Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉపవేదములు

ఉపవేదములు :

ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వవేదము, శిల్ప వేదము అను నాలుగును క్రమముగా ఋగ్యజుస్సామాధర్వ వేదములలోని తత్తద్విజ్ఞానము మూలముగా వాని కనుబంధములగుట నుపవేదము లనబడినవి. ఆయుర్వేదము అధర్వవేదమున కుపొంగమని సుశ్రుతమతము, ఆయుర్వేదాదులలో నీత్యర్థశాస్త్రములను కొందరు గణించిరి. కాని ప్రాచీన సంప్రదాయము ననుసరించి గాంధర్వ శిల్పములు ఉపవేదములను మత మంగీకరింతుము.

ఆర్యజాతి నాగరికత చెందుచున్న కొలదిని వారివిజ్ఞానము సర్వతోముఖమై యైహికముగా సత్యాన్వేషణ పరమై యాముష్మికముగాను, వికసించి, ప్రసరించి పొరముగాంచెననుట యనుభవసిద్ధము. అందు రోగనిదానమును, తత్తద్రోగచికిత్సయు, తొలుతటినుండియు కావలసివచ్చిన వగుటచే వారి వైద్యవిధాన మతి ప్రాచీనమే

యైనను, మనకిప్పటికి తెలిసినంతలో నా విజ్ఞాన మావిష్కరించిన మహర్షులలో భరద్వాజుడును, దివోదాసుడును ఆద్యులుగా కనవచ్చుచున్నారు.

భరద్వాజుని శిష్యు డాత్రేయ పునర్వసువు. అతని శిష్యు లగ్ని వేళ హారీ తాదులు. ఆ యగ్ని వేశుడు నిర్మించిన యాయు ర్వేదతంత్రమునే తరువాత చరకముని యించుక సంస్కరించి తన పేర సంహితగా ప్రకటించెను. ధన్వంతరి యను బిరుదనామము పొందిన కాశిరాజ దివోదాసుడు ఉపదేశించిన వివిధ చికిత్సాతంత్రమునే సుశ్రుతుడు తన పేర నోకసంహిత గావించెను. భరద్వాజుని మరియొక శిష్యుడు హారితుడు తన పేరనొక సంహిత నిర్మించెను. ఇట్లు భరద్వాజుడు ఉపదేష్టగా చరక సంహితా, హారిత సంహితలు ఉదయించినట్లుండగా, ఆయుర్వేదమునకు ధన్వంత రియే మూలకర్తయని సుశ్రుతుడనెను. ధన్వంతరి కృత లక్షణ గ్రంథములో నారవ ప్రకరణమైన యగరతంత్రమునే యాత్రేయపునర్వసు నభ్యసించి, అగ్ని వేశుని కుపదేశించెను. అదే చరకముని నోటబడి చరక సంహితయయ్యెనని భావ ప్రకాశమనెడి అర్వాచీన వైద్యగ్రంథము భారద్వాజు నుపదేశకత్వమునే తొలగించెను. కాని ఐతరేయ బ్రాహ్మణాదులలోని ప్రసంగములనుబట్టి భరద్వాజు డాయుర్వేద ప్రవర్తకుడగుట నిర్వివాదమే.

అర్యులు, యాగియపశువులను ఛేదించునపుడు సకలావయవ సన్ని వేశములను, వివిధనాడులను, హృదయాది కోశములను పరిశీలించి, పరిశోధించి శారీర విజ్ఞానము నార్జించి యున్నారు. వివిధవస్తువుల గుణములను సక లౌషధుల శక్తులను కనుగొనియున్నారు. ఈ ద్వివిధమైన వారి విజ్ఞానమే వారి యౌషధ చికిత్సాసంప్రదాయమునకును శస్త్రచికిత్సా సంప్రదాయమునకును మూలకారణము. రోగముల స్వరూప స్వభావములను, వానికారణములను, తచ్ఛాన్తి సాధనములను తెలియచేయుచు ప్రాణులయాయువును వృద్ధి నొందింప నాధారమగుటచే నిది “ఆయుర్వేద" మైనది.

పూర్వోకములైన సంహితలుగాక తరువాత సుమారు వంద యేబది ప్రసిద్ధ వైద్యగ్రంథములవతరించినవి. వానిలో అష్టాంగహృదయము, శార్జ్జధరసంహిత, మాధవనిదానము, వైద్యచింతామణి మొదలయినవి చిరకాలముగ వైద్యులకు పఠనీయములుగా నున్నవి.

ధనుర్వేదము : తొల్లియార్యుల కంగరక్షయై, ప్రజానాయకుల కెల్ల యెడల విజయము చేకూర్చుచువచ్చిన యీ విద్య పూర్వమెంత పేరు మోసినదో, యిపుడంతగా దీని పేరు మాసినది. బుగాది సంహిత లందును బ్రాహ్మణారణ్య కాదులందును వర్ణింపబడిన అష్టి వజ్ర శతఘ్ని మొదలగు యుద్ధ సాధనముల వేళ్ళుమాత్రమే మన కిపుడు గోచరించు చున్నవి గాని తన్నిర్మాణ విధాన మేనాడొ మరుగుపడినది. శత్రుసంహారార్థము జపించుమంత్రములు కొన్ని యధర్వ సంహికలో నున్న నేమి ? తదాచరణము చిరకాలము క్రిందటనే యడుగంటినది. ప్రాచీన మహర్షులు కొన్ని వేల సంవత్సరములు తపస్సుచేసి తపోమయములైన రమ తేజస్సులనే యస్త్రములనుగా సందర్శించినట్లు వర్ణనలు మాత్రమే మిగిలినవిగాని, వారు కనుగొన్న జృంభక సమ్మోహ నాగ్నేయాది దివ్యాస్త్రముల విజ్ఞాన మిసు మంతయు మిగులలేదు. మహాభారత సంగ్రామము వరకు భరతఖండమున వెల్లివిరిసిన ఆ దివ్యాస్త్ర శస్త్రవిజ్ఞానమును బోధించు గ్రంథమేదేని సంస్కృతమున నుదయించి యుండకపోదు గాని, యిపుడదియును గనరాదు. ఆనాటి సమంత్రకములైన పరమాస్త్రములు నేటి యణ్వస్త్రములను గూడ మించినవి. తెలుగున "ధనుర్విద్యావిలాసము" నిర్మించిన గుంటూరు మండలవాసియు, మాధ్వుడునగు కృష్ణాచార్యుడు గ్రంథావతారికలో "సద్గురు లాభంబున నిద్రనుశ్శాస్త్రము మాకు నధీతంబయ్యె. తత్త ల్లక్షణంబులు శాస్త్ర సమ్మతంబులుగా నుపన్యసించేదను" అని వ్రాసినమాటలను బట్టి యాకవి సంస్కృతము లోని ధనుశ్శాస్త్రగ్రంథము చూచినట్లు గోచరించుచున్నది. అతడు క్రీ.శ. 1847 నాటివాడు. అతని గ్రంథము కూడ ముద్రితమయినట్లు కనరాదు.

గాంధర్వ వేదము : శ్రీహరి సొమగాన లోలుడు. ఆ సామగానమే భారత వర్షియ గానవిద్యకు నిదానము. దానిని ప్రవర్తింపజేసిన ప్రాచీనముని పరంపరలో నిప్పటికి తెలియవచ్చిన సొమగానాచార్యులు పదుముగ్గురు. వారిలో రాణాయమనతడు ప్రథముడు, కడపటియతడు జైమిని మహర్షి. అతని పుత్రుడు సుమంతుడు, అతని శిష్యుడు సుకర్ముడు. వారిరువురి వంశములవారును సామగాన ప్రవచనమున క్రమముగా వన్నెకెక్కినవారు.

ఉపవేదములు

సంగ్రహ ఆంధ్ర

తక్కిన యుపవేదములవలే గాక భరతఖండమున నాటి నుండి నేటిదనుక వివిధ మార్గముల ప్రజల కానందము సమకూర్చుచు వచ్చుచున్నదీ గాన విద్యయే. పూర్వుల స్వర నిర్ణయమును నారదశిక్ష యిట్లు తెలుపుచున్నది.

“యస్సామగానాం ప్రథమ స్సవేణోర్మధ్యమ స్స్మృతః,
యోఽసౌ ద్వితీయో గాంధార స్తృతీయ స్వృషభ స్స్మృతః,
చతుర్థ ష్షడ్జ ఇత్యాహుః పంచమో దైవత స్స్మృతః
షష్టో నిషాదో వి జ్ఞేయ స్సప్తమః పంచమ స్స్మృత"

పై శ్లోకములను బట్టి స్వరముల నిట్లేరుగునది.

సామగాన స్వరములు భారతీయ గాన స్వరములు స్వరముల గుర్తులు
ప్రథమము మధ్యమ స్వరము
ద్వితీయము గాంధార స్వరము
తృతీయము ఋషభ స్వరము రి
చతుర్థము షడ్జ స్వరము
పంచమము ధైవత స్వరము
షష్ఠము నిషాద స్వరము ని
సప్తమము పంచమ స్వరము

వీటిని బట్టి సామగానములోని ప్రథమ ద్వితీయాది స్వర సంజ్ఞ లాధారముగా లౌకిక గానములోని మధ్యమ గాంధారాది స్వర సంజ్ఞ లేర్పడినట్లు వాటి యాద్యక్షరములే - " సరిగమపధని " అనునవి స్వర సంజ్ఞలైనట్లును విదితమగును..

ముప్పదియారు వేల గ్రంథముతోడి గాంధర్వ వేదమును, నాట్యకళను పూర్తిగా విశదీకరించిన నాట్య వేదమును పూర్వముండెడి వన్న మాటమాత్రము వినవచ్చునుగానీ, అవి యిపుడులేవు. ప్రాచీనమును గురుపరంపరోపదిష్టము నగుచువచ్చిన ఆ నృత్తగీత వాద్యజ్ఞాన మే పిదప భరతముని నిర్మితమైన నాట్యశాస్త్రముగా పరిణమించినది.

గాంధర్వమన గానము-పాట- అదేసంగీతము. అది మార్గము, దేశి యని ద్వివిధము. విరించి ప్రోక్తమై ఆదిని భరతాది ప్రయుక్తమైనది మార్గమనియు, ఆ యా దేశములవారు హృదయరంజకముగా పాడునది దేశి యనియు లక్షణకర్త లన్నారు. గీత వాద్య నృత్తాత్మకమైన యిందు, గీతము ప్రధానముగా, రాగవర్ణ నిరూపణ, రాగసాగర సంగీతదర్పణాదు లుదయించినవి. వానిలో శార్జ దేవుని సంగీతరత్నాకరము భరతఖండమంతట నుతి కెక్కినది. గాంధర్వవిద్యాసంబంధి విషయము లన్నిటికి నది నిధి. అతడు కాశ్మీరదేశమునుండి దక్షిణా పథమునకు వలస వచ్చిన భాస్కర పండితుని పౌత్రుడు. సోఢల దేవుని పుత్రుడు, శా. శ. 1132 ప్రాంతమువాడు. ఆ మహాపండితుడు తనకృతిలో పేర్కొన్న పూర్వ సంగీత విశారదు లెందరో కలరు. అందు కొందరినామము లివి, భరతుడు, మతంగుడు, శార్దూలుడు, విశాఖలుడు, కశ్యపుడు, యాష్టికుడు, కోహలుడు, దత్తిలుడు. శతాధికులైన వీరిటుండగా శా. శ. పంచమ శతాబ్ది మొదలుగా, పదునారవ శతాబ్ది తుదవరకును జనియించిన సంగీత శాస్త్రకృతులందును — అవియును సుమారు వంద - పెక్కుర నామములు గలవు. ఇంక దక్షిణాపథమునంతను గానరసామృతమున నోల లాడించుచున్న త్యాగరాజు కృతులును సుమారు పది వందలు కలవు.

శిల్పవేదము : దీని నామాంతరము స్థాపత్యవేదము. మనోజ్ఞమై దృష్టి నాకర్షించు నొక చిత్రమైన కర్మ శిల్ప మనబడును. ఇది తేజోమయము, వర్ణమయము, దారుమయము, శిలామయము అని బహువిధములు. దివ్యము లైన రంగులతోడి తనకిరణములను ప్రసరింప జేయు సూర్యుని జగత్ప్రకాశక లక్షణమైన చిత్రకర్మ శిల్పముగా తైత్తిరీ యారణ్యకమున నిట్లు వర్ణింపబడినది.

"యత్తే శిల్పం కళ్యప రోచనావత్,
ఇంద్రియావత్పుష్కలం చిత్రభాను”

తొల్లిటి శిల్ప విద్యారహస్యములను, శిల్ప కళా చాతుర్యమును తెలియజేయు శిలా ప్రతిమాదులు భరతఖండమున నలు దెసలను కనవచ్చును, వినవచ్చును గాని ఆ విద్యకు సంబంధించిన పురాతన గ్రంథములు మాత్ర మిపుడు కనరావు. అయినను మనవాస్తు శిల్పవిజ్ఞాన మతిప్రాచీనమని, 'ఆరుణ కేతుక చిత్య'మందలి పురీ రథాది వర్ణనలును, రామాయణ భారతాదులలోని యయోధ్యా, మయ సభాదివర్ణనలును చాటుచున్నవి.

ఈ విద్యను వెలయింపజేసిన పూర్వుల మతములలో మొదటిది గర్గమతమనియు, దానినిబట్టి మానసార మతాదులు వెలసినవనియు 'విశ్వకర్మప్రకాశ'మను గ్రంథముచే తెలియనగును. ఉత్తరహిందూదేశమందలి వాస్తు శిల్ప మతముల కించుక వేరుగా దక్షిణ హిందూ దేశమున మయ మతము, అగస్త్యమతమును హెచ్చుగా వ్యాపించినవి.

మనువు, సనత్కుమారుడు, పరాశరుడు మొదలగువారి పేర నుదయించిన వాస్తుశిల్పగ్రంథములు అర్వాచీనులు నిర్మించినవే యగుట వానికి గౌరవము రాలేదు. బరోడా సంస్థానమువారు క్రీ. 1924 లో సమరాంగణ సూత్రధారమనెడి వాస్తుశాస్త్రగ్రంథమును ప్రకటించిరి. వాస్తుశిల్పముల వివిధాంశములు అందు చక్కగా విశదీకరింపబడినవని గ్రంథ ప్రకాశకులు తెలుపుచున్నారు.

మ. సూ.శా