధ్యాయుడు లేక గురువు. వివిధ కాలములలో, వివిధ దేశములలో, ఆ ఉపాధ్యాయు డెట్టివాడుగ నుండెనో మనము తెలిసికొనవలసియున్నది. ఉపాద్యాయుని యోగ్యత లేక అర్హత, అతడు బోధించు విషయము, గురుశిష్యుల సంబంధము, ఉపాధ్యాయుని ఆర్థికస్థితి అను సంశములు విచారింపదగినవి. విద్యయొక్క పరమ లక్ష్యములతోపాటు ఉపాధ్యాయుని అర్హతయు మారుచుండును.అర్హతనుబట్టి ఉపాధ్యాయునికి సంఘమునగల గౌరవము కూడ మారుచుండును. కావున వివిధ యుగములలోను, వివిధ దేశములలోను ఉపాధ్యాయునికి గల గౌరవము, ఆ గౌరవము నకుగల కారణములు అను సంశములు కూడ మనకిప్పుడు చర్చనీయములు. ఉపాధ్యాయుని గూర్చి చర్చించుతరి విద్యార్థి యొక్క ప్రశంసకు స్థానముకలదు. గురుశిష్యులకు అవినాభావసంబంధము కలదుకదా !
అతి ప్రాచీన కాలమునుండియు భారతీయ విద్యా సంప్రదాయములో గురువున కత్యున్నతస్థానము లభించి యుండెను. తైత్తిరీయోపనిషత్తునందు శిక్షావల్లిలో, ఆచార్యుడు శిష్యునకు సందేశ మొసగుచు, "మాతృదేవో భవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ" అని శాసించెను. "తల్లిని దైవముగ భావింపుము, తండ్రిని దైవముగ భావింపుము, ఆచార్యుని దైవముగ భావింపుము" అని ఈ శాసనమునందలి తాత్పర్యము. "గురుర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవోమ హేశ్వరః గురుస్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః" అను దానినిబట్టి భారతీయ విద్యార్థి గురువును పరబ్రహ్మ స్వరూపునిగ నమ్మి నమస్క
రించును అని విధితమగుచున్నది. విద్యయనగా మానవుడు పరమేశ్వర స్వరూపమును తెలిసికొనుటకు సాధన భూతమగు జ్ఞానసంచయము. అట్టి జ్ఞానమును ప్రసాదించు వాడు గురువు. అంతేకాదు, గురువు బ్రహ్మ సాక్షాత్కారము పొందిన ధన్యుడు. అట్టి గుర్వనుగ్రహము వలన శిష్యుడుకూడ పరమపురుషార్థమగు ముక్తిని సాధించి నగును. ఈ సాధనమందు గురువు పరమేశ్వరునికిని, మానవునికిని మధ్యవర్తిగనుండి శిష్యునికి తరణోపాయము చూపును. కావుననే భారతీయులు గురువు నత్యంతముగ గౌరవించుచుండిరి. గురుభక్తి ఉత్తమ మానవున కుండవలసిన యోగ్యతగ భారతీయులు భావించిరి. గురువును దైవతుల్యునిగా పూజించు మర్యాద, ఆధ్యాత్మిక విద్యను బోధించు గురువునకే కాక ధనుర్విద్య, రాజకార్యనిర్వ
హణము మున్నగు లౌకికవిద్యల బోధించు గురువునకు కూడ లభించెడిది.
ప్రాచీన కాలమందలి గురుశిష్యుల సంబంధములో నొక అంశము ప్రత్యేకముగ గమనింపదగియున్నది. వేదమంతయు ముఖస్థమైన వెనుక, అందలి పరమార్థమును గ్రహించుటకై ప్రయత్నము జరుగుచున్నది. అందు గురుశిష్యు లిరువురును పాల్గొనుచున్నారు. ఈ మహా సాధనమందు "ఆచార్యః పూర్వరూపమ్ | అంతే వాస్యు త్తరరూపమ్ | విద్యాసంధిః ॥ ప్రవచనగ్ం సంధానం" అని తైత్తిరీయోపనిషత్తు తెల్పుచున్నది. పరమార్థ విజ్ఞాన సంగ్రహణమున గురుశిష్యు లిరువురును భాగస్వాములు. వారిరువురిని బంధించునది విద్య. ప్రవచనము వారిరువురికిని గల సంబంధము. శిష్యునియందు విజ్ఞానప్రాదుర్భావము కల్గుట గురువునకు వైజ్ఞానికమగు పునర్జన్మము. శిష్యుడాతని యుత్తరరూపము. విజ్ఞానసంపాదనము గురు
శిష్యు లిరువురి సహకారమువలననే సాధ్యము అను సంశముపై ప్రాచీనగ్రంథమునందు సూచితము.
ప్రాచీన భారతీయులు గురుశిష్యుల కుండవలసిన సంబంధమును గూర్చి నియమములు కావించిరి. తల్లియు,తండ్రియు, ఉపనయనము కావించినవాడును, విద్యాభ్యాసము చేయించిన వాడును గురువులు. వేదమును సంపూర్ణముగ చదివించినవాడు ఆచార్యుడు.అందు కొంతభాగమును మాత్రమే నేర్పినవాడు గురువు. ఉపనయనము జరిగిన తరువాత శిష్యుడు గురుకులవాసము చేయుచు, భిక్షాచరణమువలన ఉదరపోషణము కావించుకొనుచు, వినయవంతుడై గురువునకును, తత్పత్నికిని సేవ చేయుచు, గుర్వనుగ్రహమును వడసి విద్యాలాభమును పొందవలెను. విద్యార్జనము కావించునప్పుడు బ్రహ్మచర్య నియమములను కఠినముగ పాలింపవలెను. భోగముల పొంతకు పోరాదు. గురువు శిష్యునికి మంచిమాటలతోనే బోధింపవలెను. అవసరమగు నెడల బెదరింపవలెను. కొన్ని సందర్భములలో గురువు శిష్యుని త్రాటిలో కాని వెదురు బెత్తముతో కాని శిక్షింపవచ్చును. అంతకుమించి శిష్యుని దండించు గురువు రాజదండనమునకు పాత్రుడగును. ఇవి శాస్త్రకారుడగు గౌతముడు పేర్కొనిన నియమములు, మనువు కూడ గౌతమునితో ఈ నియమ విషయ మున నేకీభవించుచున్నాడు.
గురువు సాధారణముగ నున్నత వంశ సంజాతుడై ఉండవలెను. విద్యార్జనమును, ప్రవచనమును, అతనికి వంశాను గతములై యుండవలెను. గురువు ధర్మానుష్ఠాన పరుడు కావలెను. ఈతడు శిష్యునియందలి వాత్సల్యముచే ఆతనికి విద్యాదానము చేయవలయును. మరుగుపరచక తా నెరిగిన అంశముల నన్నిటిని గురువు శిష్యునకు బోధింపవలెను. ఉత్తముడగు గురువు (ఆచార్యుడు) ధనలాభము కొరకై విధ్యాబోధనము కావింపడు. ధనమును స్వీకరించి విద్యను బోధించువాడు ఉపాధ్యాయుడని మనువు మున్నగువారు అభిప్రాయపడిరి. ఆచార్యునికి శిష్యుని వలవ శుశ్రూషపొందుట కధికారము కలదు. అయినను అట్టి అధికారమును దుర్వినియోగము కావించుట కాని, శిష్యుని యొక్క విద్యాభ్యాసమునకు భంగము కల్గువిధముగ శుశ్రూషకొనుట కాని గురువున కెంతమాత్రము
తగదు. శిష్యుని నైతికౌన్నత్యముకొరకు మాత్రమే గురు శుశ్రూష విధింపబడినది. విద్యాభ్యాసము పూర్తియైన వెనుక శిష్యుడు గురువునకొసగు దక్షిణ లాంఛనప్రాయము. అది ధర్మ్యమార్గమున సంగ్రహింపబడవలయును. శిష్యుడు గురువున కొసగు దక్షిణ ఆవు, గుఱ్ఱము, ఛత్రము, పాదుకలు, ధాన్యము, కూరగాయలు మొదలగువాటిలో నొక రూపములో నుండ వచ్చును. నిజమునకు విద్యాదానమునకు ప్రతిఫలములేదు. గురువు పేదవాడై శిష్యుడు సమర్థుడైన పక్షమున, శిష్యుడు తన అవసరములకొరకై వలయుసంభారములను తెచ్చుకొని గురువు కుటుంబములో నొక్కడుగ నివసింపవచ్చును. విద్యాభ్యాసము పూర్తి కావించుకొని స్వగృహమునకు మరలిపోవు శిష్యు నుద్దేశించి, ఆచార్యుడు కావించు అనుశాసనము తైత్తిరీయోపనిషత్తునశిక్షావల్లి యందు వర్ణింపబడినది. ఇయ్యది ఉత్తమమగు నాదేశము,
కొన్ని సందర్భములలో విద్యార్థి తన ఇంటి కడనే తండ్రి వలననో, తాత వలననో, లేక తదితర సమీప బంధుపుల వలసనో విద్యార్జనము కావింపవచ్చును. ఆపద్ధర్మము క్రింద బ్రాహ్మణేతరుడగు గురువు కడ విద్యార్థి జ్ఞాన సముపార్జనము కావింపవచ్చును. గురు కులమువాడై నను శిష్యునికి పూజ్యుడే.
ఎట్టి సందర్భమునందును అనర్హుడగు శిష్యునికి విద్యాబోధనము కావింపరాదని ప్రాచీన భారతీయులు గురువును పౌనఃపున్యముగ శాసించిరి. ఈ యంశమునే శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత యందు తెల్పియున్నాడు. గీతాబోధ నము కావించి తుట్టతుదకు శ్రీకృష్ణుడు అర్జునునితో ఇట్లనెను.
ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన
న చాశుశ్రూషవే వాచ్యం నచ మాం యో భ్యసూయతి.
ఈ గీతా రహస్యమును తపస్వి కానివానికిని, భక్తిశ్రద్ధలు లేనివానికిని, గురు శుశ్రూష చేయనివానికిని, పరమేశ్వరుని చూచి అసూయపడు వానికిని తెలుపగూడదు అని దీని భావము. ప్రాచీన కాలికులగు గురువులు తమ వద్దకు వచ్చు విద్యార్థుల అర్హతను పరీక్షించిన మీదటనే వారికి జ్ఞానదానము చేసెడివారు.
విజ్ఞానకోశము - ౨
ఉపాధ్యాయుడు
ఆర్య సంప్రదాయమున నేటి కళాశాలల వంటి కళాశాలలు లేకుండెను. ఆనాడు సమస్త విద్యలను నేర్చి, ధర్మనిష్ఠతో వరలిన ఆచార్యుడే ఒక కళాశాల వంటివాడు. అతడు స్వగృహమందో, లేక ప్రశాంతమగు నరణ్యమునందో పరిమిత సంఖ్యగల శిష్యులకు విద్యాబోధనము కావించెడివాడు. ఆచార్యునకును, అంతేవానికిని అత్యంత సన్నిహితమగు సంబంధముండెడిది. ఇట్టి సంబంధమే ప్రాచీన విద్యావిధానమునకు గుండెకాయ. కానీ కాలక్రమమున నీపద్ధతి మారిపోయెను. చారిత్రక యుగమున రాష్ట్రకూట రాజులు, చోళులు మున్నగువారు విద్యాభివృద్ధికై మఠములందును, దేవాలయములందును కళాశాలలను నెలకొల్పి, వాటి వ్యయముకొరకై విరివిగ భూములను దానము చేసెడివారు. ఇందు వందలకొలది విద్యార్థులును, అనేకులు ఉపాధ్యాయులును ఉండెడివారు. మొదటి రాజేంద్రచోళ చక్రవర్తి “ఎన్నాయి రం” అను ప్రదేశమున నొక వైదిక కళాశాలను నెలకొల్పినట్లు శాసనములు తెల్పుచున్నవి. ఈ “ఎన్నాయిరం" అను గ్రామము నేటి దక్షిణ ఆర్కాటు జిల్లాలోనిది. ఇందు వేదములు, వేదాంగములు, వ్యాకరణాది శాస్త్రములు విద్యార్థులకు బోధింపబడుచుండెను. విద్యార్థులకు ఉచిత విద్య, భోజనవసతులు ఏర్పాటు కావింపబడుచుండెను. ఇందు 340 మంది విద్యార్థులును, పదుగురు అధ్యాపకులు నుండిరట. అధ్యాపకులకు నిర్ణీతములగు వేతనము లుండెడివి, కళాశాలల పోషణకొరకై రాజేంద్రచోళుడు 300 ఎకరముల భూమి నొసగెనట.
బౌద్ధధర్మము భారతదేశమున వ్యాపించిన వెనుక విద్యారంగమున కొన్ని ముఖ్యమగు మార్పులు వచ్చెను. బుద్ధధర్మము నకు సంఘములు ప్రాణములవంటివి. మత ప్రచారముకొరకై సంఘములు భిక్షువులకు శిక్షణము నొసగుచుండెను. బౌద్ధవిహారములే ఇట్టి శిక్షాకేంద్రములు. ఇందు పలువురు అధ్యాపకులు మతదీక్ష గైకొన్న విద్యార్థులకు జ్ఞానబోధనము కావించుచుండిరి. ఈ విధముగ బౌద్ధ యుగమున విహారములు లేక మఠములు విద్యా నిలయములుగ, కళాశాలలుగ నెలకొనేను. విద్యాప్రదానమునకు బౌద్ధు లితరములగు ఏర్పాట్లు కావింపలేదు. బౌద్ధ విద్యా కేంద్రములలో ఉపాధ్యాయులు, ఆచార్యులు అని అధ్యాపకులు రెండు తెరగుల నుండిరి. ఉపాధ్యాయుడు ఆచార్యునికంటె ఉన్నతశ్రేణికి చెందినవాడు. ఉపాధ్యాయుడు అంతేవాసులకు విద్యాబోధనము కావించెడివాడు. ఆచార్యుడు సంఘమునందు క్రమశిక్షణము కల్పించు చుండెడివాడు. బౌద్ధయుగమునాటి శిష్యుడు కూడ ప్రాచీన భారత విద్యార్థి వలెనే గురువునకు శుశ్రూష చేయుచుండెడివాడు. పవిత్ర జీవితమును గడపుటయు, ధనాపేక్ష లేకుండుటయు శిష్యుని ధర్మములు. గురువు శిష్యుని వాత్సల్య దృష్టితో చూచుటయే కాక అవసర మగునప్పు డాతనికి ఆర్థికసహాయము కావించుచు, అతనికి అనారోగ్యము సంభవించునప్పుడు తల్లివలె కాపాడి సేవ చేయుచుండెడివాడు.
జాతకకథల వలన కూడ బౌద్ధయుగమునాటి గురుశిష్యులకు సంబంధించిన అనేకాంశములు తెలియుచున్నవి. విద్యార్జనముకొరకై ఆనాటి యువకులు దూర ప్రాంతములకు పోవుచుండిరి. ఆ కాలమున తక్షశిల ప్రసిద్ధ విద్యా కేంద్రముగ నుండెను. అచ్చటి పండితుల విఖ్యాతి దశదిశల వ్యాపించియుండేను. అట్టి విఖ్యాతిగల ఉపాధ్యాయుని కడకు కాశీరాజు కుమారు డొక డేగినట్లును, ఆతడు మున్ముందే గురువునకు వేయినాణెములు గురుదక్షిణగ నొసగినట్లును ఒక జాతకకథయందు తెలుపబడినది. గురువునకు ధనమొసగుటకు సమర్థత లేనివారు అతనికి శుశ్రూష కావించి విద్యాలాభమును పొందుచుండిరి. పేద విద్యార్థులకు ప్రభువులు కాని, ధనాఢ్యులగు ప్రజలు కాని విద్యార్థి వేతనము నొసగుచుండిరి. ఒక్కొక్క గురువు 500 విద్యార్థులకు కూడ విద్యాబోధనము కావించుచుండెను. బౌద్ధ యుగమునాటి గురువులకడ వివాహితులును, తదితరులును ధనమునొసగి విద్యాసముపార్జనము చేసికొనుచుండిరి. వారికి గురుకులవాస నియమము లేకుండెను.
ప్రాచీన భారతీయ విద్యావిధానమునందును, బౌద్ధయుగమునాటి విద్యావిధానమునందును ఆముష్మికాభివృద్ధికి కావలసిన వేద వేదాంగములను, ఇతర శాస్త్రములను, ధార్మిక విషయములను మాత్రమే కాక, ఆనాడు ప్రచారములో నున్న సమస్త లౌకిక విద్యలను కూడ బోధించెడివారు. ప్రాచీన భారతీయ గురువులు చతుష్షష్టి కళలనబడు అరువదినాలుగువిద్యలను బోధించుచుండిరట.
ఉపాధ్యాయుడు
సంగ్రహ ఆంధ్ర
ఇవియన్నియు లౌకిక విద్యలే. వీటి ప్రశంస శుక్రనీతి సారము, వాత్స్యాయన కామసూత్రములు, బౌద్ధగ్రంథమగు లలితవిస్తరము, జైనగ్రంథమగు సమవాయ సూత్రము మున్నగు గ్రంథములందు కాననగును.
ప్రాచీనకాలమునందు అనగా క్రీ. పూ. 2000 సం॥ ల ప్రాంతమున అనాటి నాగరక దేశము లన్నిటియందును కూడ గురువునకు సంఘమున విశిష్ట స్థానము లభించియుండెను, బాబిలోనియాలో, అస్సీరియాలో, చీనాలో, ప్రాచీనకాలము నాటి ఐర్లాండు, అమెరికాదేశములందలి ఎఱ్ఱఇండియను జాతులలో ఉపాధ్యాయునికి గొప్ప గౌరవము లభించుచుండెనని తెలియుచున్నది.
ఉపాధ్యాయుడు సంఘమందలి సామాన్య జనులకు అన్ని విషయములందును నాయకుడుగ నుండెడివాడు. ఇది సహజమగు స్థితి. ఉపాధ్యాయుడు సామాన్యులగు వారికి తెలియని అనేక విషయముల నెరిగి వ్రాయుట, చదువుట నేర్చియుండెడివాడు. నిరక్షరాస్యత సర్వత్ర ప్రబలియుండిన ఆకాలమున, అక్షరములు చదువగల్గిన వాడు ఒక విశిష్ట వ్యక్తిగ భావింపబడుచుండుట సహజము కదా ! బ్రిటను, ఫ్రాన్సు వంటి నాగరక దేశములలో కూడ మధ్యయుగము నందు పుస్తకములు చదువ నేర్చిన వారి నందరను మాంత్రికులుగానో, పిశాచ గణగతులుగనో పామరులు భావించు చుండిరట! అనగా వారు సామాన్య మానవులు కారని వారి భావము. కావున అతి ప్రాచీన కాలములో ఉపాధ్యాయునకు ప్రపంచమం దెల్లెడల ప్రత్యేక గౌరవము లభించుచుండుటలో నాశ్చర్యములేదు.
భారతీయ విద్యారంగమును వీడి పాశ్చాత్యరంగమును పరామర్శించునప్పుడు, ఈ రెంటికిని గల గొప్పభేదము నించుక గమనింపవలసి యుండును. ప్రాచ్య (భారతీయ) సంప్రదాయమునందు విద్య యనగా పరబ్రహ్మమును తెలియజేయు జ్ఞానమని ముఖ్యార్థము. (“వేత్తి అనయా ఇతి విద్యా") తదితర లౌకిక విద్యలు ద్వితీయ శ్రేణికి చెందినవి. భారతీయు లిహమును, పరమును మేళవించి తత్సంయోగమును జీవితముగ భావించిరి. జన్మమును, మృత్యువును ఒకే సూత్రము నకు గల రెండు కొనలుగా వారు పరిగణించిరి. ఇహజీవిత మతి చంచలమైనది. దీనినే సంపూర్ణముగ నమ్మియుండుట పొరపాటు. పరమే మానవునికి శాశ్వతమైనదని వారి దృఢ విశ్వాసము. కావున పరమునందలి శ్రేయస్సు కొరకే ఎక్కువగ కష్టించవలెను. పాశ్చాత్య విద్యావిధానమునం దట్లుకాక ఐహిక విషయములకే ప్రాముఖ్యము మెండు. అంతేకాదు. ప్రాచీన కాలమునాటి భారతీయాచార్యులు గొప్ప పండితులై యుండుటయే గాక జీవిత పరమార్థమును గ్రహించిన మహనీయులు. అందువలన వారికి అసామాన్యమగు గౌరవ మొసగబడుచుండెను. పరమేశ్వరుడు సర్వవ్యాపి కావున ఆయనను ప్రపంచము నందలి సర్వజీవులందును సర్వవస్తువులందును కాంచనగును. భారతీయవిద్యార్థి తన గురువునందు పరమేశ్వర సాక్షాత్కారమును గాంచుచుండెను. కావున భారతీయ సంప్రచాయమున గురువునకొక విశిష్టస్థాన ముండెను. పాశ్చాత్య సంప్రదాయమున గురువునకీ విశిష్టతలేదు. కొన్ని లౌకిక ప్రయోజనములను సాధించుటకు మాత్రమే గురువు మనకు సాయపడును. అతడుకూడ విద్యార్థివలెనే మానవ మాత్రుడు. ఈ విభిన్న దృక్పథములే ప్రాచ్యపాశ్చాత్య విద్యావిధానములందలి మౌలిక భేదములకు కారణము.
యూదులు జన్మచే ప్రాగ్దేశీయులైనను వారి భావములు పాశ్చాత్యవర్ణరంజితములు. జాతీయభావ ప్రబోధము, నైతిక వర్తనము నలవరచుట వారి విద్యా లక్ష్యములు ఈ లక్ష్యముల కనువగునట్లు వారు తమ ప్రణాళికలను నిర్మించుకొనిరి. కుటుంబమునకు పెద్దయగు తండ్రియే బాలకునికి ప్రథమ గురువు. ప్రప్రథమమున Synagogues అనబడు యూదు దేవాలయముల కంగములుగ పాఠశాలలు స్థాపింపబడెను. అందు వ్రాయుటయు చదువుటయు లెక్కలు చేయుటయు ఏదైన ఒక వృత్తి విద్యయు నేర్పబడుచుండెను. పిదప ప్రతి గ్రామ మందును ఒక పాఠశాల నెలకొల్పబడెను. విద్యార్థులకు బోధనము కావించువారు యూదు ధర్మమును చక్కగ నేర్చిన వ్రాయసగాండ్రు (Scribes) అను గురువులు. ఈ గురువులు శిష్యులకు ధార్మిక విద్యను, వృత్తివిద్యను కూడ కరపుచుండిరి. యూదులు గురువును గౌరవభావముతో మన్నించుచుండిరి. మానవుని సర్వతోముఖాఖి వృద్ధిని సాధించి తన్మూలమున రాష్ట్రాభ్యుదయమునకై పాటుపడుట గ్రీకుల విద్యాలక్ష్యము. గ్రీకురాష్ట్రములలో
దేహసౌష్ఠవమును, బలమును, వృద్ధిచెందించుటకై ప్రత్యేక శిక్షణ కేంద్రములును, వ్రాతకోతలు మున్నగునవి నేర్పుటకై వేరు పాఠశాలలును ఉండెను. పౌరధర్మములను నేర్చుకొనుటకై యువకులు, అధికారపదవు లందున్న పెద్దల కార్యకలాపములను శ్రద్ధతో, సవిమర్శముగ చూచుచుండిరి. గ్రీకులు తమ గురువులకు ప్రత్యేక గౌరవ మొసగినట్లు కన్పడదు. ఉపాధ్యాయ పదవి నవలంబించిన వారిలో పలువురు తమ వృత్తిని జీవనోపాధిగా మాత్రము భావించుచుండిరి. సోఫిస్ట్సు (Sophists)అనబడు బోధకులు గ్రీకు దేశ చరిత్రలో విఖ్యాతి గాంచిరి. వీరు ధనాపేక్షలో విద్యాప్రచారము కావించెడి వారు. అంతేకాక వారు బోధించెడివిద్య రాష్ట్రాభ్యుదయము కొరకు కాక, వ్యక్తి ప్రయోజనముల సాధించుటకొరకు మాత్రమే ఉపకరించెడిది. కావున వారు ప్రజాదరమును పొందలేదు. సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటీలు అను మహావిజ్ఞానులు విద్య యొక్క ప్రయోజనములను గూర్చియు, త త్సాధనోపాయములను గూర్చియు లెస్సగ చింతించి, గ్రంథ రచనము కావించిరి. కాని వారి విద్యావిధానమునందు గురుశిష్య సంబంధమున కెట్టి విశిష్టస్థానమును లేదు. అయినను ఆకాల మునకూడ అచ్చటచ్చట ఉత్తమ గురుశిష్య సంబంధము లేకపోలేదు. విజ్ఞానియగు సోక్రటీసునకు పలువురు శిష్యు లుండిరి. వారు తమగురువును మిక్కిలి గౌరవించెడి వారు. వారిలో ప్లేటో ఒకడు. పాశ్చాత్య బాదరాయణుడగు అరిస్టాటిలు ప్లేటో యొక్క శిష్యుడు. జగదేక వీరుడగు అలెగ్జాండరు అరిస్టాటిలునకు శిష్యుడు. ఇట్టి అసామాన్యవ్యక్తులు గ్రీకు ప్రపంచముననుండినను, గ్రీకు దేశమునందలి ఉపాధ్యాయులకు ప్రత్యేక గౌరవము లభించినట్లు తెల్పుటకు వీలుపడదు. గ్రీకు విద్యావిధానమునకును, రోమనుల విద్యావిధానమునకును విశేషభేదము లేదు. రోమనులు గొప్ప కార్యశూరులు. కావున వారు విద్యావ్యాప్తికై సంస్థల నేర్పాటు కావించిరి. ఆదికాలమున రోమను సంఘమునందు తండ్రియే కుమారునకు గురువు. తల్లికికూడ ఇంచుమించు ఇట్టి గౌరవమే లభించియుండెను. తండ్రి కుమారుని నీతిప్రవర్తనమును సరిదిద్ది, ఇంచుక వ్రాతకోతలు నేర్పి, ఈడు వచ్చిన వెనుక వీరోచితమగు శిక్షణము నొసగుచుండెను. ఈశిక్షణమున కంతకును లక్ష్యము ఉత్తమ పౌరులను సిద్ధపరచుటయే. ధనాధికులగువారు తమ కుమారులకు పై విధమగు శిక్షణము నొసగుటకై ఉపాధ్యాయులను నియమించుచుండిరి. ఈ ఉపాధ్యాయుడు గృహమందలి ఇతర భృత్యులలో నొకడుగ భాపింపబడుచుండెను. క్రీ. పూ.150 ప్రాంతమున రోమనులు గ్రీకురాజ్యమును జయించిరి. ఆనాటినుండియు గ్రీకుల ప్రభావము రోము నాగరకతపై ప్రసరించెను. బాలుర విద్యాభివృద్ధికై ప్రాథమిక పాఠశాలలు, గ్రామరు స్కూల్సు అనబడు ఉన్నత పాఠశాలలు, రెటోరికల్ స్కూల్సు అనబడు ప్రౌఢ విద్యాశాలలును ఏర్పడెను. ఉన్నత పాఠశాలలలోను, ప్రౌఢవిద్యాలయములలోను, గ్రీకులు ఉపాధ్యాయులుగనుండి, విద్యాబోధనము చేయుచుండిరి. వీరికి మంచి వేతనములును, సంఘమున గౌరవస్థానమును లభించుచుండెను. రోమక చక్రవర్తులు ఉపాధ్యాయులకు హెచ్చు వేతనము లేర్పాటు కావించి వారిని గౌరవించుచుండిరి.
క్రైస్తవమతము ఐరోపా ఖండములో క్రమముగ వ్యాపించెను. తత్ఫలితముగ ప్రజా సామాన్యమునకు విద్యాబోధనము కావించు భారము క్రైస్తవమత సంఘములే వహింపసాగెను. పట్టణములలోని ప్రతి క్రైస్తవ దేవాలయమునకును అనుబంధముగ పాఠశాలలు వెలసెను. వీటికి కాతెడ్రల్ స్కూల్సు అని పేరు. ఇవికాక అనేక ముఖ్య ప్రదేశములలో మఠముల (Monasteries) కు సంబంధించిన పాఠశాలలు కూడ నెలకొనేను. ఇందుకైస్తవ సన్న్యాసులు విద్యార్థులకు మత విషయములు, గ్రీకు ల్యాటిను భాషలు, వ్యాకరణము మున్నగునంశములను బోధించెడివారు. వీరు తమ కాలమునంతను గ్రంథపఠనము నందును, ఉత్తమ మతగ్రంథములకు ప్రతులు వ్రాయుట యందును, కొన్ని ఉద్గ్రంథములకు వ్యాఖ్యానములు రచించుటందును వ్యయపరచెడివారు. వీరు ధనాపేక్షను విడచి, పవిత్రజీవితమును గడపుచు, క్రైస్తవసంఘమును సేవించుచు కాలము పుచ్చుచుండిరి. వీరాకాలమునాటి ప్రజలకు గురువులు. ఆ కాలమున ఐరోపా ఖండమునందు సంఘములో వివిధవృత్తుల నవలంబించు పనివాండ్రును, ధనాధికులును ఉన్నత వంశ సంజాతులునగు వీరపురుషు
లును (Knights) ఉండెడివారు. వివిధ వృత్తుల నవలంబించు కార్మికులు తమ వృత్తియందు విఖ్యాతి చెందిన యొక ప్రముఖునికడ శిష్యప్రాయులుగ పని నేర్చుకొని, వృత్తియందు ప్రావీణ్యమును సంపాదించుకొనిన వెనుక తాము స్వతంత్రులుగ పని చేయుటకు ప్రారంభించెడివారు. ఉన్నత కుటుంబములలో జన్మించినవారు తమ బాలురను ఏడు సంవత్సరముల వయస్సు వచ్చువరకుసు ఇంటికడనే ఉంచి, వారికి మరవిషయములు, నీతివర్తనము బోధించు చుండిరి. పిమ్మట బాలుడు ఉన్నత వంశ సంజాత యగు నొక నారీమణికడ భృత్యుడుగ సప్తవర్షములు పని చేయుచుండెను. ఈ కాలమునం దాతడు తన యజమానురాలికడ వ్రాతకోతలు, సంగీతము, నృత్యము, చదరంగము, సభ్యవర్తనము నేర్చుకొనుచు, తన యజమానురాలి ఆజ్జలను పాలించుచుండెను. ఈ కాలముననే బాలుడు ఇతరుల కడనుండి ముష్టియుద్ధము, ఈదుట మున్నగువాటిని కూడ నేర్చుకోనుచుండెను. బాలునికి పదునాల్గు సంవత్సరముల ఈడు వచ్చిన వెనుక ఆతడు ఒక భద్రపురుషుని (Lord) కడ వీరోచితములగు అస్త్రవిద్యల నన్నిటిని అభ్యసించు చుండెను.ఈ కాలమున ఈ విద్యార్థి తన యజమానురాలికి సమస్త శుశ్రూషలు చేయుచుండెడివాడు. ఇరువది యొక్క సంవత్సరముల వయస్సు వచ్చు సరి కాతడు విద్యలో పరిపూర్ణుడుగా భావింపబడుచుండెను. అప్పుడతడు స్వయముగ వీరపురుష దశ (Knighthood) ను పొందుచుండెను. ఈ విద్యాపద్ధతిని సభ్యతా విద్య (Chivalric Education) అని పేర్కొనెడివారు. పదమూడవ శతాబ్దినుండి ఐరోపాఖండములో విశ్వవిద్యాలయములు వెలసెను. అందు గొప్ప పండితు లాచార్యులుగ నుండెడివారు. విద్యార్థులు దూర ప్రదేశములనుండి ఈ విశ్వవిద్యాలయములకు ఏతెంచుచుండిరి. వీరొక ప్రసిద్ధుడగు గురువుకడ కొన్ని సంవత్సరములు శిష్యులుగ నుండి తుదకు పండిత బిరుదములను పొంది వెడలి పోయెడివారు. ఈ యుగమందు ఉపాధ్యాయ గౌరవము పలువురకు చెందుచుండెను.
మహమ్మదీయ మతము నవలంబించిన అన్ని దేశము లందును. విద్యకును, ఆ విద్యా కారణముగ గురువునకును సంఘమునందు. మిక్కిలి గౌరవము లభించుచుండెను. ప్రవక్త యగు మహమ్మదు విద్యను గూర్చి ఈ క్రింది అభి ప్రాయములను వ్యక్తపరచెను. "జ్ఞానమును సంపాదింపుము. భగవదాదేశము ప్రకారము జ్ఞానసముపార్జనము కావించువాడు, ఒక పవిత్ర ధర్మమును నిర్వర్తించు చున్నాడు. విద్యను గూర్చి ప్రసంగించువాడు పరమేశ్వరుని స్తోత్రము కావించిన వాడు. విద్యార్జనము కొరకై యత్నించువాడు భగవంతుని గౌరవించినవాడు. ఇతరుల యందు జ్ఞానోదయము కలుగజేసినవాడు గొప్పదాత. అర్హులగువారికి విద్యాదానము కావించినవాడు నిజమగు భగవత్సేవ కావించినవాడు. జ్ఞానవంతు డగువాడు కృత్యములను, అకృత్యములను గ్రహించును. జ్ఞానము స్వర్గమునకు త్రోవచూపును. ఎడారి ప్రదేశములో మన కయ్యది మిత్రము. నిర్జన ప్రదేశమునందు విద్యయే మన నేస్తకాడు, విద్య మనకు సౌఖ్యము కూర్చును. దుఃఖసమయమున అయ్యది మనకు ధైర్యము గొల్పును, విద్య మనకు వెలలేని భూషణము. విద్య మనసు శత్రువులనుండి కాపాడు కవచము. విద్యావంతుడగు మానవుడు ఉత్తమ గుణములను, ప్రాపంచిక గౌరవమును పొందును. ఆతనికి రాజాధరము లభించును. అతడు పరలోకమున నుత్తమ సౌఖ్యములను బొందును.” “కావున మహమ్మదీయ ప్రపంచమున విద్యకు మహత్తర గౌరవము లభించెను. మహమ్మదీయులు కూడ ప్రాచీన భారతీయులవలెనే గురువును మిక్కిలి గౌరవించుచుండిరి. పారసీకమందు గురువునొక ఋషిగ భావించుచుండిరి. సకల సద్గుణ సంపన్నుడగు నాతడు మాత్రమే గురుస్థానము నలంకరించుచుండెను. గురువు శిష్యుని పుత్ర వాత్సల్యముతో నభిమానించి అతనికి విద్య నేర్పుచుండెను. విద్యాప్రదానములో ధనాపేక్ష కెట్టి స్థానము లేకుండెను. గురువులకు లభించు వేతనము మిక్కిలి స్వల్పము. శుశ్రూషయే గురువునకు శిష్యుడొసగు వేతనము. ప్రభుత్వమువారిచే స్థాపింపబడిన, "మక్తబ్ మదర్సాలు" అనబడు విద్యాకేంద్రములలో పండితులగు వారిని నిర్ణీత వేతనములపై నియమించుట ఆచారముగ నుండెను. మహమ్మదీయ ప్రపంచమున లభితకళలను, వృత్తి విద్యను నేర్పుటకు వేర్వేరు గురువు లుండెడివారు. వారికి ఉస్తాదులు అని పేరు. సంగీతము, చిత్రలేఖనము మున్నగు, వాటిని శిష్యుడు గురువు పాదములకడ కూర్చుండి
అభ్యసించెడివాడు. కార్ఖానాలు అనబడు పారిశ్రామిక కేంద్రములలో నిపుణులగు పనివాండ్రు లేబ్రాయపు వారికి వృత్తివిద్యలు నేర్పుచుండిరి. ఇస్లాము ప్రపంచములోఖాన్జాలు అను విద్యా కేంద్రములు ఉత్తమతరగతికి చెందినవి . ఇచ్చట మహా విద్వాంసులగువారు శిష్యులకు బోధనము కావించుచుండిరి. అలావుద్దీన్ ఖిల్జీ కాలమున ఢిల్లీ నగరములో “నిజాముద్దీన్ అవులియా" అను జ్ఞాని పేరిట ఒక గొప్ప “ఖాన్జా" విలసిల్లెను. ఆధునిక యుగమును అన్ని విషయము లందును స్వాతంత్య్ర యుగముగ వర్ణింపవచ్చును. తక్కిన అంశములు అట్లుండ నేటి విద్యావిషయకములగు భావము లను, ఆచరణమును, గమనించిన పక్షమున వ్యక్తి కిని ఆతని అవసరములకును హెచ్చు ప్రాముఖ్యము ఒసంగబడు చున్నట్లు మనకు తెలియగలదు. ప్రాచీన యుగమునందును, మధ్యమ యుగము నందునుకూడ వివిధ సంఘములకు, అనగా మత సంఘములకు, వృత్తిసంఘములకు, ధనిక వర్గమునకు, విశ్వవిద్యాలయములకు ఎక్కువ ప్రాముఖ్యము ఉండెను. విద్యార్థికి నేర్పబడువిద్య అతడీ సంఘములలో నేదైన ఒక దానిలో చక్కగ ఇమిడి పోగల్గు మార్గమును సుకరము కావించెడిది. ఇట్టి సంఘనిర్మాణములో వ్యక్తి కెట్టి ప్రాముఖ్యమును లేదు. విద్యార్థి గురువునకు సర్వవిధముల లొంగి ఆతడు బోధించు విద్యనే గ్రహింపవలెను. శిష్యుని చక్కగా అర్థము చేసికొని ఆతనికి బోధనము కావింపవలసిన బాధ్యత గురువుపై నున్నట్లేవ్వరును ఆనాడు భావింప లేదు. ఆధునిక యుగమందా భావములు మారినవి. నేడు విద్య యొక్క లక్ష్యము సంఘమను మహాయంత్రములో వ్యక్తి యొక చిన్న చీలవలె నొకమూల అణగియుండుటకై అతనిని సిద్ధపరచుటకాదు. విద్యవలన మానవునిలో సహజముగనున్న శక్తులనన్నిటిని ప్రోత్సహించి, వాని కుత్తేజము గూర్చి, మానవుని సంపూర్ణవికాసమునకై యత్నించుట నేటి విద్యయొక్క ఆదర్శము. ప్రస్తుత సామాజిక పరిస్థితులలో విద్యార్థి విజయవంతముగ తన జీవితమును గడుపుటకును, వీలైనంతవరకు సమాజవ్యవస్థ యందు మార్పు తెచ్చి దానిని అభివృద్ధి పొందించుటకును, అనువగునట్లు ఆతనిని తరిఫిదుచేయుట విద్యయొక్క ఆదర్శము. ఈ ఆదర్శముల నంగీకరించిననాడు విద్యా విధానమునందు ప్రముఖస్థానము గురువునకుకాక శిష్యునికే లభించుచున్నది. శిష్యుని అభివృద్ధికి అనువగు పరిస్థితులను, పరికరములను, సమకూర్చి ఆతని సర్వతోముఖ వికాసమునకై చేయూత నొసగుట గురువు యొక్క ధర్మము. విద్యారంగమునందు విప్లవాత్మకమగు ఈ మార్పులను ప్రవేశ పెట్టిన వారిలో రూసో, ఫ్రానిల్, మాంటిసోరీ, జాన్ డ్యూయీ అనువారు ప్రముఖులు.
భారతదేశమునకు స్వరాజ్యమును సంపాదించి, రాజకీయ రంగమున విప్లవాత్మకమగు మార్పును కొని తెచ్చిన గాంధీ మహాత్ముడు భారతీయ విద్యారంగమునందు కూడ ఒక గొప్ప సంస్కరణమును కావించబూనెను. ఆయన అమలు కావింపదలచిన మార్పులన్నియు "బేసిక్ విద్యా విధానము" అనినేడు వ్యవహరింపబడుచున్న విద్యాప్రణాళిక యందు చేర్చబడినవి. "నేడు అమలులో నున్న విద్యావిధానము మిక్కిలి లోపభూయిష్ఠమైయున్నది. 'పేద దేశమగు భరత ఖండమునకు నేటివిద్య అనుకూలముగా లేదు. కావున అందు మార్పులు రావలెను. ఈనాడు బాలకులకును బాలికలకును కేవలము వ్రాతకోతలు, లెక్కలు, చరిత్ర భూగోళములు మున్నగు విషయములు మాత్రమే బోధింపబడు చున్నవి. ఈ విద్య విద్యార్థులను సంఘము నుండి దూరము చేయుచున్నది. వారి భావిజీవిత ప్రయోజనములను కూడ ఈ విద్య పూర్తిచేయుట లేదు. ఈ విద్య యందు ఇతరలోపములు కూడ కలవు. కావున నేటి జ్ఞానపరమగు విద్య (Literary Education) కు గల ప్రాధాన్యమును తగ్గించి, దానిని ఏదైనా ఒకవృత్తి విద్యతో జోడించి నేర్పుట చాల లాభదాయకము. ఒక వృత్తితో మేళవించి బోధింపబడినవిద్య విద్యార్థి మనస్సుపై చక్కగ హత్తుకొనిపోవును. విద్యార్థులు విద్యాభ్యాసము కావించు కాలముననే వివిధ వస్తువులను ఉత్పాదనము కావింతురు. వాటిని అమ్మి విద్యాసంస్థలను కొంతవరకైన స్వయంపోషకములుగ కావింపవచ్చును. పై వర్ణింపబడిన విద్య ముఖ్యముగ గ్రామసీమలకు వర్తించును. ఏడు, పదునాల్గు సంవత్సరముల నడుమనున్న బాలకులకును, బాలికలకును ఈ విద్య కరపబడును. ఈ మార్పుల వలన ప్రాథమిక విద్య స్వయంపోషకమగును. విద్యార్థులకు బోధింపబడువిద్య కేవలము పై మెరుగులను సంతరించునది మాత్రమేకాక, వారియొక్క సర్వశక్తులను వికసింపజేయును. ఇట్టివిద్యను నేర్చినబాలుడు ఇతర విషయ ములతోపాటు ఉపయోగకరమగు నొక వృత్తివిద్యను కూడ నేర్చినవాడై యుండును. ఆతడార్థికముగను, నైతికముగను సమాజమునకు బలము చేకూర్పగలడు." గాంధీమహాత్ముడు ప్రతిపాదించిన విద్యావిధానము సంఘ ప్రయోజనములను సాధించుటయే ముఖ్యోద్దేశముగా కలది. కాని అహింసా సిద్ధాంతముపై ఆధారపడియుండిన కారణమున ఇది వ్యక్తి యందలి వ్యక్తిత్వము నేవిధముగను బాధింపదు. ఇట్టి నూతన విద్యావిధానమునందు ముఖ్యపాత్ర వహింపవలసిన ఉపాధ్యాయులపై గొప్ప బాధ్యత యుంచబడినది. వారు సంఘ సేవాసక్తితో తమ ధర్మముల నిర్వర్తింపవలెను. ప్రతిగ్రామమునందును బేసిక్ పాఠశాలలను నడపు ఉపాధ్యాయులుందురు. వారు బాలురకును, బాలికలకును విద్య నేర్పుటయేకాక, గ్రామీణులకు సర్వవిధముల నాయకత్వము వహింపవలెను. గ్రామవాసులకు శుభ్రత, వ్రాతకోతలు, పౌరధర్మములు తెల్పువారుగ నుండవలెను. ఒక్క మాటలో చెప్పవలసిన పక్షమున బేసిక్ పాఠశాలలోని గురువు గ్రామమున కాదర్శప్రాయుడుగ నుండవలయును.
ప్రాచీనకాలముతో పోల్చిచూచిన పక్షమున గౌరవ ప్రపత్తుల విషయమందును, ఆర్థికస్థితియందును ప్రపంచమందంతటను ఉపాధ్యాయుడు ఉన్నత సోపానమునుండి క్రిందికి దిగిపోయినాడని తెలుపవలెను. కొన్ని ప్రత్యేక స్థానముల నలంకరించు ఆచార్యుల విషయమును మినహాయించి సామాన్యుడగు నుపాధ్యాయుని పరిస్థితులను గమనించిన యెడల ఈ విషయము తేటపడును. ఉపాధ్యాయ పదవికూడ ఇతర వృత్తులవలెనే జీవనోపాధి కొక మార్గముగ పరిణమించుటయే దీనికి కారణము. “గురుస్సాక్షాత్పరబ్రహ్మ" అని భావించెడి భారత దేశములో కూడ నేడు ఉపాధ్యాయు డొక కార్మికుడు (Labourer) గా భావింపబడుచున్నాడు. ఇతర కార్మికులకును, ఉపాధ్యాయునికిని గల భేదము నామమాత్రము. ఇతరులు కాయకష్టము చేయు కార్మికులు. ఉపాధ్యాయుడు మానసికకష్టము చేయు కార్మికుడు. ఇట్టి భావములు సర్వత్ర వ్యాప్తిచెందిన తరువాత గురువునకు సంఘములో ప్రత్యేక గౌరవము కష్టసాధ్య మగుచున్నది. అంతేకాక ఆధునిక ప్రపంచమునందు అర్థమునకు గల ప్రాధాన్యము మరి దేనికిని లేడు. మానవుని ఘనతను నిర్ణయించుటకు నేడు సాధారణముగ ధనమే మానదండముగ వాడబడుచున్నది. ఉపాధ్యాయున కొసగబడు వేతనము చాల స్వల్పము. కావున మేధాసంపత్తి గల యువకులును, యువతులును ఉపాధ్యాయపదవిని అంగీకరించుటలేదు. ఆర్థికముగను సామాజికము గను ఎక్కుడు లాభదాయకముగ నుండు ఇతరశాఖలలో వారు ప్రవేశించుచున్నారు. ఆస్ట్రేలియా, కనడా, ఇంగ్లాండు, జర్మనీ, హిందూదేశము, జపాను, అమెరికా సంయుక్త రాష్ట్రములు మున్నగుదేశములలో ఉన్నతపాఠశాలల లోని ఉపా ధ్యాయులు సంఘమునం దారవ స్థానమును ఆక్రమించు చున్నారు. ప్రాధమిక పాఠశాలలలోని ఉపాధ్యాయులకు అంతకంటే తక్కువస్థానము లభించుచున్నది. వైద్యులు, న్యాయవాదులు, సైనికోద్యోగులు, వ్యాపారస్థులు మున్నగు వారికి సంఘమున ఉపాధ్యాయునికంటె ఉన్నత స్థానము కలదు.
ఆధునిక యుగమందు కూడ చీనాయందును, రష్యా యందును ఉపాధ్యాయ వృత్తికి చాల గౌరవము లభించుచున్నది. స్వీడనులో కూడ ఇంచుమించు ఇట్టి పరిస్థితులే గలవు. ఈ దేశములలో ఉపాధ్యాయులు సామాజిక విషయములలో నాయకత్వమును పూనియున్నారు. ఇండోనీషియా, ఇథియోపియాలందు కూడ ఉపాధ్యాయులకు సంఘమున గౌరవ స్థానము ఒసగబడుచున్నది. ఎల్లెడలను కూడ ఉపాధ్యాయుని ఆర్థికస్థితి బాగుపడవలయుననియు, అతనికి ఇతోధిక గౌరవము సంఘమున లభింప వలయుననియు, విజ్ఞాను అంగీకరించుచున్నారు. రష్యా, స్వీడను, ఆస్ట్రేలియా మున్నగు దేశములలో పౌర ధర్మ నిర్వహణమునం దుపాధ్యాయునికి అర్హస్థానము లభించుచున్నది. ఇయ్యది నవచైతన్యమునకు నిదర్శనముగా మనము భావింపనగును.
ఖం.బా.శే